March 29, 2024

దీపావళి పద్యములు

రచన: జెజ్జాల కృష్ణ మోహనరావు

దీపావళికి సంబంధించిన పదములతో ఉండే వృత్తములను ఏరి పండుగ సందర్భముగా శుభాకాంక్షలతో ఇక్కడ అందిస్తున్నాను. అన్య నామములను కుండలీకరణములలో చూపినాను. * గుర్తుతో నున్నవి నా కల్పనలు. ప్రతి ఛందమునకు రెండు ఉదాహరణములను ఇచ్చినాను. ఇందులో వాడబడిన ఛందములు 20, అవి – దీప్తా, లక్ష్మీ, అర్చిస్సు, భాస, దీపకమాలా, మౌక్తికమాలా, కాంతి, మణిమాలా, ప్రభా, బభ్రులక్ష్మీ, నిగ్గు, దీపక, భామ, భాతి, హరిణీ, కలాపదీపక, దీపికాశిఖ, దీపార్చి, జ్యోతి, దీప.

దీప్తా – స/ర/గ IIU UI UU
(భూరిధామా, హంసమాలా)
7 ఉష్ణిక్కు 20

రగులన్ గ్రొత్త కాంతుల్
సుగముల్ నిండ శాంతిన్
మొగముల్ దీప్తమయ్యెన్
జగముల్ దీప్తమయ్యెన్

విరబూయంగఁ బువ్వుల్
సరసమ్మైన నవ్వుల్
గరమందుండు దివ్వెల్
సిరులై వెల్గు రవ్వల్

లక్ష్మీ – ర/ర/గల UIU UIU UI
8 అనుష్టుప్పు 147

మాగృహమ్మందు నర్తించ
భోగభాగ్యమ్ము లందించ
వేగమో లక్ష్మి రమ్మిందు
రాగపీయూషముల్ చిందు

పూల నీకిత్తు మో యమ్మ
లీలగా మమ్ము జూడమ్మ
పాల యా పొంగుగా రమ్ము
మేలు సౌభాగ్యముల్ తెమ్ము

*అర్చిస్సు – త/ర/మ UUI UI – UU UU
9 బృహతి 25

ఆడంగ నేఁడు – హాళిన్ గేళుల్
చూడంగ నేఁడు – సొంపుల్ రంగుల్
పాడంగ నేఁడు – పాటల్ పద్యాల్
కూడంగ నేఁడు – కూర్మిన్ మిత్రుల్

స్వానమ్ము ల్మెందు – సానందానన్
ధ్యానమ్ము లెందుఁ – దల్లిన్ గొల్వన్
గానమ్ము లెందు – గంగా స్నానా-
హ్వానమ్ము లయ్యె – స్వామిన్ గొల్వన్

గర్భిత కందము –
స్వానమ్ము ల్మెందు సానం-
దానన్, ధ్యానమ్ము లెందుఁ – దల్లిన్ గొల్వన్
గానమ్ము లెందు గంగా
స్నానాహ్వానమ్ము లయ్యె – స్వామిన్ గొల్వన్

భాస – భ/భ/స UII UII IIU సార్థకనామ గణాక్షర వృత్తము
(ప్రియతిలకా)
9 బృహతి 247

భాసము లెల్లెడ మెఱయన్
హాసము లెల్లెడఁ బరవెన్
దేశమునందున దివె లా-
కాశమునందున నుడుపుల్

దివ్వెల పండుగ యిదియే
రివ్వున బాణము లెగిరెన్
బువ్వుల వానల జడిలో
నవ్వుచు రా ప్రియతిలకా

దీపకమాలా – భ/మ/జ/గ UII UU – UI UIU
10 పంక్తి 327

దివ్వెలు వెల్గెన్ – దిక్కుదిక్కులన్
రవ్వలవోలెన్ – రమ్య తారకల్
నవ్వుల మింటన్ – నాట్యమాడె నేఁ-
డివ్వసుధన్ శ్రీ -లిచ్చు దైవముల్

చూపుల కింపై – సుందరమ్ముగా
దీపకమాలల్ – దృష్టమయ్యెగా
రేపది దీపా-లీ దినమ్ము, నా
యీ పురి యౌ దే-వేంద్రలోకమై

మౌక్తికమాలా – భ/త/న/గగ UII UU – IIII UU
(అనుకూలా, ప్రత్యవబోధా, శ్రీ)
11 త్రిష్టుప్పు 487

నవ్వుల పువ్వుల్ – నగరములోనన్
దివ్వెల వెల్గుల్ – దెరువులలోనన్
మువ్వల మ్రోఁతల్ – ముదితలు చేరన్
గెవ్వున కేకల్ – గెరలుచునుండెన్

అంతము లేదీ – యనుపమ సృష్టిన్
వింతగఁ దారల్ – వెలుఁగుల పూవుల్
పుంతల ప్రోవుల్ – ముదముల త్రోవల్
గాంతుల నిచ్చెన్ – గగనమునందున్

కాంతి – త/జ/జ/లగ
(మోటక, మోటనక, గీతాలంబన, కలితాంత, కాంత)
11 త్రిష్టుప్పు 877

UUIIU – I IU I IUవిఱుపుతో
ఈ చీఁకటిలో – హృదయ మ్మలరన్
ఈ చీఁకటిలో – నెడఁదల్ వెలుగన్
ఈ చీఁకటిలో – ఋతముల్ విరియన్
ఈ చీఁకటిలో – నిలయే మురియన్

UUI I UI I – UI IUవిఱుపుతో
వెల్గించెద దివ్వెల – వెల్లి వలెన్
గల్గించెద గాంతులఁ – గన్నులకున్
దెల్గించెద మోదముఁ – దెల్లముగాఁ
దొడ్గించెద నందముఁ – ద్రుళ్ళుచు నేన్

మణిమాలా – త/య/త/య UU IIUU – UU IIUU
(అబ్జవిచిత్రా, పుష్పవిచిత్రా)
12 జగతి 781

సొంపుల్ బ్రకటించెన్ – జూడన్ మణిమాలల్
గంపించుచు నాడెన్ – గాంతుల్ మిసి మీఱన్
గెంపుల్ మెఱయంగన్ – గేళిన్ జెలరేగెన్
రంపిల్లెడు గీతుల్ – రమ్యమ్ముగ నేఁడే

పాపాలకు ఱేనిన్ – భామామణి చంపెన్
కాపాడును గాదా – కంజాక్షుఁడు భూమిన్
దీపావళి నేఁడే – దీపాలకు వీడే
దీపమ్ముల కాంతిన్ – దేశమ్మగు శాంతిన్

ప్రభా – న/న/ర/ర III III – UIU UIU
(గౌరీ, చంచలాక్షీ, ప్రముదితవదనా, మందాకినీ)
12 జగతి 1216

విరులు విరిసె – వెల్గులై రంగులై
సిరుల పడతి – చిందెఁగా నవ్వులన్
చిఱుత లలరి – చిందులన్ వేయఁగా
మురిసెఁ బ్రభల – భూమి దీపావళిన్

నభము వెలుఁగు – నవ్వులన్ బువ్వులన్
శుభము గలుగు – సుందరమ్మై సదా
విభుని నగవు – ప్రేమతో నిండఁగాఁ
బ్రభలు గురియు – రమ్యమై రంగులన్

బభ్రులక్ష్మీ – ర/ర/త/త/గగ UIU UIU – UUI UUI UU
14 శక్వరి 2323

ఊఁవఁగా మానస – మ్మో బభ్రులక్ష్మీ శుభమ్మై
జీవనోద్ధారమై – శ్రీరూపమై పావనమ్మై
కావఁగా మమ్ములన్ – కారుణ్యరూపా ప్రశాంతిన్
దేవి రా యింటికిన్ – దీపావళిన్ దివ్య కాంతిన్

అందముల్ చిందఁగా – నానంద దీపమ్ము లెందున్
విందుతో నింటిలో – బ్రేమమ్ము మోదమ్ము గూడెన్
సందడుల్ శబ్దముల్ – సాయంత్రమందున్ వినంగా
మందహాసమ్ములే – మాయింట మ్రోఁగెన్ రమించన్

*నిగ్గు – న/న/న/మ/మ, యతి (1, 7) III III III – UU UU UU సార్థకనామ గణాక్షర వృత్తము
15 అతిశక్వరి 512

మిలమిలమని మెరిసె – మింటన్ బారుల్ దారల్
తళతళమని వెలిఁగె – తారాజువ్వల్ నేలన్
కిలకిలమని నగిరి – కేళిన్ బాలల్ లీలన్
కలకలమునఁ గదలె – కాంతుల్ నిగ్గుల్ మ్రోఁతల్

చెలువములకు నిరవు – చిందుల్ గీతుల్ కేళుల్
గలగలమని పరవె – గంతుల్ మాటల్ నవ్వుల్
వలయములగు వెలుఁగు – భ్రాంతిన్ నింపెన్ రాత్రిన్
లలనల తెలి నగవు – లాస్యానంద మ్మయ్యెన్

దీపక – భ/త/న/త/య UII UU IIII – UU IIU U
15 అతిశక్వరి 6631

దీపకమాలల్ మెరిసెను – దివ్యమ్ముగ భూమిన్
చూపుల విందయ్యెను గద – చొక్కిల్లెను గన్నుల్
గోపురమయ్యెన్ దివియల – గుత్తుల్ వెలుగంగా
తీపిగ దీపావళి యరు-దెంచెన్ బఱగంగా

చక్కని వెల్గుల్ నభమున – చంద్రుం డిఁక రాఁడే
దిక్కులఁ గప్పెన్ దిమిరము – దీపమ్ముల దండల్
రక్కసుఁ జంపెన్ నెలఁతయు – రాసాధిపుతోడన్
దక్కెను శాంతుల్ సుఖములు – ధాత్రేయికి నేఁడే

భామ – భ/మ/స/స/స UII UU UII – UII UII U
15 అతిశక్వరి 14023

భామయు చూడన్ జప్పున – పక్కున నవ్వును దాఁ
బ్రేమయు డెందమ్మందున – వేగమె పొంగు లిడన్
స్వామియు చల్లన్ గొప్పగ – చల్లని వీక్షణముల్
భూమికి భామాకృష్ణులు – మోదము నిత్తురుగా

భామలు గూడన్ గానము – పారె విలాసములన్
ప్రేమయు పొంగెన్ నిండుగ – వింతగు లాసములన్
కామము నిండెన్ మెండుగఁ – గన్నుల పండుగగా
నేమని చెప్పంగానగు – నీహృది దీపములే

*భాతి – భ/భ/త/త/త, యతి (1, 7) UII UII – UUI UUI UUI సార్థకనామ గణాక్షర వృత్తము
15 అతిశక్వరి 18743

రంగులె యెల్లెడ – రాజిల్లు రత్నాలొ వజ్రాలొ
పొంగెను ధారుణి – మోదాల నాదాల నందాల
బంగరు శోభల – భాసిల్లి నర్తించె శ్రీదేవి
నింగియు నేలయు – నిండంగ నా భాతితో నేఁడు

ధూమము నిండెను – దూరమ్ముఁ గానంగ రాదయ్యె
శ్యామల రాత్రిని – సందీప్తమై సేసె దీపాలు
మోముల నిండెను – భోగమ్ముతో నందమై భాతి
సోముఁడు లేదల – సొంపైన దీపావళిన్ నేఁడు

హరిణీ – న/స/మ/ర/స/లగ IIIIIU – UUUU – IUI IUIU
(వృషభచరిత, వృషభలలిత)
17 అత్యష్టి 46112

హరిణిఁ గొలువన్ – హర్షమ్మాయెన్ – హరించును పాపముల్
సిరుల నొసఁగన్ – శ్రీదేవీ సు-స్థిరమ్ముగ నుండ రా
హరిహృదయమౌ – హారిద్రాంగీ – యనంతసుఖప్రదా
కరుణ గురియన్ – గంజాతా నీ – కరమ్ముల గావుమా

సరసహృదయుల్ – స్వారస్యమ్మై – స్వరమ్ములఁ బాడఁగాఁ
గురియు ముదముల్ – గూర్మిన్ జిందన్ – గుడమ్మనఁ దియ్యఁగా
నరకవధయున్ – నారీగాథన్ – నవమ్ముగఁ దల్వఁగా
మురియు మనముల్ – మోదాంభోధిన్ – బునర్ణవమై సదా

కలాపదీపక – ర/జ/ర/జ/ర/జ/గ
19 అతిధృతి 174763

UI UI UI UI UI – UI UI UI UI U విఱుపుతో
పండు గాయె నేఁడు వేడ్కతోడఁ – బట్టుచీర లెందు జూడఁగా
నిండు గాయె నేఁడు కన్నుదోయి – నేలపైని రంగవల్లులన్
వెండివోలె తళ్కు లీనె నభ్ర – వీథిలోన తారకామణుల్
దండిగా కలాపదీపకమ్ము – ధారుణిన్ వెలింగె శోభతో

UI UI UI – UI UI UI – UI UI UI U విఱుపుతో
పెళ్లియయ్యె నాఁడు – పిల్ల వచ్చె నేఁడు – ప్రీతి యింట నిండఁగా
నల్లునిన్ గనంగ – నత్త మామలందు – హర్షధార నిండఁగా
మెల్లమెల్లఁగాను – మేలమాడి రెల్ల – మేఱలేని నవ్వుతోఁ
జల్లనయ్యె సంధ్య – చంద్రహీన రాత్రి – సవ్వడుల్ వెలుంగుతో

దీపికాశిఖ – భ/న/య/న/న/ర/లగ UI IIIII UUI – III IIUI UIU
20 కృతి 360063

కాల గగనమున నందాల – కలలవలె దీపికాశిఖల్
చాల సొగసులను జూపంగ – సరసతరమౌ మయూఖముల్
నేల సొబగులకుఁ దావయ్యె – నెనరు లగు నాద చాపముల్
మాల లన వెలిఁగె దీపాలు – మమత లగు మోద రూపముల్

అందముగ వెలుఁగు నిండంగ – నమరపురి డిగ్గివచ్చెనో
బృందముగ దివెలు భాసిల్ల – వెలుఁగు విరి మాలలయ్యెనో
వందలుగ పరిక లుండంగ – భవనములు చిత్రమయ్యెనో
చిందులిడ చిఱుత లెందెందుఁ – జెలఁగెఁ బలు దీపికాశిఖల్

దీపార్చి – మ/స/జ/స/జ/స/జ/గ, యతి (1, 12)
22 ఆకృతి 1431385

UUU IIUI UIII – UIUI IIUI UIU విఱుపుతో
పాపమ్ముల్ తొలగంగ స్నానమును – బ్రాలుమాలకను జేయు నాఁడుగా
శ్రీపాదమ్ముల గొల్వఁ బుష్పముల – సేకరించు తరుణమ్ము గూడెఁగా
దీపమ్ముల్ వెలిగించి శ్రేణులుగఁ – దీర్చి దిద్దు శుభవేళ నేఁడెగా
దీపార్చిన్ గన రండి రంజిలుచు – దివ్య దీప్తి ధరపైన నాడెఁగా

UUU IIUI UIII UI – UI IIUI UIU విఱుపుతో
దీపమ్ముల్ వెలుగంగ మేదిని నమాస – దేహములు పుల్కరించుఁగా
దీపార్చిన్ దిమిరమ్ము మాయమవఁ గాంతి – దిక్కులను నిండుఁగా సదా
యీపర్వమ్మున సత్యమే జయమునొందు – హృద్యముగ విచ్చు డెందముల్
శాపగ్రస్తులు శాంతితోడ నమృతత్వ – సాధనము నందవచ్చునో

*జ్యోతి – బేసి పాదాలు – ఇం/ఇం/ఇం, సరి పాదాలు – ఇం/ఇం/సూ

రంగులన్ జిమ్మె నా జ్యోతులే
రంగులన్ జిమ్మె నీ నిగ్గు
పొంగె నీ మనములన్ బ్రీతులే
నింగిలో భేదిల్లు ముగ్గు

క్రొత్తగా నల్లుండు వచ్చెఁ దా
నత్తవారింటికి నేఁడు
చిత్తమందునఁ గూఁతురికి హాయి
ముత్తెముల్ నవ్వులన్ వీడు

దీప – పది మాత్రలు, చివర న/లగ, అంత్యప్రాస

ఈ పృథు దినము నందు
మాపై సుధలు చిందు
దీపము వెలిఁగెఁ జూడు
పాపము తొలగు నేడు

లలిత లలితము రాత్రి
వెలుఁగు నలరిన ధాత్రి
కలలు నిజమగు నేఁడు
మెలగు సిరులను వీడు

1 thought on “దీపావళి పద్యములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *