March 28, 2024

కధ కానిదీ… విలువైనదీ…

రచన: గిరిజ పీసపాటి

“మీరెన్నైనా చెప్పండి. అమ్మాయికి ఇంత చిన్న వయసులో పెళ్ళి చెయ్యడం నాకు అస్సలు ఇష్టం లేదు” అంది నాగమణి, భర్త రామ్మూర్తి కంచంలో అన్నం మారు వడ్డిస్తూ…
“ఇప్పుడు ఈ సంబంధాన్ని కాలదన్నుకుంటే మళ్ళీ ఇంత మంచి సంబంధం మన జన్మలో తేలేము. అబ్బాయి అందంగా ఉంటాడు, ఆస్తి ఉంది, ఏ వ్యసనాలు లేనివాడు, పైగా ఏరి కోరి మనమ్మాయే కావాలనీ, కానీ కట్నం కూడా ఆశించకుండా చేసుకుంటానంటున్నాడు” అంటున్న భర్త మాటలకు అడ్డొస్తూ…
“నిజమే కానీ… అమ్మాయి ఇంకా పదో తరగతి చదువుతోంది. నేను పదమూడేళ్ళకే మిమ్మల్ని చేసుకుని పదహారేళ్ళకే ఇద్దరు పిల్లల తల్లినయ్యాను. కాలేజీ కెళ్ళి చదివి మంచి ఉద్యోగం చెయ్యాలనుకున్న నా ఆశ తీరనే లేదు. అమ్మాయి బాగా చదువుకుంటోంది. దాని చదువు పూర్తయి మంచి ఉద్యోగం వచ్చాక అప్పుడు పెళ్ళి చేద్దామండీ” అంది నాగమణి బ్రతిమాలుతున్న ధోరణిలో.
“నన్ను నువ్వు చిన్న వయసులో పెళ్ళి చేసుకున్న మాట నిజమే అయినా నువ్వు చదువుతానన్న చదువు చెప్పించాను కదా! నావల్ల నీకు వచ్చిన లోటేంటో చెప్పు” అని ఎదురు ప్రశ్న వేసిన భర్తకు ‘ఆర్ధిక స్వాతంత్ర్యం’ అని చెప్దామనుకుని వస్తున్న మాటను గొంతులోనే అణిచిపెట్టి గాఢంగా నిట్టూర్చింది నాగమణి.
వంటింట్లో తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణను ముందు గదిలో చదువుకుంటూ విన్న హిమజ ఇక చదువు మీద దృష్టి పెట్టలేక ఆలోచనల్లోకి జారిపోయింది.

*************

నాగమణి, రామ్మూర్తి దంపతులకు ఇద్దరు సంతానం. మొదట కూతురు హిమజ పదో తరగతి, తరువాత కొడుకు కృష్ణ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రామ్మూర్తి ఒక గవర్నమెంట్ కాలేజ్‌లో సీనియర్ గుమస్తాగా పని చేస్తున్నాడు.
ఆరునెలల క్రితం ఒక దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళికి కుటుంబ సమేతంగా హాజరయ్యాడు రామ్మూర్తి. అక్కడ రామ్మూర్తి కూతురు హిమజని పెళ్ళి కూతురి పెదనాన్న కొడుకు అయిన మధు చూసి ఇష్టపడి రామ్మూర్తి బావమరిది ప్రసాదరావుతో పెద్దల ద్వారా కబురు చెయ్యడం, ప్రసాదరావు వారి కుటుంబ విషయాలు, అబ్బాయి గుణగణాలు విచారించి హిమజకు తగిన వరుడిగా భావించి, రామ్మూర్తి దంపతులకు ఈ సంబంధం వివరాలు చెప్పడం, రామ్మూర్తి అంగీకరించి పెళ్ళి చూపులకు తగిన ముహూర్తం చూసుకుని వాళ్ళకు కబురు చెస్తామని చెప్పడం చకచకా జరిగిపోయాయి. మధుకి, హిమజకి వయసులో ఎనిమిదేళ్ళ వ్యత్యాసం ఉన్నా అదో పెద్ద అడ్డంకిగా కనిపించలేదు ఇరువైపుల వారికీ.
పెళ్ళి చూపుల తతంగం కేవలం నామ మాత్రమేననీ, అందరికీ పిల్ల నచ్చిందనీ హిమజ పదవ తరగతి పరీక్షలు అయాక పెళ్ళి చూపులు, నిశ్చయ తాంబూలాలు ఒకసారే జరిపిద్దామని అబ్బాయి కోరిక మేరకు వాళ్ళు తిరిగి కబురు చెయ్యడంతో ఆగిపోయాడు రామ్మూర్తి.
హిమజ చాలా అందంగా ఉంటుంది. బాగా చదువుతుంది. నెమ్మదిగా, వద్దికగా ఉంటుంది. బాగా బిడియస్తురాలు. కృష్ణ ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాడు. బాగా అల్లరి చేస్తాడు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు.
హిమజకు మర్నాటి నుండి పరీక్షలు ప్రారంభం కానుండడంతో మళ్ళీ తెరమీదకు వచ్చింది ఈ వ్యవహారం. ఎలాగైనా హిమజను కనీసం డిగ్రీ వరకూ అయినా చదివించి తన కాళ్ళమీద తను నిలబడ్డాకే పెళ్ళి చేద్దామని చెప్పి భర్తను ఒప్పించే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైంది నాగమణి.

************

హిమజ పదవతరగతి పరీక్షలు రాయడం, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందనీ, నిశ్చితార్థం చేసుకుందామని బావమరిది చేత అబ్బాయి తల్లిదండ్రులకు కబురు చేసాడు రామ్మూర్తి.
కానీ, అబ్బాయి తాతగారు స్వర్గస్తులవడం వలన ఏటి సూతకం అయ్యే వరకూ వీలుకాదని తిరిగి కబురు మోసుకొచ్చాడు ప్రసాదరావు.
“ఎలాగూ ఏడాది సమయం ఉంది కదా. అమ్మాయిని ఇంటర్లో జాయన్ చేద్దాం. ఇంట్లో ఉండి చేసేదేముంది” అన్న నాగమణి మాటకి ఏ కళనున్నాడో వెంటనే వప్పుకుని తను పనిచేసే కాలేజ్ లోనే హిమజను ఇంటర్లో జాయిన్ చేసాడు రామ్మూర్తి.
హిమజ ఇంటర్ ఫస్టియర్ కూడా ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణురాలవడం, మధు తండ్రి ఏటి సూతకం తీరిపోయింది కనుక నిశ్చితార్థం ముహూర్తం పెట్టించమని కబురు చేయడం జరిగిపోయింది.
ఇంటి పురోహితుడిని కలసి ముహూర్తం పెట్టించుకుని వస్తానని వెళ్ళిన భర్త కాళ్ళీడ్చుకుంటూ, నీరసంగా తిరిగి రావడంతో తాగడానికి మంచినీళ్ళు అందిస్తూ “ఏం జరిగిందండీ!? ముహూర్తం ఏరోజున పెట్టించారు?” అంటూ అడిగింది నాగమణి.
“ఇద్దరి జాతకాల ప్రకారం ఇప్పట్లో ముహూర్తం కుదరలేదు మణీ! సరిగ్గా ముహూర్తం కుదిరే సమయానికి మూఢాలు, తరువాత శూన్య మాసం మొదలైపోతోంది” అంటూ సమాధానం ఇచ్చాడు రామ్మూర్తి. ఇదే విషయాన్ని అబ్బాయి తండ్రికి కబురు చేయగా వారి ఇంటి పురోహితుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడని చెప్పారు.
మళ్ళీ కొన్నాళ్ళు పెళ్ళి ఊసు లేకపోవడంతో ఇంటర్ సెకెండ్ ఇయర్లో జాయిన్ అయి చదువుకోసాగింది హిమజ.
మూఢాలు, శూన్యమాసం గడిచాక పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం చూసి అబ్బాయి తండ్రికి కబురు చేసాడు రామ్మూర్తి.
వీళ్ళు ఆ ఏర్పాట్లలో మునిగి ఉండగా ఒకరోజు అబ్బాయి పెళ్ళి శుభలేఖతో పాటు ఒక పెద్ద ఉత్తరాన్ని జత చేసి పంపాడు మధు తండ్రి. ఉత్తరం చదివి, పెళ్ళి శుభలేఖ చూసి మ్రాన్పడిపోయి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయిన రామ్మూర్తిని చూసి “ఏమయిందండీ!?” అంటూ ఆదోళనగా ప్రశ్నించిన నాగమణి చేతిలో ఉత్తరంతో సహా శుభలేఖను పెట్టి, భార్య ముఖం చూడలేనట్లుగా గబగబా చెప్పులు తొడుక్కొని బయటకు వెళ్ళిపోయాడు రామ్మూర్తి.
ఆత్రంగా ఉత్తరం విప్పి చదివి, దానితో జతపరిచిన శుభలేఖను కూడా చూసి మనసులో ఏమూలో కాస్త బాధగా అనిపించినా, ఎక్కువగా సంతోషముగానే అనిపించి దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది నాగమణి.
అప్పుడే కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన హిమజతో “నీకా పెళ్ళి సంబంధం తప్పిపోయింది హిమజా! ఇక ఏ టెన్షన్ లేకుండా నీ చదువును హాయిగా కొనసాగించు” అంటూ చెప్పింది నాగమణి.
“అవునా! ఎలా!? అసలు ఏం జరిగిందమ్మా?” అంటూ అడిగిన హిమజతో “అబ్బాయికి ఒక వితంతువు అయిన చెల్లెలు ఉంది కదా! ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఒక మంచి సంబంధం వచ్చిందట. కానీ, వాళ్ళు తమ అమ్మాయిని మధు చేసుకునేటట్లయితేనే ఈ అమ్మాయిని తమ కోడలుగా చేసుకుంటామని షరతు పెట్టారట. దీనినే కుండ మార్పిడి పధ్ధతి అంటారు. అదే విషయం వివరిస్తూ, క్షమాపణలు కోరుతూ ఉత్తరం, శుభలేఖ పంపారు మధు నాన్నగారు” అంటూ వివరించింది నాగమణి.
హిమజ కళ్ళముందు లీలగా ఆ అబ్బాయి ముఖం కదలాడింది. పెద్ద పెద్ద కళ్ళు, మంచి పొడుగు, పొడుగుకి తగ్గ లావుతో, పచ్చటి మేనిఛాయతో అందంగా ఉంటాడు. కానీ, హిమజకి కూడా అప్పుడే పెళ్ళి ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి తన ధ్యాస ఒక్కటే. చదువు, చదువు, చదువు అంతే. చదువు తప్ప మరో ధ్యాస లేని హిమజ కూడా ఈ వార్తకి సంతోషించింది.
మధు, అతని చెల్లెలు ఇద్దరి పెళ్ళిళ్ళూ నిర్విఘ్నంగా జరిగిపోయాయని, తమ కుటుంబం తరపున తాను ఆ వివాహాలకు హాజరయ్యానని చెప్పాడు రామ్మూర్తి బావమరిది ప్రసాదరావు.

************

హిమజ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో జాయిన్ అయిన వారం రోజులకి వారి ఇంటి ముందు ఒక లారీ ఆగడం, కొందరు కూలీలు అందులోంచి సామాన్లు దించడం చూసిన నాగమణి “పక్క పోర్షన్లోకి ఎవరో అద్దెకు దిగుతున్నట్లున్నారు. ఎలాటి వాళ్ళో ఏమిటో” అంటూ బయటకు వెళ్ళింది.
పక్క ఇంటి గుమ్మం ముందు నిలబడిన ఒకావిడ నాగమణిని చూసి పలకరింపుగా నవ్వి “మేము ఈ వాటాలోకి అద్దెకు దిగుతున్నామండీ! కొంచెం ఏమీ అనుకోకుండా ఒక బిందెడు మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? రేపు కుళాయి వచ్చే వరకూ మాకు కాస్త తాగడానికి కావాలని అడుగుతున్నాను” అంది మొహమాటంగా.
“అయ్యో! ఇందులో అనుకోవడానికి ఏముందండీ!? నేను కూడా ఆ విషయం అడుగుదామనే బయటకు వచ్చాను” అంది నాగమణి లౌక్యంగా. లోపలి నుండి ఈ సంభాషణ విన్న హిమజ, తల్లి మంచినీళ్ళు ఇవ్వడానికి లోపలికి రాగానే తల్లిని చూసి నవ్వాపుకోలేక ఒకటే నవ్వసాగింది.
“హుష్. ఏమిటా నవ్వు? ఆవిడ వింటే బాగోదు” అని హిమజను మందలిస్తూనే నీళ్ళ బిందె తీసుకుని బయటకు వెళ్ళి ఆవిడకు అందిస్తూ… “నా పేరు నాగమణి. మీ పేరు తెలుసుకోవచ్చా వదిన గారూ!” అంటూ వరుస కలిపింది.
“నా పేరు కృష్ణవేణి. మీ అన్నయ్యగారు ఇఎస్ఐ లో పని చేస్తారు. మాకు ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. అమ్మాయికి పెళ్ళి చేసాము. గుంటూరులో ఉంటుంది. పేరు సులోచన. అబ్బాయి డిగ్రీకి వచ్చాడు. పేరు శ్రీకర్. మేము విజయవాడ నుండి ట్రాన్సఫర్ మీద ఈ ఊరు వచ్చాము. మావారికి తెలిసిన ఆయన ద్వారా ఈ ఇల్లు కుదిరింది. మాకు ఈ ఊరు, పరిసరాలు కొత్త” అంటూ తమ వివరాలన్నీ ఏకరువు పెట్టింది ఆవిడ.
“మీకే సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి. మొహమాట పడకండి. ఈరోజుకి మీకు భోజనం నేను వండేస్తాను. మీరు హైరానా పడకండి” అన్న నాగమణితో “మీకెందుకు వదినగారూ శ్రమ. మేము హోటల్లో తినేస్తాము” అంది కృష్ణవేణి.
“ఇందులో శ్రమ ఏముంది వదినగారూ… మీకు ప్రత్యేకంగా వండాలా, పెట్టాలా? మాకు ఎలాగూ చేస్తాను. మీకోసం మరో గుప్పెడు బియ్యం ఎక్కువ వేస్తాను. అంతేగా! ఈలోపు మీరు సామాను సర్దుకోండి” అని చెప్పి లోపలికి వచ్చి వంటపనిలో పడింది నాగమణి.
ఈలోగా రామ్మూర్తి కూడా వాళ్ళ సామాను దింపించే పనిలో కృష్ణవేణి భర్త వెంకట్రావుకు సహాయం చెయ్యసాగాడు.

**********

వెంకట్రావు అభ్యర్ధన మేరకు వాళ్ళబ్బాయి శ్రీకర్ కి తమ కాలేజ్ లోనే తన పలుకుబడిని ఉపయోగించి సీటు వచ్చేలా చేసాడు రామ్మూర్తి. శ్రీకర్, హిమజల గ్రూప్ ఒకటే కావడంతో ఇద్దరూ ఒకే క్లాస్‌లో చదవసాగారు. తను మిస్ అయిన క్లాసుల నోట్స్ హిమజను అడిగి రాసుకున్నాడు శ్రీకర్. హిమజ తమ్ముడు కృష్ణకి, శ్రీకర్ కి మంచి స్నేహం కుదిరి ఇద్దరూ కలిసి క్రికెట్ మాచ్ లు ఆడడానికి వెళ్ళేవారు.
ఈ విధంగా రెండు కుటుంబాల మధ్య స్నేహం బాగా బలపడి, సినిమాలకి, పిక్నిక్ లకి కలిసి వెళ్ళేవారు. హిమజ మాత్రం సహజంగా బిడియస్తురాలు కావడంతో అవసరానికి మీచి ఎవరితోనూ మాట్లాడేది కాదు.
కాలం వేగంగా గడిచిపోయి హిమజ, శ్రీకర్ ల డిగ్రీ పూర్తవడం, కృష్ణ డిగ్రీ మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగిపోయింది.
డిగ్రీ పూర్తి చేసిన హిమజ పిజి చెయ్యడానికి యూనివర్సిటీలో జాయిన్ అవుతానని అడగితే “మన కుటుంబంలో ఈమాత్రం చదవడమే ఎక్కువ. ఇంతకన్నా నువ్వు పెద్ద చదువు చదివితే నీకన్నా ఎక్కువ చదివిన కుర్రాడిని నీకు భర్తగా నేను తేలేను. ఇక నీకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను” అంటూ రామ్మూర్తి తేల్చి చెప్పడం, నాగమణి వప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో హిమజ చదువు ఆగిపోయింది.

***********

శ్రీకర్ ఆంధ్రా యూనివర్శిటీలో పిజి చెయ్యసాగాడు.
ఒకరోజు రామ్మూర్తి, వెంకట్రావులు మాట్లాడుకుంటూ ఉండగా “మీ బంధువులలో ఎవరైనా హిమజకు తగిన సంబంధం ఉంటే చెప్పండి బావగారూ! అమ్మాయిని మూడు సంవత్సరాల నుండి మీరు చూస్తూనే ఉన్నారు. నేను ప్రత్యేకించి మీకు చెప్పడానికి ఏముంది?” అని అడిగిన రామ్మూర్తితో “అమ్మాయికేమండీ అన్నయ్య గారూ! మహాలక్ష్మిలా ఉంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు” అంది పక్కనే ఉన్న కృష్ణవేణి.
“అలాగే బావగారూ! నా చెవిన వేసారు కదా! ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మాయికి తగిన వరుడిని చూసే బాధ్యత నాదీ” అంటూ భరోసా ఇచ్చాడు వెంకట్రావు.
ఆరోజు రాత్రి భోజనాలయాక “ఏమండీ! హిమజ మీద మీ అభిప్రాయం ఏమిటి? అనడిగిన భార్య మాటకు “మంచి పిల్ల. ఏ అబ్బాయికి ఇల్లాలవుతుందో గానీ అలాటి భార్యను పొందాలంటే బంగారు పూలతో పూజ చేసి ఉండాలి” అన్నాడు వెంకట్రావు.
“ఆ అబ్బాయి మన అబ్బాయే ఎందుకు కాకూడదు” అన్న భార్య మాటకు బిత్తరపోయి “ఏమిటి కృష్ణా! నువ్వు అనేది? అబ్బాయి, అమ్మాయి ఒకే ఈడువాళ్ళు. కనీసం సంవత్సరం అయినా తేడా లేదు” అన్న వెంకట్రావుతో “నా మనసులో ఏడాది నుండి ఈ కోరిక ఉందండీ. ఇన్నాళ్ళకు సమయం వచ్చింది కనుక బయటకు చెప్పాను. ఒకే ఈడు వాళ్ళు అయినా మన అబ్బాయి అమ్మాయి కన్నా ఆరు నెలలు పెద్దవాడే కదా!?” అన్న కృష్ణవేణి మాటలకు “సరే అబ్బాయి అభిప్రాయం ఏమిటో? వాడిని కూడా ఒకమాట అడగాలి కదా” అన్న భర్తతో “శుభస్య శీఘ్రం. లేటెందుకు ఇప్పుడే అడుగుదాం” అంటూ తన గదిలో చదువుకుంటున్న కొడుకు దగ్గరకు వెళ్ళి కాసేపు ఆమాట ఈమాట చెప్పి “నాన్నా శ్రీ! మన హిమజ మీద నీ అభిప్రాయం ఏమిటి? రామ్మూర్తి అంకుల్ హిమజకి పెళ్ళి చేసేద్దామని అనుకుంటున్నారు. ఆ అమ్మాయిని మా కోడలిని చేసుకోవాలని నేను, మీ నాన్నగారు అనుకుంటున్నాం. నీకు కూడా ఇష్టం అయితే వాళ్ళ అభిప్రాయం కనుక్కోవచ్చు” అంటూ అసలు విషయం చెప్పింది కృష్ణవేణి.
అంతా విన్న శ్రీకర్ “హిమజ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. పెళ్ళంటూ చేసుకుంటే హిమజనే చేసుకోవాలని నేనెప్పుడో నిశ్చయించుకున్నాను. హిమజతో ఈ విషయం చెప్పి తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలని ఎన్నో సార్లు అనుకుని కూడా అడిగితే కాదంటుందమో అనే సంశయంతో ఆగిపోయాను. హిమజ నాకు భార్య కాకపోతే ఇక జీవితంలో పెళ్ళే చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను” అంటూ హిమజను తను ఎంతగా ప్రేమిస్తున్నాడో తల్లికి చెప్పాడు శ్రీకర్.
శ్రీకర్ నిర్ణయానికి సంతోషం, భయం కూడా కలిగాయి కృష్ణవేణికి. ఒకవేళ వాళ్ళకు శ్రీకర్ నచ్చకపోతే… ఆ ఆలోచనకే‌ భయపడిన కృష్ణవేణి భర్తకు అదే విషయం చెప్పి “ఎలాగైనా వాళ్ళను ఒప్పించాలి. రేపెలాగూ మంచిరోజు. రేపే వాళ్ళతో మాట్లాడదాం” అని చెప్పింది.

***********

మర్నాడు అనుకున్నట్లుగానే కృష్ణవేణి, వెంకట్రావు దంపతులు రామ్మూర్తిని, నాగమణిని కలిసి తమ అభిప్రాయం చెప్పడం వీళ్ళకు కూడా ఏ అభ్యంతరం లేకపోవడంతో హిమజని కూడా ఒక మాట అడగడం, హిమజ కూడా సరేననడం జరిగిపోయింది.
తన తల్లిదండ్రులు ఏ వార్తతో వస్తారా అని ఇంట్లోనే ఆదుర్దాగా ఎదురు చూస్తున్న కొడుకు నోటిలో గుప్పెడు పంచదార పోసి శుభవార్త చెప్పింది కృష్ణవేణి.
ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి హిమజతో “నువ్వు మనస్పూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? లేక ఆంటీ, అంకుల్ నిన్ను బలవంతంగా ఒప్పించారా?” అనడిగిన శ్రీకర్ తో “అదేమీ లేదు. అమ్నానాన్నలు ఏది చేసినా నా మంచి కోసమే అని నమ్ముతాను. కాకపోతే ఇంకా చదువుకోవాలని అనుకున్నాను. అది ఎలాగూ కుదరలేదు. పేపర్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ ప్రకటన పడితే దరఖాస్తు చేసాను. వారి నుండి ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది. అమ్మ సమయం చూసి నాన్నను ఒప్పిస్తానంది. ఇప్పుడు మీతో పెళ్ళి కుదిరింది కనుక మీకు అభ్యంతరం లేకపోతే…” అంటూ మధ్యలో మాట ఆపేసిన హిమజతో “ఇంత మాత్రానికేనా? తప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్ళు. నేనే దగ్గరుండి తీసుకెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉద్యోగం చేసినా నాకు ఏ అభ్యంతరం లేదు. పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను” అంటూ భరోసా ఇచ్చాడు శ్రీకర్. ఇద్దరూ కాసేపు మనసు విప్పి ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు మరొకరితో పంచుకున్నారు.
మాట ఇచ్చినట్లుగానే పెద్దవాళ్ళను ఒప్పించి హిమజను ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడం, ఆ ఉద్యోగం హిమజకు రావడం, ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగిపోయాయి.
కాబోయే అల్లుడికి, వియ్యాలవారికి అభ్యంతరం లేకపోవడంతో రామ్మూర్తి, నాగమణి కూడా చాలా సంతోషించారు.
శ్రీకర్ చదువు ఆపేసి హిమజ చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగంలో చేరాడు. ఆరు నెలలలోనే ఒక మంచి ముహూర్తంలో శ్రీకర్, హిమజల పెళ్ళి జరిగిపోయింది.
పెళ్ళయ్యాక హిమజకు బాగా చదువుకోవాలని ఉన్న కోరికను తీరుస్తూ ప్రైవేటుగా పిజి చదివించాడు శ్రీకర్. అనుకూలమైన భర్త, కన్న కూతురిలా చూసుకునే అత్తమామలు, ఇంటి పక్కనే పుట్టిల్లు ఇలా హిమజ జీవితం ఆనందంగా సాగిపోతోంది.
కాలం గిర్రున తిరిగిపోతోంది. అంతా సాఫీగానే ఉన్నా ఒక్కటే లోటు హిమజని వేధించసాగింది. పెళ్ళయి తొమ్మిదేళ్ళు అయినా సంతాన భాగ్యం ఇంకా కలగలేదు. ఇద్దరూ డాక్టర్ కి చూపించుకుని అన్ని పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరి లోనూ ఏలోపం లేదనీ… కొందరికి ఇలా జరిగి లేటుగా పిల్లలు పుడతారనీ చెప్పారు డాక్టర్లు. అత్తగారు, తల్లి ఎంత ఓదారుస్తున్నా, మనిద్దరం ఒకరికొకరం పిల్లలమే కదా!? మనకి వేరే పిల్లలెందుకు? అని భర్త మరపించే ప్రయత్నం చేస్తున్నా హిమజ సంతానం కోసం మందులు వాడుతూనే… పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చెయ్యసాగింది.

****************

“ఛీఛీ… దరిద్రగొట్టు పెళ్ళి చేసి నా గొంతు కోసారు. ఒక సుఖమా, సంతోషమా?” అంటూ గట్టిగా వినిపించిన భార్య గొంతు వింటూ రోజూ ఉన్నదే కదా! కొత్తేముంది? అనుకుంటూ భోజనం చేస్తున్నాడు అప్పుడే షాప్ క్లోజ్ చేసి మధ్యాహ్నం భోజనానికని ఇంటికి వచ్చిన మధు. “ఎన్నంటే ఏం లాభం? దున్నపోతు మీద వాన చినుకే” మధు నుండి సమాధానం రాకపోవడంతో తిరిగి అంది మధు భార్య కమల.
మధు పెళ్ళి జరిగి అప్పటికి పన్నెండు సంవత్సరాలు దాటింది. హిమజను ఇష్టపడినా చెల్లెలి జీవితం కోసం కమలను పెళ్ళి చేసుకున్న మధు మానసికంగా కమలతో జీవతాన్ని పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. హోల్సేల్ మెడికల్ షాప్ ఓపెన్ చేసి బిజినెస్ మొదలు పెట్టాడు. పెళ్ళయిన మూడేళ్ళకే ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అయాడు మధు. సంతానం కలిగే వరకూ బాగానే ఉన్న కమల రాను రానూ తనకే తెలియని అసంతృప్తితో చిన్న చిన్న విషయాలకే అరవసాగింది.
తమ ఫామిలీ డాక్టర్ని సంప్రదించిన మధుతో కొందరికి డెలివరీ అయాక ఇలా జరుగుతుందని, మానసిక వైద్య నిపుణుడిని కలవమని సలహా ఇచ్చింది ఆవిడ. అదే విషయం కమలకి చెప్తే నాకేమైనా పిచ్చా అంటూ అప్పటినుండి ఇంకా సాధించసాగింది. కమల తల్లిదండ్రులతో ఇదే విషయం చర్చించి ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి ఒప్పించమని అడిగితే వాళ్ళు కూడా “లక్షణంగా ఉన్న అమ్మాయిని నీకిచ్చి పెళ్ళి చేస్తే పిచ్చిదానిగా మార్చి, వదిలించుకుని, నీకు నచ్చిన ఆ పిల్లని రెండో పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నావేమో? అదే జరిగితే నీ అంతు చూస్తాం. నీ చెల్లెలు మా ఇంటి కోడలని మర్చిపోకు” అంటూ నానా దుర్భాషలూ ఆడి కమలని మరింత ఎగదోసారు.
పిల్లలు ప్రస్తుతం శెలవులని ఊరిలోనే ఉన్న వారి ఇంటికే వెళ్ళారు.
“డబ్బు సర్దుబాటు అయిందా?” గదిలో నుండి రివ్వున వచ్చి కోపంగా అడిగిన భార్యతో “లేదు కమలా! రెండు రోజులు ఓపిక పట్టు. రావలసిన డబ్బు వస్తుంది. ఇస్తాను” అనునయంగా చెప్పాడు మధు. రెండు రోజుల వరకూ నాకు నచ్చిన నక్లెస్ ఆ షాపులో ఉండొద్దూ… అసలే చాలా మంచి డిజైన్. ఇంకెవరి దృష్టిలోనైనా పడితే ఎగరేసుకుపోతారు” అన్న కమలతో “అయితే ఒక పని చెయ్యి. ముందు కొంత డబ్బు కట్టి నీకోసం అట్టేపెట్టమని చెప్పు. మిగితా డబ్బు తరువాత కట్టి కొనుక్కోవచ్చు” అన్నాడు మధు.
“మీపాటి తెలివి నాకు లేదనుకుంటున్నారా? నేను షాప్ వాళ్ళను అడిగాను. వాళ్ళు కుదరదన్నారు” అంది.
“నా ప్రయత్నం నేను చేసాను కమలా! ఒక్క రెండు రోజులు అంతే” అంటున్న మధు మాటలకు మధ్యలోనే అడ్డు తగులుతూ “పాడిన పాటే పాడతారేం? మీ మాట మీదేనన్నమాట!? సరే అయితే నేను మా ఇంటికి వెళ్ళి నాన్నగారిని డబ్బు అడుగుతాలెండి. మీరెప్పుడు నా ముచ్చట తీర్చారు కనుక” అంటూ చెప్పులు వేసుకుని విసురుగా వెళ్ళిపోయింది కమల.
నిశ్చేష్టుడై తింటున్న అన్నంలో చెయ్యి కడిగేసుకున్నాడు మధు. ఇప్పుడు తను అత్తవారింటికి వెళ్ళి అందర్నీ బ్రతిమాలి మళ్ళీ తనవల్ల కమలకు ఏలోటూ రాదని హామీ ఇస్తే గాని కమల రాదు, వాళ్ళు కూడా పంపరు. ఇలా జరగడం ఇది ఎన్నోసారో? అదృష్టవశాత్తు తన చెల్లెలి భర్త ఉద్యోగం వీళ్ళకి దూరంగా హైదరాబాదులో కావడంతో చెల్లెలి జీవితం సుఖంగా సాగిపోతోంది. అది చాలు తనకు.
పిల్లలు పుట్టాక ఖర్చులు పెరగడం, భార్య కూడా బాగా ఖర్చుదారి మనిషి కావడంతో బిజినెస్ కోసం పెట్టిన డబ్బు కాస్త కాస్తగా ఇంటి ఖర్చులకు వాడడం మొదలుపెట్టాడు. దాంతో బిజినెస్ దెబ్బతింది. కనపడిన చీరలు, నగలు, ఇంటి సామాను అవసరం లేకపోయినా కొటుంది కమల.
తండ్రిని కాస్త పొలం అమ్మి డబ్బు సర్దమని అడగడం, ఇప్పటికే బిజినెస్ అంటూ చాలా తీసుకున్నావు. మిగిలినది నా తదనంతరం మాత్రమే పంచుకోమని ఆయన నిష్కర్షగా చెప్పడంతో ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు మధు.
భార్యని బ్రతిమాలుకుని ఇంటికి తీసుకుని వద్దామని, వస్తామంటే పిల్లల్ని కూడా తీసుకొద్దామని అత్తవారింటికి బయలుదేరాడు మధు.

***********

ముందు వసారాలోనే వాలు కుర్చీలో కూర్చుని ఉన్న మామగారు మధుని చూసి కూడా పలకరించకుండా చేతిలో ఉన్న దినపత్రికలో తలదూర్చాడు. ఆ తిరస్కారానికి మనసు చివుక్కుమనిపించినా “బాగున్నారా మామయ్య గారూ” అంటూ నమస్కరించాడు మధు.
“ఆఁ… ఏంబాగులే నాయనా! నీలాటి అల్లుడు దొరికాక” అంటూ తిరస్కారంగా సమాధానం చెప్పిన మామగారి మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ “కమల ఏదీ! లోపల ఉందా!?” అంటూ చనువుగా లోపలికెళ్ళబోయిన మధుకి ఎదురొచ్చిన అత్తగారు “ఎందుకు నాయనా దాన్ని ఇంకా ఏడిపించడానికా? పాపం బిడ్డ ఒక్కర్తీ మండుటెండల్లో ఇంత దూరం వచ్చింది. వచ్చిన దగ్గర నుండి ఒకటే ఏడుపు. ఎందుకమ్మా అంటే సమాధానం చెప్పదు. నువ్వే ఏడిపించి ఉంటావు? లేకపోతే అది అంత బాధ పడుతుందా?” అంటూ సాగదీస్తున్న అత్తగారితో…
“నేనేమీ అనలేదండీ. డబ్బు కావాలని అడిగింది. రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తానని చెప్పాను. మా నాన్నగారిని అడిగి తెచ్చుకుంటానని వచ్చింది. అంతే జరిగింది” అన్నాడు మధు.
“నీకు మా అమ్మాయంటే మొదటి నుండి ఇష్టం లేదు. అందుకే దాన్ని ఇంత హింస పెడుతున్నావు. మీ అమ్మానాన్నలను, మధ్యవర్తలను తీసుకుని రా. వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడి కాని అమ్మాయిని, పిల్లలని పంపము” అంటూ తెగేసి చెప్పి ముఖం మీదే తలుపులు వేసేసారు వాళ్ళు.

మధు ఈ అవమానాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. అమ్మానాన్నలకు చెప్పినా చెల్లెలి కోసం రాజీ పడమని చెప్తారు తప్ప వాళ్ళు రారు. ఇక మధ్యవర్తులను తీసుకురావడం అంటే కుటుంబం పరువు వీధిలో పెట్టుకోవడమే. వీళ్ళు ఎంత చెప్పినా మాట వినేలా లేరు. కమలకి వాళ్ళ అమ్మానాన్నలు నచ్చచెప్తే వస్తుంది. అంతేకాదు వాళ్ళు చెప్తే ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటుంది.
కానీ వాళ్ళకి ఇలాటి విషయాల్లో అవగాహన లేదు. తను చెప్తే వినిపించుకోకపోగా నేను తనని వదిలించుకోవాలని అనుకుంటున్నానని అంటున్నారు. ఇలా ఆలోచిస్తూ ఇంటికి చేరిన మధు వికలమైన మనసుతో బాల్కనీ లోని కుర్చీలో కూలబడిపోయాడు.
అసలు హిమజని చేసుకుని ఉంటే తన జీవితం చాలా హాయిగా సాఫీగా సాగిపోయేది. కమల అన్నయ్య చెల్లిని కోరి చేసుకుంటాననడం, అది కూడా తను కమలను చేసుకుంటేనే అనే షరతు పెట్టడం, అందుకు తను ఒప్పుకోకపోవడంతో చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడడం, దాంతో తల్లీ తండ్రీ ఇద్దరూ తాము కూడా చస్తామని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమలను చేసుకోవలసి వచ్చింది. ఇప్పటికీ హిమజ మీద ప్రేమ తన మనసు లోతుల్లో అలాగే ఉన్నా కమలకి, పిల్లలకి ఏవిషయంలోనూ లోటు చెయ్యలేదు.
అనవసరంగా ఈ విషయాల్లోకి హిమజని కూడా లాగుతున్నారు. కమలని చేసుకున్నాక హిమజని దాదాపు మరిచిపోయే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ, మామగారికి తెలిసిన వాళ్ళు ఎవరో తను హిమజను ఇష్టపడిన విషయం, చెల్లెలి కోసం కమలను చేసుకున్న విషయం చెప్పారట. అప్పటి నుండి అత్తగారు, మామగారు ఇద్దరూ తన మనసు వేరే అమ్మాయి మీద ఉన్నందున తమ కూతురికి అన్యాయం జరిగిందన్న అపోహలో పడిపోయారు. అదే విషయాన్ని కమలకు కూడా చెప్పి తన మనసు కూడా విరిచేసారు.
ఆలోచనలతో బరువెక్కిన బుర్రను ఒక్కసారి విదిలించాడు మధు. ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ఫోన్ అందుకుని మామగారి ఇంటికి ఫోన్ చేసాడు. తమ చిన్న కూతురు ఫోన్ ఎత్తడంతో “బాగున్నావా చిన్నారీ!” అంటూ ఆప్యాయంగా పలకరించాడు మధు.
“నీకు మేమంటే ఇష్టం లేదట కదా! ఇంకో పెళ్ళి చేసుకుంటున్నావట కదా! నిజమేనా?” అని కూతురు అడిగిన ప్రశ్నకు నివ్వెరపోయి “ఛఛ. అలా ఎందుకు చేస్తానురా? ఐనా ఎవరు చెప్పారు నీకు” అని అడిగాడు. ఇంతలో ఫోన్లో అత్తగారి గొంతు “నేనే చెప్పాను. ఇంకెప్పుడూ ఫోన్ చెయ్యకు” అంటూ ఠపీమని ఫోన్ పెట్టేసింది.
మనసాగక కసేపాగి మళ్ళీ ఫోన్ చేసాడు. ఈసారి పెద్ద కూతురు మాట్లాడుతూ… “మా అమ్మని వదిలేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోదామని చూస్తున్నావట కదా. అమ్మని వదిలి మేమెక్కడికీ రాము”. అంది.
ఆ మాటలకు నిర్ఘాంతపోయిన మధు “ఒక్కసారి అమ్మకి ఫోన్ ఇవ్వమ్మా” అన్నాడు. ఆ పాప కమలకి ఫోన్ ఇవ్వగానే “మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నీకు నచ్చిన దానినే కట్టుకుని సుఖంగా ఉండు. మేము చచ్చినట్లే అనుకో” అనడంతో “అవేం మాటలు కమలా. ఐనా నీకొక విషయం చెప్పనా? ఆ అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయింది. అటువంటి అమ్మాయి గురించి అలా మనం మాట్లాడకూడదు” అని మధు అంటుండగానే…
“ఓహో! అయితే ఆ అమ్మాయి వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట. దాని మీద మీకు ఎంత ప్రేమ లేకపోతే మన పెళ్ళయ్యాక కూడా దాని గురించే ఆలోచిస్తూ వివరాలు సేకరిస్తారు? సిగ్గు లేని జన్మ. నేను ఇప్పుడే వెళ్ళి మీ మీద పోలీస్ కేస్ పెట్టబోతున్నాను. నన్ను, పిల్లల్ని, మావాళ్ళని మానసికంగా హింసిస్తున్నారని చెప్తాను. జైల్లో చిప్పకూడు తింటే అప్పుడు తెలుస్తుంది పెళ్ళాం విలువ” అంటూ విసురుగా ఫోన్ పెట్టేసింది.
అంతా అయిపోయింది. తను ఇన్నాళ్ళు పడిన కష్టానికి, చేసిన త్యాగానికి ఇదా ప్రతిఫలం? ఇక పరువు నడిబజారులో పడ్డట్టే… ఇంత జరిగాక తన తల్లిదండ్రులు, చెల్లెలి పరిస్థితి ఏంటి? చెయ్యని నేరానికి ఏమిటీ శిక్ష. కమల మొండితనం తనకు బాగా తెలుసు. ఆ మొండితనంతోనేగా తనని కోరి మరీ చేసుకుంది. ఇప్పుడు ఎవరో తనకి బలవంతంగా ఈ పెళ్ళి చేసారని నింద వేస్తోంది. ఆ మొండితనంతోనే తనను సాధిస్తోంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఏనాడూ ఎక్కని తన కుటుంబం పరువు ఈనాడు పోయే పరిస్థితి వచ్చింది.
ఇలా ఎంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడో తెలియదు కానీ… ఈలోగా ఫోన్ మోగితే కమల దగ్గరనుండి అయి ఉంటుంది అనుకుని ఫోన్ ఎత్తిన మధు అవతలి మాటలు విని “ఇప్పుడే వస్తున్నాను” అని చెప్పి ఫోన్ పెట్టేసి ఒంట్లో నవనాడులూ కృంగిపోగా కుర్చీలో వెనక్కి వాలిపోయాడు.
అనుకున్నంతా చేసింది ఈ పిచ్చిది. పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ “మీ మీద 498A కేసు నమోదు అయిందనీ, వెంటనే ఇన్స్పెక్టర్ గారు రమ్మంటునన్నారనీ”
తన పరిస్థితికి ఏం చెయ్యాలో పాలుపోని మధు అలా ఆకాశం వైపు శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు ఏవో ఆలోచనలతో.
ఇంతలో పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీదనుండి ఎగురుకుంటూ వచ్చిన కాకి వీరు బట్టలు ఆరేసుకునే దండెం మీద కూర్చుంది ఠీవిగా. ఆ దండానికి మూరెడు దూరంలో ఉన్న హై పవర్ కరెంట్ తీగలను చూసి ఆలోచనలో పడ్డాడు మధు.
తన ఆలోచన ఎంత వరకూ సరైనది? తను ఒక్కడు లేకపోతే అందరూ హాయిగా ఉంటారు. చెల్లెలి జీవితం బాగుంటుంది. ముఖ్యంగా కమల, పిల్లలు సుఖపడతారు. కమల వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళకు ఏలోటూ రానీయరు. అలాగే తన తల్లిదండ్రులు కూడా వాళ్ళకు అండగా ఉంటారు. అనుకుంటూ ఒక్కో అడుగే పిట్టగోడ దగ్గరగా వేయసాగాడు.
ఆఖరిసారిగా అన్నట్లు కళ్ళు మూసుకుని భగవంతుడిని ప్రార్ధించాడు. తన జీవితంలో ఏదీ అనుకున్నది అనుకున్న విధంగా జరగలేదు. కనీసం ఇప్పుడైనా తన కోరిక నెరవేర్చమని వేడుకున్నాడు. ఆఖరిసారిగా అందరినీ తలుచుకున్నాడు. చివరిగా హిమజ రూపాన్ని కళ్ళనిండా నిలుపుకుని కళ్ళలో నీరు తిరుగుతుండగా పిచ్చివాడిలా… ఏదో భ్రాంతిలో ఉన్నట్లుగా… పిట్టగోడ మీదనుండి చేతులు ముందుకు చాచి రెండు చేతులతో ఒక్కసారే ఆ కరెంటు తీగలని పట్టుకున్నాడు మధు.

**********

హిమజ వాడిన మందుల ఫలితమో, చేసిన పూజల ఫలమో హిమజ నెల తప్పిందనే శుభవార్త డాక్టర్ చెప్పగానే రెండు కుటుంబాలలోనూ పండుగ వాతావరణం నెలకొంది. హిమజ కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకోసాగారు అంతా. శ్రీకర్ ఆనందానికి అవధులు లేవు. ఆఫీసులో అందరికీ స్వీట్లు పంచిపెట్టాడు.
నెలలు నిండాక పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది హిమజ. బాబుని చూసిన అందరూ ఒకటే మాట, బాబు చాలా బాగున్నాడనీ… పూర్తిగా హిమజ పోలికలే వచ్చాయని. తనను అమ్మని చేసిన బిడ్డను పరవశంగా మనసుకి హత్తుకుంది హిమజ.

***** సమాప్తం *****

15 thoughts on “కధ కానిదీ… విలువైనదీ…

  1. Very Nice Story Girija Peesapati garu. It is like real incidents happening in Middle Class lives. Writing style is very interesting and no doubts that you have all the qualities to become a seasonal and Professional Writer.

  2. చాలా బాగుంది గిరిజా. మధు లైఫ్ చాలా బాధ కలిగించింది

    1. ధన్యవాదాలు ఎన్నెలమ్మ గారు. కొన్ని జీవిత గాధలు బాధనే మిగులుస్తాయి.

  3. కథ చాలా బాగా వ్రాసారు గిరిజ గారు ..హిమజ చదువుకోవాలన్న ఆశ తీరడానికి పరిస్థితులు అనుకూలించటం ..మధు జీవితం అంధకారంలో కూరుకుపోయి జీవితాన్ని త్యజించటం ..చక్కగా వివరించారు …అభినందనలు గిరిజ గారు .

    1. ధన్యవాద సహిత నమస్సులు అమ్మా. పేరున్న మీవంటి పెద్ద రచయిత్రి మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది.

  4. కథ ఆద్యంతమూ ఆసక్తిగా చదివించింది. రచయిత్రి గిరిజకి అభినందనలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *