June 19, 2024

కాంతం_కనకం – ఒక చెత్త కథ….

రచన: మణి గోవిందరాజుల

దుప్పటీ ముసుగు తీసి నెమ్మదిగా తల పక్కకి తిప్పి చూసాడు కనకారావు. కాంతం కనబడకపోయేసరికి గుండె గుభిల్లుమంది. “అప్పుడే వెళ్ళిందా వాకింగ్ కి?” నీరసంగా అనుకున్నాడు. అయినా ఆశ చావక “కాంతం” అని పిలిచాడు , పిలిచాననుకున్నాడు. యేదో తుస్ తుస్ మని సౌండ్ వచ్చిందే కాని పిలుపు బయటికి రాలేదు.
గొంతు సవరించుకుని మళ్ళీ పిలిచాడు కొంచెం గట్టిగా”కాంతం”..
“వస్తున్నానండి” అంటూ వచ్చి చిరునవ్వులు రువ్వుతూ తన యెదురుగా నిలిచిన కాంతాన్ని చూసి లేవబోతున్నవాడల్లా దయ్యాన్ని చూసి దడుచుకున్న వాడల్లే పెద్ద కేక పెట్టి మంచం మీద అడ్డంగా పడిపోయాడు పాపం కనకారావు.
అదంతా ముందే వూహించినట్లుగా తీసుకొచ్చిన నీళ్ళు మొహాన కొట్టి
“కనకం …కనకం..”అని ప్రేమగా పిలిచింది. నాగస్వరం విన్న నాగుపాములా వెంటనే లేచి కూర్చున్నాడు.లేచాడే కాని మొహంలో ప్రేతకళ ఇంకా అలానే వుంది.
“కాంతం యేంటే ఇది? నాకెందుకే ఈ శిక్ష? నువ్వు ఈ వేషం లో బయటికి వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారే.ఇది పెద్ద క్రైం. నా మాట వినవే నా బంగారం” కాంతం కనకారావు బలహీనత..గట్టిగా యేమీ అనలేడు.
“ పోలిసులకి యెవరు చెప్తారు? ..పదండి వాకింగ్ కి” ఆర్డరేసింది.
“నేను రానే ఈ రోజు.” భీష్మించుకున్నాడు
“అయితే ఓకే! మీరు కాఫీ కలుపుకుని తాగి నాకు ఫ్లాస్క్ లో పోసి వుంచండి” కులాసాగా చెప్పి విలాసంగా బయలుదేరబోయింది.
మళ్ళీ పడిపోయాడు కనకారావు..
***************
మొన్నంటే మొన్నటివరకు కనకం జీవితం కాంతం సన్నిధిలో చాలా హాయిగా వుండేది… యే చీకూ చింతా లేని జీవితం ఒకరంటే ఒకరికి ప్రాణం.చిలుకా గోరింకల్లా కువకువలాడుతూ వుండేవాళ్ళు. ఇద్దరు పిల్లలు, పెళ్ళి చేసుకుని విదేశాల్లో వున్నారు. అంతకు ముందంతా ఇల్లూ, పిల్లలూ పనీ పనీ అంటూ క్షణం తీరిక లేకుండా వున్న కాంతానికి బోలెడు ఖాళీ దొరికింది. దాంతో టీవీ చూడ్డం మొదలు పెట్టింది. కాని మనుషుల్లో రాక్షసత్వాన్ని ప్రేరేపిస్తున్న సీరియళ్ళు నచ్చేవి కాదు. అందుకని కనకం చూస్తుంటే న్యూస్ ఛానెళ్ళు చూసేది. అందులో కాంతాన్ని బాగా ఆకర్షించింది మోడీ గారి స్వచ్ఛ్ భారత్ వుద్యమం. చూడగా చూడగా తాను కూడా దేశం స్వచ్చంగా వుండడానికి తన వంతు కృషి చెయ్యాలని నిశ్చయించుకుంది.
నిశ్చయించుకోవడమే కాకుండా తాను అవిశ్రాంతంగా స్వచ్చ్ భారత్ కోసం కృషి చేసినట్లూ , యెన్నో కష్ట నిష్టురాలకోర్చి దేశాన్ని నందనవనంలా తీర్చి దిద్దినట్లూ ప్రపంచ దేశాలన్నిటికంటే ముందువరసలో పరిశుభ్రమైన దేశంగా భరతదేశం వున్నట్లూ అందుకు ప్రధాన కారణమైన తాను ప్రధాని చేతులమీదుగా అవార్డులందుకున్నట్లూ కూడా వూహించుకుంది. అందుకోసం చాలా రకాల ప్రణాళికలు రచించుకుంది. అదిగో సరిగ్గా .అప్పటినుండే కనకారావుకి కష్టాలు మొదలయ్యాయి….

********************

“నువ్వు! వాకింగ్ కా??” తనతో పాటు తయారైన కాంతాన్ని ఆశ్చర్యంగా అడిగాడు .. కాంతం అర కిలో మీటరు నడవాలన్నా వూబర్ పిలుచుకుంటుంది.అందుకని ఆశ్చర్యం…
“యేమీ ?నేను మటుకు నాజూగ్గా అవ్వద్దా?”దబాయించింది.
“అయ్యో! అంతమాట అనగలనా?వెల్కం వెల్కం” అమాయకంగా ఆహ్వానించాడు.
నవంబర్ నెల..ఇప్పుడిప్పుడే చలి స్టార్ట్ అవుతున్నది. వాతావరణ కాలుష్య పొర అడ్డుకోవడం వల్ల సూర్యకిరణాలు భూమిని చేరడం లేదు.
రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల చుట్టు అప్పటికే జనాలు చేరిపోయారు.
సడన్ గా ఒక ఇడ్లీ బండి వేపు వెళ్తున్న కాంతాన్ని ఆపుతూ”కాంతం ..రిటర్న్ లో తీసుకెళ్దాము ఇడ్లీలు..ఇప్పుడే తీసుకుంటే చల్లారి పోతాయి” చెప్పాడు .
కాని కాంతం వినిపించుకుంటేగా…చిన్నగా వెళ్ళి ఒక పక్కగా నిలబడి హడావుడిగా తింటున్న ఒక ఐటీ అబ్బాయి దగ్గరకెళ్ళి చెయ్యి గోకింది. చేతి మీద యేదో పడ్డట్లుగా చెయ్యి విదిలించుకుని ఆత్రంగా తినసాగాడా అబ్బాయి. మార్నింగ్ షిఫ్ట్ టైం అవుతున్నది మరి..
“ఇదిగో అబ్బాయ్!” మళ్ళీ గోకింది…
ఈసారి తింటూనే యెగాదిగా చూసాడు…
చూసి యేంటన్నట్లు తలెగరేసాడు…
“నేనో మంచి మాట చెప్తాను వినబ్బాయ్..”
“యియయానికి యాకు యైం యేదు” (వినడానికి నాకు టైం లేదు) నోటి నిండా వున్న ఇడ్లీ అతని మాటను సరిగ్గా ప్రసారం చేయలేదు..
“అయ్యో పాపం మాటలు సరిగా రావేమో!” పైకే అనేసింది అప్రయత్నంగా..
ఆ అబ్బాయి “యాయలు యచ్చు…ఇయ్యీ వుయ్యి య్యోయ్యో!”(మాటలు వచ్చు.ఇడ్లీ వుంది నోట్లో) కోపంగా చూస్తూ అన్నాడు. మళ్ళీ అర్థం కాలేదు మన కాంతానికి. చాలా జాలేసింది ఆ అబ్బాయి మీద యేదో మందు తీసుకుంటే మాటలొస్తాయని చెప్పబోయి.. తన కర్తవ్యం గుర్తొచ్చింది.
“పోనీలే యెక్కువ మాట్లాడకు”అనునయంగా చెప్పింది…వాడికి వెర్రి కోపం వచ్చి గుర్రుమన్నాడు…చేతిలోని ప్లేట్ ని నేల కేసి కొట్టి అర్థం కాకుండా యేదో అరుస్తూ వెళ్ళిపోయాడు..
“మాటలు రాని వాళ్ళతో నీకు సరిగా మాటలు రావంటే ఇలానే కోపం వస్తుంది.” జనాంతికంగా అంది చుట్టు వున్నమిగతావాళ్ళను చూస్తూ. ఆ చుట్టు వున్నవాళ్ళు తినడం మర్చిపోయి కాంతాన్నే చూస్తున్న వాళ్ళల్లా యేదో పని వున్నట్లు అక్కడనుండి పారిపోయారు. బండి వాడు లబలబ లాడాడు.”యెవరమ్మా నువ్వు?నా వ్యాపారమంతా పోగొట్టటానికి పొద్దున్న పొద్దున్నే వచ్చావ్?”
“మంచిగా అడిగితే చెప్తుందా?కర్రతో అడగాలి ఈ పిచ్చి వాళ్ళను” బండివాడి భార్య కోపంగా కర్ర కోసం వెతకసాగింది.
అప్పటిదాకా బిత్తరపోయి చూస్తున్నవాడల్లా కనకారావు భార్య చేతిని అందుకుని పరుగు ప్రారంభించాడు. కర్రతో వెంటపడుతున్న ఆమెని చూసి ఇక యేమి మాట్లాడకుండా తాను కూడా పరుగు అందుకుంది కాంతం. కర్ర కంటిచూపుకి అందనంతవరకు పరిగెత్తి ఆయసపడుతూ పేవ్మెంట్ మీద కూర్చున్నాడు కనకం.
“యేంటే కాంతం?ఈ వింత చేష్టలేంటే??ఆ అబ్బాయిని అలా గోకడమేమిటి? యేమయిందే నీకు?” యేడుపొక్కటే తక్కువ కనకానికి..
“అలా వింతగా యేదన్నా చేస్తేనే వాళ్ళందరి అటెన్షన్ మన వేపు తిరుగుతుంది.” గొప్ప ఆత్మవిశ్వాసంతో చెప్పింది
“వాళ్ళ అటెన్షన్ మన వేపు యెందుకే తిరగడం?”అయోమయంగా అడిగాడు
“మరి అలా తిరిగితేనే కదా? నేను చెప్పాలనుకున్నది చెప్పగలుగుతాను?”
“యేమి చెప్పాలనుకున్నావే?” ఒక్క క్షణం డౌట్ వచ్చింది రాత్రికి రాత్రి పిచ్చెక్కలేదు కదా అని.
“స్వచ్చ్ భారత్ గురించి.. అయ్యో! పిచ్చి నా శ్రీవారూ…గుర్తు చేసుకోండి. ఆ ఇడ్లీ బండి చుట్టు యెంత చెత్త వున్నది?
“ఆ వున్నది. ఐతే?”
“పాపం వాళ్ళంతా ఆ చెత్తలో నిలబడే తింటున్నారు”
“ఐతే?” అడిగే ఓపిక కూడా పోయింది..
“ఇప్పుడూ నేనెళ్ళి బాబూ ఇలా చెత్తలో తినకండి. మీరు బండివాడికి గట్టిగా చెప్పండి, బండి చుట్టుపక్కల నీట్ గా వుంటేనే తింటాం అని , అంటే వింటారా? ఇలా యేదన్నా వింత చేష్ట చేస్తే వాళ్ళ దృష్టిలో పడతాను. అప్పుడు నే చెప్పేది వాళ్ళు వింటారు.”
“అందరూ పారిపోయారు కదే?ఇంక వినేదెవరు?” వెర్రి చూపులు చూసిన కనకం గట్టిగా నిర్ణయించుకున్నాడు కాంతాన్ని పిచ్చి డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలని.
“పోతే పోయారు. మళ్ళీ రేపొస్తాను కదా?” ధీమాగా చెప్పింది.
కాంతాన్ని రోడ్డు మీద చూసి పారిపోతున్న జనాలు కనబడ్డారు కనకానికి.బైర్లు కమ్మబోతున్న కళ్ళను గట్టిగా తుడుచుకుని
“సరేలే ఇప్పుడు ఇంటికి పోదాం పద. మొహం కనబడకుండా ఆచున్నీ కప్పుకో” అన్నాడు.
తిరుగు ప్రయాణం అయ్యారు ఇద్దరు. అంతలో కాంతం దృష్టిని ఒక చిన్నబడ్డీకొట్టు, చైనీస్ కౌంటర్ లాంటిది ఆకర్షించింది. ఆ కొట్టువాడు తరుగుతున్నది కాంతానికి కనపడలేదు. కాని ఆ కొట్టు చుట్టు కింద వున్న చెత్త బాగాఆఆఅ… కనపడింది.
ఆ కొట్టు దగ్గరికి వెళ్తున్న భార్యని చూసి “కాంతానికి మాంసం కొట్టుతొ యేమి పనబ్బా? అయినా మళ్ళీ యే గొడవ తెస్తుందో” అనుకుంటూ “కాంతం ఆగవే” అని పిలుస్తూ భార్యని గబ గబా అనుసరించాడు.
ఈసారి యే వింత చేష్టా చెయ్యలేదు.చాలా మర్యాదగా “చూడు బాబూ” అని పిలిచింది.
వాడు చేస్తున్న పని ఆపకుండా “కిలో రెండొందల్” అన్నాడు.
కాంతం వాడు చెప్పేది వినిపించుకోకుండా “ చూడు బాబూ నీ షాప్ దగ్గరకొచ్చి అందరూ తింటారు కదా కింద చూడు యెంత చెత్త వుందో? కాస్త శుభ్రం చేసుకుంటే యెంత బాగుంటుంది?మా లాంటి వాళ్ళం కూడా వచ్చి తింటానికి బాగుంటుంది” యెంతో మర్యాదగా చెప్పింది.
వాడు ఒక్క క్షణం తల యెత్తి చూసి చేస్తున్న పని ఆపి లోపలికి వెళ్ళాడు. తిరిగొస్తున్న వాడి చేతిలో చీపురు చూసి సంతోషపడింది. వెనకే వున్న మొగుడి వేపు గర్వంగా చూసి తలెగరేసింది.. ఈ లోపల షాపతను ముందుకు రమ్మన్నట్లుగా చెయ్యూపాడు. యెందుకో అని ముందుకెళ్ళిన కాంతానికి అక్కడ తరుగుతున్న మాంసం ముక్కలు కనపడి వొళ్ళు జలదరించింది. ఈ లోపల షాపువాడు కౌంటరు మీదనుండి ముందుకు వంగి కాంతం చేతిలో చీపురు పెట్టి వూడవమన్నట్లుగా సైగ చేసి మళ్ళీ మాంసం కొట్టడం మొదలు పెట్టాడు.ఈ సారి భర్త లాగకుండానే చీపురక్కడ పడేసి మొదలు పెట్టిన పరుగు ఇంటిదగ్గరకొచ్చి ఆపింది కాంతం.
గుడ్డు కూడా చేత్తో ముట్టుకోని కాంతానికి షాపువాడు, తరుగుతున్న చేతులతో చీపురు అందించటం వల్ల ఆ వాసన చేతులకి కూడా అంటుకుంది..
దాంతొ పొట్టలో కలిగిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ అలజడి ఫలితంగా ఆ రోజంతా వాంతులవుతూనే వున్నాయి..
***************
“యేంటే?మళ్ళీ ఈ రోజు తయారయ్యావు?”కంగారుగా అడిగాడు కనకం మరునాడు మళ్ళీ తనతో పాటు తయారైన కాంతాన్ని చూసి..
“అవును వాంతులు తగ్గాయిగా అందుకని బయలు దేరాను.”
“సమస్య వాంతులు కాదే. నువ్వే.. నిన్ను రోడ్డు మీద చూసి బతకనిస్తారా? అయినా నిన్న ఆ షాపతను చీపురుతో వచ్చాడు కాబట్టి సరిపోయింది.అదే కత్తి బట్టుకుని వెంటపడితే మనం స్వేచ్చగా ఆకాశంలో యెగురుతుండే వాళ్ళం..కొత్తగా ఈ గోలేంటే ”
“ఓసోస్… ఈ మాత్రానికే దడుచుకుని నా వుద్యమాన్ని ఆపేస్తానా?అలా భయపడి గాంధీగారు ఆపినట్లైతే మనకు స్వాతంత్రం వచ్చేదా? నేను కూడా అలానే పోరాడదలిచాను మన దేశం స్వచ్చమైన భారత దేశంగా అవతరించేవరకు” ఒక రకమైన వుద్వేగంతో అన్నది.
తల పట్టుకున్నాడు కనకం. “కాంతం తినే వాళ్ళకు తెలీదా?నువు చెప్పాలా? అయినా గాంధీ గారితో నీకు పోలికేంటే?”
“థింక్ హై అన్నారు పెద్దలు. అలాంటి గొప్ప వారితో పోల్చుకుంటె మనం కొద్దిగా అయినా చేయగలం …”
“ అయినా వాళ్ళకు తెలీదని కాదు.కాని యెవరో ఒకళ్ళు సమస్యని లేవనెత్తితే కొంతమందైనా ఆలోచిస్తారు .కనీసం తాము అలా చెత్తలోనె నిలబడి తింటున్నప్పుడు, తిన్న ప్లేట్స్ ని అప్పటికే పూర్తిగా నిండి పొర్లి పోతున్న డస్ట్ బిన్ లో వేసేటప్పుడు, అడుగుతారు కొత్త కవరు వేయమని. ఇంకోటేంటంటే అక్కడ తినే వాళ్ళంతా మూడొంతులు ఐటీ వుద్యోగస్తులే, బాగా చదువుకున్న వాళ్ళే పాపం ” జాలిగా చెప్పింది.
“ వేగవంతమైన ఈ జీవితంలో వాళ్ళకు ఇవన్నీ ఆలోచించే టైం వుండదే. ఆ క్షణానికి పొట్ట నిండిందా అని మాత్రమే వాళ్ళు చూసుకోగలుగుతారు. కాని నాకో డౌట్ స్వచ్చ్ భారత్ అంటే రోడ్డు మీదా రోడ్డుకి అటు ఇటూ పరిశుభ్రంగా వుండడం, వుంచేలా చూడడం. కాని నువు ఈ బండ్ల వాళ్ళ మీద పడ్డావేంటి?” కుతూహలంగా అడిగాడు.
“అలా అడగండి చెప్తాను. మీరు గమనించారా? ప్రతి పది అడుగులకు ఒక టిఫిన్ బండి కాని, కొబ్బరిబోండాల వాళ్ళు కాని, పూల వాళ్ళు కాని,రొట్టెలు చేసే వాళ్ళు కాని యేదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు వున్నారు. మొదలు వాళ్ళ వ్యాపారం వల్ల యేర్పడిన చెత్తా చెదారం రోడ్డుని ఆక్రమించకుండా వాళ్ళు చేయగలిగితే, అలా శుభ్రం చెయ్యమని మనం అంటే కస్టమర్లం పదే పదే చెప్తే వాళ్ళు తప్పక వింటారు. అప్పుడు రోడ్డు మీద నాట్యం చేసే సగం చెత్త తగ్గుతుంది.”
మెచ్చుకుంటే రెచ్చిపోతుందని “అయినా సరే నువు వాళ్ళ జోలికి వెళ్ళనంటేనే నాతో వాకింగ్ కి రా బంగారం” అనునయంగా చెప్పాడు.
ఒక క్షణం ఆలోచించుకుని సరే అంది కాంతం.
“ఆ రూట్ కాకుండా వేరే వెళ్దాము.” డిమాండ్ చేసాడు.
దానికీ సరే అంది తనలో తాను నవ్వుకుంటూ.
రోడ్డు మీద వెళ్తూ యెప్పుడూ చూసేదే అయినా ఈసారి ఇంకా యెక్కువగా గమనించసాగింది.
రోడ్దుకి అటు ఇటూ మంచి కొలతలతో ఫుట్ పాత్ వున్నా కూడా అందరూ రోడ్డు మీదనే నడవాల్సి వస్తున్నది కారణం..ఫుట్ పాత్ అంతా కూడా చెట్లూ చేమలు, చెత్త , బిల్డింగ్ వేస్టేజ్ తో నిండి వున్నది. కొద్దో గొప్పో ఖాళీగా వుంటే దాన్ని వీధి వ్యాపారస్తులు ఆక్రమించుకున్నారు. అందుకని రోడ్డు మధ్యలో నడవాల్సి వస్తున్నది.ఒక్కసారి అదంతా చక్కగా చేస్తే యెలా వుంటుందో వూహించుకుంది.తన వూహలో ఆ వీధంతా కూడా యెంతో అందంగా కనపడుతున్నది.అలా వుండాలంటే అందరూ కూడా ఆలోచించాలి..,ఆచరించాలి.
ఇంతలో కాంతం దృష్టిని స్వీపర్లు ఆకర్షించారు .వాళ్ళు చాలా సుతారంగా చెత్త హర్ట్ అవుతుందే మో అన్నట్లుగా వూడుస్తున్నారు. వాళ్ళకి ఒక పక్కగా యెన్నాళ్ళనుండి తీయలేదో పగిలిన ట్రాష్ బ్యాగ్స్ అందులో నుండి తొంగి చూస్తున్న అన్నిరకాల ట్రాష్ తమ తమ సుగంధాలతో పరిసరాలను చైతన్య పరుస్తున్నాయి. నాలుగైదు కుక్కలు వాటిల్లోనే దొర్లుతున్నాయి. నడిచే వాళ్ళందరూ కూడా ముక్కులు మూసుకుని వాటి పక్కనుండే వెళ్తున్నారు.
కాంతానికి నాలుగు దిక్కుల నుండి స్వచ్చభారత్ నినాదం వినపడసాగింది.యేదో వుత్తేజం, యేదొ చెయ్యాలన్న తపన ముందురోజు వాంతుల్లాగా తన్నుకుని రాసాగింది. నడుస్తున్నదల్లా ఆగిపోయింది..
“యెందుకే ఆగావు?గాభరాగా అడిగాడు.
“ఒక్కక్షణం…” భర్తకు చెప్పి ఆ స్వీపరు దగ్గరకెళ్ళింది.
“చూడమ్మా!” యెందుకైనా మంచిదని చీపురుకి దూరంగా నిలబడింది.
పని ఆపడానికి ఒక కారణం దొరికిందని అలసిపోయిన దానిలా ఆగింది వూడ్చే ఆవిడ.
“ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నావు? నీ డ్యూటీ నువు సరిగా చెయ్యాలి కదా? చూడు మీ చుట్టూతా యెంత చెత్త పేరుకుని వుందో?మంచిగా వూడవొచ్చు కదా? ఇలా వుంటేనే అంటు రోగాలు పెరిగేది. అలా రోగాలు వచ్చేవాళ్ళల్లో మేము వుండొచ్చు,లేదా మీరు వుండొచ్చు. అందుకని మీ డ్యూటీ మీరు బాధ్యతగా చేయాలి ” చాలా వినయంగా పొలైట్ గా చెప్పింది.
యెందుకు పిలిచిందో అని ఆగిన ఆ స్వీపరుకి వొళ్ళు మండింది కాంతం సూక్తి సుత్తావళిని వినేసరికి. “పో పోవమ్మా పెద్ద చెప్పొచ్చావు. యేళ్ల తరబడి మేమిలానే చేస్తున్నాము. ఇంతవరకు మమ్మల్ని యెవరూ అడగలేదు. నువ్వేమన్నా మాకు జీతమిస్తున్నవా అడిగేటందుకు? జీతమిచ్చేవాళ్లే అడగరు. నీకేమి పట్టింది?…ఇంక గట్టిగ అన్నవంటే మాపులిక్కడ పడేసి స్ట్రైక్ చేస్తం. యేమనుకున్నవో?” బెదిరించింది.
అదంతా వెర్రిమొహం వేసుకుని చూస్తున్నాడు కనకం.
వాళ్ళతో లాభం లేదని తమ దోవన తాము ముక్కు మూసుకుని నడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది.
“కాంతం! నాకు మాట ఇచ్చావు యెవళ్ళ జోలికి వెళ్ళనని” దీనంగా చూసాడు
“అవును “యెవళ్ళ ” అంటే నిన్న వెళ్ళిన వాళ్ళ జోలికి వెళ్ళనన్నాను కాని వీళ్ళ జోలికి కాదు..” ఈ మాత్రం తెలీదా అన్నట్లు చూసింది.
“వద్దే ఇంటికి వెళదాం రావే” ఇంకా దీనంగా అడిగాడు.
“మీకు దేశం మీద బొత్తిగా ప్రేమ భక్తి లేవు.”
“నీ మీదుందే ప్రేమ. అందరూ నిన్నలా మాట్లాడుతుంటే చూడలేనె కాంతం. మనకెందుకు చెప్పు?”
“అదిగో ఆ మాటే వద్దన్నాను. మనకెందుకేంటి? మీరు ఈ దేశపౌరులు . అయినా మీకెందుకు మీరలా చూస్తూ వుండండి” ధైర్యంగా వెళ్ళింది.
వీళ్ళు మాట్లాడినంత సేపు వీళ్ళను తప్పించుకుని నడుస్తున్నవాళ్లంతా భార్యాభర్తలు యేదో గొడవపడుతున్నరులే అనుకుని వెళ్ళిపోతున్నారు.
కనకంతో మాటలాపి వెళ్ళేవాళ్ళని ఆపింది కాంతం.
“దయచేసి మీ భార్యా భర్తల గొడవలో మమ్మల్ని లాగకండి”ఆగిన వాళ్ళన్నారు మొహమాటపడుతూ..
“మా గొడవేంటి?” అయోమయంగా అడిగారు ఇద్దరూ..
“అదే మీరేదో విషయం గురించి వాదించుకుంటున్నరు కదా?”
ఇద్దరికీ ఒక్కసారిగ నవ్వొచ్చింది.
“సరే మా సంగతి కాదు .దయచేసి కొద్ది సేపు ఆగండి”
“చూడండీ!చెత్త యెలావుందో?” చుట్టూ వున్న చెత్తను చూపుతూ అంది.
వాళ్ళు చుట్టూ చూసి “అవును చెత్త చెత్త లాగే వుంది” అన్నారు.మిగతా వాళ్ళంతా కూడా కోరస్ పాడారు.
“ఇలా వుంటే మీకు బాగుందా?”
“ఇలా వుంటే యెవరికన్నా బాగుంటుందా?” వాళ్ళకు కోపం వచ్చింది
కాంతానికి హుషారొచ్చింది “అందుకే మనం అందరం కలిసి ఈ సమస్య పరిష్కారానికి యేమన్నా చెయ్యాలి.”
“మా కంత తీరిక లేదు” సగం మంది విషయం వినగానే వెళ్ళిపోయారు.
“చూడండీ అందరం తీరిక లేదు అని వెళ్ళిపోతే ఈ సమస్య యెలా పరిష్కారం అవుతుంది?”
ఆ వెంటనే మిగతా సగం మంది వెళ్ళగా ఒకతను మాత్రం ఆగాడు
“యెవరం యెంత చేసినా దానికి పరిష్కారం అంటే ఒకటి ప్రజల్లో మార్పన్నా రావాలి లేదా అందర్నీ భయపెట్టటానికి మన చేతుల్లో పవర్ అన్నా వుండాలి.. పవర్ చేతుల్లో వున్న వాళ్ళందరూ పట్టించుకోరు. మనం యేమీ చేయలేము.” నిన్నటి నుండీ వీళ్ళను గమనిస్తున్న అతను కాంతాన్ని జాలిగా చూస్తూ చెప్పాడు..
*****************
కనకానికి నిద్ర లేదు కాని కాంతాన్నిఆ” పవర్” వుండాలి అన్నదొకటీ అమితంగా ఆకర్షించింది. దాని ఫలితమే కనకారావు కి కళ్ళు బైర్లు కమ్మి కిందపట్టం….
యెలా సంపాయించిందొ తెల్లారేసరికల్లా ఒక ఇన్స్పెక్టర్ డ్రెస్ సంపాయించింది. పైనుండి మిసెస్ కాంతం, యెస్ ఐ….అని ఇంగ్లీషులో రాసిన ఒక బ్యాడ్జ్ కూడా తగిలించుకుంది. ఇంకా ఒక లాఠీ లాంటి కర్ర కూడా…విలాసంగా వూపుకుంటూ…..
కింద పడ్డ కనకాన్ని మళ్లీ తట్టి లేపింది కాంతం.
“కాంతం..కాసిని మంచి నీళ్ళివ్వవే”అడిగాడు.
తెచ్చి కనకం కూర్చోవడానికి సాయం చేసి నీళ్ళ గ్లాస్ ఇచ్చింది.
తాగి గ్లాస్ పక్కన బెట్టి “ కాంతం ఇలా కూర్చో నా పక్కన నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను….కాస్త విను ఆ తర్వాత కూడా అల్లానే వెళ్తానంటే నీ ఇష్టం. నీ ఇష్టం యేదన్నా నేనెప్పుడన్నా కాదన్నానా?”ప్రేమగా అడిగాడు.
బుద్దిగా లేదన్నట్లు తల వూపింది.
“నీ ఆశయం చాలా గొప్పది. దానికొక పద్దతి వుంటుంది. మొదటగా యెన్నో యేళ్ళబట్టి ఇక్కడ వుంటున్నాము. నువ్వెవరో కొద్దిమందికైనా తెలిసే వుంటుంది. రాత్రికి రాత్రి నువ్వు ఇన్స్పెక్టర్ అయ్యావంటే యెవరు నమ్మరు..ఇదేమీ సినిమా కాదు. నువ్వీ వేషంతో వెళ్ళి యెవరినన్నా బెదిరించావంటే కడుపుమండిన యెవడో కేసు కూడా పెట్టక్కరలేదు పోలీసులతో చెప్పినా చాలు నిన్ను తీసుకెళ్ళి శాశ్వతంగా కటకటాల్లో తోసేస్తారు. నీ ఆశయం అక్కడ సమాధి, నేనిక్కడ సమాధి కావాల్సిందే”
గభాలున కనకం నోరు మూసింది అశుభం మాట్లాడొద్దన్నట్లు.
చేయి తప్పించి చెప్పసాగాడు “అంచేత కాంతం చెప్పొచ్చేదేమిటంటే.. నువు నిన్న మొన్నా యెన్ని వేషాలు వేసినా అవి నేరాలు కావు. కాని ఇది నేరం వద్దు మనకీ ప్రయత్నాలు.”
“మరెలా?కటకటాల్లోకి వెళ్ళక పోయినా నా ఆశయం సమాధి అయ్యేట్లుందిగా?” నిరుత్సాహపడింది.
“జరిగేదేమిటంటే సూపర్వైజర్ అడగడం లేదని స్వీపర్లు పట్టించుకోరు. తమ పైవాళ్ళు వాళ్ళ గొడవలో వాళ్ళుంటారని సూపర్వైజర్లు పట్టించుకోరు. ప్రభుత్వం అడగడం లేదని అధికారులు పట్టించుకోరు.”
“ప్రజలు అడగడం లేదని ప్రభుత్వం పట్టించుకోదు” పూర్తి చేసింది కాంతం. మెచుకోలుగా చూసాడు .
“కనుక కాంతం దీని గురించి యేమి చెయ్యాలా అన్నది మన కాలనీ వాళ్ళం కొంత మందిమి కలిసి చర్చిద్దాము. ఇది సమిష్టి కృషి.ఒక్కళ్ళతో కాదు …ప్రస్తుతానికి ఆపేసి నాకు మాంచి కాఫీ ఇవ్వు బంగారం” గోముగా అడిగాడు కనకం.
“అయ్యో! ఈ యావలో పడి మీకు కాఫీ ఇవ్వటమే మరిచాను. చిటికెలో తెస్తాను డియర్” తన ఆశయం పూర్తిగా మూతబడదు అన్న హుషారుతో వంటింట్లోకి వెళ్ళింది కాంతం.
“హమ్మయ్య గండం గడిచి పిండం బయటపడింది” నిస్త్రాణగా వెనక్కి వాలాడు కనకం……రెండు రోజులుగా నిద్రలేని కనకారావుకి వెంటనే నిద్ర పట్టింది, కాంతం కాఫీ తెచ్చేలోగానే…

**********శుభం*********

12 thoughts on “కాంతం_కనకం – ఒక చెత్త కథ….

  1. A wonderful message narrated in a comedic fashion. Letting all of us know that Govt. is nothing but people and we all have to come together to keep our premises clean and make our country clean.. once agin very well narrated with a great message.

  2. Malli oka andamina adbhutamina kadha chala bagundi keep it up we are proud of you congrats we are waiting more stories

  3. Superb story content and fine naration.comedy jodinchi brhamndamga cheppavu. Jandhyala vuntae srilakshmi brahmanandam combination ga petti movie lo comedy track ga vadae vaaru…nice mani..ee kadha mana responsibility ni gurtu chesindi.keep writing such wonderful stories….

  4. HA ha! Super story!! If each society can do that even within their premises, it will make a huge difference! It is everyone’s responsibility and not just the government’s! Perhaps the sweepers and their supervisors need some incentives too – may be a competition with photos of how well the streets are maintained and the winning entry to have some monetary prize

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *