March 29, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “మీ…టూ..అమ్మా”

రచన: విజయలక్ష్మీ పండిట్

ఆ రోజు ఆదివారం . రమ ఒకటే హడావుడి చేస్తూంది. భర్త ఆనంద్ కు ఏమి అర్థం కావడం లేదు .

“ఏంటి రమ..,సండే అంత బిజీ బిజీగా ఉన్నావు ఎక్కడికెళుతున్నావు “ అని అడిగాడు భర్త ఆనందు.

“ఈ రోజు సిటీలో వివిధ మహిళా మండళ్ళ మహిళలు, ఇతర ప్రోగ్రసివ్ ఉమన్ యాక్టివిస్ట్ గ్రూపులు కలిసి “ మీ ..టూ” ర్యాలీ చేస్తున్నామండి.నేను కొన్ని ప్లాకార్డులు వ్రాశాను. వాటిని ఈ కర్రలకు అంటించాలి.త్వరగా కావాలి
టైమ్ అయిపోతోంది. కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్” అని భర్తను అడిగింది రమ.

ఆ రోజు ఆదివారం కావడంతో తప్పించుకోలేక సరేనన్నాడు ఆనంద్. ప్లకార్డులకు గమ్ము పూసి కఱ్ఱలకు అంటిస్తూ .. “రమా..“మీ.. టూ”అంటే ఏమిటి.. మీ ర్యాలీ పర్పస్ ఏమిటి ?”అని అడిగాడు ఆనందు ఆ నినాదం పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలియక.
రమ “మీకు తెలయదాండి దేశమంతా “మీ..టూ” నినాదంతో అట్టుడుకుతూంది.పెద్ద పెద్ద ఘరానా నాయకులు, పాత్రికేయులు, సినిమా హీరోలు, పారిశ్రామిక వేత్తలు అందరి పేర్లు బయటికొచ్చి మీడియాలలో అదే న్యూస్ . ఆడవాళ్ళను పనిస్థలాలలో , స్కూలు, కాలేజీలలో , ఇండ్లల్లో ఆటబొమ్మలుగా చేసి లైంగికంగా వేదిస్తూ, చిన్న చిన్న ఆడబిడ్డలను, టీనేజ్ అమ్మాయిలను, ఆడ పనిమనుషులను మాటలతో, బెదిరింపులతో, కానుకలు డబ్బులు ఎరచూపి మభ్యపెట్టి నిరంతరం సతాయిస్తూ ఆడదంటే కేవలం వాళ్ళ కామదాహం తీర్చుకొనేందుకున్న ఆటబొమ్మగా ట్రీట్ చేసే మగవాళ్ల ఆటలు ఇక చెల్లవు.” అని ఆవేశంగా చెపుతూ రమ ఆగి,
“పద్మా ..గమ్ము బాటల్ నా స్టడీ రూములో టేబుల్ పైనుంది తీసుకురా “అని పనమ్మాయికి పురమాయించి మరలా కంటిన్యూ చేసింది ఆనందుతో ..
“ఇన్ని రోజులు ఆడవాళ్ళు మా పరువు పోతుందనో, పై అధికారులు సతాయిస్తారనో , బయటికి చెప్పుకొనే ధైర్యం లేక, ఇతర మహిళల సహకారం సపోర్టు లేక ఈ మగవాళ్ళు చేసే అఘాయిత్యాలు బయటికి
రాలేదు . ఇప్పుడు “మీ టూ” … నేను కూడా మగవాని కామచేష్టల వేదింపులకు బలి అయినానని, ఎదుర్కున్నానని .. అమెరికాలో మెుదలయిన (me..too) “మీ..టూ” ఉద్యమంతో మన దేశంలో మహిళలూ ధైర్యంతో బయటపడుతున్నారు. ఇది గొప్ప మార్పు కదండి “అని భర్తనుద్దేశించి అని, అంతలో పద్మ తెచ్చిన గమ్ బాటిల్ అందుకుని మిగిలిన కార్డులకు గమ్ పూసి ఇవ్వసాగింది ఆనందుకు.
ఆనందుకు రమతో ఏమి చెప్పావో తోచలేదు. “మీ..టూ” కార్డులను కఱ్ఱలకంటించ సాగాడు.
అక్కడ నిలుచుని ఇద్దరు చేసే పనిని గమనిస్తూంది పద్మ.

*****

దాదాపు పదిహేనేండ్ల పద్మ యవ్వనం అపుడప్పుడే వికసిస్తుంది .రమ తన ఎనిమిదేండ్ల కూతురుకు బట్టలు తెచ్చినపుడంతా పద్మకు ఒకటో రెండో పంజాబ్ డ్రస్సులు తెస్తుంది. రోజు స్నానం చేసి శుభ్రంగా ఉండాలని , పనులు, వంటలో సాయం చేసేప్పుడు తనకు నచ్చిన వంటలు నేర్పుతూ,నచ్చని విషయాలు గురించి చెపుతూంటే పద్మ ఊ..కొడుతూ రమ దగ్గర అన్ని నేర్చుకుంటూంది.
పద్మ పదోతరగతి పాసయిందని ,పద్మకు పై చదువులు చదవాలని కోరిక బలంగా ఉన్నా తనకు కాలేజికి పంపే స్థోమత అవగాహన లేక విధిలేక అలాగే వుండిపోయిందని పద్మ వాళ్ళ అమ్మ చెప్పింది రమతో.
ఆ ముందు సంవత్సరం సెలవుల్లో రమ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినపుడు పద్మను తనతో పాటు తెచ్చుకుంది రమ.
రమ కాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్. ఆనంద్ వేరొక కాలేజిలో మాత్స్ లెక్చరర్. ఇద్దరికి టైమింగ్స్ ఓకటే కావడంతో తనకు వంట ,ఇంటి పనులలో సహాయంగా ఉంటుందని , తాము వచ్చేలోపు వాళ్ళకూతురు దివ్య స్కూలునుండి ఇంటికి వచ్చినపుడు తోడుగా ఉండి ఆడించుకుంటుందని భర్త ఆనందును సంప్రదించి తనతో తీసుకొచ్చింది పద్మను.
అంతకంటే ముఖ్యకారణం పద్మ వాళ్ళ అమ్మ
రమణమ్మ చెప్పుకున్న తన జీవితం., పల్లెలో కూలిచేసుకుని బతుకుతూ కూతురిని పల్లెలోనే బడికి పంపేది రమణమ్మ. భర్త తాగుడుకు బానిసై కాలేయం జబ్బుతో కూతురు రెండు సంవత్సరాలప్పుడు చనిపోయాడు. రమణమ్మ అత్త ముసలామెను చిన్నకొడుకు కోడలు పట్టించుకోక వదిలేస్తే ఆ బాధ్యత తనే
తీసుకుంది.
పద్మ సమర్త అయి పైట వేసుకుని , పొడుగాటి జడతో తెల్లగా , తీర్చిన కనుముక్కుతో అందంగా ఎదిగే కొద్ది వాళ్ళ అమ్మకు కూతురును అందరు మగాళ్ళ ఆకలి చూపులనుండి కాపాడుకోవడం గగనమయింది.
కూతురు చిన్నపిల్ల. ఎండలో కూలిపని చేయడం రమణమ్మకు ఇష్టంలేదు. అందుకే పట్నం వస్తూ రమ వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. కూతురును రమ వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ ఇంట్లోపెడితే వాళ్ళ పంచన పనులు చేసుకుంటూ వాళ్ళు పెట్టింది తిని నీడ పట్టున ఉంటుందని తీసుకొచ్చింది.తరువాత మంచి పిల్లగాడు కుదిరితే పద్మకు పెండ్లి చేయాలని రమణమ్మ ఆశ.
రమ అమ్మనాన్నలు దానగుణము , పేదల పట్ల కనికరమున్న మంచివాళ్ళని చిన్నప్పటి నుండి వాళ్ళింట్లో పెరిగిన రమణమ్మకు తెలుసు.
పద్మను రమ ఆనందు బాగా చూసుకుంటారు. వాళ్ళ కూతురు దివ్య కూడా అక్క అంటూ పద్మతో సాయంత్రం ఆడుకోవడం , పద్మ దివ్యకు కథలు చెప్పడం , వంట పనిలో సాయం చేయడంతో రమకు పెద్ద రిలీఫ్.

*****

రమ ప్లాకార్డులను కట్టకట్టి ప్రక్కనున్న స్టూలు పై పెట్టి
పద్మ కేసి చూసింది.
పద్మ “అమ్మా..” మీ..టూ” అంటే ఏంటమ్మా” అని అడిగింది రమను.
అంతలో తన సెల్ ఫోన్ మోగడంతో ఆనందు తన కొలీగ్ ఫోన్ చేసాడని అక్కడినుండి ముందున్న బాల్కనివైపు నడిచాడు.
రమ ఆనందుతో మాట్లాడినప్పడు అక్కడ లేదని గ్రహించి ఆనందు అటువెళ్ళగానే పద్మతో …
“చూడు పద్మా నీవు వయసులో వున్నావు నిన్ను ఎవరయిన మగవాళ్ళ పట్టుకుని తాకగూడని చోట్ల తాకడం తడమడం , నిన్ను మాయమాటలు చెప్పి బలవంతం చేసి వాళ్ళ కోరిక తీర్చుకోడానికి ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి . అందువల్ల నీవు బయటికి పనిమీద వెళ్ళినా ,ఇంట్లో ఉన్నా ఆ దురుద్దేశాలను పసికట్టి దూరముండటం , అవసరమయితే ప్రతిగటించడం.., అంటే వాడెవడయినా వాడిని తోసి రక్కి నిన్ను నీవు కాపాడుకోవాలి. తెలిసిందా” అని …మరలా …,
“ ఏమయినా జరిగితే పరువు పోయేది జీవితం నాశనమయ్యేది ఆడవాళ్ళకే.అలా వాళ్ళ జీవితంలో
లైంగిక వేదింపులకు గురి అయిన ఆడవాళ్ళు “me too” అంటే “నేను కూడా “ అని అర్థం. ఆ వేధింపులను నేను కూడా అనునుభవించానని ముందుకొచ్చి మీడియాలో అంటే TV , ఇంటర్ నెట్ లో తమ కథలు చెప్పి ఆ మగవాళ్ళ పేర్లు బయటపెడుతున్నారు. దీని వల్ల మగవాళ్ళు పరువు పోతుందనో, ఉద్యోగాలు పోతాయనో కొంచెం ఒళ్ళుదగ్గర పెట్టుకుని నడుచుకుంటారు, ఆడవాళ్ళపై ఇలాంటి అఘాయిత్యాలు జరగడం తగ్గుతుంది.
అందువల్ల మా మహిళా మండలి తరఫున మేమంతా “మీ.. టూ” ర్యాలీ లో పాల్గొటున్నాము టైమయింది మేమంతా డిఫెరెంట్ ప్లేసెస్ నుండి బయలుదేరి టాంకుబండ్ దగ్గర చేరి అక్కడ మీటింగ్ ముగిసాక వస్తాను , నీవు దివ్యకు మధ్యాహ్నం లంచ్ పెట్టు అని.., ఆ ప్లకార్డులు నా కారులో పెట్టు “ అని లోపలి కెళ్ళింది పర్సు నీళ్ళ బాటిల్ తెచ్చుకొనేందుకు .
పద్మ కఱ్ఱలకు కట్టిన “మీ..టూ” నినాద జండాలను కార్లో పెట్టి రమ కారు దగ్గరకు రాగానే, పద్మ రమతో “అమ్మా మీతో నేను కూడా వస్తాను“మీ.. టూ” ర్యాలీకి “అంది.
రమ కారులో కూర్చోబోతూ వెనుతిరిగి నీవెందుకే దివ్యతో గడుపు. ఏమయినా ఆటలాడుకుంటూ లేదా కథలు చదువుకోండి అంది.
పద్మ తలదించుకుని “మీ ..టూ అమ్మా “అంది.
ఒక్క క్షణం నివ్వెరపోయిన రమ ఏమనుకుందో పద్మతో “కారెక్కు “అని …, ఉండు దివ్యను వాళ్ళ నాన్నను చూసుకోమని చెప్పొస్తానని లిఫ్ట్ దగ్గరకు నడిచింది. తిరిగొచ్చికారులో కూర్చుంటూ రా…అని డ్రైవింగ్ సీటు ప్రక్క డోరు తెరిచింది.
పద్మ రమ ప్రక్కన సీటులో కూర్చోగానే కారు స్టార్ట్ చేసింది రమ. కారు రోడ్డుపైకి రాగానే సర్దుకుని కూచుంటూ..
“ఇప్పుడు చెప్పు “మీ టూ”అన్నావు కదా ..ఏం జరిగింది ఎక్కడ ఎప్పుడు అని ప్రశ్నల వర్షం కురిపిస్తు అడిగింది రమ.

పద్మ చెప్పడం మెుదలు పెట్టింది. వాళ్ళ పల్లెలో స్కూల్లో మగ టీచర్లు ఇద్దురు అప్పుడప్పుడు పిలిచి ఒళ్ళంత తడుముతూ మధ్యలో ముద్దులు పెట్టుకోవడం నుంచి వాళ్ళమ్మ కూలికి పోయి ఇంటికి వచ్చేలోపు పక్కింటి గోపాల్ ఎదురింటి రాముడు తనతో ఆడుకుందాంరా అని చేసే వెకిలి పనులు అన్ని విడమర్చి చెప్ససాగింది.
రమ మధ్యలో “మీ అమ్మతో చెప్పలేదా నువ్వు “అని అడిగింది .
”చెప్పినానమ్మా … అమ్మ .. నన్ను ఒడిలో కూర్చేబెట్టుకుని రొమ్ములకదుకుని బావురుమని ఏడ్చింది. మన ఆడబతుకులింతేనే… బీదోళ్ళము .. మీ నాయన కూడా పోయినాడు ఇంకందరికి చులకనే మనమంటే. సందు దొరికితే కాటేసేందుకు కాసుకోనుంటారు తోడేళ్ళమాదిరి ఈ మగనాయాళ్ళు అని తిట్టింది. నిన్ను అన్నపూర్ణమ్మ వాళ్ళింట్లో పెడతా అక్కడ నీకు భద్రం అనింది.” అని పద్మ అనగానే..
“మరి ఇక్కడ మా దగ్గర బాగుందా నీకు “అని అడిగింది రమ.
తటపటాయిస్తూ తల అడ్డంగా ఊపింది.
ఏమి బాగలేదు చెప్పు అంది రమ.
“అమ్మా నేను చదువుకుంటాను నన్ను ఆడోళ్ళ హాస్టల్ లో చేర్పించవా…ప్లీజ్” అంది దీనంగా పద్మ.
రమకు తన కూతురు దివ్య ఏదైన గట్టిగ కోరుకుంటే చాలా దీనంగా మెహం పెట్టి ప్లీజ్ అమ్మా అని అడగడం గుర్తొచ్చింది. అప్రయత్నంగా రమ చేయి చాచి పద్మ తలనిమురుతూ .. సరే చూద్దామన్నట్టు తల ఊపింది. మబ్బులు కమ్మిన ఆకాశంలో మెరుపు మెరిసి మాయమయినట్టు పద్మ మెుఖంలో ఆనందం తలుక్కున మెరిసింది.
రమ మనసులో .. ఇక్కడ పద్మ కు “మీ టూ” సమస్య ఎవరితో..?! అనే అనుమానం మెుదలయింది.

*****

పదిరోజుల తరువాత ఒకరోజు రమ పద్మను తన బట్టలు సర్దుకోమని దుర్గాబాయి దేశముఖ్ స్కూల్ లో చేర్పించింది .హాస్టల్లో విడిచి వస్తూ పద్మ చేయి పట్టుకుని బయట లాన్లోకి తీసుకొచ్చి అక్కడ
మొక్కల మద్య బెంచిపై ప్రక్కన కూర్చోబెట్టుకుంది. పద్మకు ఆ వయసులో ఆడపిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ఆత్మ స్థైర్యంతో జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, బాగా చదువుకొని నీవు ఉద్యోగం చేస్తూ నీ కాళ్ళనీద నీవు నిలబడి మీ అమ్మను నీవే భాద్యతగా చూసుకోవాలని బుద్ది మాటలు చెప్పింది. అవసరమయినపుడు ఫోన్ చేయమని తనది, ఆనందుది ఫోన్ నంబర్లు ఇచ్చింది. చేతిఖర్చులకు డబ్బులిచ్చి జాగ్రత్తగా వాడుకోమని చెప్పి పద్మను లోపలికి పంపి కారు పార్కింగ్ వైపు నడిచింది రమ.
రమ వెళుతూ వెనుతిరిగి చూసింది .పద్మ హాస్టల్ గేటు దగ్గర తనను చూస్త్తూ చేయి ఊపింది.రమ కూడా నవ్వుతూ చేయి ఊపింది .
పద్మ “మీ ..టూ అమ్మా “ అని చెప్పి తన సమస్యను ,చదవాలనే కోరికతో ముడిపెట్టి చాకచక్యంగా నెరవేర్చు కోవడం నచ్చింది రమకు.
పద్మ ఇలా హాస్టల్ లో ఉంటూ చదువుకుంటాననడానికి కారణం రమ తన తమ్ముడు శ్రీను అని రమకు ఆనందు ద్వారా తెల్సింది.

*****

కారునడుపుతున్న రమకు భర్త ఆనందుతో ఆరోజు తన సంభాషణ గుర్తుకొచ్చి పెదవులపై చిరునవ్వు మెదిలింది.
“మీ టూ “ర్యాలీ నుండి ఇంటికి వచ్చాక ఆ రాత్రి భోజనాలయి దివ్య , పద్మ వాళ్ళు నిద్ర పోయాక రమ భర్తతో “పద్మ హాస్టల్లో ఉండి చదువుకుంటానని అడిగింది” అని చెప్పి “ఎందుకో భయపడుతూందండి మన ఇంట్లో వుండడానికి “ అని భర్త ముఖంలోకి చూసింది .
బెడ్ పై కాళ్ళు చాంచుకుని కూర్చొని ఇంగ్లీష్ నవలను చదువుకుంటూన్న ఆనందు తాపిగా తలలెత్తి
బుక్కును బెడ్ మీద పెట్టి రమ వైపు చూసి ఇలారామన్నట్టు సైగచేసాడు. రమ రాగానే పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
“నీ అనుమానం నా కర్థమయింది రమా..నేను మగవాడిననేగా..?!అని
“రమా..పద్మ హాస్టల్ లో ఉండి చదువుకుంటాను సార్ “అని నన్ను వారం రోజుల క్రితం అడిగింది.
శ్రీను , నీ తమ్ముడు తిరిగి వెళ్ళిన రోజు సాయంకాలం పద్మ వంటింటి బాల్కనిలో కూర్చొని ఏడుస్తూంది.నేను ఎందుకమ్మా ఏడుస్తున్నావు పద్మా అని అడిగితే ఇంకొంచెం గట్టిగా ఏడుస్తూ ..శ్రీను సార్ మంచివాడు కాదు సార్ వచ్చినపుడంతా నన్ను బలవంతపెడతాడు. మెున్న వచ్చినపుడు నాకు లొంగవు కదూ ఈసారి వచ్చినపుడు నీ పని పడతానుండు అని బెదిరించి పోయినాడు సార్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది . నేను హాస్టల్ లో ఉండి చదువుకుంటాను నన్ను బయట లేడీస్ హాస్టల్లో పెట్టి చదివించండి సార్ అని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది పద్మ .
నాకు శ్రీను గాడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది వాడిని చావగొడదామా అన్నంత . సరే రమతో మాట్లాడుతా చదువుకుందువులే అని ఓదార్చాను.
రమ అమ్మతో ఈ విషయం చెప్పకండి సార్ అమ్మ బాధ పడుతుంది తమ్ముడితో గొడవవుతుందనింది పద్మ.సరే సమయం చూసుకుని నీకు చెప్పాలనుకున్నా. మీ “మీ.. టూ “ ర్యాలీ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. పద్మ తనే నీతో సున్నితంగా “మీ .. టూ” అమ్మా అని చెప్పుకుని” అని ..ఆనందు రమను దగ్గరికి అదుముకుంటూ…”నా మీద నమ్మకం లేదా డియర్ “అన్నాడు.
రమకు మనసులో గూడుకట్టుకున్న భారం దిగిపోయింది. భర్త సంస్కారంపై నమ్మకమున్నా ఆ సమయంలో ఆలోచనలు అలా …అనుకుంటూ భర్త బుజం పై తలవాల్చి మరలా తలెత్తి ఆనందు బుగ్గ పై సున్నితంగా ముద్దు పెట్టింది. తేలికయిన రమ మనసును ఆ ముద్దు తెలిపింది ఆనందుకు.
చెన్నయిలో బి.టెక్ . చదువుతూ హాలిడేస్ లో అక్కబావ దగ్గరికి వచ్చినపుడు శ్రీను పద్మను అది తెచ్చిపెట్టు ఇది తెచ్చి పెట్టు అని పదే పదే పిలిచి చేయిపట్టుకోవడం రమకు గుర్తుకొచ్చింది.
ఆడపిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలో అర్థమయింది రమకు. “మీ.. టూ” ర్యాలీ మీటింగులో పిల్లలతో ముఖ్యంగా ఆడపిల్లలతో తల్లి తండ్రులు ఎక్కువ టైమ్ గడుపుతూ వాళ్ళు ఈ అభద్ర సమాజంలో తమను తాము ఏ విధంగా కాపాడుకోవాలో చర్చించుకున్న విషయాలు గుర్తు కొచ్చి రమకు కూతురు దివ్య మెదిలింది మనసులో.

#********#

2 thoughts on “విశ్వపుత్రిక వీక్షణం – “మీ…టూ..అమ్మా”

  1. అందరూ చదవాల్సిన కధ.కధాంశం సున్నితమైనదే కాక పరిష్కారం ఇదీ అని చెప్పలేనంత జటిలమైన సమస్య. మీరు మలచిన తీరు చాలా బాగుంది విజయలక్ష్మి పండిట్ గారు. అభినందనలు.

Leave a Reply to Girija peesapati Cancel reply

Your email address will not be published. Required fields are marked *