June 19, 2024

మది మధనం!

రచన: పద్మజ యలమంచిలి

తనకెందుకీ వేళ ఇంత అలజడి??
మనసంతా మెలితిప్పినంత బాధగా ఉంది..
ఏదో వెలితి,తెలియని అభద్రతాభావం…
అతను చనిపోయాడు..అయితే…నాకెందుకీ బాధ??
అందరూ 11వ రోజని భోజనాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా??
ఆఖరుకు అతని తల్లి కట్టుకున్న భార్య, పిల్లలు, అందరూ బానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు??
తనేమిటిలా…ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక్కసారైనా అతనితో మాట్లాడింది లేదు..చూసిందీ లేదు…మరెOదుకిలా??
దుఃఖం ఎగదన్నుకొస్తొOది??
నీకు తెలుసా…విజయమ్మగారి అబ్బాయి..ప్రాణం ఇక్కడే పోవాలని రాసిపెట్టున్నట్టుంది. అమెరికా నుంచి. సెలవులకని ఇండియాకి వచ్చి గుండెపోటుతో పోయాడంట.. ఇంకా నయం అమెరికాలోనే పోతే ఎంత ఖర్చైయ్యేదో..ఇక్కడికి తీసుకురావడానికి??
నిండా 50 ఏళ్లు కూడా లేవు..
చదువుకునేటప్పుడు కాలేజీలో ఎవరో పిల్లని ప్రేమించాడంట..ఆ పిల్ల ఈడిని కాదని ఎవరినో పెళ్ళి చేసుకుని పోయిందట..
అది మొదలు ఈయన గారు..సిగరెట్లు,తాగుడు..పిచ్చోడిలా తిరుగుతుంటే ..పెళ్ళి చేస్తే దారికొస్తాడని
తల్లి, మేనమామలు చక్కని చుక్కని తెచ్చి ఆ తంతు కానిచ్చేసి అమెరికా పంపేశారు..
అయినా మారితేనా…చేసుకున్నందుకు మొక్కుబడి కాపురం ఎలగబెట్టి ఇద్దరి పిల్లలికి తండ్రయ్యాడు కానీ మనసును మార్చుకోలేక,..ఎవరితోనూ కలవక ఎప్పుడూ ఒంటరిగానే తాగుతూ, తిరుగుతూ..ఇదిగో ఆఖరుకి ఇలా పోయాడట..
ఆ విజయమ్మకి అలా జరగాల్సిందేలే..కట్నం కట్నం అని కొడుక్కి బేరాలెట్టి, బేరాలెట్టి ఆఖరుకి వాడి ప్రేమ పెటాకులై రోడ్డున పడ్డాకా..ఏదో ముడెట్టేసి చేతులు దులుపుకుంది..ఎంత పొగరుగా ఉండేది..తీరిపోయింది ఇప్పుడు..పక్కింటి అసూయమ్మ ఆగకుండా వాగుతూనే ఉంది..
ఒక్క క్షణం కూడా ఆ మాటలు వినాలనిపించక లోపలికి వచ్చేసింది తను..
నిజమా..అతని ప్రేమలో అంత గాఢత ఉందా?? జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడని వారికి ఈ విషయం అసలు అర్ధమైయ్యే అవకాశమే లేదు..
ప్రేమలో అసూయ ఉంటుంది..కానీ ప్రేమించేవారిని నాశనం చేసేదిగా ఉండదు..
తనది చేసుకోవాలనే తపన ఉంటుంది కానీ తనకు దక్కనిది వేరెవ్వరికీ దక్కకూడదనే మూర్ఖత్వం ఉండదు..అటువంటి ప్రేమకు సాక్ష్యం సూర్యం !
నా పెళ్ళైన కొద్దిరోజులకు ఇక్కడ ఉంటే నిన్ను మర్చిపోలేను..దూరంగా పోతున్నాను అని చెప్పి వెళ్ళాడు..దూరం అంటే ఇంత దూరమా??
ఎక్కడో అక్కడ సుఖంగా ఉండొచ్చుగా..ఇలా ఎలా పోయావ్..మనస్సు మూగగా రోదిస్తోంది..
తను సరిగ్గా అర్ధం చేసుకోలేదా??
ఎలా చేసుకుంటుందీ. నాన్న లేరు జాగ్రత్తగా ఉండాలనే అభద్రతాభావం ఎవ్వరినీ నమ్మేటట్లు పెరగనివ్వలేదు నన్ను!.
కాలేజీకి కొత్తగా వచ్చిన సూర్య..ఓయ్ నేను నీకు అత్త కొడుకును అవుతాను తెలుసా..అంటూ కవ్వింపు మాటలతో, ఓర ఓర చూపులతో గుండెకు కొత్త లయ పుట్టించినా, అతని మీద మనసులో ప్రేమ ఉన్నా ఏ రోజు బయట పడనీయలేదు .
ఆస్తులున్నాయి, చదువు, వ్యాపారం ఉందని మోసపోయి పెద్దలు చేసిన పెళ్ళిని కిక్కురు మనకుండా ఆమోదించి, ఆర్ధికభారం నెత్తిన వేసుకుని కుటుంబాన్ని పోషించాల్సి వచ్చినా ఏమాత్రం చలించలేని ధైర్యాన్నిచ్చింది గుండెల్లో ఉన్న ఈ ప్రేమకాదూ…
నాకు నువ్వు వద్దు చచ్చిపో అంటే చావడానికి సైతం ధైర్యం ఇచ్చింది ఈ ప్రేమ కాదూ…
చచ్చి ఏమి సాధిస్తావ్, బ్రతికి నువ్వేంటో నిరూపించు అని ధైర్యాన్ని నింపింది ఈ ప్రేమ కాదూ…
ప్రేమంటే దూరంగా ఉండి కూడా దగ్గరగా ఉన్నట్లు అనిపించాలి అని ఈ మనస్సుకు తెలిసింది నీవల్ల కాదూ..
ఇన్నిరోజులూ ఒక శక్తి నన్ను నడిపించింది..
అది కనపడలేదు..వినపడలేదు..
అంతరంగాన్ని సృజిస్తూ,ఆశలేవో కల్పిస్తూ..
అనంత ధైర్యాన్నిస్తూ ఉండేది..
తను సరిగ్గా గమనించలేదు కానీ అది నన్ను ప్రేమించే ఒకరు ఎక్కడో నాకోసం ఉన్నారనే ధీమా…
టీవీలల్లో, సినిమాలల్లో ఇలాంటి ప్రేమకథలు చూసి అయ్యో అని కళ్ళనీళ్ళు పెట్టే జనం తమ ఇంటిలో ఇలాంటి ప్రేమకథ ఉందని తెలిస్తే ఎలాంటి నిందలు వేస్తారో మనకు తెలియదూ…
అందుకే నేస్తం…నువ్వెవరో నాకు తెలియదు
ఎవ్వరికీ చెప్పను కూడా…
మరి మదికార్చే కన్నీరుని ఎలా ఆపగలను..
ఇదిగో ఇలా అక్షరీకరించి నీకు నివాళుర్పిస్తున్నా…
సెలవు నేస్తం!.
.

4 thoughts on “మది మధనం!

  1. చిన్న కధయినా చక్కగా పొయిటిక్ గా రాసారు పద్మజా .బాగుంది కధలో ఆర్ద్రత వుంది అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *