March 4, 2024

కథ గురించిన కథ చెబుతా – ఏడు తరాలు

రచన: ఓరుగంటి శ్రీలక్ష్మి నరసింహ శర్మ.

నాకు ఇప్పటికి బాగా గుర్తు. నన్ను చిన్నప్పుడు మా హీరో తన హీరో సైకిల్ పైన కూర్చోపెట్టుకుని ఆ రోజ నన్ను మొదటిసారి మా ఊరిలో ఉన్న ఆ లైబ్రరీకి తీసుకునివెళ్ళడం. ముప్పై రెండు సంవత్సరాల క్రితం నాకు ఆ లైబ్రరీలో తొలి నేస్తంగా మారింది ఈనాడు ఆదివారంలో వచ్చే “ఫాంటం” కధలు.
అలా మొదలైన పుస్తకాలతో నా అనుబంధం ఆ లైబ్రరీలో ఉన్న నా వయస్సుకి తగ్గ పుస్తకాలన్నింటిని చదివేసినా తగ్గలేదు. తర్వాత కాకినాడకు ఆనుకుని ఉన్న ఇంద్రపాలెంలో నేను చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్ దగ్గరే ఉన్న లైబ్రరీ నా ఆకలిని కొంతవరకు తీర్చింది.
బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలజ్యోతి చివరగా చందమామ అక్కడకు రావటం పాపం వెంటనే నమిలేసేవాడిని. రోజు రోజుకి వయసుతోపాటు పెరుగుతున్న నా ఆకలిని తీర్చటం నెలకోసారివచ్చే వాటివల్ల కాలేదు. నెమ్మదిగా వారానికోసారి పలకరించే “స్వాతి” వంటి వీక్లీలతో పాటు రోజు వచ్చే దినపత్రికల వైపుగా వేశాను అడుగులు.
అసలే నాకు ఆకలి ఎక్కువేమో దాంతో ఆ లైబ్రరీ నా ఆకలికి సరిపోవటంలేదని మా కాకినాడలోని గాంధీ పార్క్లో, అలాగే గాంధీనగర్లోనే వెంకటేశ్వర స్వామి గుడికి రెండు వీధులివతల ఉన్న లైబ్రరీలనీ వీలున్నప్పుడల్లా కాదు కాదు వీలుచేసుకుని తప్పకుండా పలకరించి నా ఆకలిని తగ్గించుకునే యత్నం చేసేవాడిని.
అలా ఏది పడితే అది చదవటం అలవాటు ఐన నాకు, నెమ్మదిగా అప్పటికే పదిమందిచేత మంచివి అనిపించుకున్నవి… అలాగే కానివి కూడా చదవటం నేర్చుకున్నాను. అప్పటికి నాకంటూ ఏఇజం లేకపోవటంతో అన్ని ఇజాలను పలకరించేవాడిని.
రోజులన్నీ ఒకేలా ఉండవు కదా…
అందుకేనేమో రామక్రిష్ణ పరమహంస గురించి చదివిన తర్వాత సన్యాసిగా మారిపోవాలి అనుకున్న నేను…
“అమ్మ” చదివిన తర్వాత కమ్యూనిష్ట్ గా మారలేకపోయాను.
ఐనా పుస్తకాలు చదివితే ఎవ్వరైనా మారిపోతారా అదంతా ఒక వెర్రి భావనే కానీ, అని నేను అనుకుంటున్న కాలంలో జరిగిందా సంఘటన.
ఓరోజు తిరుపతి-మహతి ఆడిటోరోయింలో జరుగుతున్న పుస్తకాల సంతలో అన్నింటిని కళ్ళతోనే పరీక్షిస్తూ వెళ్తుంటే నాకు కనబడిందో పుస్తకం
అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో నిషేదించి, దాన్ని వ్రాసిన రచయిత మీద ఫత్వా కూడా జారిచేయించేలా చేసిన పుస్తకం అదే “లజ్జ”.
వెంటనే ఆ పుస్తకాన్ని కొని వెళ్తున్న నన్ను ఆకర్షించింది ఇంకొకటి. ఎందుకో తెలియదు కాని గులాబీ రంగంటే ఎక్కువుగా ఇష్టపడని నేను ఆ రోజు ఆ పుస్తకాన్ని కూడా కొని ఓ శనివారం సాయంత్రాన్ని లజ్జ పుస్తకానికి అంకితం చేసేశాను. పుస్తకం చదవటం మొదలు నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. నాలో విరుద్ధమైన భావనలు నా మస్తిష్కంలో తమ ప్రభావాణ్ణి చూపిస్తుండగా చిన్నప్పుడు నేను చదువుకున్న భారతీయులందరు నా సహోదరులు అనేది మర్చిపోయి మగతుగా మతం మత్తులోకి జారిపోయాను.
లజ్జ చదివిన తర్వాత ఆ ఆరు గంటలు నన్ను నేను కేవలం ఒక హిందువుని మాత్రమే అనుకుంటూ ఉన్నవేళ ముందురోజు కొన్న ఆ గులాబీ రంగు పుస్తకం మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నట్లు అనిపించడంతో చేతిలోకి తీసుకున్నాను.
ఆ ఆదివారం నా జీవితంలో ఓ పెనుమార్పు తీసుకొస్తుందని, వ్యక్తిగా నా ఆలోచనలను మొత్తంగా మార్చేస్తుందని ఆరోజు ఉదయం లేచినప్పుడు కాని ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు కాని నాకు తెలియదు.
నాకు తెలియని, నేనెప్పుడు వినని ఆఫ్రికాలో గాంబియా అనే ఓ మారుమూల దేశంలో…
కుంటా కింటే అనే నా మిత్రుని స్వచ్చమైన స్వేఛ్చపు బాల్యంతో మొదలయ్యి, కౌమారానికి వచ్చేసరికి బానిసగా బంధీ అయ్యి, తన యవ్వన, వార్ధక్య, మలి జీవితాలను కూడా బానిసత్వంలోనే గడిపి… ఏనాటికైనా నా అన్నవాళ్ళు ఎవ్వరైనా తప్పకుండా ఈ బానిస జీవితాల నుంచి విముక్తులు అవురాతనే ఆశని వదులుకోకుండా తన రక్తం ఐన లిటిల్ కిజ్జీతో తమ మూలాలను తెలిపే కధను చెప్పినప్పటినుంచి….
బానిసగా పుట్టి, బానిసగా పెరిగి, బానిసగా బ్రతికి చివరకు స్వేచ్ఛ అనే పదం కూడా తెలియకుండానే… బానిసగానే చనిపోయిన లిటిల్ కిజ్జీ నుంచి…
ఆ కధ మళ్ళీ తన కడుపునే బానిసగా పుట్టినా, చివరకు స్వేఛ్చా వాయువులు పీల్చిన కోళ్ళ జార్జ్…
అక్కడ నుంచి చివరకు ఇదిగో ఈపుస్తక రచయిత ఐన ఆ అలెక్స్ హేలీ వరకు చేరేసరికి 7తరాలు పట్టింది.
ఏదైనా సరే మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదు మనకు.
అలాగే ప్రకృతి ఆకుపచ్చని దుప్పటి కప్పుకుందా అన్నట్లు ఉండే ఆ ఆఫ్రికా ఖండంలోని గాంబియా అనే దేశంలో జుపూర్ అనే ప్రాంతంలో స్వేచ్ఛకు ప్రతీకలా ఉండే కుంటాకింటే… తమ పెద్దవాళ్ళ సలహాను వినని కారణంతో అప్పటివరకు తన దగ్గర ఉన్న స్వేచ్చను కోల్పోయి తన కౌమార వయసు నుండి మిగిలిన జీవితం అంతా బానిసగానే బ్రతకవలసి రావడం నిజంగానే ఓ దుఃఖం.
ఏదైనా సరే మనకు తెలియనప్పుడు దాని గురించి మనం ఆలోచించం.
ఈ భూమ్మీదకు వచ్చి తొలి ఊపిరి పీల్చినప్పటి నుంచి, తన చివరి శ్వాస వరకు బానిసగానే బ్రతికిన లిటిల్ కిజ్జి. తండ్రి మాటల్లో కథగా మారిన తమ చరిత్రను తెలుసుకుని దాన్ని తన తర్వాతి తరాలకి అందేలా చేయాలనే కోరిక తప్ప స్వేచ్ఛ గురించిన ఆలోచన కూడా తెలియకుండానే ఈ లోకం నుండి వెళ్ళిపోవడం విషాదమే.
ఆలోచన అనేది ఉంటే ఆచరణ కనబడుతుంది.
ఓ ఆఫ్రికన్ తల్లికి, యజమానిగా పిలవబడే ఓ అమెరికన్ కు పుట్టినా… తన మూలాలు అనేవి తన రంగు తెలియజేస్తూ ఉన్నా… బానిసగా పుట్టి, బానిసగా పెరిగినా… ఇష్టంతో నేర్చుకున్న కళతో బానిసత్వం నుండి విముక్తుడైన జార్జ్… కాదు కాదు కోళ్ళ జార్జ్ జీవితం నిజంగానే ఓ గొప్ప పాఠం.
ఎటువంటి పుస్తకానైనా అవలీలగా చదివేసే నేను… ఆ రోజు ఆ పుస్తకంలోని చివరి పేజీలను చదవటానికి చేస్తున్న ప్రయత్నం నా ప్రమేయం లేకుండానే ధారపాతంగా కారిపోతున్న నా కన్నీళ్ళ వల్ల కావటంలేదు.
కాని అప్రయత్నంగానే నాకు తెలియని, నేను ఎప్పుడూ చూడని ఆ ఆఫ్రికా దేశానికి నా మనస్సు వెళ్ళిపోయి మానవ నాగరికతలో తొలి ఆచారాలను గమనించేసరికి తెలిసింది నేను ఎవరినో?
నేను గోదావరి ప్రాంతాంవాడినో…
ఆంధ్రావాడినో…
హిందువునో…
భారతీయుడునో…
ఇవేమీ కాదని నేను మనిషినని… నేను మానవుడనని.
మతం కంటే… మానవత్వమే మిన్నయని.
నువ్వు క్రిష్టియన్వి అయితే బైబిల్ చదువు.
ముస్లింవి అయితే ఖురాన్ చదువు.
హిందువువి అయితే భవద్గీత చదువు.
పైవన్నీ చదవకపోయినా పర్వాలేదు ఈ జన్మకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ నువ్వు మనిషిగా పుడితే, మనిషిగా మారాలంటే మాత్రం….
“స్వేఛ్చ నుంచి బానిసత్వంలోకి, బానిసత్వం నుంచి స్వేఛ్చకు” మానవుడు చేసిన ప్రయాణానికి గుర్తుగా అలెక్స్ హేలీ గారిచే “రూట్స్”గా రచింపబడి “సహవాసి”గారి కృషితో తెలుగులోకి అనువదించబడిన “ఏడు తరాలు” చదువు.

1 thought on “కథ గురించిన కథ చెబుతా – ఏడు తరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *