January 27, 2022

కంభంపాటి కథలు – కారులో షికారుకెళ్లే

రచన: కంభంపాటి రవీంద్ర

 

 

“చూసేరా ..మన ఎదురు ఫ్లాట్ లోని ఆనంద్ వాళ్ళావిడికి  కార్  కొన్నాడట”  అప్పుడే తలుపు తీసి లోపలికి వస్తూన్న జగన్నాధ్ తో కుమారి అంది

“ఇంట్లోకి వస్తూనే మొదలెట్టేసేవా?.. వెధవ గొడవ .. ఇంటికి రావాలంటేనే భయమేస్తూంది” అంటూ జగన్నాధ్ విసుక్కున్నాడు

“ మీకు ఇంటికి రావాలంటే భయమేస్తూంటే , నాకు ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తూంది”   బదులిచ్చింది కుమారి

“ అంతేలే.. నేను పోతే తప్ప నీకు ప్రశాంతత దొరకదు.. నేను కూడా దేవుణ్ణి రోజూ అదే దణ్ణమెట్టు కుంటున్నాను  … ఇంక ఈ భూలోకం మీద పోస్టింగు చాలు .. త్వరగా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోవయ్యా బాబూ అని”  అన్నాడు జగన్నాధ్

“ఎవరిని తీసుకుపొమ్మనీ ? నన్నే కదా .. తెలుసులెండి .. మీకు నామీద ఎంత ప్రేముందో”

“నా గురించి చెబితేనే ఆ దేవుడు వింటాడో లేదో డవుటు .. అలాంటిది మళ్ళీ నీ గురించి కోరుకుంటే ఆయన అసలు వినడు”

“ అంటే . ఆ దేవుడు గనక మీ మాట వినేట్టయితే .. నన్ను తీసుకుపొమ్మని కోరుకునేవారన్నమాట .. అంతేలెండి .. మీకు మూడుపూటలా ఒండిపెట్టి , బట్టలుతికి , ఇస్త్రీ చేయించి , మిమ్మల్ని మహరాజులా చూసుకుంటే .. నా గురించి మీరు కోరుకునేదిది … బుద్దొచ్చింది మహాప్రభో .. బుద్దొచ్చింది !”

“ఇన్ని పనులు చేస్తావని గొప్పలు పోతావు తప్పితే, ఇంటికి రాగానే, చేతికి ఇన్ని మంచినీళ్ళిచ్చి కాస్త మెల్లగా కూచున్న తర్వాత మాట్లాడదాం అనే మంచి పని మటుకూ తోచదేం”

“నా ఖర్మ ఇలాక్కాలింది కాబట్టే , నేన్జేసే పనులు కూడా గొప్పల్లాగా కనిపిస్తున్నాయి మీకు”

“ఏదో మాట వరసకి గొప్పలు అన్నాను కానీ ..నువ్వే పనీ చెయ్యడం లేదని నేనన్నానా?”

“మరలాంటప్పుడు .. .. ఏదో ఊరికినే  ఎదురింటాయన వాళ్ళావిడికి కారు కొన్నాడని చెబితే , మీరెందుకూ చిర్రెత్తిపోవడం ?”

“నువ్వేదీ ఊరికే చెప్పవు కదా .. ఆయన ఆవిడికి కొన్నాడు కాబట్టి .. నేను కూడా నీకో కారు కొనాలని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు .. అందుకే కోపం వచ్చింది”

“అయినా నాకు తెలీకడుగుతాను .. నాకు కారు కొనాలంటే , మీక్కోపం ఎందుకండీ?”

“కోపం కాదు.. నన్నర్ధం చేసుకోలేకపోతున్నావని బాధ”

“మిమ్మల్నర్ధం చేసుకోలేకపోవడమేమిటి?.. ఏం నాకు తెలీకుండా అప్పులేవైనా చేసేరేమిటీ ?”

“ఛ ఛ .. అప్పులేమీ చెయ్యలేదు .. కానీ బయట రోడ్లెలా ఉన్నాయో నీకు తెలీదు .. ఎవడిష్టం వచ్చినట్టు వాడు డ్రైవ్ చేస్తాడు .. అసలే నువ్వు అమాయకురాలివి .. అందరూ యములాళ్ళ లా మీదికొచ్చేస్తూంటే నీకు ఏమవుతుందోనని నాకు కంగారు, బాధ .. అందుకే అలా నీమీద ప్రేమ తో కోప్పడ్డానే కానీ .. నువ్వంటే నాకు కోపమెందుకుంటుంది చెప్పు ?”

“నాకు తెలుసండీ .. మీకు నేనంటే ఎంత ప్రేమో .. కానీ ఆ ప్రేమతో పాటు నామీద కొంచెం నమ్మకం కూడా పెట్టుకోవచ్చు కదా .. ఇప్పుడు ఎదురింటావిడ దర్జాగా డ్రైవ్ చేస్తూంటే , నేను వెఱ్ఱి మొహమేసుకుని, ఆవిడ కారు వేపు నోరెళ్ళబెట్టి చూస్తూండడం మీకేమైనా బావుంటుందా ?”

“బావుండదనుకో .. కానీ ఆవిడ వేపు నువ్వలా నోరెళ్ళబెట్టి వెర్రి మొహమేసుకుని చూసే బదులు , మొహం పక్కకి తిప్పుకోవచ్చు కదా ?”

“మరప్పుడు .. ఆవిడంటే నాకు అసూయ అనుకుంటుంది .. అలా అనుకోడం బావుంటుందా ?”

“ఆవిడెలా అనుకున్నా … ఆవిడెలా అనుకుంటుంటుందో నువ్వనుకోడం బాలేదు”

“అవునులెండి .. నేనేమనుకుంటూనే మీకేం .. నాకో కారు మటుకు కొననంటారు”

“అలాక్కాదే .. నీకు డ్రైవింగు కూడా రాదు కదా .. పోన్లే .. ఓ పని చేద్దాం .. నీక్కారు కొంటాను కానీ .. ఒక డ్రైవర్ని పెడతాను ..”

“ఏ వెధవో డ్రైవ్ చేస్తూంటే పక్కన కూచుని నేనెందుకెళ్ళాలీ ?”

“పక్కనే కూచోమనెవడన్నాడు ?.. దర్జాగా వెనక్కాల కూచో”

“సొంత కారుంచుకుని వెనక్కాల కూచోవడమెందుకండీ .. దర్జాగా నేనే డ్రైవ్ చేస్తానంటూంటే ?”

“నీకు డ్రైవింగ్ రాదుగా .. పైగా .. నువ్వు ఈ ట్రాఫిక్ ని తట్టుకోలేవు”

“మన పెళ్లి టైముకి నాకు వంటొచ్చేమిటీ ?.. ఇప్పుడు అదరగొట్టేయడం లేదూ ?”

“అవుననుకో .. కానీ .. నువ్వు వంట నేర్చుకునేలోపు ఓసారి నీ వంటకి ఎంతమంది బలైపోయేరో కూడా ఆలోచించు .. కాబట్టి అదే లాజిక్కు నీ డ్రైవింగ్ కి వాడేవంటే , నిన్ను లోపలేస్తారు”

“మీరేం కంగారు పడకండి .. మన వీధి చివర్న సాయి దివ్య డ్రైవింగ్ స్కూలతని తో మాట్లాడేను .. నాకు డ్రైవింగ్ నేర్పించే పూచీ అతనిది అని గట్టిగా ఒట్టేసి మరీ చెప్పేడు”

“సరే .. ఇంతదాకా వచ్చేక మళ్ళీ నీ సరదా కి అడ్డేయడమెందుకూ ?.. ఏ కారు కొందామనేం ?”

“ఎదురింటావిడ ఐ 10 కారు కొంది .. వాళ్ళాయన కన్నా మీరెక్కువ సంపాదిస్తున్నారు కాబట్టీ , వాళ్ళాయన కన్నా మీరు కట్నం కూడా ఎక్కువ తీసుకున్నారు కాబట్టీ , మీరు ఐ 20 కొనండి చాలు”

“జీతం సంగతి సరే .. ఇప్పుడా కట్నంలో పోలికెందుకు ? అయినా ఆవిణ్ణే అయితే నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునేవాణ్ణి”

“ఏవన్నారూ ??”

“అబ్బే .. ఏమీ లేదు .. ఆవిడతో పోలిస్తే మీవాళ్లు చాలా ఉన్నవాళ్లు కదా అంటున్నాను”

“సరే .. నేను రేపే డ్రైవింగ్ క్లాసులో చేరతాను .. మీరు కారు కొనెయ్యండి ..”

************

“ఇంతకీ నీ డ్రైవింగ్ క్లాసులు ఎంత వరకు వచ్చేయి ?”

“చాలా బాగా చెబుతున్నాడండీ .. ఇవ్వాళ లెర్నర్ లైసెన్సుకి , నా బదులు అతని కుర్రాడి చేతే టెస్టు రాయించేసేడు ..తెల్సా ?”

“అతనెవరో రాస్తే , నీకెలా తెలుస్తుందీ ?.. నువ్వే రాయచ్చు కదా ?”

“అబ్బా .. ఊరుకోండి .. ఆ ఎండలో నేనెళ్లలేను బాబూ .నాకు తెలుసు .. . అయినా నా ప్రాణం సుఖంగా ఉండడం మీకిష్టం లేదు ..”

“అలాక్కాదే .. రోడ్లసరే బావులేవు .. ఎవడిష్టం వచ్చినట్టు వాడు డ్రైవ్ చేస్తాడు .. నిన్నెవరు గుద్దేస్తాడోనని నాకు టెన్షన్”

“మీరు మరీనూ .. నా జాగ్రత్తలో నేనుంటానులెండి .. మీకు నాకేమవుతుందోనని మరీ అంత భయముంటే , ఓ హెల్మెట్టు కూడా పెట్టుకుని డ్రైవ్ చేస్తాను లెండి”

“హెల్మెట్టు పెట్టుకుని డ్రైవ్ చెయ్యక్కర్లేదు కానీ .. జాగ్రత్తగా అన్నివేపులూ చూసుకుని మరీ డ్రైవ్ చెయ్యి .. ఏ వెధవ ఎటువేపునుంచి గుద్దేస్తాడోనని నాకు టెన్షన్”

“ఈరోజుల్లో ఆడవాళ్లు కూడా అంత భయపడడం లేదు .. ఇంక ఊరుకోండి .. నాకేమీ కాదు”

**************

“ఏవండీ ….”

“ఏమైంది ?…ఎవరైనా నీ కారు గుద్దేసేరా ?.. ఎలా ఉన్నావు ?.. నీకేం కాలేదు కదా .. మాట్లాడవేం ?”

“నాకేమీ కాలేదండీ ..”

“మరి ?.. ఎవడైనా మన కారుని గుద్దేడా ?.. నువ్వేం కంగారు పడకు”

“మన కారుని ఎవరూ గుద్దలేదండీ .. మీరు చెప్పినట్లే , నాలుగువేపులా చూస్తూ డ్రైవ్ చేసేను”

“నాకు తెలుసు .. నువ్వు నా మాట వింటావని .. కానీ ఆ మాటల్లో కంగారెందుకు ?”

“మీరు చెప్పినట్లే నాలుగు వైపులా చూస్తూ కారు నడుపుతూ , ముందు వేపు చూడ్డం మర్చిపోయేను .. ఆ మర్చిపోడంలో మా డ్రైవింగ్ స్కూలు ఓనరుగారిని గుద్దేసేను .. ఆయన అన్నీ నేర్పించేడు కానీ ఎవర్నైనా గుద్దేస్తే ఏం చెయ్యాలో నేర్పించలేదు చూడండి .. ఫీజు మటుకు మొత్తం పుచ్చేసుకున్నాడు !”

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *