April 19, 2024

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద

ఆటో వేగంగా వెళ్తోంది.
కేయూరవల్లి పరధ్యానంలో మునిగి ఉంది పూర్తిగా.
ఈశ్వరి పరిస్థితి ఆమెకు జాలిని కలిగిస్తోంది.
ఎందుకు మనుషులిలా ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు. కేవలం తమ స్వార్ధం కోసం, స్వలాభం కొసం ఇన్ని అబద్ధాలాడి, ఇంతింత మోసాలు చేయాలా?
ఒక పెద్ద ప్రయాణం లాంటిది జీవితం.
సరిగ్గా ఆలోచిస్తే జనన మరణాల్ని కలిపే ఒక వంతెన జీవితం.
ఇటీస్ స్పాన్ ఇన్ బిట్వీన్ లైఫ్ ఆండ్ డెత్
ఇటీజ్ జర్నీ టువర్డ్స్ డెత్ విచ్ ఇస్ ఇన్ ఎస్కేపబుల్ ఆండ్ ఇనెవిటబుల్.
మరి ఇంత అశాశ్వతమైన బ్రతుకు మీదనా అంత అంతులేని తీపి.’తన బ్రతుకు మీద అంతులేని తీపితో మరొకరి జీవితం నిండా విషం నింపాలా?
ఇంత నీచ ధర్మం సృష్టిలో మరే ప్రాణికోటిలోనన్నా ఉందా?
ఎంత సంపాదించినా గతంలో ఎవరూ ఏమీ చస్తూ పట్టుకెళ్లలేకపోయేరని తెలిసి, తాను కూడా పట్టుకెళ్లలేనని తెలిసి కూడా మనిషికెందుకింత దురాశ.
భూకంపాలు, వరదలూ, ఉప్పెనలూ, ఏక్సిడెంటులూ, శబ్ద, వాతావరణ, నీటి కాలుష్యాలూ, యుద్ధాలు, మూకుమ్మడి చావులూ, కలహాలూ, కల్లోలాలూ.. ఇవన్నీ చూసి కూడా మనిషి అడ్డదారి తొక్కి, అన్యాయాలు చేసి ఇతరుల జీవితాల పునాదుల మీద తన జీవన సౌధం నిర్మించుకునే ప్ర్ అయత్నం చేస్తున్నాడంటే మనిషెంత పవర్ ఆండ్ మనీ మానియా అయిపోయాడో అర్ధమవుతుంది.
ఇలాంటి నీచ నికృష్ట రెండు కాళ్ల జంతువుకి చావు లేకుండా చేయాలన్న తపనతో తన భర్త తనకి తాను అన్యాయం చేస్కున్నదేగాక తమకీ తీరని ద్రోహం చేసేడు.
అతనితో ముడిపెట్టుకున్న తమకు ఏ ఆనందమూ లేని యాంత్రిక జీవితాన్ని ప్రసాదించేడు.
నిజంగానే తన ప్రయత్నం ఫలించి మనిషికి చావే లేకపోతే .. ఏ నిమిషాన చస్తానో అని భయం కూడా లేకపోతే మనిషికి మించిన రాక్షసుడీ సృష్టిలో ఉంటాడా?
ఆటో సడన్ బ్రేక్‌తో ఆగింది.
కేయూర ఒక విధమైన ఉలికిపాటుతో తన ఆలోచన నుండి బయటపడి చుట్టూ చూసింది.
ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అడవిలా పెరిగిన చెట్ల మంధ్య పాడుబడినట్లున్న ఒక పెంకుటింటి ముందాగింది ఆటో.
ఆమె ఆ ప్రదేశాన్ని అయోమయంగా చూస్తూ “ఇదేంటిది. వాల్తేర్ అప్‌లాండని చెబితే ఇక్కడికి తీసుకొచ్చావ్?” అంది.
దూరంగా దాటిపోయి వచ్చిన జూలాజికల్ పార్కు గోడలు కనిపిస్తున్నాయి.
ఆటొ డ్రైవర్ మితబాషిలా ఆమె వంకదోలా చూసాడు.
కేయూర అతనివైపు అనుమానంగా చూస్తూ “ఏం మాట్లాడవు?” అంది కోపం మిళితమైన స్వరంతో.
“వాడు నా మనిషి. ఏం మాట్లాడతాడు?” అంటూ ఆటో వెనుక భాగం నుండి ముందుకొచ్చేడు వెంకట్.
వెంకట్‌ని చూడగానే ఆమె నిర్ఘాంతపొయింది మొదట. ఆ వెంటనే ఆమె కళ్లలో కోపం, అసహ్యం మిళితమై చోటు చేసుకున్నాయి
“ఇది నీ ప్లానా? డర్టీ రోగ్!” అంది.
“మాటలెక్కువ జారనియ్యకాంటీ. మర్యాదగా ఆటో దిగు.”అన్నాడు వెంకట్.
కేయూర అప్పటికే అతని ప్రక్కన నిలబడ్డ ఇద్దరు బలమైన వ్యక్తుల వైపు చూసింది.
తను దిగకపోతే వాళ్ళు బలవంతంగా తనని లాక్కెళ్తారు. తాను మానసికంగా ఎంత బలవంతురాలైనా శారీరకంగా అశక్తురాలు. వాళ్లని ఢీకొనలేదు. వాళ్లకా అవకాశం ఇవ్వడం కంటే తనే వాళ్లు చెప్పినట్టు వినడం ప్రస్తుతానికి మంచి పని.
కేయూర మనసులో చెలరేగుతున్న ఆందోళను అణచుకుంటూ ఆటో దిగింది.
“దట్స్ గుడ్! ఆంటీ తెలివైనది. అల్లరి పడదు.” అన్నాడు వెంకట్ నవ్వుతూ ముందుకి నడుస్తూ.
కేయూర కోపాన్నణచుకుంటూ అతన్ననుసరించింది.
ఆమె వెనుక ఆ ఇద్దరూ నడుస్తున్నారు.
వెంకట్ పెంకుటింట్లోకి నడిచి. “రా ఆంటీ. ఇలాంటిచోట నువ్వెప్పుడూ లేవు కదూ.. వీలయినంతలో నీకన్నీ సదుపాయాలూ చేసేనులే. చూడు నీకింకేం కావాలో”అన్నాడు చుట్టూ తిరిగి భుజాలెగరేస్తూ.
కేయూర నిర్లిప్తంగా ఆ గదిని పరికించింది.
ఆ గదిలో ఒక మంచం, కుండతో మంచి నీళ్లు, కొన్ని పళ్ళు ఉన్నాయి.
“నన్నెందుకిక్కడికి తీసుకొచ్చేవు?” అనడిగింది కేయూర నిదానంగా.
బదులుగా వెంకట పకపకా నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నావు?”
“మరేం చెయ్యను. పులి పిల్లిలా మాట్లాడుతుంటె. నీకు నా హిస్టరీ మొత్తం తెలిసిపోయిందని నాకు తెలిసిపోయింది. తెలిసేక నిన్నెలా వదిలేస్తాను. నువ్వేం మమూలు మనిషివా. కోపం వస్తే పంజా విసిరి పేగులు బయటికి తీసే రకం. అందుకే నిన్ను కొన్నాళ్లీ అజ్ఞాతవాసంలో పెట్టక తప్పడం లేదు” అన్నాడు.
కేయూర మంచమ్మీద కూర్చుని “అలా ఎన్నాళ్ళు తప్పించుకోగలవు.”అనడిగింది.
“నీ ఆస్థి నా స్వంతమయ్యేవరకు, ఈశ్వరి డబ్బు తెచ్చి నాకిచ్చేంతవరకు” అన్నాడు వెంకట్.
కేయూర ఏహ్యంగా చూసిందతని వైపు.
“నువ్వెలా చూసినా నేను సిగ్గుతో చిదికిపోను. నీ కూతురెలానూ ఆ కేరళ అడవులనుండి బతికి బయట పడదు. నీకు సంపాదించడమేగాని బొత్తిగా ఖర్చు పెట్టడం రాదు. నీ బాంక్ బుక్ నా దగ్గరే ఉంది. అందాక ఒక యాభయివేలు చెక్ రాసివ్వు. ఈ వెధవలకి ఫీజిచ్చుకోవాలి. డబ్బిచ్చి ఆటొవాడి నోరు నొక్కాలి” అనాడు వెంకట్.
కేయూర నిదానంగా అతని వైపు చూస్తూ బాగ్‌లోని చెక్ బుక్ తీసి పాతికవేలు, పాతికవేలకి రెండు చెక్‌లు రెండు తారీఖులతో ఇస్తూ “ఒకే చెక్‌తో ఎక్కువ్ ఆమౌంట్ డ్రా చేస్తే మానేజర్ నాకు ఫోన్ చేసి అడుగుతాడు.”అంది.
వెంకట్ ఆ చెక్కుల్ని ముద్దు పెట్టుకుంటూ “ఆంటీ మంచిదే పాపం. జాగ్రత్తాంటీ. పళ్లు తిని పడుకో. ఎప్పుడూ రెస్ట్‌లెస్‌గా పని చేస్తుంటావు. ఇప్పుడయినా విశ్రాంతి దొరికింది నీకు” అంటూ వాళ్లని తీసుకొని బయటకి నడిచి గదికి తాళం వేసి అతను వెళ్తోంటే భావరహితంగా చూసింది కేయూరవల్లి.
*****
సముద్రం ఒక్క ఊపున తోసేసిన ఊయలలా కనిపిస్తోంది లిఖిత కళ్లకి.
క్షణక్షణం అలలు పెరిగి కెరటాలు ఎగసెగసి పడుతున్నాయి. ఎంత సేపయినా కాణ్హా, తండ్రి జాడలు కనపడక లిఖిత ఆందోళనగా సముద్రం దగ్గరగా వచ్చి పట్టి పట్టి అలల వైపు చూసింది. చల్లని కాంతిని మాత్రం సృష్టికి పంపడం తెలిసిన చంద్రకిరణాలలో సముద్రం బుస కొట్టే నాగులా మెరుస్తుంది. అలల ఎత్తు పల్లాల మధ్య వారిద్దరి జాడా ఎంత తరచి తరచి చూసినా తెలియడం లేదు.
“కొంపదీసి ఇద్దరూ కొట్టుకుపోలేదు కదా.” ఆ ఆలోచన రాగానే లిఖిత శరీరమంతా భయంతో కంపించింది. ఒక పక్క చల్లటి విసురుగాలి ఆమెను చుట్టబెట్టేసి అటూ ఇటూ తోసేస్తున్నది.
“కాణ్హా! కాణ్హా! “అంటూ గొంతుని తీవ్రస్థాయిలో పెంచి నోటికి చేతులడ్డం పెట్టి అరిచింది లిఖిత.
ఆమె అరుపు ఆమెకే వినిపించడం లేదు ఆ సముద్రఘోష మధ్య.
జన సంచారం ఏమాత్రం లేని ఆ సముద్ర తీరం అంతం లేని కొండచిలువ విశ్రాంతిగా భూమిని చుట్టుకుని పడుకున్న భ్రాంతిని కల్గిస్తోంది.
ఆ ప్రాంతంలో తానొక్కర్తినే ఉన్నానన్న విషయం జ్ఞప్తికి రాగానే లిఖిత కళ్ళు వర్షించడం ప్రారంభించేయి.
ఒంటరితనం, బేలతనం ఒక్కుమ్మడిగా ఆమె మనసుని తుఫాను మబ్బుల్లా కమ్మగానే ఆమె నిస్సహాయంగా ఇసుకలొ కూలబడి వెక్కెక్కి ఏడ్చింది.
అలా ఎంతసేపు గడిచిందో.
ఆమె తల మీద నీటి చుక్కలు పడినట్లయి వర్షం కూడా వస్తున్నదేమోనన్న భయంతో ఆమె తలెత్తి చూసింది.
తడిసిన శరీరంతో కాణ్హా ఉన్నాడక్కడ.
అతని చేతుల్లో అచేతనంగా ఉన్న కార్తికేయన్ శరీరముంది.
ఆమె దిగ్గున లేచి నిలబడుతూ “ఏమయింది. మీరిద్దరూ కనపడక వణికిపోయేను” అంది కంగారుగా.
మీ నాన్న సముద్రంలో కొట్టుకుపోయేరు. ఈ రాత్రి పూట అతన్ని వెదకడం చాలా కష్టమయింది”అన్నాడు కాణ్హా.
తండ్రివైపు ఆందోళనగా చూసింది లిఖిత.
కార్తికేయన్ ప్రాణం లేనట్లుగా వ్రేళ్ళాడిపోతున్నాడు.
“ఏమయింది నాన్నకి. అసలు బ్రతికున్నారా?” అనడిగింది లిఖిత ఆదుర్దాగా.
“ఊపిరాడుతోంది” అంటూ కాణ్హా అతన్ని ఇసుకలో పడుకోబెట్టి తలకింద ఇసుక తీసి పలం వేసి పొట్టని గట్టిగా నొక్కేడు. ఉప్పు నీరు బుడబుడా బయటకొచ్చింది. అతను కొద్దిగా కదిలేడు.
వెంటనే కాణ ఆతన్నెత్తుకుని “పద, మనం త్వరగా హోటల్ కెళ్ళిపోదాం. ఈ చలిగాలి కాయన తట్టుకోలేరు” అన్నాడు గబగబా ముందుకడుగు లేస్తూ.
లిఖిత పరిగెట్ట్తున్నట్లుగా అతన్ననుసరించింది. ఇద్దరూ ఇసుక తీరం దాటి రోడ్డు మీద కొచ్చి తాము ఏర్పాటు చేసుకున్న టాక్సీ ఎక్కేరు.
టాక్సీ పది నిముషాల్లో హోటల్ చేరుకుంది.
కార్తికేయన్‌ని తీసుకొచ్చి రూంలో పడుకోబెట్టి “వేడినీళ్ళు కావాలి” అన్నాడు కాణ్హా,.
లిఖిత గీజర్ ఆన్ చేసింది.
కార్తికేయన్ ఇంక ఆపస్మారకంగానే ఉన్నాడు.
అతని పెదవులు ఉండీ ఉండీ ఇంకా సన్నగా ఏదో గొణుగుతూనే ఉన్నాయి.
“అతను మన లోకంలోకి మామూలు మనిషయి రావడమటుంచితే అసలు బ్రతికి బయటపడతాడా” అన్న సందేహంతో లిఖిత సతమతమయి పోతున్నది.
కాణ్హా వేడినీళ్లలో టవల్ ముంచి పిండి ఉప్పు నీటితో నిండిన అతని శరీరాన్ని శుభ్రపరచేడు.
లిఖిత నిస్సత్తువగా మంచం అంచున కూర్చుంది.
“ఏదైనా వేడిగా ఈయనకి తాగించాలి”
లిఖిత వాచివైపు చూసుకుంది.
“మూడున్నర. ఇప్పుడేం దొరుకుతుంది”
“నేను ప్రయత్నిస్తాను” కాణ్హా తలుపు తీసుకుని బయటకెళ్ళేడు.
లిఖిత తండ్రివైపే చూస్తున్నది.
తండ్రిని సరయిన మానసిక స్థితిలో తల్లికి చూపించాలని ఆశ పడింది తాను. కాని ఇప్పుడు కనీసం ప్రాణాలతోనయినా చూపించగలదో లేదో.
వృద్ధాప్యం ఆవరిస్తున్న అతని శరీరం సన్నగా వణుకుతోంది.
అకస్మాత్తుగా అతనేదో కొద్దిగా గట్టిగా అన్నాడు.
లిఖిత దగ్గరగా వెళ్లి “డేడి! డేడీ” అంది ఆందోళనగా.
అతను మరి కాస్సేపేం మాట్లాడలేదు.
లిఖిత్ నిస్పృహగా మళ్లీ మంచం మీద కూర్చోబోతుండగా అతను “మీనన్!మీనన్” అని అనడం స్పష్టంగా వినిపించింది.
ఆమె కళ్ళు ఉత్సహంతో మెరిసేయి.
పరుగున తండ్రి మంచం దగ్గరకెళ్లి మోకాళ్లమీద క్రింద కూర్చుని “కార్తికేయన్!” అని పిలిచింది గంభీరంగా.
“నా ప్రయత్నం వృధా అయింది మీనన్. నేను ఓడిపోయేను” అన్నాడతను నీరసంగా.
“ఎలా?” అనడిగింది లిఖిత మీనన్‌లా నటిస్తూ.
“నా జీవితమంతా ఈ లాబ్‌లోనే వృధా చేసుకున్నాను. నా భార్యాబిడ్డల్ని దూరం చేసుకున్నాను. చివరికి నేనేం సాధించాను. నన్ను నా భార్య క్షమించగలదా?”
ఆ మాటలు విని లిఖితకి చెప్పలేని సంతోషం కల్గింది. తన తండ్రి బ్రతకడమే కాదు తిరిగి పూర్వ మానసిక స్థితిని కూడా సంపాదించుకున్నాడు.
ఆమెకి ఆనందంతో ఎగిరెగిరి గెంతాలనిపించింది.
గిరగిరా బొంగరంలా తిరగాలనిపించింది.
“డేడీ!డేడీ!” అంటూ అతని చేతులు పట్టుకుని ఒప్పులకుప్ప తిరగాలనిపించింది.
ఆమె తనలో ఉప్పొంగుతున్న ఉత్సాహాన్ని బలవంతంగా అణచుకుని “తప్పక క్షమిస్తుంది. వెళ్తావా?”అనడిగింది.
అతను కళ్లు మూసుకునే “కేయూరని చూడాలనుంది. నా కూతురిప్పుడు చాలా పెద్దదయి ఉంటుంది కదూ” అన్నాడు.
తన గురించి అతను మాట్లాడగానే లిఖిత కళ్లు ఆనందంతో చెమర్చేయి.”డేడీ” అని అతన్ని కౌగలించుకోవాలన్న కోరికని బలవంతంగా అణచుకుని “చాలా పెద్దదయింది కార్తికేయన్. నిన్ను చూడాలని ఉబలాటపడుతోంది. వెళ్ళు” అంది.
సరిగ్గా అప్పుడే వేడి కాఫీ ఉన్న ఫ్లాస్కు తీసుకుని కాణ్హా లోపలికొచ్చేడు.
లిఖిత పరుగున వెళ్లి అతని చేతులు పట్టుకొని “డేడీ మాట్లాడుతున్నారు. డేడీకి స్పృహొచ్చింది”అంది ఆనందంగా.
కాణ్హా పడుకొని ఉన్న కార్తికేయన్ వైపు అపనమ్మకంగా చూశాడు
“ఎవరితో మీనన్, మాట్లాడుతున్నావు?” అనడిగేడు కార్తికేయన్.
“ఎవరో లాబ్ బాయ్. నువ్వు లేచి కాఫీ తాగు” అంది లిఖిత.
కార్తికేయన్ మాట్లాడలేదు.
కాణ అతన్ని లేవదీసి వడిలో తల పెట్టుకొని కాఫీ తాగించేడు.
మరో గంట వరకు అతను అపస్మారకంగానే మాట్లాడుతూనే ఉన్నాడు.
కాలం నిశ్శబ్దంగా భూతకాలంలో వినీలమవుతున్నది. తూర్పువైపు వెలుగు చాయలు క్రమ్ముకోవడం ప్రారంభమైంది.
“ఎప్పుడు తెలవారుతుందా” అని ఆశతో ఎదురు చూస్తున్న లిఖిత విండో తెరల్ని పక్కకి లాగింది. సూర్యుడు భూగర్భం నుండి నారింజ పండులా ఉదయించి పసుపురంగుకి తిరుగుతూ పైపైకి ఎగబ్రాకుతున్నాడు.
సరిగ్గా అప్పుడే ఒక లేలేత సూర్యకిరణం ఆ గాజు కిటికీ ఫలకం మీద పడి వేల కిరణాలుగా చిట్లి వెనక్కు మళ్లింది.
అదే సమయానికి కార్తికేయన్ కళ్లు తెరచి లేచి మంచమ్మీద కూర్చుని ఆ హోటల్ గది నలుమూలల్ని అయోమయంగా పరిశీలించసాగేడు.
లిఖిత ఊపిరి బిగించి అతన్నే గమనిస్తోంది.
కాణ్హా కూడా అతని వైపే చూస్తున్నాడు.
అతను వాళ్లని గమనించకుండా “మీనన్” అన్నాడు.
ఎవరూ జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు.
అప్పుడు పడిందతని దృష్టి లిఖిత మీద.
కన్నతండ్రి చూపుల సారింపుకే పులకించి పోయిందామె మనసు.
“మీరెవరు? నేనెక్కడున్నాను?” అనడిగేడతను లిఖిత వైపు చూస్తూ.
“మీరున్నది కేయూర లాబ్స్‌లో కాదు. కొచ్చిన్‌లో” అంది లిఖిత.
“కొచ్చిన్… కొచ్చిన్‌లోనా.. నేను అవును కొచ్చినొచ్చేను. కాని మున్నార్. . అవును. మున్నార్‌లోని ఆ గుహ… అతను.. అతనేడీ?”అన్నాడతను గతాన్ని కొద్దికొద్దిగా జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ.
“అతనంటే… ” అంటూ ఎదురు ప్రశ్నించింది లిఖిత.
“అదే.. మరణం లేని మంత్రం ఉపదేశిస్తానని ”
“అతను కుక్క చావు చచ్చేడు”
ఆ జవాబు విని ఉలిక్కిపడ్డాడు కార్తికేయన్.
ఆ వెంటనే లిఖితని పరిశీలనగా చూస్తూ”నువ్వెవరివమ్మా?” అనడిగేడు
లిఖిత నీళ్లు నిండిన కళ్లతో కాణ్హా వైపు చూసింది.
కాణ్హా కళ్లలో ఆనందం తొంగి చూసింది.
“ఇంకెందు కాలస్యం. ఆయన పూర్తిగా కోలుకున్నట్లే చెప్పు” అన్నాడు.
“నేనే డేడీ. మీ కూతుర్ని. అమ్మ మిమ్మల్ని తీసుకుని రమ్మని నన్ను పంపించింది” అంది లిఖిత్ ఆనందంతో వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ.
ఒక క్షణం ఆమెవైపు నిర్విణ్నుడయినట్లుగా చూసి”నిన్ను కేయూర పంపించిందా. నువ్వేమన్నావూ? నా కూతుర్నని కదూ. అంటే నువ్వు.. ఇంత పెద్దదానివయి పోయావన్న మాట.” అన్నాడతను వణుకుతున్న పెదవులతో.
లిఖిత తలాడించింది మాటలు దొరకక.
కార్తికేయన్ హృదయం ఆర్ద్రమైపోయింది కూతుర్ని చూసి.
భాషకందని భావాతో ఉక్కిరిబిక్కిరయిపోతున్న అతని హృదయ సంచలనానికి ఎన్నో సంవత్సరాల తర్వాత ఎదుట ఉన్నకన్నకూతుర్ని చూసి ఆనందంతో ఎగసిపడుతూ మనసు చేస్తున్న సంబరానికి అద్దం పడ్తున్నాయతని కళ్లు.
గండి పడిన చెరువులోంచి నీళ్ళు తన్నుకొచ్చినట్లు అతని గుండె ప్రేమతో పొంగులు వారింది.
అతను ఆర్తిగా చేతులు చాచేడు.
ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న ఆమె రివ్వున వెళ్లి అతని చేతుల్లో వాలిపోయింది.
ఆ దృశ్యాన్ని చూస్తున్న కాణ్హా మనసు ఆనంద తరంగాల్లో ఓలలాడింది.
ఇంకా వుంది.

1 thought on “బ్రహ్మలిఖితం 21

  1. మొత్తానికి కూతురికి తండ్రిని అప్పచెప్పారు..మనిషికి మరణమే లేకుండా చేయాలనే పిచ్చి తో సంసారాన్ని గాలికి వదిలేసిన విజ్ఞాన మూర్ఖుడిని కూడా గౌరవించడం కేవలం..రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకే సాధ్యం?! చాలా బావుంది శారద గారూ… అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *