March 28, 2024

ఐఐటి(లెక్కల) రామయ్యగారు

రచన: శారదాప్రసాద్

ఖద్దరు పంచె, చొక్కా, భుజాన ఒకఖద్దరు సంచి వేసుకొని అతి సాధారణంగా కనిపించే ఈయనను చూసిన వారెవరూ ఆయనను అఖండ మేధావిగా గుర్తించలేరు. చికాకు లేని చిరునవ్వు ఆయన సొంతం. ఈ అసమాన్య మేధావే లెక్కల(చుక్కా) రామయ్య గారు.
శ్రీ చుక్కా రామయ్య గారు 20 -11 -1928 న, వరంగల్ జిల్లాలోని గూడూరు గ్రామంలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లితండ్రులు-నరసమ్మ , అనంతరామయ్య గార్లు. వీరి ప్రధాన వృత్తి పౌరోహిత్యం. దానితో పాటుగా కొద్దిగా వ్యవసాయం కూడా చేసేవారు. వారిది ఉమ్మడికుటుంబం. రామయ్యగారికి ప్రాధమిక విద్య నేర్పించే ఆర్ధికస్తోమత లేని కుటుంబం అది. ఏమీ చేయలేక, తండ్రి శ్రీ అనంతరామయ్య గారు, వీరిని కులవృత్తి అయిన పౌరోహిత్యాన్ని చేపట్టామన్నారు. తల్లిగారికి అది సుతరామూ ఇష్టం లేదు. తన కొడుకును కష్టపడి పెద్ద చదువులు చదివించాలని ఆవిడ ఆశయం. అందుకోసం, ఆమె భర్త అభీష్టానికి విరుద్ధంగా ఆమె తన మెడలో ఉన్నకొద్ది బంగారు నగలనూ అమ్మివేసి, రామయ్యగారిని హనుమకొండలో మూడవ తరగతిలో చేర్పించింది. ఆవిడ అలా చెయ్యకుంటే, ఈ రోజు ఐఐటి రామయ్య ఒక పురోహితుడిగా మిగిలిపోయేవాడు!
రామయ్య గారు తన 14 వ ఏట తండ్రి శ్రీ అనంతరామయ్యగారిని కోల్పోయారు. ఆస్తిపాస్తులు లేని పెద్ద కుటుంబం కావటం వల్ల శ్రీ రామయ్యగారు చాలాకాలం అనేక కష్టాలను అనుభవించారు. ఆ రోజుల్లో తెలంగాణా ప్రాంతం దొరల ఏలుబడిలో, కనుసన్నలలో మెలిగేది. ప్రజలు చదువుకొని చైతన్యవంతులు కావటం దొరలకు రుచించేది కాదు. అందుకని రామయ్యగారు రాత్రిపూట పిల్లలకు చదువు నేర్పేవారు. అలా ఒక ‘రాత్రి బడిని’ ప్రారంభించారు. దొరలు, ఆ బడిని మూయించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఊరి జనం ఎదురు తిరిగారు. రాత్రిబడిలో రామయ్య గారు చదువుతో పాటు, ప్రజలకు ఉన్న దుర్వ్యసనాలైన మద్యపానం వంటివి మానిపించటానికి కూడా కృషి చేశారు. అలా, ఆయన జాతి కుల విచక్షణ లేకుండా ప్రజలకు చేరువ అయ్యారు. మాదిగలు ఆయనను దేవుడుగా చూసేవారు. ఆయన వారికి అతి సన్నిహితుడయ్యారు.
దొరలు రామయ్య గారి మీద బ్రాహ్మణ కులపెద్దలకు ఫిర్యాదు చేశారు. కులపెద్దలు రామయ్యగారిని కులం నుండి వెలివేశారు. రామయ్యగారి సంస్కరణాభిలాషను, ఆయన తల్లి నరసమ్మగారు కూడా సమర్ధించింది. నేటికీ దళిత వర్గాల్లో రామయ్య గారి పట్ల అవే ప్రేమభావనలు ఉన్నాయి. విద్యార్ధిదశలో ఉండగా 1946 వ ప్రాంతంలో రామయ్య గారు, మహాత్మా గాంధీ గారు వరంగల్ వచ్చినపుడు, వారి ఉపన్యాసము విని ఆకర్షితులై, స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. జైలు శిక్షను అనుభవించారు. జైలులో ఉండగా కొంతమంది మిత్రుల సహాయంతో ఆంగ్లం పైన మంచి పట్టు సాధించారు. అనేక గ్రంధాలను చదివారు. అలాగే మార్క్సిజం పట్ల ఆకర్షితుడయ్యారు. లెక్కలలో రామయ్యగారి ప్రతిభను గుర్తించిన జైలు అధికారి, తన కూతురికి లెక్కలు చెప్పమన్నాడు. ఆ విద్యార్ధిని పదో తరగతి చదివేది. ఆ రోజుల్లోని కమ్యూనిస్ట్ నాయకుడైన శ్రీ ధర్మబిక్షం గారు వీరికి జైలులో మిత్రుడయ్యారు.
సమాజం పట్ల ఎప్పుడూ బాధ్యతతో వ్యవహరించే రామయ్య గారిని, ప్రజలూ, వారి మిత్రులూ, సంఘం రామయ్య అనీ, కమ్యూనిష్టు రామయ్య అనీ ప్రేమగా పిలిచేవారు. రామయ్యగారికి వివాహ వయస్సు వచ్చింది. కులం నుండి వెలివేయటం వల్ల ఎవరూ పిల్లను ఇవ్వటానికి ముందుకు రాలేదు. హైదరాబాద్ కు చెందిన రాధాబాయి, జానకిరామయ్య గార్ల కుమార్తె అయిన లక్ష్మి గారితో పెళ్లి అయింది. ఆ తరువాత కుటుంబపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు నిర్వహించటానికి అత్తా, మామలు అభ్యంతరాలు చెప్పేవారు. తమ్ముడు వెంకటయ్య బొంబాయిలో ఐఐటి చదివి ఇంజనీరు అయ్యాడు. ఆ తర్వాత తమ్ముడికి పెళ్లి చేశారు. కుటుంబ పోషణార్ధం రామయ్యగారు బడిపంతులుగా జీవితాన్నితిరిగి ప్రారంభించారు. పోలీసు యాక్షన్ సమయంలో బి. యస్. సి. చదువుకున్న రామయ్యగారు మళ్ళీ బి. ఏ. చదవటానికి నిర్ణయించుకున్నారు. బి. ఏ లో మంచి రాంక్ వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యమ్. యస్. సి(maths)లో చేరి మంచి రాంకును సంపాదించారు.
సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. అలా12 సంవత్సరములు అదే వృత్తిలో కొనసాగారు. ఆ సమయంలోనే కొంతమంది విద్యార్ధులకు ఐఐటి పరీక్షల కోసం శిక్షణ ఇచ్చారు. హైదరాబాదు స్థిరపడి, ఐ. ఐ. టి జె. ఇ. ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు గణితము బోధించడం మొదలుపెట్టాడు. ఆ విద్యార్థులు ప్రవేశ పరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో, ఆయన చాలా ప్రఖ్యాతి పొందాడు. చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్ధులు ఐ. ఐ. టిలలో ప్రవేశించారు. రామయ్య Institute లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శికణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపింబడ్డాయి. ఐఐటీ ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ’’ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందాడు. అచిర కాలంలోనే ఐఐటి శిక్షణ ఇవ్వటంలో సాటిలేని మేటి అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చి వేలాదిమంది వీరి వద్ద శిక్షణ పొందినవారు నేడు దేశవిదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు .
వ్యాపారదృష్టితో తన విద్యాసంస్థను ఏనాడూ నడపలేదు. నేటికీ, ఆయన క్లాసుకు వెళ్లేముందు తాను చెప్పబోయే అంశాన్ని క్షుణ్ణంగా చదివి ఒక విద్యార్దిలాగా తయారు అవుతాడు. వారికి ‘బాసర’ అంటే విపరీతమైన అభిమానం. చదువులతల్లి సరస్వతీదేవి నిలయం అది. బాసరలో ఐఐటి ఉండాలని తీవ్రంగా కృషిచేశాడు. అయితే వివిధ సౌకర్యాల రీత్యా ప్రభుత్వం దాన్ని హైదరాబాదులో నెలకొల్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కొంతకాలం ఉపాధ్యాయుల వర్గాల నుండి ఎన్నికైన శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధిస్తూ ఉద్యమించాడు. ఆయన రచయిత. పెక్కు వ్యాసాలను రచించారు. కొన్ని పత్రికలలో శీర్షికలు కూడా నిర్వహించారు . ఆయన నిర్వి’రామ’ కృషీవలుడు.

ఆయన జీవితమే స్ఫూర్తిదాయకం.
కృషివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు–అన్నది రామయ్యగారి పట్ల నూటికి నూరుపాళ్ళు నిజం.
ఆ మహనీయునికి శ్రీ జ్ఞానసరస్వతి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుందాం!

8 thoughts on “ఐఐటి(లెక్కల) రామయ్యగారు

  1. విశిష్ట వ్యక్తులను గురించి చక్కగా తెలియచేస్తున్నారు.సంతోషం

  2. Very interesting life history of Sri Chukka Ramaiah Garu.Hither to we all know him as IIT Ramaiah Garu
    Now you made us to know about his early days of his child hood.
    Chukka…means CHUKKANI to IIT students…Great.

Leave a Reply to BHASAKARAM Cancel reply

Your email address will not be published. Required fields are marked *