March 29, 2024

గిలకమ్మ కతలు – గిలకమ్మ పందేరం. ఆహా..! ఏమి యవ్వారం.

రచన: కన్నెగంటి అనసూయ

యేగోరింట్లో పిల్లోడ్ని పెళ్ళి కొడుకుని సేత్నారంటే అయ్యాల తెల్లారగట్తే లేసి పన్జేసుకుంది సరోజ్ని.
మల్లీ ఎండెక్కితే కుదరదని పిల్లలు నిదళ్ళు లేత్తాకి ముందే తలిప్పి సిక్కుల్లేకుండా దువ్వెన్తో దువ్వి..తల్నిండా నూనెట్టి మరీ పైకి ముడెట్తేసి..బాగా మసిలి,మసిలీ పొగలొచ్చేసిన రాగి బిందెడు నీళ్లతో నీళ్ళోసేసుకుని ఏదో పాత సీరుంటే సుట్తబెట్టి బీరువాలోంచి పగడాల గొలుసుదీసి మెళ్ళో ఏసుకుని అద్దంలో సూసుకుంది.
సూత్రాల గొలుసునీ, నల్లపూసల గొలుసుని అంతకు ముందురోజే కుంకుడుకాయల పులుసులో నానేసి మరీ తోవిందేవో..పగడాల దండ జతసేరే సరికి నిగనిగలాడిపోతన్నాయ్ అనుకుంది అద్దంలో అదే పనిగా తనని తాను సూసుకుంటా..
అక్కడకా పనయ్యాకా పిల్లల్ని నిద్దళ్ళు లేపి మొకాలు కడుక్కు రమ్మని రాత్రన్నం ఉంటే అందులో కాతంత పెరుగు గుమ్మరిచ్చి, సిటికెడుప్పేసి ఆవకాయ బద్ద అడ్డేసిందేవో ఆవురావురుమంటా తిని బళ్లోకి లగెత్తేరు ఆళ్లిద్దరూ.
ఆళ్లనలాగంపి “ అమ్మయ్యా..వానెలిసినట్టుంది..” అని మనసులో అనుకుంటా…మొగుడు పొలాన్నించి తిన్నగా అటే వత్తాననేతలికి సాకలోడు నున్నగా సేసిన ఇస్త్రీ జత ఏస్కున్నాకా బొంత రుమాలు భుజాన్నేసిందేవో..అతనలాగెల్లేకా తలుపులు గడెట్టి ..తీరిగ్గా సేతికున్న మట్టిగాజులు తీత్తా..
“ స్సూరేకాంతవా..ఏకాడున్నా? పనయ్యిందా? ఏగోరింటికి..భోజనానికెల్లాలిగందా! ఎన్నింటికెల్దాం..?”
గోడ మీంచే కేకేసింది సరోజ్ని..
“ ఇంకో అరగంటడతాది. నీదో..? మియ్యన్నయ్య..రాత్రినించీ అక్కడే ఉన్నారుగదా. తెల్లారగట్టొచ్చి నీళ్లోసుకునెల్లేరు. నేనింకా తానం సెయ్యాలంతే..నీదైపోయిందా?”
“ ఆ..అయినట్టే. పిల్లజెల్లా బళ్లకెల్లి ఇల్లు కాలీ అయ్యేతలికి ఇదిగో..ఇయ్యాలయ్యింది. “ అంది అంతకు ముందే బీరువాలోంచి తీసి పక్కనెట్టుకున్న బంగారు గాజుల్ని మట్టిగాజుల్తో కలిపి అదొకటీ, ఇదొకటీ ఉండేట్టు చూసి చెరి సగం గాజులు చేతికి తగిలిచ్చుకుంటా.
అరగంటన్నమడిసి గంటైనా గుమ్మం తలుపు తెరవలేదేవో.. వాకిట్టో కూకుని ఒకటే తీపులు బోయింది సరోజ్ని..పేరంటాల్లు ఎల్లే వాల్లు ఎల్లకుండా..”య్యే..ఎవ్వరికోసం సూత్నా..రా..ఎల్ధాం. పొద్దెక్కింది” అనేతలికి.
“ మొగుడెప్పుడో తెల్లారగట్టే వచ్చి నీళ్ళోసుకునెల్తే..ఇయ్యేల్దాకా ఏంజేసిందో ఈ ఇల్లాలు..” అనుకుంటున్నంతలో..తాళం కప్ప సేత్తో పట్టుకుని రానే వచ్చింది సూరేకాంతం బయటికి.
ఈల్లెల్లేతలికే కిటకిటలాడిపోతంది పెళ్ళోరిల్లు. పందిట్లో మగోళ్ళున్నారని దొడ్డి తలుపులు తీసుండేతలికి అటేల్లేరేమో..మంచాల్నిండా, బల్లల్నిండా,వసారాల్లోనూ, సెట్లకిందా , సాపలెసుకుని ఎక్కడ సూసినా ఆడోళ్లే.
“ బాగున్నారా? ఎప్పుడొచ్చేరు? పిల్లలు బాగా సదుంతున్నారా? పిల్ల పెద్ద మనిసయినట్టుంది గదా..?” లాంటి ఊసులే ఎక్కడ సూసినా.. అయ్యన్నీ ఇంటా మనసులోనే నవ్వుకుంది సరోజ్ని.
“ బంతి కాలీ అయ్యిందంట భోజనాలకి రమ్మంటన్నారు “ అనేతలికి ఒకటే కోలాహలం కోళ్ల గంపని పైకెత్తితే ఒక్కసారిగా తొసుకుంటా, పోటీ పడి బయటికి పరుగులెత్తుతున్న కోళ్లల్లాగా. తోపులాట కూడాను.
“ ఇక్కడ కూకుందాం రా..ఎలాగా బంతయ్యేతలికి అరగంటన్నా పట్టుద్ది “ అంది సరోజ్ని సూరేకాంతానికేసి సూత్తా..బంతిలో కూకుంతాకెల్లినోల్లతో ఖాలీ అయిన కుర్సీల్లో ఒక దాన్లో కూకుంటా..
“ లేదు..బేగినే వడ్డిచ్చేత్తన్నారు. మనోళ్లుగాదు వడ్డిచ్చేది. ఎవుళ్లనోదీసుకొచ్చేరుగదా బయట్నించీ..ఎంతోగానీ తీసుకుంటారంత. కమలమ్మంది..అందరికీ అన్నీ ఏత్తారంట మర్సిపోకుండాను. మనోళ్ళైతే అదావిడి సేసేసి తత్తరబిత్తరలాడిపోతా ఒకటేత్తే ఒకటెయ్యరని మర్సిపోతారని. ఒక్కగానొక్క ముండగాడు. ఆడికన్నీ సరిగ్గా జరపాపోతే మీ తాతూరుకోండుగదా.. మాటరాగూడదు. అంతుకని. ” అంది ..పిల్లోడి నాయనమ్మ. ఆవిడకి మోకాళ్లు నొప్పులు. నడవలేదని కుర్చీ తెచ్చి కుదేసేరందులో. అంతుకే ఆవిడికి దగ్గర్లో ఎవరు కూకుంటే ఆల్లతో ఇయ్యే కవుర్లు. వడ్డిత్తాకి అలా మడుసుల్ని పొరుగూర్నుణ్చి తెత్తం గొప్పగా సెప్తా.
“ పర్వాలేదులే.. మామ్మా..! ఒక నిమిసం ఆలీసం అయితే మాత్తరం పొయ్యేదేటుందిలే. ఇంటికెల్లి పడుకుంటవేగా ..నీకొంట్లో బాగుంటందా” సాగదీసింది సరోజ్నీ.
“ ఆ..ఏంబాగు? నా బాగే అడిగేవా? ఇదిగో ఇలాగే. మండాపరోల్లాగా ..ఎక్కడో ఓసోట కుచ్చీలో కుదేత్తారు. లేపే దాకా లెగలేను. ఒహటే నెప్పులు అమ్మా..యా..”
“అదే ..మామ్మా..డాట్టర్లేవో తగ్గమంటారు..” పరాగ్గా అంది సరోజ్ని..అందరి సీర్లొంకా ఒకర్ని మార్సి మరొకరొంక అదేపనిగా సూత్తా.
“ అదే గదా సావొచ్చి పడింది….! తగ్గితే బాగానే ఉండును..మరి ఏంజేత్తాం. నొసట్న..ఇలా రాసుంటే ”
ఆవిడ మానాన ఆవిడ సెప్పుకుని పోతానే ఉంది. అయ్యన్నీ పెడ సెవిని ఇని ఊకొడతా..అందర్నీ కలయసూత్తందేవో సరోజ్ని, భోజనం సేసేసి తాంబూలం తీసుకుని లోపల్నించి బయటికొత్తన్న లక్ష్మి మాస్టార్నిసూసేతలికి పేనం లేసి నిలబడ్దట్తయ్ కూకున్నదల్లా గబుక్కున లేసి..
“లచ్చింమేస్టరుగారొచ్చేరు..పలకరించొత్తానుండు..” అంది సూరేకాంతం భుజమ్మీద సేత్తో తట్టి ఇప్పుడే వత్తానుండే, నేనొచ్చేదాకా భోజనానికెల్లకు అన్నట్టు.
”యావండీ…. బాగున్నారాండీ ..! “ అంది సరోజ్ని..ముకంనిండా ఇంతానందాన్ని పులుముకుని ..లచ్చిం మేశ్తారికెదిరెల్లి.
ఆ సుట్తుపక్కలా కూకున్నోల్లంతా ఈల్లిద్దరొంకే సూత్తం మొదలెట్టేరు..
“ నమస్తే! బాగున్నానమ్మా..! మీరెలా ఉన్నారు? “ అన్నారావిడి సరోజ్నినే సూత్తా..
ఆవిడా ఊరి స్కూల్లో పన్జేత్తారు. గిలకమ్మ టీచరు.
“ బాగున్నానండి. మాగిలక్కెంతిస్టవోనండి మీరంటేని. అంతమానూ “ లచ్చిమ్మేష్టారు లచ్చిమ్మేశ్టారంటా నోరు కాయదండి..” అంది సరోజ్ని మెలికలు తిరిగిపోతా..!
పక పకా నవ్వేరు లచ్చిమ్మేస్టారు సరోజ్ని మాటలకి.
కాసేపు గిలకమ్మ కబుర్లయ్యాకా ఎల్లొత్తానని దొడ్డి గుమ్మంకేసి నడుత్తా అంతలోనే ఏదో గేపకవొచ్చినట్టు ఎనక్కి తిరిగి రెండడుగులేసి సరోజ్ని దగ్గరకంటా వచ్చి ..
“ మొన్న మీరిచ్చారని వంకాయలు తీసుకొచ్చింది గిలక. అప్పుడే తోట నుండి కోసారేమో..నవనవలాడిపోతున్నాయ్. మీ తోటలోవట కదా! పాలుపోసి వండితే ఎంత రుచిగా ఉందో కూర. ధేంక్సమ్మా.” అంది ఇంత మొఖం సేసుకుని లచ్చిమ్మేస్టారు..వెనక్కి తిరుగుతా..
“ ఆ..దాన్దేవుందిలెండి…మీకు ఇట్టవని సెప్పిందండి మా గిలక..” అందిగానీ మొగమాటానికి..రత్తం సుక్కుంటే ఒట్టు సరోజ్ని మొకంలో. ఏం సెయ్యాలో తెలవక గుడ్లప్పగించి సూత్తా ఉమ్దిపోయింది ఆమె గుమ్మందాటేదాకా.
అది ఇని అప్పటికే పెడమొకవెట్టేసింది సూరేకాంతం..
” గోడపక్కనున్నదాన్ని నాకివ్వకుండా ..మేస్టారికంపేవా? ఆవిడెక్కువైపోయిందా నీకు? దేశదిమ్మరోళ్ళాళ్ళు. ఇయ్యాలిక్కడుంటారు. రేపు మరోసోటుంటారు. ఎల్లకాలం నిన్నిడిసిపెట్టకుండా ఉండేదాన్ని నేనేనే సరోజ్ని. నువ్వెంత నా కాడ్నించి దాద్దావన్నా, ఇలా బయటికొత్తానే ఉంటది. మంచోల్లని మోసం సెయ్యనివ్వడా పైవోడు. ఎంత సేద్దావనుకున్నాగానీ..” అని మనసులోనే అనుకుంటా..
కాల్లూ, సేతుల్లో ఒకటే వనుకు సరోజ్నికి.
ఇంటికొచ్చిందిగానీ కాలుగాల్న పిల్లలే ఆ సివర్నించి ఈ సివరికీ, ఈ సివర్నించి ఆ సివరికి తిరుగుతానే ఉంది మనసు మనసులో లేక. రేపటేల్నించీ సూరేకాంతం దెప్పే దెప్పుళ్లకి అంతూ పొంతూ ఉంటదా? అననుకుంది తన్లో తనే. అయినా పచ్చిమిర్గాయలేటి, కందదుంపేటి? పెండ్లం దుంపేటి సేలో ఎయ్యి పండితే అయ్యి మొదటేల తలుపుగొట్టి మరీ ఇత్తాది పాపం. అలాటప్పుడు బాధుండదేటి? ఉంటది. నిజవే. అయినా..
తిడితే తిట్టిందిలేగానీ..ఈ కుర్రముండకేం పొయ్యాకాలవొచ్చిందో..! వంకాయలట్టికెల్లి మాయమ్మిచ్చిందని సెప్పుద్దా? ఆలీ లేదు సూలీ లేదు కొడుకుపేరు సోవలింగవన్నట్టు సేలో వంగమొక్కలే ఎయ్యనప్పుడు ఇదెలాగిచ్చింది అట్టుకెల్లి? పైగా నేనిచ్చేనని సెప్పుద్దా? నేనంపలేదని ఆవిడకాడంటే గిలకమ్మ పరువెల్లి గంగలో కలుత్తాదని మాట్టాడలేదు గానీ..అమ్మో..అమ్మో…ఇదెన్ని నేర్సింది?
ఇయ్యాల ఇదయ్యింది. రేపు ఇంకోటవ్వుద్ది. అంతుకే ఇయ్యేలే తేల్సెయ్యాలి దీని సంగతి? అసలా వంకాయలేటి? నవనవలాడతవేటి? గిలకట్టికెల్తవేటి? నేనిచ్చేనని సెప్తువేటీ? ఏటిది?
సరోజ్ని ఆలోసన్లిలా ఉంటే ..
లచ్చిం మేస్టారు ఇంటికెల్లే తలికే బళ్లోంచి వచ్చి ధిలాసాగా పడక్కుచ్చీలో కూచ్చునున్నారేమో.. లచ్చిం మేస్టారుగారి భర్త శివరామయ్యగారు..కాసేపటికి సిన్న గిన్నెతో తెచ్చిన ఏయిచ్చిన తాళింపు శెనగల్ని..నోట్లో ఏసుకుంటా..“ పేరంటానికెళ్ళొచ్చావా? “ అనేతలికి..
” ఆ..వెళ్ళేను. అంతా మిమ్మల్నే అడిగారు మాస్టారు రాలేదా మేడమ్..” అని అంది లచ్చింమేస్టారు.
“ అవున్లే ..ఎన్నాళ్లయ్యింది మరి..! అయిదారేళ్లు పైనే అయ్యిందిగదా.. మనం ఈ ఊరొచ్చి “ అన్నాడాయన శెనగల్ని నవుల్తూ..
“ పైమాటేగానీ..! పెళ్ళివాళ్లింట్లో గిలకా వాళ్లమ్మగారు కనపడ్దారు. వంకాయలు చాలా బాగున్నాయని చెప్పాను..”
“ కొంప ముంచేసావ్? నేను చెప్పాను కదా నీకు. గుర్తులేదా? ఆ రోజు నాకు సెంటర్లో..కూరగాయలోడి దగ్గర వంకాయలు ఏరుతూ గిలక కనపడిందనీ, చిన్న పిల్లైనా చాలా బాగా ఏరిందనీ..అవే మనకు తెచ్చి ఇచ్చినట్టుందనీ..” విసుక్కున్నాడు శివరామయ్య పెళ్ళాం మీద.
“ అవుననుకోండిగానీ..మొదట్లో మనమనుకున్నట్టు చెప్పద్దనే అనుకున్నా. కానీ వాళ్లకీ తెలియాలి కదా ఈ పిల్ల ఏం చేస్తుందో? ఇచ్చిందని తీసేసుకుని తినేస్తే…ఇల్లాగే రేపు ఇంకొకటి చేస్తుంది. అటు చెప్పినట్టూ కాకుండా..అలా అని ఇటు కృతజ్ఞతలు చెప్పినట్టూ ఉంటుందని ఎందుకైనా మంచిదని..చెప్పాను. అయినా ఆవిడ నిజంగానే పంపి ఉంటే కనీసం తలపెట్టలేదు చూశావా అనుకోరూ..ఆవిడ.? అందుకే చెప్పాను. అయినా..మీరంటున్నారుగానీ అక్కడ ఏరుతుందని, వాళ్ళమ్మగారైతే పంపానన్నట్టుగానే నవ్వారే..ఏమో..! ”
“ ఏదో నువ్వంటే..ఆ పిల్ల ముండకి ఉన్న ఇష్టం కొద్దీ ఏదో ఒకటి నీకు తెచ్చివ్వాలి అనుకుంటుందనుకో. టీచర్లుగా మనకివి మామూలేగా పూలో, పళ్ళో, పాలో , పెరుగో..ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు. అలాగే పంపిందనుకుని నువ్వనుకున్నావ్. నేను చూడబట్టి, చూసి నీకు చెప్పబట్టీ తెలిసింది. లేదంటే మనకీ తెలియదు కదా.. కొనుక్కుని తీసుకు వచ్చిందనీ ! ఏం లేదు. చిన్నపిల్ల. దాన్నెక్కడ కొడతారోనని నా భయం. అంతే..” అని కాసేపు ఏదో ఆలోచించి ..
“ ..పోన్లే మంచి పనే చేసావ్..” అన్నాడు. ఐతే,
నిప్పులు తొక్కిన కోతిలా గుమ్మం కాణ్నించి ఇంట్లోకీ , ఇంట్లోంచి గుమ్మం కాడికీ లోలోన రగిలిపోతా, ముక్కుపుటాలు ఎగరేస్తా కూతురెప్పుడొస్తుందా తాట తీసేద్దావని తిరుగుతానే ఉందేమో సరోజ్ని..కూతురు ఇంట్లోకి వత్తంతోటే రెండు జళ్ళూ మొదట్లో పట్టుకుని నిలేసింది..
” ఏవే..ఇయ్యెప్పుడ్నించీ మొదలెట్టా..నాకు సెప్పకుండా ?” అంటా..
గిలగిల్లాడిపోయింది గిలక..అసలు సంగతేంటో తెలవక. తెల్లబోయేడు శీను అక్క సేసిన తప్పేంటో, అమ్మకెంతుకు అంత కోపవొచ్చిందోనని.
“ నువ్వు జళ్ళొదులు ముందు..” తల్లిని కసురుకుంటా గింజుకుంది గిలక.
ఆ మాటతో మరింతగా సేతుల్ని బిగిచ్చిన సరోజ్ని..కూతురు సెంపలు వాయిత్తా..
“ ఆ లచ్చిం మేస్టారికి వంకాయలిచ్చొచ్చేవా..?”
“ ఇచ్చేను..” ధైర్నంగా అంది గిలక..
“ ఎవరిత్తే ఇచ్చేననిజెప్పా..”
“నువ్వే..”
“ నేనిచ్చేనా..నీకు పట్టుకెల్లి నేనిచ్చేనని ఆవిడికిచ్చిరాని.?”
“ లేదు..?”
“మరెంతుకలా సెప్పా? అలా సెప్పొచ్చా..ఆపద్దాలాడచ్చా..అయినా నీకన్ని డబ్బులెక్కడియ్యే..వంకాయలు కొంటాకి..? సెప్పాపోయావంటే సెవడాలొత్తేత్తాను ఎదవా..ఎదవని. ఇయ్యాల నువ్వో నేనో తేలిపోవాల..” ఊగిపోయింది సరోజ్నీ పూనకం వచ్చిందాన్లాగా..
“ నువ్వే ఇచ్చేవ్ గదమ్మా..డబ్బుల్నాకు….” ఏడుత్తా గట్టిగా అంది గిలక .
“ నేనా..? డబ్బులు నేనెప్పుడిచ్చేనే..? నియ్యమ్మాకడుపు కాలా..! దొంగతనాల్నేరిసేవా? డబ్బులు దొబ్బుతువేగాకుండా..నేనిచ్చేనన్జెప్పి ఆపద్దాలాడతావా?”
గొంతు తగ్గిచ్చింది సరోజ్ని. అప్పటిదాకా గొంతెత్తి గట్టిగానే అరిసింది..సరోజ్ని..గోడవతలున్న సూరేకాంతానికి ఇనపడేతట్టుగా..మేస్టారుగారికి వంకాయల్ని నేనివ్వలేదన్నట్టు మరోసారి నిరూపిచ్చుకుంటానికన్నట్టు. కానీ ఆపద్దాలూ, దొంగతనం అనేతలికి మల్లీ కూతురి పరువు ఊరూ వాడా ఏకం సేసేత్తదని మెల్లగా అంది.
“ ఏ ..అమ్మా..ఇంకో దెబ్బేసేవంటే నాన్తో సెప్ప్తా ఏవనుకున్నావో..నువ్వే అబద్ధాలాడతన్నావ్..అయ్యాల తీగల మీద నడిసేవోళ్ళు వత్తే అందర్నీ ఇళ్లకెల్లి డబ్బులు తెమ్మన్నారని వత్తే నువ్వేగదా ఇచ్చేవు. ఆ సూత్తే ఏవొత్తాదిలే అని..సూడకుండా దాసుకుందావనుకున్నాను..అందరూ సూత్తంటే నేను కళాసులోనే కూకున్నాను ఎల్లకుండా. ఆల్లందరి డబ్బులూ అయిపోయినియ్యి. నా డబ్బులు అలాగే ఉన్నాయ్. ఇంటికొచ్చేతప్పుడు ఏదన్నా కొనుక్కుందావనుకున్నాను. సూత్తే వంకాయలగపడ్దాయ్. మా లచ్చింమేస్టారికి సేనా ఇస్టం.
నేనిత్తే తీసుకుంటారా? అంతుకే నీ పేరు సెప్పేను..” అంటా అన్ని దెబ్బల్తిన్నా నొప్పులన్నీ మర్సిపొయి పక పకా నవ్వింది గిలక.
అంతే..
దాంతో..అవాక్కైపోయిన సరోజ్ని..గుండెలెక్కడో లోపల పిడసగట్టుకుపోయినట్తనిపిచ్చి..గుండెల్నట్టుకుని నిలబడ్దసొటే కూలబడిపోయిందేవో..గబుక్కునెల్లి కాసిన్ని మంచి నీల్లుదెచ్చి తల్లితో తాపిస్త్తుంటే ..
“ఏవయ్యింద”టా వచ్చేడు..సరోజ్ని మొగుడు…
పిల్లల్నోటితో అంతా ఇన్నాకా..
“ అయినా బళ్లోంచొచ్చిన పిల్లని పచ్చి మంచినీల్లన్నా తాగనియ్యకుండా..సేతివాటం సూపిత్తాకి నేను సచ్చేననుకున్నావా? వచ్చేదాకా ఆగొచ్చు కదా..! గిలక నాకు అయ్యాలే సెప్పింది..నాన్నా అమ్మనడిగి తాళ్ల మీద నడిసే గారడీ సూద్దావని డబ్బులు తీసుకున్నాగానీ సూడబుద్దవలేదని. ఇంటికొత్తుంటే వంకాయలు నచ్చి మన సూరబ్బులే అమ్ముతున్నాడని.., మన సేలో కాసినియ్యేనని సూరబ్బులు డబ్బులు తీసుకోలేదని నాకయ్యాలే సెప్పింది. “
“ మన సేలో కాయలా?” నీర్సంగా అంది సరోజ్ని..
“ మన సేలోయే..! సేలగట్ల మీద ఓ పాతిక వంగ మొక్కలు ఏసుకున్నాడ్లే..ఏదో పైకర్సుకు ఉంటాయని. అడిగితే నేనే ఏసుకొమ్మన్నాను. ఎప్పుడుబడితే అప్పుడు ఏ పని సెప్పినా సేత్తన్నాడు. పోయిందేవుందిలే అని ఏస్కోమంటే తొలికాపు దెచ్చి మనింట్లో ఇత్తానంటాడు. మనకెన్నిగావాలి? తర్వాజ్జూద్దాంలే ..రేటు బాగున్నప్పుడే అమ్ముకొమ్మని అనేతలికి సెంటర్లో పోసి సాటింపేసేడు. అలాటోడు మన గిలకమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటాడా ఆ నా కొడుకు?..” అంటా తనని సుట్టుకుపోయిన కూతురొంక చూసి తల మీద నిముర్తా..
“ మన గిలకమ్మ..బంగారు సిలకమ్మే. నువ్వంటే మా ఇట్టం. మానాన ఇచ్చేడని సెప్పిందా ఏటీ. ? మాయమ్మించ్చిందనేగా సెప్పింది..కదరా..!” అన్నాడు ప్రేమగా కూతురొంక సూత్తా..
“ ఇయ్యానందం సాల్దా..! సూరేకాంతం నమ్మితే ఏటి,నమ్మాపోతే ఏటి..? ఎంతిట్తవైతే పిల్లముండ..దాసుకున్న డబ్బుల్తో కొని ఇచ్చొత్తాదా? నాయమ్మే . బంగారు తల్లి..” పైకంటే మెళ్ల మీదకెక్కి కూకుంటాదని మనసులోనే
అనుకుంటా..పైకి మాత్తరం..
“ సాల్లే సంబడం..కాళ్ళు కడుక్కురండి. శెనగలు ఏయించేను.తిందురుగాని అందరూ..ఎల్లి కాళ్ళూ,సేతులూ కడుక్కురంది గిలకా, శీనూ..”
“ అబ్బా..శెనగల తాళింపంటే అక్కా..! ద్దా..ద్దా..”
శెనగలనేతలికి అన్నీ మర్సిపోయి గబుక్కున తూవులోకి పరిగెత్తింది గిలక.

3 thoughts on “గిలకమ్మ కతలు – గిలకమ్మ పందేరం. ఆహా..! ఏమి యవ్వారం.

  1. భలే సరదాగా ఉండటమే కాదు మానవసంబంధాలు ఇచ్చిపుచ్చుకోటాలు చక్కగా వివరిస్తున్నారు గిలకమ్మ కబుర్లతో

  2. తెలుగులోగిళ్ల జీవనసౌందర్యమంతా రంగరించి రాస్తున్నారు. గిలకమ్మ అందరికీ ఎంత అపురూపమయిపోయిందంటే, ఈసారి సరోజ్ని నోరుపాడేసుకున్నా, చెయ్యిచేసుకున్నా మేము ఊరుకునేదిలేదు. హన్నా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *