March 29, 2024

కౌండిన్య హాస్యకథలు – అట్ల దొంగ

రచన: రమేశ్ కలవల

 

ధీవర .. ప్రసర సౌర్య భార .. అని బ్యాగ్ గ్రౌండ్ లో సాంగ్ వినపడుతోంది. ఎత్తుగా ఉన్న గోడ మీదకు దూకి ఆ ఇంట్లోకి ఇట్లా చొరపడి అట్లా పట్టుకెళ్ళాడు. వచ్చింది ఒక్కడే కానీ వెళ్ళేటప్పుడు నలభై మంది వెళ్ళిన శబ్థం వచ్చింది. అతనే ఆలీబాబా అట్లదొంగ!

ప్రతీ సంవత్సరం అట్లతద్ధినాడు మాత్రమే దొంగతనం చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. అసలు చిక్కితేగా అడగటానికి? మొదటి సంవత్సరం భార్యలు ఏ కాకో, పిల్లో ఎత్తుకుపోయాయిలే అనుకున్నారు, వచ్చే సంవత్సరం కిటికీలు, తలుపులు గట్రా వేసుకొని జాగ్రత్త పడతార క్షమించమని దేవుణ్ణి ప్రార్థించారు. రెండో సంవత్సరం కూడా అలా జరగడంతో జంతువుల మీద అనుమానం పోయి భర్తల మీద పడ్డారు. అదీ కూడా కాదని తెలుసుకొని పశ్చాత్తాప పడి ఏదో పూర్వ జన్మ పాపాల వల్ల ఇలా జరిగిందేమో, వచ్చే ఏడాది జరగకుండా చేస్తే ఓ ఐదు ఎక్కువ అట్లు పంచుతానని ఒట్టేసుకున్నారు. ఇక వరుసగా మూడో సంవత్సరం కూడా జరగడంతో అదొక సంచలన వార్తగా తయారయ్యింది. ఇక పనిలోని టివీ ఛానల్సు వారు వేరే గ్రహాల ఏలియన్స్ ఈ దోసెలకు అలవాటుపడుంటాయి అంటూ బ్రేకింగ్ న్యూస్ మీద బ్రేకింగ్ న్యూస్ లు ఆ ఆకాశం కేసి చూపిస్తూ, ఏం కనిపించినా ఫోన్ కానీ ఎస్ యం యస్ చేయండంటూ ఓ సంచలనం సృష్టించారు.

మళ్ళీ ధీవర.. ప్రసర సౌర్య భార .. ఉత్సర.. స్థిర గంభీర ..అంటూ బ్యాగ్ గ్రౌండ్ లో వినిపించింది. ఎత్తైన గోడ మీదకు దూకాడు, ఆ డాబా మీద హారతి ఇస్తుంటే తనను పిలిచిన వాడిలాచెయ్యి జాపి బ్యాలెన్సు తప్పి బొక్క బోర్లా పడి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడ్డాడు.ఆ పడటంలో ఆయన దొంగలించిన అట్లు కొన్ని ఆ అమ్మాయి పట్టుకున్న ప్లేటులో పడటంతో అంతా భగవంతుడి లీల అనుకుంది పిచ్చిపిల్ల. ఆ పడిన ఓ అట్టు తుంచి నోట్లో పెట్టుకోబోతుంటే ఆపి తన సంచి లోంచి ఓ క్రిస్పీ దోసె తీసి ఇచ్చాడు. అది ఆస్వాదిస్తూ తింటూ మీరెవరు? అని అడిగింది. ఆలీబాబా, అట్లదొంగ అని నోరు జారాడు.  అమ్మ దొంగా, మీరెనా క్రిందట సంవత్సరం నా అట్లు దొంగలించింది? చిలిపి అంటూ కిందటి ఏడాది అట్లన్నీ పల్చగా రావడంతో ఏ గాలికో ఎగిరిపోయాయని ఎంత బాధపడ్డానో తెలుసా? అందుకే ఈ సారి దిబ్బరొట్టెలేసాను అంది. అబ్బచా! అట్లతద్దినాడు దిబ్బరొట్టెలేంటమ్మా, పాడు! అన్నాడు అదికాదులే ఆలీబాబా, ఈ సంవత్సరం కూడా నీళ్ళు ఎక్కువయ్యి రుమాలీ రోటీ లాగా వచ్చాయిలే అంది. ఏది ఇందాక ఇచ్చిన ఆ క్రిస్పీ దోసె ఇంకోటి ఇవ్వు అట్లా కూర్చొని మాట్లాడుకుందాం అంది ప్రేమగా. ఆమ్మో, ఇంకా చాలా ఇళ్ళు వెళ్ళాల అన్నాడు. ఈ సంవత్సరం ముహూర్తం కొంచెం లేటు ఆలీబాబా, నీకు తెలీదా? అంది. అవునా? నా ఫోనులో తిది, గ్రహణం చెప్ప్ ఆప్ సరిగా పనిచేయలేదు అన్నాడు. నే చెప్తాగా కూర్చో అంటూ ఆ మొహానికి గుడ్డ తీసేయ్ ఊపిరాడకుండా అంది. అమ్మో, గుర్తుపట్టేస్తావేమో? అన్నాడు. పోనీలే వద్దులే అంది. సరేలే నువ్వెవరికీ చెప్పేదానిలా అనిపించడం లేదు అంటూ తన ముసుగు తీసాడు. అబ్బా! ఎంత అందం ఆలీబాబా అంది. కందగడ్డలా అయ్యింది మొహం సిగ్గుతో. ఇంకో దోసె ఇవ్వు అంది. ఇచ్చి ఇదే లాస్టు అన్నాడు అట్టు ఇస్తూ. ఛీ పో అంది తను.

అట్టు తింటూ ‘అవునూ, ఇలా ఎంత కాలం దొంగలా ఇళ్ళ వెంట తిరుగుతావు ? అని అడిగింది ఆలీబాబా సొట్ట బుగ్గ నిమురుతూ. సంవత్సరానికి ఒక్క రోజే కదమ్మ! అన్నాడు. పోనీలే అంది, అయినా ఇలాంటి పనిచేయవలసిన అవసరం నీకెందుకురా? అంది ఈ పని ఎందుకు చేస్తున్నాడో రాబట్టడానికి. ఓస అదా అని తెప్పబోతూ భోరున ఏడ్చాడు చిన్న పిల్లాడిలా, తల్లిలా దగ్రరకు తీసుకొని ఓదార్చింది. వెనక్కు నెట్టి ఏం సెంటు నువ్వు రాసిందని అడిగాడు. కళ్ళు పెద్దవి చేసి బావుందా పండగ స్పెషల్ అచ్చం అట్ల వాసన వొస్తోంది కదూ అంది. కొంచెం వెనక్కు జరిగి ఇదిగో అట్లని అవమానిస్తే నాకు చిరాకు, అన్నాడు. సరే ఇందాక ఏదో చెబుతున్నారు అని మళ్ళీ గుర్తు చేసింది. భోరున మళ్ళీ ఏడ్చి తన చీర కొంగుతో తుడుతుకుంటూ ‘ అసలు ఏమయ్యిందంటే? ఆ సంవత్సరం అట్లతద్దినాడు కరెంట్ పోయి గుడ్డి దీపంలో ఇంట్లో నేను పెట్టిన తెల్ల పేయింట్ తో ఓ రెండు గంటలు కష్టపడి దోసెలు వేసింది. నేను ఆఫీసు నుండి రాగానే నా చేత చీకట్లో అదోలా ఉన్నాయి అంటున్నా వినకుండా తినిపించింది. అన్నీ తిన్నతరువాత కరెంటు రాగానే నేను తను చేసింది పిండితో కాదని చూపించగానే, మళ్ళీ కడుపులో ఏదైనా అవుతుందని నా ముక్కు మూసి ఆ పక్కనున్న కిరోసిన్ నోట్లో పోసింది. అప్పటి నుండి ఇంకెవరి ఈ పరిస్థితి రాకుడదని నే అట్ల దొంగగా మారాను’ అన్నాడు. అమ్మో, ఎంత విషాద గాధో! అంటూ ఆలీబాబా సంచిలో ఇంకో అట్టుకోసం చేయి పెట్టింది. తన చేతిమీద ఒక్క చిన్న దెబ్బేసాడు ఇంకా దుఃఖం పోక.

ధీవర.. ప్రసర సౌర్య భార .. ఉత్సర.. స్థిర గంభీర .. అంటూ ఫోన్ రింగుటోను తో మ్రోగింది. అరే! నీ టేస్టు నా టేస్టు ఒకటేనే. ఇద్దరిదీ ఒకటే రింగుటోను! అన్నాడు. ఆమె ఆ ఫోన్ ఎత్తి ‘ ఇతడే. నే కలగన్న నా ప్రియుడు నా మదిలోని మన్మధుడు ‘ అంటూ ఓ చరణం పాడి పెట్టేసింది. ‘సీక్రెట్ కోడామ్మ బుజ్జి! ‘ అని అడిగాడు. ‘అవును ఆలీబాబా మా ఆయన ఇంటికి వచ్చే ముందు ఓ రింగు ఇస్తాడురా! అంది ముద్దెక్కువై.

ఇంతలో పోలీసు వ్యానుల సైరన్లు, మీడయా వ్యానులు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. మైకులలో ‘తప్పించుకోవడం అట్లు తిన్నంతా సులువు కాదు, కాబట్టి మర్యాదగా లొంగిపో’ అంటున్నారు. ఆ అట్లసంచిలో ఆఖరి క్సిస్పీ దోసె తీసుకొన ఆ దోసెల సంచి అక్కడ పాడేసి వీడుకోలు చెప్పి చిటికలో గాలిదుమారంలా మాయమయ్యాడు మన ప్రియమైన ఆలీబాబా అట్లదొంగ.

ఆ అట్ల సంచి ఆమె పక్కన ఉండటంతో ఆమే ప్రతి ఏటా చేసే దొంగ అనుకొని మీడియా తెగ వీడీయోలు తీస్తుంటే కోపంతో  అట్లు కొమెరా మీదకు విసిరింది. అసలే దొంగ తప్పించుకున్నాడని చిరాకుగా ఉంది అని అరిచింది. మీడియా రిపోర్టర్లు ‘ఇంతకీ మీరెవరూ?’ అని అడిగారు. ‘నేను

అట్లదొంగ ఆలీబాబా లో ప్రేమలో పడ్డ..’ అనబోతూ నాలుకు కొరుక్కొని ‘ఆలీబాబా అట్లదొంగ సమాచారం అందించిన అట్ల సువాసనలొచ్చే డిటెక్టివ్ గంథం బుడ్డిని ‘ అంది

‘అదండీ సంగతీ! దీన్ని బట్టి ఈ ఈరోజు మనకు తెలిస్ందేంటంటే ఏలియన్స్ అట్లు ఇష్టం లేదని… ఓవర్ టు యు’ అని మేడమ్ ఓ దోసె ఇస్తారా? మీ వార్త అందేసరికే సగం తింటున్నవాడిని కాస్తా పరిగెత్తుకు రావాల్సివచ్చింది అన్నాడు.

ఆ సంచి ఇచ్చి, ఎంజాయ్! అంది. ఆలీబాబా మాయమయ్యన దిశగా చూసింది!!

 

1 thought on “కౌండిన్య హాస్యకథలు – అట్ల దొంగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *