April 23, 2024

గిలకమ్మ కతలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక

రచన: కన్నెగంటి అనసూయ

“ అబ్బబ్బా..! ఈల్లు పిల్లలుగాదమ్మోయ్..పిశాసాలు. పీక్కు తినేత్తన్నార్రా..బాబోయ్ ..ఒక్కక్కళ్ళూను. ఎదవలు బడుంటేనే నయ్యిం. బళ్ళోకి పోతారు. ఇంట్లో ఉండి సంపేత్తన్నారు . పట్టుమని పది నిమిషాలన్నా..పడుకోనిత్తేనా..? ”
కెవ్వుమన్న పిల్లోడేడుపుకి నిద్దట్లోంచి లేసిందేవో..మా సిరాగ్గా ఉంది సరోజ్నీకి.
లేసలా మంచం మీద గూకునే సెదిరిపోయిన జుట్టుని లాగి ఏలు ముడేసుకుంటంటే..
ధడాల్న తలుపు తోసుకుంటా గది లోకొచ్చిన కొడుకు ఏడుపిని మరింత సిర్రెత్తిపోయిందేవో…సరోజ్నికి ఆ కోపంలో ఆడ్ని గభాల్న దగ్గరకి లాగి మెడలొంచి దబ్కా దబ్కామంటా రెండంటిచ్చింది ఆడీపు మీద..
“ పొద్దంతమానూ పొయ్యికాడడి కొట్టుకున్నదాన్ని కొట్టుకున్నట్టుంటానా..! పట్టుమని పదినిమిసాలు నడుం వాలిత్తే సాలు కొట్టుకుసత్తారేరా ఎదవల్లారా? కాసేపన్నా పడుకోనియ్యరా? ఇప్పుడే నిదరడతా పడతా ఉంది. ఏం పొయ్యేకాలం వొచ్చింది కొట్టుకు సత్తాకి. ..” అంటా..
నడి నిద్రట్లోంచి లేత్తవంటే సరోజ్నికి మాసెడ్ద సిరాకు. తలపోటొచ్చేద్ది. ఆ సిరాకూ, ఈ సిరాకు కలిపి ఆడి మీద సూపిచ్చేసిందేవో.. సుక్కలు కనపడ్డాయాడికి సరోజ్ని కొట్తిన దెబ్బలకి..
ఏదో..నిదర సెడగొట్టేడన్న కోపంలో కొడతం అంటే కొట్టేసింది గానీ, ఏడుత్తున్న కొడుకున్జూసి జాలేసిన సరోజ్ని..ఆడ్ని దగ్గరకంటా రమ్మని…
” .. పొట్తనిండా కూరి కూరి అన్నాలెట్టేకానే కదా తాటిపండొలిసిచ్చింది. అరిటి పండొలిసి సేతిలో బెట్టినట్టు ఒలిసిత్తే తింటాకి తీపరవా ఎదవల్లారా? పేనాలు ఏగిచ్చీపోతన్నాయ్ బాబోయ్ నావల్లగాదు..” అంటా ఆణ్ని గుండెలకానిచ్చుకుని..ఎక్కడ కొట్టిందని అడిగింది…
ఆల్లమ్మ కాతంత దగ్గరికి తీసేతలికి మరింత రాగం తీత్తా..ఆవె సేతుల్లో ఒదిగిపోతానే..
“ ఎనకనించొచ్చి గిలకక్క..తోసేసిందమ్మా..! సెబ్దామనొత్తేనేమో..నువ్వూ కొట్టేసేవు..” అంటా మరింతగా ఏడుత్తా గారాలుపోయేడు శీను “నీగ్గాక మరెవరికి సెప్పుకోను..” అన్నట్టు.
“ఏం పొయ్యేకాలవొచ్చింది దానికి పిల్లోడివని కూడా సూడకుండా కొడతాకి..? పెంటమ్ముండనీ..పెంటమ్ముండ. ఎక్కడుందదీ ..? ఇలా రమ్మన్జెప్పు…దాని సంగజ్జప్తాను..” గిలకని తీసుకురమ్మన్నట్టుగ అంతలోనే ఆణ్ణి దూరంగా తోత్తా..
దాంతో ఏడుపాపి..ఒక్కంగలో ఈదిలోకి పరిగెత్తీవోడల్లా…ఇంతలో గిలకే ఎదురొచ్చేతలికి… తిరుగుటపాలో ఎనక్కొచ్చి, ఆల్లమ్మ పక్కగా నిలబడి గిలక్కేసి సూడసాగేడాడు..ఆపెసిన రాగాన్ని తిరిగి అందుకుంటా..
నోట్లోతాట్టెంకెట్టుకుని రెండు సేతుల్తో దాన్ని గుండ్రంగా తిప్పుతా…రానే వచ్చింది గిలక.
“ ఒసేయ్ గిలకా..! ఇలారావే..! ఏంజేసా ఆడ్ని..? రేవులో తాళ్లా పెరుగుతుంకాదు. ఇవరం ఉండక్కల్లెద్దా? తిక్కమందని..తిక్కమంద పోగయ్యేరు నా పేనానికి. కడుపునిండా కూడేట్టే గందా తాటి పండొలిసిత్తా..? తింటాకి నొప్పా..కొట్టుకు సత్తన్నారు..? ఎందుక్కొట్టావాడ్ని..”
ఓ పక్క కూతుర్ని ఇసుక్కుంటానే, మరో పక్క అక్కడే నిలబడి రాగం తీత్తన్న కొడుకొంక సూత్తా..
“ బొయ్యో బొయ్యో మంటా..కుమ్మరోళ్ల ఈధిలో కుక్కరిసినట్టు ఏంటా ఎడుపు? ఏ కొంపలంటూ పోయినయ్యనీ..? ఆపు. ఓ పక్కన అడుగుతున్నాను గదా..” ఇసుక్కుంది సరోజ్ని..ముందుకొంగి శీనుగాడ్నో లాగు లాగి ఏడుత్తుం వల్ల కొడుకు ముక్కు నుంచి నీల్లల్లే కారతన్న సీవిడ్ని పైట సెంగుతో అణిసిపెట్టి మరీ తుడుత్తా..
తాట్టెంక సీకుతానే ఇదంతా సూత్తా నిలబడింది తప్ప ఏమ్మాట్తాడలేదు గిలక..
సిర్రెత్తుకొచ్చింది సరోజ్నికి గిలకన్జూసి..
“ ఎందుక్కొట్టేవంటే నోరిప్పవేమే? ఏవొచ్చిందే పొయ్యేకాలం తోత్తాకి…? ఏళ్ళెల్లే కొద్దీ గుణం గుడిసెక్కి కూకుందంట. అలాగుంది నీపని…” అంటా మంచం మీంచి లేసి, నాలుగడుగులేసి అక్కడే ఇసక మీదుంచిన నల్లని మట్టికుండ మూతమీద బోర్లిచ్చిన గళాసుని కుండలో ముంచి గళాసుడు నీళ్ళూ పైకెత్తి గొంతులో పోసుకుని ఒక్క గుటకేసిందో లేదో…
“ య్యే…తప్పు సేత్తే ..కొట్రా..? ముద్దెట్టుకుంటారా?” తాట్టెంకని నోట్లో పెట్టుకుని రెండు సేతుల్తో తాట్టెంకని గుండ్రంగా తిప్పుతా….గిలకన్న మాటలకి..సర్రున ఇటుకేసిదిరిగి..
“ ఏటా వాగుడు? పెద్దంత్రం సిన్నంత్రం లేకుండాను.? తిన్నాదరుగుతుల్లేదా..? ఏదో సిన్నోడు. తెలిసో తెలవకో ఏదోటి సేత్తాడు. .? పెద్దదానివి ఇవరం సెప్పాలిగానీ ఆణ్నట్టుకుని కొడతావా? ” కూతురొంక కల్లెర్రజేసి జూత్తా..సరోజ్నంది.
“ ఆడు సేసినియ్ కనపడవ్ నీకు ..ఎప్పుడూ నన్నే తిడతావ్…” అసలే తమ్ముడు సేసిన పనికి ఒల్లుమండిపోయి ఉందేమో, తల్లిగూడా తమ్ముణ్నే ఎనకేసుకొచ్చేతలికి తట్టుకోలేక తాట్టెంక అంత దూరానికి ఇసిరికొట్టి.. కెవ్వుమంది గిలక….
కూతురుగూడా ఏడుపు లంకిచ్చుకునేతలికి ..నిదరమత్తంతా దిగిపోయిందేవో సరోజ్నికీ..
“ ఈడు ఏదో సేసే ఉంటాళ్లే. లేపోతే అదెంతుక్కొడద్దని “ మనస్సులోనే అనుకుని శీనుగాడొంక సూత్తా “ ఏరా..ఏంజేసా? నువ్వు నల్లల్లే కనపడవ్..అది కనపడద్ది..అంతే..! ఏం జరిగిందో.. సెప్పిసావండే …ఎవళ్ళో ఒకళ్ళు. సెప్పాపోతే పొండవతలికి మీరూ, మీ తాట్టెంకానూ..! ఎదవగోలని, ఎదవగోల. అవతల నాకు బోళ్లంత పనుంది. మీతో కూకుంటానా పొద్దత్తమానూను..” పిల్లల మీద ఇసుక్కుంది సరోజ్ని..
తేలు కుట్టిన దొంగల్లే శీనుగాడేం మాట్టాళ్ళేదుగానీ ..
“ నేను కొట్టేనని సెప్పేటప్పుడూ..నువ్వేంజేత్తే కొట్టేనో అజ్జప్పాలి గదా ? సెప్పేవా అమ్మకి?” సుర్రా సుర్రా సూత్తా.. గిలకడిగిందానికి నోరిప్పలేదాడు.
“ నువ్వెంతుకు సెప్తావ్..?”అంటా ఆల్లమ్మనెక్కి సూత్తా..
“ నిన్న సందాల ..తమ్ముడు…ఆడుకుని ఇంటికొత్తుంటే…ఎంకాయమ్మామ్మ..తాటిపడిచ్చిందామ్మా.. తాత్తెచ్చేడని..”
గుత్తొచ్చింది సరోజ్నికి..
అంతకు ముందు రోజు సందేల శీనుగాడు ఆడుకుని ఆడుకుని ఇంటికి తిరిగొత్తుంటే ఆలపాటోరి ఎంకాయమ్మ ఆణ్ణి మజ్జలో అడ్దంగొట్టి..
” ఒరేయ్ శీనుగే. ఇలారా. ఇదిగోరా తాటిపండు. మీ తాత్తెచ్చేడు నిన్న రేత్రి పొలాన్నించి. కాల్చమన్నానని మియ్యమ్మతో సెప్పి కాల్పిచ్చుకుని తినండి. మా సెడ్దతీపనుకో. మియ్యమ్మకి సెప్పు. . మన సేలోదే..” అంటా తాటిపండోటిచ్చింది ఆడి సేతికి.
గౌడిగేత్తలకాయంతుందది..నల్లగా నిగనిగలాడ్తా…
అస్సలే శీనుగాడికి తాట్టెంక తింటవంటే మా ..ఇట్టం. దాంతో కొహినూరు వజ్రాన్నట్టుకున్నట్టు దాన్నట్టుకుని ఇంత మొకం జేసుకుంటా ఉరుకులు పరుగుల్తో దాన్నింటికిదెచ్చి అప్పటికప్పుడు కాల్చమని ఆల్లమ్మ పీకల మీద కూకున్నాడు.
రాత్రుల్లందు తింటే కడుపులో నొప్పొత్తాదని సెప్పి..
“రేపెలాగా ఆదివారవేగదా..రేపు కాలుత్తాన్లే. మజ్జాన్నించి తిందురుగాని. కడుపులో నొప్పొచ్చినా కాల్లో నొప్పొచ్చినా సందాలమాటు కాతంత మందడేత్తే సోమారం బళ్ళొకెల్లొచ్చు…. “
అనొప్పిచ్చే తలికి తలపేనం తోక్కొంచ్చింది సరోజ్నికి.
ఆ మర్నాడు.. పొద్దున్న వంటయ్యాకా తాటిపండుని నేలకేసి దబకా దబకా నాలుగు బాదులు బాది టెంకలు,టెంకలుగా ఇడిపోయిందనుకున్నాకా, పొయ్యిలో నిప్పులు బయటికి లాగి ఆటి మీదీ తాటిపండడేసింది.
అసలే సింతనిప్పులేమో..కణకణలాడతా ఉండేతలికి ఆ సెగకి తాటిపండు బాగా కాలిపోయి నిప్పుల మీదే తొక్క ఇడిపోయిందేమో.., ఇడిపోయిన తొక్కల సందుల్లోంచి పాకం కారిపోయి ఊరూవాడా కూడాను..కమ్మటి తాటిపండోసనే.
ఇంకా ఉంటే మాడి సత్తాదేమోనని..కాలిన తాటిపండున్దీసి పక్కనెట్టి నిప్పుల మీద కాసిన్ని నీళ్ళోసి ఆటిని ఆరిపేసింది.
అదయ్యాకా తలుపులు గడెట్టి , ఒంటి మీద కాసిన్ని నీళ్ళోసుకుని పిల్లలకి అన్నాలెట్టింది.
సరోజ్ని ఎప్పుడూ అంతే .ఏదన్నా తింటాకి ఇంట్లో ఉంటే ఎయ్యేలబడితే అయ్యేల ఊరికే తిననిచ్చెయ్యదు. అన్నాలకి ముందైతే అసలకే పెట్తదు. ఏదైనా అన్నం తిన్నాక మజ్జాన్నించే. .
ఆల్లన్నాలు తిని ఆడుకుంటాకి ఈధిలోకి పొయ్యేకా…సందాల అన్నానికని సేట్లో కాసిన్ని బియ్యవోసుకుని ఏరి పక్కనెట్టి..తీరిగ్గా కూకుని మరీ కాల్చిన తాటిపండు తొక్కలు తీసి, వల్చిన తాట్టెంకల్ని కంచంలో పెట్టి , తొక్కల్నున్న పీసంతా తీసి గుండ్రంగా ముద్దల్లే జేసి అక్కడెట్టి మరీ పిల్లల్ని పిల్సింది..
అమ్మేదో పెడతాకే పిల్సిందన్నట్టు ఆగమేగాల మీద ఆల్లొచ్చేసేరేవో..ఆల్లెనక్కే సూత్తా..
” అదుగో తాటిపండు .బట్టలకయ్యిందంటే ఈపు ఇమానం మోతెత్తుద్ది ఏవనుకున్నారో..” అనోసారి బెదిరిచ్చి ..ఆల్లు పల్లెవట్టుకుని వసారాలోకెల్లిపోయేకా..అవతలి గదిలోకెల్లి గత్తలుపులు దగ్గరికి జేరేసి నులక మంచం మీద నడుం వాల్సింది సరోజ్ని..
ఇలా పడుకుందో లేదో అలా ఏడుత్తా పిల్లడొత్తం గుత్తొచ్చి..
” అత్తెలుసులే..తర్వాజ్జెప్పు..” ఈసడించింది సరోజ్ని కూతుర్ని.
“ అదే సెప్తుంటే నీగ్గాదా? “ అంటా సెప్తుం ఆపి ఓసారి తల్లికేసి సూసి..
“….ఆ యంకాయమ్మామ్మ…ఆడ్ని కేకేసి ఇచ్చిందిగదా.. తాటిపండు. ఆడి కూడా నేనుంటే నాకే ఇచ్చుననుకో. అప్పుడే గొడవా ఉండాపోను. ఆడికిచ్చిందేవో.. అంతుకని ఆడు సెప్పినట్టే నేనినాలంట. “
“ నేలకి రెండు జాన్లెత్తు లేడు..ఏటో ఆడు సెప్పేది?”
మజ్జలో అడ్దంగొట్టింది కూతుర్ని…మనసులో నవ్వుకుంటా..
“ అజ్జెప్తుంటే నీగ్గాదా?” ఇసుక్కుంది గిలక ఆల్లమ్మని. కాసేపాగి..మల్లీ గిలకే అంది..
“ ఆడు ఇచ్చిందేదో అదే తీసుకోవాలంట. సెప్పేడు. అలాగేలే అన్నాననుకో..ఆ ఇచ్చేదేదో ఇచ్చెయ్యచ్చుగదమ్మా..? ఉహ్హూ.. ఇవ్లేదమ్మా. ఇవ్వకుండా దగ్గరికి పిల్సి..
“ అక్కా..! అమ్మ..ఏదన్నా పెడతాకి మనిద్దర్నీ పిల్సి ..మీక్కావల్సినియ్యేయో మీరు తీసుకోండంటే పెద్ద పెద్దయ్యి నువ్వు బాగా ఏరతావ్ కదా. అంతుకే…ఈ మూడు తాట్టెంకల్లో పెద్దదేదో..తీసుకో…” అన్నాడమ్మా. ఆడలా అన్నాడని మూడు తాట్టెంకల్నీ సూసీ, సూసీ పెద్దదేదో..అత్తీసేనమ్మా.. ” ఉడుకుమోయింది గిలక..
“ ఊ ..తీత్తే..?”
“ తీసేనమ్మా..! నన్ను తీసుకొమ్మంటేనే కదమ్మా..తీసేను. నేను పేద్ద తాట్టెంక తీత్తే , అది నాకియ్యకుండా ఆడు తీసేసుకుని..” ఇదమ్మకి “ అని సెప్పి పక్కనెట్టేసి, తతిమ్మా రెండు టెంకల్నీ సూపిత్తా ..
“ఈ రెండింట్లో పెద్దదేదో తీస్కో.. “ అన్నాడమ్మా..! సర్లెమ్మని రెండింట్నీ సూసి, సూసీ బాగా పెద్దదాన్ని తీసుకున్నాననుకో..అది కూడా నాకివ్వకుండా…“ ఇది ..నాకు…” అంటా నేనేరిన పెద్ద తాట్టెంకని ఆడు తీసుకుని..సింతాట్టెంకని నన్ను తీసుకోమన్నాడమ్మా..! అంతుకే ..ఒక్కటిచ్చేను ఎదవని..” కసి, కోపంతో గొల్లున ఏడిసేసింది గిలక.
ఆ ఏడుపులో…అవమానించేడన్న బాధని గమనించిన సరోజ్నికి నవ్వాగలేదు..
ఎంతాపుకోవాలన్నా తన వల్లకాక అంత కోపంలోనూ పుసుక్కున నవ్వేసింది పైకే సరోజ్నీ.
నవ్వుతానే కొడుకెనక్కి సూసింది…ప్రేమగా..
అక్కేం సెప్పుద్దోనని ఏడుపాపి ఆడింకా గిలకొంకే సూత్తన్నాడు..
ఆడ్నలా సూత్తన్నకొద్దీ ముద్దొచ్చేసేడేమో.. సరోజ్నికీ కల్లల్లో నీల్లు తిరిగేయి..
అంతలోనే ..కల్లు తిప్పేసుకుని గిలకెనక్కి సూసింది..
నిజవే..గిలక్కి తిండంటే ఇట్టం. పిల్లలు బళ్ళోంచి ఆకలిగా వత్తారని ఆల్లొచ్చేతలికి ఏవన్నా పలపరిసి ఉంచుద్దేమో..ఆటిల్లో ఎవరికేం కావాలో తీసుకోండని ఆల్లమ్మంటే ..కాసేపలాగా ఆటికేసి సూసీ సూసీ పెద్దయ్యేయో అయ్యి తీసుకుంటది. పోనీ తెసుకుంది గదాని తినగలుగుద్దా అంటే అదీ లేదు. తర్వాత ఆడికే పెట్టేసుద్ది.
ఆరాటం ఎక్కువ, ఆరగిచ్చేత్తక్కువానూ..!
సరోజ్ని ఆలోసనల్లో సరోజ్ని ఉండగానే..
“ అమ్మ..పెద్దదని పెత్తాంటెంక అమ్మకిచ్చేను ..తప్పేటి?” శీనన్నాడు..మల్లీ ..ఏడుపు మొదలెడతా..
సరోజ్ని కళ్ళు సెరువులయ్యేయి కొడుకన్న ఆమాటకి..
“ మరి నేను ? నేను సిన్నదాన్నా? పెద్దదాన్ని కాదా నీ కంటే..? తర్వాద్ది నాకివ్వొచ్చు గదా..?నువ్వెంతుకు తీసుకున్నావ్ ?” కాట్ల కుక్కలా అరిసింది..గిలక తమ్ముడు మీద..
ఆడేం తొనకలేదు,బెనకలేదు..గిలకరుపులకి. నిదానంగా ..గిలకొంకే సూత్తా..
“ నేను సిన్నోడ్ని గదా..? అంతుకని..నేన్దీసుకున్నా..” ఏడుపాపి గోడకి జేరబడి దర్జాగా అన్నాడు శీనుగాడు..
దాంతో మరింత ముద్దొచ్చేసిన కొడుకొంక సూత్తా..
“ ఏదీ నాకోసం పక్కనెట్టిన పెత్తాట్టెంక ఇలాతే..! మీ దెబ్బలాటలుగానీ తాట్టెంకలన్నీ ఒక సైజే ఉంటాయర్రా..! మీ తెలివి సల్లగుండా..” నవ్వుతా అందేమో సరోజ్ని..తల్లి ముఖంలో ఆనందాన్ని సూసి ఒక్కంగలో తాట్టెంకున్న పల్లెందెచ్చి తల్లి ముందెట్టేడు..శీను.
పల్లెం అలా పట్టుకునే గిలకెనక్కి సూత్తా..
“ మీ దుంపల్దెగ…! సిన్న పిల్లలు. అదే పనిగా తింటే మీకెక్కడ కడుపులో నొప్పొత్తాదోనని ఏదో నాలుగు టెంకలున్నప్పుడు ఎప్పుడో ఒకటి తిన్నానే అనుకోండి. అలాగని కాల్చినప్పుడల్లా పందేరం పెడతారా? పెద్దదాన్ని నేను తినాపోతే ఏవయ్యిందిగానీ..సగం నువ్వు తిన్నాకా తమ్ముడికిచ్చెయ్..” అంది సరోజ్ని..సెయ్యి కడుక్కొచ్చి తడి సేత్తో..తాట్టెంకని నున్నగా సవరదీసి కూతురుకందిత్తా…
నాకక్కాలేదు. ఎంకాయమ్మామ్మ ఆడ్ని పిలిసి ఆడికే ఇచ్చింది కదా! అంతుకే ఆడేదిత్తే అదే. నువ్వేమో..ఎప్పుడైనా ఏదైనా పెట్టేతప్పుడు మీకెయ్యి కావాలో తీసుకోండి అనంటావని పెద్దయ్యి తీసుకునేదాన్ని. నువ్వు సెప్తేనే కదమ్మా అప్పుడైనా నేన్తీసుకున్నది. అంతుకే కదా నేనేత్తీసుకుంటే అది నాకే ఇచ్చేసేదానివి కదమ్మా..!మరి ఈడుజూడు ఎలా సేసేడో. ఆడు ఇచ్చేదేదో ఆడు ఇవ్వచ్చు గదమ్మా..! నువ్వే సెప్పమ్మా..! నాతో ..తీయిచ్చి , సిన్నది నాకిత్తం మోసం కాదా? అంతుకే కొట్టేను..” నేన్జేసిందాన్లో తప్పులేదన్నట్టు కొండంత ధీమా గిలక మాటల్లో..
“కొడితే కొట్టేవ్ లే. మోసంజేత్తే ఎవరైనా కొడతారు. “ అని గిలకని ఓదార్సి..అంతలోనే..
“ ..అయినా పెత్తాంటెంక అమ్మకిద్దావని ఆడలా సేసేడ్లేవే! నీకు మాత్తరం అమ్మనిగానా? ఎంకాయమ్మామ్మ నీకిత్తే నువ్వూ అలాగే సేత్తావేమో…అమ్మకోసం. ఇంద. ఇది తీసుకుని సగం దిని ఆడికిచ్చెయ్..” గిలక దగ్గరకంటా వచ్చి దగ్గరకి లాక్కుంటా మరీ అంది సరోజ్ని.
“నాకొద్దమ్మా..! ఆడు సిన్నోడుగదా…ఆడికే ఇచ్చెయ్! “
“ సర్లే…ఐతే..! ఇదిగోరా శీనూ..” అంటా కొడుక్కందిచ్చిందేవో సరోజ్నీ, దాన్నట్టుకుని ఆడు గిలక దగ్గరకంటా ఎల్లి.. “ అక్కా..! దా…ఇది నీకే..! నీకు అమ్మెప్పుడూ రెండిత్తదిగదా..”
అంటన్న శీనూ కేసి తెల్లబోయి సూసింది సరోజ్ని..
”హాస్నీ..మీరూ మీరూ ఒకటేనా? ” అన్నట్టు..

******

2 thoughts on “గిలకమ్మ కతలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక

  1. అహ్హహ…. ఎంత దెబ్బలాడుకున్నా పిల్లలు..పిల్లలు ఒకటే?! గోదారోళ్ల యాస తో పాటు ఆరాటం ఎక్కువ, ఆరగిచ్చేత్తక్కువానూ..! సామెతలు కూడా గిలకమ్మ కథలు బావున్నాయి…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *