April 17, 2024

తొలివలపు

రచన: నిష్కల శ్రీనాథ్

బయ్యప్పనహళ్ళి (బెంగళూరు)మెట్రో స్టేషన్ సమయం 7:45 మెట్రో ఎక్కేవాళ్ళు దిగేవారితో రద్దీగా ఉంది. ఈ నగరానికి వచ్చిన దగ్గర నుండి హడావిడి గా మనుషులు పరిగెత్తడం చూసి అలవాటు అయిపోయిన స్వప్న మాత్రం మెల్లగా సెక్యూరిటీ చెక్ ముగించుకుని లోపలికి వెళుతూ ఫోన్ కి ఇయర్ ఫోన్స్ పెట్టి చెవిలో పెట్టుకుంది. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఆ పాత మధురాలు వింటూ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాక గుర్తు వచ్చింది మెట్రో కార్డు రీఛార్జి చేయించాలని చాలా మందే ఉన్నారు. కాని ఎలాగూ టైం ఉంది కదా అని కౌంటర్ దగ్గర నిల్చుంది. చుట్టూ పరికించి చూసేసరికి ఎందుకో పండగ వాతావరణంలా ఉంది. అందరు జంటలుగా కనిపిస్తున్నారు. వాళ్ళ ముఖంలో ఎదో తెలియని ఆనందం. ‘ నాకు తెలియని పండగ ఏంటి అబ్బా ‘ అనుకుంటూ ఆ రోజు తేది చూసింది. అప్పుడు గుర్తు వచ్చింది ప్రేమికుల రోజు అని .
తన లో తానే నవ్వుకుంది స్వప్న ఇంతలో కౌంటర్ దగ్గరకు రావడంతో ఆలోచన మాని డబ్బులు ఇచ్చి రీఛార్జి చేసుకుంది. అప్పుడే ఒక ట్రైన్ వెళ్లిపోయింది. చేసేది ఏమి లేక అక్కడ బెంచ్ మీద కూర్చుని మళ్ళీ పాటలు వినడం మొదలు పెట్టింది. అప్పుడు మొదలు అయింది తనకి నచ్చిన పాట ‘ నన్ను వదిలి నీవు పోలేవు లే అదే నిజము లే. ….’ స్వప్న కళ్లలో మెరుపు పెదవుల పై చిరునవ్వు తన కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి స్వప్న ఆలోచనలు 6 నెలల వెనక్కు వెళ్లాయి. ఆరోజు కూడా ఇలాగే ట్రైన్ లో పాటలు వింటూ ఉంది ఇయర్ ఫోన్స్ ఒకవైపు పని చేయక పోవడంతో ఒక వైపే వినిపిస్తుంది పాట. మరో వైపు ట్రైన్ లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా రెండో వైపు కూడా అదే పాట మరో వైపు ఏ చరణంలో ఉందో అదే వినిపిస్తుంది. ఆశ్చర్య పోయింది. స్వప్న పాట వినిపించిన వైపు చూసింది ఇయర్ ఫోన్స్ ని ఫోన్ కి పెట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆకాశ్ కనిపించాడు. మొట్ట మొదటి సారి చూడగానే నచ్చేసాడు స్వప్నకి. ఎందుకో స్వప్నకి అర్ధం కాలేదు కాని ఇట్టే ఆకర్షించే శక్తీ అబ్బాయిలో ఉందేమో అనుకుంది కాని తన లాంటి అభిరుచి ఉన్న అబ్బాయి అదే ట్రైన్ లో తన ఎదురుగా కూర్చుని అదే పాట వినడం ఒకింత ఆశ్చర్యానికి గురి అయింది స్వప్న అప్పటి నుండి ఆకాశ్ ని గమనించడం మొదలు పెట్టింది కాల క్రమేణా అబ్బాయి పేరు ఆకాశ్ అని బ్యాంకు లో పని చేస్తున్నాడు అని తెలుసుకుంది ఏమి తెలియక పోయినా ఎందుకో అబ్బాయి మీద ఒక రకమైన ఆకర్షణ కలిగింది ఆఫీస్ వేళలు కూడా ఒకటే కావడం వల్ల దాదాపు ఇద్దరు ఒకే ట్రైన్ ఎక్కేవారు అలా అలా స్వప్న అ అబ్బాయి గురించి ఎదురుచూసి తను వచ్చాకే ట్రైన్ ఎక్కడం మొదలు పెట్టింది.
రోజు పీజీ(హాస్టల్) కి రాగానే స్వప్న రూమ్మెట్ స్వాతి తో ఈ విషయాలన్నీ చెప్పడం అలవాటు గా మారింది 5 సంవత్సరాలు గా స్వప్న ని చూస్తున్న స్వాతి కి ఇది ఆశ్చర్యానికి గురి చేసేది ఎవరితోనూ ఎక్కువగా కలవని తన పరిధి దాటి ఏ విషయాన్నీ పట్టించుకోని స్వప్న ఒక అబ్బాయి మీద అంత ఆసక్తి ఎందుకు చుపిస్తూoదో అర్ధం అయ్యేది కాదు ఇద్దరు ఒకే ఊరి వాళ్లు స్వాతి స్వప్న కి రెండేళ్లు సీనియర్ స్వాతి ఇక్కడ ఉండబట్టే స్వప్న తల్లితండ్రులు బెంగళూరు పంపారు అంతవరకు హాస్టల్ భోజనాన్ని తినలేక పోయిన స్వాతి కి స్వప్న ఒక అన్నదాత లా అనిపించేది స్వప్న చేసే వంటలకు స్వప్న కి అభిమాని గా మారిపోయింది స్వప్న చేసే ఘమఁ ఘమఁ లాడే వంటలు తను మోసుకువచ్చే వేడి వేడి కబుర్లు తో ఇద్దరు ప్రపంచాన్నే మర్చిపోయేవారు.
“ఎక్స్ క్యూస్ మీ ” అన్న పక్కన అమ్మాయి అభ్యర్ధన తో ఆలోచనల నుండి బయటకు వచ్చింది ట్రైన్ వస్తుంది అందుకే అందరు హడావిడి పడుతున్నారు తన కళ్ళు ఎదురు చూసిన చెలికాడు కుడి పక్కన కాస్త దూరం గా తెల్ల రంగు చొక్కా కింద బూడిద రంగు ప్యాంటు వేసుకుని హుందాగా నిల్చున్నాడు తన బట్టల వైపు చూసుకుంది తెల్ల రంగు అక్కడక్కడ నీలం రంగు పువ్వుల చుడీదార్ కాలేజీ లో ఉన్నప్పుడు తనకు నచ్చిన అమ్మాయి ఏ రంగు డ్రెస్ వేసుకుని వస్తే అదే రంగు చొక్కా వేసుకుంటే ఆనందించేవాళ్లు అబ్బాయిలు లేకపొతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వేసుకుని వస్తే చొక్కాలు మార్చుకునే వాళ్లు అని స్నేహితురాలు చెప్పిన విషయం విని నవ్వుకుంది అప్పుడు ఇప్పుడు తను కూడా అలాగే ఆలోచిస్తుంది అనుకుంటూ ట్రైన్ ఎక్కింది.
*****************
” ఏంటి ఈరోజు లేట్ అయినట్టు ఉంది ఆఫీస్ లోన లేక ట్రాఫిక్ లోనా ??” అంటూ అడుగుతున్న స్వాతి ని చూసి నిట్టూరుస్తూ ” ఆఫీస్ లొనే ” అంటూ బట్టలు తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్లింది ” చపాతీ లు చేస్తాను ఇదిగో కూర చెయ్యి ” అంటూ కడాయి స్వప్న చేతికి ఇచ్చింది ” ఏంటి ఈరోజు విశేషాలు అవును ప్రేమికుల రోజు కదా ” అంటూ కొంటె గా స్వప్న వైపు చూసింది స్వాతి ” అంత లేదు తల్లి ఆఫీస్ లో మీటింగ్ వల్ల లేట్ పైగా అమ్మ వచ్చి 3 నెలలు అవుతుంది ఇంటికి రమ్మని అడుగుతుంది అందుకే టికెట్స్ బుక్ చేస్తు టైం చూసుకోలేదు ఏమి ప్రేమికుల రోజో ఏంటో ఈరోజు అంతా పని తో అయిపోయింది” అంటూ నీరసం గా గరిటే తిప్పింది ” అది సరే ఇంతకి మన హీరో గారి సంగతి ఏంటి??” అంటూ కన్ను కొట్టింది స్వాతి వెంటనే స్వప్న ముఖం వెయ్యి వోల్ట్ బల్బు లా మారింది ఉత్సాహం గా చెప్పడం మొదలుపెట్టింది .
” మరి ఎప్పుడు మాట్లాడతావు తనతో ” అంది స్వాతి తన మంచం మీద దుప్పటి సరిచేసుకుంటూ ” అమ్మో మాట్లాడటమే నాకు మాములుగా ఎవరితోనైనా మాటలు మొదలు పెట్టాలంటే భయం అలాంటిది నేను నేనుగా వెళ్ళి ఆ అబ్బాయి తో మాట్లాడాలి అంటే నా వల్ల కాదు ” అంటూ స్వాతి వైపు తిరిగి పడుకుంది స్వప్న ” అయితే మరి దీనిని ఏమంటారు ప్రేమా? ఇష్టమా?? లేక నీకు పెళ్ళి ఇంకొకరితో అయ్యేంత వరకు ఇలాగే చుస్తూ ఉండిపోతావా?” ” ఇది ప్రేమో? ఇష్టమో? ఆకర్షణొ ? తెలిదు కానీ ఈ అనుభూతి మాత్రం చాలా బాగుంది” అన్న స్వప్న మాటలకూ పెదవి విరుస్తూ ” ఏది ఏమైనా త్వరగా అది ఏంటో తెలుసుకో ఎందుకంటే నీకు త్వరలో సంబంధాలు చూడటం మొదలుపెడతారు అప్పుడు మనసు మార్చుకోవటం కష్టం అవుతుంది” అంటూ కళ్ళు మూసుకుంది స్వాతి వైపే చుస్తూ స్వప్న ఆలోచనలో మునిగిపోయింది.
*****************
” ఏంటే ఇంత చిక్కిపోయావు నీ వంట నువ్వే తినలేక పోతున్నావా?” అంటూన్న తల్లి వంక కోపంగా చుస్తూ ” అమ్మా నీ కన్నా నేనే నయం పాపం అన్నయ్య ని, నాన్నని చూస్తే జాలి వేస్తుంది ” అంటూ సోఫాలో కూర్చుంది స్వప్న. అందరి నవ్వులతో ఆ ఇంట్లో సందడి మొదలు అయ్యింది.
” నాన్న నాకు చెప్పకుండా పెళ్ళి చూపులు ఎలా నిర్ణయించారు ? అసలు నా పెళ్ళి ఆలోచనలు మీకు మొదలుఅయినట్టు నాకు చెప్పనేలేదు ” ఆందోళన గా స్వప్న తన తల్లి తండ్రుల వంక చుస్తూ అడిగింది .” లేదు రా కిందటి వారమే నీ ఫోటో ఇచ్చాను. వెంటనే ఈ సంబంధం వచ్చింది కానీ నీకు అప్పుడే చెపితే కోపంతో ఇంటికి రావేమో అని ఇప్పుడు చెప్పాము. నీకు నచ్చకపోతే మేము అడ్డు చెప్పము సరే నా” అని తండ్రీ భరోసా ఇవ్వగానే ఆనందంగా తల ఊపింది స్వప్న .
“స్వప్న వాళ్ళు వచ్చేసారు నువ్వు తయారుగానే ఉన్నావు కదా ” అంటూ తల్లి గది లోకి వచ్చి అడగగానే అవును అన్నట్టు తల ఊపింది స్వప్న. కానీ ఎదో మూలన అనిపించింది ఎంతయైన మొదటి పెళ్ళి చూపులు అబ్బాయి ఎలా ఉన్నాడో చూడాలని ఉత్సాహం కలిగింది స్వప్నకి. మెల్లగా తలుపు వెనక నక్కి హాల్ లో ఉన్న వాళ్ళని చూడటానికి ప్రయత్నించసాగింది. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కనిపిస్తున్నారు. ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని తెలుస్తుంది. కానీ వాళ్ళు కనిపించడానికి ఇంకాస్త ముందుకు వెళ్లాలి. కర్టెన్ వేసే ఉంది కాబట్టి తను వేసే వేషాలు కనపడవు. తల ఇంకాస్త వంచి చూసింది. నల్ల రంగు జీన్స్ పైన కాషాయం రంగు టీ షర్ట్ కనిపిస్తుంది . ఇంకొంచెం వంగింది ముఖం కనిపించడం తలుపుకి అడ్డం గా వేసిన కుర్చీ తగులుకోవడం ఒకేసారి జరిగింది. ఇది నిజమా? కలా? అనుకుని దెబ్బకి లోపలికి వచ్చి కూర్చుంది తను చూసింది ఎవరినో కాదు ఆకాశ్ ని “నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే …..” అని ఒక పాట మనసులో వేసుకుని మురిసిపోతూ ఉన్న సమయంలో ” స్వప్న రా ” అంటూ తల్లి వచ్చి పిలుచుకుని వెళ్లింది .
“మా అమ్మాయి” అంటూ పరిచయం చేసింది తల్లి. అందరికి నమస్కారం పెట్టి కూర్చుంది స్వప్న. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తుంటే తల్లి అందరికి ఫలహారాలు తీసుకువచ్చింది ” బాబు పెద్ద వాళ్ళ మాటలు అయిపోయాయి ఇప్పుడు మీరు మాట్లాడుకొండి అబ్బాయి ని మేడ మీదకి తీసుకువెళ్ళమ్మా” అంటూ కూతురు తో చెప్పాడు తండ్రీ సరే అన్నట్టు తల ఊపి అబ్బాయి సూటిగా చూడలేక కాళ్ళ వంక చూసింది తను ఊహించినట్టు గా నల్ల రంగు జీన్స్ కాకుండా పక్కన ఉన్న ముదురు నీలం రంగు జీన్స్ సోఫా లో నుండి లేచి నిలచో వడం తో స్వప్న కి ఏమి అర్ధం కాలేదు తల వెనక్కు తిప్పి కళ్లలో నుండి ఉబికి వస్తున్న కన్నీరు ఆపుకుంటూ మేడ మెట్ల వైపు నడిచింది.
” నా పేరు, ఉద్యోగం అన్నీ మీ వాళ్ళు చెప్పే ఉంటారు ఇక పోతే నా గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను తరువాత మీ గురించి చెప్పండి నిజం చెప్పాలంటే మీ ఫోటో చూడగానే సరే అనేసాను అందుకే మీరు వైజాగ్ కి వచ్చారు అని తెలియగానే అమ్మ రమ్మని ఫోన్ చేసింది నా ఉద్యోగం వల్ల వాళ్లతో కలిసి ఉండడం తక్కువే నాకు…” ఈలోగా తన ఫోన్ మోగడం తో తీసి మాట్లాడటం మొదలుపెట్టాడు
“హలో ! ఆ రమ్య చెప్పు ,అవును ఆకాశ్ చేసాడు తన ఫోన్ రిపేర్ కి ఇచ్చాడు అది చెప్పడానికే చేసాడు ఇవ్వాలా వాడికి ఒక్క నిమిషం ” ” ఎక్స్ క్యూస్ మీ ” అంటూ స్వప్న తో అని క్రిందనే ఉన్న ఆకాశ్ ని పిలిచాడు ” ఎవరు అన్నయ్య ?” అంటూ ఆకాశ్ వచ్చాడు ” రమ్య రా ” అంటూ ఫోన్ చేతికి ఇచ్చి స్వప్న దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఎదో మాట్లాడబోతుంటే స్వప్న మధ్యలో కల్పించుకుని ” అరవింద్ గారు నన్ను క్షమించండి నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు ఒక 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి అప్పుడు సొంతం గా తడి చెత్త తో వచ్చే ఉపయోగాల తో ఒక చిన్న బిజినెస్ మొదలు పెట్టాలని ఆలోచన పెళ్ళి అయ్యాక కూడా చెయ్యచ్చు అని అనుకోవచ్చు కానీ కొత్త బాధ్యతలు వచ్చాక మన కలలను వేరే వారికీ అనుగుణం గా మార్చుకోవలసి వస్తుంది అది నాకు ఇష్టం లేదు మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి” అంటూన్న స్వప్న కేసి అభిమానం గా చూస్తూ ” బాగుంది మీ లక్ష్యం నాకు మీ గురించి 3 సంవత్సరాలు ఎదురు చూడాలని ఉంది కానీ ఇందాక చూసారు గా మా తమ్ముడు చిన్నాన్న కొడుకు వాడికి నిచ్చితార్ధo అయిపోయింది 6 నెలల తరువాత పెళ్ళి ఈలోగా నాకు కూడా పెళ్ళి చేయాలనీ అమ్మ నాన్న అనుకుంటున్నారు మీకు జీవిత భాగస్వామి ని అవ్వలేక పోయిన ఒక స్నేహితుడి గా అనుకోండి మీ లక్ష్య సాధన లో ఎలాంటి అవసరం వచ్చినా నన్ను గుర్తుపెట్టుకోండి భయపడద్దు మా అమ్మ,నాన్న కి అభిప్రాయాలు కలవలేదు అని చెప్తాను” అంటూ నవ్వుతూ మెట్ల వైపు వెళ్లాడు అరవింద్.
*************
“ఏంటి స్వప్న ఇంకా ఎన్నాళ్ళు ఇలా నువ్వు వైజాగ్ నుండి వచ్చి నెల అవుతుంది ఇప్పటికి నువ్వు అ అబ్బాయిని మర్చిపోకపోతే ఎలా ఇంకొన్ని నెలలలో ఆ అబ్బాయికి వేరే పెళ్ళి అయిపోతుంది నువ్వు ఇంకా నీ జీవితం గురించి ఆలోచించు ” అంటూ స్వప్న కి బాక్స్ చేతికి ఇచ్చింది స్వాతి ” అదేం లేదు స్వాతి చాలా మంది ఇష్టపడినా ఎవ్వరి మీద కలగని ఇష్టం ఆ అబ్బాయి మీద కలిగింది కానీ చివరికి అది ఇలా అవుతుంది అనుకోలేదు అయినా ఇన్ని రోజులు షిఫ్ట్ మారడం తో తను కనిపించే అవకాశం లేదు అని కొంచెం దైర్యం చెప్పుకున్నా మళ్ళి ఈరోజు నుండి అదే షిఫ్ట్ అందుకే కాస్త ముందుగా వెళుతున్నాను కనిపించకుండా ఉండాలనే కోరుకుంటున్నాను” అంటూ బాధగా బ్యాగ్ తగిలించుకుని బయటకు నడిచింది స్వప్న .
“ట్రైన్ రిపేర్ ఆగిఁతూ ఇంద సైడ్ బన్ని ” అంటూ ఒక అమ్మాయి స్వప్నతో చెప్పడంతో ” ఎంత సేపు అవుతుంది” అని అడిగింది “వేరే ట్రైన్ వస్తది వెయిట్ మాడి ” అంది ఇంక చేసేది ఏమి లేక బెంచ్ మీద కూర్చుని ఆఫీస్ మెయిల్స్ చూసుకుంటుంది ఫోన్ లో ” ఎంత సేపు పడుతుంది ట్రైన్ రావడానికి” అన్న ప్రశ్న కి తల ఎత్తకుండానే “పది నిమిషాలు పడుతుంది” అని చెప్పింది కానీ ఎందుకో అనుమానం వచ్చి పక్కకి చూసింది ఆకాశ్ నవ్వుతు కనిపించాడు కాసేపు బిత్తరపోయింది తను అలా ఆశ్చర్యం గా చూడడం తో తనని గుర్తు పట్టలేదు అనుకుని ” మర్చిపోయారా ? అరవింద్ అన్నయ్య తో పాటు వచ్చాను కదా ” అన్నాడు గుర్తు వచ్చింది అన్నట్టు తల ఊపింది ” నా పేరు ఆకాశ్ ” అంటూ పరిచయం చేసుకున్నాడు.
“ఏంటి జేపీ నగర్ లో ఆర్ బి ఐ లేఔట్ ఆ!! నందిని హోటల్ ఉంది కదా అక్కడ మా బ్యాంకు ఒక పని చేద్దాం ఇద్దరం క్యాబ్ బుక్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు త్వరగా కూడా వెళ్తాము ఏమంటారు? మీకు ఇబ్బంది లేకపొతేనే ?” ” పర్లేదు నేను కూడా ఆఫీస్ కి త్వరగా వెళ్ళచ్చు ” అంటూ మొహమాటం గానే క్యాబ్ ఎక్కింది.
స్వప్న లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తు ఆలోచించింది ‘దేవుడు మళ్ళీ తనని ఎందుకు దగ్గర చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే ఎదో మాములు మనిషిని అవుతున్నాను మళ్ళీ ఎందుకు ఆశ కల్పిస్తూన్నాడు లేదు తనకి కాస్త దూరం గా ఉండడమే మంచిది అనుకుని తినడం మొదలు పెట్టింది.
స్వాతి కి స్వప్న విషయం చెప్పగానే మంచం మీద నుండి కింద పడినంత పని చేసింది “నాకు పిచ్చిఎక్కుతుంది స్వప్న ” అంటూ జుట్టు పీక్కోవడం మొదలుపెట్టింది ” స్వాతి నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను ఈసారి మాత్రం సాటి ప్రయాణీకుడి గానే చూడాలని అందుకే సాయంత్రం కూడా కలిసి వచ్చినా నా మనస్సులో ఎలాంటి భావన లేదు వాళ్ళ అన్నయ్య తో నేను మాట్లాడింది అంతా ఆకాశ్ కి చెప్పాడట వాళ్ళ అన్నయ్య ఒక లక్ష్యం పెట్టుకుని దానికి కట్టుబడి ఉండడం బాగా నచ్చింది అంట తనకి, అప్పుడు తన పెళ్ళి గురించి అడిగాను ఇంకా తేది నిర్ణయించలేదు అని చెప్పాడు ” అంటూ ఉల్లిపాయలు తరగడo మొదలుపెట్టింది.
******************
“ఆహా మీకు కూడా పాత పాటలు అంటే ఇష్టమా చాలా విచిత్రం గా ఉందే చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి మన ఇద్దరిలో ” అన్నాడు ఉత్సాహం గా ఆకాశ్ ” పాటలే కాదు సినిమా లు కూడా ఇష్టం ఆదివారం అందరు కొత్త సినిమా గురించి ఎదురు చూస్తే నేను పాత సినిమాలు గురించి ఎదురు చూసేదానిని ” అంటూ చెప్పింది రెండు నెలల నుండి ఇద్దరు కలిసే ప్రయాణిస్తున్నారు ఎంత స్వప్న కలవకూడదు అనుకున్నా ఆకాశ్ తనంతట తాను కలిసే సరికి ఏమి అనలేకపోతుంది ఆకాశ్ కి ఫోన్ రావడం తో ఆలోచన నుండి బయటకి వచ్చింది నెంబర్ చూడగానే ఆకాశ్ ముఖం కోపం తో ఎర్రబడింది ” మావయ్య నేను చెప్పాల్సింది రాత్రే చెప్పాను ఇంకా రాయబారాలు నడపద్దు అని వాళ్ళకి చెప్పండి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నేను మార్చుకోలేను ఈ విషయం ఇంతటి తో వదిలేస్తే మంచిది ” అంటూ ఫోన్ పెట్టేసాడు .స్వప్న కి ఇదంతా ఇబ్బంది గా అనిపించినా అంత కోపం గా ఎప్పుడు చూడలేదు ఆకాశ్ ని అందుకే కారణం తెలుసుకోవాలని అనుకుంది ” ఏమైంది ఆకాశ్ గారు” అంటూ భయం భయంగా అడిగింది అప్పటికి గుర్తు వచ్చింది ఆకాశ్ కి పక్కన స్వప్న ఉంది అని ఇంక చెప్పక తప్పలేదు ఆకాశ్ కి ” అది మీకు తెలుసు గా నాకు నిశ్చితార్థo అయిందని అది వద్దు అనుకున్నాం ఎందుకు? ఏమిటి ?అని అడగద్దు ఎందుకంటే అమ్మాయి గురించి చెడు గా చెప్పాల్సి వస్తుంది ఏమైనా నచ్చని అలవాట్లు అయితే మార్చుకోగలను కానీ పూర్తిగా నేనే మారిపోవాలి అంటే ఎలా? అందుకే చాలా తర్జనబర్జన పడ్డాక ఆ నిర్ణయం తీసుకున్నాను అవకాశం కోల్పోయాక బాధపడే కన్నా ఉన్నప్పుడే వినియోగించుకోవడం మంచిది కదా ఇది జరిగి రెండు నెలలకి పైనే అయింది కానీ నిన్న రాత్రి మళ్ళీ వాళ్ళ నాన్నగారు రాయబారం పంపారు మా అమ్మాయి పెత్తనం చలాయించడం తప్పే ఇక నుండి అలా జరగదు అని కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మార్చుకోలేను అని చెప్పేసాను మీరు చెప్పండి తప్పు చేశాను అంటారా?” అని అడిగాడు స్వప్న కి ఏమి చెప్పాలో తెలీలేదు ” నచ్చనప్పుడు అమ్మాయి ఐన అబ్బాయి ఐన ఎవరైనా వాళ్ళ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు వాళ్లకి మాత్రమే ఉంటుంది మీరు సరి ఐన నిర్ణయం తీసుకున్నారు ” అంటూ అభినందించినట్టు మాట్లాడే సరికి ఆకాశ్ కాస్త తృప్తి చెందాడు .
బట్టలు మడత పెడుతుంది అన్నమాటే గానీ స్వప్న మనసు ఎక్కడో ఆలోచిస్తుంది అది గమనించిన స్వాతి ” మేడం గారు ఊహల్లో విహరిస్తూనట్టు ఉన్నారు ” అంది వెటకారం గా దానికి సమాధానం గా నవ్వి పొద్దున్న జరిగింది చెప్పింది ” దేవుడా!! సూపర్ కదా అయితే ఇంక ఆ పెళ్ళి జరగదు అంటే తను ఇప్పుడు మళ్ళీ సింగిల్ నీకు లైన్ క్లియర్ అయింది అల్ ద్ బెస్ట్ ” అంటూ చేతులూ ఊపడం మొదలు పెట్టింది ” పూర్తిగా విను నాకు ఒకటి మాత్రం బాగా నచ్చింది పెళ్ళి రద్దు అనుకున్నా ఆ అమ్మాయి గురించి తప్పు గా చెప్పలేదు ” ” స్వప్న నిజం గా చెప్తున్నా మన హీరో తో ఈ రెండు నెలల సావాసం లో మొట్ట మొదటి సారిగా మళ్ళీ అదే మెరుపు కనిపిస్తుంది ని కళ్లలో ” ” చాలు ఒకసారి తిన్న దెబ్బ అదేం లేదు లేని పోనీ ఆశలు కల్పించకుండా గప్ చుప్ గా పడుకో ” అంటూ లైట్ ఆపింది .
*************
“ఏమి చెయ్యను ఈ వర్షం ఆగటం లేదు వర్షం కి మెట్రో కూడా ఆపేశారoట బస్ లు కూడా ఏమి రావట్లేదు ” “ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్ మరి” అని ఆందోళన గా అడిగింది స్వాతి ” ఆకాశ్ వాళ్ళ బ్యాంకు దగ్గర బస్ స్టాప్ లో ఉన్నాను ఇంతవరకు నడుచుకుని వచ్చాను ఏమైనా దొరుకుతాయి ఏమో అని ” అని అంది స్వప్న “సరే ఇంక మాట్లాడకుండా ఆకాశ్ వాళ్ళ బ్యాంకు కి వెళ్లు తనతో ఉండు ఒంటరిగా ఉండటం సేఫ్ కాదు పైగా వర్షం లో తడిచావు జాగ్రత్త కలిసాక మెసేజ్ పెట్టు” అంది స్వాతి.
“ఏంటి సర్ప్రైజ్ మీరు మా బ్యాంకు కి ?” అడిగాడు ఆకాశ్ కుతూహలం గా విషయం అంతా చెప్పాక పరిస్ధితి అర్ధం చేసుకుని “ఒక పని చేద్దాం ఇప్పుడు కష్టపడి ఏ ఆటో నో పట్టుకుని వెళ్లినా కనీసం 4 లేదా 5 గంటలు పడుతుంది ఇప్పుడు 8 అవుతుంది మీరు మీ పీజీ కి నేను కస్తూరినగర్ లో ఉన్న మా ఇంటికి చేరేసరికి 12 ఐన అవుతుంది అందుకని మీరు ఏమి అనుకోను అంటే రేపు ఎలాగూ వీకెండ్ కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గర లో ఉంది రాత్రి అక్కడ ఉండి ప్రొద్దున వెళ్దాం ఏమంటారు??” అన్నాడు స్వప్న కి ఏమి చెయ్యాలో తెలీలేదు ఈ పరిస్ధితి లో ఆకాశ్ చెప్పింది సబబు గానే ఉంది కానీ ఎదో మూల భయం గా ఉంది ” మరి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?” అని అడిగింది ” ఇద్దరే కాకపోతే వాళ్ళ వైఫ్ ఇప్పుడు డెలివరీ కి అని పుట్టింటి కి వెళ్లింది మీకు ఇబ్బంది అయితే పైన ఓనర్ వాళ్లు కూడా తెలుగే వాళ్ళ ఇంట్లో ఉండచ్చు ” అని చెప్పి తన బ్యాగ్ సర్దుకోవడం మొదలు పెట్టాడు.
“ఆంటీ రాహుల్ చెప్పే ఉంటాడు ఫోన్ చేసి మీకు ” అంటున్న ఆకాశ్ వంక కాకుండా స్వప్న వంక చుస్తూ ” ఆ అమ్మాయి ఆ రాహుల్ కజిన్ ?” అని అడిగింది ఇంటి ఓనర్ ” అవును ఆంటీ సారీ ఆంటీ మీకు ఇబ్బంది పెట్టాము ” అన్నాడు “పర్లేదు బాబు కానీ కరెంటు పోయి పోయి వస్తుంది కొవ్వుత్తి ఉందో లేదో చూడండి లేకపొతే నన్ను అడగండి మళ్ళీ 9 అయితే పడుకుండి పోతాము ” అని అంది సరే అని కిందకు ఇంటి తాళం తీశాడు ” మీరు మా ఫ్రెండ్ కజిన్ అని చెప్పాను మిమ్మలిని అడిగితే అలాగే చెప్పండి” అంటూ లోపలికి నడిచాడు.
బట్టలు మార్చుకుని తల తుడుచుకుంటూ పక్క గది దగ్గరకి వచ్చిన ఆకాశ్ ఆ దృశ్యం చూసి అలా ఆగిపోయాడు గులాబీ రంగు చీర కట్టుకుని తల ఆరబెట్టుకుంటున్న స్వప్న ని చూడగానే ఆకాశ్ గుండె లయ తప్పింది మనసులో ఎదో మూలన “ఎంత వారు గానీ వేదంతులైన గానీ వాలు చూపు శోకగానే తేలిపోదురోయ్…కైపు లో……” అన్న పాట వినిపించింది తడి ముంగురులు కళ్ల మీద పడుతుంటే వెనక్కి నెడుతూ ఆరబెట్టుకుంటున్న స్వప్న అతిలోక సుందరి లా కనిపించింది ఆకాశ్ కి ఒకసారి అలా గతం లోకి వెళ్లాడు ‘ మొదటి సారి అన్నయ్య పెళ్ళి చూపుల లో చూసాను చాలా సాదా సీదా గా ఉంది అమ్మాయి అనుకున్న లక్ష్యం గురించి తెలిసాక ప్రత్యేకత ఉన్న అమ్మాయి అని తెలిసింది తనకు తెలియకుండానే ఆమె పట్ల ఆకర్షణ పెరుగుతుంది ఆమె తెలివి తేటలు,అభిరుచులు ,లక్ష్యం అన్నీ నచ్చాయి కానీ ఒకసారి బోల్తా పడ్డాను అందుకే ఏ నిర్ణయం అయినా ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకుని తీసుకోవడం మంచిది’ “ఏమైనా కావాలా” అన్న ప్రశ్న కి ఆలోచనల నుండి బయటకు వచ్చాడు “మరి భోజనం సంగతి ఏంటి మీకు ఆకలి వేయటంలేదా?” అని అన్నాడు .
ఎదో పడిన శబ్దం వస్తే వంటగది లోకి వెళ్లాడు ఆకాశ్ అక్కడ స్వప్న అరచేతులు నూనె తో తడిచిఉన్నాయి “సారీ నూనె గురించి డబ్బా తెరవాలిని ప్రయత్నిస్తూoటే ఇలా అయింది ” అంటూ సింక్ లో పడిన నూనె డబ్బా చూపించింది ” పర్లేదు ముందు మీరు చేతులు కడుక్కోoడి ” అని ఆకాశ్ అంటూ ఉండగానే కరెంటు పోయింది కంగారు లో తన చేతికి ఉన్న నూనె ఆకాశ్ ముఖానికి రాసింది వెంటనే కరెంటు రావడం తను చేసిన పనికి నాలుక కరుచుకుని సారీ చెప్పింది సింక్ లో నీళ్ళు రాకపోవడం తో బాత్రూమ్ లో నీళ్ళు ఉన్నాయని స్వప్న చెప్పింది కంట్లో కి నూనె వెళ్ళడం తో కనిపించటం లేదు ఆకాశ్ కి ” ఒక పని చేద్దాం మీరు నా చేతులూ పట్టుకోండి నేను మీకు దారి చెప్తాను ” అంది అలాగే పట్టుకున్నాడు కిటికీలు తెరిచి ఉన్నాయేమో గాలి బాగా వేస్తుంది ఆ గాలి కి స్వప్న జుట్టు సుతారంగా ఆకాశ్ చెవి ని తాకుతుంది ” కలవర మాఁయె మదిలో నా మదిలో …..” అనుకున్నాడు . ముందుగా స్వప్న చేతులు కడుక్కుని తరువాత ఆకాశ్ కి ముఖం కడుక్కోవడం లో సాయం చేసింది అప్పుడే చేతులు చాలా మృదువుగా ఉన్నాయి అంటూ ఆకాశ్ చేతులు పట్టుకోవడం తో వెంటనే చేతులు వెనక్కి తీసుకుంది ఆ హటాత్పరిణామం కి ఇద్దరు ఇబ్బంది పడి ఒకేసారి బయటకి వెళ్లాలనే తొందర లో ఇద్దరు ఒకరిఒకరు అడ్డు గా వచ్చి అటూ ఇటు వెళ్ళసాగారు అప్పుడు ఆకాశ్ ముందుగా ఆగి స్వప్న కి దారి ఇచ్చాడు స్వప్న ముందుకు పడుతున్న తన జుట్టు ని వెనక్కి తీసుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది ఆకాశ్ అప్పుడు అర్ధం చేసుకున్నాడు స్వప్న కి కూడా తనంటే ఇష్టం ఉందని.
“నాకు ట్రాన్స్ఫర్ అయింది నర్సీపట్నం కి వచ్చే వారమే వెళ్ళిపోతున్నాను వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు ఆరోజు కలుద్దామా ? మీకు కుదురుతుందా?” అన్నాడు తెల్లవారి బయలుదేరడానికి తయారుఅవుతున్న సమయం లో ” అదేంటి మీరు ఇంతవరకు చెప్పనే లేదు ” అంది స్వప్న బాధగా ” మనం ఈ వారం కలిసి ఆఫీస్ కి వెళ్ళడం కూడా అవ్వదు నేను కాస్త త్వరగా వెళ్లాలి అమ్మ,నాన్న ముందుగా వెళ్లిపోయారు సామాన్లు కూడా రేపు పంపిస్తాను అవును అన్నయ్య పెళ్ళి కి చెప్పాడా ?” అని అడిగాడు “ఆ చెప్పారు నేను ఎలాగూ వైజాగ్ వెళ్లాలి మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంది అదే రోజు కాబట్టి పెళ్ళి కి తప్పకుండా వస్తాను అని చెప్పండి అరవింద్ గారికి ” అంటూ బ్యాగ్ తగిలించుకుని వెనక్కి చూడకుండా తలుపు దగ్గరకు వచ్చింది.
“స్వప్న పిచ్చి దానిలా మాట్లాడకు నువ్వే అంటున్నావు ఇష్టం ఉందేమో అని మళ్ళీ నువ్వే అంటున్నావు మనసులో ఏముందో తెలియట్లేదు అని అందుకే అంటున్నా తన పుట్టినరోజు కి పిలిచాడు కదా వెళ్ళు ఏమైనా చెప్పడానికే పిలిచాడు ఏమో ?” అంది స్వాతి స్వప్న చెప్పిందంతా విని ” లేదు స్వాతి కనీసం ట్రాన్స్ఫర్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు తను నాకు కాస్త బాధగా అనిపించింది నేనే ఎక్కువ ఊహిస్తూన్నానూ ఏమో అనిపిస్తుంది ఈ విషయం ఇంతటి తో వదిలేయ్” అంటూ భారం గా కళ్ళు మూసుకుంది.
********************
“బాగున్నారా! అరవింద్ గారు ఇప్పుడే అమ్మాయి ని చూసాను బాగుంది జంట బాగుంటారు” అంది మెచ్చుకోలూ గా దానికి అరవింద్ నవ్వుతు “థాంక్స్ అండి ఎలా ఉన్నారు?” ” బాగున్నాను ఇంతకి మీ తమ్ముడు ఎలా ఉన్నారు కనిపించట్లేదు ?” దానికి అరవింద్ ” ఓహ్ వాడు మీకు చెప్పలేదా చెడిపోయిన నిశ్చితార్థo బాగు చేయడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి ” అంటూ ఒక గుంపు వైపు చూపించాడు స్వప్న కి మాటలు రాలేదు అయినా అతి కష్టం మీద మాట తెచ్చుకుని “మరి ఆకాశ్ కి ఇష్టమేనా?” అని అడగలిగింది “ఏమో సంధి ప్రయత్నాలు సఫలం అయ్యే టట్లు ఉన్నాయి వాడికి ఇష్టమే అనుకుంటా ” అన్నాడు గుంపు వైపు చుస్తూ అంతే ఇంక అక్కడ ఉండలేకపోయింది ఉబికి వస్తున్న కన్నీరు ఆపుకుని “ఇప్పుడే వస్తాను “అంటూ వెళ్లిపోయింది ఎంత త్వరగా వెళ్ళినా స్వప్న కంట్లో కన్నీరు గమనించాడు అరవింద్.
తెన్నేటి పార్క్ అని బోర్డు చూడగానే “ఇక్కడ ఆపు” అని ఆటో వాడికి చెప్పి డబ్బులు ఇచ్చి ఆటో దిగింది అలా నడుచుకుంటూ మెట్లు దిగి బీచ్ దగ్గరకి వచ్చి అక్కడ ఇసుక లో కూర్చుని ఏడవడం మొదలు పెట్టింది అలా చాలా సేపు ఏడ్చి అలసి పోయినట్టు గా బ్యాగ్ లో ఉన్న నీళ్ళ బాటిల్ తీసి తాగి మూత పెడుతుంటే “నాకు కొంచెం కావాలి నేను అలసిపోయాను ” అని గొంతు వినిపించింది ఆశ్చర్యం గా పక్కకి తిరిగి చూసింది చెమటలు కక్కుతూన్న ఆకాశ్ కనిపించాడు కోపం గా లేచి వెల్లబోతుoటే చటుక్కున స్వప్న చెయ్యి తీసుకుని మోకాళ్ల మీద కూర్చుని “నేను నిన్ను ప్రేమిస్తున్నాను జీవితాంతం నాకు తోడు గా ఉంటావా!!” అంటూ వేలి కి ఉంగరం తొడిగాడు అంతా రెప్పపాటున జరిగిపోవడం తో బిగుసుకుపోయింది స్వప్న “చెప్పు స్వప్న ” అని ఆకాశ్ అడగడం తో తేరుకుని సమ్మతమే అన్నట్టు తల ఊపి చిన్న చిరునవ్వు నవ్వింది .” అవును నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు ?” అని అడిగింది ” అన్నయ్య జరిగిందంతా చెప్పి ని కళ్లలో నీరు చూసాను అని చెప్పగానే ఇంక అర్ధం అయింది నువ్వు కోపం తో కచ్చితం గా ఇక్కడికే వస్తావు అని ఒకసారి నువ్వే చెప్పావు కదా కోపం వచ్చిన,ఆనందం వచ్చిన ఇక్కడికి వస్తాను అని ” అన్నాడు ” అది సరే నిన్నటి వరకు మీరు ఇప్పుడు నువ్వు ఒకేసారి పిలుపు మారిపోయింది ఏంటి ? ఏంటి సంగతి ??” అని అడిగింది ” నువ్వు అనడం లో ఉన్న దగ్గరి తనం మీరు లో లేదు ” అంటూ దగ్గరకు రాబోయాడు “ఆ!ఆ! ఇప్పుడే మొదలైంది కాస్త దూరం గా ఉంటే మంచిది ” అంది ఆకాశ్ ఉత్సాహానికి అడ్డు కట్ట వేస్తూ ” సరే కనీసం సెలెబ్రేట్ చేసుకుందామా?” అన్నాడు సరే అన్నట్టు తల ఊపింది ఇద్దరు ముసి ముసి గా నవ్వుకున్నారు ఆకాశం వాళ్ళని దీవిస్తూన్నట్టు గా చిరు జల్లులు కురిపించసాగింది కెరటాలు ఆ జంట ని చూసి ఎగసి ఎగసి పడుతున్నాయి ఎక్కడో దూరం గా రేడియో లో “నన్ను వదిలి నీవు పోలెవు లే అది నిజము లే ….” అంటూ పాట వస్తుంది.

********సమాప్తం*******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *