April 20, 2024

ఇరుకు

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం.

బంధువుల ఇంట్లో పెళ్ళికి బెంగుళూరు వెళ్ళాను. ఆ పెళ్ళికి చిన్న మామయ్య కూతురు మాధవి వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటిలాగే నిరాడంబరంగా వుంది. ఆప్యాయంగా పలుకరించింది . చిన్న మామయ్య అరుణాచలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన తన అక్కా చెల్లెళ్లను ఆదరించిన తీరు నాకు ఆయన ఎడల గౌరవాన్ని పెంచింది. ఆయనకు వచ్చే జీతం తక్కువ. అయిదుగురు పిల్లలు. కానీ మేమంత మామయ్య ఇంటికి సెలవుల్లో వెళ్ళి వారాల తరబడి ఉండేవాళ్ళం. అత్తయ్య కూడా మమ్మల్ని ప్రేమగా ఆదరించేది. మంచివాళ్ళకు దేవుడే సహాయం చేస్తాడు అంటారు. ఆయన ఎప్పుడో తక్కువ ఖరీదులో కొన్న ఇళ్ళ స్థలాల ఖరీదు బాగా పెరిగి పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు డబ్బుకు ఇబ్బంది లేకుండా ఆదుకుంది .
మా పెద్ద మామయ్య కూతురు వసుంధర కూడా ఈ వివాహానికి హాజరు కావడం వలన తనని కూడా చూసే అవకాశం కలిగింది నాకు. పెద్ద మామయ్య వాళ్ళతో మాకు అంతగా రాకపోకలు లేవు. మామయ్య తరపు వాళ్ళను దూరముగా పెట్టింది ఆయన భార్య. వాళ్ళకు ఇద్దరే సంతానం. భార్య ఆస్తి కూడా కలిసి వచ్చింది మామయ్యకు. బహుశా అందుకే ననుకుంటాను ఇంట్లో ఆవిడ మాటే చెల్లుబాటు అయ్యేది. అమ్మ , మేము పెద్ద మామయ్య ఇంటికి ఒకటి రెండుసార్లు వెళ్ళిన గుర్తు. పెద్ద కూతురు వసుంధర చదువులో రాణించక పోవడం వలన పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసేసారు. బాగా డబ్బున్న సంబంధం.
సంవత్సరాల తరువాత చూస్తున్నానేమో ముందు గుర్తు పట్టలేక పోయాను. బాగా లావయి పోయింది. జరీ ముద్దలా ఉన్న కంచిపట్టు చీర కట్టి, మెడలోను చేతులకు కలిపి సుమారు కేజీ బరువు ఉండే నగలు ధరించి ఉంది. వసుంధర అక్క పెళ్ళికి వచ్చింది గాని నా పెళ్ళికి రాలేదు. తాను అక్క కంటే పెద్దది. అప్పటికే తనకి ఇద్దరు పిల్లలు.
అమ్మ పోయాక మా మధ్యన రాకపోకలు తగ్గాయి.
“బాంక్ లో ఆఫీసరుగా పని చేస్తున్నావుట. పుట్టింటిలో ఉన్నప్పుడు పెట్టుకున్నట్టు తులం బంగారం గొలుసులోనే ఉన్నావేమిటి ? నీ సంపాదన అంతా మీ ఆయన దాచేస్తున్నాడా ఏమిటి.” దగ్గరికి వెళ్ళి పలుకరించగానే నవ్వుతూ అడిగింది. వాళ్ళతో పోలిస్తే మా నాన్నగారి ఆదాయం తక్కువే. అయితే పిల్లలు అందరమూ చదువులో ఎక్కి వచ్చాం.
అక్క పెళ్ళికి వచ్చినప్పుడు చూశాను తనని. చేతుల నిండా బంగారు గాజులు, మెడలో రాళ్ళ నెక్ లేసు, చంద్రహారం, నడుముకు వడ్డాణము పెట్టుకుని, పాతిక వేల ఖరీదైన చీరలో డాబుగా కనబడింది . అయిదేళ్ళ కూతురు తల మీద ముందు వైపు సూర్యుడు, చంద్ర వంక అటు ఇటు పెట్టి మధ్యలో పాపిడి పిందెలు, వెనకాల బంగారు జడ గంటలు, జడలో నడుమ రాకిడి, పైన నాగరం పెట్టుకుని పట్టు పావడలో తెగ తిరిగింది.
నేను చేతికి రెండేసి బంగారు గాజులు, మెడలో ఒంటి పేట గొలుసుతో ఉంటే ‘కాలేజ్ గర్ల్ నని నాజూకు పడుతున్నావా?” అని సాగదీసి వెక్కిరించింది గుర్తుకువచ్చింది నాకు.
తను ఏమీ మారలేదు. నవ్వేసి వూరుకున్నాను.
పెళ్లి కూతురుకి నేను వెండి దీపాలు చదివించాను. ఏదో ఫోటో ఫ్రేమ్ చదివించిన వసుంధర ఆశ్చర్యంగా చూసింది.
నేను వూరికి బయలు దేరుతుంటే అన్నది “ఎంత పెద్ద ఆఫీసరువైనా హైద్రాబాదు వచ్చినప్పుడు మమ్మలిని మరచి పోకు. ఈ సారి మా ఇంట్లో దిగక పోతే ఇంకెప్పుడూ నీతో మాట్లాడను. లంకంత ఇల్లు. ”
వాళ్ళ అమ్మలా కాకుండా. బంధుప్రీతి ఉన్నట్టు వుంది అనుకున్నాను.
” నేరుగా మీ ఇంటికే వస్తాను. సరేనా” అన్నాను.
మాధవీ కూడా హైద్రాబాద్ లో వుంటున్నట్టు చెప్పింది. ఈసారి వస్తే మా ఇంటికి రాకూడదూ” అని అడ్రెస్ ఇచ్చింది. అనుకోకుండా నెల రోజుల తరువాత హైద్రాబాదు వెళ్ళ వలసిన పని పడింది. వారంరోజులు శిక్షణ కోసం ఆఫీసు వాళ్ళు పంపారు. మాకు అక్కడ ఉండే దానికి వాళ్లే ఏర్పాటు చేస్తారు. కానీ నాకు వసుంధర బెదిరింపు గుర్తుకు వచ్చింది. సరే తన పిల్లలను చూసినట్లు అవుతుంది రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉందాం అనుకుని నేరుగా కూకట్ పల్లికి ఆటో మాట్లాడు కున్నాను.
మాధవి ఇంటికి వూరికి వెళ్లే ముందు ఒక పూట వెళ్ళి చూసి బయలుదేరి పోవచ్చును. మాధవి భర్త చిన్న ఉద్యోగంలో వున్నట్టు విన్నాను. ఇద్దరు పిల్లలు. మధ్య తరగతి సంసారం. తన మీద అదనపు భారం మోపడం దేనికి? అనుకున్నాను . అంతే కాకుండా మాధవీ ఏదో యధాలాపంగా రమ్మని పిలిచినట్టు అనిపించింది .
కాలింగ్ బెల్ కొట్టగానే వసుంధరే తలుపు తీసింది. నన్ను చూడగానే ముఖంలో ఆశ్చర్యం కనబడింది .
“ఇదేంటి ఉన్నట్టుండి ఊడిపడ్డావు” అంటూ లోపలికి రమ్మన్నట్టు పక్కకు తప్పుకుంది.
ఏదో శిక్షణ కోసం వచ్చానులే” చేతిలోని చిన్న సూట్ కేస్ హాల్లో సోఫా పక్కన పెడుతూ చెప్పాను .
“మీ శిక్షణ క్యాంపులు అన్నీ ఒక రోజు రెండు రోజులే కదా” అంది. “ఈసారి వారంరోజులు వేశారు.” అన్నాను.
వసుంధర ముఖంలో భావాలు మారాయి.
” ఏదో నా మాట కాదనలేక వచ్చావు గాని మీకు వాళ్ళు ఏర్పాటు చేసిన ఏసీ గెస్ట్ హౌస్ వదిలి రోజు ఇంత దూరం నుండి వెళ్ళి అవస్థ పడతావా ఏమిటి?” అంటూ లోపలికి దారి తీసింది.
ఉండడానికి నాలుగు పడక గదులు , పెద్ద హాలు, విశాల మైన భోజనాల గది , అన్ని సౌకర్యాలు ఉన్న వంటగది ఉన్నాయి గాని ఏమిటో పొందికగా పద్ధతి గా అమర్చి లేవు.
ఒక గదిలో మంచంమీద ఆడ్డ దిడ్డముగా పడుకుని ఉన్న వసుంధర ఇరవై ఏళ్ల కూతురు “తను నా మేనత్త కూతురు. బాంక్ లో ఆఫీసర్ గా చేస్తున్నది.” అని నన్ను పరిచయం చేస్తే కనీసం మర్యాదకన్నా లేచి కూర్చోకండా ఒకసారి నాకేసి చూసి కనుబొమలు ఎగుర వేసి తాను చదువుతున్న హెరాల్డ్ రాబిన్స్ రొమ్యాంటిక్ నవల లో మునిగిపోయింది.
ఇంకో గదిలో మోకాళ్ళ మీద, చీల మండల వద్ద చినిగి ఉన్న జీన్స్ ప్యాంట్స్ పైన ఏదో విచిత్రమైన రాతలు ఉన్న చొక్కా లో ఉన్న పదహారు ఏళ్ల కొడుకు పిచ్చి గంతుల డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నన్ను పరిచయం చేసింది. డ్యాన్స్ ఆపకుండానే హై అన్నాడు. మంచం మీద చిందర వందరగా పడి ఉన్నాయి విడిచేసిన బట్టలు, చదివిన పుస్తకాలు.
వంట ఇంటి లోకి వెళ్ళాక చెప్పింది ” వాళ్ళ నాన్నగారు ముంబై వెళ్లారు. అందుకే ఇష్టారాజ్యంగా ఉన్నారు. ఇద్దరికీ ఇప్పటి కిప్పుడు అమెరికా వెళ్లిపోవాలని ఉంది. “ఆ పిల్ల చదువుతున్నది బి. ఏ అయినా ఏదో అమెరికా సంబంధం చూసి, కట్నం పారేసి చేసేయవచ్చు. కానీ వాడు డిగ్రీ పూర్తి చేసి అదేదో జి ఆర్. ఈ రాయాలంట. ఖర్చుల గురించి బెంగ లేదనుకో.” అంది వసుంధర.
” న్యూ ఇయర్ కి క్లబ్ లో పార్టీలు, పుట్టిన రోజుకి డ్యాన్స్ పార్టీలు …అబ్బో అంతా అమెరికా పద్ధతులే. ఈ నడుమ హాల్లోవీన్ కూడా జరుపుతున్నారు.” ఇండియాలో ఏముంది మమ్మీ దుమ్ము మురికి తప్ప. ఉంటే ఆమెరికాలో ఉండాలి” అంటారు. కాస్త గర్వంగా చెప్పింది.
“ఆయన ఇవాళ ఫ్లైట్ లో వస్తున్నారు. నెలకు నాలుగు సార్లు బిజినెస్ పని మీద ఫ్లైట్ లోనే తిరుగుతుంటారు.” అని చెప్పింది.
శ్రీమంతురాలిని అన్న అహంకారం ఆమె మాటలలో కనబడుతున్నది. అమెరికాలో వున్న వాళ్ళ పిల్లలకు మనదైన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలని శని ఆది వారాలలో ముప్పై మైళ్ళ దూరంలో వున్నగురువుల దగ్గరికి తీసుకు వెళ్ళి కర్నాటక సంగీతం, కూచిపూడి నాట్యం నేర్పించి అరంగేట్రం చేయిస్తున్నారని వింటున్నాము. మన స్వాతంత్ర్య దినం ఘనంగా జరుపుకుంటున్నారు. కొత్త కారు కొన్నా, పుట్టిన రోజు అయినా గుడికి వెళ్లుతున్నారు. ఉగాది , హోలి పండగలు జరుపు కుంటున్నారు. ఇక్కడి వాళ్ళకి అమెరికా పిచ్చి పట్టుకుంటున్నది.” అనుకుంటూ ” నేను స్నానం చేసి వస్తాను. ప్రయాణం వలన చికాకుగా ఉంది” అన్నాను .
” బట్టలు మా గదిలో మార్చుకో. ఆయన లేరుగా. నాలుగో బెడ్ రూమ్ తాను ఆఫీస్ గది లాగా వాడుకుంటూ ఉంటారు. వెనక ఒక గెస్ట్ రూమ్ వుంది . నువ్వు రెండు రోజులు వుంటాను అంటే ఆది వాడుకోవచ్చును. ఈలోపున ఆఫీసు వాళ్ళు ఎవరైనా వస్తేనే ఇబ్బంది. ఏమిటో ఇంత ఇల్లు ఉన్న ఇరుకు అనే అనిపిస్తుంది . ఫలహారం చేసి వుంటావు. వంట మొదలు పెడతాను.” అంది.
నేను స్నానం ముగించి బట్టలు మార్చుకుని వచ్చాను. భోజనాల బల్ల దగ్గర పిల్లలతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ కంచాలలో కావలసినవి వడ్డించుకుని తీసుకు వెళ్ళి టి వి ముందు కూర్చున్నారు హై అన్న ఒక్క మాటతో నన్ను పలుకరించేసి. “మాధవి చిక్కడపల్లి లో ఉందిట కదా. వెళ్ళి చూడాలి ” అన్నాను భోజనం అయ్యాక.
” వాళ్ళ ఇంట్లో వుండాలని అనుకుంటున్నావా ఏమిటి కొంపతీసి? చిన్న ఇల్లు. ఆ ఇరుకులో ఎలా వుంటారో బాబూ నేను అయితే ఒక పూట గడపలేను అలాటి చోట .” అంది వసుంధర ముఖం చిట్లిస్తూ. సాయంత్రం వసుంధర భర్త వచ్చారు. నన్ను పరిచయం చేసింది. ఆయనే అందరికన్నా బాగా నన్ను పలుకరించారు. ” రాక రాక వచ్చారు. మీకు కావలసినన్ని రోజులు ఉండండి . మా గెస్ట్ రూమ్ లో మీకు సౌకర్యంగానే వుంటుంది ” అన్నారు.
ఒక గంట అయ్యాక నేను సూట్ కేస్ తీసుకుని బయలు దేరాను. “రేపు పొద్దున్న ఏడు గంటల కల్లా మేము సమావేశం కావాలి. మాకు బస ఏర్పాటు చేసిన అతిధి గృహం అక్కడికి దగ్గర . నాకు అనుకూలం.” అని చెప్పి.
” అదేమిటి? నువ్వు ఇక్కడే వారం రోజులు వుంటావు అని అనుకున్నాను. అవునులే పెద్ద ఆఫీసరువి. మా ఇళ్ళలో ఎందుకు వుంటావు? “అన్నది నిస్టురముగా.
” మీ ఇంట్లో దిగాను నీ మాట ప్రకారం. ఒక పూట ఉండి అందరినీ చూశాను. నాకు అక్కడ దగ్గరగా ఉంటే సౌకర్యంగా వుంటుంది.” చిరునవ్వుతో చెప్పి బయట పడ్డాను.
నేను ఓలా ట్యాక్సీ కోసం ఫోనుచేస్తుంటే ఇంటి ముందు వాళ్ల కారు, డ్రైవర్ వున్నా అందులో పంపుతాను అనలేదు వసుంధర .
మరునాడు సాయంత్రం మాధవి నుండి ఫోను వచ్చింది. “మీ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తున్నాను ఖాళీగానే వున్నావు కదూ ?” అని అడిగింది. వసుంధర చెప్పిందట నేను వచ్చినట్టు. తాను వాళ్ళ ఇంట్లో వుండమని బలవంతం చేసినా వినకుండా వెళ్ళిపోయానని చెప్పిందట.
సరే కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చునని రమ్మన్నాను. వచ్చీ రాగానే గదిలోని నా వస్తువులన్నీ పెట్టెలోకి సర్దేసింది. “ఇప్పటికీ రెండు రోజులు అయిపోయాయి. కనీసం మిగిలిన అయిదు రోజులయినా నా దగ్గర వుండాల్సిందే . కాదంటే నామీద ఒట్టే ” అంటూ పెట్టె పట్టుకుని గది బయటకు నడిచింది. నా మాట వినిపించుకునే లాగా లేదు. సరే ఒక రోజు ఉండి ఎలాగో నచ్చచెప్పి వచ్చేద్దాము అనుకుని తన వెంట నడిచాను.
చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంది వాళ్ళ ఇల్లు. ఆటో డబ్బులు కూడా నన్ను ఇవ్వనీయ లేదు మాధవి. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురు వచ్చారు పిల్లలు ఇద్దరు. “ఆత్తని. లోపలికి తీసుకు వెళ్లండి” అని చెప్పింది మాధవి.
” మీరు బాంక్ లో ఆఫీసరుగా పని చేస్తున్నారట కదా? మేము మీలాగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అమ్మ ఎప్పుడూ చెప్తుంది అత్తా . మీ పెట్టె మా గదిలో పెడతాను. ” అంటూ లోపలికి దారి తీసారు.
వసుంధర చెప్పినట్టు ఇల్లు చిన్నదే. కానీ ఎక్కడికక్కడ సామాను పొందికగా సర్ది వున్నందున ఇరుకుగా అనిపించదు.
“పిల్లల గది నువ్వు వాడుకో. వాళ్ళు హాల్లో పడుకుంటారు. పోతే నువ్వు నిద్రపోయేదాకా కబుర్లు చెబుతారు. నిన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వరేమో ” అని నవ్వింది మాధవి .
” అవును అత్తా. మీరు కథలు బాగా రాస్తారు అని చెప్పింది అమ్మ. ” అన్నారు వాళ్ళు.
” ఏమిటి నాగురించి వీళ్ళకు చాలా గొప్పగా చెప్పేశావే?” “ఉన్నవే చెప్పానులే . ఏమీ కల్పించలేదు. ” అంది నవ్వుతూ.
మాధవీ వాళ్ళ ఆయన కూడా ఆదరంగా పలుకరించాడు. ” వస్తూ పోతూ వుంటేనే కదండీ బంధుత్వాలు బలపడేది . మేము కూడా ఎప్పుడో విజయవాడ వస్తాము. మీ ఇంట్లోనే దిగుతాము. మీరు మొహమాట పడకండి.” అన్నాడు.
మాధవి నాకోసం ప్రత్యేకంగా ఏమీ చేయ లేదు. ఆర్భాటంగా ప్రేమ ప్రకటించ లేదు. వాళ్ళు తినేదే నాకు పెట్టింది. వాళ్ళ ఇంట్లో మనిషి లాగా చూశారు. అదే నాకు చాలా నచ్చింది. అంత ఆప్యాయంగా వాళ్ళు అక్కడే ఉండిపొమ్మంటే కాదు అనడానికి మనసు రాలేదు.
మధ్యలో వచ్చిన ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్దామని బయలుదేరదీసాను. పిల్లలు చాలా ఉత్సాహంగా తయారు అయ్యారు. పొద్దున్న తొమ్మిది కల్లా బయట పడ్డాము. కాస్త ఖర్చు ఎక్కువ అయినా పరవాలేదని ప్రత్యేకమైన టికెట్లు కొన్నాను. వోల ట్యాక్సీ లో వెళ్ళి ముందుదిగి లోపలికి వెళ్ళాము.
వెళ్ళగానే స్వాగతం చెబుతూ చల్లని పండ్ల రసం ఇచ్చారు మా అందరికీ. అక్కడి నుండి వాళ్లే బండిలో తిప్పి చూపిస్తారు. ఒక పెద్ద భవనం చూపించి అందులో ఒక వైపు కళాశాల- నాయిక నాయకులు ప్రేమలో పడడానికి, మరో ముఖ ద్వారం చర్చ్ / గుడి- పెళ్లి చేసుకోవడానికి, మరో ద్వారం హనీ మూన్ హోటెల్, నాలుగో వైపు హాస్పిటల్ – డెలీవెరీ కోసం అని చెప్పి నవ్వించాడు గైడ్.
బ్రహ్మాండమైన సెట్లు, సినిమా షూటింగ్, జరిపే విధానం చూపించారు. సందర్శకుల నుండి ఒక అమ్మాయిని పిలిచి షోలేలో హేమ మాలిని లాగా తయారుచేసి వేదిక మీద గుర్రాలు లేని ఉత్త బండిలో కూర్చో పెట్టారు. చేతిలోని చెర్నాకోలాతో ముందు వైపు గుర్రాలు ఉన్నట్టు ఊహించుకుని కొట్టమన్నారు. మరో ఇద్దరు పర్యాటకులను వేదిక పైకి పిలిచి ఆ బండిని అటు ఇటు కదప మన్నారు. ఆ వెనక తెర మీద గుర్రాల మీద దుండగులు వెంటాడుతున్న దృశ్యం కనబడుతున్నది. మొత్తం షూటింగ్ చేసి వేరే హాల్లో తెరమీద చూపించారు. అందులో అమ్మాయి బండిలో వేగంగా ముందుకు పోతుంటే వెనుక దుండగులు గుర్రాల మీద వెంటాడుతున్న దృశ్యం కనబడి అందరూ చప్పట్లు కొట్టారు.
ఇంకా ఎన్నో విశేషాలు చూసి స్టార్ హోటెల్ లో భోజనం చేసి, నీళ్ళతో నిప్పుతో చెలగాట మాడిన వాళ్ళను చూసి, మురిసి పోయారు. బాగా అలిసి పోయినా ఒక కొత్త మాయలోకంలోకి వెళ్ళి వచ్చిన అనుభూతి తో బయట పడ్డాము.
“అత్తా! అమెరికాలోని హాలివుడ్ కన్నా మన రామోజీ ఫిల్మ్ సిటీ నే బాగుందని అంటారు కదా” అన్నాడు మాధవి కొడుకు .
“ఏమో. నువ్వు చూశాక చెప్పు” అన్నాను.
“అక్కడ ఆభిప్రాయాలు రాసే పుస్తక లో ఎవరో రాసారు. నేను కూడా రాశాను ఈ స్టూడియో మనవాళ్ళకు గర్వ కారణం. అని అన్నది మాధవి కూతురు. “తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయంను వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ ఓటు వేయమంటే మన దేశంలో ఎక్కువమంది పట్టించుకొ లేదంటారు కదూ . పోయి ఆ వేసవిలో కన్యాకుమారి ,మధురై వెళ్ళాము. ఎంత గొప్ప గుడులు అవి.” మాధవి అంది.
“అవును . చాలా బాగున్నాయి.” అన్నారు పిల్లలు.
ఇంటికి వెళ్ళాక ఆరోజు ఇద్దరు నేను పడుకుంటున్న గదిలోనే పడుకున్నారు. మరునాడు నేను వెళ్ళి పోతానని నాతో కబుర్లు చెప్పాలని. తీరికగా నా ల్యాప్టాప్ లో మా ఇద్దరి పిల్లల ఫోటోలు, మావారి ఫోటోలు చూపించాను వాళ్ళకి.
ఈసారి వాళ్ళను కూడా పిలుచుకు రావాలి”అంది మాధవి.
” అవును అత్తా!”అన్నారు ఇద్దరూ.
“ముందు మీ వారు అన్న మాట ప్రకారం మీరు విజయవాడ రండి. “అన్నాను. ” నేను జి ఆర్ ఈ రాస్తున్నాను అత్తా! మంచి మార్కులు వచ్చి, మంచి యూనివర్సిటీ లో ఉపకార వేతనంతో సీట్ వస్తే నేను అమెరికా వెళ్లే ముందు మీ ఇంటి కి వచ్చి అందరినీ చూసి వెళ్తాను.” అన్నాడు మాధవి కొడుకు. ఆ రాత్రి నాకు బాగా అర్థం అయ్యింది నేను వసుంధర ఇంట్లో ఎందుకు ఉండలేకపోయానో? ఇక్కడ హాయిగా ఎందుకు ఉండిపోయానో! ఇల్లు ఎంత పెద్దది అయినా వసుంధర వాళ్ళకు ఇరుకుగా అనిపించడానికి కారణం తెలిసింది. డబ్బుకు మాత్రమే విలువ నిచ్చే పెద్ద అత్తయ్య పెంపకంలో, బంధుత్వాలకు, బాంధవ్యాలకు చోటు లేని ఆ వాతావరణంలో పెరిగిన వసుంధరకు ఇరుకైన మనసు, సంకుచిత భావాలు ఉండడం సహజ పరిణామమేమో! తన పిల్లలు కూడా అదే రకంగా ఉండడము కూడా వింత కాదు మరి. వాళ్ళ మనసు ఇఱుకు. దృక్పథం కూడా ఇరుకే. అందుకే అక్కడ నాకు ఊపిరి ఆడనట్టు అనిపించింది. ఆప్యాయతకు మారుపేరైన చిన్నమామయ్య, అత్తయ్యల చేతులలో పెరిగిన మాధవి ఇల్లు చిన్నది అయినా మనసు విశాల మైనది. ఆ తల్లి గుణాలే పిల్లలకు వచ్చాయి. అమ్మలాగే వీళ్ళకూ బంధుప్రీతి వుంది. తాము పుట్టిన దేశం మీద గౌరవం వుంది . ఏ దేశానికి వెళ్ళినా ఈ పిల్లలు కొత్తను రెండు చేతులా ఆహ్వానించగలరు. అదే సమయంలో తమది అయిన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించ గలరు. నా సంతానం ఇలా పెరిగితే నేను గర్వ పడతాను. అనుకుంటూ హాయిగా నిద్ర పోయాను.

1 thought on “ఇరుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *