April 19, 2024

గీకు వీరుడు..

రచన: గిరిజారాణి కలవల

 

గుర్నాధానికి ఉక్రోషం వచ్చేస్తోంది. కడుపులోనుండి తన్నుకుంటూ మరీ వస్తోంది.

రాదు మరీ… చుట్టు పక్కల ఎవరిని చూసినా… రయ్ రయ్ మంటూ.. వేలితో తోసుకునే ఫోనులే. అరచెయ్యి సైజు నుండి అరఠావు పుస్తకం సైజులో ఎవరి చేతిలో చూసినా అవే కనపడుతున్నాయి.

తను  ఇంకా టిక్కు టిక్కు నొక్కుకునే ఫోనే వాడుతున్నాడు. కొనలేక కాదు.. అదెలా వాడాలో చేతకాక.

మూడేళ్ళు నిండని పిల్లలు సైతం. . ఆ తోసుకునే ఫోనులో ఏవో ఆటలు ఆడేస్తున్నారు.

ఏంటేంటో చూడొచ్చుట ఆ ఫోను వుంటే.. ప్రపంచంమంతా జేబులోనే వుంటుందండీ అంటూ పక్కసీటు పరమేశం పళ్ళికిలిస్తూ అనేసరికి పుండు మీద కారం చల్లినట్లయింది.

ఆ అటెండర్ ఆశీర్వాదానికీ అదే ఫోను. తెగ ఫోటోలు తీసుకుంటూవుంటాడు. టేబుల్ మీద నా ఫోను చూసినప్పుడల్లా కిచకిచ నవ్వుతాడు కోతి లాగ. అందుకే వాడు వస్తూ వుంటే గుర్నాధం తన ఫోను తీసి దాచేస్తూ వుంటాడు. అయినా కనిపెట్టేస్తాడు వాడు. కావాలని తన టేబుల్ దగ్గరకి వచ్చి తన ఫోను తీసి ఏదేదో గీకుతూ వుంటాడు. ఇవన్నీ భరించలేకపోతున్నాడు గుర్నాధం.

ఇంటి దగ్గరా ఇదే గోల. నిన్న సాయంత్రం పక్కింటి పేరంటానికి వెళ్లిన భార్యామణి గోమతి రుసరుసలాడుతూ తిరిగొచ్చింది.

విషయం కనుక్కుంటే తేలిన సంగతేంటటంటే.. ఆ పక్కింటావిడ తన ఫోనులో స్కైప్ లో   ఇక్కడ పేరంటం అంతా అమెరికాలో కూతురికి చూపిస్తూ మురిసిపోయిందట. అదీ సంగతి.

” అయినా ఏ వస్తువు వెంటనే కొన్నారనీ.. మీ సంగతి నాకు తెలీదేంటి?  ఫ్రిజ్, మిక్సీ ఇలాంటివి  అందరిళ్ళలోనూ వచ్చేసాక ఆఖరి కి పనిమనిషి, వాచ్మెన్ కూడా వాడడం మొదలెట్టాక భయం, భయంగా కొన్నారు. ఇక ఇప్పుడు ఈ ఫోను కొనేసరికి ఎన్నాళ్లు అవుతుందో, అసలు కొంటారో లేదో నాకు డౌటే.. చేతకాని పీత అంటారు మీలాంటి వాళ్ళని. అదేం బ్రహ్మవిద్యా? అంతలా భయపడతారు..అందరూ అన్ని టెక్నాలజీలని వుపయోగించేస్తున్నారు. మీరే ఇంకా బిసి కాలంలో  వున్నారు. ” అంటూ సాధించేస్తోంది .

స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ అన్నట్టు ” ప్రపంచమంతా ముందుకు పోతోంది. మనమే ఇంకా ఇలా వున్నాం ” అన్నట్టుగా వుంది.

అదే టైమ్ లో ఇంట్లో   వున్న లాండ్ ఫోన్ మోగింది.  గోమతే గబగబా వెళ్లి అందుకుంది. అటు పక్క కొడుకు రవి.. బెంగళూరు నుంచి.  ” అమ్మా.. ఎలా వున్నారు? నాన్న గారు కులాసానా?  రేపు మేము వస్తున్నాము. రెండు రోజులు సెలవలు వచ్చాయి. ఇంకో రెండు రోజులు పెట్టుకుని వస్తున్నాము.”  అన్నాడు.

” సరే సరే.. రండి.. నాకు మనవడిని చూడాలనిపిస్తోంది.” అంది గోమతి.

ఫోన్ పెట్టేసి.. ” ఏవండీ.. రేపు రవి, కోడలు,పిల్లాడు వస్తున్నారు.  కూరలూ,  పళ్ళు తీసుకురండి ” అని చెప్పింది. సంచీ తీసుకుని బయటకి నడిచాడు గుర్నాధం.

మర్నాడు ఉదయమే దిగారు  కొడుకు కోడలు. స్నానాలూ, టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో కూర్చుని వుండగా.. కోడలు సుజాత ఓ చిన్న బాక్స్ తీసుకు వచ్చి రవికి అందించింది. రవి అది తెరిచి.. అందులోనుండి ఓ స్మార్ట్ ఫోన్ తీసి తండ్రికి ఇచ్చాడు. అది చూసి గోమతి మొహం చాటంత అయింది.

గుర్నాధం మాత్రం.. ” నాకెందుకురా ఈ ఫోను? కావాలంటే నేను కొనుక్కోలేనా? అది ఎలా ఆపరేట్ చెయ్యాలో చాతకాక కొనుక్కోలేదు కానీ.. నాకు వద్దు.” అన్నాడు.

” అది కాదు నాన్నా… చాతకాదు, చాతకాదు.. అనుకుంటూ నువ్వు కొనుక్కోవడం లేదు. అందుకనే నేను నీకు అన్నీ నేర్పిద్దామని సెలవు పెట్టుకుని మరీ వచ్చాను. చాలా సులభమే ఇది నేర్చుకోవడం. పైగా చాలా ఉపయోగం కూడాను. అన్నీ ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు. బాంక్ పనులూ, రిజర్వేషన్లు ఇలా ఎన్నో చేసుకోవచ్చు. నువ్వు అనవసరంగా దీన్ని వాడడానికి భయపడుతున్నావు అంతే. ” అంటూ అందులో సిమ్ వేసి.. వాడడానికి సిధ్ధం చేసాడు.

ఇక తప్పదని గుర్నాధం కొడుకు దగ్గర ఫోన్ పాఠాలు నేర్చుకోవడం  మొదలెట్టాడు. ఓ చిన్న నోట్ బుక్ పెట్టుకుని  రాసుకుని మరీ నేర్చుకోవడం మొదలెట్టాడు.

ఫర్వాలేదు కాస్త గాడిలో పడేసరికి, కొడుకు కోడలు వెళ్లి పోయారు.

ఆఫీసుకి తీసుకెళ్ళి అటెండర్ ముందు తనూ ఫోనుని గీకడం మొదలెట్టాడు. గేస్ బుక్ చేయడాలూ, రైలు, బస్సు రిజర్వేషన్లు నేర్చుకోవడం చేస్తున్నాడు.  అంతగా అర్థం కావడం లేదింకా. రోజంతా దానితోనే తిప్పలు పడుతున్నాడు. రాత్రి పొద్దుపోయేదాకా టిక్కు టిక్కు ఏదో ఒకటి నొక్కి చూసుకుంటూనే వున్నాడు. ఇక చాలు పడుకోండి… కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని గోమతి అరిచేసరికి ఫోన్ ఆఫ్ చేసి పడుకున్నాడు.

 

మంచి నిద్రలో వున్న గుర్నాధానికి సడన్ గా గుండె పట్టుకున్నట్టనిపించింది. కళ్లు తెరిచి చూస్తే పక్కన భార్య కనపడలేదు.. పిలిచాడు.. అయినా బదులు లేదు.. వంటి నిండా చమటలు పట్టేస్తున్నాయి.. ఏం చెయ్యాలో తోచక.. పక్కనే వున్న ఫోన్ తీసుకుని అందులో అప్పటికే సేవ్ చేసుకుని వున్న హాస్పిటల్ ఫోన్ నెంబర్ డయల్ చేసాడు.

ఈయన చెప్పేది వినిపించుకోకుండా… అవతలనుంచి ఇలా వినపడసాగింది.. ” నమస్కారం… మా హాస్పిటల్ సేవలు వినియోగించుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు.. చెప్పండి మీకు ఎటువంటి సేవ కావాలి?

ఎమర్జెన్సీ అయితే ఒకటి నొక్కండి..

సాధారణ సుస్తీ అయితే రెండు నొక్కండి…

ఛీప్ డాక్టర్ అపాయింట్ మెంట్ కోసమైతే మూడు నొక్కండి…

జూనియర్ డాక్టర్ సరిపోతుందనుకుంటే నాలుగు నొక్కండి..

టెస్టు లూ, ఎక్సరేలూ అయితే ఐదు నొక్కండి.. ” అంటూ ఇంకా నెంబర్లు అన్నీ ఏకరవు పెడుతోంది.

మన గుర్నాధానికి ఈ మాటలతో గుండె ఇంకా స్పీడ్ గా కొట్టుకోవడం మొదలెట్టింది.

” నీ అమ్మ కడుపు కాలా… అంబులెన్స్ పిలవాలంటే ఏ నెంబరో చెప్పవే తల్లీ… ఈలోగా ఇక్కడ నా నెంబర్ క్లోజ్ అయిపోయేట్టుందీ… అంబులెన్స్ .. అంబులెన్స్..” అని అరవడం మొదలెట్టాడు.

ఈ అరుపులకి గోమతి గబుక్కున లేచి,  నిద్రలో అరుస్తున్న గుర్నాధాన్ని.. గబగబా తట్టి లేపింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.

” ఏమిటండీ.. అంబులెన్స్.. అని అరుస్తున్నారూ.. ఏం కలొచ్చిందీ.. ” అని అడిగేసరికి… అయోమయంగా మొహం పెట్టి…

” ఏంటీ.. ఇదంతా కలలోనా? ఇంకా నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చింది అనుకున్నా.. ఇదంతా ఈ ఫోన్ మూలంగానే… ఏది బుక్ చేసుకోవాలన్నా… అది కావాలంటే ఒకటీ.. ఇది కావాలంటే రెండూ నొక్కండి అంటోంది.. అదే తలుచుకుంటూ పడుకున్నా.. గుండె నొప్పి వచ్చి.. హాస్పిటల్ కి ఫోన్ చేసినట్లు.. అక్కడా ఇలాగే అంటున్నట్టూ కల వచ్చిందే.. ” అని భార్య తో అన్నాడు.

” ఈ ఫోన్లతో ఇంత తతంగం ఏంటే… రేపు ఎవరైనా తల్లిదండ్రులుతో మాట్లాడాలని ఫోన్ చేస్తే.. మీ నాన్నతో మాట్లాడాలంటే ఒకటి నొక్కండి.. మీ అమ్మతో మాట్లాడలంటే రెండు నొక్కండి.. అని కూడా అంటుందేమో…  ఈ స్మార్ట్ ఫోన్ యుగం ఏంటో అంతా అయోమయం.. మనలాంటి వాళ్ళకి.. నా వల్ల కాదు.. ఈ ఆన్ లైనులూ.. బుకింగులూ.. గట్రా నాకు వద్దు.. నేను బేంక్ కి వెళ్ళే.. నా పనులు చూసుకుంటాను… స్టేషన్ కి వెళ్ళే రైలు రిజర్వేషన్లు చేసుకుంటాను.. ఇవేమీ నాకొద్దు.. అంటూ గొణుక్కుంటూ నిద్రలోకి జారుకున్నాడు గుర్నాధం.

 

1 thought on “గీకు వీరుడు..

Leave a Reply to మాలిక పత్రిక 2018 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *