March 28, 2024

ఆఖరి కోరిక

రచన: నిష్కలశ్రీనాథ్

ఎక్కడో దూరంగా మసీదు నుండి ప్రార్ధన మొదయిలైంది .
అప్పుడే సుభద్రకి మెలకువ వచ్చింది పక్కన భర్త రాఘవ కనిపించలేదు, బాత్రూంలో వెలుతురు కనిపిస్తుంది. రాత్రి జరిగిన గొడవ గుర్తొచ్చింది సుభద్రకి ‘బహుశా నిద్ర పట్టి ఉండదు లేదంటే ఇంత త్వరగా లేస్తారా ‘ అనుకుని మంచం మీద నుండి లేచింది.
వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టింది. హాలులో ఉన్న బాత్రూంలోకి వెళ్లి స్నానం ముగించుకుని వచ్చింది .
రాఘవ అప్పటికే రెడీ అవుతుండడం చూసి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టింది .
రోజు ఒక అరగంట నడకకు వెళ్లడం రాఘవకు అలవాటు. తాను బయటికి వెళ్లేలోగా కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది సుభద్ర,
ఏం మాట్లాడకుండా తాగేసి వెళ్లిపోయాడు.
‘ఏం మనిషో ఇంత వయసు వచ్చిన ఈ కోపం మాత్రం తగ్గలేదు ‘అనుకుంది .
రాఘవ రిటైర్ అయ్యి సంవత్సరం కావస్తుంది. ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్లు వాళ్ళ పిల్లలు, సంసారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఎప్పుడో పండగకు రావడం ఒక రెండు రోజులు ఉండి వెళిపోవడం రాఘవ కు బాగానే గడుస్తున్నా సుభద్ర కు మాత్రం కొన్నేళ్ల నుండి ఒకే రకమైన జీవితం విసుగు పుడుతుంది .
సుభద్ర వాళ్ళ ఊరు చాలా దూరం. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి అని చాలా దూరం అయినా అమ్మాయి సుఖపడుతుంది అని రాఘవతో పెళ్ళి చేసారు సుభద్ర తల్లి తండ్రులు.
కాని సుభద్రకు అ ఊరు విడిచి రావడం ఇష్టం లేదు కాని పెళ్ళి అయ్యాక నీ భర్త వెంటే నువ్వు అని అందరు నచ్చచెపితే పద్దెనిమిదేళ్ళ వయసులో కొత్త పెళ్లికూతురులా ఈ ఊరులో అడుగుపెట్టింది
ముప్పైదు సంవత్సరాలు అయింది, పిల్లల పెంపకంలో కాలం ఎంత త్వరగా గడిచిపోయిందో తెలీలేదు సుభద్ర కి పిల్లలకి పెళ్లిల్లు అయిపోయాక మెల్లగా ఒంటరితనం అనిపించసాగింది .
రాఘవ రిటైర్ అయ్యేవరకు వేచి ఉండి అప్పుడు తన మనసులో ఎప్పటి నుండో ఉన్న కోరిక రాఘవ ముందు ఉంచింది .
దానిని అంతగా పట్టించుకోని రాఘవ చూద్దాం అంటు మూడు నాలుగు నెలలు దాటవేసాడు కాని పట్టు వదలకుండా అడుగుతూనే ఉంది. దాని పర్యవసానమే నిన్న జరిగిన గొడవ .
సుభద్ర తను పుట్టి పెరిగిన ఊరంటే ఎంతో ఇష్టం తనకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది ఆ ఊరు .
తన స్నేహితురాళ్ళు కొంతమంది అదే ఊరు లో పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. ఇంకొంతమంది దగ్గర ఊర్లలో స్థిరపడ్డారు. తను మాత్రమే చాలా దూరంలో ఉంది .
ఎప్పుడైనా ఊరు వెళ్లినా పట్టుమని పది రోజులు కూడా ఉండే అవకాశం లేకపోయేది సుభద్రకు. ఎప్పటికైనా తను పుట్టిన ఊరు లోనే కన్ను మూయాలని సుభద్ర కోరిక .
తన జీవితంలో చాలా భాగం అయిపొయింది ఇంకా మిగిలిన జీవితం తన ఊరులో గడపాలని కోరికను రాఘవ కు చెప్పింది.
మొదట్లో రాఘవ తను ఏమి సమాధానం చెప్పకపోతే ఉరుకుంటుంది అనుకున్నాడు.
కాని సుభద్ర పదే పదే అడుగుతుంటే నచ్చచెప్పాలని ప్రయత్నించాడు.
కాని సుభద్ర వినకపోయేసరికి కోపం వచ్చి గొడవ పెట్టుకున్నాడు .
“నీ కోరిక తీరడానికి ఇన్నేళ్ళుగా ఉన్న ఊరుని వదిలేసి రమ్మంటావా ఈ వయసులో. అక్కడికి వచ్చి ఎలా సర్దుకుపోగలను ”
అ మాట వినేసరికి చాలా ఏళ్లుగా మనస్సులో ఉన్న బాధ అంతా ఒక్కసారి బయటకు వచ్చింది సుభద్రకు. “పద్దెమినిమిదేళ్ళు పెంచిన తల్లితండ్రులని, పుట్టి పెరిగిన ఊరుని, నా అనుకునే వాళ్ళను వదిలేసి మీతో ఈ ఊరు వచ్చేసాను అన్నిటికి సర్దుకుపోయాను.
ఇన్నేళ్ల మన సంసారంలో నా గురించి మిమ్మలిని ఏ కోరిక అడగలేదు .
అ వయసులో ఏ నమ్మకంతో ఈ ఊరిలో అడుగుపెట్టానో, మీరు అదే నమ్మకం తో నా కోరిక మన్నిస్తారని అనుకుంటున్నా ” ఎప్పుడు తనతో అలా మాట్లాడని సుభద్రని చూస్తూ ఉండిపోయాడు రాఘవ .
రాఘవ మాట్లాడేలోపు గదిలోకి వెళ్ళి నిద్రపోయింది సుభద్ర .

*****************

రాఘవ నడుస్తున్నాడు అన్నమాటే గాని సుభద్ర గురించే ఆలోచిస్తున్నాడు.
నిన్న తను మాట్లాడిన దానిలో నిజం ఉంది, కాని ఎందుకో వెంటనే అ కోరికని మన్నించలేకపోతున్నాడు . ఈలోగా కాస్త అలసట అనిపించి అక్కడ బెంచ్ కనిపిస్తే అక్కడ కుర్చున్నాడు.
పక్కనే ఉన్న బెంచ్ మీద ఒక ముప్పైఏళ్ళ యువతీ కూర్చుని ఉంది.
ఎందుకో ఆమె మొహంలో విషాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఇంతలో ఆమె ఫోన్ మోగింది. ఆమె మాటలు బట్టి అర్థం అయింది ఆమె విషాదానికి కారణం .
ముగ్గురు అబ్బాయిల తరువాత లేక లేక పుట్టిన ఆడపిల్ల చాలా గారాబంగా పెరిగింది .
తనను పెళ్ళి చేసుకున్న వెంటనే భర్త కి బ్యాంకు లో ఉద్యోగం రావడంతో తమ కూతురు అదృష్టవంతురాలు అని మురిసిపోయారు .
కాని అ ఉద్యోగంలో తరచు బదీలీలు అవుతుంటే తల్లితండ్రులకి దూరం అయిపొయింది .
వాళ్ళ అమ్మ నాన్న ని చూద్దామన్నా ఎప్పుడు పంపేవాడు కాదు . ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు అని ఫోన్ వస్తే పిల్లలకి పరీక్షలని అవి అయిపొయాక వెళ్ళమని అన్నాడంట భర్త .
అమ్మ ని వెంటనే చూడాలనిపించినా భర్త అర్థం ఎలాగూ చేసుకోడని గుడికి అని చెప్పి ఇక్కడ బెంచి మీద కూర్చుని బాధపడుతుంది అని అర్థం అయింది రాఘవ కి .
ఆమె తన బాధంతా ఎవరికో హిందీ లో చెపుతుంది.
రాఘవ కి ఒక్కసారి ఎవ్వరో చెంప చెళ్లుమనిపించినట్లు అయింది .
నిజమే ఇన్నేళ్ల లో సుభద్ర తల్లితండ్రులకి అవసరం అయినప్పుడు ఎప్పుడు పంపలేదు. ఎవో కారణాలు చెప్పి ఆపేసేవాడు. ఇప్పుడు కూడా అ యువతి తన కూతురి వయసున్న అమ్మాయి కావడంతో ఒక తండ్రి గా ఆ అమ్మాయి బాధ చూడలేకపోయాడు.
ఈలోగా ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడటం అయిపోయింది. తన దగ్గరకి వెళ్ళి పరిచయం చేసుకుని తండ్రి లాంటి వాడినని అని ఓదార్చాడు,
వీలైతే తన భర్త దగ్గరకు వచ్చి నచ్చచెప్తానని మాట ఇచ్చాడు .
భాష తెలియని ఊరులో తమ భాషలో మాట్లాడి ఓదార్చడం ఆమెకు కాస్తా ఊరట నిచ్చింది .
ఆమె మొహం లో విషాదం మాయం అవడంతో ఊపిరి పీల్చుకుని ఇంటి దారి పట్టాడు రాఘవ మనసులో అప్పటికే నిర్ణయం తీసుకున్నాడు.

***************
సుభద్ర టిఫిన్ వంట పూర్తి చేసి వంటిల్లు సర్దుతుంది .
రాఘవ వచ్చే వేళ అయ్యింది. స్నానంకి వేడినీళ్లు పెడదామని అటు వెళ్లే లోపు గుండెల్లో సన్నగా నొప్పి ప్రారంభం అయింది .
మెల్లగా నొప్పి ఎక్కువ అవుతుంటే నొప్పికి తట్టుకోలేక అక్కడే నేల మీద కూలబడింది.
నొప్పి కి మెలికలు తిరుగుతుంటే ఈలోగా గేట్ శబ్దం అయింది.
ఎంతో ఆశతో తన నిర్ణయం ని చెపుదాం అని వచ్చిన రాఘవకి సుభద్ర పరిస్థితి చూసి కాళ్ళు చేతులు ఆడలేదు, వెంటనే బయటకి వెళ్ళాడు ఆటో ని పిల్చుకురాడానికి కాని ఇక్కడ సుభద్ర కి నొప్పి ఎక్కువ అవ్వసాగింది . ఒక్కసారిగా తను పుట్టినప్పటి నుండి నిన్నటి వరకు జరిగిన సంఘటనలు గుర్తుకువచ్చాయి,
తన నుండి ఏదో బయటికి వెళ్తున్నట్టు అనిపించింది.
అప్పుడు తన మనసులో అనుకుంది ‘తన కోరిక ఎప్పటికీ తీరదు. . . . . . ‘ అని అంతే సుభద్ర కళ్ళు శూన్యంలోకి చూస్తుండి పోయాయి .
లోపలికి వచ్చిన రాఘవ సుభద్ర ని చూసి లేపడానికి ప్రయత్నించి లేవకపోయేసరికి విషయం అర్థం అయ్యి ఏడుస్తూ సృహ కోల్పోయాడు.
జీవితం చాలా చిన్నది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు వాళ్ళు దూరం అయ్యాక తెలుసుకున్న ఉపయోగం లేదు. వాళ్ళని పూజించకర్లేదు, వాళ్ళ అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి కాస్త ప్రేమ ని పంచితే చాలు

*******సమాప్తం*******.

1 thought on “ఆఖరి కోరిక

Leave a Reply to మాలిక పత్రిక 2018 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *