April 19, 2024

నూటికొక్కరు

రచన: ఆదూరి. హైమావతి.

అది ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వపాఠశాల. ఆదర్శ పాఠశాలగా ఎంపికైంది. H. M. రాజేంద్రప్రసాద్ గారు చాలా ఆదర్శ భావాలున్నవారు, వృత్తి పట్ల అంకిత భావం ఉన్నవారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర సమరయోధులు, అందుకే కుమారునికి ఆ పేరు పెట్టుకున్నారు. పాఠశాలలో విలువలు, ఉప విలువలు మొత్తం’ 108 ‘ గురించీ పాఠశాల ప్రార్ధనలో బోధిస్తూ పిలల్ల చేత స్వఛ్ఛందంగా 2, 3 ని. ఉపన్య సింపజేస్తారు. ఉపాధ్యాయ బృందం, పిల్లలు అంతా వాటిని పాటించేలా కృషిచేస్తున్నారు.
అలాంటి పాఠశాలలో ఆ సోమవారం నాడు ప్రార్ధన అయ్యాక, H. M. గారు, ” ప్రియ విద్యార్ధులారా! ఈరోజు’ నిజాయితీ ‘అనే ఉప విలువ గురించీ మన ఏడో తరగతి విద్యార్ధి ‘ రాజు ‘ ఉపన్యసిస్తాడు. “అని అనౌన్స్ చేశారు. తెల్లని పైజామా లాల్చీ ధరించిన, ఒత్తైన రింగుల జుత్తున్న రాజు చిరునవ్వుతో చేతులు జోడిస్తూ వచ్చి ప్రధానో పాధ్యాయుని పక్కనే నిల్చుని, నిదానంగా స్పష్టంగా మాట్లాడసాగాడు.
” ఉపాధ్యాయ బృందానికీ నా నమస్సులు! నా సోదర విద్యార్ధి బృందానికీ శుభోదయం! ‘ని’జాయితీ అనేది మనలను మనం –‘జా’గ్రత్తగా –‘యి’న్స్ పెక్ట్ చేసుకునే –‘తీ’రు . అనినా అభిప్రాయం. దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేక పోవడమే నిజాయితీ. అంతే కాకుండా నిజాయితీ అంటేనమ్మకం, విధేయత, నిష్పక్ష పా తం, చిత్తశుద్ధి, యదార్ధం అని కూడా చెప్పవచ్చు. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తాను గ్రహించి సరిదిద్దుకునే ప్రయత్నాన్ని నిజాయితీ అనవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాయితీ గా వ్యవహరించడమే “నిజాయితీ” అంటే. మనల్నిమనం ప్రతిక్షణం పరిశీలించుకుంటూ, పరిశో ధించుకుంటూ పవిత్రమైన గుణాలను పాటించడమే నిజాయితీ. ఈఒక్క గుణా న్నీ పాటిస్తే మానవుడు ఉన్నత స్థితిని పొందడం తధ్యం. మన బళ్ళో ప్రతి ఒక్క రూ ఈ విలువలను పాటించను ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇలా ప్రతి భారతీయుడూ ముఖ్యంగా ప్రతి రాజకీయ నాయకుడూ, వ్యాపారీ, ప్రభుత్వోద్యో గీ, ప్రతి పౌరుడూ నిజాయితీ పాటిస్తే మనదేశం అగ్రస్థానంలో నిలుస్తుంది.
బాలురుగా ఉన్నపుడు గాంధీజీ, ఆరు సంవత్సరాల వయస్సులో జార్జ్ వాషింగ్టన్, రిటైరవబోతున్న రోజున కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు పాటించిన నిజాయితీ, తిలక్ మహాశయుడు, వల్లభా య్ పటేల్, ఆయనకుమార్తె మణి బెహెన్—ఇంకా ఎందరో మహానుభావులు నిజాయితీ పాటించిన వారే! అందుకే వారిని మనం ఈనాడూ గుర్తుంచు కున్నాం. నిజాయితీ అనేది ఉపన్యా సాల్లో చెప్పేది కాదు, పాటించేది మాత్రమే అని నా ఉద్దేశ్యం. అందుకే ‘ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ ‘అన్నారు. నామాటల్లో తప్పులుంటే మన్నించవల్సినదిగా ఉపా ధ్యాయ బృందాన్ని కోరుకుంటూ, అందరికీ శలవు. ” అని చెప్పిన రాజు భుజం తట్టి గర్వంగా చూశారు H. M. రాజేంద్రప్రసాద్ గారు.
ప్రార్ధన పూర్తై అంతా తరగతి గదుల్లోకి వెళ్ళారు. రాజును చూసి గర్వంగా ఫీలవుతూ రాజేంద్రప్రసాద్ గారు తన గదిలోకి వచ్చికూర్చున్నారు. ఆయన ఆలోచనలు ఒక్కసారి గతంలోకి మళ్ళాయి.
ఆరోజు రాజేంద్రప్రసాద్ గారు మధ్యాహ్న భోజనం తర్వాత స్కూల్ కు వేగంగా నడచి వెళ్తున్నారు. తన వీధి తిరగ్గానే మైన్ రోడ్ మీద ఒక ఫంక్షన్ హాల్ ముందున్న కుప్పతోట్లోని ఎంగిలి విస్తారాకుల్లోని స్వీట్లు, అన్నం ఏరుకు తింటున్న షుమారు ఐదారేళ్ల పిల్లవాడిని చూశాడు. కుక్కలను తన ఎడంచేతిలోని పెద్ద కర్రతో అది లిస్తూ కుడిచేత్తో ఇడ్లీముక్కలు, గారె ముక్కలూ, స్వీట్లూ ఏరుకు తింటున్నాడు.
రాజేంద్రప్రసాద్ గారి మనస్సు జాలితో నిండిపోయింది. ‘వ్యాస భగవాన్ అం తటి వారే ఆకలికి ఆగలేక తల్లి లాంటి కాశీనగరాన్నిశపించబోయారు. ఇహ ఈ పసివాడు ఇలా ఆకలికి ఆగలేక ఎంగిలి మెతుకులు ఏరుకు తినడం విశేషం కాకు న్నా భారత దేశంలోని పసి బాలలు ఇలా ఎంతమంది ఆకలికి ఆగలేక మెతుకు, దొరక్క క్రమేపీ సంఘ విద్రోహాలకు పాల్పడుతున్నారో కదా! ఎన్ని పసి ప్రాయాలు ఇలా ఎండబారిపోతున్నాయోకదా! లోపలేమో తిన్నంత తిని ఎక్కువై పారేసే వా రూ, బయట కుప్పతొట్లో ఎంగిలి మెతుకులు ఏరుకు తినే పసివారూ, ఎంత దౌర్భాగ్యం! తన చిన్నతనం ఆయనకు గుర్తొచ్చింది. అమ్మానాన్నా ఒక యాక్సిడెంటలో మరణించడంతో అనాధ ఐన తనను తన స్కూల్ మాస్టారుగారు వారాలు ఏర్పాటు చేసి చదువుకోను సహకరించారు . లేకపోతే తాను ఎలామారిపోయి ఉండే వాడోకదా! తానుఅలా చదువు కున్న విషయం ఆయనెన్నడూ మరువడు. ఆ రో జుల్లో అలా తిండి, బట్ట, పుస్తకాలు దొరకబట్టే తాను ఈరోజు ఇలా ఉపాధ్యాయుడు కాగలిగాడు, అందుకే ఇలాంటిబాలలను చూస్తే తన మనస్సు బాధతో నిండి పోతుంది. ‘అని ఆయన మనస్సు ఆవేదన చెందింది.
వెంటనే వాడి రెక్కపుచ్చుకు లాగాడు. వాడు విదిలించాడు. ఆ విదిలింపుకు వాడి చేయి తగిలి ఆయన కళ్ళజోడు క్రిందపడి పగిలి పోయింది కూడా. ఐనా ఆయన బలంగా వాడిని లాగి లేపి, రెక్క గట్టిగా పట్టుకుని ఐదునిముషాల దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడే వెళ్ళిన భర్త అంతలోనే తిరిగిరావడం, పక్కనే గోచీ గుడ్డతో ఉన్న పసివాడినీ చూసి ‘ఏమైంది?’ అన్నట్లు కళ్ళతోనే పలకరించింది ఆయన సతీమణి అరుణ.
“అరుణా! ఇంట్లో అన్నమేమైనా ఉందా! ఉంటే పట్రా!” అంటూ ఆయన వాడి రెక్కపట్టుకుని గేట్ వద్ద ఉన్నట్యాప్ వద్దకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ట్యాప్ త్రిప్పి వాడి వంటిమీద నీరు పడుతుంటే, తోటలోపని చేసి చేతులు కడుక్కోను ఉంచుకున్న సబ్బుబిళ్ళ ఇచ్చి రుద్దుకోమని సైగ చేశారు. వాడు భయం భయంగానే వంటికి సబ్బునురగ పట్టించుకుని, స్నానం ఐందనిపించాడు.
అక్కడే దణ్ణెం మీద ఆరేసి ఉన్న తువ్వాలు తీసిచ్చి తుడుచుకోమని చెప్పారు. ఇంతలో అరుణ ఒక ప్లేట్ లో కూర, పప్పు అన్నంపెట్టుకుని వచ్చింది. వరండా లో టవల్ కట్టుకునున్న వాడిని కూర్చోబెట్టి అన్నం తినమని సైగ చేశారా యన, వాడు ఆబగా అన్నం తీసుకుని క్షణంలో తినేశాడు.
“కడుపునిండిందా!”అడిగింది అరుణ. నిండిందని వాడూ సైగ చేశాడు. “నీపేరేంటీ!” అడిగింది అరుణ. తెలీదన్నట్లో, లేదన్నట్లో తలతిప్పాడు. ‘ఏంచేద్దాం!’ అన్నట్లు భర్తవేపుచూసింది .
“ఏముందీ బళ్ళో వేస్తాను. వీళ్ళ ఇల్లెక్కడో కనుక్కుందాం. సరే మన సత్యం, చిన్న ప్పటి చొక్కా నిక్కరూ తెచ్చివ్వు వీనికి, బయల్దేరుతాను బడికి”అంటూ లే చాడాయన. ఆయన ఒక్కగానొక్క కొడుకు ఆఊర్లో ఉన్న ఏడోక్లాస్ చదువయ్యాక వాళ్ళ అమ్మమ్మగారి ఊర్లో హైస్కూల్లో చేరి చదువుతున్నాడు.
అరుణ లోపలికెళ్ళి బట్టలజత ఒకటి తెచ్చి వాడికిచ్చింది, వేసుకోను సాయం చేసింది. వాడిని తనవెంట రమ్మంటూ రాజేంద్రప్రసాద్ బడివేపు నడిచాడు. కడుపు నింపి, బట్టలిచ్చిన ఆయనంటే వాడికి తెలీకుండానే అభిమానం ఏర్ప డింది.
బడి స్వీపర్, అటెండర్ సాయంతో ఊరి చివర ఉన్న గుడిసెల్లోని వాళ్ళ అమ్మను పిలిపించారు. ఆమె జబ్బుమనిషి, ఒంటరి. పనిచేసి బువ్వ పెట్టేవారులేక వాడు అలా తింటున్నాడని ఆయనకు అర్ధమైంది.
“సారూ! నాకూ ఎవ్వరూ లేరుగదా ! నేను వాళ్ళను నా ఇంట్లో ఉంచుకుంటాను సారూ!”అంది స్వీపర్ సానమ్మ.
షుమారుగా 50పైన వయస్సున్న ఆమెకు నా అన్న వాళ్ళెవ్వరూలేరు. “మంచిది సానమ్మా! నీకు భారం కాకుండా నీకు బియ్యం, పప్పు వగైరాలు నేను వారి కోసం ప్రతినెలా పంపుతాను. ” అన్నారాయన. ఉపాధ్యాయులంతా ‘ ఈయన కిదో పిచ్చి ‘ అని మనస్సులో అనుకున్నారు.
అలా వాడిని ‘రాజు ‘అనే పేరుతో బళ్ళో నమోదు చేసారు రాజేంద్రప్రసాద్ . స్వీపర్ ఇంటికి వారి మకాం మార్చి, వాడి తల్లికి వైద్యం చేయించ సాగారాయన. కొద్ది రోజుల్లోనే వాడు బడి వాతావరణానికి అలవాటు పడిపోయి, బళ్ళో మధ్యాహ్న భోజనం, రాత్రులు స్వీపర్ వాడికీ, తల్లికీ వండిపెట్టే అన్నం తింటూ, తల్లి వద్దే పడుకుంటూ, స్వీపర్ మనవడుగా గుర్తింపుపొంది, చక్కగా చదువుకోసాగాడు.
వాడి విద్యా ప్రస్తానం అలాసాగి ప్రస్తుతం ఏడో తరగతిలోకి వచ్చాడు.
రాజేంద్రప్రసాద్ గారు, తన ప్రయాస వృధాకానందుకూ, ఒక పసివాడు చక్కగా తాను కోరుకున్నవిధంగా ఎదుగుతున్నందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు . ఐతే ఆయన ఊహించని సంఘటన ఒకటి జరగబోతునందని, దాంతో తన మనస్సుకు అశనిపాతం లాంటిదెబ్బ తగలబోతునందనీ అప్పుడా యనకు తెలీదు.
******** “నేను నమ్మలేను నాగేష్! అతడిలా చేశాడంటే!” “మరి ఏమైందంటారు సార్! మరెవ్వరూ ఇక్కడికి రాలేదు. ” టీచర్ నాగేష్ సందేహం.
“ఔను, ఎవ్వరూ రాలేదు, అతడు కవరు ఇచ్చివెళ్ళాక ఎవ్వరూ రాలేదు. ” రాజేంద్రప్రసాద్ గారి మాట.
“అసలు అతడు కవరు ఎక్కడపెట్టాడు, మీచేతికే అందించాడా!” టీచర్ వనజ అడిగింది.
“లేదు వనజా! నేను గుమ్మంవద్ద నిల్చుని పిల్లలంతా లైన్ గా వెళ్తుంటే చూస్తూ ఉన్నాను. నా టేబుల్ డ్రాయర్ సొరుగులోనే వేయమని చెప్పాను. ‘ వెళ్ళిరానా మాస్టారూ!’అని అడిగాడు లోపలికొచ్చాక, టేబుల్ మీది రిజిస్టర్లన్నీ లోపలపెట్టి తాళం వేసేసి, కీ నా జేబులో వేసుకుని వెళ్ళాను. ” “నాకు మతిపోతోంది. అసలా కవరెలా మాయమైందాని. మనం రోజూ ప్రార్ధనలో చెప్పే విలువలూ, ఉపవిలువలూ వాటి వివ రాలూ అన్నీ ఏమవుతున్నాయి!”
ఆశ్చర్యమూ విచారమూ కలివిడికాగా హెడ్ మాస్టర్ రాజేంద్రప్రసాద్ గారు విచారంగా కూర్చుండి పోయారు.
ఉపాధ్యాయ బృందమంతా ఆయన గదిలో సమావేశమై, ఆ కవరు గురించీ, అది మాయమైన తీరు గురించీ చర్చ జరుపుతోంది. “పోనీ అతడ్ని పిల్చి మా అందరిముందూ ప్రశ్నిస్తారా!” “వద్దు వద్దు, పసిమనస్సు బాధపడకూడదు. ” “మరేమైనట్లు మాస్టారూ!అసలు అతడా కవరు మీకు చూపి సొరుగులో వేయకుండానే వెళ్ళిపోయి ఉంటాడు, రేపు విహార యాత్రకు వచ్చేవాళ్లనందరినీ వంద రూ. తెచ్చుకోమన్నాం కదా!వాడు కవర్ మీకు చూపి జేబులో వేసేసుకుని వెళ్ళి ఉండవచ్చు కదా! మీరేమో ఇచ్చాడనుకుని ఉంటారు !” డిటెక్టివ్ నవలలు బాగా చదివే దినేష్ అన్నాడు. ” లేదు అతడు తెచ్చాడు, ఏమైనా నేనతన్ని అనుమానించలేను. సరి దీన్నింతటితో వదిలేద్దాము. ఆ సొమ్మంతా నేనే ఆ సంస్థకు చెక్ పంపుతాను. మీరెవ్వరూ ఎవ్వరితోనూ ఈ విషయం గురించీ ఇహ మాట్లాడకండి. అంతా మర్చిపోండి, పదండి వెళదాం” అంటూ లేచారు హెచ్. యం. రాజేం ద్ర ప్రసాద్ గారు.
ఉపాధ్యాయులంతా ఆయన చాదస్తానికీ, ఒక అనామకుని నమ్మిన ఆయన తీరుకూ నవ్వుకుంటూ, విమర్శించుకుంటూ వెళ్ళారు. ఇంటికెళుతున్న ఆయన మనస్సు ప్రార్ధన లో అతడు చేసిన ప్రసంగం వైపు మళ్ళింది.
‘ఎంత బాగా చెప్పాడు!, స్వంతంగా వార్తాపత్రికలూ, గ్రంధాలయంలో పుస్తకాలూ చదువుతూ బాగా విఙ్ఞానం పెంచుకున్నాడు, మంచి విద్యార్ధి. ‘ఇది అతడి పని కాదు, ఎక్కడో పోరబాటు జరిగింది ‘. అనుకుంటూ ఇల్లు చేరారాయన.
ఇల్లు రాగానే ఆయన ఆలోచనల్లోంచి బయటపడి, ఇంట్లో అడుగుపెట్టారు. మంచినీళ్ళగ్లాసుతో వచ్చిన ఆయన అర్ధాంగి అరుణ,
“ఏంటండీ! అలా ఉన్నారు, ఆరోగ్యం బావుంది కదా!” అంటూ పలకరించింది . “అరుణా! ఈ రోజు ఒక సంఘటన నా మనస్సును కలచివేస్తున్నది. ” అంటూ నీరు త్రాగి గ్లాసు అందించాడామెకు.
“ఏమైందండీ!” అంటూ పక్కనే కూర్చీలో కూర్చుందామె. “అరుణా! మా స్కూల్ పిల్లలను మా ఉపాధ్యాయులు ప్రోత్సాహించి, ప్రతిసం. ఏదైనా ప్రమాదాలపాలైన వారికి ఉడతాభక్తిగా సాయం అందించే అలవాటు చేశాం. పిల్లలకు ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశ్యం కలిగించనే ఈ పని. ప్రతి మార్చినెల్లో రెండో వారంలో పిల్లలు తమ పాకెట్ మనీ వారి తరగతిలోని కిడ్డీ బ్యాంకుల్లో వేస్తారు, శనివారం నాడు చిల్లరంతా కలిపి లెక్కించి నోట్స్ తీసు కుని అంతే సొమ్ము ఉపాధ్యాయులమంతా తలా కొంచెం కలిపి దాన్ని ఆయా వ్యక్తులకు లేదా సంస్థకు పంపుతాము. అలా ఈ శనివారంనాడు మన రాజు ఆ సొమ్ము 4, 915రూ. లెక్కించి, చిల్లరకు సరిపడా పచారీ దుకాణం నుంచీ నోట్లు తెచ్చి ఒక కవర్లో నా గదిలో ఉంచాడు.
ఆ కవరు ఈ రోజు కనిపించ లేదు. ఇది ఎవరిపనో అంతు చిక్కడం లేదు. రాజు తప్ప నాగదిలోకి ఎవ్వరూ రారు. ఉపాధ్యాయులంతా అతడినే అనుమానిస్తున్నారు. నాకు మాత్రం అతడలా చేయడని అనిపిస్తోంది. వాని మీద నాకు సంపూర్ణ విశ్వాసం. మనస్సేమీ బావోలేదు అరుణా!” విచారంగా అన్నారు రాజేంద్రప్రసాద్గారు.
“ఏమండీ! మీరూ మరచిపోయి ఉండరు, నాకైతే నిన్నే జరిగినట్లు గాఉంది. ఆ రోజూ. ఆకుర్రాడ్ని మనింటికి తేడం…అదంతా ఇంకా నా కళ్ళలో మెదుల్తూనే ఉంది. మీరు మన సత్యం చదువు కంటే రాజు చదువు కుంటన్నందుకు సంతోషించడం నాకు తెల్సుకదా! ఇది అతడు చేసి ఉండడు. ఏదో పొరబాటు, నిదానంగా బయటపడుతుంది కానీ రాజునేం అడక్కండి, వాడి మనస్సు అసలే చాలా మెత్తన. . . ” అంది ఆయనకు సరైన జోడీ ఐన అరుణ.
******
మరునాడు విఙ్ఞానయాత్రకు బయల్దేరారు, ఉపాధ్యాయులు, పిల్లలు అంతా కల్సి. రాజు రాలేదు. రాజేంద్రప్రసాద్ గారు స్వీపర్ సానమ్మను అడగ్గా వాడి తల్లికి వంట్లో బావోలేదనీ ఆమెకు తోడుగా ఉంటానని చెప్పాడంది. మూడురోజులకు విహారయాత్రనుంచీ తిరిగొచ్చిన రాజేంద్రపసాద్ గారికి సానమ్మ” సారూ! ఇదేందో కవరు మీ బల్లకింది సెత్త బుట్టలో ఉండది సారూ!”అంటూ ఒక కవరు ఆయనకు ఇచ్చింది.
అదే ఆ కవరు!. అది చూడగానే ఆయన ముఖం వికసించింది. అంటే అంటే. . ‘ తాను రిజిస్టర్లు లోపల పెట్టేప్పుడు సొరుగులోంచీ క్రింద ఉన్నచెత్త బుట్టలో ఆ కవరు పడింది. తాను పదిసార్లు సొరుగు చూశాడు తప్ప, క్రింది బుట్టలో వెతకలేదు. పైగా మరునాడు చెత్త కాగితాలన్నీ ఆ బుట్టలో విసిరేయడం వల్లఅవి కవర్ను ముంచేసి కనిపించకుండా చేసాయి. ఇదీ జరిగింది ‘అని ఆయనకు అర్ధ మైంది.
ఏది ఏమైతేనేం సమస్య విడిపోయింది. తన నమ్మకం వమ్ముకాలేదు, ఇది వాడిపని కాదు. గుండెనిండా గాలి పీల్చు కుని రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే రాజు గురించీ సానమ్మను అడిగారు. ” అన్నట్లు సారూ! రాజు, వాడితల్లీ అదేదో ఊరు సెప్పిండ్రు సారూ! మరిసినా, ఆడ ఆమె నాయినున్నడంట, ఆడనే ఉందమని ఎల్లిండ్రు మీరెల్లిన్నాడే!. ” అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పింది. “అదేంటి సానమ్మా! వాడు బాగా చదువుకుంటున్నాడు కదా! ఇలా పరీక్షల ముందు వెళితే ఎలా!ఆపకపోయావా!”అన్నారాయన.
“నేనూ శానా చెప్పిన్నయ్యా! ఆడు పట్టుపట్టిండు, తాతకాడే ఉందమని, తాతనీ ముసలొయసులో వొంటరిగొదిలుండకూడదని ఆల్లమ్మ కాదన్లేక ఆడితో పాటెల్లింది”అని చెప్పిందామె.
ఉపాధ్యాయులంతా తాము రాజును అనుమానించడం పొరబాటని అన్నారు. రాజేంద్రప్రసాద్ గారి మనస్సు బాధతో మూల్గింది. ‘తాను వాడిని అనుమానించా ననుకుని వాడు తాను ఊర్లోలేనపుడు మెల్లిగా వెళ్ళిపోయాడు. తానెంతో తప్పు చేశాడు ‘ అని ఆయన చాలా బాధపడ్డారు. తనవల్ల ఒక బాలుని చదువు మధ్యలోనే కుంటుబడింది. అని తరచూ ఆలోచిస్తూ, భార్యతో అంటూ ఉండేవారు.
******* కాలచక్రం ఎవ్వరికోసమూ ఆగదుకదా! ఆగకూడదు కూడానూ. సంవత్సరాలు గడచిపోయాయి. రాజేంద్రప్రసాద్ కొడుకు సత్యం ఇంజనీరై, మంచి ఉద్యోగం సంపాదించి, తల్లిదండ్రులు చూసిన తనలా ఇంజనీరైన అందాలభామను వివాహ మాడి ఉద్యోగంలో పెంపుదలతో అమేరికా వెళ్ళి పోయాడు.
ఇంకా ఉద్యోగంలో ఉన్న రాజేంద్రప్రసాద్, అరుణ అక్కడే ఉండిపోయారు. ఆ రోజు రాజేంద్రప్రసాద్ గారి పదవీ విరమణ రోజు.
సాయంకాలం నాలుగైంది. ఆయనకు సన్మానం చేయను ఉపాధ్యాయులంతా వేదికను అందంగా అలంకరించారు. ప్రోగ్రాం మొదలయ్యేముందుగా స్కూల్ ముందు ఒక పోలీసు జీపు వచ్చి ఆగింది. పోలీసులు జీపుదిగి వేదికవద్దకు వచ్చారు. ఊర్లో వారంతా స్కూల్ లోని వేదిక వద్ద కూర్చునున్నారు.
పోలీసు జీపు రావడం అంతా చూసి, ఏదైనా ఆపద లేక, ఎవరైనా తప్పు చేసి ఉంటారేమో ఎందుకొచ్చిందీ పోలీసు జీపని అంతా గుసగుసగా అనుకోసాగారు. “సారేమి తప్పు చేసినరబ్బా!”
“ఎందుకూ పెద్దసారు రిటేరయ్యే యేల్టికి పోలీసులొచ్చిండ్రు!” “సార్ కొడుకేమైనా తప్పు సేసి ఉంటడా!”
“అబ్బేఆ బాబు అమెరికెల్లిపోయిండు గదా!” “మనూళ్ళో ఎవురైనా ఏదైనా తప్పు సేసి ఉంటరా! ఆసారు అట్టాంటి మడిసి కాదే!”ఇలా ఎవరి బుధ్ధికి తోచిన విధంగా వారు అనుకో సాగారు.
వేదిక మీద ఉన్న రాజేం, ద్రప్రసాద్ గారి దగ్గరికి ఆ పోలీసు ఆఫీసరు వెళ్ళి “బావున్నారా సారూ!”అంటూ వంగిపాదాలకు నమస్కరించాడు.
కంగారుగా ఆయన పైకి లేచి” మీరెవరండీ!”అన్నారు. ఆ పోలీసాఫీసర్ తన తలపైనున్న హ్యాట్ తీసి “ఒకమారు పద్యం తప్పుచెప్పానని ఈ రింగుల జుత్తే పట్టుకుని బుగ్గ మీద కొట్టారు, ఈ చేయి పట్టుకుని మీ ఇంటికి తీసు కెళ్ళి ట్యాప్ క్రింద స్నానం చేయించి కడుపు నిండా అన్నం పెట్టారు. నాకో జీవితాన్ని ప్రసాదించిన దేవుడు సార్ మీరు. ’నిజాయితీ ‘అంటే ఏంటో నేర్పారు, ఎలా జీవించాలో చూపారు. నేను సర్ మీ రాజును. “అంటూ ఆయన పాదాల మీద పడి పోయాడతను.
రాజేంద్రప్రసాద్ గారు, అతడెవరో తెల్సుకుని ఇహ ఉండలేక, ” రాజూ! నా రాజూ!”అంటూ అతడ్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న అరుణ “ఏమై పోయావు బాబూ! సార్ నిన్ను తలంచని రోజు లేదంటే నమ్ముతావా! సారంటే ఇంత ప్రేమ, గౌరవం ఉన్న వాడివి అలా చెప్పాపెట్టకుండా ఎక్కడికెళ్ళిపోయావు? తనకెవరూ లేరని మీ అమ్మ చెప్పింది. మరి మీ తాత ఎక్కడ నుంచీ వచ్చాడు. అదంతా అబధ్ధమని మా ఇద్దరికీ తెల్సు. ఆ రోజు పరీక్షల ముందు వెళ్ళావని సారు నీ కోసం ఎంత బాధపడ్డారో నీకు తెలీదు. నీకోసం చాలా వెతికించారు కూడా, “అందామె.
ఆ పోలీసు ఆఫీసర్ అరుణ పాదాలు పట్టుకుని నమస్కరించి” నాకు సంస్కా రం నేర్పిన దేవత మీరు, నాకో జీవితాన్ని నిర్దేసించిన దయామయులు మీరిద్దరూ! ఆరోజు నేను విహారయాత్రకు రాననీ, మా అమ్మకు జ్వరం రావటాన ఆ విషయం చెప్పేందుకు ఆఫీసు రూం వద్దకు వచ్చాను. ఆ కవర్ కనపడటం లేదని ఉపాధ్యాయులంతా చర్చిస్తున్నారు. సారు తప్ప అంతా నామీద అనుమానం వ్యక్తపరిచారు. ఆ కవరు దొరక్కపోతే అంతా నన్నే అనుమానిస్తారు . నా మనస్సు బాధపడింది. ఇప్పుడిప్పుడే నిజాయితీగా ఉండటం నేర్చుకుంటున్ననాపై నింద పడితే నేనెలా మారి పోతానో, వారంతా నన్ను అనుమానంగా చూస్తే సహించలేనేమో అనే భయంతో, నేను సార్ గారు విహారయాత్రకు వెళ్ళగానే మా అమ్మతోకల్సి సానమ్మకు ఏమీ చెప్పవద్దని ప్రామిస్ చేయించుకుని దూరంగా ఉన్న టౌన్ కెళ్ళాను.
అక్కడ ఒక స్కూల్ లో చేరి సార్ ఆశీర్వాద బలంతో, చదువుకుని పోలీసు ఆఫీసర్ నయ్యానమ్మా! నాకు తర్వాత కలిసినపుడు సానమ్మవ్వ కవరు దొరికిందని చెప్పింది, ఐనా ‘నిజాయితీ ‘పోలీసు ఆఫీసర్ గా అవార్డు అందుకుని మిమ్ము కలవను వచ్చాను. ఈ రోజే మీ రిటైర్మెంట్ కావడం విశేషం. ఇంకోమాటమ్మా సానమ్మ అవ్వను రిటైరయ్యాక నా దగ్గరికి పిలిపించుకున్నాను. ఇప్పుడామె నా దగ్గరే ఉంది. పెద్దదైంది. ” అంటూ మైక్ అందుకుని, ” అందరికీ నమస్కారం! అయ్యా! మీ ఊర్లో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండటం అదృష్టం. నా తల్లి పుట్టుకనిస్తే ఈ సారు నాకో జీవితాన్నిచ్చారు. ఈ ఊర్లోనే ఈ బళ్ళోనే నన్ను చేర్చి, సద్గుణాలు నేర్పి చదువంటే ప్రేమ పెంచి నాకో దిశానిర్దేశం చేసిన నా దేవుడీ యన. వందకొకరు ఇలాంటివారు ఉంటే దేశమంతా బాగై పోతుంది. “అంటూ తాను తెచ్చిన పూలమాల వారిద్దరి మెడల్లో వేసి ఇద్దరికీ వస్త్రాలు బహూకరించి నమస్కరిస్తున్న రాజు తలపై ప్రేమగా నిమిరారు ఇద్దరూనూ.

THE END

1 thought on “నూటికొక్కరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *