April 19, 2024

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

సీసపద్యం తెలుగునాట బాగా వెలుగు చూసిన ప్రక్రియ. దానికి కారణం దానిలోని గాన యోగ్యత. రెండవది సంభాషణలాగా ఉండే ప్రక్రియ.
ఎదుటి వారితో మాట్లాడుతున్నట్టుగా సాగే ఈ పద్య ప్రక్రియకు శ్రీనాథునిది పెట్టింది పేరు.
ఆయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితిని మరుత్తరాట్చరిత్ర’బహు ప్రసిద్ధం.
అలాగని మిగతా కవులెవ్వరిని తీసివేయడానికి లేదు.
నన్నయ రాజవంశోత్తమ రంతిదేవుని కీర్తి
ఏలచెప్పగ బడి విందు నందు. . . అట్లాగే
తిక్కన సీసం
‘కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల గప్పికొనగ’ పద్యరత్నాలలో ఒకటి.
పోతన్న సీసం
‘మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపమ్ము బోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలం దూగు
రాయంచ జనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్రనీహారములకు

అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు !
వినుత గుణశీల,మాటలు వేయునేల?
ఎంత ప్రఖ్యాతిగన్నదో.

అలాగే వసుచరిత్రకారుడు భట్టుమూర్తి లేదా రామరాజభూషణుని సీసపద్యం
‘లలనాజనాపాంగ వలనావసదనంగ
తులనాభికాభంగ దోః ప్రసంగము’వింటే వీనులకు విందే.

ఎత్తిపొడుపులకు సీసపద్యాన్ని మన పౌరాణిక సినిమాల్లో చూస్తాం.
ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి ఈ సీసపద్యపాదం వినండి.
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
కోకెత్తుకెళ్లింది కొండగాలి
ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా. ఇది సినిమాపాటే వేటూరి రాసింది. హిట్టుసాంగు కదా అప్పట్లో.
అందుకే చెబుతున్నా సీసపద్యం తెలుగు భాషలో
ఒక ప్రత్యేకత కలిగిన పద్య ప్రక్రియ. సీసపద్యాల్లో రాసిన నరసింహ శతకం అంత ప్రఖ్యాతి ఏ శతకమూ పొందలేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వీథిబళ్లలో చదువుకున్న వారికి నరసింహ శతకం పద్యాలు కంఠస్థాలు.
సీసాన్ని సముచితంగా వాడుకున్న వాళ్లలో నరసింహ శతకకర్త శేషప్పను కూడా చెప్పుకోవాలె. ఈయన ధర్మపురనివాసి. పదిహేడవ శతాబ్దికి చెందిన కవి. గోదావరీ తీరంలోగల ధర్మపురి నివాసుని ఆలయంలో దీపధారుడేకాక రాత్రివేళ ఆలయం కాపలాదారుడుగా కూడా ఉండేవాడట. ఎంత విచిత్రం. అందరినీ కాపాడేవానికి కాపలాదారు ఉద్యోగం. అంత సన్నిహితుడు గనుకనే తన మొరనంతా ఆ స్వామికి నీవేదించుకున్నాడు సీసపద్యాల్లో. పామరజనులకు అర్థమయ్యేవిధంగా సరళమైన సీసపద్యాలు రాశాడు.
పద్మలోచన సీసపద్యముల్ నీమీద చెప్పబూనితినయ్య చిత్తగింపు మంటూ మొదలు పెట్టి
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో ముగిస్తాడు. నరసింహశతకం తెలుగు రాష్ట్రాల్లోనే గాక మలేషియా వంటి దేశాల్లో కూడా ప్రాచుర్యం
పొందిన శతకం.
లోకరీతిని ఎండగట్టే ఈ శతకం నిండా అనేక సుద్దులు చెప్పబడ్డాయి.
పసరంబు పందైన పసుల కాపరి తప్పు
కూతురు చెడుగైన మాత తప్పు
భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు
తవయుండు చెడుగైన తండ్రి తప్పు
అంటాడు
అలాగే లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారమ్ము మింగబోడు అంటాడు
ముక్కుడితొత్తుకు ముత్యంపు నత్తేల
విరజాజి పూదండ విధవ కేల అని ఎన్నో లౌకిక విషయాలను విన్నవిస్తాడు.
నరసింహ నీదివ్య నామమంత్రముచేత
దురితజాలమునెల్ల దునుప వచ్చు
నరసింహ నీదివ్య నామమంత్రముచేత
బలువైన రోగముల్ బాపవచ్చు
నరసింహ నీదివ్య నామమంత్రముచేత
రిపుసంఘముల సంహరింపవచ్చు
నరసింహ నీదివ్య నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల దరుమవచ్చు
భళిర నేనీ మహామంత్ర బలముచేత
దివ్యవైకుంఠ పదవి సాధించవచ్చు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర
అంటూ తన భక్తిని చాటుకుంటాడు
ఒకప్పటి వీథిబడి వ్యవస్థలో నరసింహశతకపద్యాలు
కంఠస్థం చేయించారంటేనే దాని విలవ తెలుస్తుంది.
గానానుకూలంగా ఉండటమే గాక వాడుక భాషకు కూడా అనుకూలమైనది సీసపద్య మొక్కటే. ఇంకాచెప్పాలంటే అన్యభాషాపదాలతో కూడా అందమైన సీసం రాసిన కవులున్నారు.
ఈ పద్యం చూడండి ఆంగ్లభాషా పదాలను
కాళ్లకూరి నారాయణరావుగారు తన మధుసేవ నాటకంలో
మార్నింగు కాగానె మంచములీవింగు
మొగమువాషింగు చక్కగా సిటింగు
కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు
గడగడా డ్రింకింగు గ్యాంబులింగు
భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు
క్లబ్బును రీచింగు గ్యాంబులింగు
విత్తము లూజింగు చిత్తము రేవింగు
వెంటనే డ్రింకింగు వేవరింగు

మరలమరల రిపీటింగు మట్టరింగు
బసకు స్టార్టింగు జేబులు ఫండరింగు
దారిపొడుగునా డ్యాన్సింగు థండరింగు
సారెసారెకు రోలింగు స్లంబరింగు
ఉరుదూ పదాలను చేర్చి రాసిన సీసపద్యాలు కూడా
ఉన్నాయి.
సెహభాష్ రాందాస్ బహుతచ్ఛ పాఠాన్కి
నేర్పించెనందర్కి నేనే సెప్తాన్
నా చేతికెవడైన నమ్మి పైసా ఇస్తె
మింగేస్తాన్ పెళ్లాంతో రంజు చేస్తాన్. . . . . . . .
అదీ సీస పద్యమంటే

2 thoughts on “తేనెలొలుకు తెలుగు – 5

  1. అయ్యా,
    “కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి” అను పద్యము పోతన గారి భాగవతము ప్రథమ స్కంధము లోనిది గా సరిచేసుకో గలరు. మీరు చెప్పినత్లు అది తిక్కన పద్యము కాదు.

Leave a Reply to Dhan Kalvakolanu Cancel reply

Your email address will not be published. Required fields are marked *