April 24, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 31

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

భగవంతుని సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు, తరించేందుకు ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నది భాగవత పురాణం. భగవంతుని లీలలను పాడుతూ, ఆడుతూ మైమరచి… తానను తానే కీర్తించుకుంటున్నానంతగా భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. భారతదేశంలో భక్తి సామాన్యులకు మరింత చేరువయ్యేందుకు తోడ్పడిన ‘భక్తి ఉద్యమం’లో కీర్తనం ఒక ముఖ్య భాగమై నిలిచింది. భరతఖండంలో మీరా, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని మన తెలుగునాట అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య వరకూ భగవంతుని వేనోట కీర్తించి తరించినవారే. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య బాట అందరికీ మార్గదర్శకమైంది. అన్నమయ్య ఈ కీర్తనలో నాలుక పవిత్రం కావాలంటే ఉబుసుపోని పలుకులు, వాళ్ళ మీద వీళ్ళమీద చెప్పుకునే చాడీలు వద్దు అంటున్నాడు. శ్రీవేంకటేశ్వరుని బహువిధాల కీర్తించినప్పుడు మాత్రమే మనిషి జిహ్వ పవిత్రమౌతుంది అంటున్నాడు.

కీర్తన:
పల్లవి: పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా!
వేవేల కితని నింక వేమాఱునుం బాడి ||పల్లవి||

చ.1.హరినామములే పాడి అతనిపట్టపురాణి
ఇరవై మించినయట్టియిందిరం బాడి!
సరస నిలువంకలాను శంఖచక్రములఁ బాడి!
వరదకటిహస్తాలు వరుసతోఁ బాడి ||పావ||

చ.2.ఆదిపురుషునిఁ బాడి అట్టే భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపుబ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబు కంఠ మంకెతోఁ బాడి ||పావ||

చ.3.శ్రీవెంకటేశుఁ బాడి శిరసుతులసిం బాడి
శ్రీవత్సము తోడురముఁ జెలఁగి పాడి
లావుల మకరకుండలాలకర్ణములు పాడి!
ఆవటించి యితనిసర్వాంగములుఁబాడి ||పావ||
(రాగం:భూపాళం, సం.2.సం.359, రాగిరేకు 173)

పల్లవి: పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా!
వేవేల కితని నింక వేమాఱునుం బాడి

“కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;

దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి”

అని పోతన మహాశయుడు సెలవిచ్చినట్లు మన జిహ్వను జిహ్వ అని పిలవాలంటే పరమాత్ముని శ్రీనాధుని వర్ణించి తీరాలి లేకపోతే అది నాలుకే కాదు. కేవలం పనికిమాలిన కబుర్లు చెప్పడానికి, తినడానికి మాత్రమే పనికి వస్తుంది. అందుకే అన్నమయ్య కూడా “ఓ జీవుడా! నీ జిహ్వతో శ్రీనివాసుని వేవేల కీర్తించి పావనం కారాదా! నీ నాలుకను పావనం చేసుకోరాదా! అని విన్నవిస్తున్నాడు.

చ.1. హరినామములే పాడి అతనిపట్టపురాణి
ఇరవై మించినయట్టియిందిరం బాడి!
సరస నిలువంకలాను శంఖచక్రములఁ బాడి!
వరదకటిహస్తాలు వరుసతోఁ బాడి

ఓ జిహ్వా! నిరంతరం శ్రీహరి నామాలను కీర్తించు. ఆయన పట్టపురాణి యైన ఇందిరను కీర్తించు. ఆ శ్రీహరి శంఖు చక్రాలను కీర్తించు. ఆయన కటిప్రదేశములో నున్న వరద హస్తాన్ని కీర్తించు. ఆవిధంగా కీర్తించి తరించమని మోక్షప్రాప్తిని పొందమని అన్నముని ఉద్బోధ.

చ.2. ఆదిపురుషునిఁ బాడి అట్టే భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపుబ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబు కంఠ మంకెతోఁ బాడి

ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువును ప్రార్ధిద్దాం. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీదేవి ఆయన పాదములను ఒత్తుతుండగా చూచి తరించి కీర్తిద్దాం. పదునాలుగు భువనభాండమ్ములను ఆనందంతో మోస్తున్న ఆదిదేవుని కీర్తిద్దాం. ఆదరంగా శంఖంవంటి కంఠముగల శ్రీనివాసుని చేరి కీర్తిద్దాం.

చ.3. శ్రీవెంకటేశుఁ బాడి శిరసుతులసిం బాడి
శ్రీవత్సము తోడురముఁ జెలఁగి పాడి
లావుల మకరకుండలాలకర్ణములు పాడి!
ఆవటించి యితనిసర్వాంగములుఁబాడి

శ్రీవేంకటేశ్వరుని మనసారా త్రికరణ శుద్ధితో కీర్తిద్దాం. ఆయన శిరసుపై ఉన్న తులసిమాలను కీర్తిద్దాం. విజృంభించి ఆయన వక్షస్థలంపై గల శ్రీవత్సము అనే పేరుగల పుట్టుమచ్చను కీర్తిద్దాం. ఆదేవదేవుని మకరకుండలములను గాంచి కీర్తించి తరిద్దాం. పొందికగా శోభించే ఆయన సర్వాంగాలను కీతించి తరిద్దాం రండి అని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: పావనము = పవిత్రము; జిహ్వ = నాలుక; వేవేల = కొన్ని వేలసార్లు; ఇరవై = సుస్థిరమైన; మించిన = అతిశయించి నిలిచిన; ఇరువంకల = కుడియెడమలనున్న ఆయుధాలు; వరద కటి హస్తాలు = వరద హస్తము మరియూ కటిహస్తము; అంకె = సామీప్యము, వశము; కంబుకంఠము = శంఖము వంటి మెడ; ఉరము = వక్షస్తలము; మకరకుండలము = మొసలి ముఖము వంటి కర్ణభూషణము; ఆవటించు = పొందుపఱుచు, సేకరించు.

-0o0-

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *