March 28, 2024

కౌండిన్య హాస్యకథలు – చెరగని మచ్చ

రచన: రమేశ్ కలవల

తనకు ఊహ తెలిసిన రోజులు. అద్దంలో చూసుకుంటూ అక్కడ మచ్చ ఎలా పడిందా అని చిన్న బుర్రతో చాలా సేపు ఆలోచించాడు. అర్ధం కాక మళ్ళీ తువాలు కట్టుకొని అమ్మ దగ్గరకు బయలు దేరాడు.
“అమ్మా, ఇక్కడ ఏమైయ్యింది నాకు?” అని వెనక్కి తిరిగి చూపిస్తూ అడిగాడు.
“అదీ… నువ్వు పుట్టగానే ఎంతకీ మాట్లాడక పోయేసరికే ఆ హస్పటల్ లో ఓ నర్సు అక్కడ నిన్ను గట్టిగా గిచ్చగానే ఆ మచ్చ పడిందమ్మా” అంది తల్లి
“అదిగో అటు చూడు ఆ చంద్రుడు కూడా మచ్చ ఉంటుంది కాబట్టి ఏమి ఫర్వాలేదు” అంది
“అస్సలు ఆ నర్సు ఎవరమ్మా? .. ఎక్కడ ఉంటుంది? ” అంటూ కుశల ప్రశ్నలు వేసాడు.
తల్లి వాడి బుగ్గలు గిల్లుతూ “ఆవిడ ఇప్పుడెక్కడుందే తెలీదురా. నాన్నగారికి బోలెడు ట్రాన్సఫర్లు అయ్యేవి కదా. మనం ఆ ఊరు వదిలేసి వేరే ఊరు వచ్చేసాం” అంది
ఇది ఎపుడో చిన్నపుడు జరిగిన సంఘటన.
—————

మెడిసిన్ మొదటి సంవత్సరం. క్లాసులో పాఠంలో భాగంగా పిల్లలు పుట్టగానే చేయవలసిన పనులు, డాక్టర్లు, నర్సుల బాధ్యతల గురించి వివరించారు, ఎవరికైనా ఏదైనా ప్రశ్నలుంటే చేతులెత్తమన్నారు మాస్టారు.
తను చెయ్యెత్తి “పిల్లలు పుట్టగానే ఏడవకపోతే గిచ్చవచ్చా?” అని అడిగాడు.
ఆ ప్రశ్నకు అందరూ ఫక్కున నవ్వారు.
“నో.. నో .. నెవర్.. అలా గిచ్చడాలు, చెక్కిల గంతలు పెట్టడం, తొడపాశం లాంటి చేయకూడదు. సిట్ డౌన్” అన్నాడు ప్రొఫెసర్ గారు. క్లాసులో అందరూ ముసి ముసి నవ్వులు నవ్వారు.
సాయంత్రం హాస్టల్ రూమ్ లో తన మచ్చను ఓ సారి చూసుకొని, మెడికల్ ప్రోసీజర్ కు విరుద్దంగా తనని ఆ నర్సు గిచ్చడం గురించి తలుచు కొని బాధపడ్డాడు. ఆ కిటికీలోనుంచి కనపడుతున్న చంద్రుడిని చూసి తల్లి తనతో చిన్నపుడు చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకొని తనను తాను సముదాయించుకున్నాడు. నాలుగు సంవత్సరాలు తెలియకుండా గడచిపోయాయి.
ఫైనల్ ఇయర్ ఎంగ్సామ్ ఇలా గిచ్చే పరిస్థితి మీద ప్రశ్న వస్తే అటు నర్సులకు, బేబీలకు సైతం రాకూడదూ అంటూ ఓ రెండు పేపర్లు తీసుకొని మరీ తన అభిప్రాయం రాసాడు. గోల్డు మెడలిస్టు కొట్టేసాడు. పిల్లల డాక్టరుగా కొత్త ఊర్లో హాస్పిటల్ లో చేరాడు.
—————
ఉద్యోగంలో చేరిన ఓ రెండు నెలలకే ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెట్టి తనకు నచ్చేలా ఓ అమ్మాయిని చూపించారు, సిగ్గుపడుతూ నచ్చిందని తన అంగీకారం చెలియజేసాడు. తల్లి కూడా “మాకు ఈ అమ్మాయి నచ్చింది నువ్వు చేస్తున్న ఆసుపత్రిలోనే నర్సుగా చేరబోతోంది” అంది
“నర్సా? డాక్టర్ అయితే బావుంటుందేమో?” అన్నాడు.
తల్లికి పరిస్తితి అర్ధమై “అందరూ నర్సులూ అలా ఉంటారేంటిరా? పిల్ల ఎంత నాజూకు గా ఉందో చూడు. చరువాత చదువుకుంటుందిలే” అని సర్ధి చెప్పింది. పెళ్ళి బ్రహ్మాండంగా అయ్యింది, పెళ్ళిలో మంచి జోడని ప్రశంసల వర్షం కురిపించారు.
ఓ నెల రోజులలో పండక్కి అల్లుడుగారిని అత్తమామ గారింటికి పిలిచారు. ఇల్లంతా పండగ వాతావరణంతో సరదాగా గడిచింది. అల్లుడంటే ఎంతో ముద్దు అత్తగారికి. ఆ రోజు రాత్రి భోజనం అవ్వగానే ఆ సందడిలో ఆవిడ తన అలవాటులో పొరపాటున అనుకోకుండా ముద్దు ఎక్కువై పక్కన ఉన్న అల్లుడు గారిని వీపు మీద గిచ్చడం జరిగింది. ఇబ్బందిగా తన గదిలోకి పరిగెత్తాడు. అల్లుడు గారికి సిగ్గెక్కువే అన్నారు అత్తగారు.
గదిలోకి వెళ్ళి చూసుకున్నాడు. సరిగ్గా అలాంటి మచ్చే ఇంకోటి వీపు మీద పడింది.. కన్నీళ్ళు గిర్రున తిరిగాయి. ఆ కిటికీ వైపుకు నడిచాడు. అక్కడ చంద్రుడిని చూస్తూ “నీకు ఒకటే మచ్చ.. నాకు రెండు” అన్నట్లుగా సైగలు చేస్తుండగా భార్య గదిలోకి ప్రవేశించింది.
———
“నిన్ను ఒకటి అడగాలి” అన్నాడు.
“సరే అడగండి” అంది
“నీ గురించి కాదు.. మీ అమ్మ గారి గురించి” అన్నాడు.
”మా అమ్మ గురించా?” అంది ఆశ్చర్యపడుతూ
“మీ అమ్మగారు ఏం చేస్తుంటారు?” అని అడిగాడు.
”ఇపుడు వంటిల్లు సర్దుతూ ఉండాలి” అంది
“అబ్బా ఇపుడు కాదు.. ఉద్యోగం సంగతి?” అని అడిగాడు
“ఇపుడు చేయడం లేదండి.. అయినా ఇవన్నీ ఈ సమయంలో ఎందుకండీ?” అంది
“ఏ ఉద్యోగం” అని అడిగాడు.
“పెళ్ళి కాక ముందు ఏదో ఉద్యోగం చేసేది అండి” అంటూ ప్రేమగా చెయ్యి పట్టుకుంది.
“అదే ఏం ఉద్యోగం చేసే వారు?” అన్నాడు. కొంచెం విసుగు ప్రదర్శిస్తూ
“గుర్తులేదండి.. అయినా అవన్నీ అవసరమంటారా?” అనేలోగా
“ఏ ఊరిలో చేసేవారు?” అని మళ్ళీ ఇంకో ప్రశ్న సంధించాడు. ఆ ప్రశ్నతో ఆపకుండా ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతుంటే భార్యకు ఒళ్ళు మండి తనకూ చిన్నప్పటి నుండి ఉన్న పాత అలవాటు ప్రకారం ఓ సారి గట్టిగా గిచ్చింది… అది కూడా సరిగ్గా ..వాళ్ళ అమ్మగారి లాగానే.
“ఓరి దేముడోయ్.. కొంప మునిగింది.. ఆ చిన్నప్పటి నర్సు ఈ నర్సు కచ్చితంగా ఒక్కరే …వాళ్ళ కూతురికి కూడా ఈ అలవాటు….” అనేలోగా నోరు కుక్కేసి “ఊరుకోండి ..అందరికి వినపడేలాగా అంత గట్టిగా అరుస్తారెందుకు?” అంటూ
“ఆ గుర్తుకొచ్చిందండి. మా అమ్మ కూడా అప్పలాయపాలెంలో నర్సుగా చేసేది.. చాలా ఏళ్ళ క్రితం లేండి” అంది
ఆ చంద్రుడి వైపుకు చూస్తూ అదోలా నవ్వి ”నీకూ ఒక్కటే మచ్చ అంటావా? దూరపు కొండలు నునుపు లాగా నీకు కూడా కనపడని ఎన్నో మచ్చలు ఉండి ఉండాలి… ఇప్పటికి నాకు మూడు.. ఇంకా ఎన్ని భరించాలో..” అన్నాడు
“మీకు అమ్మ చేసిన వంట పడలేదేమో? రేపటి నుంచి నేను చేస్తాలెండి” అంది.
“కాదు ..నీకు ఓ సంగతి చెప్పాలి” అంటుండగా సడన్ గా కరెంటు పోయింది.
ఆ కరెంట్ పోయిన కోపం మళ్ళీ తన మీద చూపిస్తుందేమో నని దూరంగా జరిగాడు, ఆ చెరగని మచ్చల గురించి ఆలోచిస్తూ ఒంట్లో వణుకు మొదలయ్యింది.
శుభం భూయాత్!

1 thought on “కౌండిన్య హాస్యకథలు – చెరగని మచ్చ

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *