March 4, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి పదకొండు పద్యాలు

రచన: శారదా ప్రసాద్

మిత్రులకు నమస్కారములతో,
కొంతమంది శ్రేయోభిలాషులు, హితులు మిత్రులు, కార్తీక మాస సందర్భంలో ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’నుండి కనీసం పది పద్యాలను, వాటి అర్ధాలను తెలియచేయమని ఆశీర్వచనపూర్వకంగా ఆదేశించారు. దానిని శివాజ్ఞగా భావించి, కొన్ని పద్యాలను గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. విశేషమేమంటే, నేను శ్రీకాళహస్తిలో అయిదు సంవత్సరాలు పనిచేసాను. ఆలయంలో గోడలపై ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’లోని పద్యాలన్నిటినీ చెక్కారు. అలా, నేను ఆ పద్యాలన్నిటినీ అతి జాగ్రత్తగా చదివాను. చాలావరకు నోటికి వచ్చు. అర్ధాలను చెప్పటానికి ప్రయత్నిస్తాను. తప్పులుంటే మన్నిచగలరు. ఆశీర్వదించగలరు.
———–
అష్టదిగ్గజాలలో ఒకడైన శ్రీ ధూర్జటి మహాకవి తన చరమదశలో ఈ శతకాన్ని వ్రాశాడని ప్రతీతి. జీవితమంతా భోగలాలసలతో గడిపిన ఆయన, చివరి సమయంలో జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకొని భక్తి ప్రపత్తులతో వ్రాసిన శతకమిది. ధూర్జటి అంటేనే శివుడు. ప్రతి పద్యం హృద్యంగా ఉంటుంది. వాటిలో నీతి వాక్యాలతో పాటుగా, కవిత్వ సువాసనలు గుబాళిస్తాయి. ధూర్జటి ఎక్కువగా జానపదుల భాషను వాడేవారు. ఈ పద్యాలన్నిటినీ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాడు ఆయన. చాలా మంది కవిత్వం వ్రాయటానికి కలం పడతారు. కలం పట్టిన ప్రతివాడు కవి కాలేడు . భావావేశంతో చక్కని పదప్రయోగాలతో వ్రాసిన ఒక్క రసాత్మకమైన వాక్యం చాలు కవియొక్క ప్రతిభను గుర్తించటానికి. అలాంటి చరణాలను ఎన్నో కమనీయంగా వ్రాసి ఆంధ్రులకు ఒక అపురూపమైన శతకాన్ని అందచేసిన శ్రీ ధూర్జటి మహాకవిని స్మరించుకుంటూ, ముల్లోకాలాను తన కనుసన్నలతో కాపాడే ఆ ముక్కంటిని స్థుతిస్తూ ఇక మొదటి పద్యంలోకి వెళ్లుదాం!

01)శ్రీ విద్యుత్కవితాజవంజవ మహాజీమూత పాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా మీ కరుణా శరత్సమయమింతే చాలు చిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా

ఇది శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని మొదటి పద్యం. మొదటి పద్యమే ఇంత రమణీయంగా వుంటే, మిగిలిన పద్యాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు, చెప్పనలవి కాదు.
అర్ధం–శ్రీకాళహస్తీశ్వరా!వానాకాలంలో తటాకాలు బురదనీటితో నిండి, ఆ బురద నీటి యొక్క మాలిన్యంతో కమలాలు తమ సహజ సౌందర్యాన్ని కోల్పోయి కాంతివిహీనం అవుతాయి. అదే విధంగా కవితా కాంతులతో కూడిన ఈ సంసారమేఘం సహజంగా పాపజలాన్నే వర్షించుతుంది. ఆ పాపజలం వలన నా హృదయకమలం పూర్తిగా మలినమై తన అందాన్ని కోల్పోవటమే కాకుండా చూపరులకు ఏహ్యభావం కూడా కలిగించింది. శరదృతువులో తటాకాలు నిర్మలమైన నీటితో నిండివుండి, వాటిలో వుండే పద్మాలు అందంగా వికసించటానికి అవకాశం కల్పిస్తాయి. శరదృతువు లాంటి నీ దయ వుంటే చాలు, పాపపంకిలమైన ఈ దేహాన్ని, మనస్సును నీ ధ్యానంతో మరలా తేజోమయం చేసుకుంటాను.
———-
ఈ పద్యంలో శ్రీ ధూర్జటి మహాకవి తన జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించుకున్నాడు. పాపపంకిలమైన తన పాత జీవితాన్ని ఈశ్వరుని కరుణా కటాక్షాలతో ప్రక్షాళన చేసుకోవటానికి సంకల్పించి శ్రీకాళహస్తీశ్వరునికి తన జీవితసర్వసాన్ని అర్పించుకున్నాడు. భక్తి , కవిత్వం రంగరించి వ్రాసిన మధుర శతకాన్నిశ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించాడు. ఈ శతకంలోని ప్రతి పద్యం, భక్తిసుధాతరంగం, ఆవేదానభరిత గానం. కవిత్వాన్నిపలవరించి, అనుభవించితే గానీ ఆ మాధుర్యం తెలియదు.

02)ఏ వేదంబు పఠించలూత భుజంగం బేశాస్త్రము ల్చూచెతా
నే విద్యాభ్యాసం బొనర్చెగరి చెంచేమంత్రమూహించే బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా కావు మీ పాదసం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా

అర్ధం-శ్రీకాళహస్తీశ్వర శతకంలోని అత్యద్భుత పద్యమిది. మోక్షానికి జ్ఞానం అవసరం లేదు. జ్ఞానం వల్ల అహంభావం పెరిగే అవకాశం ఎక్కువుగా వుంది. తపస్సంపన్నులైన మహర్షులు కూడా ఈ అహంభావంతో మోక్షాన్ని పొందలేకపోయారు. భక్తితో దేవుని ప్రార్ధిస్తే మోక్షం సులభంగా లభిస్తుంది. కానీ, భక్తి అంత సులభమైన మార్గం కాదు. నేడు చాలామంది అనుకునే భక్తి , దేవునితో వ్యాపారసంబంధం ఏర్పరుచుకోవాలని చూడటమే!’పరమప్రేమ'(Pure Love)ను మాత్రమే భక్తి అని అంటారని శ్రీ నారదమహర్షి తన భక్తి సూత్రాలలో వెల్లడించారు. ‘పరమప్రేమ’అంటే ఇవ్వటమే కానీ ప్రతిఫలం ఆశించటం కాదు. ఈ ‘పరమప్రేమ’ను భాగవతంలో గోపికల వద్ద చూస్తాం. విశేషమేమంటే, గోపికలు కూడా పెద్దగా విద్యావాసనలు లేని వారే!నిర్మల చిత్తంతో నిరంతరం కృష్ణ స్మరణ తప్ప వారికి మరేమీ తెలియదు. అటువంటి భక్తిని మనం ఆటవికులలోనే ఎక్కువుగా చూస్తుంటాం. శబరి, కన్నప్ప, గుహుడు. . ఇలా చాలామంది భక్తి మార్గంలోనే మోక్షాన్ని పొందారు. ఆదికావ్యం వ్రాసిన వాల్మీకి కూడా ఆటవికుడే!ఇక పద్యం యొక్క అర్ధానికి వస్తే–నిత్యం శివుని ఆరాధించే సాలెపురుగు ఏ వేదాన్ని చదువలేదు. తన తొండంతో శివునికి అభిషేకం చేసిన ఏనుగు ఏ విద్యనూ అభ్యసించలేదు. కన్నప్ప(తిన్నడు)అనే చెంచుజాతికి చెందినవాడు ఏ మంత్రాన్ని ఉపాసన చేయలేదు. లోకంలో బ్రతుకుతెరువులకోసం చదువుకునే చదువు లేవియూ ఏ జీవులకూ మోక్షాన్ని ప్రసాదించవు, ప్రసాదించలేదు. శ్రీ కాళహస్తీశ్వరుని పైన భక్తి వుంటే చాలు-అదే మోక్షాన్ని పొందటానికి సకల విద్యల సారం. ఇక్కడ ఒక విశేషం చెబుతాను. కన్నప్ప, ఒక చేతిలో పండ్లు, మరొక చేతిలో మాంసపు ముద్ద , నోటిలో నీళ్ళతో శివుని సమీపించాడు. నోటిలోని నీళ్ళతో పుక్కిలించి శివునికి అభిషేకం చేసాడు. చేతులలోని పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాడు. శివుని కంటి నీరును చూసి తట్టుకోలేక శివలింగంపై తన కాలు వుంచి శివునికి కన్నుఅర్పించాడు. తిన్నడు అలా కన్నప్ప అయ్యాడు. భగవంతుని సంగతి అలా వుంచి, మన ఇంటికి వచ్చిన అతిధిని అలా సేవించగలమా?మహర్షులు సేవించగలరా?——సేవించలేరు. ‘అద్వైతాన్ని’ ఔపోసన పట్టిన వారే ఆ విధంగా చేయగలరు. భగవంతుడు, తానూ వేరు కాదని, భగవంతుడు తనలాంటివాడే అనే భావన గలిగిన వారే చేయగలరు. శబరి ఎంగిలి పండ్లను రామునికి అర్పించింది. వీరే నిజమైన అద్వైతమూర్తులు. శ్రీ రామకృష్ణ పరమహంస కూడా ఈ సాధనలో పరిపూర్ణత సాధించి మోక్షాన్నిపొందారు. మోక్షం, ముక్తిని పొందటానికి లౌకికమైన చదువుల వల్ల ఉపయోగంలేదని, ఈశ్వరునిపై నిశ్చల భక్తి ఒక్కటే మార్గమని ఈ పద్యం యొక్క భావం.

03)కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరెకౌరవేంద్రునకనేకుల్ వారిచే నే గతుల్
వడసెం పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం-కోరికలే అన్ని దు:ఖాలకు మూల కారణం. మనం కోరుకున్న దానిలో సుఖం ఉండకపోవచ్చు. తనంతట తానే మన దరికి చేరిన దానిలో అనేక సౌఖ్యాలు ఉండవచ్చు. అసలు, మనకు ఏమి కావాలో మనకే తెలియదు. కోరినది నెరవేరవచ్చు. కానీ, అది ఎలాంటి కోరికైనా చివరికి దు:ఖాన్నే మిగిలిస్తుంది. సంతానం లేనివారు సంతానం కొరకు అనేక వ్రతాలు ఆచరిస్తారు, పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. సంతానం పొందలేకపోయామని చాలామంది పరితపిస్తారు. వీరంతా జీవన భ్రాంతిలో పడిన అజ్ఞానులు. కౌరవేంద్రుడైన ధృతరాష్ట్రునకు సంతానానికి ఏ లోటూ లేదు. నూరుగురు కొడుకులు పుట్టారు. ఉపయోగమేమన్నా వున్నదా?ధృతరాష్ట్రుడు సంతానం వల్ల ఏమైనా సుఖం అనుభవించాడా?చెడు బుద్ధులతో నూరుగురు సంతానం ధర్మక్షేత్రంలో మట్టికరచి, దుర్భరంగా మృత్యువు ఒడిలోకి జారిపోయారు. కోరికలవల్ల
కౌరవేంద్రునకు చివరికి యెంతటి దుర్భర స్థితి కలిగిందో మనందరికీ తెలిసినదే!సంతానం లేకపోవటం వల్ల శుకమహర్షికి ఏదైనా దుర్గతి ప్రాప్తించిందా? పుత్రులు లేనంత మాత్రానా మోక్షానికి అర్హత కోల్పోతామా? సంకల్పంతో ఈశ్వరార్చన చేయరాదు. అన్నిసన్యాసలలో కన్నా’సంకల్ప సన్యాసం’ చాలా గొప్పది. మహర్షులు సైతం మోక్షం కావాలనే సంకల్పంతో యాగాలు, యోగాలు చేస్తారు. అట్టివారికి మోక్షం కలగటానికి ముందరే దుఖం కలుగుతుంది. విశ్వామిత్రుడికి మాదిరిగా తపస్సు అనేక మార్లు భగ్నం అవుతుంది. కావున, కోరికలతో భగవంతుని ప్రార్ధించకండి. మనకు ఎప్పుడు, ఏది కావాలో అన్నీ ఆయనకు తెలుసు. నీవు కోరుకున్నా, కోరుకోకపైనా అవన్నీ ఆయనే నీకు ప్రసాదిస్తాడు, దు:ఖాలతో సహా! వాటినన్నిటినీ పరమాత్ముని ప్రసాదంగానే స్వీకరించి, జీవనయానం కొనసాగించాలి. కోరికలే అన్ని దు:ఖాలకు మూలం అని చెప్పటం ధూర్జటి మహాకవి భావం అయి ఉండవచ్చు. భార్యా, పిల్లలూ, కామవాంఛలతో జీవితంమీద రోతపుట్టి, నిష్కాముడై శ్రీకాళహస్తీశ్వరుని శరణాగతిని వేడుకుంటున్నాడు ధూర్జటి మహాకవి. పశ్చాత్తాపాగ్నిలో కామవాంఛలను దహనంచేసి, తుదకు శివసాన్నిధ్యానికి చేరాడు.

04)కాయల్గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్
రాయన్రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశ విభ్రాంతిచే
ప్రాయంబాయెను బట్టగట్టె తల చెప్పన్ రోత సంసారమే
చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం-ధూర్జటి మహాకవి కవిత్వంలోనే కాదు సరస శృంగారంలో కూడా మంచి దిట్ట. ఒకసారి శ్రీ కృష్ణదేవరాయల వారు ‘భువనవిజయం’లో–ధూర్జటి మహాకవి కవిత్వానికి ఇంత అతులిత మాధురీ మహిమ ఎలా కలిగింది?అని ఒక సమస్యను ఇచ్చారు. దానికి తెనాలి రామకృష్ణుడు–వార వనితల అధర సుధారసధారలను గ్రోలటం వల్లనే అని చెప్పి, ధూర్జటికి ఒక చురక అంటించాడు. ధూర్జటి యవ్వనపు తొలి రోజుల్లో స్త్రీ లోలుడు, పచ్చివ్యభిచారి. దాని కారణంగా చివరి రోజుల్లో మేహ సంబంధమైన కుష్టువ్యాధి బారిన పడ్డాడు. ఆ సమయంలో అతను శ్రీకాళహస్తిలో ఉండి, ఈశ్వరుని ధ్యానించి మోక్షాన్ని పొందాడు. రతిక్రీడలో, స్త్రీల వక్షోజాలతో పురుషుడు జరిపే శృంగార ప్రక్రియలు రెండు. ఒకటి నఖక్షతం , రెండవది దంతక్షతం. నఖక్షతమంటే, వక్షోజాలను చేతిగోళ్ళతో గోమటం. దంతక్షతమంటే, పంటితో వక్షోజాలను పలకరించటం. నఖక్షతాలచేత ధూర్జటి మహాకవి చేతులు కాయలు కాచాయట!మరి ఆయన చేతులు అంత సున్నితమైనవో, లేక నాటుసరుకుతో సరససల్లాపాలు సలిపాడో ఆ ఈశ్వరునికే ఎరుక. అంత కామప్రవృత్తి, ప్రవర్తన వల్ల అతని దేహం చితికి శల్యమైంది. తప్పు తెలుసుకునే సమయానికి, జీవనరవి పశ్చిమాద్రికి చేరబోతున్నాడు. వార్ధక్యం వచ్చింది. పైగా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. గతించిన వయసు తిరిగిరాదు. శరీరపు రూపురేఖలు మారిపోయాయి. జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చింది. ఆయన చేసిన పనుల మీద ఆయనకే అసహ్యం కలిగి, జీవితం మీద, సంసారం మీద రోతపుట్టింది. ఇంత జరిగినా, వైరాగ్యం కలుగలేదు. “నాకు ఈ సంసారం మీద రోత పుట్టించి వైరాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా!!”అని శ్రీకాళహస్తీశ్వరుని వేడుకుంటున్నాడు ధూర్జటి. మానవుడు సరాగి కావాలన్నా, విరాగి కావాలన్నా ఈశ్వరుని అజ్ఞ లేనిదే వీలుపడదు.

05)నిను సేవింపగ నాపద ల్బొడమనీ నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీగ్రహగాతుల్ కుందింపనీ మేలువ
చ్చిన రానీ యని నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా

అర్ధం-సుఖాలు ఇచ్చేది భగవంతుడైనప్పుడు, కష్టాలనిచ్చేది కూడా భగవంతుడే!సుఖాలు అనుభవించేటప్పుడు మనిషి అదంతా తన ప్రతిభ వల్లనే అనుభవిస్తున్నాని భావిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు, తనకు కాలం కలసి రాలేదని అంటాడు. గ్రహరీతులు బాగాలేవని అంటుంటాడు. కష్టసుఖాలు విడదీయలేనివి. రెండూ కలసే వుంటాయి. సుఖాలు అనుభవించటం వల్ల చాలా కష్టాలు రావచ్చు. కష్టాలు అనుభవించిన తరువాత సుఖాలు పొందవచ్చు. కష్టసుఖాలను సమదృష్టితో స్వీకరించే వారినే ‘స్థితప్రజ్ఞులు’ అని అంటారని శ్రీ కృష్ణ పరమాత్మ గీతోపదేశంలో చెప్పారు. శ్రీ కృష్ణుడు ఒకసారి కుంతీ దేవిని, ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. అప్పుడు కుంతీదేవి-మాకు ఎల్లప్పుడూ కష్టాలనే ప్రసాదించమని వేడుకుంటుంది. అందుకు కృష్ణుడు, ”అదేమిటి అత్తా!అందరూ సుఖాలను కోరుకుంటారు, కానీ నీవు కష్టాలను ఎందుకు కోరుకుంటున్నావు?” అని అడుగుతాడు. దానికి కుంతీదేవి–కష్టాలుంటే, నీవు మా చెంతనే ఉంటావు. సుఖాలు వస్తే నిన్ను మరచిపోతాం , అని అంటుంది. నేనీ మధ్య పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ కుంతీమాధవ దేవాలయాన్ని చూసాను. మాధవుడు కుంతీదేవి చెంతనే ఉంటాడని చెప్పటానికే వారిరువురికీ దేవాలయాన్ని కట్టించి వుంటారు. చేసిన మేలును వెంటనే మరచిపోవాలి. పొందిన మేలును జీవితాంతం గుర్తుంచుకోవాలి. కానీ, మానవ నైజం దీనికి పూర్తి విరుద్ధంగా వుంటుంది. సుఖాల మత్తులో పడి భగవంతుని కూడా మరచిపోతారు. ఇక సాటి మనుషులను గురించి చెప్పేదేమున్నది? ఇక పద్యం అర్ధంలోకి వెళ్లుదాం. శివుని పూజించటం వల్ల కష్టాలొచ్చినా, సిరిసంపదలొచ్చినా , జీవితం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగినా, సిరిసంపదలేమీ లేకుండా అతి సామాన్యుడిగా మిగిలినా, మహానీయుడిగా కీర్తిని పొందినా, సంసారబంధంలో, మోహంలో పడి తప్పించుకోలేకపోయినా, జ్ఞానం కలిగినా, చెడు జరిగినా, మేలు జరిగినా అవన్నీ ఆయనకు భూషణములే అని ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వరుని భక్తితో కీర్తిస్తున్నాడు. భక్తి సోపానంలో నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కి పరాకాష్టకు చేరుకున్నాడు ధూర్జటి. ద్వంద్వాలన్నిటినీ సమదృష్టితో చూసి, ‘సర్వం ఈశ్వరార్పణమస్తు’ అనే భావనకు పూర్తిగా వచ్చాడు ధూర్జటి మహాకవి. ఈ పద్యంలోని ప్రతి పదాన్ని నిష్కామదృష్టితో ఆచరిస్తే, వేరే అర్చనలు, ఆరాధనలు అవసరం లేదు.

06)ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్ధంబులీ నేర్తురే
వేళన్వారి భజింప జాలిపడకావిర్భూత మోదంబునన్
కాలంబెల్ల సుఖంబు నీకు నిక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం–సంసారబంధంలో మానవుడు చిక్కుకున్న తరువాత, నిరంతరం సంబధీకులను ఆనందపరచవలసినదే! తను కష్టాలు పడుతున్నా వీరిని సంతోషంగా ఉంచినంత కాలమే అతనిని బంధువులు ఆమోదిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఇది లోకసహజం. ఒక్కరోజు దానికి భిన్నంగా వ్యహరిస్తే ఆ జీవిని పైవారందరూ చీదరించు కుంటారు. కనబడినా పల్లెత్తి మాట్లాడరు. కొరకొర చూస్తారు, అతను వారి ఆస్తిని ఏదో కాజేసినట్లు. సంసారంలోని సారం ఇదే. ఎప్పుడూ ఇతరులను తృప్తి, ఆనందపరచ వలసిందే!ఇన్ని బాధలు పడుతూ కూడా మానవుడు సంసారబంధంలో ఏదో ఆనందమున్నదని భ్రమపడుతూ జీవిస్తాడు. అవన్నీఎండమావులే. సంసారం నిస్సారం అని చివరి క్షణంలో కూడా తెలుసుకోలేడు. అంతే కాదు, మనకు ఏమి కావాలన్నా భార్యాబిడ్డలను, స్నేహితులను, హితులను స్థుతించితేనే వారు మన కోర్కెలను తీర్చుతూ ఉంటారు. అనుక్షణం సంగతీ సందర్భం లేకుండా వారిని పొగుడుతుండాలి. పొగిడినంత కాలమే, మనల్ని ఆమోదిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడు అలా కాదు. అవసరమున్నవారూ, లేనివారు కూడా ఆయనని కీర్తిస్తుంటారు. అలా కీర్తిస్తే, సిరిసంపదలు పొందవచ్చని కొందరి భావనైతే, మోక్షం పొందవచ్చని మరికొందరి భావన. తన్నుకీర్తించే వారిని కానీ, కీర్తించని వారిని కానీ బేధభావంతో చూడకుండా వారివారి అర్హతలను బట్టి వారి కోర్కెలను తీరుస్తాడు . అలా ఆయన అనుక్షణం ఆనందంగా ఉంటాడు. అందరినీ ఆనందపరుస్తాడు. అందరినీ బిచ్చమడిగి ఆయన పోగుచేసిన సంపదలు, స్వీకరించిన పాపకర్మలు, ఆయన అనుభవించటానికి కాదు. వాటినన్నిటినీ జాగ్రత్తగా భద్రపరుస్తాడు. భక్తులను రక్షింపక , ఆయన ఆ సిరిసంపదలను కూడబెట్టాడని అజ్ఞానులు భావిస్తుంటారు. అందరికీ సర్వసంపదలను ఇచ్చే ఆయనకు మనమిచ్చే కానుకలు ఏపాటి? ధూర్జటి మహాకవికి ఈ విషయం పూర్తిగా అవగతంకాలేదు. ఈశ్వరుడు, భక్తులను కాపాడకుండా ఆ ముడుపులను ఎవరికోసం దాచుకున్నాడో అనే చిత్తభ్రమలో ఆయన ఉన్నాడు. ధూర్జటి, చివరి రోజులలో ఆకటితో అలమటించిన రోజులు వున్నాయి. అలాంటి సందర్భంలో, ఈశ్వరునిపైన ఈ ‘నిందాస్థుతి’ని చేసి ఉంటాడు. రామదాసు కూడా శ్రీ రాముని గురించి ఇలాంటి నిందాస్థుతులు పలుమార్లు చేసాడు. పరమేశ్వరుడు ఇవన్నీ పట్టించుకోడు. తన చెట్టుకు కాసిన కాయ పక్వానికి వచ్చిన మరుక్షణమే దానికి విముక్తి కలిగించి, తన సన్నిధికి చేర్చుకుంటాడు.

07)ఎన్నేళ్లుండుదు నేమిగందునిక నేనెవ్వారి రక్షించెదన్
నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమో న్నిద్రాప్రమోదంబునా
కెన్నండబ్బెడు నెంతకాలమున్ నేనిట్లున్న నన్నియ్యెడం
చిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం–జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకనాడు గతించవలసినదే. మనం ‘చిరంజీవులని’ కొందరిని అంటాం. ఆ పదానికి నిజమైన అర్ధం చెప్పాలంటే చిరకాలం జీవించిన వారని అర్ధం. అంటే, చాలా ఎక్కువ కాలం జీవించినవారన్న మాట. వారు కూడా ఈ జననమరణచక్రంలో తిరగవలసినవారే. సృష్టిలో జీవం పోసుకున్న ఏ జీవి మృత్యువు నుంచి ఇంతవరకూ తప్పించుకున్న దాఖలాలు లేవు. అవతార పురుషులైన రామకృష్ణులకు కూడా మరణం తప్పలేదు. ఇక సామాన్య మానవ జన్మ ఎత్తిన మన సంగతిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు మీద పడుతున్నకొద్దీ అనేకరకాలైన వ్యాధులనే శత్రువులు దాడి చేయటం మొదలు పెడతాయి. ఇక అరిషడ్వర్గాలను గురించి చెప్పనవసరం లేదు. మానవుడు, వీటినన్నిటినీ జయించి మృత్యువునుండి తప్పించుకోవటం అసాధ్యం. మృత్యువును గురించి భయపడి అనుక్షణం మరణించే దానికన్నా, ‘జీవన్ముక్తులు’కావాటానికి మార్గాలు-దైవస్మరణ, పరోపకారం లాంటివి మనిషి ఆచరించాలి. ధూర్జటి మహాకవి జీవితపు చివరిదశలో ఉన్నాడు. వ్యాధులు ముదిరాయి. శరీరపు పటుత్వం తగ్గింది. ఇక యెంత కాలం జీవిస్తాడో తెలియని పరిస్థితిలో వున్నాడు. అవయవాలు స్వాధీనం తప్పి, మలమూత్రాలు తన అదుపుతప్పిన జీవి–జీవించి మాత్రం చేసేదేముంటుంది, చూసేదేముంటుంది? అట్టి దురవస్థలో మనిషికి జీవితం మీద పూర్తి విరక్తి కలుగుతుంది. దానికి కారణం వైరాగ్యభావం రావటం కాదు, సపర్యలు చేయవలసినవారు కూడా అసహ్యించుకోవటం. సపర్యలు చేసేవారు లేని వారి పరిస్థితి మరింత దుర్భరం. ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో వృద్దులైన భార్యాభార్తలిద్దరే ఒంటరి జీవితం గడుపుతున్నారు. పిల్లలు పొట్టకూటికోసం స్వదేశంలో చాలాదూరంలో కొందరు, మరి కొందరు విదేశాల్లో వుంటున్నారు. క్రమంగా భారతదేశం ఒక ‘అనాధ వృద్ధశరణాలయంగా’ మారుతుంది, చాలావరకు మారింది కూడా. ఇటువంటి పరిస్థితులలో జీవించి ఎవరిని ఉద్ధరించగలం! కనీసం, రెండు చేతులతో భగవంతుడిని కూడా నమస్కరించలేం, సేవించలేం!ఈ ఉపద్రవాలన్నిటినీ తప్పించుకునే స్థితి లభించటమనేది అనుమానాస్పదమే! ఇలా ఎవరికీ ఉపయోగ పడకుండా ఇంకా యెంత కాలం జీవించి వుండాలి?ఆశక్తుడైన తన్ను ఏలుకోమని ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుని వేడుకుంటున్నాడు. ఈ పద్యభావం మొత్తం ధూర్జటి మనోవేదనే! శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే పరహితం, దైవస్మరణ లాంటి సత్కార్యాలు చేసిన వారికి మరణం సమీపిస్తున్నప్పుడు మృత్యుభయం వుండదు. అట్టివారికి యముడు శుభంకరుడు. జీవించినపుడే మనిషి ముక్తిమార్గాన్ని ఎన్నుకోవాలి. అలాంటి వారే శివునికి సన్నిహితులు, వారే శివసాన్నిధ్యానికి చేరుకోవటానికి అర్హులు.

08)రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా
బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిం పొందితిన్ జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం-రాజులు, ధనమదాంధులు, బధిరాంధులు. వారు ధన మదంచేత, అధికార దర్పంచేత కళ్ళుండి చూడలేరు. చెవులుండి వినలేరు. అట్టి వారు చనిపోతే, వారి శవాన్ని చూడటం కూడా పాపమని సుమతీ శతకకారుడు అయిన బద్దెన మహాశయుడు శలవిచ్చారు. అన్నమయ్య కూడా–మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినం దు:ఖమొందనేల? అని చెప్పారు. మనిషి స్వార్ధపరుడు. ఈ పీల్చే గాలిని, త్రాగే నీటిని ఇచ్చిన భగవంతుని మరచి చిటికెడు విభూతిని ఇచ్చే దొంగస్వాములను ఆరాధిస్తుంటాడు. రాజులు మదోన్మత్తులు. వారిని నిరంతరం సేవించినా తృప్తిని పొందరు. భక్తితో ఒక చెంబెడు నీళ్ళను లింగం మీద పోస్తే సంతోషిస్తాడు భోళాశంకరుడు. అటువంటి ఈశ్వరార్చనను మరచి దొంగస్వాములను, రాజులను, ధనవంతులను, అధికారులను ఆశ్రయించి నిరంతరమూ వారి సేవలో కాలంగడిపి జీవితాన్నివృధాపరచు కొంటారు చాలామంది. అటువంటి వారిని సేవించటమంటే, ఈ భూలోకంలోనే నరకాన్నిచూడటమే! దానికన్నా నరకమే మేలు. రాజులు ఇచ్చే మణి , మాణిక్యాలు, మడులు, మాన్యాలు, ఆభరణాలు, వాహనాలు— ఇవన్నీ కూడా దు:ఖానికి కారణ భూతులు. దు:ఖం కలగటానికి అంకురాలు. ఎందుకంటే, కోరికలకు అంతం అనేది వుండదు. ఈ సేవలన్నిటినీ భోగాలాలసల కోసం ధూర్జటి చేసినవే. ఆ భోగాలవల్ల దు:ఖాన్నే చివరకు పొందాడు. ఆ అనుభవం చేత శ్రీకాళహస్తీశ్వరుని ఇలా ప్రార్ధిస్తున్నాడు. ” స్వామీ! నీ మీద భక్తితో, అనురక్తితో తృప్తి పడతాను. ఇకనైనా నన్ను ఆత్మజ్ఞానమనే అసలైన లక్ష్మీకటాక్షంతో కరుణించు!”

09)నీ పై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్ వ్రాసి యి
మ్మా పాఠం బొనరింతునన్న యతడున్ మంజు ప్రబంధ ని
ష్టాపూర్తిం బఠియించుచున్న యతడున్ సద్బాంధవుల్ గాక ఛీ
ఛీ పృష్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం–వందల పేజీల చెత్త నవలలు వ్రాయటం కన్నా ఆణిముత్యం లాంటి ఒక చక్కని మాట వ్రాయటం మేలు. అటువంటి జనహిత పదాలను, పద్యాలను వ్రాసిన వారే గొప్ప కవులు, రచయితలు. అదే ఈశ్వరార్చన కూడా!పోతన గారి కవిత్వం భక్తి రస ప్రధానమైనప్పటికీ, భాగవతంలో ఎన్నో తెలుసుకోదగ్గ నీతివాక్యాలు వున్నాయి. అన్నమయ్య, త్యాగయ్య లాంటి వారెందరో ప్రతి పదాన్ని దైవ స్మరణతో పాటను చేసారు. నేటికి కూడా తెలుగువారు వాటిని నిత్యం మననం చేసుకుంటున్నారు. డబ్బు కోసం కావ్యాలు వ్రాస్తారు కొంతమంది. మరి కొంతమంది కీర్తి కోసం వ్రాస్తుంటారు. ఒక లక్ష్యం లేకుండా వ్రాసే అటువంటి సాహిత్యం కాలగర్భంలో కలసిపోయేదే!ఆ రచయితలను కూడా ప్రజలు ఆమోదించరు. ధూర్జటి మహాకవి కావ్యరచనలో దిట్ట. కవుల తత్త్వం ఎరిగినవాడు. చాలామంది రాజాశ్రయం కోసం, రాజుల ప్రీతి కోసం వ్రాసిన వారే!తంజావూరును పరిపాలించిన నాయకరాజుల కాలంలో తుచ్ఛమైన తెలుగు సాహిత్యం వచ్చింది. ఆ రాజులు పచ్చిశృంగార ప్రియులు. వారి ప్రీతి కోసం, అలనాటి చాలామంది కవులు తుచ్ఛశృంగార సాహిత్యాన్ని వ్రాసారు. తంజావూరు సామ్రాజ్యం పతనమైంది. అలానే, ఆ కవులు పతనమైనారు. కవిగా విశేష అనుభవం గడించిన ధూర్జటికి , ఏ కావ్యాలు వ్రాస్తే కవికి తృప్తి నిస్తాయో తెలిసింది. అందుకనే ఇలా అంటున్నాడు–శ్రీకాళహస్తీశ్వరుని గురించి కావ్యాలు వ్రాసే కవులు, వాటిని అడిగి తీసుకొని చదివేవారు , అతి మనోహరమైన ప్రబంధాలను మనసునింపి చదివేవారు–వీరే ధూర్జటికి(మనకు కూడా) నిజమైన బంధువులు. అంతేగానీ, జన్మత: వచ్చిన బాంధవ్యాలు నిజమైన బాంధవ్యాలు కావు.

10)నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపుమోకాలొ స్త్రీ
చన్నోకుంచమో మేకపెంటియొ యీ సందేహము ల్మాన్పి నా
కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే
చిన్నీరేజ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం-అర్ధం చెప్పేముందు, ఈ పద్యంలోని కొన్ని విశేష(ణ)ములను గురించి చిన్నవివరణ ఇవ్వాలి. ఒక సందర్భంలో గీతాచార్యుడైన శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడితో ఇలా అన్నాడు. “అర్జునా!భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు ప్రత్యేకంగా గుడికిపోయి పూజలు చేయవలసిన పని ఏముంది?”అని ప్రశ్నిస్తాడు. అందుకు అర్జునుడు, “దేవదేవా! నీవే నాకు గురుడవు, దైవం, ఆరాధ్యుడవు. నీవు ఎక్కడ ధ్యానించమంటే అక్కడే ధ్యానం చేస్తాను. “అని చెప్పాడు. అప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడికి తన మొకాలిచిప్పను చూపించి, అది శివలింగం ఆకారంలో వుంది కనుక, దానినే శివలింగంగా భావించి ధ్యానించమన్నాడు. అర్జునుడు అలానే కృష్ణపరమాత్ముని మోకాలిని శివలింగంగా భావించి అర్చించాడు. ఇక్కడ మొదట చెప్పు కోవలసినది, శివకేశవులకు బేధం లేదని. రెండవ విశేషణం ఏమంటే సర్వచరాచర జగత్తును నడిపించే భగవంతుడికి ఒక ప్రత్యేకమైన రూపం ఆపాదించటం ఒట్టి భ్రమ!అలాగే, పూర్వం నందివర్ధన మహారాజనే గొప్ప శివభక్తుడుండే వాడు. అతను వేశ్యాలోలుడు. కార్తీక సోమవారం ముందునాటి రాత్రంతా వేశ్యా సంపర్కంతో కాలం గడిపాడు. శివార్చన సమయమైంది. అప్పుడు మహారాజుకు శివార్చన సమయం గుర్తుకొచ్చి, ఆ మందిరంలోని అన్ని ప్రదేశాలలో శివలింగం కోసం లేక అటువంటి ఆకృతి కలిగిన మరో రూపం కోసం పరితపిస్తూ వెదుకుతాడు. ఎక్కడా అటువంటి రూపం కనపడలేదు. అట్టి సమయంలో దీర్ఘ నిద్రలో ఉన్న వేశ్య యొక్క పమిట కొంగు, రవిక తొలగివుంది. ఆ వేశ్య కుచమును పానవట్టముగా, చనుమొనను శివలింగంగా భావించి అర్చించాడు. ఆ మహారాజు భక్తికి సంతోషించి, ఈశ్వరుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట అనే గ్రామంలో ‘చంటేశ్వరుడిగా’ వెలిసాడని ప్రతీతి. చంటేశ్వరుడి పేరు మీదనే ఆ గ్రామానికి ‘ఆచంట’ అనే పేరు వచ్చింది. ఆచంట ప్రక్కనే ఉన్న పాలకొల్లులో, పెనుగొండలో నేను కొంతకాలం పనిచేసాను. ఆ సందర్భంలో ఆ దేవాలయాన్ని చూసాను. అక్కడ శివలింగం చనుమొన ఆకారంలో వుంటుంది. ఇక్కడ విశేషమేమంటే, భక్తికి భావన, భావం ముఖ్యం. ఆడంబరంగా పూజా మందిరాలు ఏర్పాటు చేసుకొని, భక్తి లేకుండా చేసే పూజలవల్ల ప్రయోజనమేమీ వుండదు. ఈ రోజుల్లో భక్తిని ఆలంకరరణలు, ఆడంబరాలతో ఒక స్టేటస్ సింబల్ గా మార్చారు కొందరు డంబాచారులు. ఏ రూపాన్నైనా ఈశ్వర రూపంగా భావించి పూజించే వారికి శివుడు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాడు. పూర్వం ఒక వర్తకుడు తనకు వ్యాపారంలో లాభాలు రావటం లేదని బాధతో , విరక్తితో, ‘కుంచెమును'(ధాన్యాన్ని కొలిచే సాధనం) శివలింగంగా భావించి పూజించాడు. శివుడు, అతని భక్తికి సంతసిల్లి ‘కుంచేశ్వరుడిగా’ ఒక క్షేత్రంలో వెలిసాడంటారు. పూర్వం ఒక యాదవ బాలుడు , తనకు పూజించటానికి శివలింగం దొరకలేదని దు:ఖిస్తూ వున్నాడు. ఆ దారినే పోతున్నఒక మహానుభావుడు ఆ బాలునికి మేకపెంటికను చూపించి, దానినే శివలింగం అని ఆ బాలునికి చెప్పాడు. ఆ బాలుడు ఆ మేకపెంటికను శివలింగంగా భావించి పూజించాడు. ఆ బాలుని భక్తికి మెచ్చిన భక్తవశంకరుడు ‘కాటేశ్వరుడిగా’ మరో పుణ్యక్షేత్రంలో వెలిసాడట. ఈ పైన చెప్పిన గాధలన్నిటి పరమార్ధం ఒక్కటే!భక్తికి భావనే ముఖ్యం. రూపం ముఖ్యం కాదు. పానవట్టం, శివలింగం- ప్రకృతి పురుషుల సంయోగానికి సంకేతమే!ఇక పద్యం యొక్క అర్ధానికి వస్తే, ఈశ్వరుడు భక్తుల హృదయకమలాలలోని మకరందాన్ని గ్రోలే భ్రమరం లాంటివాడు. నిర్గుణుడు, నిరాకారుడైన శివుడు అనంతకోటి రూపాలలో కూడా దర్శనమిస్తాడు, మనం భావిస్తే! కొందరు ఆయన రూపం మోకాలిచిప్పగా భావించారు, మరికొందరు స్త్రీ వక్షోజంగా భావించారు, ఇంకొందరు కుంచెముగా, మేకపెంటికగా భావించి భక్తితో పూజించి మోక్షాన్ని పొందారు. ఇన్ని రూపాలలో కనిపించిన ఆ సర్వేశ్వరుడికి అసలు రూపం ఉందా?ఉంటే ఏ రూపంలో ఉంటాడు? ఈ అయోమయంలో అందరిలాగే ధూర్జటి కూడా పడి ఈశ్వరుని అసలు రూపంకోసం అన్వేషిస్తున్నాడు. సత్యం, శివం, సుందరం అయిన ఆ రూపాతీతుడి రూపం కోసం అన్వేషణలో ధూర్జటి వ్రాసిన అతి మధురమైన పద్యమిది. నిరంతరాన్వేషణలోనే సత్యాన్ని (భగవంతుడిని)గుర్తించగలం. ఆ అన్వేషణలో శ్రీకాళహస్తీశ్వరుడిని ఇలా ప్రార్ధిస్తున్నాడు ధూర్జటి–ఎన్నో రూపాలను ధరించే నీకు ఒక రూపం ఉందా? ఉంటే అది ఎలా ఉంటుంది?నా సందేహాలను, భ్రమలను పటాపంచలు చేసి, సుందరమైన నీ సగుణాకారాన్ని చూసే భాగ్యం ప్రసాదించు తండ్రీ!

11) దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేన చరించునప్పుడె కురుల్వెల్వెల్లగానప్పుడే
చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా

అర్ధం-యవ్వనంలో శక్తిసామార్ధ్యాలు ఉన్నప్పుడే అన్ని కార్యాలను పట్టుదలతో ఎలా సాధిస్తామో, అలానే భక్తి మార్గంలో కూడా పట్టు సాధించాలి. అంతే కానీ, మృత్యు భయంచేత భగవంతుని ఆఖరి క్షణంలో ధ్యానించటం కేవలం, మృత్యువు నుండి తప్పించుకోవాలని చూడటమే!అట్టివారు మృత్యువునుండి తప్పించుకోలేరు సరికదా, ప్రతిక్షణం మరణిస్తుంటారు. జీవించటం తెలిసిన వాడికి మరణమంటే భయం వుండదు. జీవించటమంటే, అన్ని జీవులలో దైవాన్ని చూడటమే! పరోపకార బుద్ధితో చరించటం. అలా జీవించని వారు, జీవించినా మరణించిన వారితో సమానం. ఎందుకంటే, వారు జీవించినా, మరణించినా ఒకటే!దంతాలు ఊడనప్పుడే, దేహదారుఢ్యం తగ్గక ముందే, వికారపు రూపాన్ని చూసి స్త్రీలు అసహ్యించుకోక ముందే, వృద్ధాప్యం దరి చేరక ముందే, జుట్టు తెల్లబడకముందే, భక్తితో ఈశ్వరుడిని ధ్యానించాలి, అని ధూర్జటి మహాకవి తన అనుభవసారమంతా నింపి, ముందు తరాలకు మార్గదర్శకంగాఈ పద్యాన్ని అతిమనోహరంగా, నీతిదాయకంగా చెప్పాడు. ఇది శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఆఖరి పద్యం.

మిత్రులు చాలామంది కార్తీకమాసం సందర్భంలో కనీసం పది పద్యాలకైనా భావార్ధాలను వ్రాయమని ప్రేమతో కోరారు. . మొదటి పద్యం వ్రాసిన తరువాత అనేకమంది, శతకం మొత్తానికి భావార్ధాలను వ్రాయమని కోరారు. పదకొండు పద్యాలకు భావార్ధాలను వ్రాసాను. ఈ కార్తీక మాసంలో శివమహాదేవునికి నేను చేసిన మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇదే!శివానుగ్రహం వుంటే, వీలైనప్పుడు మిగిలిన పద్యాలకు భావార్ధాలను వ్రాయటానికి ప్రయత్నిస్తాను. మరికొంతమంది మిత్రులు వీటిని గ్రంధ రూపంలో తెమ్మని కోరారు. ఎంతో ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో అనుక్షణం నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు కృతజ్ఞతలు. ఈ సందర్భంలో నాదొక చిన్న మనవి. మంచి సాహిత్యాన్ని చదవండి, చదివించండి. అప్పుడే మనలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. తెలుగు భాషలోని తియ్యదనాన్ని ఆస్వాదించండి. తెలుగులో వ్రాయటానికి ప్రయత్నించండి.

శుభం భూయాత్!

15 thoughts on “శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి పదకొండు పద్యాలు

 1. నేడు శివరాత్రి నాడు మహా కవి దుర్జటి వారి పద్యాలు చదవడం ఆ పరమ శివుని అనుగ్రహం గా భావిస్తున్నాను…
  ప్రతి పద్యానికి మీరు ఇచ్చిన తాత్పర్య విశ్లేషణ అత్యద్భుతం
  మనసుకి ఎంతో ఆనందం కలిగించినందుకు ధన్యవాదములు

 2. అరటిపండును ఒలిచి చేతిలో పెట్టినట్లుందండీ!

 3. అన్ని పద్యాలకు వ్యాఖ్యానం ఎప్పుడు వ్రాస్తారు?

  1. ఎంతోమేలుకరము. అర్ధంతెలిసింతరువాతచదివితేఇంకా ఆనందంగాఉంటుంది, పద్యాలరుచి తెలుస్తుంది ఇంకాచదవాలి ఇటువంటిపద్యాలు అనిపిస్తుంది. నీ ప్రయత్నానికి ,కృషికి అభినందనలు మిత్రమా….వి.యస్.కె.హెచ్.బాబురావు.

 4. మిత్రమా,
  పద్యాలు చదువుతారు అందరూ, తాత్పర్యం లేక ఆపద్యాలకు అర్ధాలు తెలియకఇబ్బందిపడుతుంటారు. చక్కగా తాత్పర్యాన్ని వివరిస్తూ అందరికిఅర్ధంఅయ్యేవిధంగా వివరిస్తున్నావు.ఇదీఒకయఙ్ఞం.చాలమంచిపని.నీవునిరంతరంసాహితీసేద్యంచేస్తూఫలాలనుపంచుతున్నావు.అభినందనీయం.నీసాహితీసేవఇలాగేకొనసాగాలని ఎన్నో మంచిమంచి విషయాలు,తెలసుకోదగ్గవిషయాలువ్రాస్తూఉండాలనిచదువరులు క్రొత్తవిషయాలు తెలుసుకోవడానికిఉత్కంఠతో ఎదురుచూస్తూఆనందిస్తారని నీ తరువాతి రచన కోసంనేను ఎదురుచూస్తూ,,
  ధన్యవాదాలు.

 5. ధూర్జటి విరచిత శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని కొన్ని పద్యాలు అర్ధతాత్పర్య పూర్వకం వివరించడం చాలా ముదావహం. నిగూఢమైన పారమార్థిక విషయాన్ని మీకున్న పరిజ్ఞానాన్ని జోడించి వివరించడం బావుంది. మీరు సదా అభినందనీయులు, ధన్యులు.

 6. I agree with Narasimha Murthy garu.
  Sarada Prasad garu, hats off to you for translating the poems in a very simple understandable Telugu. Thank you Sir.

 7. అత్యంత ఆసక్తికరంగా ప్రతి పద్యాన్ని అరటిపండు ఒలిచినట్టుగా విడమరిచి భావాన్ని మనసులో నాటుకు పోయేటట్టుగా , లౌకిక ప్రపంచంలో విహరిస్తూ ఏది తప్పో, ఒప్పో తెలియక సతమవుతున్న జనావళికి సరియన రీతిలో మేల్కొలుపు ఈ పద్యాలు అని నేననుకుంటున్నాను.ఇంత చక్కగా , కాస్తంత వ్యావహారిక జ్ఞానాన్ని కూడా జోడించి పాఠకులకు అందించిన మీ కృషి సరదా శ్లాఘనీయం. మీకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *