June 24, 2024

రెండో జీవితం 11

రచన : అంగులూరి అంజనీదేవి

శృతికను చూశాక సంవేదకి ఒక్కక్షణం ఏమి అర్థంకాలేదు. బయట మనం కొనుక్కునే బొమ్మల్లో కూడా కొంచెం ఫీలింగ్స్‌ కన్పిస్తాయి. ఈమెలో ఒక్క ఫీలింగ్‌ కూడా కన్పించలేదు బొమ్మను మించిన బొమ్మలా వుంది. ఇదేంటి ఇలా? ద్రోణ గారు బొమ్మలు వేసి, వేసి భార్యను కూడా ఓ బొమ్మను చేశారా? లేక ఆమె మనస్తత్వమే అంతనా? అయినా ఆవిడ గురించి నాకెందుకులే…ఆయన భార్యను చూడాలన్న కోరికైతే తీరింది. అది చాలు. అనుకుంటూ శృతిక చూపించిన గదిలోకి వెళ్లి కూర్చుంది.
నిముషాలు గడుస్తున్నా సంవేద వున్న గదిలోకి ద్రోణ రాలేదు.
కుర్చీలోంచి లేచి ముందుగా గోడలకున్న బొమ్మల్ని చూసింది. ఆ తర్వాత కర్టన్‌ తొలగించి అక్కడ కూడా కొన్ని బొమ్మలు వున్నట్లనిపించి లోపలకెళ్లింది.
ఒక్కో బొమ్మ ఒక్కో కళాఖండం. అద్భుతం, అమోఘం.
ఒక బొమ్మలో ఒక అమ్మాయి మందారచెట్టు దగ్గర నిలబడి పూలుకోస్తూ శూన్యంలోకి చూస్తుంది. ఆ బొమ్మపక్కనే ఓ కాప్షన్‌ రాసి ఉంది. ఆ బొమ్మ ఎంత అపూర్వంగా వుందో దాని పక్కన రాసిన ఆ వాక్యాలు కూడా అంత మహత్తరంగా వున్నాయి.
”…నువ్వొక ఆకాశం.. అర్థం కావు. నువ్వొక సముద్రం… అర్థం కావు. నువ్వొక నిత్యనూతనపు తలంపువి… అర్థం కావు. అయినా కానీ ఏదో, ఏదో అర్థం వుందన్న మైమరపులో పుట్టిన పులకింతల చిరుసవ్వడితో నన్ను స్పర్శిస్తున్నావు.
అందుకే నువ్వు నా అంతరంగపు అనంత జలపాతంలో తడిసి, తడిసి ముద్దయి, ముగ్ధలా, స్నిగ్ధలా, స్థితప్రజ్ఞలా నా ఎదవాకిట్లో నిలబడి అరమోడ్పు కళ్లతో నన్నే చూస్తున్న భావనలో మునిగివున్నాను. ద్రోణ” అని రాసివుంది.
ఆ వాక్యాలను చదువుతూ అలాగే నిలబడింది సంవేద.
.. ఎప్పుడొచ్చాడో ద్రోణ! ఆమె వెనక నిలబడి, ఆమె తలమీద నుండి ఆమె ఏమి చూస్తుందో అదే చూస్తున్నాడు. అంతలో ఒక పూర్ణపురుషుని ఎదను తాకేంత దగ్గరగా నిలబడి వున్నానన్న భ్రమ కలిగి, అది భ్రమ కాదు నిజమని తెలిసి దిగ్భ్రమ చెంది, తనకు తెలియకుండానే చిరుకదలికతో, ఓ చిరునవ్వుతో అతన్ని పలకరించింది.
ఆ పలకరింతకి అతనిలోని కళా హృదయం ఒక్కక్షణం రంగుల కుంచెలా విప్పుకొని హరివిల్లయి, సుమరాగ రంజితమై, అరవిందమై చందన శకలమైంది.
అతన్నలా చూస్తుంటే సముద్రాన్ని అతి దగ్గరగా చూస్తున్న భావన కలిగింది సంవేదలో… కొందరు నదిని సముద్రమనుకుంటారు. సముద్రాన్ని నది అనుకుంటారు. సముద్రాన్ని సముద్రంగా గ్రహించటం వివేకం..
”ఎప్పుడొచ్చారు?” అన్నాడు ద్రోణ మృదుమధురంగా ఆమె ఆలోచనలని చెదరగొడ్తూ…
”ఇప్పుడే వచ్చాను మీరు రావటం ఆలస్యం కావొచ్చని మీ పర్మిషన్‌ లేకుండానే ఈ కర్టన్‌ దాటి లోపలకి వచ్చి ఇవన్నీ చూస్తున్నాను.” అంది
”నిజానికి ఇక్కడికి ఎవరూ రారు. శృతిక కూడా.. అయినా నాదగ్గర మీకు పర్మిషనేంటి? కూర్చోండి!” అంటూ నాలుగడుగులు వెనక్కి వేసి… అతను కూర్చుంటూ ఆమెకు కుర్చీ చూపించాడు.
ఆమె కూర్చుంది. ఆ కూర్చున్న విధానంలోని ఒద్దిక, పొందిక ఎంతో గొప్పగా అన్పించింది ద్రోణకి… ఆమెనే చూస్తే బావుండదని చూపు తిప్పుకున్నాడు.
హృదయంలో లేని వాళ్లను కౌగిలించుకోవాలంటే ఎంత కష్టమో, హృదయంలో వున్న వాళ్లకి ఓ అడుగు దూరంలో వుండటం కూడా అంతే కష్టమని ద్రోణకి అర్థమయినా స్థిర చిత్తంతో చూస్తున్నాడు.
ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ…”నిశిత పెళ్లి సర్‌! ఇన్విటేషన్‌ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరు తప్పకుండా రావాలి. మామయ్యగారు తన పిలుపు కూడా నన్నే పిలవమన్నారు.” అంటూ శుభలేఖను అతని చేతికిచ్చింది
ప్రశాంతంగా చూస్తూ ” అబ్బాయి ఏం చేస్తాడు?” అన్నాడు ఎంతో ఆత్మీయంగా.
”గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌ అని చెప్పారు” అంది సంవేద. అంతకన్నా వివరాలు తెలియనట్లు చూసింది.
సంవేద ముఖంలో అసంతృప్తి ఎంత శాతం వుంది. తృప్తి ఎంత శాతం వుంది తెలుసుకోవాలన్నట్లు సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు ద్రోణ.
అతని చూపులు ఆమెను గుచ్చుకున్నట్లై కడిగిన ఆకాశంలా వుండానికి విశ్వప్రయత్నం చేస్తూ అతని కళ్లకి దొరికిపోయింది.
”చెప్పు సంవేదా ! నువ్వు హ్యాపీగా వున్నావా?” అన్నాడు సడన్‌గా.
అతను తీసుకుంటున్న ఆ చనువుకి ఆమె ఆశ్చర్యపోయింది. అయినా దాన్ని యాదృశ్చికంగా భావిస్తూ.. ”నిశిత పెళ్లి జరిగితే అంతకన్నా హ్యాపీ వుండదు సర్‌! అది మీ ద్వారానే జరుగుతోందిప్పుడు…” అంది తలవంచుకొని.
నీకు సంతోషాన్ని కల్గించే ఏ చిన్నవిషయమైనా నేను చేయటానికి సిద్ధంగా వున్నాను అది నీకెలా తెలియాలి? అన్నట్లు చూశాడు.
ద్రోణ చూపుల్ని గమనించకుండా ”సర్‌! మీరు అన్ని రకాల బొమ్మలు వేస్తున్నారు. అన్ని బొమ్మల్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం నాకెలా తెలుసంటే నన్నోసారి ఆముక్త మీ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ తీసికెళ్లింది. ఈ ఆర్టిస్ట్‌ మన కాలేజీలోనే చదివాడు అని కూడా చెప్పింది… కానీ ఆ కర్టన్‌ అవతల వున్న బొమ్మని ప్రదర్శించడం లేదు. ఎందుకని?” అంది.
ద్రోణ మాట్లాడలేదు.
ఆమె నొచ్చుకుంటూ ”మీకు చెప్పాలని లేకుంటే వద్దులెండి!” అంది.
ఆమెను నిరాశపరచటం ఇష్టం లేక… ”మీకు చెప్పటంలో ప్రయోజనం లేనట్లే చెప్పకుండా వుండటంలో కూడా అర్థం లేదు. నాకు ఆ బొమ్మలోని అమ్మాయితో మానసికంగా చాలా దగ్గర సంబంధం వుంది.” అన్నాడు.
”నేనొకి అడగాలనుకుంటున్నా… ఏమీ అనుకోరుగా?” అంది.
”అడగండి ! పర్లేదు…” అన్నాడు ద్రోణ రిలాక్సడ్‌గా కూర్చుంటూ.. ఆమె అలా ఏదో ఒకటి మాట్లాడుతుంటే అతనికి ఇంకా వినాలని వుంది. ఎంత వద్దనుకున్నా ఒక మనిషిలో కలిగే మానవ సహజమైన ఫీలింగ్‌ అది…
”మీరామెను ప్రేమించారా?” అంది. ఆమెకు చాలా కుతూహలంగా వుంది. ముఖ్యంగా అతని నోటితో చెబితే వినాలని వుంది.
”ప్రేమించాను. కానీ ఆ విషయం ఆ అమ్మాయితో చెప్పలేదు” అన్నాడు నిజాయితీగా.
”ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మన మనసులో ఏదైనా ఒక మార్పు జరుగు తున్నప్పుడు ఆ మాత్రం స్పృహలే కుండా వుంటుందా? మనుషులం కదా!” అంది.
”చెప్పేంత అనుకూలమైన వాతావరణం లేదప్పుడు.. చెప్పినా లాభం లేదని మౌనంగా వుండిపోయాను” అన్నాడు
బోరున ఏడ్వాలనిపిస్తోంది సంవేదకి…
తన ఇంట్లో ప్రతిక్షణం ఏడుపు వస్తున్నా ఓదార్చేవాళ్లు లేక ఆపుకునేది. ఇప్పుడు ఏడిస్తే ద్రోణ తన బలమైన బాహువుల్లోకి తీసుకొని తన బాధను క్షణంలో మాయం చేస్తాడు. కానీ తను ఏడవకూడదు. కంట్రోల్ చేసుకోవాలి. ఈ జీవితం ఇక ఇంతే అని సరిపెట్టుకోవాలి. తనకు ఏది ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే లభించిందని తృప్తిపడాలి.
తృప్తికి మించిన జీవనసూత్రం లేదు కదా! అనుకుంటూ అతని ముఖంలోకి చూడలేకపోతోంది.
కారణం ఆ బొమ్మలో వుండే అమ్మాయిలో వున్న పోలికలన్నీ తనవే…
…ఆణిముత్యం దొరికితే బావుండని సముద్రతీరాన వెళ్తుంటే గుడ్డిగవ్వ దొరికినప్పుడు చేసేది ఏముంటుంది? చేతుల్లోకి తీసుకొని ఇదే ముత్యం అనుకోవాలి. ఇదే సర్వం అనుకోవాలి అలా ఎంతమంది అనుకోవటం లేదూ! ఎంతో నిస్సారంగా జీవితం గడుపుతూ కూడా ఎంతో సారవంతమైన నవ్వుల్ని నటిస్తూ నటనే జీవితంగా మార్చుకుంటున్నారు. తనేమైనా పొడిచొచ్చేపొద్దా! నడిచొచ్చే శిల్పమా! అతి మామూలు సాదాసీదా సంవేద! అంతే! తను కూడా వాళ్లతో సమానమే…
”ఏమి ఆలోచిస్తున్నారు?” అన్నాడు ద్రోణ ఆమె మౌనాన్ని చూసి..
”ఏడుపెందుకు రావటం లేదా అని…” అంది.
షాకింక్‌గా చూశాడు ద్రోణ.
”కొందరు ఆడవాళ్లు పరిపూర్ణంగా ప్రేమించే మనిషిని కళ్ల ముందు వుంచుకొని పొరపాటున కూడా ప్రేమించని భర్తతో కాలాన్ని నెట్టుకొస్తూ అదే జీవితంలా, పరమార్థం వున్న జీవితంలా పైకి నటిస్తుంటారు. మగవాళ్లు కూడా కొందరు అంతే! ఏదో ఏదో లోలోపల దాచేసుకొని త్యాగాలు చేస్తుంటారు. దీనివల్ల చివరకు మిగిలేది ఏమిటి సర్‌!” అంది సంవేద సూటిగా.
ఆ మాటలు ద్రోణ గుండెల్ని గురి చూసి తాకాయి. వెంటనే తేరుకొని ”అది కాలం నిర్ణయిస్తుందని కాలానికే వదిలేసి బ్రతకటమే చివరికి మిగిలేది” అన్నాడు ద్రోణ.
”మీరింత గొప్పగా ఎలా నటిస్తున్నారు?” అంది సంవేద ఇక ఆగలేక…
”నాది నటన కాదు. మనోనిబ్బరం… నిశ్చలత..” అన్నాడు ఇన్ని రోజులు అతనికో బాధ వుండేది తన మనసులో ఆమె వున్నట్లు ఆమెకు తెలియకుండానే ముగిసిపోతుందేమో అని. ఇప్పుడా బాధ తగ్గింది.
ఈ సంఘటనతో ఆమెకు కూడా నన్ను ప్రేమించే ఓ వ్యక్తి రహస్యంగా వున్నాడన్న ఊరట లభించింది.
”నేనిక వెళ్తాను సర్‌! ఇంట్లో ఎదురు చూస్తుంటారు.” అంది సంవేద.
”అలాగే!” అంటూ లేచి ఆమెవెంట నాలుగడుగులు వేసి ఆగిపోయాడు.
*****
నిశితను పెళ్లి పీటపై చూస్తుంటే శ్యాంవర్ధన్‌ మనసు దహించుకుపోతోంది. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే బావుండనుకుంటున్నాడు.
”ఈ పెళ్లి జరగడానికి వీలులేదు” అంటూ దూరప్రాంతంనుండి అప్పుడే వచ్చిన వాళ్ల బంధువు ఒకామె పెళ్లి మధ్యలో వెళ్లి నిలబడింది.
”ఎందుకు? ఎందుకు?” అంటూ మహదానందాన్ని మనసులోనే నొక్కిపెట్టి ముందుకొచ్చాడు శ్యాంవర్ధన్‌.
శ్యాంవర్ధన్ని ఓ నెట్టు నెట్టి గంగాధరం దగ్గరకి వెళ్లి ”ఏమయ్యా! గంగాధరం! మా వాడికి నీ మాయమాటలతో కట్నం ఆశ చూసి కుంటిదాన్ని అంటగట్టాలని చూస్తావా? అయినా దాన్ని పోషించటానికి నువ్విచ్చే ఆ ముష్టి ఏబైవేలు ఏ మూలకి వస్తాయి ఇంక ఏమేమి ఆశలు చూపావు?” అంటూ కేకేసింది.
తల కొట్టేసినట్లైంది గంగాధరానికి…
పెళ్లికి వచ్చిన వాళ్లంతా బిత్తరపోయి చూస్తున్నారు.
”మర్యాదగా మాట్లాడండి! అతనే మా అమ్మాయిని చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఆశ చూపటం లాంటి చిల్లర మనుషులం కాదు…” అన్నాడు గంగాధరం.
”తెలుస్తూనే వుంది. కుంటిదాని కోసం ఎవరైనా వస్తారా? దానికేమైనా తల్లిదండ్రులా? అన్నదమ్ములా? నాలుగురోజులు కూడా తక్కువ కాకుండా జీవితాంతం పోషించాలి. అవి దాన్ని చేసుకొని అష్టకష్టాలు పడాల్సిన ఖర్మమావాడికేంటి?” అంది.
”మానసిక రోగులకన్నా మా నిశిత ఎంతో మేలు. చేతిమీద కురుపు లేస్తే చేయిని నరుక్కుంటామా? కాలు లేనంత మాత్రాన జీవితమే లేకుండా పోతుందా? దయచేసి నా మాట విని ఈ పెళ్లి జరగనివ్వండి!” అన్నాడు ప్రాధేయపడ్తూ గంగాధరం.
”వాళ్లను బ్రతిమాలొద్దు మామయ్యా! నేనీ పెళ్లి చేసుకోను” అంటూ పక్కనున్న ఆడవాళ్ల సాయంతో లేచి నిలబడింది నిశిత.
ఆ మాటతో – పెంపుడు జంతువును లాక్కెళ్లినట్లు పెళ్లికొడుకును లాకెళ్లిందామె… అది చూసి నిశ్చేష్టులయ్యారు గంగాధరం, సంవేద.
శ్యాంవర్ధన్‌కి ఆనందతాండవం చేయాలనివుంది. ఆఫీసునుండి అర్జంటుగా రమ్మని కాల్‌ రావటంతో వెళ్లాడు.
నిశితను ఓదార్పుగా అక్కున చేర్చుకొంది దేవికారాణి. ఆమెకు ధైర్యం చెబుతూ భార్య పక్కనే కూర్చున్నాడు గంగాధరం. ఆయనకి ఈ సంఘటన చాలా అవమానకరంగా వుంది. పెళ్లి చూడాలని వచ్చిన వాళ్లు ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు.
సంవేద కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే పక్కకి తీసికెళ్లి కూర్చోబెట్టింది ఆముక్త. అది గమనించిన ద్రోణ వాళ్ల దగ్గరకి వెళ్లాడు.
సంవేదకి – ఆమెను అర్థం చేసుకొని, ఆమె తప్ప ఇంకో స్త్రీ అవసరం లేదనుకునే భర్త దొరికి వుంటే ఈ సమస్యలు వుండేవికావు. తనకి ఆమెను ఓదార్చాలని వున్నా, నీకేం పర్వాలేదు నేనున్నానని చెప్పాలని వున్నా – భూమికి, పాదానికి మధ్యలో చెప్పులా ఏదో శక్తి అడ్డుగా వుంది ద్రోణకి…
చిన్న కాగితం మీద గొప్ప చిత్రాన్ని వేయగలిగిన ద్రోణ ఈ బ్రతుకు చిత్రానికి ఏ కాగితం సరిపోతుందో, ఏ రంగులు కావాలో అంచనా వేయలేక పోతున్నాడు. వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్లినట్లు ఆలోచిస్తున్నాడు. జీవితమనేది కొందరికి ‘కల’ అయితే కొందరికి ‘ఆట’. కొందరికి వినోదమైతే.. కొందరికి విషాదం… కానీ ప్రతి వ్యక్తికి కొన్ని కష్టాలు, బాధలు అవసరం. పడవలో అడుగున కొంత బరువెయ్యందే అది నిలకడగా ప్రయాణం చెయ్యదు. పడినప్పుడే లేస్తాం. భంగపడ్డప్పుడే పోరాడతాం. అందుకే జీవితం ఓ అసాధారణ వ్యాపారం. అందులో ఎలా జీవించాలన్నది గొప్పకళ. దాన్ని నేర్చుకోవటమే కాదు, నేర్పటం కూడా అవసరం అనుకొని…
”సంవేదా! ఈ పెళ్లి ఆగిపోయినందుకు సంతోషించు…” అన్నాడు ద్రోణ.
వెంటనే తలెత్తి ఎందుకన్నట్లు చూసింది సంవేద.
ఆమెను చూస్తుంటే భూమిలోకి కుంగిపోతున్న దానిలా వుంది.
”నిశితకి మీరు చెయ్యాల్సింది పెళ్లికాదు. అలాంటి ప్రయత్నం మీరు చేసినప్పుడల్లా ఆమె మనసు గాయపడటం తప్ప ఇంకేం వుండదు. పెళ్లే సెక్యూరిటీ అని కూడా అనుకోవద్దు. మనిషి చెయ్యవలసిన పనులు చాలా వున్నాయి. మన పనులే మనకి సెక్యూరిటీ…” అన్నాడు ద్రోణ.
”తనేం చెయ్యగలదు పనులు?” అంది నిరుత్సాహంగా
”నిశితలో కాలు సహకరించపోవటమనేది పెద్ద లోపం కాదు. అన్ని పనులు కాకపోయినా కొన్ని పనులు చక్కగా చేసుకోగలదు. ఆ కొన్నినే అనుకూలంగా మలుచుకొని కొంత సాధన చేయించి చూద్దాం.” అన్నాడు.
”ఎంతయినా నా చెల్లెలు చిల్లుకుండ సర్‌! ఆ కుండతో తోటనేం తడుపుతుంది?” అంది సంవేద.
”చిల్లుకుండతో కూడా ఉపయోగం వుంటుంది సంవేదా! వెయిట్ అండ్‌ సీ…” అన్నాడు స్థిరంగా.
అతని మాటలు వింటుంటే నిశిత జీవితానికి ఏదో దారి కన్పిస్తున్నట్లు, ఇంకా ఏదో స్పష్టతరాని ఆశల అల్లిక ఆమె కళ్లముందు మెదిలింది.
”ఇక నేను వెళ్తాను. ఇంకో గంటలో నేను ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ దగ్గరకి వెళ్లాలి.” అన్నాడు.
ద్రోణ ఇంకొద్దిసేపు వుంటే బావుండని సంవేద మనసు ఆశించింది. ఆమె ఫీలింగ్‌ ఆమెకే విచిత్రంగా అన్పించి ”సరే ! సర్‌!” అంది రెండు చేతులు చాలా పద్ధతిగా జోడించి.
ద్రోణ ‘బై’ చెబుతూ తను చెప్పిన ఆ నాలుగు మాటలకే ఆమె ముఖం తేటగా మారటం గమనించాడు.
”నేను ఆటోలో వెళ్తాను ద్రోణా!” అంది ఆముక్త.
అతనేం మాట్లాడలేదు. ఆటోను పిలిచి ఆమెను ఎక్కించాడు.
అతను కారెక్కి డ్రైవ్‌ చేసుకుంటూ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌కి వెళ్లాడు.
*****
ద్రోణ వేసిన నిశిత బొమ్మకి జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. అలా వచ్చినట్లు అన్ని పత్రికలు ప్రకటించాయి.
ఎందరో కళాకారులు, కళాభిమానులు ద్రోణను అభినందిస్తూ అతని మొబైల్‌కి మెసేజ్‌లు పంపుతున్నారు.
అందరికన్నా చైత్రిక పంపిన యెస్సెమ్మెస్‌లో ఓ ప్రత్యేకత వుంది.
ఆముక్త ఫోన్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
సంవేదనుండి ఓ ఫోన్‌కాల్‌ కాని, చిన్న ఎస్సెమ్మెస్‌ కాని లేదు. ద్రోణలో అదోలాంటి నిరాశ, వెలితి…
…మనిషికి ఏదీ అనుకున్నట్లు జరగదు. జరిగేది అనుకున్నది కాదు. అదే జీవితం అని ద్రోణకి తెలియంది కాదు. కానీ మనిషి మనసు విచిత్రం… రహస్యంగానే తనకేం కావాలో అది కోరుకుంటూనే వుంటుంది. అది జరగదని తెలిసినా అలా కోరుకోవడం మానుకోదు. ఆ కోరికలో కలిగే స్పందన తాలూకు రసానుభూతి ఎంత డబ్బు సంపాయిం చినా రాదు.ఎంతమందితో మ్లాడినా రాదు. అదో అలౌకిక స్థితి… ముఖ్యంగా కొందరు కళాకారులు ఇలాంటి స్థితిలోనే ఎక్కువగా జీవిస్తుంటారు. ఆ ఇన్సిపిరేషన్‌ వాళ్లలోని కళకి, సమర్థతకి జీవంపోస్తుంది. అదొక అసాధారణ చర్య…
సంవేద తాలూకు ఆలోచనలు అతని అంతఃచక్షువుని ఎప్పుడూ తడుముతూనే వుంటాయి. అదొక రహస్య నిధి.
అవార్డు తాలుకూ ఆహ్వాన పత్రాలు అందరికి అందాయి.
*****
అవార్డు సభ ప్రారంభం కాబోతోంది.
ఆహూతుల సమక్షంలో ఆడిటోరియం కళకళలాడుతోంది. కళాభిమానులు, కళాకారులు, నగరంలో ప్రముఖ వ్యక్తులు ఆ సభలో కూర్చుని ద్రోణలోని ప్రజ్ఞను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
ముందుగా సరస్వతీదేవి విగ్రహం ముందు జ్యోతి వెలిగించారు.
కార్యదర్శి మైక్‌ముందు నిలబడి ఒక్కో వక్తను పేరు, పేరున పిలిచి వేదికను అలంకరించమని గౌరవపూర్వకంగా చెబుతున్నాడు.
ఒక్కొక్కరే వెళ్లి వేదికపై ఆశీనులయ్యారు.
అధ్యకక్షులు మాట్లాడి కూర్చున్నాక – ఒక్కో వక్త లేచి ద్రోణలోని ప్రత్యేకతను, ఆయన కుంచె నడిపిన తీరును ప్రశంసిస్తూ, బొమ్మల్ని గీయటంలో అతను ఎలాంటి మెళుకువల్ని ఎలా వడిసి పట్టుకున్నాడో చెప్పారు.
ఇంత చిన్న వయసులో అతనెంత గొప్ప అభివృద్ధిని సాధించాడో, ఒక కళలో నిష్ణాతులు అవ్వదలుచుకున్న వాళ్లలో ఎలాంటి లక్షణాలు వుండాలో అవన్నీ ద్రోణలో వున్నాయన్నారు.. అన్నికన్నా పోటీలలో నిలబడానికి అతను ఎంచుకున్న కళారూపం ఎంత ఉదాత్తమైనదో చెబుతూ…
ఆ చిత్రాన్ని గీయడంలో అతనిలోని ఆవేశపూరితమైన మనో ఆకాశం ఉక్కిరిబిక్కిరై ఇక ఆగలేక అంతిమక్రియగా ఎలా గర్జించుకుంటూ కురిసిందో, దానికి అతను వాడిన కాగితం విప్పుకొని విస్తరించిన సముద్రంలా ఎలా మారిందో అద్భుతంగా వర్ణిస్తుంటే ఆడిటోరియంలో చప్పట్లు మారుమ్రోగాయి.
”చూశారా మీలోని కళ మీకెంత గుర్తింపు నిచ్చిందో” అన్నట్లు చైత్రిక కళ్లు మెరిశాయి.
ద్రోణ పట్ల అభినందనతో సంవేద కళ్లు తడిసి తళుక్కుమన్నాయి.
ఆముక్త కళ్లు ఆశ్చర్యంతో ఆవులించాయి.
శృతిక కళ్లు – అభావంగా తన చీరమీద ఏదో మరక వున్నట్లు అన్పించి దాన్నే చూసుకుంటున్నాయి.
వేదికపై కూర్చుని వున్న ద్రోణ వాళ్ల నలుగుర్ని గమనిస్తూ తన కళ్లని ఒక్కక్షణం సంవేద మీద నిలిపాడు. ఎంత సాధించినా ఇంకా ఏదో మిగిలే వుంటుంది కళాకారులకి… కానీ సంవేద కళ్లలోని తడి.. ఆ తడిలోని తృప్తి ద్రోణ మనోమందిరాన్ని తడిపి బీటలు వారిన అతని హృదయ భూమిని చిత్తడి, చిత్తడి చేసింది.
ఈ క్షణంలో ఇంతకన్నా తనకింకేం కావాలనిపించట్లేదు. ఈ తృప్తి చాలనిపిస్తోంది. ఈ తృప్తే కాదు… సంవేదలోని మానసిక వ్యధను తొలగించి ఆమెను సంతోషపెట్టాలంటే ఇంకా తను చేయదగిన పనులు ఏమున్నాయో ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన కూడా అతనికి ఆనందంగానే వుంది.
ప్రేమించే మనసుపడే పరితపన, పరితాపం… ప్రేమింపబడే వాళ్లకి అజ్ఞాత రక్షణగా వుంటుందనానికి ద్రోణ ఆలోచనలే నిదర్శనం…
ముందు వరుసలో కూర్చుని వున్న ద్రోణ తల్లిదండ్రులు విమలమ్మ, సూర్యప్రసాద్‌ పుత్రుని అభివృద్ధిని చూసి పొంగిపోతున్నారు.
ద్రోణ స్పందనని ఎప్పుడెప్పుడు విందామా అని ఆహుతులైన శ్రోతలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
చివరగా ద్రోణ మాట్లాడతాడని అధ్యక్షులు చెప్పటంతో…
తలపండిన పెద్దవాళ్ల పక్కన కూర్చుని వున్న యువకుడైన ద్రోణ లేచి నిలబడగానే మళ్లీ చప్పట్లు మోగాయి.
…ద్రోణ ”సభకు నమస్కారం!” అంటూ మొదలుపెట్టి… ఆర్ట్‌ అంటే ఏమి దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమి అన్న అంశంపై అనర్గళంగా మాట్లాడుతూ… దానికి ఎలాంటి ఇన్సిపిరేషన్‌ కావాలి. ఎలాంటి డెడికేషన్‌ కావాలి. ఎలాంటి వాతావరణం కావాలి అన్నది కళ్లముందు కన్పిస్తున్నట్లు మాట్లాడాడు. ఆ తర్వాత…
నేను ఈ రోజు ఈ అవార్డు అందుకోటానికి కారణాలు ఎన్ని వున్నా అందుకు నిశిత అనే అమ్మాయి రూపమే ప్రధాన కారణమని నేను నమ్ముతున్నాను. అ అమ్మాయి లేకుంటే ఈ రోజు నాకీ అవార్డు లేదు. అందుకే ఈ అవార్డుతో పాటు నాకు ఇస్తున్న ఈ డబ్బుని ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం వినియోగించాలనుకుంటున్నాను.” అన్నాడు.
ద్రోణ ఆ మాట అనగానే సంతోషంతో కూడిన చప్పట్లు ఆడిటోరియంను అదరగొట్టాయి.
ఒక్కక్షణం ఆగి ద్రోణ మాట్లాడటం మొదలుపెట్టాడు.
”నిశిత తనకి కాలు లేదని, తనో ఓటి కుండనని అనుకుంటోంది. తనమీద తనే జాలిపడ్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. కానీ అది తప్పు… ఎలా అంటే!
ఒక తోటమాలికి తన కావడిలో ఒకి మంచికుండ ఇంకోటి చిల్లికుండ వున్నాయట. ఏి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచికుండ తోటను తడిపితే చిల్లికుండ తోటకెళ్లే దారిలో వుండే మొక్కల్ని తడిపేదట… ఆ విషయం ఆ తోటమాలికికాని, చిల్లికుండకి కాని తెలియదు. దారిలో వున్న పూలమొక్కలు ఎన్నో అందమైన పూలు పూసి ఎంతో మంది స్త్రీల శిగలను అలరిస్తుంటే – తోటమాలి చిల్లికుండను ప్రేమతో దగ్గరకి తీసుకొని ‘పగిలిపోయిన నిన్ను నిజానికి పారేయాలి. కానీ నీ మీద నాకున్న ప్రేమ అందుకు అనుమతించదు. అందుకే నాకు తోచిన పద్ధతిలో నిన్ను వాడుకొని నీ ఉపయోగం. ఎంతవరకు వుందో అంతవరకు నిన్ను ఉపయోగించుకుంటాను.’ అని తోటకెళ్లే దారిలో మంచి, మంచి పూలమొక్కల్ని నాటి చిల్లికుండను తన కావడిలోంచి తియ్యకుండా వుంచుకున్నాడట…
దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ”పనికిరాని కొండకన్నా పగిలిన కుండమిన్న” అని…
నిశిత లాంటి వాళ్లు ఎందరో వున్న ఒక సేవా సంస్థను కలిసి మాట్లాడి వచ్చాను. అక్కడవాళ్లు చేస్తున్న పనుల్ని గమనించి ఆశ్చర్యపోయాను. వాళ్లు చేస్తున్న ప్రతి పనిలో ఉపయోగం వుంది. ఆర్థికపరమైన లాభాలున్నాయి. మానసికమైన ఉల్లాసం వుంది. అదొక బడి, అదొక గుడి అదొక పరిశ్రమ.
నిశిత తరుపున నేను డొనేట్ చేస్తున్న ఈ డబ్బుతో రేపటి నుండి నిశిత అక్కడే వుంటుంది. అలా వుండేందుకు అన్ని ఏర్పాట్లు నేను చేసి వచ్చాను. ఇకపై నిశిత ఎవరికి బరువుకాదు. తనని తను పోషించుకుంటుంది. తనకు తనే సెక్యూరిటిగా నిలబడ్తుంది. నిశితే కాదు. నిశితలాంటి వాళ్లు ఎందరో అక్కడ ఆత్మస్థయిర్యంతో ఆనందంగా వున్నారు. ఈ విషయంపై నిశిత కుటుంబ సభ్యులతో మాట్లాడవలసి వుంది. వాళ్ల అంగీకారంతోనే ఈ పని జరుగుతుంది.” అన్నాడు ద్రోణ.
ద్రోణలోని మానవత్వంతో కూడిన ఆ చర్యని అభినందిస్తున్నట్లు మళ్లీ చప్పట్లు మారుమోగాయి.
సంవేదకి ద్రోణ పాదాలని తాకాలని వుంది.
ఆ భావనకన్నా మించిన ఇంకో భావన ఏదైనా వున్నా బావుండనిపిస్తోంది. అదికూడా సరిపోదేమో అనిపిస్తోంది. ఉబుకుతున్న కన్నీరు ఆనందభాష్పాలై చెంపల్ని తడుపుతుంటే – పక్కనున్న ఆముక్త సంవేద తలని తన భుజానికి అదుముకొంది.
శృతిక వెంటనే డ్రైవర్‌కి ఫోన్‌చేసి ఒక్కతే లేచి ఇంటికెళ్లిపోయింది. శృతిక ఫోన్‌ చెయ్యటం, వెళ్లిపోవటం వేదిక మీద కూర్చుని వున్న ద్రోణ చూస్తున్నాడు. ఆమె అలా ఎందుకెళ్లిపోయిందో అతనికి అర్థం కాలేదు.
చైత్రిక ద్రోణ మీదనుండి తనచూపుల్ని తిప్పుకోలేక పోతోంది. ఆశ్చర్యానందంలోంచి తేరుకోలేకపోతోంది. తన కళ్లముందే ద్రోణ ఉన్నత శిఖరాలను అందుకోవటం చూసి గర్వంగా ఫీలవుతోంది.
సభ ముగిసింది.
కారులో కూర్చున్నాక…
”నిశిత వచ్చి వుంటే బావుండేది” అన్నాడు ద్రోణ నిశిత రానందుకు వెలితిగా ఫీలవుతూ.
”రావాలని చాలా ఉత్సాహం చూపింది సర్‌! ఒంట్లో బావుండలేదు. మీరు సభలో ప్రకటించిన విషయం తెలిస్తే సంబరపడిపోతుంది. మీరు దానికి ఇంత మంచి దారి చూపుతారని అది కలలో కూడా వూహించి వుండదు…” అంది సంవేద.
”అదెవ్వరు ఊహించరు.. కొన్ని అలా జరిగిపోతుంటాయి. ఊహలకి అందకుండా…” అంది చైత్రిక.
”ఏది ఏమైనా నేను కూడా ఓ గొప్ప అభ్యుదయ కవిత రాసి ద్రోణ చేత బొమ్మ గీయించుకోవాలి. ఈ రాత్రికే కవిత రాయటం మొదలుపెడతాను” అంది ఆముక్త.
”కవితలకి గీసిన బొమ్మలకి కూడా అవార్డులిస్తారా సర్‌?” అంది సంవేద సందేహంగా ద్రోణవైపు చూస్తూ…
”ఆముక్త రాయబోయే కవిత మీద నాకు చాలా నమ్మకం వుంది. అది తప్పకుండా అవార్డు స్థాయిలోనే వుంటుంది.” అన్నాడు ద్రోణ.
ఆ మాటలకి ఆముక్తకన్నా సంవేదనే ఎక్కువ సంతోషించింది.
గుండెలనిండా సంతోషం, మనసునిండా ఆనందం ఆ కారులో వున్న వాళ్లందరి సొంతమైంది.
ద్రోణ తల్లిదండ్రులు తమ కారులో తమ ఇంటికి వెళ్లారు.
”మీరు ముగ్గురు నాతోపాటు మా ఇంటికి రండి! ఈ సంతోష సమయంలో మా శృతిక మీకో మంచి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత మా డ్రైవర్‌ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తాడు.” అన్నాడు ద్రోణ.
”సరే” అన్నారు ముగ్గురు ఒకేసారి.
ద్రోణ ఇల్లు రాగానే నలుగురు దిగి ఒకరి వెంట ఒకరు లోపలకి నడిచారు
*****
లోపలకి వెళ్లి హల్లోకి అడుగుపెట్టగానే అక్కడ శృతికను చూసి.. ఊహించని దృశ్యాన్ని చూసినట్లు ద్రోణ మనసు మండుతున్న పెట్రోల్‌ బావిలా అయింది. శృతికను సడన్‌గా కుర్చీలోంచి లేపి చెంప చెళ్లుమనిపించాడు
చెంపను చేత్తో పట్టుకొని కొండ విరిగిమీద పడ్డట్లు ఊపిరి ఆగిపోతున్న దానిలా నిలబడింది శృతిక వెంటనే తేరుకొని ఎర్రబడ్డకళ్లతో కోపంగా చూస్తూ ”నన్నెందుకు కొట్టారు?” అంది.
ఆముక్త, చైత్రిక, సంవేద నిశ్చేష్టులై నిలబడ్డారు.
శృతిక బావ అనిమేష్‌ చంద్ర పరిస్థితి కూడా అలాగేవుంది.
”నన్నెందుకిలా కొట్టారు? అందరిలో నన్ను అవమానించాలనా?” అంది బుసలుకొడ్తూ శృతిక భర్తనే చూస్తూ…
”నిన్ను నలుగురి ముందే కొట్టి అవమానించాను. నువ్వు నన్ను అనేకమంది ఆహూతుల సమక్షంలో అవమానించావు. సభలో నేను మాట్లాడుతుండగా నా భార్య సభా మర్యాదల్ని అతిక్రమించి మధ్యలో లేచి వెళ్లిపోతే నాకెంత తలవంపో తెలుసా నీకు? భర్తంటే లెక్క వుందా నీకు?” అన్నాడు ద్రోణ.
”భర్తంటే లెక్క లేంది నాకా? మీ చుట్టు తిరిగే వీళ్ల ముగ్గురికా?” అంది వాళ్ల ముగ్గురివైపు వేలు తిప్పి చూపిస్తూ శృతిక.
ద్రోణ ఆ ముగ్గురి వైపు ఓసారి చూసి, తిరిగి శృతిక వైపు చూస్తూ…
”ఆముక్తకి ఆర్ట్ అంటే ఇష్టం… ఆమె రైటర్‌. నాకు అవార్డు రావటం ఎంతో ఆనందాన్నిచ్చి ఆమె భర్త ఆమెను ఆడిటోరియం దగ్గర వదిలివెళ్లాడు. ఆయనకి నేనంటే గౌరవం… చైత్రిక నా బెస్ట్ ఫ్రెండ్‌! నా అభివృద్ధిని తన కళ్లతో చూసుకోవాలని ఇంట్లో పర్మిషన్‌ తీసుకొనే వచ్చింది. ఇకపోతే సంవేద! ఆమె నాకు ఏమీకాదు. వాళ్ల చెల్లి బొమ్మ ఏ స్థాయిలో పదిమందిలోకి వెళ్లిందో స్వయంగా చూసుకోవాలన్న సంతోషంతో వాళ్ల మామగారు పంపగా వచ్చింది.
ఇప్పుడు వాళ్లను సేఫ్టీగా ఎవరి ఇళ్ల దగ్గర వాళ్లను వదిలే బాధ్యత నాది… ఇకపోతే అవార్డుకి వచ్చిన డబ్బుతో నిశిత జీవితాన్ని కాపాడటం కోసం ఎందుకు వాడాను అంటే ఒక ఆర్టిస్ట్‌ గా ఆ పని నాకెంతో సంతృప్తిని ఇచ్చింది కాబట్టి… మరి నువ్వు నా పర్మిషన్‌ తీసుకోకుండా మధ్యలో లేచి ఎందుకొచ్చావ్‌?” అన్నాడు చాలా వివరంగా… నీ జవాబు నాకు వెంటనే తెలియాలి అన్నట్లు కోపంగా చూశాడు.
”నాకు ఆ సభలో కూర్చోవాలనిపించలేదు. ఇరిటేషన్‌ అనిపించింది. వచ్చేశాను తప్పేంటి? ఇదేమైనా చెంప పగలగొట్టేంత నేరమా?” అంది చెంపను తడుముకుంటూ.
”అంత వరకైతే అవసరం లేకపోవచ్చు… కానీ నువ్వు మీ బావతో రహస్యంగా గడపాలని ఎవరూ లేని టైంలో అతనికి కాల్‌చేసి రప్పించుకున్నావు. అది నేరం కాదా? మమ్మల్ని అక్కడే వదిలేసి నీ ప్రైవసీ నువ్వు చూసుకున్నావు. ఇది అబద్దమా? అందుకే కొట్టాను.” అన్నాడు గంభీరస్వరంతో స్థిరంగా.
వినలేనట్లు చెవులు మూసుకొంది శృతిక.
ఇంతవరకు చూసిన ద్రోణ వేరు ఇప్పుడు చూస్తున్న ద్రోణ వేరు. అన్నట్లుగా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆముక్త, చైత్రిక, శృతిక.
అనిమేష్‌ చంద్ర నోట మాటపడిపోయినట్లు కళ్లప్పగించి చూస్తున్నాడు.
”అతను మా బావ. మా అక్క భర్త. మీరేమంటున్నారు? మీ కసలు…” అంటూ సందేహంగా చూసింది.
”నాకన్నీ పనిచేస్తున్నాయి. అర్థాలు కూడా తెలుస్తున్నాయి. ఏమన్నావిప్పుడు? అతను మీ అక్క భర్తనా? ఏ మగవాడైనా ఒక ఆడదానికి భర్తే అవుతాడు. అంత మాత్రాన ‘పనికి’ రాడా? అసలేంటి నీ ఉద్ధేశ్యం?” అన్నాడు సూిగా.
రెండు చేతులు జోడించి దండం పెడ్తూ… ”నన్నలాంటి భావంతో ఊహించి చూడకండి! నాకు అసహ్యంగా వుంది.” అంది శృతిక. ఆమె నరనరం మెలిపెడ్తున్నాయి ఆ మాటలు వినలేక..
”నేను ఊహిస్తున్నానా? పచ్చి నిజాన్ని పట్టుకొని వూహాంటావా? ఎవరూ లేని టైంలో మీ ఇద్దరు ఇలా పక్కపక్కన కూర్చుని టీ.వి.చూస్తుంటే మిగతా కార్యక్రమాలు వూహించుకోక ప్రాక్టికల్‌గా చూడలేంగా?” అన్నాడు అసహ్యంగా చూస్తూ…
భూమి చీలి వున్న పళంగా కూరుకుపోతే బావుండనిపిస్తుంది శృతికకు…
”ఇక ఆగు ద్రోణా! ఆవేశపడకు. అసలేం జరిగిందో నేను కనుక్కుంటాను. శృతిక అలాంటిది కాదు.” అంటూ ముందుకొచ్చింది చైత్రిక తన స్నేహితురాలి బాధను చూడలేక…
”ఎలాంటిదో ఒకప్పుడైతే నమ్మేవాడిని… ఇప్పుడు నమ్మను చైత్రికా! ఒక పుస్తకం పై భాగంలో వుండే అట్టను చూసి లోపల ఎంతో బాగుండవచ్చని కొన్నట్లు శృతికను కట్టుకున్నాను. లోపల వున్న కాగితాలు, ప్రింటయిన విషయాలు పనికిమాలినవని పుస్తకం తెరిచి లోపల కెళ్లాకనే తెలిసింది.” అన్నాడు
శృతిక చురకత్తిలా చూస్తూ… ”అలాంటి పుస్తకాన్ని నేను కాదు. ఈ చైత్రిక… నాకు బుద్దిలేక మిమ్మల్ని టెస్ట్‌ చెయ్యమంటే మీకు దగ్గరైంది. రుత్విక్‌ను మోసం చేసింది. దీని మీద నేనో పెద్ద లెటర్‌ కూడా రాశాను. అయినా అతనేం పట్టించుకోలేదు. నేను ఏ తప్పు చేయకుండానే మీరింత రాద్దాంతం చేస్తున్నారు.” అంది శృతిక.
శృతిక మాటలు చైత్రిక చెంప చెళ్లుమనిపించాయి… ఎర్రబడ్డ కళ్లతో శృతిక వైపు చూస్తూ…. ”ఆ లెటర్‌ నాకు రుత్విక్‌ పోస్ట్‌ చేసి ‘నీ ఫ్రెండ్‌ ఎంత పనికిమాలిందో చూడు… అలాంటి మనిషికి హెల్ప్‌ చెయ్యాలనా నా దగ్గర పర్మిషన్‌ తీసుకొని ద్రోణను టెస్ట్‌ చెయ్యాలనుకున్నావ్‌! ఇంకెప్పుడూ ఇలాంటి వాళ్లను స్నేహితులుగా చెప్పుకోకు…’ అన్నాడు శృతికా! కానీ ద్రోణలోని సంస్కారం చూసి ఆయనతో స్నేహం చేస్తున్నాను. రుత్విక్‌ కూడా ద్రోణకి ఫ్రెండయ్యాడు. మా ఆలోచనలు, అనుబంధాలు చాలా ఆరోగ్యంగా వుంటాయి. నీలాగా మొగుడికో కాల్‌ రాగానే పుట్టింటికెళ్లి వాళ్లను ఏడ్పించేంత తక్కువ స్థాయిలో వుండవు…” అంది చైత్రిక. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అన్నట్లు అందరివైపు చూసింది.
”అయితే… ఇప్పుడు మీరేమంటున్నారు? మా బావతో నేను తప్పు చేస్తున్నాననా?” అంది శృతిక ఉడుక్కుంటూ ఊపిరికూడా పీల్చటం అవసరం లేనంత వేగంగా…
”తప్పొప్పులు దైవ నిర్ణయాలు. మేము నీలాగ ఆలోచించం… నీలా అవమానించం… నీలా అనుమానించం…” అంది చైత్రిక.
ఉప్పెనలాంటి ఆగ్రహంతో.. ”నేనిక్కడో క్షణం కూడా వుండను. మీరందరు ఒకటయ్యారు”. అంటూ శృతిక బయటకి పరిగెత్తబోతుంటే…
అనిమేష్‌ చంద్ర ఆమెను గట్టిగా పట్టి ఆపుతూ… ”ఎక్కడి కెళ్తావ్‌? ఈ తొందరపాటే నిన్నీస్థితికి తీసుకొచ్చింది. ఎదుటివాళ్లను ఎందుకంత వ్యక్తిత్వం లేనివారిలా ఆలోచిస్తావ్‌? అసలు ద్రోణని టెస్ట్‌ చెయ్యమనటం తప్పుకాదా? రుత్విక్‌కి అలా లెటర్‌ రాయటం తప్పుకాదా? ద్రోణను తిరుగుబోతుగా ఊహించుకోవటం తప్పుకాదా? స్నేహాన్ని స్నేహంలా చూడకపోవటాన్ని ఏమనాలి?” అన్నాడు ఆవేశంగా….
”బావా! నువ్వు కూడా వాళ్ల వైపే మాట్లాడుతున్నావా?” అంది నీరసంగా చూస్తూ…
”ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? నేనిక్కడికి రావటమే పెద్ద తప్పని పిస్తోంది. ఆరోగ్యంగా ఆలోచించలేని నీలాంటి మనిషికి బావనని చెప్పుకోవటానికే సిగ్గుగా వుంది. నువ్వు వాళ్లను ఏ స్థాయిలోకి జారి ఆలోచించి అవమానించావో నిన్ను కూడా వాళ్లు అదే స్థాయిలో ఆలోచిస్తున్నారు. నేను నీ బావను కాబట్టి నీ తండ్రి స్థానంలో వుండి నీకో మాట చెబుతాను…” అంటూ ఆగాడు.
‘ఏమి మాట?’ అన్నట్లు చూసింది శృతిక.
మిగతావాళ్లు కూడా ఉద్విగ్నంగా చూస్తున్నారు.
”ఆకాశం మీద ఉమ్మెయ్యాలని చూస్తే అది తిరిగి మన ముఖం మీదనే పడ్తుంది. ఇదెంతవరకు నిజమో ఈపాటికి నీకు తెలిసే వుంటుంది.” అన్నాడు అనిమేష్‌ చంద్ర.
వెంటనే ఆముక్త కాస్త ముందుకొచ్చి ”చూడండి! సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. శృతికను కూడా మనం అర్ధం చేసుకుందాం! ఎందుకంటే కళాకారులను ఎవరైనా దేవుళ్ళలా భావిస్తారు. దగ్గరవ్వాలని చూస్తారు. ఆ మధ్యన ఒక సాహిత్య సభలో ఒక కవితో నాకు పరిచయం అయింది. ఒక కవయిత్రిగా కవులతో పరిచయాలు మంచిదే అన్న ఆలోచనలో వున్న నాకు అదో మంచి అవకాశమనుకున్నాను… ఆ కవిది మారుమూల పల్లెటూరు. ఆయన దగ్గర ఓ సెల్‌ఫోన్‌ వుంది. చుట్టూ పుస్తకాలు, పేపర్లు వుంటాయి. ఆయన భార్య నడవలేదట. కారణాలు నాకు తెలియవు… నాతో రోజూ ఫోన్లో మాట్లాడేవాడు. రోజుకి రెండుసార్లు, మూడుసార్లు ఆ తర్వాత లెక్కలేనన్ని సార్లు… సాహిత్య కబుర్లు కావు అవి. నన్ను ఆయన భార్య స్థానంలో వూహించుకుంటూ చెప్పే మాటలు… నాకు ఎలర్జీ అన్పించి పక్కకి తప్పుకున్నాను. ఆ తర్వాత ఆయన తాగినప్పుడు కొందరు సాహిత్యకారులతో నామీద చెడుగా ప్రచారం చెయ్యటం మొదలుపెట్టాడట. ఈ విషయం మా కవయిత్రుల ద్వారా తెలిసి బాధపడ్డాను. వాళ్లేమన్నారంటే – ”నువ్వు కొత్తదానివి కాబట్టి ఆయన్ని త్వరగా నమ్మావు. మేము కూడా నీలాగే ఆయన ఫోన్‌కాల్స్‌ ని, చెడు ప్రవర్తనని గ్రహించి ప్రతిఘటించాం. అందుకే మనమంటే ఆయనకి చిన్నచూపు. బయట మనల్ని అదీ, ఇదీ అనే సంభోదిస్తాడట… ఆయన మనకి తెలుసని చెప్పుకోవటమే మనకి అవమానం. ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీలేదు. కొత్తగా రాసేవాళ్లకి ఆయన దగ్గర జాగ్రత్తగా వుండమని మాత్రం చెబుదాం… ఒక్క మాటలో చెప్పాలంటే దొంగస్వాములకి ఆ కవి ఏమాత్రం తీసిపోడు” అన్నారు. ఒక్కరు కాదు. ఇలా ఐదారుమంది కవయిత్రులు చెప్పారు.
దీన్నిబట్టి తెలుసుకునేది ఏమీలేదు అని కాకుండా ఒక్కసారి ఆలోచించండి! ఇలాంటి ఒక్కరివల్ల మిగతా అందరు కవులమీద నమ్మకంపోతుంది. దగ్గరకాలేము. వాళ్లలో వుండే తెలివి తేటల్ని, విజ్ఞానాన్ని ఆస్వాదించలేం. నలుగురికి పంచలేం… ఇదిగో ఇలాంటి వాళ్లను చూసినా, విన్నా మన శృతికలాంటివాళ్లు తమ భర్తలు ఎంత మంచివాళ్లైనా అనుమానిస్తారు, అవమానిస్తారు… మంచి అయినా, చెడు అయినా, అనుమానమైనా, అవమానమైనా ఎక్కడో పుట్టదు. మనలోంచే పుడ్తుంది. అది మన సృష్టే. దాన్ని మనమే జీర్ణించుకోవాలి . ఉలిక్కిపడకూడదు. పారిపోకూడదు. దొంగస్వాములు ఊరంతా ఉండరు కదా! ఎక్కడో ఓ చోట మాత్రమే తళుక్కున మెరిసి చివరికి మసిపెంకులా అన్పిస్తారు. నేను చెప్పిన కవి కూడా అలాంటివాడే…
కానీ ఒక్కోసారి అన్పిస్తుంది – కొందరు కవులు, కళాకారులు చేసుకునేంత ఆత్మవంచన ఎవరూ చేసుకోరని… వాళ్ల భాషలో వున్నంత భావుకత్వం వాళ్ల మనసులో వుండదని.. కాగితాల పైన ‘పిట్టకూసింది, చెట్టు వంగింది, మబ్బు కరిగింది. ఆమె నవ్వింది’ అని రాసినట్టు వాళ్ల స్వభావాలు వుండవని… కాని ఎవరికైనా రెండు జీవితాలు ఉంటాయి. ఒకటి భౌతికం, ఇంకోటి అభౌతికం. ఇవి రెండూ ఉన్నతంగా వున్నప్పుడే చుట్టూ వున్న పరిసరాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి” అంది.
ద్రోణ వైపు చూడలేక, వస్తున్న ఏడుపును ఆపుకోలేక – తన గదిలోకి వెళ్లి బెడ్‌ మీద బోర్లాపడిపోయింది శృతిక.
వెంటనే శృతిక దగ్గరకి చైత్రిక వెళ్లబోయింది. అసలే ఆవేశపరురాలైన శృతిక ఏమవుతుందోనని…
”మీరు వెళ్లకండి? మేఘం కురిసి, కురిసి అలసిపోతే ఆకాశం తేటతెల్లగా మారుతుంది. అలాగే వదిలెయ్యండి కొద్దిసేపు శృతికను…” అన్నాడు అనిమేష్‌ చంద్ర వెంటనే ద్రోణవైపు తిరిగి.
”ద్రోణా! ఇవాళ సిటీలో నీ పోగ్రాం వుందని నాకు తెలియదు. నేను కవరేజ్‌ ఏరియాలో లేకపోవటం వల్ల మీ ఫోన్‌కాల్స్‌ నాకు రాలేదు. లేకుంటే డైరెక్ట్‌ గా ఆడిటోరియం దగ్గరకే వచ్చేవాడిని… నేను వచ్చింది కూడా ఇప్పుడే … నేను లోపలకి అడుగుపెడ్తూ మీ కారు రావటం కూడా చూశాను.” అన్నారు నేనిప్పుడే వచ్చానన్న అర్థం వచ్చేలా….
ద్రోణ మాట్లాడలేదు.
”కాలుష్యం మరో కాలుష్యానికి దారితీస్తూ ఊర్లను, నదులను, సముద్రాలను చెత్తకుండీలుగా చేస్తే, – నేల, నీరు, గాలి, భూగర్బ జలాలు ఎలా కలుషితం అవుతాయో … మనసులో అనుమానపు కాలుష్యం చెరితే జీవితం చెత్త, చెత్తగా రోత, రోతగా తయారవుతుంది. కానీ ద్రోణా నువ్వొక విషయాన్ని గమనించు. మనిషి జీవితం శూన్యానికీ, శూన్యానికీ మధ్యలో వుండే ఒకటే లాంటిది… కోపం, బాధ, అసూయ, అనుమానం… ఇలాంటివన్నీ ఎడమ పక్క వుండే సున్నాలు. ఒకటికి ఎడమపక్క ఎన్ని సున్నాలున్నా వాటికి విలువలేదు కదా! అలాగే అనుకొని శృతికను క్షమించు.. గతంలో ఆమె చేసిన తప్పుల్ని కళ్లముందుకి తెచ్చుకోకు…” అంటూ ఒక్క క్షణం ఆగాడు అనిమేష్‌ చంద్ర.
అనుమేష్‌ చంద్రను ప్రక్కకు తీసుకెళ్లి హగ్‌ చేసుకొని ”సారీ అన్నయ్య ఆమెలో మార్పు రావాలనే నేనిలా బిహేవ్‌ చేసాను అంతే కాని అన్నాడు.” ద్రోణ. ”ఏదైనా మన మంచికే జరిగిందనుకుందాం.” అంటూ ద్రోణ భుజం తట్టి వెళ్లిపోయాడు అనిమేష్‌ చంద్ర.
ఆముక్త, సంవేద, చైత్రిక ద్రోణ కారులో ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లారు.
*****
ద్రోణ తన గదిలో అటు, ఇటు తిరుగుతున్నాడు
శృతిక అలాగే పడుకొని వుంది.
ద్రోణ సెల్‌కి సంవేదనుండి కాల్‌ వచ్చింది.
ఫోన్‌లో సంవేద గొంతు విన్పించగానే సెల్‌ని చెవి దగ్గర అలాగే పట్టుకొని హాల్లోకి వెళ్లి అటు, ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు ద్రోణ.
”మీకు నిశిత ఏదో చెప్పుకోవాలంటుంది సర్‌! ముందు దానితో మాట్లాడండి! తర్వాత నాతో మాట్లాడుదురు.” అంది సంవేద మొబైల్‌ని చెల్లి చేతికి ఇస్తూ ద్రోణతో…
”అలాగే” అంటూ… ”హలో నిశితా! బాగున్నావా?” అన్నాడు వెంటనే ద్రోణ ఎంతో ఆత్మీయతను తన గొంతులోంచి మాటల్లోకి ప్రవహింపచేస్తూ…
”బాగున్నాను సర్‌! నేను ఈ జన్మలో మీ ఋణం తీర్చుకోలేను.” అంది హృదయపూర్వకంగా… కృతజ్ఞతతో కూడిన తడితో ఆమె గొంతు జీరబోతోంది.
”ఇందులో ఋణం ఏముంది నిశితా! నీ జీవితం బాగుండాలి. నేను నీకు ఇవ్వబోయే ‘నీడ’ నీకు హాయిగా అన్పించాలి. అదే నేను ఆశించేది” అన్నాడు.
”తప్పకుండా వుంటుంది సర్‌! నాకా నమ్మకం వుంది. ఇన్ని రోజులు ‘ఏ నీడన దాగను నేను’ అని అర్ధరాత్రులు లేచి కూర్చుని బోరున ఏడ్చుకున్న రోజులు వున్నాయి. బహుశా నా ఆక్రందన దేవునికి విన్పించి మీ ద్వారా నాకీ నీడను చూపిస్తున్నట్లుంది. ఇది నాలాంటి వాళ్లకి అరుదైన, అద్భుతమైన ‘నీడ” అంది. ఆ మాటలు ఆమె హృదయంలోంచి తన్నుకొస్తున్నాయి.
కదిలిపోయాడు ద్రోణ. జీవితంలో తను చేసిన పనుల్లో ఎక్కువ తృప్తిని ఇచ్చిన మంచిపని ఇదేనేమో అనుకున్నాడు.
”సర్‌! నన్ను పడగనీడలోంచి తప్పించబోతున్నందుకు మరోసారి నా కృతజ్ఞతలు.. ఫోన్‌ అక్కకి ఇస్తున్నాను. మాట్లాడండి సర్‌!” అని ఎంతో అభిమానంగా, గౌరవంగా చెప్పి… వెంటనే మొబైల్‌ని సంవేద చేతికి ఇచ్చి పక్కకెళ్లింది నిశిత.
”హలో సర్‌!” అంది సంవేద.
”చెప్పు సంవేదా!” అన్నాడు ద్రోణ… అతనంత దగ్గర వ్యక్తిలా ‘చెప్పు’ అనటం బాగుంది సంవేదకి…
”మా అందరి ముందు మీ మిసెస్‌ని మీరలా కొట్టటం ఏదోగా వుంది సర్‌! మీరసలు భార్యను కొడతారన్న విషయాన్నే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీరు నా మనసులో చాలా ఎత్తున ఉన్నారు. నా దృష్టిలో మీరు అందరిలాంటి వారు కాదు కూడా…” అంది సంవేద.
”నీ అభిమానానికి థ్యాంక్స్‌ సంవేదా! కానీ నేనొక కళాకారుడ్ని… అలౌకిక స్థితిలోకి వెళ్లి ప్రేరణ పొందుతూ దాన్ని ఒక కళారూపంలోకి ప్రజెంట్ చెయ్యాలంటే వాతావరణం చాలా ఫ్రశాంతంగా వుండాలి. ఆ టైంలో ఏ సమస్య వచ్చినా తల్లడిల్లిపోతాను. నా ఏకాగ్రత దెబ్బతింటుంది. అలాంటి నన్ను ఇన్ని రోజులు నేను ఊహించని రీతిలో ఇబ్బంది పెట్టింది. అది చెప్పినా అర్థంకాదు. ఎందుకంటే నా సమస్య నీకు తేలిగ్గా అన్పించవచ్చు… అలాగే నిన్ను బాధపెట్టే సమస్య నాకూ అలాగే అన్పించవచ్చు. అందుకే చెప్పటం వృధా!” అన్నాడు ద్రోణ.
సంవేద మాట్లాడలేదు. అతను మాట్లాడితే వినాలన్నట్లు ”ఊ” అంటోంది ఆసక్తిగా. అతనికి కూడా చెప్పుకోవాలని పిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మానసికమైన తోడు భగవంతుడు ఇస్తేనే దొరుకుతుంది. బహుశా ఇది ఆయనకు సరియైనది అన్పించే సంవేదను ఇలా దగ్గర చేసి వుంటాడు. ఇలాంటి బంధాలు ఇచ్చే స్పూర్తితో ఎంతి సంక్లిష్ట స్థితిని అయిన అధిగమించవచ్చు. అని మనసులో అనుకుంటూ…
”జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఇంత బీభత్సం చేశాడేంటి అన్పిస్తోంది కదూ! నిజమే సంవేదా! గృహహింస మంచిదికాదు. చాలా చోట్ల అది విజృంభించి మానవ హక్కుల రెక్కల్ని సైతం కత్తిరిస్తోంది. కానీ ఒక సెలబ్రిటీగా శృతికతో బాగా విసిగిపోయి దీనికి ఇదే సరైన పరిష్కారం అన్నట్లు కొట్టాను.” అన్నాడు ద్రోణ.
ప్రశాంతంగా వింటోంది సంవేద.
”నేను కొట్టటానికి ఇంకో బలమైన కారణం కూడా వుంది. చైత్రిక శృతిక బెస్ట్‌ ఫ్రెండ్‌! ఆ అమ్మాయిని ఎవరూ ఉపయోగించుకోని విధంగా ఉపయోగించుకోవాలనుకొంది. చివరకు ఆ అమ్మాయి ఉడ్‌బీకి ఓ లెటర్‌ రాసి చైత్రికను క్యారెక్టర్‌ లేని వ్యక్తిని చేసింది. ఇది తప్పుకాదా? ఇకపోతే ఇప్పుడు నువ్వున్నావు. ఫ్యూచర్లో నా బొమ్మల్ని చూసి ఫోన్‌ చేస్తావు. చూడాలనిపించి ఇంటికొస్తావు. తను భరించలేదు. ఎందుకంటే అనుమానం… నాకు నువ్వూ… చైత్రిక, ఆముక్త అందరు కావాలి. మీరు నా అభిమానులు, మిమ్మల్ని దూరం చేసుకోలేను.
ఎవరికైనా జీవిత భాగస్వామి అవసరమే. ఆమెకు చాలా విలువ కూడా ఇవ్వాలి. అలా అని భార్యే జీవితం కాదు. భార్యే సొసౖటీ కాదు. ఒక సెలబ్రిటీగా నాకు అందరు కావాలి. ఎవరో ఒకరు ఏదో ఒక థాట్ లో నాకు అవసరం అవుతూ వుంటారు. ఒక్కోసారి భార్యతో చెప్పుకోలేనివి ఇతరులతో పంచుకోవలసి వస్తుంది. అలా అని భార్యను ప్రేమించనట్టు, విలువ ఇవ్వనట్టు కాదు. శృతిక నన్ను అర్థం చేసుకోలేకపోయింది. అందుకే ముళ్లును ముళ్లుతోనే తీయాలి అన్నట్లు కొట్టాను. నేను కొట్టటం తప్పంటావా? కొట్టకుండా కూడా చెప్పొచ్చంటావా? చెప్పు!” అన్నాడు.
చెప్పటానికి తన దగ్గర ఏమీ లేదన్నట్లుగా ఒక్కక్షణం ఆగి ”మరిప్పుడు ఆమెను ఓదార్చారా? అలాగే వుంచారా?” అని మాత్రం అంది సంవేద.
”అదే చూస్తున్నా.. ఏ టైప్‌లో ఓదార్చాలా అని ఆలోచిస్తున్నా. మరి నేను వుండనా? బై, సంవేదా!” అన్నాడు ద్రోణ.
ఆమె కూడా ‘బై’ చెప్పి కాల్‌ క్‌చేసింది.
*****
ఆముక్త నిద్ర మధ్యలో లేచి కూర్చుని కవిత రాయటం మొదలుపెట్టింది… ఏదో రాయాలని దానికో రూపం రావాలని ఊపిరి బిగబట్టి ఆలోచిస్తోంది. కళాకారులు మొండివాళ్లంటారు. తాము రాయబోయేది ఎంత కష్టమైనా తెగించి శ్రమిస్తారంటారు. అలాగే ఆముక్త కూడా తన మనసు లోతుల్ని తాకుతూ ఆలోచిస్తోంది.
కవిత రాయటం అంటే ఏవో తోచిన నాలుగు వాక్యాలను రాసుకుంటూ పోవటం కాదు. కళ్లముందు జరిగే నేరాలను, ఘోరాలను, అవమానాలను, అన్యాయాలను ఎదిరించేలా అలా ఎదిరించి నిలబడేలా వుండాలి అనుకొంది ఆముక్త.
ప్రస్తుతం బ్రతుకులో బాధల బస్తాలను మోసే ఎద్దులబండిలా అన్పిస్తున్న తన భర్తే తనకి ఇన్సిపిరేషన్‌ అనుకొంది. గుండె బరువును ఆపుకోలేక పోతోంది. ఎన్ని పుస్తకాలను చదివితే వస్తుంది ఇంతి ప్రేరణ? నా అనుభవమే నన్ను నడిపించే ఉత్తమ గురువు అన్న చందంగా ఆమె కలం కాగితంపై నెమ్మదిగా పోరాడుతోంది… మనసుతో రాయటం అలవాటైన కలంలా ఊహల రథాన్ని నేలమీదకి దింపి దారినిండా ప్రజ్వలించే ఆలోచనల విత్తనాలను చల్లుకుంటూ వెళ్తోంది…..
”చెక్కిన బాణం నేరుగా వచ్చి
నిర్ధాక్షిణ్యంగా గుచ్చుకున్నట్లు
గుండెలోతుల్లోంచి చీల్చుకెళ్లి
మనసు పొరల్ని ఛేదించుకొని
అతి సున్నితమైనదేదో తునాతునలైనట్లు
ఎదలోతుల్లో ఎక్కడో నిర్ధయగా
నిప్పుల తుంపర కురుస్తున్న భావన-
ఒకవైపు ప్రపంచపు భారాన్ని మోసే అట్లాస్ లా మనిషి
ఇంకోవైపు తీరిగ్గా విశ్రమించేందుకు నిర్విరామంగా
కృషిచేస్తున్న స్పృహ…
ఒకవైపు మానసిక వత్తిడి, ఇంకోవైపు శారీరక ఇబ్బంది
ఏదో అస్పష్టమైన నిస్పృహ నిండిన నడక.
బాధల బావుల ఊటల్లోంచి బాధ్యతల మొసళ్లు
మనసును మౌనంగా చుట్టుముట్టినట్లు దారుణమైన హింస.
అందుకే అన్పిస్తోంది…
జీవితం పాలరాతిపై నడక కాదుగా అని-
యాసిడ్‌ దాడులుంటాయ్‌ ! సునామీలుంటాయ్‌! స్వైన్‌ప్లూలుంటాయ్‌!
అర్ధాంతర చావులు, కష్టాలు, కన్నీళ్లు…
అన్నినీ మించి…
గుప్పెడంత గుండెలో సముద్రమంత దుఃఖాన్ని
సమ్మెట దెబ్బలా భరిస్తూ నిట్టూర్పుల జ్వాలలు
ఏది ధారబోస్తే తీరుతుంది.
నిరంతరం తడుస్తున్న కళ్లలోని నిర్వేదం?
ఆత్మవిశ్వాసాన్ని చేతులుగా మార్చుకొని
మట్టిని పిసికితేనా?
కల్తీ నవ్వుల్ని కౌగిలించుకొని
మనసుని నలిపితేనా?
దీని మూలాలను వెతుక్కోవటం కోసం
దేన్ని పొందాలి?
దేన్ని పోగొట్టుకోవాలి?” అని
వచన కవితను రాయటం పూర్తిచేసింది ఆముక్త…..
రేపే వెళ్లి ద్రోణకి ఇవ్వాలి. తప్పకుండా బొమ్మవేస్తాడు. అనుకొని ఒకటికి రెండుసార్లు ఆ కవితను మళ్లీ చదువుకొని,… బావుందనుకుంటూ భర్త పక్కన పడుకొని హాయిగా నిద్రపోయింది.
*****
రోజులు శరవేగంగా కదులుతున్నాయి.
ఆరోజు నిండు పౌర్ణమి… వెన్నెల ఒళ్లు విరుచుకొని ఊర్లని, అడవుల్ని తడుపుతోంది.
ద్రోణ ఎప్పిలాగే డాబామీద కెళ్లి తన స్టాండ్‌బోర్డ్‌ ముందు నిలబడి బొమ్మ గీస్తున్నాడు.
ఆ నిశ్శబ్దం, ఆ వాతావరణం, ఆ వెన్నెల అతనికి గొప్పస్పూర్తి. ఓ మూర్తిని సృష్టించానికి అతను పడే ఆరాన్ని అర్థం చేసుకున్నట్లు ఓ ఒంటరినక్షత్రం నేలమీదకి అద్భుతంగా జారి కళ్లను మిరమిట్లు గొలుపుతుంటే…
అతనికి సంవేద చేసిన ఫోన్‌ కాల్‌ గుర్తొచ్చింది.
నిశితను కారుణ్య సేవా సంస్థలో జాయిన్‌చేసి వచ్చానని. తనతో అత్తగారు, మామగారు వచ్చారని… శ్యాంవర్ధన్‌ మొదట్లో వద్దన్నా మామగారు కోప్పడటంతో మెత్తబడ్డారని … ఇప్పుడు తను చాలా సంతోషంగా వున్నానని… ఆ సంతోషానికి ”మీరే కారణం’ అని గద్గద స్వరంతో చెప్పింది.
ప్రేమంటే అవతల వ్యక్తి మన దగ్గర లేనప్పుడు కూడా గుర్తుచేసుకోవటం… ఆ వ్యక్తి ఎక్కడున్నా సుఖంగా వుంటే చాలని సంతృప్తి చెందటం… సంతోషంగా వున్నానని తెలిస్తే మరింత ఆనందపడటం… అదే స్థితిలో వున్నాడు ద్రోణ.
తర్వాత చైత్రిక చేసిన కాల్‌ గుర్తొచ్చింది.
”రుత్విక్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ కంప్లీట్ అయిందని… లండన్‌ నుండి రాగానే పెళ్లి చేసుకోబోతున్నామని …తను రాసిన ఎగ్జామ్స్‌ అన్నీ ఎయిటీ పర్సెంట్ మార్క్స్‌ తో పాసయ్యానని..” అన్నీ శుభవార్తలే చెప్పింది.
వెంటనే ఆముక్త చేసిన కాల్‌ గుర్తొచ్చి మెల్లగా నవ్వుకున్నాడు.
”నేను రాసిన అభ్యుదయ కవిత నచ్చిందా ద్రోణా నచ్చితే బొమ్మ ఎప్పుడు వేస్తున్నావు? వేశాక దాన్నెప్పుడు పోటీకి పంపుతావు?అని .. ఆముక్తకి అన్నీ తొందరే. కానీ ఆముక్త రాసిన కవిత చాలా బావుంది. తప్పకుండా బొమ్మ వేయాలి. అని మనసులో అనుకుంటుండగా..
ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కి చీర కట్టుకున్న మోడల్లా పాల గ్లాసు చేత పట్టుకొని ద్రోణ దగ్గరకి వచ్చింది శృతిక… అతనికి వెనగ్గా నిలబడి, అతను వేస్తున్న బొమ్మలోకి ఆసక్తిగా చూసింది.
”ఏమండీ!” అంటూ ఎప్పుడు పిలవనంత ప్రేమగా, ఆర్తిగా, సంబరంగా పిలిచింది.
ఆ పిలుపు ఎక్కడో తాకి శతతంత్రుల్ని మీటినట్లయి, అంతవరకు వున్న శూన్యాతి శూన్యస్థితిలో భావరహితంగా నిర్ణయిస్తున్న హృదయం తన దుఃఖాన్ని కడిగేసుకుంది… తేలిగ్గా శ్వాసించి, కుంచె పక్కన పెట్టి వెనుదిరిగి భార్యవైపు చూశాడు.
పాలగ్లాసు అందివ్వబోయింది. అతనా గ్లాసు అందుకోకుండా ముందుగా ఆమె చేతిలోవున్న కాగితాన్ని తీసుకొని చూసి ఆశ్చర్యపోయాడు.
”ఇది ఆముక్త కవిత కదూ! నీ దగ్గర ఎందుకుంది?” అన్నాడు అర్థంకాక కనుబొమలు కాస్త ముడిచి.
”సాయంత్రం మీరు దీనిమీద పేపర్‌ వెయ్‌ట్ పెట్టకపోవటంతో చెత్తలో పడిపోయింది. నేను చూసి చదివాను. నాకు చాలా నచ్చింది. బొమ్మల కోసం మీ దగ్గరకి వచ్చిన కవితలన్నికన్నా ఈ కవిత బాగుంది. ముందుగా ఈ కవితకే బొమ్మ వెయ్యండి!” అంది శృతిక.
జీవితంలో ఎప్పుడూ చూడనంత ఆశ్చర్యానందంతో భార్యవైపు చూస్తూ పక్కనే వున్న స్టాండ్‌ ఊయలమీద కూర్చుని చిరుదరహాసాన్ని పెదవులమీదకి తెచ్చుకున్నాడు. వైట్ నైట్ డ్రస్‌లో అతను చంద్రోదయాన్ని తలపింప చేస్తున్నాడు.
భర్తనలా చూస్తుంటే దుఃఖమొచ్చేలా ఆత్మీయత కల్గుతోంది. విడిచి వుండలేనేమో అన్నంత బాధ కల్గుతోంది.
పాలగ్లాసుని టీపాయ్‌ మీద పెట్టి మెల్లగావెళ్లి భర్త ముందు మోకాళ్ల మీద కూర్చుంది శృతిక. అతని కాళ్ల చుట్టూ చేయివేసి ఆర్థత నిండిన మనసుతో అతని మీద తల ఆన్చి, ఒక్క నిముషం కళ్లు మూసుకుంది. ఆమె చాలా ఉద్విగ్నంగా, ఉల్లాసంగా వున్నట్లు ఆమె అంతరాంతరాల్లో ఇంతకన్నా ఇంకేమీ వద్దు అన్న భావన వున్నట్లు అర్థమవుతోంది.
నెమ్మదిగా తలెత్తి భర్త కళ్లలోకి చూసింది. అతను కూడా ఆమెనే చూస్తున్నాడు.
”ఏమండీ! ఇప్పుడు మీరు వేస్తున్న ఆ బొమ్మలో నా పోలికలే వున్నాయి కదండీ! అంటే నేను మీ మనసులో పరిపూర్ణంగా వున్నట్లేగా… ఇప్పుడు నాకెంత ఆనందంగా వుందో తెలుసా?” అంటూ తడినిండిన కళ్లతో ఆర్తిగా అతని కడుపుమీద తల ఆన్చి కళ్లు మూసుకొంది.
ఆమె తలనిమురుతూ చేయి చాపి పాలగ్లాసు అందుకున్నాడు ద్రోణ.

-: అయిపోయింది :-

1 thought on “రెండో జీవితం 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *