April 19, 2024

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

తెలుగు భాషను సుసంపన్నం చేసిన మరో దేశీఛందస్సుకు చెందిన ప్రక్రియ ఆటవెలది.

ఆటవెలది అనగానే

అనగననగరాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం గుర్తుక వస్తుంది
ఆటవెలదుల్లో అనేక లౌకిక వాస్తవాలను వెల్లడించిన ప్రజాకవి వేమన.
మేడిపండు జూడ మేలిమై యుండును
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ
ఇలా వందల పద్యాలు వేమన పేరుమీద చలామణిలో ఉన్నాయి. వేమన మొదట శృంగార జీవితం గడిపి తరువాత విరక్తుడై యోగిగా మారిన కవి అని చెబుతారు. ఇదమిద్థంగా కాకపోయిన ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి. నన్నయ మొదలుకొని నేటి ఔత్సాహిక కవులదాకా ఎంతో మంది కవులు ఆటవెలదులు రాసిన వారే. కాకపోతే వేమన పద్యాలు జీవితానుభవాలనుండి పుట్టినవి. మనిషిని తీర్చి దిద్దడానికి రాసినవి. ప్రజల అగచాట్ల నుండి బయల్వెడలినవి. జనుల భాషలో రాయబడినవి అందుకే వాటికంత ప్రాచుర్యం లభించింది.
మంచి ఉపమానాలతో చెప్పబడినవి అందుకే అవి ప్రజలనాలుకలమీద నడయాడుతుంటాయి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ
ఇలా చెబుతూ పోతే వందల పద్యాలు చెప్పాలిసి వస్తుంది.

కేవలం నీతిబోధకే కాకుండా ఆటవెలది అన్ని భావాలకూ ఒదుగుతుంది.
ఇనగణత్రయంబు ఇంద్ర ద్వయంబును
హంసపంచకంబు ఆటవెలది
అని ఛందస్సులో సూత్రం చెప్పారు
మొదటి పాదంలో మూడు సూర్య గణాలు రెండు ఇంద్రగణాలు, రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు
అలాగే మళ్లీ మూడు నాలుగు పాదాలు కూడా కొనసాగుతాయి.
రాగయుక్తంగా పాడటానికి అనువైన పద్యం ఆటవెలది.
ప్రబంధకవులందరూ తమకావ్యాల్లో వృత్తాలతో పాటు ఆటవెలదులు తేటగీతులు విరివిగానే వెలయించారు. ఆధునిక కవులు చాలామంది ఆటవెలది పద్యాలలో లఘు కావ్యాలు వెలువరించారు. ఆటవెలదితో పాటు తేటగీతి కూడా
బాగానే తెలుగు భాషకు అందాలు అద్దింది.

పోతన ప్రసిద్ధ పద్యం
చేతులారంగ శివుని పూజించడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపుచేటు
అంతేగాక సీసపద్యం నాలుగుచరణాల తరువాత

ఎత్తుగీతిగా తేటగీతిగాని ఆటవెలదిగాని ఉండటంతో సీసాలు రాసిన కవులందరూ ఆటవెలది తేటగీతుల్ని రాశారు.

కరుణశ్రీ తన లఘుకృతుల్లో ఈ రెండు ప్రక్రియల్నీ
విరివిగా ఉపయోగించుకున్నారు. మచ్చుకి
కుంతీకుమారిలో
దొరలునానందబాష్పాలో పొరలు దుఃఖ
బాష్పములోకాని అవి మనము చెప్పలేము
జారుచున్నవి ఆమె నయనాలనుండి
బాలకుని చెక్కుటద్దాలమీన
అలాగే పుష్ప విలాపంలో
ఊలుదారాలతో గొంతుకురి బిగించి
గుండెలోనుండి సూదులు గుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట దయలేనివారు మీఆడువారు

ఇలా ఎందరో ఆటవెలదుల్ని తేటగీతులు రాసి తెలుగు భాషకు వెలుగు నింపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *