April 25, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “రహస్య స్నేహితులు”

రచన: డా. పి.విజయలక్ష్మి పండిట్

నింగిలోని నిశ్చల సంధ్య కిరణాలు నిశ్శబ్ధంగా నేలతల్లి ఒడిలో వాలి లాలిస్తున్నాయి
తరులను లతలను , గడ్డి పోచలను, కొండ కోనలను. మెడలు వాల్చి పూలు ఆకులు పక్షులు నిదురమ్మ ఒడిలో తూగుతున్నాయి.
అలసిన సూర్యుడ్ని అక్కున చేర్చుకుంది సంధ్య.
కాలమే మైమరచి మమేక మయింది ఆ క్షణాలలో.
అదనుచూసి ఆకుల సందులలో దూరి పరచుకుంటున్న నిశీధి నీడల ఊడలు, నాటుకుంటున్నాయి భూమాత శరీరంలో కర్కశంగా. అంతలో, అలముకున్న చీకటి తెరలను చీల్చుకుంటూ వచ్చాయి పూర్ణచంద్రుడు వదిలిన చంద్రికల శరాలు. జగమంతా వెన్నెల కిరణాల ఆనంద తాండవం . జలదరించి పులకించింది
ప్రకృతి తనువు సమస్తం.
ఆ ప్రకృతి లో భాగమయి తన ఇంటి ప్రక్కన విశాలంగా పచ్చని తివాచి లాగ పరుచుకొని వున్న లాన్ లో కూర్చొని టీ తాగుతూ ఆ క్షణాలలో లీనమై ఆ సంధ్యాసమయానన్ని ఆస్వాదిస్తున్న జయ
తనువు , మనసు కూడా పులకరించింది.
ఆ సంధ్యాసమయంలో చీకటి వెలుగులు ఆడుతున్న దాగుడుమూతలాటగా తోచింది జయకు. ఒకదాని వల్ల మరొకదానికి పరస్పర అస్తిత్వ మన్నట్టు ఉన్నాయి చీకటి వెలుగులు.
ఆ దాగుడుమూతలాటలో పాలు పంచుకొనే సమస్త ప్రకృతి. పగలు రాత్రి కలిసి నడిచిన కాలం ఒక రోజు. ఆ రోజును నిష్టగా నడిపే ఆదిత్యుడు. ప్రతి జీవి జీవితం చీకటి వెలుగుల సమ్మేళనం అన్న జీవితసత్యం గోచరించింది జయకు ఆ సంధ్య సమయంలో.
**
జయ మనసులో ఆ ఆలోచనలు తొంగిచూడడానికి కారణం తన స్నేహితురాలు వసుధ . రెండు రోజుల క్రితమే జయ, జయ భర్త ఆదిత్య , బ్రెస్ట్ క్యాన్సర్ నుండి కోలుకుంటున్న వసుధను చూసివచ్చారు. దాదాపు ఒక సంవత్సరం ఆ క్యాన్సర్ మహమ్మారి చీకటి పంజాలో రేడియో తెరపి, కీమో తెరపితో శారీరకంగా, మానసికంగా అలసిపోయి జీవితాన్ని గడిపి త్వరగానే కోలుకుంది వసుధ.

తను తిరిగి పొందిన జీవితాన్ని గురించి వసుధ చెప్పిన మాటలు మననం చేసుకుంది జయ.
“నా భర్త, పిల్లలు, అత్త మామలతో పాటు నా చుట్టు ఉండి ఏ ఫలాపేక్ష లేకుండ నిస్వార్థంగా నిరంతరం నాకు చేదోడు వాదోడుగా వుండి నాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం , స్పూర్తిని పంచిన నా రహస్య స్నేహితులు ఎవరో తెలుసా జయ?!”అని మరలా కొనసాగించింది వసుధ,
“క్యాన్సర్ దిగులు కమ్మిన నా మనసుకు నేనున్నానని వెచ్చని స్నేహ హస్తాన్ని అందించేవాడు రోజు ఉదయించే సూర్యుడు.
ఆ ఉదయ కిరణాలలో స్నానం చేస్తూన్న నన్ను పలకరిస్తున్నట్టు పచ్చని ఆకుల చేతులనూపే చెట్లు. నా శరీరాన్ని సున్నితంగా తాకుతూ అనునయించే చల్లని గాలి. ప్రేమగా తనువును తడుపే వాన చినుకులు. అనంతంగా పరచుకుని రక్షణ గొడుగులా నేనున్నానని ధైర్యాన్నిచ్చే నీలాకాశం. రాత్రులలో చీకటిని చీల్చుకుంటూ మిణుకు మిణుకు మని మెరిసే నక్షత్రాలు, చంద్రుని వెన్నెల నాలో జీవితాశను నిలబెట్టి, నాకు ధైర్యాన్ని , ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ నన్ను ఆ చీకటికాలం నుండి బయటపడేసింది ఆ రహస్య స్నేహితులే జయా . . ”అని వసుధ చెప్పిన తన అనుభవం జయలో ప్రకృతిమాత పట్ల ఆరాధన భావం మేల్కొంది.
**
“ప్రకృతి పట్ల ఎంత మంచి అవగాహన వసుధది. . ! అని జయ తలుస్తూ . . .
అవును సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చల్లనిగాలి, నీరు , పచ్చని చెట్లు, నీలాకాశం , కొండ కోనలు మనకు తెలియకుండానే మన చుట్టు వుంటూ మనలను కాపాడుతున్న రహస్య స్నేహితులు. ఈ సహజ ప్రకృతి సత్యాన్ని గమనించి, గ్రహిస్తూ ఆస్వాదిస్తూ ఆ రహస్య స్నేహితుల నిస్వార్థ సేవలను స్నేహాన్ని గుర్తించే సమయం లేని ప్రాపంచిక జీవులం మనం.
మనం జీవిస్తున్న భూమాత ఒడిలో అణువణువున అడుగడుగున స్పూర్తిని నింపే మన స్నేహమయ సహజీవులను గుర్తించలేకున్నామనే సత్యాన్ని గుర్తించింది జయ.

భూమిపై జీవులకు వెలుగును పంచే గుణంతో విరాజిల్లే రవి చంద్రులు తారలు, ప్రాణవాయువును ఆహారాన్నందించే పచ్చని చెట్లు, జీవుల దాహం ఆకలి తీర్చే నదులు, కొండ కోనలు అంకిత భావంతో మనిషికి ఆనందమయ జీవితాన్నందించేందుకే వున్నాయా అని అనిపించింది జయకు.

అనాయాసంగా దొరికే ప్రకృతి స్నేహం, చికిత్స పట్ల మనకు అవగాహన లోపించి జీవుల హితాన్ని కోరే ఆ నిస్వార్థ ప్రకృతి స్నేహితుల పరిరక్షణ పట్ల బాధ్యతలేని జీవనశైలి మనది . . , అనే రియలైజేషన్ మేల్కొంది జయలో.

ఇన్నిరోజులు తన రిటైర్డ లైఫ్ ను ఎలా నలుగురికి ప్రయోజనకారిగా, తనకు ఆరోగ్యం ఆనందం, శాంతి నొసగే కార్యక్రమం, వ్యాపకం కొరకు ఆలోచిస్తున్న జయ తన ఫామ్ హౌస్ లో “ప్రకృతి చికిత్సాలయం” నడపాలనే నిర్ణయానికొచ్చింది. అందుకు స్పూర్తి తన స్నేహితురాలు వసుధకు మనసులో ధన్యవాదాలు తెలుపుకొంటూ భర్తకు తన నిర్ణయాన్ని తెలపాలని ఇంట్లోకి నడిచింది.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *