విలువ తెలుసుకో!

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు

ఎవరు లేకుంటే
నీకు విలువ లేదో, నీవు నిలువ లేవో,
గ్రహించలేకున్నావు,
నీ అహంకారాన్ని నిగ్రహించలేకున్నావు.
ఎవరు నీకు కంటివెలుగై,
నీ కాలి అడుగై, నీ గొడుగై,
నీకు నీడగా,నీ తోడుగా నిలుస్తున్నారో
నీకు గెలుపునిస్తున్నారో
తెలియలేకున్నావు.
ఆమెను మనసారా కలియలేకున్నావు,
ఆమె మనసును తెలియలేకున్నావు.
ఆ తోడుని అలుసు చేస్తున్నావు
ఆమెతో నీ అనుబంధాన్ని
పెళుసు చేసుకుంటున్నావు.
నిన్ను పట్టి పీడిస్తున్నది
తెలియని అజ్ఞానమనుకోవాలా?
తెలియనివ్వని అహంకారమనుకోవాలా?
నిజంలో చరించ లేకున్నావు,
అందుకనే తరించ లేకున్నావు,
వైవాహిక జీవితాన్ని వరించలేకున్నావు.

Leave a Comment