April 25, 2024

గతం గతః

రచన-డా.లక్ష్మి రాఘవ

ఆ గది తలుపులు తీస్తూంటే ఆసక్తిగా తొంగి చూసింది కమల వంటింట్లో నుండీ.
అత్తగారు విశాలమ్మ, భర్త సూరి లోపలకు పోయి తలుపులు మూశారు.
మామగారు విశ్వనాథం విశ్రాంతిగా పాత వాలుకుర్చీలో కూర్చుని వున్నారు.
ఆయనకు ఇంట్లో ఏమి జరుగుతున్నా పట్టి నట్టే వుండదు.
వంటింట్లో పని చూసుకుని బయటకు వచ్చేసరికి చేతిలో బ్యాగుతో బయటకు వస్తున్న సూరి, ఆ వెనుకే తలుపుకు తాళం పెడుతున్న అత్తగారు కనిపించారు. ఇద్దరూ విశ్వనాధం దగ్గరికి వెడుతూంటే తొంగి చూసింది కమల.
“ఈ సారికి రాగి కలశం పెద్దది ఇచ్చి పంపుతున్నాను ఏమంటారు? “ విశాలమ్మ అడగటం విని పించింది.
“ఏమంటాను? వేరే దారి లేదు కదా…” విశ్వనాథం నిట్టూర్చాడు.
బ్యాగ్గు తీసుకుని కమల దగ్గరకు వచ్చి “కమలా కొంచెం చింతపండు, ఉప్పు వేసి కడిగి పెట్టు“ అని కమల చేతికి కలశం చెంబును ఇచ్చింది.
ఆ రాగిచెంబును చూసి కమల ఆశ్చర్యపోయింది కమల. పెద్దసైజులో చుట్టూ అష్టలక్ష్ములతో చాలా అందంగా వుందా కలశం చెంబు! ఎన్ని తరాలదో…కిందపడిందేమో ఒక చోట కొద్దిగా నొక్కు వుంది. తోమాక తుడుస్తూ వుంటే దాని బరువు కూడా ఎక్కువగా వున్నట్టు గ్రహించింది…దేని గురించీ మాట్లాడ కూడదు అన్న ఆంక్ష వుండటంతో ప్రశ్నించే హక్కు లేదు..
“ఇలా ఎన్నని అమ్ముకుంటారు????” అని గట్టిగా అడగాలనిపించింది.
చెంబు ఒక కవరులో పెట్టుకుని సూరి తన ఫ్రెండ్ ప్రసాద్ వస్తే అతనితో కలిసి బయటకు వెళ్లి పోయాడు.
వంటింట్లో పెద్దగా చేసేదేమీ లేక పెరట్లో పారిజాతం చెట్టు కింద బండమీద కూర్చుంది కమల.
జీవితం అయోమయంగా వుంది..పెళ్ళయి నాలుగు నెలలైంది.
గతం గుర్తుకు వచ్చింది……..
“జమీందారీ కుటుంబం ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ పోయాయి. ఇల్లు గడవడానికి డోకా లేదు. బీదింటి అమ్మాయి, సర్దుకు పోయే గుణం వుంటే చాలు అన్నారు. కట్నం, కానుకలు లేవు…ఆలోచించండి. సంబంధం కుదిర్చే బాధ్యత నాది…” మధ్యవర్తి శర్మ గారు తండ్రి నారాయణతో చెబుతోంటే విన్నది కమల.
ఆరోజు సాయంకాలమే తండ్రితో తానుగా చెప్పింది కమల.
“నాన్నా…. పేదవాళ్ళమనే కాదు చదువు ఎక్కువ లేదని కూడా సంబందాలు కుదరలేదు నాకు. పోనీ ఏదైనా చేద్దామంటే నా 10 తరగతి చదువుకు ఏమీ రావటం లేదు. కట్నాలు లేవంటున్నాడు కదా మారు మాటాడకుండా ఒప్పుకుందాం…ఆలోచించవద్దు”
“జమీందారీ కుటుంబమైనా అన్నీ పోగొట్టుకున్న ఆ కుటుంబంలో మళ్ళీ పేదరికమే చూస్తావు అని ఆలోచిస్తున్నానమ్మా”
“అన్నయ్య యాక్సిడెంట్ లో పోయాక తట్టుకోలేని అమ్మ, జబ్బుపడి మంచానపడి చనిపోయాక వున్నడబ్బంతా పోవడంతో మనకు ఈ పరిస్థితి వచ్చింది. నా పెళ్ళి మీకు మరింత కష్టాన్ని తెచ్చి పెట్టకూడదు. ఈ సంబంధం మనలను వెతుక్కుంటూ వచ్చింది. నేను సర్దుకుపోగలను. కష్టపడగలను. అంగీకరించండి” అని ధైర్యంగా చెప్పిందా రోజు.
పెళ్లి ఆర్బాటం లేకుండా గుడిలో చేస్తే చాలు అన్నారు. ఇరువైపులా కలిసి 50 మందిని మించి లేరు.
మంగళ సూత్రధారణ తరువాత అత్తగారు విశాలమ్మ సన్నటి చంద్రహారం గొలుసు కమల మెడలో వేస్తూ
“నాకు పెళ్లి అయినప్పుడు నిండుగా నగలు పెట్టారు. అన్నీ హరించుకుపోయినా కోడలి కోసం ఇది దాచా..” అంటే మురిసిపోయింది కమల. పుట్టినప్పటి నుండీ బంగారు గొలుసెరగని ఆమె మెడకు ఆ గొలుసు భారంగా అనిపించింది..
అతారిల్లు చేరాక పరిస్థితి అర్థం అయ్యింది కమలకు.
చూడటానికి పెద్ద ఇల్లు అయినా చాలా పాతది. ఒకప్పుడు నిండుగా వస్తువులతో వుండేదేమో కానీ ఇప్పుడు దీనంగా వుంది.
వంటిల్లు పెద్దదే కానీ సరుకులు నిండుగా వుండవు. ప్రతినెలా ఏదైనా వస్తువు అమ్ముకోవాలసిందే !
విశ్వనాథం అన్నీ పోయాయన్న బాధలో పెరాలసిస్ పాలై ఎడం చెయ్యి పని చెయ్యక రోగిష్టిగా మిగిలిపోయ్యాడు.
సూరి డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం చెయ్యడు!
నెలతిరిగేసరికి డబ్బులు లేక అవస్థ పడాల్సిందే!
పాత వైభోగపు గుర్తులుగా మిగిలిన వస్తువులను అమ్ముకుంటూ గడిపేస్తున్నారు.
ఎవరైనా ఇంటి కి వస్తే జమీందారీ హోదాలోనే మాట్లాడుతారు.!
ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కమలకు నెల్లాళ్ళు పట్టింది
ఇంట్లో తినడానికి చారు మెతుకులు తప్ప వేరు గతి వుండదు అప్పుడప్పుడూ.
కమల ఆలోచించి పెరడు కొంత మేరా బాగు చేసి తవ్వి పాదులు చేసి మిరప విత్తనాలు వేసింది. పక్కింటి వారి దగ్గర బచ్చలి తీగ తెచ్చి నాటింది. విత్తనాలు తెమ్మన్నదుకు సూరి కోప్పడ్డాడు. మట్టిని తవ్వుతున్న కమలతో “ఈ పనులు చేయడం మన ఇంటా వంటా లేదు” అంది అత్తగారు.
మామయ్య గారు గమనించినా ప్రశ్నంచలేదు.
రెండవ నెలలో భర్తను నిలదీసింది.
‘ఇంట్లో జరుగుబాటు లేదు. మీరు డిగ్రీ చదువుకున్నారు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చెయ్యచ్చు గదా” అని.
“ఉద్యోగాలు చేసే కుటుంబం కాదు మాది..” సూరి సమాధానం.
‘అది ఒకప్పటి పరిస్థితి. కాలం మారింది. ఇలా నెలకో వస్తువు అమ్ముకుంటూ పొతే ఏమి మిగులుతుంది? ఆలోచించండి”
సూరి తీవ్రంగా చూశాడు కమలవైపు.
ఈ మధ్య కమల అన్నిటినీ ప్రశ్నిస్తూ ఒక తిరుగుబాటుదారులా కనిపిస్తూంది అతనికి.
ఒక రోజు కాఫీ పొడి కావాలని ఎదురుగా వున్న కొట్టుకు వెళ్లి వస్తే విశాలమ్మకు కోపం వచ్చింది.
“మన ఇంటి పరువు బజారుకెక్కుతోంది…ఇలా రోడ్డుమీద తిరగటం మన ఇంటా వంటా లేదు…”అని గట్టిగా మందలించింది. విశ్వనాథం నుండీ చిన్న మాట కూడా రాలేదు.
“మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు అత్తయ్యా” అన్న కమలను చూస్తూ
“నీ భార్యకు నోరు ఎక్కువ అవుతూంది…”అంది కొడుకుతో.
“ఇలాటి పిచ్చిపనులు చేసి అమ్మను నొప్పించకు..” అన్నాడు సూరి.
“మీరు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి” అన్న సామెతలా వుంది. ఒకప్పటి వైభోగం ఇప్పుడు లేదు కదా..మన కాళ్ళ మీద మనం నిలబడి తేనే గౌరవం..హీనస్థితిని ఎదుర్కోవాలే గాని, దాచిపెడతారా? ఎన్ని రోజులు???” భార్య మాట్లాడుతూంటే కోపంగా చూస్తూ చెయ్యిపట్టుకుని రూమ్ లోకి లాగి విసురుగా మంచం మీద పడుకున్నాడు సూరి
తమ కుటుంబం ఎంత ఉన్నతస్థాయిలో బతికిందీ కమలకేమి తెలుసు? బీదపిల్ల సర్దుకుపోతుంది అనుకుంటే ప్రతిదానికీ అడ్డుపడతా వుంది. పైగా “పని చేసి సంపాదించలేవా??”అని సవాలు చేస్తా వుంది..పని చెయ్యడం అంటే ఒకరికింద వున్నట్టే, అది అలవాటు లేదు.. పరిస్థితి మారాక కూడా అమ్మ పద్దతిగా వుండటం లేదా? కమలనే అడ్డం తిరుగుతా వుంది. నాలుగు పీకి దారికి తెచ్చుకుందామని వున్నా కమల చెప్పింది నిజమే కదా అని మనసు నిలదీస్తా వుంది…
అమ్మడానికి గదిలో వస్తువులు తక్కువైపోతూ వున్నాయి. మన బతుకు ఇంతే అనే అమ్మ..
మారు మాట్లాడని నాన్న…అన్నిటికీ ఎందుకిలా?అని ప్రశ్నించే కమల!!
సూరికి తలనొప్పి ఎక్కువైంది!!
తరువాత కొన్నిరోజులు కమల ఎక్కువ మాట్లాడలేదు. మధ్యాహ్నం పూట ఎవరూ గమనించకుండా పక్కింటికి వెళ్లి వచ్చింది.
విశాలమ్మకు జ్వరం వచ్చింది, డాక్టర్ కూ మందులకూ మరో రెండు వస్తువులు ఖర్చయినాయి. రూమ్ తెరిచినప్పుడు కమల గమనిస్తే రూమ్ లో ఒక పక్కగా కొన్ని భోషాణాలు మిగిలి వున్నాయి.
విశాలమ్మ కోలుకున్నాక ఇంటి ముందు వరండాలో వున్న ఖచేరీ రూమును క్లీన్ చేసింది కమల. హాలులో మూలగా వున్న పాత జంఖానా తీసి రూములో పరిచింది
“ఏమి జరుగుతా వుంది?” నిలదీసింది విశాలమ్మ.
“ప౦చాయితీ ఆఫీసువాళ్ళకు ఒక గది కావాలని అన్నారుట. బయట ఖచేరి రూము బాడుగకు ఇవ్వాలని క్లీన్ చేసినా..”
“అన్నీ పేద బుద్దులే నీవి. మనిల్లు బాడుగకు ఇస్తే అందరూ ఏమనుకుంటారు?”
“ఏమీ అనుకోరు…అనుకున్నా పరవాలేదు…నావి పేద బుద్దులే. కానీ బతుకు తెరువు ఆలోచనలు. జమీందారులని పనులు చెయ్యకుండా, ఆస్తి అంతా పోయినా మేము గొప్ప అని నలుగురూ అనుకోవాలని అనుకుంటున్నారే మీవి వక్రబుద్దులు… కాలం మారింది అత్తయ్యా, మీరు ఆ ప్రపంచం నుండీ బయటకు రండి. ఎన్ని రోజులు వస్తువులు అమ్ముకుని బతుకుతాము? రేపు నాకు పిల్లలు పుడితే ఏమి పెట్టి పోషిస్తాము? ఆలోచించండి…మీరు చెప్పండి మామయ్యా…”అని విశ్వనాదాన్ని చూసింది కమల
విశ్వనాథం తలెత్తి కమలను చూసిన చూపులో కోపం లేదు… సమ్మతం కనిపించి కొంచెం ధైర్యం వచ్చింది.
“అంతే కాదు అత్తయ్య నేను డ్వాక్రా గ్రూపులో చేరినాను. డ్వాక్రా లో లోన్స్ ఇస్తారు. దానితో విస్తర్లు చేసే మిషన్లు, చిప్స్ చేసే మిషన్లు తీసుకుని చిన్న కుటీర పరిశ్రమలాగా మొదలు పెట్టాలని నిర్ణయించు కున్నాము. ఇలా చేస్తే కొంత డబ్బు మన చేతికి వస్తుంది..రూముకు వచ్చే బాడుగ మనకు తోడూ అవుతుంది…”ఆపింది కమల.
విశాలమ్మ కమలను ఆశ్చర్యంగా, విస్మయంగా చూస్తూవుంటే నెమ్మదిగా వెళ్లి అత్తయ్య కాళ్ళ దగ్గర కూర్చుంది.
“అత్తయ్యా మీకు ఎదురు తిరుగుతున్నానని అనుకోవద్దు. ఎలా బతకాలో యోచన చేస్తున్నాను. భ్రమలతో జీవించడం మానుకుందాం. మన కోసం మనం కష్టపడ్డంలో నామోషీ లేదు. జమీందారీ పోయాక మనం మామూలు మనుష్యులమే. ఏ పని చేసినా గౌరవంగానే వుంటుంది.. మా ఆయనకు తగ్గ ఉద్యోగం చూదాం. మేమిద్దరం కష్టపడితే బతుకు బాగు పడుతుంది..ఆలోచించండి”అని విశాలమ్మ కాళ్ళు పట్టుకుంది.. విశాలమ్మ అప్రయత్నంగా కమల తలమీద చెయ్యి వేసింది.
విశ్వనాథం ముఖాన చిరునవ్వు వెలిసింది!!
కాలాను గుణం గా కొత్త అవకాశాలను అందిపుచ్చు కావాలన్న ఆలోచన సూరికి వచ్చింది
పోయిన సంపదతో సాంప్రదాయాలు వదలలేక అష్టకష్టాలూ పడ్డ వాళ్ళ జీవితాల్లోకి కొత్త వెలుగు వచ్చింది.
**************

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *