March 28, 2024

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద

అంబులెన్స్ లో అతి బలవంతంగా నల్గురు వార్డు బాయిల సహయంతో ఈశ్వరిని డాక్టర్ ప్రభంజన దగ్గరకి తీసుకెళ్లారు.
ఈశ్వరి ఏడుస్తూ గింజుకుంటుంటే ప్రభంజన వార్డుబాయిల కేసి చూసి “ఆమెనెందుకు హింసిస్తున్నారు. ఆమె కేమన్నా పిచ్చా? షి ఈజ్ ఆల్‌రైట్. ఆమె నొదలండి.”అంది.
వార్డుబాయిలు ఈశ్వరినొదిలేసేరు. ఈశ్వరి ప్రభంజన్ తనని సపోర్టు చేసినట్లుగా ఫీలయింది. ఆమె ప్రభంజన కేసి ఫిర్యాదు చేస్తున్న చంటిపిల్లలా చూసి “చూడండి. నేనెంత చెప్పినా వీళ్ళు నా మాట వినకుండా గొడ్డుని లాక్కొచ్చినట్లుగా లాక్కొచ్చేసేరు. ఈ కుక్కగాడు వారం రోజులుగా నన్ను గదిలో పెట్టి బంధించేడు” అంది ఏడుపు స్వరంతో.
ప్రభంజన ఈశ్వరి వెనుక లోని కొచ్చిన కుటుంబరావు కేసి జాలిగా చూసింది. అతని మొహం ఎర్రబడటం ఆమె గమనించింది.
“మీరు కాస్సేపు బయట కూర్చోండి” అంది కుటుంబరావుతో.
కుటుంబరావు బయటకెళ్ళగానే ప్రభంజన చిరునవుతో ఈశ్వరి కేసి చూసి “భర్తనలా అనడం తప్పు కదూ. ఆయనెంత బాధపడ్తాడు” అంది నెమ్మదిగా.
“అతనేం నా భర్త కాదు. వాడు పూర్వజన్మలో మా ఇంట్లో పెంపుడు కుక్క. నా ఖర్మ కాలి వాడీ జన్మలో నా మొగుడయి నంజుకు తింటున్నాడు. నా అసలు భర్త వెంకట్. దయచేసి నన్నతని దగ్గరకి పంపే ఏర్పాటు చేయండి” అంది చేతులు జోడిస్తూ.
ప్రభంజన ఈశ్వరి వైపు తిరిగి నవ్వి “అలాగే పంపిస్తాను. ఇంతకీ నీకీ పూర్వజన్మ వృత్తాంతం ఎలా తెలుసు?” అనడిగింది.
“భీమిలీ రోడ్డులోని ఓంకారస్వామి చెప్పేడు. అతనికి చాలా మహత్యముంది. సరిగ్గా అన్నీ అతను చెప్పినట్లే జరిగేయి” అంటూ ఈశ్వరి గతమంతా ఆమెకు వివరించింది.
ప్రభంజనకి జరిగినదంతా అర్ధమయింది.
“నువ్వు నా దగ్గరే ఉండు. నేను మీ ఆయన్ని.. సారీ ఆ కుక్కగాణ్ణి పంపించేసి వస్తాను” అంది డా.ప్రభంజన లేచి నిలబడుతూ.
ఆ మాట విని ఈశ్వరి మొహంలో సంతోషం తాండవించింది.
“పొమ్మనండా శనిగాణ్ణి” అంది విసురుగా.
డాక్టర్ ప్రభంజన బయట కూర్చున్న కుటుంబరావు దగ్గరకొచ్చి “ఒక్కసారిలా రండి” అంది అతనితో.
అతను ఆమె ననుసరించేడు.
మరో గదిలో అతన్ని తీసుకెళ్ళి “కూర్చోండి” అంది ప్రభంజన.
కుటుంబరావు తల దించి కూర్చున్నాడు.
ప్రభంజన అతని మానసిక పరిస్థితి గ్రహించింది.
తనూ అతని ఎదురు కుర్చీలో కూర్చుంటూ “ఆవిడ పిచ్చిది కాదు” అంది ఉపోద్ఘతంగా.
అతను చివ్వున తలెత్తి “పిచ్చిగాకపోతే ఏంటిది?” అన్నాడు కొంచెం కోపంగానే. తర్వాత తనెదురుగా కూర్చుంది ఒక ప్రముఖ సైక్రియాట్రిస్టన్న విషయం గుర్తొచ్చి “సారీ మేడం. నన్ను, ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని అదెవడో దారిన పోయే దానయ్యని మొగుడని వెంటబడుతుంటే నా పరువేం కావాలి. పైగా నన్ను కుక్కంటూ అందరి ముందూ..” అంటూ చెప్పలేనట్లు తల దించుకున్నాడు రోషంగా.
“నాకు మీ బాధర్ధమయింది కుటుంబరావుగారూ. కొందరు స్త్రీలు వైవాహిక జీవితాన్ని చాలా గొప్పగా, ఊహించు కుంటారు. అంటె బోల్డంత డబ్బు, నగలు, చీరలూ, పెత్తనం. ఇవి కావు. ఇవి ఆశించేవాళ్లని పక్కా మెటీరియలిస్టు లనొచ్చు. వాళ్లు ఇలాంటి పిచ్చి పనులు చేయరు. మనసు, ప్రేమ, భర్తతో షికార్లు, అతని ఆదరణ, గుర్తింపు కావాలని వెర్రిగా ఆశపడే స్త్రీలు మాత్రమే, ఎంతో కాలం వాటిని భర్తనుంచి పొందాలని ప్రయత్నించి విఫలమైనప్పుడే .. ఏ చిన్ని ప్రేమతో కూడిన ఆదరణ లభించినా అటు వైపు మొగ్గిపోతారు. ఈశ్వరి గడుసు మనిషి కాదు. పైగా బలమైన వ్యక్తిత్వం కూడా లేదు. ఎటువంచితే అటు వంగే ఈ బలహీనురాల్ని మీ వైపు వంచుకోలేకపోయేరంటే.. లోపం మీ దగ్గరే ఉందని చెప్పడానికి ఒక డాక్టరుగా నేనెంత మాత్రం వెనుకాడను” అంది.
కుటుంబరావు దెబ్బతిన్నట్లుగా చూశాడామె వైపు.
“సారీ! నేను మిమ్మల్ని హేళన చేయడం లేదు. మీలోని లోపాన్ని కూడా మీకు తెలియజేయడం నా బాధ్యత” అందామె అనునయంగా.
“నేను దాన్నెప్పుడూ కఠినంగా చూడలేదు డాక్టరుగారూ. ఎప్పుడూ చిన్న దెబ్బయినా వేసెరగను. అదేం చేసుకున్నా, ఏ చీర కొనుక్కున్నా ఎందుక్కొన్నావని అనలేదు. చివరికి అది గడ్డి వండి పెట్టినా పరమాన్నంలా తిన్నాను కాని.. ఇదొండేవేంటనలేదు. ఇంక నా తప్పేముంది చెప్పండి.”అన్నాడు కుటుంబరావు వేదనగా.
“అదే మీరు చేసిన తప్పు. దెబ్బయినా వేసెరగనంటున్నారు. భర్త భార్యని కొట్టే హక్కు కల్గి ఆ హక్కుని ఉపయోగించు కోలేదన్నట్లుగా చెబుతున్నారు. మీరు ఫలానా కూర వండమని అంటే.. ఆమె సంతోషించేది. ఫలానా చీర కట్టుకుంటే బాగుంటావని.. ఫలానా రంగు నీకు మాచవుతుందని … ఈ రోజు ఫలానా చోటుకెళ్దామని.. ఆమెని గుర్తించి ఉండి ఉంటే.. మీరన్నట్లుగా ఒక దెబ్బేసినా చివరికి దారుణంగా కొట్టినా ఆమె మిమ్మల్ని వదిలేది కాదు. ఏ గుర్తింపూ లేని యాంత్రిక జీవితం నుండి బయటపడాలనే ఉబలాటమే ఆమెనింతకి తీసుకొచ్చింది. మిమ్మల్ని ఎంత మాటన్నా ఆమె కసి తీరడం లేదు. అది సరే. మీరు ఇంటికి వెళ్లండి. నేనామెనొక దారికి తెస్తాను. ఆమె గురించి బెంగక్కర్లేదు. కాని ఒక్క మాట..”
“చెప్పండి..” అన్నాడు కుటుంబరావు.
“తిరిగి ఆమెను మామూలు మనిషిని చేసే పూచీ నాది. కని.. తర్వాత ఆమెని మీ భార్యగా నిలబెట్టుకోవడం మీ చేతిలో ఉంది.”అందామె లేచి నిలబడుతూ.
కుటుంబరావు చేతులు జోడించి వెను తిరిగేడు. డాక్టర్ ప్రభంజన ఈశ్వరి చిత్రమైన కేసు గురించి ఆలోచిస్తూ కేయూరవల్లికి డయల్ చేసింది. ఫోను రింగవుతుందే గాని ఏవరూ లిఫ్ట్ చేయడం లేదు. చాలా సేపు ప్రయత్నించి విఫలురాలై వెనుతిరిగి కన్సల్టింగ్ రూంలో కొచ్చింది ప్రభంజన.
ఈశ్వరి జాకెట్‌లోని వెంకట్ పాస్‌పోర్ట్ ఫోటోని తీసి తదేకంగా చూసుకోవడం గమనించనట్లుగా క్రీగంట గమనించి మరో కేసుని స్టడీ చేయడానికి పిలిచింది.
*****
కార్తికేయన్ చేతుల్లో లిఖిత ఎంతోసేపు ఇమిడిపొయింది గువ్వలా.
పుట్టేక ఎన్నడూ చూడకపోయినా కన్నతండ్రి స్పర్శ ఆమెకు ఎనలేని హాయిని కల్గిస్తోంది. సుదీర్ఘ గ్రీష్మతాపంలో దొరికిన అమృతంలా రక్త సంబంధంలో మహత్యం ఆమె కర్ధమవుతోంది.
కార్తికేయన్ పరిస్థితి అలానే ఉంది.
ఇన్నాళ్ళూ కట్టుకున్న భార్యపైనా.. కన్న కూతురి మీద ఉన్న ప్రేమని సమాధి చేసి తన బ్రతుకుని నిరర్ధకం చేసు కున్నాడు. ఏదో సాధించి సమాజానికందించాలన్న తపనతో తన కందిన ప్రేమ వనరుల్ని కాలదన్నుకున్నాడు. తన బిడ్డ, తన రక్తాన్ని పంచుకుని పుట్టిన కూతురు తండ్రికి దూరమై ఎంత వేదనని గుండెలో అణచిపెట్టి పెరిగిందో. ఎన్ని నిస్పృహలకి గురయిందో.
కొంతసేపటికి లిఖితే తేరుకుని అతని కౌగిలిలోంచి బయటకొచ్చే ప్రయత్నం చేసింది. కాని కార్తికేయన్ వదల్లేదు.
ప్రేమగా ఆమె ముంగురులు సరిచేస్తూ “నేను మీకన్యాయం చేసేను. కాని.. ఏం చేయను. చిన్ననాడే నా మనసులో బలంగా ఎర్పడిపొయిన కోరిక..మరణాన్ని జయించడం. కాని.. అంతా బూడిదలో పోసిన పన్నీరయింది.” అన్నాడు తన అపజయాన్ని తలచుకుంటూ.
“బాధపడకండి. మరణమనేది అనివార్యమైంది. ప్రపంచంలో ఒక అత్యుత్తమ సైంటిస్టుగా మీకు ప్రత్యేక స్థానముంది. మనిషి బ్రతికినన్నాళ్ళూ హాయిగా బ్రతికే అద్భుతాలని కనుక్కోవడంలో మీ పాటవాన్ని చూపించుదురు గాని. మరింక ఇక్కడ మనం అనవసరం. టిక్కెట్లు దొరికితే ఈ రోజే బయలుదేరుదాం. మీరు స్నానం చేయండి. మీకు నేను బట్టలు కొనుక్కొస్తాను”అంది లిఖిత.
కార్తికేయన్ అయిష్టంగా ఆమె నొదులుతూ “అలాగే. మీ అమ్మని కూడా చూడాలని ఆత్రుతపడుతోంది నా మనసు” అన్నాడతను.
లిఖిత కాన్హాని తీసుకొని బయటకొచ్చి ఆటో ఎక్కింది.
“ఈ రోజే వెళ్ళిపోతారా?” అనడిగేడు కాన్హా.
ఆ ప్రశ్నలో దిగులు స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది.
లిఖిత అతనివైపు అభిమానంగా చూసింది.
వెంటనే ఆర్తిగా అతని చేతిని పట్టుకుంది.
“అవును కాన్హా. ఈ పాటికే ఆమ్మ నా కోసం బాగా బెంగపడి ఉంటుంది. నువ్వు చేసిన సహాయం నేనెప్పటికీ మరచిపోలేను. అవును నువ్వు కూడా మాతో వచ్చేయకూడదూ. ఆ అడవిలో దేనికి?” అంది.
కాణ్హా చిన్నగా నవ్వి “అమ్మని, అమ్మలాంటి అడవిని నేనొదిలి బ్రతకలేను. ముఖ్యంగా గణ. ఇప్పటికే నా కోసం బెంగపడుతుంది” అన్నాడు.
అతని నవ్వులో ఒకలాంటి నైరాశ్యం చోటు చేసుకోవడం గమనించింది లిఖిత.
“అవును. అమాయకమైన ప్రాణుల మధ్య బ్రతికే నువ్వు క్షణక్షణం ఒకర్నొకరు అక్కర్లేకపోయినా వంచించుకుంటూ వెన్నుపోట్లు పొడుచుకుంటూ బ్రతికే జంతువుల మధ్య బ్రతకలేవు?’ అంది బాధగా.
“ఆ జంతువుల పేరేంటి?”
“మనుషులు. వీటికి విశ్వాసం ఉండదు. కృతజ్ఞత ఉండదు. ముఖ్యంగా తృప్తి ఉండదు. అసూయ, పేరాశ, నయవంచన వీటి జన్మ లక్షణాలు. వాటి మధ్య నువ్వు నిజంగానే బ్రతకలేవులే” అంది లిఖిత.
కాణ్హా ఆర్ధం కానట్లుగా చూశాడు.
లిఖిత అతనికి అర్ధమయ్యేట్లు చెప్పే ప్రయత్నమూ చేయలేదు.
ఇద్దరి మనసుల నిండా బాధ ఉంది. అది ఆ ఇద్దరికీ తెలుసు.
*****
కేయూర ఇరవై నాలుగ్గంటలుగా అలానే కూర్చుంది మంచమ్మీద. ఎదురుగా చిన్నని కిటికీ ఉంది. కాని మనుష సంచారమే లేదు.
వెంకట్‌లోంచి బయటకొస్తున్న క్రూర మృగాన్ని చూస్తుంటే.. ఆమె మనసు క్షణక్షణానికి విస్తుపొతోంది. ఇలాంటి నీచులకి దేవుడు కావాల్సినంత మేధస్సు ఇస్తాడు. దాన్ని వీళ్ళు కుళ్ళు కాలువ లాంటి నీచపు పనులకే ఉపయోగిస్తారు. చివరికి ఇలాంటి వాళ్లకి కుక్క చావే లభిస్తుంది. అంతే ఎవరిదీ ఒక్క కన్నీటి బిందువు దొరకని మరణం.
సరిగ్గా అప్పుడే ఆమె చూపు గుబురుగా పెరిగిన చెట్ల మధ్య సన్నటి బాట వెంట గంప నెత్తిన పెట్టుకుని వెళ్తున్న ఒక స్త్రీ మీద పడింది.
గబగబా లేచి చప్పట్లు చరచింది అనాలోచితంగా.
ఆమె వెనుతిరిగి చూసింది.
కేయూరవల్లి కిటికీలోంచి అతి కష్టమ్మీద చెయ్యి జొనిపి రమ్మన్నట్లుగా సైగ చేసింది.
ఆవిడ అర్ధం కాలపోయినా సందేహంగా కిటికీ దగ్గరగా వచ్చింది.
ఆమె దగ్గర కొస్తుంటూనే కేయూర ఆమెని పోల్చుకుంది.
నల్లటి నేరేడు పండు నలుపు, మెల్లకన్ను, ఎత్తుపళ్ళు. ఆమె నిస్సందేహంగా అప్పలనరసమ్మే. పదేళ్ళ క్రితం తాము వాల్తేరు అప్‌లాండ్స్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు సీతమ్మధారలో ఉండగా వచ్చి పాలు పోసేది. వయసు పెరిగినా అదే తయారు. కొప్పులో మందారాలు, మెడలో గుళ్ళ గొలుసు.
“అప్పల నరసూ! నన్ను గుర్తుపట్టలేదూ?” అంది కేయూర ఆత్రంగా.
అప్పలనరసమ్మ కళ్ళు చికిలించి చూసింది.”అవులూ? నానాలు పట్నేక పోతాన్నా!” అంది.
“నేనే. సీతమ్మ దారలో ఉండగా పాలు పోసే దానివి. కేయూరమ్మని.”అంది కేయూరవల్లి.
అప్పలనరసమ్మ గంప అమాంతంగా క్రింద పడేసింది. చెంపలు గట్టిగా వాయించుకుంటూ “ఓయమ్మో, ఓయమ్మో, నా కళ్లల్లో జిల్లేడు పాలు పొయ్యా! మిమ్మల్నే పోలుసుకోలేక పోనాను. దిక్కుమాలిన జన్మాని దిక్కుమాలిన జనమ. మీరా కోకల కంపెనీ అమ్మాగారు కదూ. నా కెన్నేసి గుడ్డలిచ్చీసీనారు. నానే దొంగముండని. నీళ్ల పాలు పోసేసి మీ ఇల్లు పోగొట్టుకున్నాను. ఇదేటీ పాడుబడ్డ కొంపలో కొచ్చేస్నారు. సిత్రంగా ఉందే!” అంది బుగ్గలు నొక్కుకుంటూ.
“ష్! గట్టిగా అరవకు. ఒక రౌడీ వెధవ నన్నీ గదిలో పెట్టి బంధించేసేడు” అంది కేయూర మెల్లిగా.
“ఎవడా తొత్తు కొడుకు. పేగులు దీసి పోలేరమ్మకి పలారమెడతాను” అని మళ్లీ అరవబోయింది అప్పలనరసమ్మ.
“ఆ పని తర్వాత చేద్దువుగాని. ముందు తొందరగా అవతల పక్కన తాళం కప్ప బద్దలు కొట్టు.” అంది కేయూర.
అప్పలనరసు అటువేపెళ్ళి తాళం కప్పని చూసి తిరిగొచ్చి “అది తాళం కప్పా తాటికాయంతుంది. తలుపన్నా మక్కా సెక్కా సేయొచ్చుగాని దాన్నేటీ సెయ్యలేం” అంది.
అప్పుడు చూసింది కేయూర తలుపు వైపు. తలుపు కూడా కొంపలానే శిధిలమైంది. ఒక్క బలమైన తాపుకి ఊడిపడొచ్చు.
వెంటనే “నరసూ! బలంగా ఒక్క తన్ను తన్ను” అంది. నరసు అన్నంత పనీ చేసింది. మూడు తోపులకి తలుపు విరగలేదు కాని.. ఒక పక్కగా జాయింట్లు ఊడి ఊగుతూ ఒరిగిపోయింది.
కేయూర సందు చేసుకొని ఎలానో బయటకొచ్చి “పద! ఇక్కడొక్క క్షణముంటే ప్రమాదం!” అంది గబగబా ఆ ఇంటి వెనుక ఉన్న కాలిబాటన నడుస్తూ.
“అసలేటి జరిగిందమ్మా” అనడిగింది నరసమ్మ అయోమయంగా.
కేయూర వెనుకనున్న మామిడి తోటలోకి తీసుకెళ్లి నరసుకి జరిగిందంతా చెప్పింది.
“అమ్మ సచ్చినోడు. ఆడు అగ్గిబుగ్గయిపోనూ. ఆడి సంగతి నాను సూసుకుంతాను. మీరు బీపారెల్లిపోండి. ఇటేపు సక్కగా ఎల్గే నక్కానిపాలెం వచ్చేస్తది. ఆటొ బండెక్కేసి అందాక నాల్రోజులు ఎవురింట్లోనన్నా ఉండిపోండి” అంది నరసు కోపంగా.
“నువ్వనవసరంగా ఎందులోనూ ఇరుక్కోకూ!” అంది కేయూర హెచ్చరిస్తున్నట్లుగా.
“మా వూరి ఎద్దునే ఏడు సెరువుల నీల్లు తాగించీసినాను. ఈ తొండగాడొక లెక్కా నాకు. మీరు పదండి.”అంది అప్పలనరసు కేయూరని.
కేయూర మరేం ఆలోచించకుండా నరసు చూపించిన బాటన వేగంగా అడుగులేసింది. ముందేం చేయాలన్న ఆలోచనతో.
*****
రైలు మరి కొన్ని నిమిషాల్లో కొచ్చిన్‌లో బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. ఏ.సి. సెకండ్ క్లాసులో తన బెర్త్ మీద మౌనంగా కూర్చుని ఉన్నాడు కార్తికేయన్.
లిఖిత ప్లాట్‌ఫాం మీద నిలబడ్డ కాణ్హాతో ఆఖరిసారిగా అంది.
“నీ మేలు మరచిపోలేను. నిన్ను కూడా. నువ్వు చేసిన సహాయం గురించి నేనెంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ కాగితంలో నా ఏడ్రసుంది. నీకెప్పుడు రావాలనిపించినా వచ్చేయ్” అంది లిఖిత భారమైన స్వరంతో.
కాణ్హా మౌనంగా ఆ కాగితాన్ని అందుకున్నాడు. అంతకంటే భారంగా ఉందతని హృదయం.
అతనికి నాగరికత తెలియదు. చదువు లేదు. అడవిలో చెట్టులో చెట్టులా, జంతువుల్లో జంతువులా తిరుగుతూ తన ఏనుగుతో కలప మోయిస్తూ ఆకలేసినప్పుడు ఏదో ఓకటి తిని, ఆనందం కల్గినప్పుడు ఏ సెలయేరు దగ్గరో బండల మీద పడుకుని, పక్షుల పాటలు వింటూ.. అలసిపోయినపుడు ఆదమరచి నిదురపోయే అతనికి చదువుకుని అన్నీ తెలిసిన నాగరిక ప్రపంచంలోని మనుషుల కన్నా స్పందించే సహృదయం, ప్రేమ, బాధ, అన్నీ ఉన్నాయి. కాని వాటిని బహిల్పరచగల భాషే లేదతనికి.
మాటి మాటికీ అతని గుండె చెమరుస్తున్నా అతను బయటికి బండరాయిలానే నిలబడ్డాడు.
రైలు కదిలింది.
లిఖిత అతనికి కనుమరుగవుతూనే ఉంది.
అతని కళ్లు ఆఖరి కంపార్టుమెంటు ప్లాట్‌ఫాంని వదిలేసేసరికి నీటితో నిండిపోయేయి.
అతను తన చేతిలోని కాగితాన్ని తీసుకొని ఎవరో బలవంతంగా తోస్తున్నట్లుగా బయటకొచ్చేడు.
అతను ఒక పక్కగా నిలబడి కాగితాన్ని తెరిచేడు. అందులో రాసింది ఎడ్రస్‌లా అనిపించలేదు. చాలా రాసి ఉంది ఇంగ్లీషులో. అదెలా చదవాలి.
అతను చుట్టూ చూశాడు.
గడ్డం పెరిగి ఒక పిచ్చివాడిలా అనిపించే మనిషొకడు ఇంగ్లీసు పేపరు చదువుతూ కనిపించేడు.
కాన్హా అతని దగ్గరగా నడిచి “ఇది కాస్త చదివి పెడతారా?” అనడిగేడు.
“ఏంటది లవ్ లెటరా?” అతను వెటకారంగా నవ్వాడు. కాన్హాకి అర్ధం కాలేదు. మౌనంగా తన చేతిలోని కాగితాన్నిచ్చేడు.

ఇంకా వుంది.

2 thoughts on “బ్రహ్మలిఖితం 21

  1. మనసు, ప్రేమ, భర్తతో షికార్లు, అతని ఆదరణ, గుర్తింపు కావాలని వెర్రిగా ఆశపడే స్త్రీలు మాత్రమే, ఎంతో కాలం వాటిని భర్తనుంచి పొందాలని ప్రయత్నించి విఫలమైనప్పుడే .. ఏ చిన్ని ప్రేమతో కూడిన ఆదరణ లభించినా అటు వైపు మొగ్గిపోతారు. So true..ఇలాంటి వాళ్ళు సంఘంలో చాలామందే తారసపడుతుంటారు.. అసంతృప్తితో వారి జీవితాన్ని వారే నరకంలోకి తోసేసుకుంటూ… చాలా బావుంది

Leave a Reply to పద్మజ యలమంచిలి Cancel reply

Your email address will not be published. Required fields are marked *