March 4, 2024

కౌండిన్య హాస్యకథలు – మనుషులు చేసిన బొమ్మల్లారా…

రచన: రమేశ్ కలవల

“సార్, నేను ‘చెప్పుకోండి చూద్దాం’ కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాను”
“ఏ కంపెనీ? “
“చెప్పుకోండి చూద్దాం”
“ఎపుడూ వినలేదే మీ కంపెనీ పేరు”
“గెస్ కంపెనీ సార్, మీరు తెలుగు వారు కదా అని ‘చెప్పుకోండి చూద్దాం’ కంపెనీ అన్నాను”
“ఓ.. ఎందుకు కాల్ చేసారు?” అన్నాడు
“మీ యావిడ గారి డెలివరీట కదా?”
“ఎవరు నువ్వు ? అసలు ఎవరిచ్చారు నా నెంబరు? బుద్దుందా లేదా? యావిడ అంటావేంటి, ఆవిడ అనకుండా? తెలుగు మాట్లాడటం వచ్చా ముందు ఫోన్ పెట్టేయ్” అన్నాడు చిటపటలాడుతూ.
“సార్ నా మాట కొంచెం వినండి. ఏదో అలవాటులో పొరపాటుతో అలా అనేసాను. నేను మా యావిడని యావిడనే పిలుస్తాను, మీ ఆవిడను కూడా యావిడనేసాను, క్షమించాలి. ఇంతకీ మీరు తండ్రి కాబోతున్నందుకు కంగ్రాట్స్”
“ఆ సంగతి ఎవరు చెప్పారు మీకు?”
“మాకు పర్సనల్ గా ఎవరూ చెప్పరు సార్. మా కంపెనీ కు అలా తెలిసిపోతాయంతే” అన్నాడు
“ఏంటి తెలిసేది?”
“మీ విషయాలు సార్”
“అసలు నీకు.. నీకు నా నెంబర్ ఎలా వచ్చింది చెప్పు ముందు?” దబాయించాడు.
“మా పార్టనర్ కంపెనీ డాటాబేస్ నుండి తెలుస్తాయి సార్. ముఖ్యంగా గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాము.”
“మరి బ్యాడ్ న్యూస్”
“మా వేరే విభాగం వారు వాటి గురించి చూస్తారు, ఇంతకీ నాలుగు నెలలలో డెలివరీ అంటే అంత పెద్దగా సమయం కూడా లేదు మీకు”
“ఎన్ని నెలలు మిగిలాయో కూడా తెలుసనమాట?”
“తెలుసండి మీరు ‘ముందుచూపు హాస్పటల్’ లో చేర్పిద్దామనుకుంటున్నారుట కదా?”
“అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నా మీద నిఘా వేశారా మీ కంపెనీ?” కోపంతో అరవబోయాడు.
“అబ్బే! అలాంటివి మా కంపెనీ పాలసీకి విరుద్ధం”
“నా విషయాలన్నీ మరెలా తెలిసాయి?”
“మీరు నెట్లో ముందుచూపు హస్పటల్ గురించి సెర్చ్ చేస్తే మా కంపెనీ కు తెలిసిపోతుందంతే”
“ఏంటి తెలిసిపోయేది?”
“మీ విషయాలు సార్. కోపం తెచ్చుకోవద్దు”
“అసలు నువ్వు ఫోన్ నా కెందుకు చేసినట్లు?”
“మీరు తండ్రి కాబోతున్నారు గనుక ఓ మంచి పాలసీ గురించి మీతో మాట్లాడాలని చేసాను. మా కంపెనీ మీలాంటి వారి విషయాలను సేకరించి దానికి తగ్గట్టుగా మీకు రాబోయే కాలంలో ఉపయోగపడేవి మేము ఊహించి చెబుతాము”
“నేను ఆఫీసులో ఉన్నాను ఎక్కువ సేపు మాట్లాడటం కుదరదు”
“మీ ఆఫీసు వారు కూడా మా కంపెనీ పాలసీను రికెమెండ్ చేస్తారు సార్ కాబట్టి మీకు మాట్లాడటానికి మీ బాసు గారికి ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం”
“నేను పాలసీలు గట్రా పర్సనల్ గా కలిసి మాట్లాడితే తప్ప తీసుకోను” అని ఫోన్ పెట్టేసాడు వెనక్కి తిరిగాడు రెండు అడుగులు వేసాడో లేదో “మీ పక్కనే ఉన్నాను సార్ పర్సనల్ గా మాట్లాడతాను అటు పదండి వెడదాం” అన్నాడు.
“ఇప్పటిదాక నా దరిదాపులలో ఉన్నవాడివి ఫోన్ ఎందుకు చేసావు?” అని నిలదీసాడు.
“పాలసీ తీసుకుంటామని ఒప్పించే దాకా కష్టమర్లతో ఫోన్లో మాట్లాడాలని మా కంపెనీ పాలసీ. ఆ సంభాషణలు అన్నీ రికార్డ్ అవుతాయి .కొత్తగా జాయిన్ అయిన వారి ట్రైనింగ్ కు వాడతారు” అన్నాడు. ఆ దగ్గరలో ఉన్న టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసాడు. విసుగుగా అటు నడిచాడు.
“ఇంతకీ ఏంటి ఈ పాలసీ?” అని అడిగాడు
“చెబుతాను సార్. ఈ పాలసీ తీసుకుంటే మీ బాబు లేక పాప తో పాటు..”
“మా ఆవిడకు బాబు పుడతాడో పాప పుడుతుందే తెలుసుండాలే మీకు?”
“మా పాలసీకి బాబు అయినా పాప అయినా దానితో నిమిత్తం లేదు కాబట్టి వారి గురించి ప్రస్తావన తీసుకు రాలేదు”
“ఇంతకీ ఎక్కడ ఉన్నాము.. ఆ .. మీ బాబు కానీ పాపతో పాటు ఓ కంప్యూటర్ ను పెంచుతాము”
“కంప్యూటరా? అయితే మా ఆవిడ పిల్లలని ఎందుకు కంటున్నట్లు మరీ?”
“తప్పు చేసారు సార్. కంట్రోల్ చేసుకోవాల్సింది”
“అంటే?”
“ముందు జాగ్రత్త కు పిల్లలని కనకుండా సరిపోయేది”
“పోనీ ఓ కంప్యూటర్ని కనమనేదా మా యావిడ ని” అన్నాడు వేళాకోళంగా.
“తప్పుగా అర్థం చేసుకోకండి. రాబోయే రోజులలో అన్నీ పనులు కంప్యూటర్లే చేస్తాయని ఈ మధ్య ఓ సర్వేలో తేలింది”. అన్నాడు
“అంటే పనులు చేయించుకోవటానికా మేము పిల్లలను కనేది? అయినా మీ పాలసీకి మా ఆవిడ డెలివరీ కీ సంబంధం ఏంటి?”
చెబుతాను వినండి అంటూ చెప్ప సాగాడు. ఇప్పటికే ఆఫీసులలో సగం పనులు కంప్యూటర్లే చేస్తున్నాయి. మీ పిల్లలు పెద్దవాళ్ళైయ్యేసరికే ఆ తరం మనుషులు, ముఖ్యంగా మీ పిల్లలు ఏ పనికి పనికిరారని మా కంపెనీ అంచనా.
“మాటలు జాగ్రత్త గా రానీ బాబు” అన్నాడు.
“ముఖ్యంగా పిల్లలు అనబోయి మీ పిల్లలన్నాను సార్, అందరూ పిల్లల పరిస్థితి అలాగే ఉంటుంది, మీకు బి పీ ఉంది కాబట్టి మీరు ఆవేశ పడకూడదు”
“నా బీ పీ సంగతి కూడా మీ కంపెనీ తెలుసా?”
తల ఊపడంతో “వెరీ గుడ్…” అన్నాడు
“మీ బాడీలో రక్త ప్రసరణ కంట్రోల్ అవుతుంది ఇటు ఈ స్క్రీన్ వైపు అదే పనిగా ఓ పది సెకండ్లు మెల్లకన్నుతో చూడండి” అన్నాడు.
“మెల్లకన్ను పెట్టి చూడాల్సింది ల్యాపుటాప్ ను కాదు నిన్ను” అన్నాడు.
“మళ్ళీ విషయానికొద్దాము. మీరు నెలనెల కట్టే ప్రీమియంతో కంప్యూటర్ కు ఒక్కొక్క పార్టు కొంటాము. మీ పిల్లలు స్కూలు చదువులకు వచ్చే సరికే మీ కంప్యూటర్ నిర్మాణం కూడా పూర్తిగా తయారవుతుంది. అప్పుడు మిమ్మల్ని పిలుస్తాము. మీ ఆవిడతో పాటు రావాల్సివస్తుంది కానీ పిల్లలు తీసుకురాకూడదు” అన్నాడు.
“పిల్లలెందుకు రాకూడదు ?” అని అడిగాడు.
“పిల్లలని తీసుకువస్తే వాళ్ళు కంప్యూటర్ పాడు చేస్తారని మా కంపెని పాలసీ ప్రకారము తీసుకురానివ్వము, ఇకపోతే మీ ఆవిడ తప్పకుండా రావాల్సి ఉంటుంది ఎందుకంటే కంప్యూటర్ కు మీరిద్దరూ కలిసి అక్షరాభ్యాసం చేయించాల్సి ఉంటుంది. ఒక సారి అక్షరాభ్యాసం అవ్వగానే మేము దానికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెడతాము.” అన్నాడు
“మీకు ప్రీమియం కడుతూ మా పిల్లలకూ స్కూలు ఫీజులు కడుతూ చదివించాలా? అన్నాడు.
సార్ మీరు అర్థం చేసుకోవడం లేదు. మీకు ముందే చెప్పాను. మున్ముందు డబ్బు సంపాదించేది మీరు పెట్టుబడి పెట్టే ఈ కంప్యూటర్లే , మీ పిల్లల చదువులకు పెట్టే ఖర్చు మీరు రిస్క్ తీసుకుంటున్నట్లే, అది మీ ఇష్టం అన్నాడు.
“మరి పిల్లలెందుకో?”
“బొమ్మలు కొనుక్కోకుండా సరిపోతుందని నా ఉద్దేశం. చక్కగా ఆడుకోండి సరదాగా గడపండి కానీ పనిమంతులవుతారని, సంపాయిస్తారని మాత్రం అనుకోవద్దని మా కంపెనీ సలహా”
“ఉదాహరణకు చెబుతాను చూడండి. ఇప్పుడు మీరు తెలుగు వాక్యాన్ని మరాఠిలో ట్రాన్స్లేట్ చేయాలనుకోండి మీరేంచేస్తారు? మీ మొబైల్ కంప్యూటర్ లో ట్రాన్సులేటర్ ను అడుగుతారు కానీ రెండుభాషలు తెలిసిన మనుషులని అడగరు కదా? మనిషి అవసరం లేకుండా పోయింది. అలాగే ఈ రోజు మీరు కారును నడుపుతున్నారు కానీ మీ పిల్లలు పెద్దయ్యే సరికే దానంతట అవే నడిపే కార్లు తప్ప ఇప్పుడున్న డ్రైవర్ల అవసరం అస్సలు ఉండదు. ఇక డాక్టర్ల సంగతి అంటారా వారి అవసరం కూడా లేకుండా మీ సమస్య ప్రకారం ఏ మందు వేసుకోవాలో అవే చెబుతాయి” అన్నాడు
ఇది విని కొంచెం ఆలోచనలో పడ్డాడు. కొంచెం మొగ్గు చూపాడని తెలుసుకున్నాడు అతను.
మా పాలసీలో కూడా రకరకాలున్నాయి. అంటే మీ ప్రీమియం ను బట్టి కంప్యూటర్ నైపుణ్యం నిర్ణయించబడుతుంది, శిక్షణ ఇవ్వబడుతుంది. మీరు మా పాలసీకి ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు, మీకు నచ్చితే రెండు కంప్యూటర్లు ఒకే సారి పెంచడానికి ప్రీమియం కట్టుకోవచ్చు.
రెండు అని ఎందుకు చెబుతున్నాననుకుంటున్నారా? పిల్లలు ఒకళ్ళను చూసి ఒకళ్ళు నేర్చుకున్నట్లు కంప్యూటర్లు కూడా నేర్చుకుంటున్నాయి ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది” అన్నాడు.
“అవునా?” అన్నాడు
“అవును ఇది అక్షరాలా నిజం. ఒక దాన్ని చూసి ఇంకొకటి తమలో తప్పులను సరిదిద్దుకొంటాయి”
“ఎన్ని తెలివితేటలు? ఏది ఆ కంప్యూటర్ ఎలా ఉంటుందో ఓ సారి చూపిస్తారా?” అని కుతూహలంగా అడిగాడు.
“రోబో సినిమాలో లాగా అచ్చంగా మనిషి లాగానే ఉంటుంది. మీరు ఎవరి పోలికలతో కావాలో ముందుగా చెబితే అలా తయారుచేయించే బాధ్యత మాది” అన్నాడు.
“ఇంతకీ ఎంతవుతుందన్నారు?” అని అడిగాడు.
“మీ జీతంలో ఇపుడు మీరు పెట్టే ఖర్చులు పోగా మీకు నెలకు పాతిక వేలు సేవ్ చేస్తున్నారు కరక్టేనా” అన్నాడు
ఇవన్నీ ఎలా తెలుసూ అన్న ప్రశ్నలు అడగటం మానేసి మీ కంపెనీ ఎంత తెలివైంది గురూ అంటూ ఆశ్చర్యం అంగీకరిస్తూ తల ఊపాడు.
మా పాలసీకి నెలకు పదిహేను వేలు చాలు, మీకు ఇంకా సేవింగ్సు పదివేలు మిగులుతాయి అన్నాడు.
“మొన్న ఓ డబ్బున్నాయన ఒకే సారి ఓ పాతిక కంప్యూటర్ల పాలసీ తీసుకున్నాడు సార్ ఎందుకంటే ఇవాళ మ్యాన్ పవర్ అంటున్నాము కదా తరువాత కాలంలో ఎన్ని కంప్యూటర్లు ఉంటే అంత బలగం సంపాదించినట్లే”
“చూడండి మీకే గనుక ఓ పది కంప్యూటర్లు ఉంటే రాబోయే కాలంలో కంప్యూటర్ యుద్దాలకు కొన్ని కంప్యూటర్లు కావాలన్నారనుకోండి ఆ ఆర్మీకి మీ కంప్యూటర్లు పంపుకోవచ్చు”
“ఇలా బోలెడు విషయాలు, వాటి ఉపయోగాలు మా పాలసీ డాక్యుమెంట్లో తెలుస్తాయు. చెప్పండి ఏమంటారు మా పాలసీ తీసుకుంటారా? మీ ఆవిడి గారిని సలహా తీసుకోవాలంటే మళ్ళీ కలుస్తాను. ఒక్క విషయం మాత్రం చెప్పదలుచులుకున్నాను ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది, కనీసం నాలుగు నెలలు పడుతుంది కంప్యూటర్ ఆర్డర్ ఇచ్చి నమూనా తయారు చేయించడానికి” అన్నాడు.
“అబ్బే మా యావిడ నేను ఎంత చెబితే అంతే! కాబట్టి ఇపుడే ఆ అప్లికేషన్ పూర్తి చేసేద్దాం” అన్నాడు.
“దీంట్లో పూర్తి చేయటానికి ఏమీ లేదు. మీ అన్నీ విషయాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు టచ్ స్క్రీను మీద గీకి సంతకం చేస్తే చాలు” అన్నాడు.

వెంటనే సంతకం చేసి, “అవునూ ఓ విషయం అడగటం మరిచిపోయానూ, పుట్టగానే నామకరణం చేయడం మా ఇంటి ఆనవాయితి. తయారు చేయగానే ఈ కంప్యూటర్ కు కూడా నామకరణం చేస్తే బావుంటుందన్న ఆలోచన తట్టింది, అభ్యంతరం ఏమి ఉండదు కదా? “ అని అడిగాడు.

“అబ్బే, అదేలేందండి! ఏదో కొంత రుసుం కట్టాల్సి ఉంటుందంటే తప్ప మీ కంప్యూటర్ మీ ఇష్టం నామకరణం చేస్తారో, బారసాల చేసుకుంటారో మీ ఇష్టం కానీ అన్నప్రాసన నో నో సార్” అన్నాడు.
సంతోషంగా ఇంటికి చేరాడు. “ఈ నాలుగు నెలల ఎదురు చూపులతో తట్టుకోలేక పోతున్నానోయ్ అన్నాడు వాళ్ళ ఆవిడతో. ఆవిడకేం తెలుసు ఈ పాలసీ గోల?”
నెలలు ఇట్టే గడిచిపోయాయి. ముద్దులొలుకుతున్న పాప పుట్టింది.
*****
“ఇది మనుషులు చేసిన బొమ్మ! దీనితో ఆడుకోవాలి, సరదాగా గడపాలి. మనకేదో సంపాదించాలి పెట్టాలి, తను సంపాదించుకోని బాగుపడాలి అన్న భయం ఇంకలేదోయ్. నేను రిటైర్ అయ్యేసరికే ఓ నాలుగు మన కంప్యూటర్ పిల్లలు ఇంచక్కా సంపాదించి పెడుతూ, పనులు చేసి పెడుతూ ఉంటే మనందరం కాలుమీద కాలువేసుకొని సరదాగా గడపడమే” అన్నాడు.
“మన అమ్మాయితో పాటు ఇంకో పేరు కూడా ఆలోచించు” అనే లోగా తన మొబైల్ మోగింది.
“సార్ నేను గెస్ కంపెనీ నుండి మీ కంప్యూటర్ నమూనా తయారయ్యింది.” అన్నాడు
“మంచి శుభవార్త చెప్పారు. ఇంతకీ నాకు బాబునా పాప పుట్టింది చెప్పుకోండి చూద్దాం అని అడిగాడు”
“ఒక్క సారి అంటూ చెక్ చేసి మా కంపెనికి తెలిసింది సార్ పాప పుట్టిందిట కదా, అచ్చం మీ ఆవిడ లానే ఉందిట కదా?” అన్నాడు.
“మీ కోరిక ప్రకారం మీ కంప్యూటర్ కూడా చూడటానికి మీ ఆవిడ గారు పోలికే సార్”
“నామకరణం ఫీజుల సంగతి మైయిల్లో పంపిస్తాను. త్వరలో కలుస్తాను సార్” అంటూ ఫోన్ పెట్టేసాడు.
పట్టలేని సంతోషం. “ఇద్దరు పిల్లలోయ్ మనకి! ఒకళ్ళు ఆడుకోవటానికి, ఇంకొకళ్ళు సుఖపెట్టటానికి” అన్నాడు.

“ఏమిటో మీరన్నది ఏమి అర్థం కాలేదు” అంది
“నీతో తరువాత చెబుతాలేవోయ్! ఆశ్చర్యపోతావు!” అన్నాడు.

1 thought on “కౌండిన్య హాస్యకథలు – మనుషులు చేసిన బొమ్మల్లారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *