May 25, 2024

శిక్ష

రచన: నిష్కల శ్రీనాథ్

“అమ్మా! రసం చాలా బాగుంది, ఈ రోజు వంట నువ్వే చేసావు కదా ?” అంది రోషిణీ ఎదో కనిపెట్టినట్టు ముఖం పెట్టి. దానికి సమాధానంగా గీత నవ్వుతూ ” అవును..సరే త్వరగా తిను ఇప్పటికే చాలా లేట్ అయింది పొద్దునే త్వరగా లేవాలి ” అంటూ ఇంకోసారి భర్తకు ఫోన్ చేసింది. లాభం లేదు ఈసారి కూడా ఎత్తలేదు అని పక్కన పెట్టి తినడం మొదలుపెట్టింది.
” నేను తినడం అయిపోయిందమ్మా పడుకుంటాను గుడ్ నైట్ ” అని గీతకు చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది 12 ఏళ్ల రోషిణీ. తననే చూస్తూ ఉన్న గీతకు కొడుకు రోహిత్ గుర్తుకువచ్చాడు, ఈ వయసులో ఉన్నప్పుడు ఇలాగే తన మాట వినేవాడు కానీ ఇప్పుడు.. కళ్లలో నీళ్ళు తిరిగాయి గీతకి. ఇంతలో ఫోన్లో మెసేజ్ భర్త నుండి వచ్చింది ‘ నేను భోజనానికి రావట్లేదు ఆలస్యం అవుతుంది వచ్చేటప్పటికీ ‘ అని దాని సారాంశం అలవాటు అయినట్టుగా విరక్తిగా నవ్వి భోజనం ముగించింది.
సమయం 9:30 అయింది వంటింట్లో అన్నీ సర్ది బయటకు వెళ్ళి చూసింది వాచ్‍మాన్ రాజు గేటు దగ్గర తన ఫోన్ లో పాటలు వింటున్నాడు. “రాజు” అని పిలిచింది వెంటనే రాజు లేచి వచ్చాడు ” చెప్పండి మేడం” అన్నాడు “రాజు సారు వచ్చేసరికి ఆలస్యం అవుతుందంటా, నువ్వు లోపలకు వెళ్ళి కూర్చో బయట చలిగా ఉంది. అవును భోజనం చేసావా?” అని అడిగింది పనివాళ్ళని కూడా తన వాళ్లుగా చూడటం గీతకు అలవాటు.
” ఆ భోజనం చేశానమ్మా. రాణి అక్క వెళ్ళేముందు భోజనం పెట్టేసి వెళ్లింది. బయటే ఉంటాను మేడం. తాళం తీయడం కాస్త ఆలస్యం అయినా సారు కోప్పడతారు మేడం. మరి రోహిత్ సారు ఎప్పుడు వస్తారు ?” అని అడిగాడు రాజు. ఆ ప్రశ్న కు సమాధానం ఇవ్వబోతుంటే బైక్ ల శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసి వెంటనే గేటు దగ్గరకి పరుగు పెట్టాడు రాజు. ” సరే బై రా రేపు కలుద్దాం ” అన్నాడు రోహిత్ స్నేహితుడు. రోహిత్ గేటు దగ్గరకు వచ్చి వాళ్లకు చేయి ఊపి తన ఆధిపత్యం రాజు మీద చూపించడం మొదలుపెట్టాడు.
“గేటు తీయడానికి ఇంత సేపా ? ” అంటూ కోపంగా బండిని పార్కింగ్ లో పెట్టి నిర్లక్ష్యంగా తూలుతూ నడుస్తూ తలుపు దగ్గర గీతని చూసి కూడా చూడనట్టు వెళ్లసాగాడు.
” రోహిత్ ఇంతవరకు ఎక్కడ ఉన్నావు ? ఈరోజు కూడా తాగావా? నీ వయసు ఏంటి ? నువ్వు చేస్తున్న పనులు ఏంటి?” అని కోపంగా అడిగింది.
కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా తన గదిలోకి వెళ్లిపోయాడు రోహిత్. 22 ఏళ్ల కొడుకు చెడిపోతున్నా ఏమి చెయ్యాలో తేలిక, తల పట్టుకుని సోఫాలో కూర్చుంది గీత. ‘తను నవ మాసాలు కని పెంచి, గోరు ముద్దలు పెట్టిన కొడుకేనా ఇప్పుడు తనకి కనీసం విలువ కూడా ఇవ్వటంలేదు’ అనుకుంటూ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.
************
బయట లాన్ లో కుర్చీ లో కుర్చుని దిన పత్రిక తిరగేస్తున్న భార్గవ దగ్గరకి కాఫీ పట్టుకుని వెళ్లింది గీత. “ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి ” అంది కప్పు అందిస్తూ.
“ఏంటి ?” అన్నాడు పత్రిక మడతపెడత పెట్టి కాఫీ తాగడం మొదలుపెడుతూ ” రోహిత్ రోజు రోజుకు బాగా చెడిపోతున్నాడు. నిన్న కూడా తాగి వచ్చాడు. నేను ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పలేదు. మీరు కూడా వాడిని వెనకేసు కొస్తూ ఇంకా చెడగొడతున్నారు. మీరు కాస్త గట్టిగా మాట్లాడాలి వాడితో. ఇప్పటికే చదువులో 2ఏళ్లు వెనకబడ్డాడు. వాడి తోటివాళ్లు అందరు డిగ్రీ పూర్తి చేస్తే వీడు ఇంకా మూడో సంవత్సరంలోనే ఉన్నాడు, మీరు కొంచెం పిల్లల గురించి కూడా పట్టించుకుంటే బాగుంటుంది” అంది.
కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టీపాయ్ మీద పెట్టి ” గీత వాడి వయసు అలాంటిది మెల్లగా వాడే తెలుసుకుంటాడు. రేపు పొద్దున నా బిజినెస్ చూడాల్సింది వాడే.వాడికి ఈ బిజినెస్ మీద మంచి అవగాహన ఉంది ఆ డిగ్రీ ఎదో పూర్తి చేస్తే చాలు. ఒకవేళ అది కుదరకపోతే అయితే డిగ్రీ కొనడం మనకు కష్టం ఏమి కాదు. ఇంక తాగుడు అంటావా ఎదో సరదాగా పార్టీ చేసుకుని ఉంటారు. అన్నీ భూతద్దంలో పెట్టి చూడకు వాడి గురించి నేను చూసుకుంటాను ” అంటూ ఉండగా ఫోన్ మోగింది. ఇంక అక్కడ ఉండడం దండగ అని కప్పు పట్టుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది.
“అమ్మ ఇంకో ఇడ్లి కావాలి ” అని అరిచింది రోషిణీ “రాణి ఆ హాట్ ప్యాక్ లో ఉన్న ఇడ్లిలు డైనింగ్ టేబుల్ మీద పెట్టు ” అని వంట మనిషి రాణికి పురమాయిoచింది గీత. గీత డైనింగ్హాల్ లోకి వెళ్ళి పెట్టి వంట గదిలోకి వచ్చి గీతకు మాత్రమే వినపడేలా “అమ్మా, రోహిత్ బాబు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు” అంది.
గీత డైనింగ్ హాల్ లోకి వెళ్ళి రోహిత్ ముందు ప్లేట్ పెట్టి ఇడ్లిలు పెట్టి, చట్నీ వేసి పక్క కుర్చీలో కూర్చుంది. రోహిత్ తినడం పూర్తి అయ్యాక ” రోహిత్ నిన్న ఎందుకు తాగావ్? ఈమధ్య తరుచుగా తాగుతున్నావు. అది ఆరోగ్యానికి మంచిది కాదు నాన్న ఈ అమ్మ మాట వింటావు కదా ” అంటూ బుజ్జగించబోయింది గీత. అంతే ఒక్క ఉదుటున లేచి “నేను ఇంకా చిన్న పిల్లాడిని కాదు. నా ఆరోగ్యం గురించి నేను ఆలోచించుకోగలను. నాకు అనవసరం గా లెక్చర్ లు ఇవ్వద్దు ” అంటూ టేబుల్ మీద ఉన్న గ్లాసు నేల మీదకు విసిరి కొట్టి బయటకి వెళ్లిపోయాడు. రోషిణీ బిక్కచచ్చిపోయి గీతని గట్టిగా పట్టుకుంది.
రోజంతా ఆ సంఘటన గురించి అలోచించి ఆ రోజు త్వరగా పడుకుంది గీత, అర్దరాత్రి మెలకువ వచ్చింది పక్కన టేబుల్ మీద ఉన్న వాచ్ వైపు చూసింది. ఒంటి గంట అవుతుంది దప్పిక గా అనిపించి నీళ్లు తాగుదామని వంట గది వైపు వెళ్లింది. అక్కడ హాల్ కి అనుకుని ఒక గ్లాస్ రూమ్ ఉంది భార్గవ వ్యాపార లావాదేవీల గురించి చర్చించుకోడానికి. అవి బయటకు వినపడకుండా గ్లాస్ అమర్చారు ఆ గది రలో భార్గవ కోపంగా రోహిత్ ని తిడుతూన్నట్టు ఉన్నాయి అతని హావభావాలు. రోహిత్ తల దించుకుని నిల్చున్నాడు. అది చూసిన గీత రోహిత్ మళ్ళి ఎదో గొడవలో ఇరుక్కుని ఉంటాడు, కానీ భర్త కొడుకు ని ఇంతగా తిడుతూన్నా డు అంటే పెద్ద గొడవే అయ్యి ఉంటుంది అనుకుంది నీళ్ళు తాగి గదిలోకి వెళ్ళి పడుకుంది.
********************
“రాజు” అంది గీత బయటకి వచ్చి, వెంటనే రాజు గీత దగ్గరకు వచ్చాడు ” రాజు సారు కనపడటం లేదు బయటకు వెళ్ళడం నువ్వు ఏమైనా చూసావా ?” అని అడిగింది. ” 4 గంటలకు పెద్ద సారు, రోహిత్ సారు కారులో వెళ్లారమ్మా” అని చెప్పాడు ఆశ్చర్యపోయింది గీత.
‘ అంత ప్రొద్దున తనకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారా’ అనుకుంది. అదే అడిగింది రాజుని ” తెలీదు మేడం ” అన్నాడు సరే అని వెనుతిరిగింది.
ఇంతలో మళ్ళీ రాజు పిలిచాడు ” మేడం ఇది ఎంతవరకు నిజమో నాకు తెలిదు, కానీ సారూ ఎక్కువగా తోటలో ఉన్న ఫామ్ హౌస్ కి వెళ్తారని డ్రైవర్ చెప్పాడు. అక్కడ పెద్ద పెద్ద వాళ్లు అందరు వస్తారంట అమ్మాయిలు….కూడా….” అని ఆపి మళ్ళీ మొదలు పెట్టాడు.
” ఇందాక పెద్ద సారూ రోహిత్ సారుతో కూడా ఎదో హౌస్ అన్నట్టు వినపడింది, బహుశా అక్కడికేనేమో మేడం ” అని తల దించుకుని వెళ్లిపోయాడు.
గీత లోపలకు వచ్చి ఆలోచించసాగింది ‘ భార్గవ ఎలాగూ నైతిక విలువలు ఎప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడు కొడుకుకు కూడా అలవాటు చేస్తున్నాడా ‘ అని అనుకుంటూ ఉండగానే,”అమ్మా!…అమ్మగారు… ” అంటూ హడావిడిగా వచ్చింది రాణి.
“ఏమైంది రాణి ఏంటి హడావిడి ?” అని అడిగింది గీత. దానికి రాణి “అమ్మా రోహిత్ బాబు మీ నెత్తి మీదకు పెద్ద తుఫాను తీసుకువచ్చాడు ” అంది. మళ్ళీ తనే గీత చెవి దగ్గరకి వెళ్ళి ” రోహిత్ బాబు వాళ్ళ కాలేజీలో చదివే అమ్మాయిని పాడు చేసాడటమ్మ” అని ముగించింది. గీతకు ఆ మాట వినగానే ప్రపంచం ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపించింది ‘తన కొడుకు ఇంత నీచానికి ఒడిగడతాడా’ అనుకుని కుర్చీలో కూలబడింది.
రాణి అన్నీ సపర్యలు చేసాక మాములు అయింది. రాత్రి నుండి జరిగినవి అన్నీ గుర్తు తెచ్చుకుంది. ఇంక రోహిత్ ఫామ్ హౌస్ లో ఉంటాడు అని అర్ధం అయ్యాక, భార్గవకి గీత గురించి తెలుసు తప్పులు వరకు ఒప్పుకుంటుంది గానీ అన్యాయం అంటే సహించదు. అందుకే గీతకు విషయం తెలియకముందే ఇంటి నుండి బయటకు తీసుకు వెళ్లిపోయాడు.
ఎప్పుడు భార్గవ పరపతిని వాడుకోని గీత మొదటిసారి వాడి ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుంది. అసలు ఏమి జరిగిందో అప్పుడు తెలిసింది గీతకి. రోహిత్ స్నేహితుడి ద్వారా ఆ అమ్మాయి పేరు అనూహ్య అని కాలేజీ ఫంక్షన్ లో పొరపాటున తగిలితే, ఇద్దరు గొడవ పడ్డారని అసలే తాగి ఉన్న రోహిత్ ఆ అమ్మాయితో అసభ్యoగా ప్రవర్తించాడని, అందుకు అనూహ్య ప్రిన్సిపల్ కు రోహిత్ మీద కంప్లైంట్ ఇవ్వడంతో, ప్రిన్సిపల్ అప్పటికే రోహిత్ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి అని టీ.సి. ఇస్తామని అనడంతో రోహిత్ కి కోపం వచ్చి అనూహ్యని కంప్లైంట్ వెనక్కి తీసుకోమన్నాడు. కానీ అమ్మాయి వినిపించికోపోయేసరికి క్షణీకావేశoలో విచక్షణ కోల్పోయి చేసిన అఘాయిత్యం అని అర్ధం చేసుకుంది గీత.
అక్కడితో ఆగలేదు. తను అనుకున్న ప్రణాళిక ప్రకారం అనూహ్య తో మాట్లాడటానికి ప్రయత్నించింది. అనూహ్య స్నేహితురాలి ద్వారా ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పింది. అనూహ్య రోహిత్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలా ప్రోత్సహించింది. ముందుగా కారు మాట్లాడుకుని ఫామ్ హౌస్ కి బయలుదేరింది, అక్కడికి చేరగానే గేటు దగ్గర వాచ్ మాన్ ఆపాడు. “నేను ఎవరో తెలుసుగా ” అని గద్దించింది. ఆమె అరుపుకి భయపడి గొంతు తగ్గించి చెప్పాడు వాచ్ మాన్ ” లోపల సారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఎవరిని లోపలికి పంపద్ధు అన్నారు మేడం” అని,అయినా వినిపించుకోకుండా లోపలకు వెళ్ళి తలుపు కొట్టింది.
రోహిత్ తలుపు తీశాడు బయట గీతని చూసి ఆవాక్కయ్యాడు “అమ్మా” అన్నాడు చూసి అంతే రోహిత్ చెంప పగలకొట్టింది.
“ఏరా అమ్మ ఇప్పుడు గుర్తొచ్చింది రా…నీకు తాగుడు, గొడవలు అనే అనుకున్నా. ఇప్పుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావా ? ” అంటూ చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్లింది. “నువ్వు ఇప్పుడు బుద్దిగా నాతో వస్తే సరే సరి లేదంటే వెరే లా తీసుకువెళ్ళాల్సి వస్తుంది నా గురించి నీకు తెలుసుగా ” అని బెదిరించింది.
“నాన్న కి కూడా చెప్పి..” అని నసిగాడు “ఈపాటికి నాన్నకి వాచ్మాన్ ఫోన్ చేసి ఉంటాడు. ఇంటి దగ్గర కలుసుకోవచ్చు లే పద ” అంది ఇంక చేసేదేమీ లేక గీత వెంట నడిచాడు రోహిత్.
***********
ఇంటికి వెళ్ళేసరికి భార్గవ, పోలీస్ కేసుల గురించి ఎక్కువగా కలిసేది విజయ్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనికి అన్నీ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. ఎలాంటి కేసు అయినా జామీనూ ఇప్పించగల పలుకుబడి ఉంది. గీత అది ముందే ఊహించింది కాని ఊహించనిది వాళ్లతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు ఆడవాళ్లు ఇంచుమించు రోహిత్ వయసులో ఉన్న యువతితో పాటు గీత వయసు ఉన్న ఆమె.
అప్పుడు రాణి వచ్చి గీత చెవిలో చెప్పింది ” ఆ అమ్మాయేనమ్మా ” అని గీతకు అర్ధం అయింది అనూహ్య, వాళ్ళ అమ్మగారు వచ్చారని. ఆ నిశబ్దాన్ని చేధిస్తు విజయ్ మాట్లాడటం మొదలుపెట్టాడు “రండి గీత గారు మీ గురించే ఎదురుచూస్తున్నాం, అందరం మీ సమక్షంలో అన్నీ మాట్లాడుకోవాలి వచ్చి కూర్చోండి ” అన్నాడు. ‘నా ఇంట్లో నాకే మర్యాద ఇస్తున్నాడు ‘ అనుకుని ముఖం చిరాకుగా పెట్టి కూర్చుని భర్త వైపు చూసింది భార్గవ గీత వైపు కోపంగా చూస్తున్నాడు.
“మీ పేరు ఏంటమ్మా ?” అని అడిగాడు విజయ్ అనూహ్య తల్లిని ఉద్దేశించి “రాజ్యలక్ష్మి ” అంది. గొంతులో వణుకు తెలుస్తుంది అందరికి ” చూడండి రాజ్యలక్ష్మిగారు! ఇప్పటి వరకు జరిగింది మీకు తెలుసు. జరగబోయేదానికి పరిష్కారం మనం ఆలోచించాలి. కేసు వేశారు అది కోర్ట్ కి వెళ్తుంది, ఎన్నో రేప్ కేసులలాగే సంవత్సరాల తరబడి సాగుతుంది. కారణం మీరు సమాజంలో హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు మీద ఆరోపణ చేసారు. ఒకవేళ మీ సాక్ష్యాలు రుజువు అయితే అబ్బాయికి శిక్ష పడుతుంది. అప్పుడు అబ్బాయి జీవితంతో పాటు అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. అందరికి తెలిసాక అమ్మాయి ని చేసుకోడానికి ఎవరు ఇష్టపడతారు, ఒకవేళ చేసుకున్నా జీవితాంతం ఆనందంగా కలిసిఉండగలరా ? పైగా మీది మగ దిక్కు లేని కుటుంబం. ఇంతవరకు గుట్టు గా నెట్టుకొస్తున్న సంసారాన్ని కోర్ట్ ల చుట్టూ తిరిగితే మీ పరువు ఉంటుందా ? ఒకసారి ఆలోచించండి ” అన్నాడు.
అనూహ్య తల్లి ముఖంలో ఆందోళన కనిపించగానే, తన పాచిక పారిoది అని లోలోన సంతోషపడుతూ ” అందుకే మీ సమస్య కొలిక్కి రావాలంటే మీ అమ్మాయి అనూహ్య ని రోహిత్ కి ఇచ్చి పెళ్ళి చెయ్యండి. ఇద్దరి జీవితాలు పాడు అవ్వవు మీకు అమ్మాయి పెళ్ళి బెంగ తీరుతుంది. వాళ్ళ అబ్బాయికి శిక్ష తప్పుతుంది. అబ్బాయి తప్పు చేసాడు కాదు అనను కానీ క్షణీకావేశoలో చేసిన దానికి అంత పెద్ద శిక్ష పడుతుంది. జీవితమే నాశనం అవుతుంది మీ నిర్ణయం ఆలోచించుకుని చెప్పండి మీ అమ్మాయి బంగారు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోండి. ఇంత పలుకుబడి ఉన్న మామగారు, కోడలిని కూతురిలా చూసుకునే అత్తగారు ఏమంటారు? ” అన్నాడు. ఆ మాటలు కొంచెం బెదిరించి నట్టుగా, మరి కొంచెం కేసు వెనక్కి తీసుకోమని వేడుకున్నట్టు గా ఉన్నాయి. అనూహ్య తల్లి ఆలోచనలో పడింది.
ఇలాంటి పరిష్కారం ఎదో ఉంటుంది అని విజయ్ ని ఇంట్లో చూసినప్పుడే అనుకుంది గీత, అనూహ్య గీత వైపు చూసింది అనూహ్యకి ధైర్యం చెప్తూన్నట్టు గా కంటి రెప్పలు కిందకు వాల్చి పైకి లేపి మాట్లాడటం మొదలుపెట్టింది. ” విజయ్ గారు మీరు మాట్లాడటం అయిపోతే నేను మాట్లాడచ్చా?” అని దానికి విజయ్ సంతోషంగా ” మాట్లాడండి మీరు కూడా మీ ఉద్దేశం చెప్తే వాళ్లకి ధైర్యం ఉంటుంది ” అన్నాడు.
” అదే ఆ ధైర్యం నింపడానికే నేను మాట్లాడతా అంది. మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా క్షమించండి వాళ్ళలో ఎవరినైనా రోహిత్ ఇలా చేస్తే అప్పుడు కూడా ఇదే పరిష్కారం చెపుతారా?” అని అడిగింది. ఊహించని ప్రశ్న కి విజయ్ ఆవాక్కయి చూసాడు భార్గవ వైపు, అప్పటి వరకు సహనంగా ఉన్న భార్గవ ఊరుకోలేక భార్య మీద కోపంగా అరిచాడు. ” గీతా నువ్వు హద్దు దాటి ప్రవర్తిస్తూన్నావ్ మన అబ్బాయికి శిక్ష పడకుండా ఉండాలంటే ఇదే మార్గం లేదంటే వాడి జీవితం జైలు పాలు అవుతుంది ఒకసారి ఆలోచించుకో ” అని హెచ్చరించాడు.
గీత నిర్లక్ష్యంగా నవ్వి ” మన అబ్బాయి క్షమించండి వాడు ఎప్పుడు అయితే పశువులా ప్రవర్తించాడో, అప్పుడే నా దృష్టిలో చచ్చిపోయాడు. నాకు మీ వల్ల ఒక కూతురు ఉంది. కాని నాకు ఆ దేవుడు ఇచ్చిన కూతురు అనూహ్య. ఆమెకు న్యాయం జరిగేవరకు పోరాడతాను న్యాయం జరగాలంటే ఉండాల్సింది మగ తోడు కాదు రుజువులు,సాక్ష్యాలు, అవి నిజం అని నిరూపించగల సత్తా అవి మాకు మెండుగా ఉన్నాయి. ఇకపోతే అనూహ్య జీవితం గురించి ఆమె మీద జరిగిన అత్యాచారం ఒక పీడకలలా తను ఎప్పుడో మర్చిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న అనూహ్యకి మనుషలంటే విలువ ఇవ్వని ఈ వెధవ కిచ్చి కట్టబెట్టడమే అసలైన అత్యాచారం. వాడికి శిక్షను తప్పించే క్రమంలో మీరు అనూహ్య కు జీవితాంతం పెద్ద శిక్ష వేస్తున్నారు. ఈ వెధవ ఎట్టి పరిస్థితులలోనూ శిక్ష తప్పించుకోకూడదు. వీడే కాదు ఇలాంటి పనులు చేసే ఏ వెధవా తప్పించుకోకూడదు. ఇకపోతే మిస్టర్ భార్గవ, జీవితంలో నేను చాలా కోల్పోయాను అయినా మీకు ఎప్పుడు ఎదురు తిరగలేదు .కాని కొడుకు ఇంత పెద్ద తప్పు చేసినా సమర్ధించి శిక్ష తప్పించాలని చూస్తున్న నిన్ను నా భర్త అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నా, ఆడదానిని గౌరవించలేని, ఆడదాని శీలానికి రక్షణ లేని ఈ ఇంటి నుంచి నీ జీవితం నుండి నా కూతురిని తీసుకుని శాశ్వతంగా వెళ్ళిపోతున్నా ” అంటూ కూతురి చేయి పట్టుకుని అనూహ్య తల్లి దగ్గరకు వెళ్ళి ” అమ్మా మీకు తోబుట్టువులు ఉన్నారో లేదో తెలిదు, కానీ నేను మీ తోబుట్టువు అనుకోండి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి. అనూహ్య గురించి ఇద్దరం కలిసే పోరాడుదాo మీకు నేను ఉన్నాను ధైర్యంగా నా వెంట నడవండి ” అని రాజ్యలక్ష్మి కంట్లో నీరు తుడిచి అనూహ్య చేయి పట్టుకుని ఇంటి నుండి బయటకు వెళ్లింది.
అనూహ్యకే కాదు అలాంటి వారికి న్యాయం జరగాలని కోరుకుందాం. ఇంట్లో ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఎంత బాధపడతారో, అదే అబ్బాయి తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పించే మార్గాలను వెతుకుతారు. నిర్భయ చట్టం వచ్చినా ఇంకా ఇలాంటి దారుణాలు, సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులు ఎదో విధంగా శిక్షలు తప్పించుకుంటూనే ఉన్నారు, బాధితులు మాత్రం బలి అయిపోతునే ఉన్నారు. అలా బలి అయిపోయిన నా సోదరిమణులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.

**************సమాప్తం************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *