April 23, 2024

విరక్తి

రచన: వాత్సల్య

రాత్రి పదిన్నరవుతోంది. మానస మంచం మీద విసుగ్గా అటూ ఇటూ కదులుతోంది, ఎంత ప్రయత్నించినా నిద్రాదేవి కరుణించట్లేదు. అరగంట క్రితం గుండెల్లో సన్నని మంట మొదలయ్యింది. లేచి కాస్త మజ్జిగ కలుపుకుని తాగిందే కానీ అరగంటైనా తగ్గట్లేదు.
మంచం దిగి మాస్టర్ బెడ్రూం లోకి వెళ్ళింది. అక్కడ పని చేసుకుంటున్న భర్త దీపక్ కనీసం ఈమె రాకని గమనించినట్లు కూడా లేదు. కొన్ని సెకన్లు అతనికెదురుగా నిలబడి తనని గమనించట్లేదని బాత్రూంలోకి వెళ్ళి వచ్చి మళ్ళీ నిలబడింది. తను వచ్చాను అన్న సంకేతంగా సన్నగా దగ్గింది. ఏమిటీ అన్నట్లు విసుగ్గా తలెత్తి చూసాడు దీపక్. ఏంటో గుండెల్లో మంటగా ఉంది అంది సన్నని గొంతుతో. అయితే ఏమిటీ అన్నట్లుగా చూసాడు. మజ్జిగ త్రాగాను ఇంకా తగ్గట్లేదు అంది అతని మొహంలో మారే భావాలని చూస్తూ. అయితే ఏమంటావు, హాస్పిటల్ కి వెళ్దామా వద్దా చిరాకు ధ్వనిస్తుండగా అరిచినట్టే అన్నాడు.
ఒక్క నిమిషం మానస మనసు బాధతో మూలిగింది. వెంటనే తేరుకుని వద్దులే అని చెప్పి తన గదిలోకి నడిచింది. నెప్పంటావు డాక్టరంటే వద్దంటావు ఏమి చెయ్యమని నీ ఉద్దేశ్యం అసహనంతో దీపక్ అంటున్న మాటలు తన చెవిన పడ్డా దిండులో తలదాచుకుని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తోంది మానస. ఏమిటో మనసులో ఎడ తెగని ఆలోచనలు, ఏమిటి తన జీవితం ఇలా?? ఇద్దరికీ మంచి ఉద్యోగాలు, చక్కటి ఇల్లు, ఒక్కడే సంతానం, అయినా తామిద్దరి మధ్యా ఏదో అడ్డుగోడలు. గత కొద్ది సంవత్సరాలుగా తమ పడకలు వేరయ్యేంత దూరం. తప్పెక్కడుందో ఎంత ఆలోచించినా అర్ధం కావట్లేది మానసకి. నిద్ర పట్టక లేచి తన గదిలో చదువుకుంటున్న కొడుకు శశాంక్ దగ్గరకి వెళ్ళింది. ఏమిటమ్మా అన్నట్లు తలెత్తి చూసాడు పదహారేళ్ళ కొడుకు. ఏమీ లేదురా నిద్ర పట్టక ఇలా వచ్చాను. మొన్న కెమిస్ట్రీ నోట్స్ ఏదో రాసుకోవాలన్నావు, రాయనా అని అడిగింది. రాసిపెడతా అని తల్లి అనేసరికి అమ్మా ప్లీజ్ ఇదిగో మా ఫ్రెండు నోట్సు, అయినా టాపిక్ చూస్తే నువ్వే ఇంటర్నెట్లో చూసి చక్కటి నోట్సు ప్రిపేర్ చేస్తావుగా అంటూ నోట్సు అందించాడు.
వాడిని చూసి చిన్నగా నవ్వుకుంది మానస. ఏమిటో ఈ చదువులూ అని నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళి ల్యాప్ టాప్ ఆన్ చేసి నోట్సు రాయడంలో మునిగిపోయింది. ఆలా రాస్తూ రాస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. దాహమేసి మెలకువొస్తే టైము చూసింది. ఉదయం నాలుగున్నరవుతోంది. నీళ్ళు త్రాగి ఇలా పడుకుందో లేదో మళ్ళీ గుండెల్లో మంట మొదలు. ఇది మామూలే కదా అనుకుని నిద్ర పోవాలని ప్రయత్నిస్తోంది కానీ నెప్పి అంతకంతకూ ఎక్కువవుతోందే తప్ప తగ్గట్లేదు. కొద్ది నిమిషాల్లోనే తట్టుకోలేనంత నెప్పి. శరీరమంతా ఏదో బాధ. లేచి భర్తని పిలుద్దామనుకుంటొంది కానీ లేవలేకపోతోంది. ఓక ఐదు నిమిషాల తరువాత ఈ పెనుగులాట ఆగింది. హమ్మయ్య అనుకుని మానస లేవబోయింది. ఏంటో శరీరమంతా తేలిగ్గా అయిపోయింది. మంచం దిగలేకపోతోంది. గాల్లో తేలినట్లనిపిస్తోంది. మానసకి ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు. తనేమో గాలిలో తేలుతోంది ఇంకో పక్క తనేమో మంచం మీద నిశ్చలంగా పడుకుని ఉంది. తరచి చూసుకుంటే తను మనిషి శరీరంలోంచి బయటకొచ్చేసి ఉంది. అంటే అంటే తను చచ్చిపోయిందా?? మానసకి నమ్మశక్యంగా లేదు తను చనిపోయిందంటే.
తెల్లవారింది, కొడుకు లేచి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి అమ్మా అని లేపడానికి తన దగ్గరకొచ్చాడు. నాన్నా, నేను లేనురా అని చెప్పాలనుకుంటొంది కానీ చెప్పలేకపోతోంది. తన శరీరాన్ని అటూ ఇటూ కదిపి చూసి ఏదో అనుమానం వచ్చి నాన్నా అంటూ పరిగెత్తుకెళ్ళాడు. ఓ ఐదారుసార్లు లేపితే కానీ లేవలేదు దీపక్. అమ్మా లేవట్లేదు నాన్నా దాదాపు ఏడుపు గొంతుతో అన్నాడు శశాంక్. ఒంట్లో బాగాలేదంది పడుకుని ఉంటుందిలే నువ్వు తిన్నావా అని నిద్ర మత్తులోనే అడిగాడు. నాన్నా ఒక్కసారి అమ్మని చూడు మరోసారి అడిగాడు శశాంక్. విసుగ్గా మంచం మీదనించి లేచి తనని లేపడానికి ప్రయత్నించడం చూస్తూనే ఉంది. ఏదో అనుమానం వచ్చి కింద ఫ్లాట్లో ఉండే డాక్టర్ జగదీశ్వర్కి ఫోను చేసాడు. డాక్టరు గారొచ్చి చూసి పెదవి విరిచారు. నిద్రలోనే హార్ట్ ఎటాక్తో పోయింది దీపక్, కానీ పాపం బాగా ఇబ్బంది పడినట్లుంది చివరి క్షణాల్లో అనిపిస్తోందయ్యా మొహం చూస్తే. ఓ రెండు గంటలయినట్లుందయ్యా అందరికీ ఫోన్లు చెయ్యి అయాం సారీ అనేసి వెళ్ళిపోయారు.
తనని ఒక కొత్త చాపలో పడుకోపెట్టి తల దగ్గర దీపం పెట్టారు. అందరూ వచ్చారు. ఏమిటే అప్పుడే వెళ్ళిపోయావా అంటూ తన తల్లితండ్రులూ, అక్కలు ఏడ్వటం తనకి కనిపిస్తూనే ఉంది. కొడుకు శశాంక్ మొహం చూస్తే తనకి జాలేస్తోంది. కానీ ఏమీ చెయ్యలేదు. ఒక్కసారి వాడిని తడిమి చూసుకోవాలనుంది కానీ అయ్యే పని కాదని తెలుసు. అయ్యా సూర్యాస్తమయం కాకముందే కార్యక్రమాలు నిర్వహించాలి కానెయ్యండి తొందర పెట్టారెవరో. అయిపోయింది అంతా అయిపోయింది నిన్నటి వరకూ తిరిగిన ఇంట్లో నుండి తనని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంక తను ఏమీ చెయ్యలేదు. భర్త దీపక్ యాంత్రికంగా పురోహితుడు చెప్పిన క్రతువు చేస్తూ ఉన్నాడు ఎప్పటిలాగే అభావంగా. ఏంటి నేను అక్కర్లేదా, ఎప్పటికీ తిరిగి రానని తెలిసి కూడా ఏమిటి ఈ మనిషి అనుకుంటొంది మానస ఆత్మ. కాసేపటికి తనని చితి మీద పేర్చి కట్టెలతో కప్పెస్తున్నారు. చివరిసారిగా ఒక్కసారి చూడు బాబూ అన్నారు మానస నాన్నగారు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. నిర్లిప్తంగా నడచి వచ్చి మానస ముఖంలోకి చూసి తల అటు తిప్పుకున్నాడు దీపక్. కొడుకు శశాంక్ పాపం ఏడ్చీ ఏడ్చీ వాడి బుగ్గలమీద కన్నీటి చారికలు కట్టేసాయి. ఇదే ఆఖరుసారి తన వాళ్ళని చూడటం అనుకుంటుండగా భగ్గున లేచిన అగ్ని జ్వాలలు తన శరీరాన్ని చుట్టేసాయి.
బాబూ కపాల మోక్షమయ్యింది ఇంక బయలుదేరండి అన్న కేక వినపడటంతో అందరూ ఇంటికి బయలుదేరారు. దీపక్ ఇంటికొచ్చి అలా సోఫా వంక చూసాడు. తన కంటే అప్పుడప్పుడు ముందరే ఆఫీసు నుండి వచ్చినప్పుడు మానస అక్కడే కూర్చుని కాఫీ తాగుతూ పుస్తకం చదువుకుంటూ ఉండేది. ఒక్కసారి తల విదిల్చి లోపలకి వెళ్ళిపోయాడు.
మానస వెళ్ళిపోయి మూడు రోజులు కావస్తోంది. బంధువులూ, స్నేహితులు, చుట్టు పక్కల వారి పరామర్శల తాకిడి ఇంకా తగ్గలేదు. నాలుగో రోజు మధ్యాహ్నం బయట వాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో. కట్టాల్సిన బిల్లులు అవీ చూద్దామని కూర్చోపోతుండగా నాన్న, రాజీ ఆంటీ వచ్చింది అని చెప్పాడు శశాంక్. రాజి, మానస ఒకే ఆఫీసు. మానస అక్కడ చేరేటప్పటికే రాజి అక్కడ సీనియర్. ఆవిడ పర్యవేక్షణలో పని నేర్చుకుని స్వతాహాగా తెలివైనదైన మానస అతి త్వరలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగింది.
అయాం సారీ దీపక్, ఊర్లో లేకపోవడం వల్ల ఆ రోజే రాలేకపోయాను, రాగానే మా కొలీగ్స్ చెప్పడంతో షాకయ్యాను అంది రాజి ఉబికి వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ. అసలిదంతా ఎలా జరిగింది అని అడిగింది రాజి. ఏమో ముందు రోజు రాత్రి కాస్త ఆలశ్యంగా నిద్ర పోయిందంతే, మరునాడు లేచి చూసేసరికి. . అని ఆగిపోయాడు దీపక్. మానస గుండెల్లో మంటగా ఉందనడం ఇవన్నీ అనవసరనిపించి చెప్పలేదు. కాసేపు రాజి శశాంక్ ని దగ్గరకి తీసుకుని మాట్లాడింది. బయలుదేరుతూ తన చేతిలో ఒక కవర్ పెట్టి, ఆఫీసులో తన డెస్కులో ఉన్న వస్తువులన్నీ ఈ కవర్లో ఉన్నాయి. మానస అప్పుడప్పుడు లంచ్ టైములో ఏదో రాస్తుండేది.
మాకెవ్వరికీ తెలుగు రాదు అందుకే తను ఏమి రాస్తోందో కూడా మాకు తెలీదు. అడిగితే ఏవో చిన్న కధలు నా బ్లాగుకోసం అనేది తప్ప అంతకు మించి ఇంకెప్పుడూ నేను రెట్టించలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తనని గమనించి చెప్తున్నాను అందరితో ఉన్నప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఆలోచనలలోకి జారిపోయేది. ఆఫీసు బస్సులో చూసాను తన కనుకొసల నుండి నీరు జారడం. ఇది చదివి తనకి మిగిలిన కోరికలేమైనా ఉన్నాయేమో చూసి వీలయితే తీర్చు దీపక్, కార్యక్రమాలన్నీ అయ్యాకా శశాంక్ ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది.
దీపక్ కి ఏమీ అర్ధం కాలేదు. మానసకి డైరీ రాసే అలవాటు లేదు తనకి తెలిసి. ఏమి రాసి ఉంటుందో అని చదవాలని కుతూహలంగా ఉన్నా ఎవరో రావడంతో పక్కన పెట్టేసాడు. జరగవలసిన కార్యక్రమాలు ఇతర పనులతో దాదాపు పదకొండో రోజు వరకూ దానిని తెరిచి చదవలేకపోయాడు. ఇక రేపటితో ఈ కార్యక్రమాలు ఆఖరు బాబూ, దానికి మనం తిలోదకాలిచ్చేస్తాము. ఇక దాని ప్రయాణం అది మొదలెడుతుంది అని చెప్పారు మానస నాన్నగారు. ఆయనని చూస్తే జాలేసింది దీపక్కి. డెబ్భై ఐదేళ్ళ వయసులో రాకూడని కష్టం పాపం అనుకున్నాడు. ఆ రోజు రాత్రి డైరీ తెరిచాడు.
మొదటి పేజీలో దాదాపు ఐదేళ్ళ క్రితం తమ పెళ్ళిరోజు నాడు రాసినది. అక్షరాల వెంబడి దీపక్ కళ్ళు పరుగెత్తడం మొదలెట్టాయి. దీపూ, ఈ సంబోధన చూడగానే చిన్న అలజడి దీపక్ లో. తాము కలిసి చదువుకునే రోజుల్లో అలా పిలిచేది మానస తనని. ఒక్కసారి ఆరోజులు గుర్తొచ్చాయి. ఆలోచనలని పక్కన పెట్టి ఏమి రాసిందో చదవడంలో మునిగిపోయాడు.
అసలు మన పెళ్ళిరోజున ఇద్దరం ఇలా ఎడ మొహం పెడ మొహంగా ఉంటామని మచ్చుకైనా అనుకోలేదు. ఏమయ్యింది దీపూ నీకు????బ్యాంకుల్లో మూలిగే డబ్బు లేకఫోయినా ఇద్దరమూ సరిపోను సంపాదిస్తున్నాము. నా సంపాదన నీ కంటే ఎప్పుడూ తక్కువే అనుకో. నీ దాంట్లో సగం కూడా ఉండదని నువ్వు ఎగతాళి చేస్తే కోపమొచ్చి నీతో మాట్లాడని రోజులున్నాయి కానీ ఇప్పుడు ఆలోచిస్తే అదే నిజం కదా నిజం మాట్లాడితే నాకెందుకు కోపం అని నవ్వొస్తోంది తెలుసా. అవును నేను సెంటిమెంటల్ ఫూల్ ని, ఎప్పుడూ నీకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాను. కానీ ఇవన్నీ గతానుభవాల పాఠాలని నీకర్ధమయ్యేలా ఎలా చెప్పేది??చెప్తే నువ్వెమో అంతా ట్రాష్, అలా ఏమవ్వదులే నువ్వు నోర్మూసుకో అంటావు. నీకు తెలుసా నోర్మూసుకో అంటే నా మనసెంత గాయపడుతుందో.
అదే మాట చెప్తే చెంప పగలగొట్టాలి కానీ జస్ట్ ఆ పని చెయ్యలేదని సంతోషించు అన్నావు పైగా ఎదుగుతున్న పిల్లాడి ముందు. వాడి ముందు ఏమిటా మాటలు అంటే నేర్చుకోనీ, ఆడదాని నోరు లేస్తే ఎలా ఆపాలో తెలియాలి కదా అన్నావు. అసలు నీ నోట్లో నుండి ఇలాంటి మాటలు వస్తాయని ఎవ్వరూ నమ్మరు తెలుసా?? ఒకసారి మా అమ్మా వాళ్ళకి తనతో గొడవయిందమ్మా అని చెప్తే నువ్వే ఏదో నోరు పారేసుకుని ఉంటావు అన్నారే గానీ నీ మీద పిసరంతైనా అనుమానం రాలేదు తెలుసా. నీ మీద అంత నమ్మకమున్నందుకు గర్వపడాలో, నన్ను అర్ధం చేసుకునేవారెవ్వరని ఏడ్వాలో అర్ధం కాలేదు.
అయినా నిన్న ఏమన్నానని నా మీద చెయ్యి చేసుకున్నావు అదీ పని మనిషి ముందు?? నీ మేనళ్ళుడికి కొన్న వాచీ ఖరీదు ఐదు వేలు తక్కువెందుకు చెప్పావు అని అడిగాననే కదా. నాది తప్పే నీ ఈమెయిల్ తెరిచి చూడటం, కానీ ఎందుకు తెరిచానో తెలుసా?? నీ ఖర్చుల మీద అదుపు ఉండట్లేదు బయట వారికి పెట్టేటప్పుడు, మన శశాంక్ అడగక అడగక ఏమైనా అడిగితే కాలయాపన చేస్తున్నావు అని. దొరికిపోయినందుకు సిగ్గు పడకుండా సమర్ధించుకుంటావా?? అదే పని నేను చేసుంటే అంటే ఏమన్నావు?? ఏమో నీ జీతంతో ఎవడికి ఏమి కొనిస్తున్నావో అన్నావు “ఎవడికి” అన్న మాటని ఒత్తి పలుకుతూ. ఆ మాటకి విలవిల్లాడిపోయాను. అదే మాట నీతో చెప్తే ఆ పొడుచుకొచ్చిందండీ అంటూ ఎగతాళి.
ఇది చూడగానే ఐదేళ్ళ క్రితం మానసకి అబద్ధం చెప్పి తన మేనళ్ళుడికి కొన్న వాచీ, తదనంతర సంఘటనలు మెదిలాయి దీపక్ మనసులో. తను అడ్డంగా దొరికిపోవడంతో కోపం ఆపుకోలేక మానస మీద చెయ్యి చేసుకున్నాడు.
దీపక్ మరలా చదవడం ప్రారంభించాడు.
రాత్రి వచ్చి నేనే సారీ చెప్పి మాట్లాడినా ఉలుకూ పలుకూ ఉండదు నీ నుండి. ఆసలు కోపం వస్తే అలా బెల్లం కొట్టిన రాయిలా ఎందుకయిపోతావో అర్ధం కాదు నాకు. ఎన్ని వందల సార్లు అడిగుంటాను నిన్ను నీకు కోపమొస్తే ఏమి చెయ్యాలి అని?? ఏమన్నావో గుర్తుందా?? ఏమీ చెయ్యకు అలా వదిలెయ్యి. నాకిష్టమైనప్పుడు మాట్లాడుతాను అన్నావు. నీ అంతట నీకు కోపం తగ్గడం అనేది కల్ల, నా అంతట నేనే పలుకరిస్తే(నిజం చెప్పొద్దూ నాకు నిన్ను పలుకరించే ధైర్యం ఉండదు, ఎస్సెమ్మెస్సు, ఫోన్ల ద్వారా అడగడమే ప్లీజ్ మాట్లాడు మాట్లాడు అని. అలా ఓ పదిసార్లు బ్రతిమాలించుకుని సరే మాట్లాడుతాను కానీ ఇన్ని రోజులూ ఎందుకు మాట్లాడలేదు నీకు కోపమొస్తే ఏమి చెయ్యాలి లాంటి ప్రశ్నలు ఉండకూడదు అలా అయితేనే ఓకే అంటేనే మాట్లాడతా అంటావు. ఈ మాట విని మొదట్లో ఏడుపొచ్చేది ఇప్పుడు నవ్వొస్తోంది దీపూ.
డైరీ అంతా తమ మధ్య జరిగిన గొడవలూ తను అనుభవించిన క్షోభని వివరంగా రాసుకుంది మానస.
స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద నిలబడగలాలి అంటావు దీపూ, కానీ అవన్నీ అలా బయటకి చెప్పడానికే గానీ ఆచరించడానికి కాదు అని నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొన్ని నెలలకే అర్ధం అయ్యింది. నేను ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టి నా జీతం కూడా నువ్వు తీసుకుంటున్నా మన ఇంటి అవసరాలకే కదా అని మొదట్లో చూసీ చూడనట్లొది లేసాను. కానీ అపాత్ర దానాలు ఎక్కువవ్వడంతో ఏమిటీ ఇదంతా అని అడిగానని నీ ఇగో దెబ్బ తింది.
నాకర్ధమయ్యిందేమిటంటే స్త్రీ అంటే చెప్పు కింద పడి ఉండాలి నీ దృష్టిలో. అలా అని నేనేమీ స్త్రీలు, స్వతంత్రత అని ఉపన్యాసాలిచ్చే రకం కూడా కాదు, నాకు కుటుంబమే ముఖ్యం. అందుకే నా తోటివారు కెరీర్లో రాకెట్ స్పీడుతో ఎదుగుతున్నా నేనింకా మధ్య స్థాయిలోనే ఉన్నాను దీపక్. నైట్ షిఫ్టులు పని చేసే ఆడవారి మీద నీకు ఉన్న అభిప్రాయం విన్నాక ఒళ్ళు జలదరించింది. అయినా సర్దుకుపోయాను.
నేను సర్దుకుపోతున్న కొద్దీ నీ మొండి వైఖరి మితిమీరిపోతోంది. వారాల తరబడి మాట్లాడుకోకపోవడం నిత్య కృత్యం అయిపోయింది. ఫ్రతీ సారీ నేనే వచ్చి పలకరించాలి, నీకు తెలుసు మన గొడవలన్నింటికీ కారణం నువ్వే అని. హింసించే వాడంటే తాగుడు అలవాటొ, బయట తిరగడమే కాదు దీపక్, మాటలతో గుండెల్ని చీల్చేసే నీలాంటి వాళ్ళ హింస బయటకి కనపడదు, అవన్నీ భరిస్తున్న స్త్రీ కళ్ళలోకి లోతుగా చూస్తే తప్ప. ఇలా కాదు దీపూ మనం కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుందాము అంటే అవన్నీ అనవసరం అంటావు తేలికగా.
నీకర్ధం కావట్లేదు దీపూ, బీటలు వారిన మన బంధాన్ని బీట వారిన ముక్క తీసి పక్కన పెట్టకుండానే అలాగే లాగిం చేస్తున్నాము ఇది ఎప్పటికైనా శాశ్వతంగా మనల్ని దెబ్బ తీస్తుంది అని. అదే అంటే చివరికి జరిగేదదేలే అంటావు. మన బంధాన్ని నిలుపుకోవాలని ఒక్కదానినే ఎన్ని ప్రయత్నాలని చెయ్యాలి??
ఈ పదిహేనేళ్ళల్లో ఒక్కసారి తప్ప ప్రతీ సారీ నేనే వచ్చి మాట్లాడాను, కొత్తలో అస్సలు అర్ధమయ్యేది కాదు నా తప్పేమి లేకపోయినా నేనే ఎందుకు సారీ చెప్పాలో. కానీ నీతో మాట్లాడకుండా ఉండలేక సారీ చెప్పేదానిని. . అది ఒక అలవాటయిపోయింది నీకు. యాంత్రికంగా తయారైపోతున్నాను దీపూ, సారీ చెప్పినా మనస్ఫూర్తిగా చెప్పట్లేదు , నీ తప్పు తెలుసుకో అంటే ఏమంటావు?? ప్రతీ సారీ మాట్లాడతావుగా ఒక్కసారి మాట్లాడితే నీ సొమ్మేమీ పోదు అని ఎంత తేలికగా అంటావు?? నా గుండెల్లోని బాధ నీకెలా చెప్పాలి?? ఎంత బాధ పడుతున్నాను తెలుసా అంటే నీ వల్ల మేమేమీ ఇక్కడ సుఖాలు అనుభవించెయ్యట్లేదంటావు.
ఒక్కసారి మాత్రం ఒక ఉత్తరం రాసి ఒట్టు పెట్టుకున్నావు ఇంకేప్పుడూ నా మీద చెయ్యెత్తననీ, సూటి పోటి మాటలనననీ, జరిగిన దానికి చింతిస్తున్నాననీ. కానీ రెణ్ణెల్లు కూడా గడవకముందే నీ పాత పంథా మొదలు. అడిగితే సూటి పోటి మాటలు లేదా చేతి సత్కారాలు.
అప్పుడెందుకు ఒట్టు పెట్టుకున్నావు అంటే లేచొచ్చి నన్ను తన్నావు గుర్తుందా, బాధతో విలవిల్లాడుతూ లేవలేకపోతే శశాంక్ వచ్చి లేవదియ్యబోతే వాడినీ వారించావు మీ అమ్మ నాటకాలు నీకు తెలీవు అంటూ. నీ మీద కోపం, ఏమీ చెయ్యలేని నా నిస్సహాయతా పాపం వాడి వీపుమీద వాతలుగా తేలేవి. ఒకరోజు నేను ఒట్టు పెట్టుకున్నాను నీ ముందే నీకు గుర్తుందో లేదో, ఇంకెప్పుడూ నీ మీద కోపం తెచ్చుకోనని. అవును నా మాటకి కట్టుబడే ఉన్నాను నేను. ఇంతకు ముందు లాగా నిన్ను ఎందుకిలా చేసావని అడగట్లేదు కదా నా మానాన నేను ఉంటున్నాను. ఇంకా ఏమి చెయ్యాలి దీపూ ఏదో చిన్న చిన్న విషయాలకి కూడా అలా బిగుసుకుపోయి వారాల తరబడి మాట్లాడవేమిటి అంటే నా మీద కోపం తెచ్చుకోనన్నావు కానీ నీ మాట మీద ఉన్నావా అంటావు.
బహూశా నీ దృష్టిలో కోపం తెచ్చుకోను అన్నానంటే నువ్వేమి చేసినా నవ్వుతూ ఏమీ జరగనట్లే ఉండి నీ అడుగులకి మడుగులొత్తుతూ ఉండాలేమో.
ఒక మనిషికి విరక్తి కలిగితే ఏమవుతుందో చూడాలంటే నేనే ఉదాహరణ. అసలు పూర్తిగా నిన్ను పట్టించుకోవడం మానేసాను ఏదో ప్రపంచానికి భార్యా భర్తలమంతే మనము. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడే మన పడకలు ఒక గదిలో లేకపోతే ఎవరి దారి వారిదే. నీ మీద నుండి మనసు మరలించుకోవాలని ఎన్నో వ్యాపకాలు పెట్టుకున్నాను. మొన్నటికి మొన్న ఏమిటి దీపూ ఎన్ని రోజులిలా మాట్లాడవు, ఇలా అడగకూడదనే ఎన్నో పనులతో తలమునకలవుతున్నాను అంటే ఏమో ఎవరికి తెలుసు నువ్వెందుకు అవన్నీ చేస్తున్నావో అన్నావు శ్లేషతో. అప్పటికప్పుడే భూమి చీలి నిలువునా కూరుకుపోతే బాగుండనిపించింది.
ఇవన్నీ చూసి మన పిల్లాడు కూడా ఇలా తయారయ్యి ఇంకొక అమ్మాయిని బాధపెడతాడేమో అని రోజూ రాత్రి నేను వాడితో చెప్పించే నాలుగు మాటలేమిటో తెలుసా, ఎప్పుడూ భగవంటుండి నుండి దూరం జరుగకు, అబద్ధం చెప్పకు, ఎవ్వరి మీదా చెయ్యెత్తకు ముఖ్యంగా స్త్రీల మీద, ఎక్కడా అప్పు తీసుకోకు. ఇది చదవగానే దీపక్ కళ్ళకి సన్నని నీటి పొర కమ్మింది.
అసలు వాడితో ఏమి చెప్పిస్తోందో తెలుసుకోకుండానే మానసతో ఎంత ఎకసెక్కంగా మాట్లాడాడు తను, ఏమిటీ నీ పైత్యం అంతా వాడికి నూరి పోస్తున్నావా వాడికి పడుకునేముందు కూడా అంటూ. అయినా తను మౌనంగా ఉందంటే…. . ఇక డైరీ చదవాలనిపించలేదు.
ఆలోచిస్తున్న కొద్దీ దీపక్ తల తిరిగిపోతోంది. మగవాడిననే అహంకారంతో ఎంత తప్పు చేసాడు, స్త్రీ అలా పడి ఉండాలంతే అని నరనరానా జీర్ణించుకుపోయిన తను పెళ్ళికి ముందు ఎన్ని తియ్యని కబుర్లు చెప్పాడు మానసతో. పాపం పిచ్చిది అవన్నీ నిజమే అని నమ్మి తనతో కలిసి ఏడడుగులు నడవగానే నిజస్వరూపం బయట పెట్టాడు. కనీసం మీ అమ్మా వాళ్ళ ముందైనా అలా పూచిక పుల్లలాగ తీసేసినట్లు మాట్లాడకు, నువ్వే గౌరవించకపోతే వాళ్ళూ అలాగే చూస్తారు అని ఎన్ని సార్లు వేడుకుందో పాపం. దానికి తనేమనెవాడు?? గౌరవం అడుక్కుంటే వచ్చేది కాదు నీ అంతట నువ్వు సంపాదించుకోవాలి వాళ్ళ దగ్గర అని ఎంత వెటకరించాడు. .
తలచుకుంటున్న కొద్దీ మనసు భారమయిపోతోంది. పెళ్ళికి ముందు తను దూరమవుతుందేమో అని వేదన పడ్డ రోజులు గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడు శాశ్వతంగా తనని విడిచి పెట్టి వెళ్ళిపోయింది పిచ్చిది. ఒక్క నెల ముందు ఈ డైరీ చదివుంటే తనని అర్ధం చేసుకునే వాడినేమో అన్న ఊహే తనని పిచ్చివాడిని చేస్తోంది. ఆఖరు రాత్రి కూడా నెప్పి అని చెప్పడానికొస్తే ఎంత కసురుకున్నాడు తను?? చేజేతులా తన మానసని తనే చంపుకున్నాడని అర్ధమయ్యి దీపక్ కళ్ళ నుండి ధారాపతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి, ఇదంతా తనకే కొత్తగా ఉంది, తనలో ఇంత ఆర్ద్రత ఇంకా మిగిలుందా అనుకుంటూ. అలా ఎంత సేపు ఏడ్చాడో తెలీదు.
బాబూ పంతులుగారొచ్చే టైమయ్యింది అంటూ మామగారు లేపడంతో గబగబా స్నానం చేసి తయారయ్యాడు. క్రతువంతా అయ్యాకా బాబూ ఈ పిండాన్ని అలా బయటకి తీసుకెళ్ళి పెట్టండి , పోయిన వారు కాకిరూపంలో వచ్చి స్వీకరిస్తారు అని పురోహితుడు చెప్పడంతో డాబా మీద పెట్టి నిల్చున్నాడు. ఎంత సేపైనా ఒక్క కాకి జాడ కూడా లేదు. ఇప్పుడు కాకులెక్కడ ఉన్నాయిరా, కాకి రాకపోతే ఏమి చెయ్యాలో పంతులుగారిని అడగనా అంటున్న తన తల్లి వంక తీక్షణంగా చూడటంతో ఆవిడ మిన్నకుండిపోయింది.
మానసా ప్లీజ్ నన్నిలా బాధ పెట్టకు, నిన్ను క్షోభ పెట్టానురా క్షమించు అని అరిచి కింద పడి ఏడుస్తున్న దీపక్ని అందరూ తెల్లబోయి చూస్తున్నారు. మానస అమ్మా నాన్నలకయితే నోట మాట లేదు.
ఇంతలో ఆకాశం అకస్మాత్తుగా చల్లబడింది, చల్లటి గాలి వీచడం మొదలయ్యింది. బాబూ వర్షం వస్తుందేమో కాకి రాకపోతే…. ఇంకా పంతులుగారి మాట పూర్తి కాలేదు ఎక్కడి నుండి వచ్చిందో ఒక కాకి వచ్చి తిని వెళ్ళిపోయింది.
థాంక్యూ మనూ థాంక్యూ ఆకాశం కేసి చూస్తూ పిచ్చిగా అరిచి కూలపడి ఏడుస్తున్న దీపక్ దగ్గరకి వెళ్ళడానికెవరూ సాహసించలేదు.
ఆరోజు రాత్రి శశాంక్ పడుకోవడానికి వెళ్ళబోతుంటే దగ్గరకి పిలిచి, ఏదీ చెప్పు, ఎప్పుడూ భగవంతుడికి. . అని దీపక్ అంటుంటే శశాంక్ నోట మాట రాలేదు. తండ్రి వంక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. “మంచీ చెడూ ఏది ఎదురైనా సరే భగవంతుడికి దూరంగా జరగకూడదు”, “ఎవ్వరి మీదా చెయ్యెత్తకూడదు ముఖ్యంగా స్త్రీ మీద”, “అబద్ధ మాడకూడదు”, ”ఎవ్వరి దగ్గరా అప్పు చెయ్యకూడదు” అని చెప్పి తండ్రి భుజం మీద తల వాల్చాడు శశాంక్.
సరిగ్గా అప్పుడే గోడ మీద ఆరోజే అమర్చిన మానస ఫోటోకి వేసిన దండ లో నుండి పువ్వు జారిపడింది నేనూ మీతోనే అన్నట్లుగా.

1 thought on “విరక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *