March 29, 2024

తపస్సు – మొదటి సమిధ

రచన:- రామా చంద్రమౌళి


ఔను .. ఈ శరీరం ఒక పుస్తకమే .. సంహిత
బీళ్ళు, అరణ్యాలు , నదులు, పర్వతాలు .. అన్నీ
ఈ దేహంలోనే .. సుప్త సముద్రాలు , జ్వలితాకాశాలు
పుట వెనుక పుట తిప్పుతూ
ఎన్ని యుగాలుగానో .. ఈ బూజుపట్టిన గ్రంథాల పురాపరిమళం
హోమర్ లు, వ్యాసులు, కంఫ్యూషియస్ లు, సూఫీలు
అన్నీ రక్తనదుల్లో కొట్టుకుపోతూ రాజ్యావశేషాలు
ఏ చక్రవర్తి జాడించి సింహాసనంపైకి బొంగరాన్నో , ఖడ్గాన్నో విసిరినా
అది .. రాజ్యంకోసమో , రమణీ ప్రియద్యూతిక రతిక్రియ కోసమో
రాక్షస హింసానందంకోసమో ,
స్క్రూ డ్రైవర్ ను ఎదుటివాని అరచేయిలో నాటుతున్నప్పటి
రక్తవిస్ఫోటనం .. హింస .. ఒక పైశాచిక పరమానందం
సీ అండ్ ఎంజాయ్ .. షో అండ్ ఎంజాయ్
ఫక్ అండ్ ఎంజాయ్ .. ఎంజాయ్ బట్ డోంట్ ఫక్
అంతిమంగా .. అన్నీ స్రావాలు.. దుఃఖాశ్రు పాతాలు
చివరికి ఒంటరి అశ్వద్థ వృక్ష కొమ్మకు
వ్రేలాడ్తూ , శబ్దిస్తూ .. ఇనుప గొలుసుల చెక్క ఊయల
కిర్ కిర్.. కిర్ కిర్
గాలి నిశ్శబ్ద సాక్ష్యం .. అనాది మానవుని అసలు చరిత్రకు –
యజ్ఞ కుండాల ముందు వేదమంత్ర ఘోష
ఓం నారాయణే బ్రహ్మః .. ఓం నారాయణే శివః
ఓం నారాయణే ఇంద్రః
ద్వాదశ రుద్రులు .. అష్టాదిశ పాలకులు .. వ్యాసులు అరవైఆరు .,
అనాది పురాణ, ఇతిహాస, ఋక్ ఘోషలన్నీ
మూసిన పిడికిట్లో బందీ ఐన చిదంబర రహస్యాలు
విముక్త కాంక్ష .. యుగయుగాల తిరుగుబాట్లలో
హావ్స్ .. అండ్ హావ్ నాట్స్
రెండే రెండు జాతులు ప్రపంచ మానవ మహాసమాజంలో
ఉజ్జయిని కోట గోడపైనైనా, చైనా లాంగ్ వాల్ పైనైనా
ఒరేయ్ తండ్రీ
గోడకు కొట్టిన పిడక ఎండిన తర్వాత రాలిపోవాల్సిందే
మనిషి మాత్రం .. రొచ్చు
గోమూత్రం ఔషదం
విసర్జితాలన్నీ ఒకటి కావు
నీ ఆహారాన్నిబట్టి నీ బహిర్ పదార్థాలు
శుద్ధి చేసుకోవాలి ఎవరికివారు.. అగ్ని చికిత్సతో
ఓం అంతరిక్షగం శాంతిః .. ఓషదయ శాంతిః
వనస్పతయ శాంతిః .. ఓం శాంతిరేవ శాంతిః
అని ఒక మహోధృత అశాంతలోకంలోనుండి
శాంతి క్రతువును మానవమహాప్రపంచమంతా హోమిస్తున్నపుడు
అగ్నిని శిరస్సున ధరించిన మొట్టమొదటి సమిధ ఎవరు .. అంటే
… అది నేనే.. ఆత్మాహుతితో –

1 thought on “తపస్సు – మొదటి సమిధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *