March 4, 2024

జలజాక్షి. జలజాపతి. ఎక్సర్ సైజులూ. ఎగస్ట్రాలూ.

రచన: గిరిజారాణి కలవల

వీక్లీలో. స్లిమ్ గా వున్న హీరోయిన్ వైపూ. జలజాక్షి వైపూ. మార్చి మార్చి చూసాడు మన జ. ప.
జుట్టంతా నడినెత్తికి చేర్చి ఓ క్లిప్పు పెట్టేసి, గోనెసంచీ లాంటి నైటీ తగిలించుకుని పైనుంచి కింద దాకా ఒకే ఆకారంలో కాళ్ళు చాపుకుని, టీవీ చూస్తున్న జలజం. లంకలో సీతాదేవికి కాపలా వున్న రాక్షసకన్యలాగా,
సన్నటి మెరిసే మెరుపుతీగలా, తళుకులీను చీరలో ఆ బ్యూటీ హీరోయిన్ జ. ప కళ్ళకి దేవకన్యలా కనపడుతోంది.
లాభం లేదు. జలజంలో మార్పు తేవాలనుకున్నాడు. ఆ కార్యక్రమంలో ఈనాటి భాగంగా.
” జలజం. అంటే నీకు కోపం కానీ. అస్తమానం అలా టీవీ ముందు కూర్చుంటే ఎలా? కొంచెం శరీరానికి కదలికలు వుండాలి కదా. వాకింగులూ గట్రా.” అంటూ. తర్వాత మాటలు మింగేసాడు మన కింగ్.
గుర్రుగా చూసింది. గురుడు కేసి.
” ఏమనుకుంటున్నారు. నేను ఇంట్లో చేసే వాకింగ్ ఎంతవుతోందో తెలుసా మీకు? వంటింటిలోనుండి టివీ దగ్గరకీ. టీవీ దగ్గరనుంచి వంటింట్లోకి. ఇలా రోజుకు ఎన్నిసార్లు నడుస్తున్నానో. మధ్యలో యాడ్స్ వచ్చినపుడు, కూర మాడుతోందనో, పాలు పొంగుతున్నాయనో గుర్తు వచ్చినపుడు రన్నింగ్ కూడా చేస్తూ వుంటాను. టివీ రిమోట్ నొక్కేటపుడు వేళ్ళు స్ట్రెచింగ్ చేస్తూనే వుంటాను. ఇవన్నీ ఎక్సర్సైజ్ లు కావా? ” అని అంది.
“అది కాదు జలజం. ఈ హీరోయిన్ చూడు ఎంత స్లిమ్ గా వుందో. ” అన్నాడు.
“ఉంటుందుంటుంది. ఎందుకుండదూ. ఆవిడగారు ఒక్కో సినిమాకీ లక్షల్లో తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు అలాగే వుంటుంది. రేపు సినిమా ఛాన్స్ లు లేవనుకోండి, వీళ్ళ బండారం అప్పుడు బయట పడి బండలా తయారవుతారు. నన్నూ ఎవడైనా డైరక్టర్ సినిమాల్లోకి తీసుకుంటా అని వస్తే. నేనూ వుంటా స్లిమ్మూగా ” అంది.
“నిన్నా? సినిమాల్లోకా , హీరోయిన్ గానా ? ఎవడికీ అంత ధైర్యం, దమ్ము. లేవే జలజం. ” అన్నాడు జ. ప.
“ఏం ? నాకేం తక్కువా. నేను కల్పనారాయ్ కి ఎక్కువా. ఐశ్వర్యారాయ్ కి తక్కువా. అన్నట్టుంటాను. ఏం. కాదా. ” అంది జలజం.
ఆ మాటకి అవాక్కయిపోయి, అవతలకి పోయి గుండ్రాయితో గుండు మీద కొట్టుకుందామనుకున్నాడు.
” ఔనులే. జలజం. ఏ రాయి అయితే ఏంటి పళ్ళు రాలగొట్టుకోడానికి. అయినా. నీకు సినిమాలెందుకు గానీ. నీ ఆరోగ్యం, నీ గురించే చెపుతున్నా. రేపటినుండీ కొంచెం ఎక్సర్సైజ్ లు చెయ్యవే. లేకపోతే తర్వాత బాధ పడతావు. నా మాట విను.” అన్నాడు జ. ప బుజ్జగించే రీతిలో.
ఏ కళ నుందో. సరే అని ఒప్పుకుంది. రేపటి నుంచి ఏవేం చేయదలచుకుందో. ఆలోచించి చెప్పింది. సరే అన్నాడు జ. ప
కాసేపటికి. ఓ పేపర్ మీద ఏదో లిస్ట్ తయారుచేసి
జ. ప. చేతిలో పెట్టి.” రేపటినుండీ. మీరు చెప్పినట్టుగా బరువు తగ్గడానికి. నేను చేయబోయేవాటికి కావలిస వస్తువుల లిస్ట్ ఇదిగో. సాయంత్రం తీసుకురండి. ” అంది జలజం.
హనుమంతుడి తోక లా వున్న ఆ లిస్ట్ లో వున్నవి చదివి కళ్ళు తేలేసి నోరు వెళ్ళ బెట్టాడు.
వాకింగ్ షూస్, ఫిట్ బిట్ వాచ్, జాగింగ్ డ్రస్, బ్రాండెడ్ వాటర్ బాటిల్, ఐ ఫోనూ,చెవిలో పెట్టుకుని పాటలు వినడానికి ఇయర్ఫోనూ. ఇలా ఇలా.

ఇంకా.

యోగా నేర్చుకోవడానికి. యోగా మేట్, యోగా డ్రస్. యోగా గురూకి నెలకి పదివేలు ఫీజు.

ఇంకా.

డాన్స్ క్లాస్ మాష్టర్ కి పదిహేను వేలు ఫీజు, దానికి అవసరమైన డ్రస్సులూ.

ప్రతిరోజూ మినరల్ వాటర్ బాటిల్స్. డ్రైఫ్రూట్స్. ఆపిల్స్. కమలాలూ. బొప్పాయి వగైరాల పళ్లూ. జ్యూసులూ. ఇంకా స్ప్రౌట్సూ వగెరాలు.

స్విమ్మింగ్ కూడా అనుకుంటే. వాటికి అవసరమైనవీ.

ఇవన్నీ అయ్యాక. ఇంట్లో వంటకి టైముండదు కాబట్టి. వంటమనిషిని మాట్లాడడం. ఇలా ఇవన్నీ చదివి. జలజాపతి గుడ్లు తేలేసాడు.
అనవసరంగా కదిలించి. ఖర్చయిపోయానే అని గతుక్కుమన్నాడు.

1 thought on “జలజాక్షి. జలజాపతి. ఎక్సర్ సైజులూ. ఎగస్ట్రాలూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *