June 19, 2024

కంభంపాటి కథలు – రంగు పడింది.

కంభంపాటి రవీంద్ర

నందగోపాల్ గారికి ఉదయాన్నే, అంటే సూర్యుడు తన చిరు వెలుగుల్ని ప్రసరించకుండానే లాంటి మాటలెందుకులెండి గానీ, సూర్యుడు డ్యూటీలోకి దిగకముందే వాకింగ్ కి వెళ్లడం చాలా ఇష్టం. ఈ మధ్యనే రిటైర్ అయ్యేరేమో, ఖాళీగా ఉండడం ఇష్టం లేక, వాళ్ళ అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ బాధ్యత తీసుకున్నారు. ఈ పదవి తీసుకోకముందు ఏదో తన మానాన తాను ఓ గంటసేపు అందరినీ పలకరించుకుంటూ వాకింగ్ చేసుకునొచ్చేసేవారు. ఇప్పుడు ఆ పలకరింపులు కాస్తా, ఫిర్యాదులయ్యేయి.

ఇంతకు ముందు, ‘గుడ్మానింగ్ అండీ ‘ అని పలకరించేవారు కాస్తా, ‘సార్. నిన్న రాత్రి పదకొండింటికి టాయిలెట్ కి వెళ్తే నీళ్లు రావడం లేదు.చాలా ఇబ్బంది పడ్డాను.. కొంచెం ఆ పనేదో చూద్దురూ ‘, ‘రాత్రి సెకండ్ షో సినిమా చూసొచ్చేసరికి మన సెక్యూరిటీ వాడు నిద్దరోతున్నాడు. ఇలాంటి సెక్యూరిటీని ఎక్కడ్నుంచి పట్టుకొచ్చేరండీ ‘ అనో, ‘నిన్న రాత్రి ఆ బి-బ్లాక్ లో ఉండే తమిళియన్ ఫామిలీ ఏదో అరుచుకున్నారు. ఎందుకో మీకేమైనా తెలుసా ‘ లాంటి డవుట్లు అడుగుతున్నారు. ఐతే, నందగోపాల్ గారికి ఏ పని చేసినా వీలైనంత సిన్సియర్ గా చేసుకుంటాడు కనక, ఎవరెలాంటి ప్రశ్నలేసినా విసుక్కోకుండా సమాధానపరిచేవాడు.

ఆ రోజు వాకింగ్ చేస్తూ తల పైకెత్తి చూసేసరికి, అపార్ట్మెంట్ బిల్డింగులు బాగా రంగులు వెలిసిపోయి కనిపించేయి. నిజమే. కట్టి పదేళ్లవుతూంది కదా. మళ్ళీ పెయింట్లు వేయించాలి. ఇప్పుడు మొదలెట్టేమంటే ఎండాకాలంలోపు ఆ పన్లన్నీ అయిపోయి, మళ్ళీ కొత్త బిల్డింగ్ లా కనబడుతుంది, అనుకుని వెంటనే ఆ ఆదివారం అపార్ట్మెంట్ అసోసియేషన్ మీటింగ్ పెట్టాలి అనుకుని, ఇంటికెళ్లిన తర్వాత అందరికీ ‘అసోసియేషన్ మీటింగ్ ఆన్ సండే మార్నింగ్ ‘ అని మెసెజ్ చేసేడు.

ఆదివారం రానేవచ్చింది, అసోసియేషన్ సభ్యులందరూ వచ్చి కూచోగానే, ‘అపార్ట్మెంట్ కట్టి పదేళ్లయ్యింది, మళ్ళీ తిరిగి పెయింట్లు వేయించే టైము వచ్చింది , అక్కడక్కడ సీపేజీలు అవీ వచ్చి గోడలు పాడయ్యేయి, ఇవన్నీ కూడా ఒకేసారి ఫిక్స్ చేసుకున్నట్లు ఉంటుంది. ‘ అంటూ చెప్పేడాయన

‘గుడ్ ఐడియా. ఇంకేం. పెయింట్స్ వేయించేయండి అంకుల్ ‘ అన్నాడు, ఫోన్లో బిజీగా ఫేస్బుక్ చూసుకుంటున్న ఐటీలో పనిచేస్తున్న సుధాకర్
‘పెయింట్స్ వేయించేయండీ అంటే ఇదేమైనా అప్పడాలు వేయించడమంత ఈజీనా? బోలెడు ఖర్చు ‘ అన్నారు, జీ హెచ్ ఎం సి లో పన్జేసే రామారావుగారు

‘అప్పడాలు వేయించేయడం ఈజీ అని ఎలా చెబుతున్నారు ?. స్త్రీలు చేసే పన్లని ఇలా తేలిక చేసేయకండి ‘ అంటూ గయ్యిమంది రమామణి, ఈ మధ్యనే టీవీల్లో చర్చా కార్యక్రమాలకి వెళ్తూందావిడ

‘ ఇక్కడున్న మగాళ్లందరూ నన్ను సపోర్ట్ చెయ్యాల్సిన టైం వచ్చింది. వంట చెయ్యడం స్త్రీల పనని ఎవరన్నారు? నలభీమపాకం అన్నారు కానీ దమయంతీ ద్రౌపదీ పాకం అనలేదు. అసలా మాటకొస్తే ఈటీవీ అభిరుచి ప్రోగ్రాంలో వంటలు నేర్పించేది మగాడు. ఆ విషయం తెలుసుకోండి ముందు. ‘ అంటూ గెట్టిగా అరుస్తూ కోప్పడ్డాడు కృష్ణమూర్తి గారు, రోజూ అర్నబ్ గోస్వామి ప్రోగ్రాం చూడందే అతనికి నిద్దరట్టదు !

‘ఏంటండీ. ఏమ్మాట్లాడుతున్నారు మీరు. ఆ ఈటీవీలో ఆయనెవడో వంటల్జేస్తే మొత్తం మగాళ్లందరూ వంట చేస్తున్నట్టేనా ?’ అరిచింది రమామణి

‘ఏం ? మీ ఇంట్లో మీ ఆయన వంట చెయ్యడా ?. నిజం చెప్పండి ‘ అరిచేడు కృష్ణమూర్తి

‘మా ఆయన. మా ఇల్లు. అయినా మా ఆయన మా ఇంట్లో వంట చెయ్యకపోతే మీ ఇంట్లో చేస్తాడా ? అభ్యుదయ వాదాలు లేనివాడిని మీ ఆవిడ ఎలా పెళ్లి చేసుకుందో ‘ అరిచిందావిడ

‘మరే. మీలా కుక్కలా అరవను కదా. అందుకే చేసుకుంది ‘ కసిగా చెప్పాడు కృష్ణమూర్తి

‘కుక్కకి విశ్వాసం ఉంటుంది. నాకు మీలా నక్క బుద్దుల్లేవు ‘

‘అంటే నేను నక్కనా ?’

‘ఏమో. మీకే తెలియాలి. ఇంటికెళ్లి ఓసారి అద్దంలో చూసుకోండి. లేదా మీ ఆవిణ్ణి అడగండి ‘ అంది రమామణి

నందగోపాల్ గారు అందరికేసీ చూసేసరికి, మిగతా అసోసియేషన్ సభ్యులందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు వాట్సాపూ, ఫేసుబుక్కులూ చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

ఇంక కలగజేసుకోకపోతే లాభం లేదని,’చూడండి. మనం టాపిక్ నుంచి పక్కకెళ్ళిపోయేము. మనం ఇక్కడికి వచ్చింది మన అపార్ట్మెంట్ కి కొత్త పెయింట్లు వేయించాలనే విషయం మీద. ‘ అంటూ అనేసరికి, ఇంతకు మునుపు సెక్రటరీగా పన్జేసిన ముత్యంరెడ్డి గారు ‘ఐడియా బావుంది. కానీ. అదేదో వొచ్చే ఏడాది చివర్లో వేయించొచ్చు కదా ‘ అనేసరికి కృష్ణమూర్తిగారు తగులుకుని, ‘అంటే. వచ్చే ఏడాది చివర్లో మీ అమ్మాయి పెళ్ళనుకుంటున్నారు కదా. అంటే. అప్పటికి అపార్టుమెంటుకి రంగులేయిస్తే, మీ ఇల్లు గ్రాండ్ గా కనిపించాలని ఆలోచన’ అనేసరికి ముత్యంరెడ్డిగారికి ఒళ్ళుమండి ‘ప్రతీదానికీ రాజకీయం వెతికే ఈ వెధవ అపార్టుమెంటు నాకేం అక్కర్లేదు. అంతగా కావాలనుకుంటే మేం మా అమ్మాయి పెళ్ళి నాటికి కొత్త అపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాం ‘ అనేసి విసురుగా వెళ్ళిపోయేరు

‘ఈ పెయింటింగ్ వేయించడం మూలంగా మన అపార్ట్మెంట్ రెంట్లు ఏవైనా పెంచుకోవచ్చా అంకుల్?’ అడిగేడు సుధాకర్

‘లేదమ్మా. ఇప్పటికే మన ఏరియాలో చాలా అపార్టుమెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. డిమాండ్ కన్నా సప్లై ఎక్కువుంది. కాబట్టి. ఇప్పట్లో రెంట్లు పెరిగే అవకాశం లేదు ‘ అన్నారు నందగోపాల్ గారు

‘అంటే పెయింట్లు వేయించినా అద్దె పెరగదన్నమాట. మరి ఏ లాభం లేనప్పుడు ఎందుకీ వెధవ మీటింగులూ?’ అని రమామణి విసురుగా లేస్తే, మిగతా అందరూ కూడా ‘అనవసరంగా ఆదివారం ఉదయం పాడైపోయింది ‘ అని గొణుక్కుంటూ వెళ్ళిపోయేరు !

1 thought on “కంభంపాటి కథలు – రంగు పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *