March 29, 2024

సౌందర్యలహరిలోని ఓ పది శ్లోకాలు!

రచన: శారదా ప్రసాద్

కొంతమంది మిత్రులు, హితులు ‘సౌందర్యలహరి’ నుండి ఒక పది రోజులు పది శ్లోకాలకు, వాటి అర్ధాలు, వివరణలను క్లుప్తంగా చెప్పమని కోరారు. మనం చేయవలసిన పనులు ఇలానే మన వద్దకు వస్తాయి. నా వద్దకు వచ్చిన ఆ ప్రతిపాదనను అమ్మవారి ఆజ్ఞగా, ఆశీస్సుగా తీసుకొని వ్రాయటానికి ఉపక్రమించటానికి ముందుగా, అమ్మను కీర్తించే శక్తిని అమ్మనే ప్రసాదించమని ప్రార్ధించి శ్రీకారం చుట్టాను. నాకు తెలియకుండానే అలా ఒక పది శ్లోకాలకు అర్ధాలను, నాకు తోచిన భావంలో, నాకు వచ్చిన, నచ్చిన భాషలో చెప్పటానికి ప్రయత్నించాను. నిజానికి, నాలాంటి స్వల్పునకు ఇది తలకు మించిన భారం. ఆ భారాన్ని కూడా అమ్మవారే మోసి, నన్ను తన చేతితో దిద్దించి వ్రాయించి మరోసారి అక్షరాభ్యాసం చేసింది. ఈ వయసులో అటువంటి గురువే కావాలి! నాలో నిజమైన ‘అక్షరాన్ని’నాటింది అమ్మ. దానికి నీరు పోసి పెంచుకోవలసిన బాధ్యత నాది. నిజానికి సౌందర్యలహరిలో ఒక పది శ్లోకాలను ఎన్నటం అపరాధమే! అమ్మవారికి పూజా పుష్పాలుగా ఒక పది శ్లోకాలను మాత్రమే సమర్పించే సమర్ధతను, అర్హతను అమ్మ నాకు ప్రసాదించిందేమో! అదే పరమానందంగా భావించి ఆ లహరిలో తేలియాడాను. వీటిని వ్రాయటానికి శ్రీ జి.యల్. యన్.శాస్త్రి గారు వ్రాసిన సౌందర్యలహరిని కొద్దిగా ఆధారంగా చేసుకొని వ్రాసాను. వారికి భక్తిపూర్వక కృతజ్ఞలతో!
ఇక, అమ్మవారి అనుగ్రహంతో అవధరించండి. అన్ని సౌందర్యాలు ఏనాటికైనా వాడిపోవలసినవే! ఈ నాటి అందాల రాశులు రేపటికి పనికి రాని(రాణి) కాసులవుతారు. ‘నశించని అసలు సిసలు సౌందర్యాన్నే ఆరాధించండి, అదే మిమ్మల్ని మోక్షానికి దగ్గరగా తీసుకెళ్ళుతుంది ‘అని చెప్పటమే ఆది శంకరుల భావన! అసలు సౌందర్యలహరి అంటే ఏమిటి?ఇది ముచ్చటైన మూడు పదాల కలయిక. సౌ: -అంటే మోక్షం, దరి -అంటే దగ్గరికి, లహరి-అంటే కెరటం. మూడు పదాలను కలిపి చెప్పుకుంటే, సౌందర్యలహరి అంటే, మోక్షమార్గానికి చేర్చే అల(కెరటం) అని చెప్పుకోవచ్చు. శ్రీ ఆదిశంకరుల భక్తి కావ్యాలలో, భక్తితో పాటు గొప్ప సాహితీ సంపద పుష్కలంగా లభిస్తుంది. శ్రీ ఆదిశంకరుల సౌందర్యలహరిలో మనం కూడా తేలియాడుదాం. అంటే, అమ్మ ఒడిలో హాయిగా విశ్రమించి ఆనందించుదాం!
సౌందర్యలహరిలో నుండి పది శ్లోకాలను ఎన్నిక చేయటమే పెద్ద అపరాధం. ఎందుకంటే , అన్ని శ్లోకాలు పరమాన్నం లాగా ఉంటాయి. ‘అమ్మకు’ నైవేద్యంగా కొన్నిటికి నాకు తోచిన అర్ధాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తాను. సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చెప్పటానికి ప్రయత్నిస్తాను. సద్బుధ్ధితో చేసే పనులలో అమ్మ దోషాలను ఎంచదు. ఈ ప్రయత్నాన్ని మిత్రులు సహృదయంతో స్వీకరించి, నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అందరూ అమ్మ ప్రేమకు పాత్రులు కావాలనే ఆకాంక్షతో. . .
సౌందర్యలహరిలోని మొదటి శ్లోకమే, ఆ గ్రంధసారాన్ని మొత్తం తెలియ చేస్తుంది.

ఇప్పుడు ఆ మొదటి శ్లోకాన్ని, దాని అర్ధాన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను.

శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్త: ప్రభవితుమ్
న చే దేవం దేవో నఖలు కుశల: స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్య: ప్రభావతి.
అర్ధం-తల్లీ! భగవతీ!! సాక్షాత్తు పరమశివుడంతటివాడు శక్తిస్వరూపిణి అయిన నీతో కలసి ఉండటం వల్లనే ఈ సర్వ జగత్తును, సమస్త సృష్టినీ చేయుటకు సమర్ధుడగుచున్నాడు. అలా, నీతో కూడి యుండనిచో, శివుడైనను చలించలేడు, శక్తివంతుడు కాలేడు. త్రిమూర్తులచేత కూడా పూజించబడే నిన్ను గురించి నమస్కరించటానికి గానీ, ఆరాధించటానికి గానీ, స్తుతించటానికి గానీ పుణ్యం చేయని వాడు ఏ విధంగా అర్హుడు?(అర్హుడు కాదని అర్ధం)ఈ విధంగా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలోనే ‘అమ్మ’ గొప్పతనాన్ని గురించి కవితాత్మకంగా చెప్పారు. అమ్మ దయ ఉంటేనే అయ్య అనుగ్రహం లభించేది!సౌందర్యలహరిలో మొత్తం నూరు శ్లోకాలు ఉంటాయి. మొడటి 41 శ్లోకాలు గల భాగాన్ని ఆనందలహరి అని, తరువాతి 59 శ్లోకాలు గల భాగాన్ని సౌందర్యలహరి అని అంటారు. మొదటి భాగమునందు కుండలినీ యోగానికి సంబంధించిన షట్చక్ర, తంత్ర, యంత్ర, మంత్ర శాస్త్ర రహస్యాలు ఎక్కువుగా ఉంటాయి. రెండవ భాగమైన సౌందర్య లహరిలో అమ్మవారి నఖశిఖపర్యంత వర్ణన ఉంటుంది. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించే సందర్భంలో వాటిలో కొన్ని శ్రీ విద్యా రహస్యాలు కూడా ఉంటాయి.

ఇప్పుడు మనం మొదటి భాగమైన ఆనందలహరిలోని, 5 వ శ్లోకం, దాని అర్ధాన్ని గురించి చెప్పుకుందాం!
హరి స్త్వా మారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంత: ప్రభవతి హి మోహాయ మహతాం
అర్ధం– తల్లీ!పరమ పావనీ!!నిన్ను ఆరాధించే భక్తులకు సౌభాగ్యాలను ప్రసాదించే వరదాయినివి నీవు. నిన్ను ఆరాధించే పూర్వమొకసారి శ్రీమహావిష్ణువు జగన్మోహినీ అవతారాన్ని పొంది, త్రిపురహరుడైన శివుని సైతం మోహంలో పడేసాడు. శివుని మనసుని కలవర పెట్టాడు. అలాగే, మన్మధుడు కూడా నిన్ను స్థుతించి, నీ దయకు పాత్రుడై తన భార్య అయిన రతీదేవికి కన్నుల పండుగ గొలుపు సుందర శరీరాకృతిని పొందటమే కాకుండా జితేంద్రుడై, మౌనంగా తపస్సు చేసుకునే ఋషులను కూడా మోహానికి దాసులను చేయు సమర్థుడయ్యాడు కదా?
వివరణ-అమ్మను ఆరాధించి, ఆమె దయను పొంది–అసమాన్యులైనవారిని ఆట పట్టించిన ఇరువురి పూర్వ గాధలీ శ్లోకంలో ప్రస్తావించబడ్డాయి.
రతీ మన్మధుల అంతరార్ధం-‘స్మరుడు’ అనగా మన్మధుడు. అతని భార్యే రతీదేవి. అతిలోక సుందరి ఈమె. భార్యాభర్తల ప్రేమానురాగాల దాంపత్యానికి వీరు ప్రతీకలు. ‘రతి, ‘అంటే, ఆసక్తి, అనురక్తి. ‘మన్మధం’అంటే మానసిక మధనం, అంటే ‘అనుభూతి’, అంటే ప్రతి వ్యక్తిలోనూ ఆసక్తిని రేకెత్తించేది ‘రతి’ కాగా, అనుభూతిని ప్రసాదించేవాడు మన్మధుడు. అందుకనే మానవులలోని ఆసక్తి, అనుభూతులకు వీరు సంకేతాలు. అమ్మవారి కుమారుడైన మన్మధుని కంటితో కాల్చినందుకు శివునకు సైతం కామప్రభావం ఎలా ఉంటుందో, రుచి చూపించిన ఘనుడు మన్మధుడు. ఇది అతని ప్రభావం కాదు, కేవలం అమ్మవారి కరుణా కటాక్షమే!అమ్మవారి చల్లని చూపులకు నోచుకున్న మన్మధుడు ముక్కంటి కంటి బారినుండి కూడా తప్పించుకొని, అనంగుడయ్యాడు (శరీరం లేకుండా జీవించటం). సామాన్యుడైన మన్మధుడు అమ్మవారి దయకు పాత్రుడు కావటం వల్లనే ఇది సాధ్య పడింది. అమ్మవారి అనుగ్రహం వుంటే, సామాన్యులు అసమాన్యులవుతారని శ్రీ శంకరభగవత్పాదులు ఈ శ్లోకంలో చక్కగా వివరించారు.

ఇప్పుడు మనం ఆనందలహరి లోని ఎనిమిదవ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం!
సుధా సింధోర్మధ్యే , సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే
శివాకారే మంచే పరమశివపర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యా: కతిచన చిదానందలహరీం
అర్ధం-లోకపావనీ! సుధాసముద్రపు మధ్యప్రదేశంలో చుట్టూ కల్పవృక్షములు గల మణిమయ ద్వీపంలో, కదంబ వనంలో, చింతామణులతో నిర్మించబడ్డ గృహము నందు, శివాకారపు మంచమునందు, సదాశివుని అంకభాగం నిలయంగా కలిగి, జ్ఞానానంద తరంగ రూపంగా ఉన్న నిన్ను–కృతార్ధులైన వారు మాత్రమే సేవించి తరించు చున్నారు.
వివరణ -పైన తెలిపిన విధంగా జగన్మాతను అంతర్ముఖంగా ధ్యానించి, సేవించి తరించువారు బహు స్వల్ప సంఖ్యలో ఉంటారని ఆది శంకరులు చెప్పుచున్నారు. ఆత్మానందం పొందుటకు–ఆడంబరములైన పూజాదులు అవసరం లేదనియూ, స్థిర చిత్తంతో అమ్మవారిని ధ్యానించి కూడా సులువుగా మోక్షం పొందవచ్చని ఈ శ్లోకం లోని అంతరార్ధం. ‘లలితా సహస్రనామం స్తోత్రం’లోని — శివ కామేశ్వరాంకస్థా, సుమేరు శృంగమధ్యస్థా, బైందవాసనా, సుధాసాగర మధ్యస్థా, శివశక్తైకరూపిణీ , పంచ బ్రహ్మాసనస్థితా మొదలగు అమ్మవారి నామాలు , ఈ శ్లోకంలో చక్కగా అమరినవి. అనంతకోటి నామాలుగల అమ్మను ప్రేమతో ఏ పేరుతో పిలిస్తే పలుకదు ?

ప్రస్తుతం మనం ఆనందలహరి లోని 21వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం!
తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం
నిషాణ్ణాం షణ్ణా మప్యుపురి కమలానాం తవ కలాం
మహా పద్మాటవ్యాం మృది తమల మాయేన మనసా
మహాంత: పశ్యంతో దధతి పరమాహ్లాదలహారీం
అర్ధం-అమ్మా జగజ్జననీ! మెరుపు తీగలాంటి అందమైన, సూక్ష్మమైన, పొడవైన క్షణకాల తేజోవంతమైన కాంతితో, సూర్యచంద్రాగ్నిరూపాల సమన్వయంతో, షట్చక్రాల ఆవల గల గొప్ప తామర వనమందు(అనగా సహస్రారం కమలమందు) వెలుగొందే నీ మహాకళ–కామాది మాలిన్యాలను పోగొట్టుకున్న మహాఋషులైన యోగీశ్వరులు, ధ్యానించి నీ ‘మహదానందలహరి’లో తనివి తీరా తేలియాడుతున్నారు, ఓలలాడుతున్నారు.
వివరణ-ఈ శ్లోకం అమ్మవారి అనుగ్రహానికి పరాకాష్ట. వివేకం, వాక్చాతుర్యం, రచనా నైపుణ్యం, అందం, ఐశ్వర్యం, ఇతరులను ఆకర్షించే వ్యక్తిత్వం, సేవాతత్పరత లాంటి ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ , ఇంకా పొందవలసిన సంపద ఒకటి మిగిలి ఉంది. అదే మోక్ష మార్గం. అదే ప్రతి జీవి జీవితానికి అంతిమ లక్ష్యం. దీనినే, అన్నిటినీ మించి ఆనందం కలిగించే’పరమపదం’ అని పెద్దలు అన్నారు. శ్రీ విద్య, శ్రీ చక్రోపాసన లోని ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. అలా సాధన చేసిన మహాఋషులు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ, వారికి భౌతికమైన సంపదల మీదా, ఆనందాల మీదా కోరికలు ఉండవు. ఈ స్థితికి చేరుకోవటానికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చేరుకోగలం.

ఇప్పుడు మనం సౌందర్యలహరి లోని 49వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం.

విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయై:
కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా
అవంతీ సృష్టి స్తే బహునగర విస్తార విజయా
ధృవం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే.

అర్ధం-అమ్మా భగవతీ!విశాలమైన నీ చూపుల వల్ల, విశాలా అనే నగర నామం నీకే తగినది. కళ్యాణమంతమైన నీవు కళ్యాణీ అనే నగర నామంతో పిలువబడటంలో ఏ మాత్రం అనౌచిత్యం లేదు. నల్లకలువల కాంతి నీ నిక్కమైన కాంతి ముందు వెలవెల బోవటంవల్ల మరియూ నీ అతిలోక సౌందర్యం వల్లనూ అయోధ్య అనే నగరం పేర పిలువబడుచున్నావు. కృప, కరుణారస ధారలను ప్రసరించే నీవు ధారానగర నామంతో పిలువ బడటం చాలా అర్ధవంతం. అవ్యక్తమైన మధుర మనోజ్ఞత కలిగి వుండటం వల్ల , నీవు మధురానగర నామంతో పిలువ బడటానికి పూర్తి అర్హురాలవు. పరిపూర్ణ భోగాలను ఇచ్చే నీవు కాక మరెవరు భోగవతీనగర నామంతో పిలువ బడటానికి అర్హులు?రక్షణ ఇచ్చేనిన్ను అవంతీనగర నామంతో పిలవటానికి మాకు ఎంతో సంతోషం. విజయాన్ని ఇచ్చే నిన్ను విజయనగర నామంతో ఆనందంతో కీర్తిస్తాం. ఈ విధంగా ఎనిమిది ముఖ్య లక్షణాలు కలిగి, ఆ లక్షణాలు కలిగిన నగరాల నామాలతో అమ్మ స్వాతిశయంతో భక్తులకు కనువిందు చేస్తుంది.
వివరణ-ఈ శ్లోకం అమ్మవారి నేత్రదృష్టిని(చల్లని చూపులను) గురించి విశేషంగా చెబుతుంది. ఆ చూపులు భక్తులపై కరుణ రసామృతాన్ని కురిపిస్తాయి. అమ్మవారి చూపులను గురించి చెప్పటంలో, వాడిన ‘విశేషణాలు’, కర్మ భూమి అయిన భారతదేశంలోని ఇతిహాస ప్రాధాన్యమున్న ఎనిమిది మహానగరాల పేర్లు ఉన్నాయి. భారత దేశమంతా అమ్మ కీర్తిని వేనోళ్ళ కీర్తిస్తుంది అని చెప్పటం కూడా ఆ శ్లోకానికి అంతరార్ధమై ఉండవచ్చు. అమ్మ కళ్ళు తెరిస్తే శిష్టులకు రక్ష , దుష్టులకు శిక్ష!అదే ఆ ‘నేత్రదృష్టి’ విశేషం. భక్తినావతో ఆనందలహరిని దాటి సౌందర్యలహరికి చేరుకున్నాం .

తరువాత మనం సౌందర్యలహరిలోని 50 వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం.

కవీనాం సందర్భస్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణ యుగళం
అముంచన్తౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళా
వసూయా సంసర్గా దళికనయనం కించి దరుణం
అర్ధం- మామూలు భక్తులే అమ్మవారిని అత్యద్భుతంగా కీర్తిస్తుంటే, మరి సుకవులను గురించి చెప్పేదేముంది? అటువంటి కవిపుంగవులు రసవత్తర వర్ణనలతో అమ్మను ఇలా వర్ణిస్తున్నారు. పుష్పాల నుండి జాలువారే మకరందమందు ఆసక్తిని చూపించే నీ కళ్ళు, చూపు, ‘కడగంటి చూపులు’ అనే నెపంతో నీ చెవులను తాకుతున్నాయి. గండుతుమ్మెదల లాంటి నీ రెండు కళ్ళు నవరసాస్వాదానుభూతిని కలిగిస్తున్నాయి. ఆ రసాస్వాదానుభూతిని నీ చెవులు వదులుకోలేక వున్నాయి. అంతే గాక, నీ భ్రూమధ్యమందు ఉన్న ‘లలాట నేత్రాన్ని’చూసి, నీ వీనులు అసూయ కూడా పడుతున్నాయి. అలా నీ వీనులు ఆ రసాస్వాదానుభూతిని వదులుకోక పోవకుండా అలానే నీ నేత్రాలను అంటిపెట్టుకొని ఉండటం వల్ల , భక్తులకు ఇబ్బంది కలగటం వల్లనేమో కూడా , నీ లలాట నేత్రం కోపంతో ఎరుపెక్కింది.
వివరణ-అయ్యవారికే కాదు, అమ్మవారికి కూడా మూడు కళ్ళు ఉన్నాయి. ఆయన కంటే ఏమి తక్కువ అమ్మకు?అమ్మ, అయ్యల ఆరుకళ్ళు ప్రకృతిలోని ఆరు ఋతువులను సూచిస్తాయేమో!సౌందర్యలహరిలోని అన్ని శ్లోకాలకంటే, ఈ శ్లోకాన్నిసుకవులు, సాహితీ పిపాసులు ఎక్కువగా ఇష్ట పడుతారు. మహా కవులు మాత్రమే ఈ విధంగా కవితా పాండిత్యాన్ని ప్రదర్శించగలరు. ఈ శ్లోకంలోని ప్రతి అక్షరం కవితామయమే!ఈ శ్లోకం ఒక చక్కని పదచిత్రం. ఎంత చక్కని భావుకత!సౌందర్యరాశి అయిన అమ్మవారిని చక్కని ఊహలతో, భావనలతో అందంగా చెప్పిన శ్లోకమిది. రమణీయ, కమనీయ, స్మరణీయమైన అద్భుత కవితాశిల్పం గల ఈ శ్లోకం–పున:పున: స్మరణీయం! నేను మొదట్లోనే చెప్పినట్లు శ్రీ శంకరులు మహాకవిభక్తవరేణ్యుడు, భక్తమహాకవి శయుడు!భక్తిని, కవిత్వాన్ని రంగరించి భారతీయులకు శ్రీ శంకరులు అందించిన మధుర కావ్యం సౌందర్యలహరి.

అటు పిమ్మట సౌందర్యలహరి లోని 60 వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం.

సరస్వత్యా: సూక్తీ రమృతలహరీ కౌశలహరీ:
పిబంత్యా శ్శర్వాణీ శ్రవణచులుకాభ్యా మవిరళం
చమత్కార శ్లాఘా చలితశిరస: కుండలగణో
ఝుణత్కారై స్తారై: ప్రతివచన మాచష్ట ఇవ తే.
అర్ధం-అమ్మా శర్వాణీ!సరస్వతీ దేవి వినిపించు మధుర గానసుధారసధారలకు ఆనందంతో, తన్మయత్వంతో నీవు శిరస్సును లయబద్ధంగా ఊపు సందర్భంలో, నీ చెవులకు ఉన్న కర్ణాభరణాలు ఒక్కసారిగా రమ్యధ్వనిలో చేయు ఝణ ఝణత్కారాలు, సరస్వతీ దేవి గానం ‘బాగున్నది’అని మాటలతో చెప్పటానికి బదులుగా, సంకేతంగా చెప్పటమే అనిపిస్తుంది.
వివరణ-అమ్మవారి సౌందర్యాన్ని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. వాడిపోని కుసుమకోమలగాత్రిని గురించి-నఖశిఖపర్యంతం భక్తిభావంతో కవితాత్మకంగా చెప్పారు శ్రీ శంకరులు. అమ్మవారు ధరించిన వస్తువులు కూడా సౌందర్యవంతమైనవే!ఆమె స్పర్శకు జడత్వమున్నశిలలకు సైతం మనోహర సౌందర్యం ప్రాప్తిస్తుంది. ఈ శ్లోకంలో విశేషాన్ని చూడండి–సరస్వతీ దేవి గానానికి , జ్ఞానానికి అధిదేవత. అట్టి దేవత వినిపించే మధుర గానసుధారసధారల కన్నా అమ్మవారి కర్ణాభరణాలు చేయు ఝణ ఝణత్కారాలు గొప్పగా ఉన్నాయని చెప్పటమే శ్రీ శంకరుల భావం. అమ్మవారి సౌందర్యం ముందు ప్రపచంలో మనమనుకునే సౌందర్యాలన్నీ దిగదుడుపే!ఈ కావ్యానికి సౌందర్యలహరి అని పేరు పెట్టటానికి కారణం-ప్రతి శ్లోకంలో అమ్మవారి సౌందర్యాన్ని గురించి ఆరాధనా భావంతో చెప్పటమే!

ఇప్పుడు మనంసౌందర్య లహరిలోని 63 వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం.

స్మితజ్యోత్స్నా జాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణా మాసీ దతిరసతయా చంచుజుడిమా
అతస్తీ శీతాంశో రమృతలహరీ రామ్లరుచయ:
పిబంతి స్వఛ్ఛందం నిశి నిశి భ్రుశం కాంచిక ధియా.
అర్ధం-అమ్మా పరమేశ్వరీ!చంద్రబింబం లాంటి నీ నగుమోము, నీ నవ్వు ఎలా ఉన్నాయంటే -వెన్నెలనంతటినీ అమితంగా గ్రోలిన చకోర పక్షులకు మధురమైన ఆ వెన్నెలను అమితంగా గ్రోలటం వల్ల వాటి నాలుకలు ఆ తీపిదనానికి చచ్చుబారిపోయి, మరే రుచిని గ్రోలనివ్వటం లేదు. అందుచేత ఆ చకోరపక్షులు ఏమైనా పుల్లనైనవి త్రాగి తమ నాలుక మొద్దుబారినతనాన్ని పోగొట్టుకొన తలచి-చంద్రుని వెన్నెల అనబడు బియ్యాన్ని కడిగిన నీరు, లేదా అన్నపు గంజియను భ్రమలో ప్రతిరాత్రి ఎక్కువగా త్రాగుచున్నవి. (అలా, అవి నీ నవ్వులోని తియ్యదనాన్ని గ్రోలటం మాత్రం మానలేదు. )
వివరణ-అమ్మవారి చిరునవ్వుల తీపిదనం గురించి పోల్చి చెప్పేటప్పుడు-చంద్రుని వెన్నెల తీపిదనం అన్నపుగంజి వలే పుల్లగా ఉంటుందనే విషయం, వెన్నెల రుచుల లోని గుణ దోషాలను, తారతమ్యాలను, హెచ్చు తగ్గులను నిర్ణయించి చెప్పటానికి ప్రామాణిక మైన–చకోర పక్షుల చేతనే చెప్పించటం కవితాలోకంలో నేటికీ ఒక నూతన ప్రక్రియ. ఇటువంటి నూతన ప్రక్రియను శ్రీ శంకరులు ఏనాడో కవితాత్మకంగా, మనోహరంగా చెప్పారు. ఈ కవితా రీతులను తరువాతి కవులు కూడా అనుకరించారు, అనుసరించారు. చంద్ర సహోదరి అయిన అమ్మవారి నగుమోమును చంద్ర బింబంతో పోల్చటం ఎంతో సహజంగా ఉంది.

తరువాత మనం సౌందర్యలహరిలోని 88 వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం.

పదం తే కీర్తీనాం ప్రపద మపదం దేవి విపదాం
కథం నీతం సద్భి:కఠినకమఠీ కర్పరతలాం
కథం వా పాణిభ్యా ముపయమమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృష్టది దయమానేన మనసా.
అర్ధం-అమ్మా పరమ పావనీ!అన్నిసత్కీర్తులకు ఆలవాలమై, అన్ని ఆపదలనుండి భక్తులను కాపాడే నీ అతి మెత్తని పాదాలను సుకవులు అతి గట్టిగా నుండే ఆడు తాబేలు యొక్క వీపు పైన ఉన్నకవచం(డిప్ప)తో పోల్చటం ఏమంత సమంజసంగా ఉంది?త్రిపుర హరుడైన పరమ శివుడు కఠిన హృదయుడై నీ వివాహ సమయంలో ‘సన్నికల్లు'(పసుపు నూరుకునే సాధనానికి ఆధారం)ను నీ లేత చిగురుటాకు వంటి పాదం మీద ఎలా ఉంచగలిగాడు?
వివరణ-ఈ శ్లోకంలో అమ్మవారి పాదాలను గురించి శ్రీ శంకరులు వివరించారు. సాధారణంగా ఆడువారి పాదాల పై భాగం కొద్దిగా ఉబ్బెత్తుగా వుంటాయి. కవీశ్వరులు ఆ పాదాలను ఆడ తాబేలు వీపు పైనుండు డిప్పతో పోలుస్తారు. ఆపద వచ్చే సమయాన్ని ముందుగానే పసిగట్టి, తాబేలు తన నాలుగు కాళ్ళను మెడ మరియు ముఖంతో సహా ఆ డిప్పలోకి దాచుకుంటుంది. కవీశ్వరులు అలా ఆడువారి పాదాలను పోల్చటం శ్రీ శంకరులకు నచ్చలేదు. అందునా, పరమపావని అయిన జగన్మాత లేత చిగురుటాకు వంటి పాదాలను అలా పోల్చటం ఆది శంకరులకు రుచించలేదు. ఆఖరికి, శివుడు కూడా వివాహ సమయంలో అమ్మ మెత్తని పాదాలపై గరుకుగా మరియు గట్టిగా ఉండే సన్నికల్లును పెట్టి ఆయన కఠిన హృదయాన్నిచాటుకున్నాడు. అమ్మవారి సుతి మెత్తని పాదాలను కవీశ్వరులు అలాపోల్చటం, శివుడు ఆ పాదాలపై సన్నికల్లును పెట్టటం శ్రీ శంకరుల హృదయాన్ని ద్రవింప చేసింది. అమ్మవారి పాదాలను శివుడితో సహా ఎవరైనా సరే సక్రమంగా గుర్తించి, కీర్తించకపోతే శంకర భగవత్పాదులు సహించలేరు. అంత గొప్పనైన అమ్మ పాదాల చెంతనే మనకురక్ష !ఈ పది శ్లోకాలలో అమ్మవారి సౌందర్యాన్ని గురించి ఆనందంగా, తన్మయత్వంతో ఆరాధనా భావంతో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆఖరి శ్లోకాన్ని (నూరవది)గురించి చెప్పుకుందాం. ఈ శ్లోకంతో దీనిని ముగిస్తున్నందుకు హృదయం బరువెక్కుతుంది. ఈ పది శ్లోకాలు పది ఆణిముత్యాలు. సాధ్యమైనంతవరకు వీటిని పున:పున: స్మరించండి. అమ్మవారి అనుగ్రహంతో, మీ ఆశిస్సులతో మాత్రమే వీటికి అర్ధాలు, వివరణలు ఇవ్వటం సాధ్యపడింది. లేకపోతే , నాలాంటి స్వల్పునకు ఇది సాధ్యమేనా?

ఇక శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం.

ప్రదీపజ్వాలాభి ర్దివసకర నీరాజనవిధి:
సుధాసూతే శ్చంద్రోపలజలలవై రర్ఘ్యరచనా
స్వకీయై రంభోభి స్సలిలనిధి సాహిత్య కరణం
త్వదీయాభి ర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతి రియం
అర్ధం-ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, భావాన్ని వ్యక్త పరచటానికి మాట , వ్రాత చాలా అవసరం. అట్టి వాక్ప్రపంచానికి తల్లివైన ఓ భగవతీ!తన ప్రకాశంతో వెలుగొందే సూర్యునికి దివిటీలతో హారతి ఇచ్చుట ఎట్లో, చంద్రకాంత శిలాజలధారలచేత చంద్రునికి అర్ఘ్యం సమర్పించుట ఎట్లో, సముద్ర జలాల చేతనే సముద్రునకు తర్పణం విడుచుట ఎట్లో , అలాగే–నీ అనుగ్రహం, దయ వల్ల నీ రూపం నుండి వ్యక్తమైన నా పదాలను ఏర్చి కూర్చి మాలగా చేసి ఈ స్తుతి చేయటం జరిగింది. ఈ స్తుతి చేయటం అనేది కూడా నీ చేతనే చేయబడింది. నేను నిమిత్త మాత్రుడను.
వివరణ- ఈ చివరి శ్లోకం ఒక విధంగా అమ్మవారికి, సౌందర్యలహరిని అంకితం చేసినట్లుగా ఉంది. సౌందర్యలహరి లోని ప్రతి పలుకు వాగ్దేవి అయిన అమ్మవారి అనుగ్రహం చేత కూర్చిమాలగా చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు శ్రీ శంకరులు. కావున ఈ స్తోత్రం అమ్మవారిని గురించినదే కాకుండా, అమ్మవారికే చెందినది కూడా. ఈ విశ్వంలో అన్నిటికీ కూడా ఆమే యజమాని, సంరక్షకురాలు కూడా! శ్రీ శంకరులు, తాను నిమిత్త మాత్రుడనని అతి వినయంగా చెప్పుకుంటూ అమ్మవారికి సర్వసమర్పణ చేసుకుంటున్నారు. నిరహంకారంతో, సర్వం అమ్మవారికి సమర్పిస్తూ శ్రీ శంకరులు సౌందర్యలహరిని ముగిస్తున్నారు. మనమూ అమ్మవారిని కీర్తిస్తూ, సర్వసమర్పణ బుద్ధితో అమ్మకు ప్రణమిల్లుదాం. ఇంత గొప్ప కావ్యాన్ని భారతీయులకు అందించిన శ్రీ శంకరులకు మనసారా నమస్కరిస్తూ, ఆ ఋషిఋణం మనం ఏనాటికైనా తీర్చుకోవలసిందే!దానికి మార్గం ఒక్కటే–ఆయన వ్రాసిన వేదాంత, భక్తి కావ్యాలను నిరంతరం పారాయణం చేయటమే!

శ్రుతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం

(వేదాలు ఉపనిషత్తులు, పురాణాలను ఔపోసన పట్టిన కరుణాలయుడు, సాక్షాత్తు పరమ శివుని అవతారమైన శ్రీ ఆదిశంకరులకు ప్రణమిల్లుతున్నాను)
శుభం భూయాత్
శారదాప్రసాద్

10 thoughts on “సౌందర్యలహరిలోని ఓ పది శ్లోకాలు!

  1. Wonderful ! Names and their derivations
    From Slovak num 49 …..great indeed !
    Explanation of all the selected 10 slokas is superb!!

  2. అద్భుతంగా వ్రాసారు ,అభినందనలు!

  3. చాలా బాగా వ్రాసారు.సౌందర్యలహరిలోని అన్ని శ్లోకాలను వ్రాయగల సమర్ధత మీకుందనిపిస్తుంది !

  4. Dear Sastry
    Beautiful.You have shown your talent in POETRY side also.Like a sword which has power in both sides you have shown your talent.
    Interestingly you have taken SOUNDARYALAHARI.
    AMMA BLESSINGS ARE ALWAYS WITH YOU.

  5. అద్భుతంగా వివరించారు శాస్త్రిగారు. జగజ్జనని సౌందర్యం ఎంతని వర్ణించగలం. ఏది మొదలు .. ఏది తుది. మానవమాత్రులకి సాధ్యమా అమ్మ విలాసాన్ని వివరించడం. మీరు మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు.

Leave a Reply to B S Moorty Cancel reply

Your email address will not be published. Required fields are marked *