March 28, 2024

కలం స్నేహం.

రచన: గిరిజారాణి కలవల

మధ్యాహ్నం భోజనమయి పడుకునే టైమూ… కొరియర్ అబ్బాయి బెల్లు కొట్టే టైమూ.. ఎప్పుడూ ఒకేసారి అవుతాయి. సరిగ్గా మిట్టమధ్యాహ్నం ట్రింగ్ ట్రింగ్ కొట్టడం.. నిద్ర కాస్తా ఎగిరిపోతుంది దెబ్బకి. ఎన్నిసార్లో చెప్పాను శ్రీవారికి.. ఈ టైమన్నా మార్చండీ లేకపోతే మీ ఆఫీసు అడ్రస్ అయినా ఇచ్చుకోండీ అని.. వింటేగా..
విసుక్కుంటూ తలుపు తీసా… కొరియర్ వాడే.. అయితే ఏ వస్తువూ కాదు.. కవర్ ఇచ్చి వెళ్ళాడు. శుభలేఖలా వుంది. ఎవరిదబ్బా.. అని ఓపెన్ చేసాను.
పేరు చూడగానే ఎగిరి గంతేసాను. నా ప్రాణస్నేహితురాలు లత పెళ్ళి శుభలేఖ. కనీసం ఫోన్ అయినా చేసి చెప్పలేదు అనుకున్నా. .. నాలుగు పీకాలి దాన్ని అనుకున్నా.
వరుడు.. సుధాకర్ అని వుంది. ఆశ్చర్యపోయాను. అశోక్ తో కదా లతకి పెళ్ళి జరగాల్సింది. ఇప్పుడు సుధాకర్ అని వుంది.. ఏదో జరిగి వుంటుందనుకున్నాను.
వెంటనే ఫోన్ చేసాను. లతే లిఫ్ట్ చేసింది.
” హలో.. రమా! ఎలా ఉన్నావే… శుభలేఖ అందిందా? నాలుగు రోజులు ముందుగా రావాలి నువ్వు.” అంది లత.
” అది సరే కానీ… ఈ సుధాకర్ ఎవరే? అశోక్ కాదా.. పెళ్లి కొడుకు? నాకు అయోమయంగా వుంది. ఏమైందో చెప్పు.” అన్నాను.
” అవన్నీ.. ఫోన్ లో చెప్పేవి కాదు.. వస్తావుగా.. అప్పుడు చెపుతాను.. ” అంటూ ఫోన్ పెట్టేసింది లత.

ఏం జరిగిందో.. ఏంటో.. అర్థం కాలేదు తనకి. ఏడాది క్రితం బావతో తన పెళ్లి అయిపోయి హైదరాబాద్ వచ్చేసాక తన కొత్త కాపురం, అచ్చట్లు ముచ్చట్లలో.. లతతో మాట్లాడడం తగ్గింది తనకి. అదీ చెయ్యలేదు తనకి ఫోను. ఇదిగో ఇప్పుడు ఈ శుభలేఖతో చిన్న ఆటంబాంబు పేల్చింది. తాను ప్రేమించిన అశోక్ తోనే తన పెళ్లి అని నాకూ తెలుసు. లత తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ఆ అశోక్ తో తనకీ పరిచయం వుంది. అతనితోనే కదా లత కి పెళ్ళి అనుకుంటూంటే.. ఇప్పుడు సడన్ గా తెరమీదకి వచ్చిన ఈ సుధాకర్ ఎవరో? అనుకుంది.

లత, తను చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్ మి. ఇంటర్ వరకూ కలిసే చదువుకున్నాము. ఇక ఆ తర్వాత ఇద్దరి చదువుకీ బ్రేక్ పడింది దానికి కారణం
మా వూరు పల్లెటూరికి ఎక్కువా.. పట్నానికి తక్కువా.. అలా వుంటుంది. జూనియర్ కాలేజీ వరకే అక్కడ వుంది. డిగ్రీ చదవాలంటే.. పాతికమైళ్ళ దూరంలో వున్న వూరికి వెళ్ళాల్సిందే. ఆడపిల్లలని బయటకి పంపి ఏం చదివిస్తాంలే.. వున్న వూళ్లో చదువువరకూ లాగించింది చాలు అనుకునే పెద్దలే ఎక్కువ మా వూళ్లో. మా అమ్మానాన్న, లత తల్లిదండ్రులు అందుకు మినహాయింపు ఏమీ కాదు.
ఇంటర్ అవగానే ఇక చాల్లే చదువు అని మా ఇద్దరికి ఫుల్ స్టాప్ పెట్టించేసారు.
నా కైతే నా కన్నా నాలుగేళ్ళు ముందుపుట్టిన బావ రెడీగానే వున్నాడు.. ఏదో ఒక టైమ్ లో నన్ను ఎగరేసుకుపోడానికి.. కానీ
లతకే , దగ్గర వాళ్ళలో ఎవరూ లేరు పెళ్ళి కొడుకులు.. వాళ్ళమ్మ నాన్నలు.. తెలిసినవాళ్ళకీ, పెళ్లిళ్ళ పేరయ్య లకీ.. ఏవైనా మంచి సంబంధాలు వుంటే చూడమని చెప్పారు. ఏవో వస్తున్నాయి.. వీళ్లకి నచ్చక కొన్నీ, వాళ్ళకి నచ్చక కొన్నీ.. పోతున్నాయి.
ఆ శ్రావణంలో నాకూ బావకీ ముడిపెట్టేసారు. పెళ్ళవగానే హైదరాబాద్ లో కాపురం పెట్టాము. నెల్లాళ్ళకే బావని కంపెనీ వాళ్ళు మూడునెలలపాటు జర్మనీ పంపేసరికి.. నేను అమ్మనాన్నల దగ్గరకి వచ్చాను.
ఖాళీగా కూర్చున్న మేమిద్దరం రోజూ మా ఇద్దరి ఇళ్లలో ఎక్కడోక్కడ కలుసుకుని కబుర్లు చెప్పుకోవడమో, సినిమాలకి వెళ్ళడమో, చేస్తూ వుండేవాళ్ళం. కొంచెం పుస్తకాలు పిచ్చి కూడా వుంది ఇద్దరికీ. వీక్లీలు చదువుతూ, వాటిలో కధల మీద, సీరియల్స్ మీద చర్చలు చేసుకునేవాళ్ళం.
అలాంటి ఓ వారపత్రికలో ‘ కలం స్నేహం చేయాలని వుందా, మీ అభిరుచుల , అలవాట్లతో మీ వివరాలు అడ్రస్ లు పంపండి.. మీకు తగిన స్నేహితులని ఎన్నుకోండి’ అనే ప్రకటన చూసి.. మా లత .. సరదాగా తన అడ్రస్.. వివరాలూ.. పంపింది. వారం తిరిగేసరికి ఉత్తరాలు కుప్పలు, కుప్పలు రావడం మొదలయ్యాయి. ఇది బిత్తరపోయింది వాటిని చూసి. రకరకాల ఉత్తరాలు అవన్నీ… ప్రేమించుకుందాం అంటూ కొన్ని, పెళ్లి చేసుకుందాం. అంటూ కొన్ని, అక్కా.. అంటూ కొన్ని, చెల్లీ అంటూ కొన్ని.. ఇలా వచ్చాయి. నేను, లత కూర్చుని ఇవన్నీ చదవడం.. నవ్వకుంటూ అన్నీ చింపి పడేసేవాళ్ళం. అలా వచ్చిన వాటిలో దానికి ఎక్కువగా నచ్చింది… అశోక్ దగ్గరనుండి వచ్చిన ఉత్తరం.
పిచ్చి పిచ్చి.. పైత్యపు వ్రాతలు లేవు, అక్కా, చెల్లీ వరసలు లేవు.. మంచి భావకవిత్వం, చక్కటి అభిరుచులూ.. మంచి మంచి మాటలూ… ఇలా వున్నాయి. లతకి కూడా కాస్త కవిత్వం పిచ్చి వుండడంతో… అశోక్ రాతలు దాని అభిరుచులకి తగ్గట్టుగా వుండడంతో.. అశోక్ తో కలం స్నేహం కొనసాగించింది. ఇద్దరూ వ్రాసుకునే ఉత్తరాలలో ఎక్కడా ఇబ్బందికరం కాకపోవడమూ, పైగా మా ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలూ కూడా లేకపోవడంతో.. నేనూ ఆ ఉత్తరాలు చదివేదాన్ని. నాకూ నచ్చాయి ఆ ఉత్తరాలు. వాటిని బట్టి, నేను, లత అతని పట్ల ఒక మంచి అంచనా వేసుకున్నాము. లత ఇంట్లో కూడా ఈ స్నేహానికి ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు.. ఈ క్రమంలో వీరిద్దరి అభిరుచులూ, అలవాట్లు ఒకేలా వుండి… అభిప్రాయాలు ఒకరితో ఒకరు పంచుకోవడంలో.. తామిద్దరూ పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అని అనుకున్నారు. అయితే పెద్దవారి అనుమతితోనే అని లత అనేసరికి.. అశోక్ లత తల్లిదండ్రులులకి ఫోన్ చేసి.. తన గురించి వివరాలు అన్నీ చెప్పాడు.
బెంగళూరులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేస్తున్నానీ, తన ఊరు కృష్ణా జిల్లాలో ఓ పల్లెటూరు అనీ, అక్కడే పొలాలు, తోటలూ వున్నాయనీ, తండ్రి వ్యవసాయదారుడనీ చెప్పాడు.
ఈ వివరాలు లత నాన్నగారికి బానే నచ్చేసాయి. కృష్ణా జిల్లాలో పొలాలూ, తోటలూ అంటే బాగానే ఆస్తిపరులైవుంటారు, పిల్లాడు కూడా నెమ్మదస్తుడిలా, మర్యాదగా మాట్లాడుతున్నాడూ, జీతం అదీ కూడా బానే వుంది.. వెతుక్కోకుండా, వచ్చేస్తున్నాడు.. అనుకున్నారు. లత వాళ్ళమ్మ మాత్రం తొందరపడి మాటివ్వకండి.. ఓసారి అతన్ని ఇక్కడ కి రమ్మని పిలవండి.. మాట్లాడదాము అనేసరికి.. అదీ నిజమే అనిపించి.. అశోక్ ని తమ ఊరికి రమ్మని చెప్పారు.
ఆ తర్వాత వారం అశోక్.. మా వూరు వచ్చాడు. ఇదే చూసుకోవడం.. లత, అశోక్.. అప్పటివరకు ఫోటోలు చూసుకోవడమే.. అశోక్ వచ్చాడని నన్ను కూడా పిలిచింది. ఉత్తరాలలో నా గురించి చెపుతూ వుండేది అశోక్ కి.. మనిషి బావున్నాడు.. అందగాడు.. చక్కటి రూపం.. మాట కూడా చాలా మర్యాదగా, పొందిగ్గా వుంది.
మధ్యాహ్నం భోజనాలయ్యాక.. అశోకే ఈ టాపిక్ ఎత్తాడు.. తన తల్లిదండ్రులు అయితే.. ఈ పెళ్ళికి ఒప్పుకోరు.. ఎందుకంటే తనకి మేనమామ కూతుర్ని ఇచ్చి చేయాలని వాళ్ళు డిసైడైపోయారు.. తనకి ఇష్టం లేదని చెప్పినా సరే.. ఆమెనే చేసుకోవాలని బలవంతం పెడుతున్నారు. తనకి లత బాగా నచ్చింది.. లతని వదిలి వుండలేను… మీకు అభ్యంతరం లేకపోతే.. మా ఇద్దరికీ మీరు దగ్గరుండి , పెళ్లి జరిపించండి. ఆ తర్వాత మావాళ్లు ఏమీ అనలేరు ఇక. ముందు పెళ్ళి అయిపోతే వాళ్ళని ఎలాగోలా దారికి తెచ్చుకోగలను.. ముందు పేచీ పెట్టినా తర్వాత ఎలా గోలా ఒప్పుకుంటారు. ఒక్కగానొక్క కొడుకుని వాళ్ళు వదులుకోరు.. ఇలా చెపుతూంటే.. నిజమే కదా అనిపించింది.
ప్రస్తుతం మూఢాలు జరుగుతున్నాయి…. ఇప్పుడు ముహూర్తాలు వుండవు.. ఆ తర్వాత మాట్లాడుకుందాం.. అని లత నాన్నగారు అనేసరికి సరే అన్నాడు అశోక్.
అశోక్.. తండ్రి వివరాలు.. వూరూ.. అడ్రస్ అన్నీ అడిగి తెలుసుకున్నారు. ” అంకుల్.. మీరిప్పుడు మా నాన్న గారిని ఈ విషయం అడిగితే చచ్చినా ఒప్పుకోరు.. తర్వాత అయితే ఒప్పుకుంటారన్న ధీమా నాకుంది.” అన్నాడు.
“ఇప్పుడు కదిలించను. పెళ్లి తర్వాతనే ..” అన్నారు లత నాన్నగారు.
ఆ మరునాడు అశోక్ వెళ్లి పోయాడు. ఆ తర్వాత బావ వచ్చి, నన్ను హైదరాబాద్ తీసుకెళ్లి పోయాడు. వెళ్ళే ముందు లతకి చెప్పాను.. ముహూర్తం పెట్టగానే చెప్పమని.
ఆ తర్వాత రెండు మూడుసార్లు ఫోన్ చేసుకున్నామంతే… నేనూ నా కొత్త కాపురం హాడావుడిలో పడిపోయి ఆ విషయం మర్చిపోయాను.
ఇప్పుడు ఈ శుభలేఖ చూడగానే.. అదంతా గుర్తు వచ్చింది.
బావ రాగానే.. టికెట్ బుక్ చేయించుకుని, పెళ్లికి పదిరోజుల ముందే మా ఊరికి బయలు దేరాను. పెళ్లి టైమ్ కి బావని రమ్మన్నా.. ఇద్దరం కలిసి వచ్చేద్దామని చెప్పాను. సరే అని చెప్పి.. నన్ను రైలు ఎక్కించాడు. ఎప్పుడెప్పుడు లతని కలుస్తానా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రంగా వున్నాను.
మర్నాటి ఉదయం స్టేషన్ కి నాన్న వచ్చారు. ఇంటికి వెళ్ళాక స్నానం, టిఫిన్ ముగించుకుని.. అమ్మకి చెప్పి లత ఇంటికి బయలుదేరాను. అక్కడ పెళ్ళి హడావుడి కనపడుతోంది. ఇంటికి రంగులు.. డెకరేషన్..
వచ్చిన దగ్గర బంధువులు, ఈ సందడిలో లత ని పట్టుకుని రూమ్ లోకి తీసుకువెళ్ళాను.
వెంటనే ఆత్రంగా అడిగాను…” ఏమిటే.. ఏమైంది? అశోక్ ని ఎందుచేత చేసుకోవడం లేదు? అంకుల్, ఆంటీ ఒప్పుకున్నారు కదా.. నీకూ నచ్చాడు కదా.. ఏమైంది అసలు..ఈ సుధాకర్ ఎవరు? ఈ పెళ్ళి నీ ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నావా?” ఇలా ప్రశ్నలతో లతని ఉక్కిరిబిక్కిరి చేసేసాను.
“అంతా చెపుతాను.. కంగారు పడకే తల్లీ..ముందు కాస్త ఏదెనా తిందువు గాని ” అంది లత.
“తిండి విషయం తర్వాత.. ముందు ఇదేదో నాకు చెప్పు.. ” అని నేను అనేసరికి..
రూమ్ తలుపు వేసి, లత నా ఎదురుగా కూర్చుని చెప్పడం మొదలెట్టింది.
” ఆ రోజు అశోక్ చెప్పిన మాటలు నీకు గుర్తు వున్నాయి కదా.. నాన్న కూడా మూఢాలు వెళ్ళాక ముహూర్తము పెట్టుకుందాం అనేసరికి, సరే.. మీ ఇష్టం.. అని అశోక్ తిరిగి బెంగళూరు వెళ్లి పోయాడు. ఆ తర్వాత కూడా నాకు ఉత్తరాలు వ్రాసాడు. ఓ పదిహేను రోజుల తర్వాత మా ఢిల్లీ బాబాయి ఏదో పని మీద మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చాడు. అప్పుడు అమ్మ నాన్న.. ఈ అశోక్ సంబంధం గురించి బాబాయికి చెప్పారు. తను బెంగళూరు వెళ్లి అశోక్ ని ఓసారి చూసి వస్తా అని బాబాయి అన్నారు. సరే అన్నారు నాన్న కూడా. బెంగళూరు వెళ్ళిన బాబాయి ఆఫీసు కి వెళ్ళి అశోక్ ని పరిచయం చేసుకున్నారు. అశోక్ కూడా బాబాయిని చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుని, తన రూమ్ లోనే తనతో పాటు రెండు రోజులుంచుకుని, సెలవు పెట్టుకొని సిటీ అంతా చూపించాడట. అశోక్ వినయం, మర్యాద బాబాయికి కూడా బాగా నచ్చాడు. తన తల్లిదండ్రులు గురించి మాకు చెప్పినట్లే బాబాయికి కూడా చెప్పాడు అశోక్.
తిరిగి వచ్చిన బాబాయి.. అశోక్ గురించి అంతా బాగానే చెప్పాడు.. అశోక్ ఉద్యోగం, ఆఫీసు, జీతం అన్నీ ఎంక్వయిరీ చేసాను.. అంతా బావుందని చెప్పాడు. నేను హమ్మయ్య అనుకున్నా. కానీ బాబాయికి మరో డౌట్ వచ్చింది.. అశోక్ తల్లిదండ్రులు వూరు వెళ్లి ఓసారి ఎంక్వయిరీ చేసి వస్తానని వెళ్ళాడు.
ఆ వూరిలో తను ఎవరో ఎందుకు వచ్చినట్లో చెప్పకుండా.. అశోక్ కుటుంబం గురించి ఆరా తీసాడు. ఆ ఊళ్లో వారు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు బాబాయి.
ఆ వూరిలో ప్రస్తుతం అశోక్ తల్లిదండ్రులు లేనే లేరట. అతను చెప్పినట్లుగా వారికి పొలాలు, తోటలు కూడా లేవట. చాలా బీద కుటుంబమట వారిది. అన్నిటికన్నా షాక్.. ఏంటంటే.. అశోక్ కి అంతకు ముందే పెళ్ళి అయిందట. అశోక్ చాలా శాడిస్ట్ అనీ, అతను పెట్టే టార్చర్ తట్టుకోలేక.. నాలుగో నెల గర్బవతి అయిన అతని భార్య .. సూసైడ్ చేసుకుని చనిపోయిందట. తగిన సాక్ష్యాధారాలు లేక అశోక్ మీద కేసు కొట్టేసారట. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు ఈ వూరు వదిలి వెళ్ళి పోయారట. ఎక్కడకి వెళ్ళిందీ తమకి తెలీదని ఆ ఊరి వారు చెప్పడంతో.. బాబాయికి నోట మాట రాలేదట. అశోక్ కూడా ఎక్కడ వుంటున్నదీ, ఏ ఉద్యోగం చేస్తున్నదీ తమకి తెలీదని చెప్పారు వాళ్ళు.
ఇంటికి వచ్చి బాబాయి ఈ సంగతులు చెప్పగానే నాన్న తాటిచెట్టంత ఎగిరారు. అశోక్ తో స్నేహం చేసి కలం స్నేహం చేసినందుకు నన్ను చఢామఢా తిట్టేసారు. తను కూడా ముందు వెనక చూసుకోకుండా ఒప్పుకున్నందుకు తనని తనూ తిట్టుకున్నారు. ఆ విషయమై బాబాయి.. అశోక్ ని తిడుతూ ఉత్తరం రాసి.. ఇంకెప్పుడూ.. నాకు లెటర్స్ వ్రాయవద్దనీ.. ఏదైనా గొడవలూ, బెదిరింపులు చేస్తే పోలీసు రిపోర్టు ఇస్తాననీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
నాకు కూడా.. ఈ సంఘటనతో కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకా నయం.. ఎక్కడా.. ఏ మాత్రం నేను ఉత్తరాలలో కానీ.. ప్రవర్తనలో కానీ తొందర పడలేదు. .. లేకపోతే నానా రభస అయిపోయేదాన్ని.. అదృష్టం బావుండ బట్టి గోతిలో పడలేదు. బాబాయి ముందుచూపు వల్ల నా జీవితం నాశనం కాకుండా.. ఒడ్డున పడ్డాను. కాస్త స్థిమిత పడ్డాక బాబాయే తనకి తెలిసిన ఈ సంబంధం తీసుకువచ్చాడు.. మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను. ” అని జరిగిన సంగతులన్నీ చెప్పింది లత.
నాకు చాలా భయం వేసింది..” అమ్మో.. ఎంత మోసం చేసాడు అశోక్.. తేనె పూసిన కత్తి.. కట్టుకున్న భార్య ఉసురు తీసాడు.. నిన్ను చేసుకుని వుంటే.. ఏం చేసేవాడో.. ముందుగా ముప్పు తెలుసుకోగలిగారు.. నయమే.. అతని మాట తీరు చూసి ఎంత మంచివాడో అనుకున్నా.. అయినా మనదే తప్పు . అమ్మానాన్న ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే ఇలాగే అవుతుంది. ఇది అందరు ఆడపిల్లలకీ ఓ గుణపాఠం అవుతుంది. ” అన్నాను నేను.
ఈ కలం స్నేహాలూ, ఫేస్బుక్ స్నేహాలు నిజమే అనుకుని భ్రమ పడి ఎందరో మోసపోతున్నారు.. వారందరికీ ఇదో కనువిప్పు అవుతుంది అనుకున్నా.
వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ లత మెడలో సుధాకర్ మంగళసూత్రం కడుతూండగా.. లత మోములో మెరిసే కాంతి నాకు ప్రస్ఫుటంగా కనిపించింది. వీరిద్దరూ కలకాలం హాయిగా వుండాలని ఆ భగవవంతుని ప్రార్ధించాను.

2 thoughts on “కలం స్నేహం.

  1. I like this story Kalam Sneham Ante Pen Friendship., very nice story and writing by Girija Kalavala. Thankn you Jyothi Valaboju Garu . Conrtas to you on successful Self made Career of Publishing. I like this Link of Facebok. First time I read any =thing on Facebok. Love this. keep it coming.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *