March 29, 2024

గిలకమ్మ కతలు – అద్దీ.. లెక్క! కుదిరిందా.. తిక్క?

రచన: కన్నెగంటి అనసూయ

మజ్జానం బడి వదిలే ఏలయ్యింది. పొద్దున్ననగా పెరుగన్నం తినెల్లినోళ్ళు ఆకలితో నకనకలాడతా ఇంటికొత్తారని.., ఆళ్లకి అన్నాలు పెట్టి తను తినొచ్చులే అని పనంతా అయ్యాకా నీళ్ళోసుకుని ఈధి తలుపులు దగ్గరకేసి వసారా మీద గోడకి నిలబెట్టున్న నులక మంచాన్ని వాల్చి దుప్పటీ, తలగడీ లేకుండా ఆమట్నే ఇలా నడుం వాల్సిందో లేదో సేస్సేసున్న ఒల్లేవో..ఇట్టే కునుకట్తేసింది సరోజ్నికి.
అంతలోనే తలుపు మీదెవరో “మేడంగారా..మేడంగారా..” అంటా సేత్తో కొట్టిన సప్పుడై సటుక్కున లేసి కూకుంది సరోజ్ని.
“ ఇయ్యాల్టప్పుడు ఎవురొచ్చేరో..? పైగా మేడంగారంటన్నారు సిత్రంగాను. నన్నెవరు పిలుత్తారలాగ?” మనసులోనే నవ్వుకుంటా తలుపుదీసిందేవో..ఎదురుగ్గా గంగాజలం మేస్టారు..
ఆవిడ్ని సూసి తెల్లబోయింది సరోజ్ని. అలా తెల్లబోతానే..”ఇయ్యాల్టప్పుడు ఈవిడొచ్చిందేటి? ఈ గిలకమ్మకసలే కుదురు తక్కువ. కొంపదీసి ఎవర్నన్నా..పడేసి తొక్కెసిందా ఏటి బళ్ళోను. గొడవెట్టుకుంటాకొచ్చిందేవో..? “ అని మనసులో అనుకుంటా ..
” ఈల్లొత్తారేవోనని సూత్తన్నానండి..అంతుకే తలుపులు దగ్గిరికి జేరేసేను. బళ్లోంచే వత్తన్నారేవో? మంచి నీళ్లిచ్చుకుంటారా? ?” నవ్వుతూనే మరియాదగా అడిగింది సరోజ్ని..కుచ్చీలో కూచ్చోమన్నట్టుగా దాన్ని బర్రున గంగాజలం మేస్టారి ముందుకి తోత్తా..
గంగాజలం మేస్టారిది ఆ ఊరే. అక్కడే పుట్టి పెరిగేరు కూడాను. సెకండరీ గ్రేడూ ట్రయినింగయ్యి ఇక్కడే మేస్టారుగా సేరేరు. అంతుకే సూడగానే గుర్తుపట్తేసింది..సరోజ్నీ.
బళ్లో గిలక ఆవిడ కళాసే. కానీ ఈ కుదురు తక్కువ ముండ కూకుంటే గదా ఆవిద కళాసులోను.. ఆలోసిత్తానే గంగాజలంగఆర్ని గమనిత్తందేవో..
“వద్దండి. బళ్ళోంచే గదండీ వత్తన్నాను. ఇంటికెల్లేకా తాగుతాను గానీండీ..మీతో ఓ మాట సెప్పాలని ఇంకా బడి ఇడిసి పెట్టక ముందే ఇటొచ్చేనండి..బడి ఇడిసిపెడితే పిల్లలొచ్చేత్తారని మా హెడ్డు మాస్టరుగార్నడిగి ఒకడుగు ముందొచ్చేనండి..ఇదీ కారణవని సెప్పేతలికి ఆరూ ఒప్పుకున్నారండి..”
సరోజ్ని గుండెల్లో ఈశడు తూకం రాయడింది అదిని. ఆలోసిత్తానే వద్దన్నా మంచినీల్లు తెచ్చిఛింది.
“పోన్లే .. తెచ్చిచ్చేరు గదాని” అవసరం లేపోయినా నాల్గయిదు గుటకలేసి మిగతా నీళ్ళు అక్కడే ఉన్న కొబ్బరి సెట్టు మొదట్లో పోసి..ఎనక్కొచ్చి గళాసు కిందెట్టి కుర్సీలో కూకుంటా..
“ మరేమో..మీ పాప మా క్లాసేగదండీ..” అంటా మొదలెట్టింది గంగాజలం.
నవ్వుతా తలూపింది అవునన్నట్టు సరోజ్నీ.
“ నా క్లాసైనా ..మీ పాపెప్పుడూ నా క్లాసులో కూకోదండి. మరదేటో గానీ నాకూ అర్ధమై సావదండి. ఎప్పుడూ ఆ లచ్చిం మేస్టారి క్లాసులోనే కూకుంటాదండి. పక్క రూమే అయ్యే తలికి ..మా క్లాసులోంచి బేటికొచ్చి ఆల్ల క్లాసులోకి కిటికీలోంచి వచ్చిందో లేదోనని ఓసారి తొంగి సూసి ఆజరు ఏసుకుంటానండి. రోజూ అంతేనండి. ఎన్ని సార్లు అడిగినా వచ్చి కూకోదండి. లచ్చిం మేస్టారు కూడా సాలాసార్లు సెప్పేరండి. అయినా రాదండి. కడాకరుకి హెడ్డు మాస్టరుగారు కూడా సెప్పేరండి. బెయపెట్తేరు గూడానండీ గోడ కుచ్చీ ఏయిత్తానని. అయినా ఇన్లేదండి..“ కించిత్తు బాధగా, కూతంత స్సిగ్గుగా అంది గంగాజలం.
“ తెలుసండి..కూకుంటాలేదని. అదే సెప్పుద్ది. ఎంతుకే అనడిగితే ఏమ్మాట్తదు. రోజూ అడుగుతానండి ఓమాట బళ్లోంచి రాగానే ఎక్కడ కూకున్నావే అని. నదురూ బెదురూ లేకుండా సెప్పేత్తాదండి.
ఇంట్లో ఉంటానండి. దీన్నెలాగ కొంకిలు ఇరగ్గొట్టి మీ కళాసులో కూకోబెట్టాలో తెలుత్తాలేదండి. నేనెల్లనంతే అని తెగేసి సెప్పేత్తాదండి. అదేం పిచ్చోగానీ దానికి లచ్చిం మేస్టారంటే మా ఇదండి. పువ్వు పుయ్యనివ్వదండి. మా లచ్చిం మేస్టారికి అని కోసేసి పట్టుకెల్లి పోద్దండి. ఏదైనా పెట్టినా అంతే. మొన్నామద్దెన..బళ్ళోకి ఎవరో గారడీ వోళ్ళొచ్చేరు. అందరూ తలో పావలా తెచ్చుకోండి ఇళ్లకెల్లి అన్నారంటండి..పరుగూ,పరుగున వచ్చేసి పీకల మీద కూచ్చుందండి..డబ్బులు ఇత్తావా సత్తావా అని. ఇవ్వక సత్తానా అండి. ఇవ్వాపోతే అదో గోల. అంతుకే ఇచ్చేనండి. తీరా అయ్యట్టుకెల్లి తీగల మీద నడుత్తువో ఏదోనంటండి..పక్కింటోల్ల పిల్లోడు సూస్సేడండి. ఆడు సెప్పేడు. ఆ గారడీ ఏదో సూడకుండా సెంటర్లో అమ్ముతున్నారని నవనవ లాడతన్నాయంటండి వంకాయలు. అయ్యి కొనుక్కెల్లి మాయమ్మ మీకిమ్మంది అని ఇచ్చొచ్చిందండి. నాకూ దెలవదండి అలా ఇచ్చినట్టు. సెప్పలేదండి తిడతాననుకుందో ఏవో. మొన్నామజ్జన ఏగోరింట్లో పెళ్ళికొడుకుని జేత్తంటే ఎల్లేవండి..నేనూ ,మా ఇరుగూపొరుగూ. అక్కడ ..ఆల్లందరూ ఉండగా సెప్పిందండి..వంకాయలు ఎంత రుసిగానో ఉన్నాయని గుజ్జల్లే ఉడికిపోయింది కూరని.
ఆ పక్కా ఈ పక్కా ఈల్లున్నారేవో సిగ్గేసేసిందనుకోండి..పోనీ నేనంపితే అలాటిమాటే. నాకే పాపం దెల్వదండి. మొకవట్టికెల్లి ఎక్కడ పెట్తుకోవాలో తెల్వలేదండి. పోనీనమ్మాఅని నేనిచ్చి అంపితే అదో రకం అనుకోండి..నేనివ్వని దానికి నాకెందుకొచ్చిన గొడవ సెప్పండి. అడుగుదావా అంటే సేసిన పని సెడ్డది గాదు. అలా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటం మంచి గుణవే. కాదన్ను. దీనికెలా సెప్పాలో తెలుత్తాలేదండి..” మొత్తుకుంది సరోజ్ని..
“పిల్లలు అలాగే ఉంటారండి..ఎవర్ని ఇష్టపడతారో తెల్వదు…ఇష్టపడ్దారంటే..ఇదిగో ఇలాగే ఉంటాదండి..”
“ అబ్బే ..! ఇది మరీనండ బాబా. ఏది పెట్టినా తినను గూడ తినదండి. అన్నీ దాత్తది. ఎంతుకే దాత్తన్నావ్ అంటే మా లచ్చిం మేస్టారికి అంటాదండి.. దీంతో ఎలా ఏగాలో తెలుత్తాలేదండి.”
నవ్వుకుందా మాటకి గంగాజలం.. మేస్టారు. కాసేపటికి నవ్వాపి..సరోజ్నీ వంక , వాచ్ఛీ వంకా మారిసి మారిసి సూత్తా..
“ఇనస్పెట్టరు గారు వచ్చినప్పుడల్లా…నాకిదో పెద్ద పనైపోయిందండి మీ పాపని బెతిమిలాడ్తం. సిగ్గేత్తంది కూడానండి..” అంది ..మొకవదోలాగ పెట్టుకుంటా..
సరోజ్నీకి సచ్చేంత జాలేసేసింది ఆవిడ్నలా సూసేతలికి.. కోపంగూడా గుప్పున పొగలాగ మొకవంతా పొంగుకొచ్చేసిందేవో..
“నాలుగు సరవాపోయారా ఎదవని.? వచ్చి కూకున్నేవో..” అంది..
“ అయ్యో! సరుత్తుం ఎంతసేపండి. సేతి కొద్దీ లాగి ఈపమ్మటా సరవచ్చు. నాలుగూ పీకొచ్చు. నార పీసు లాగెయ్యొచ్చు కూడానండి. కానీ నేనలా సేత్తే బడి మానేత్తేనో..? మీరు ఊరుకోరు గదండీ..! అదీ రిమార్కేనండి మాకు..సస్పెండు సేసేత్తారండి. ఒకల్లని బళ్ళోకి బల్వంతాన సేర్సలేవండి.అలాటిది ఒకల్లని బడి మానేసేలాగ ఎంతుకండీ సేత్తవని ఊరుకున్నానండి. సరేలే..! తనకి ఎక్కడ ఇట్టం ఉంటే అక్కడే కూకోనిత్తే పోద్దని ఇన్నాల్లూ పట్టిచ్చుకోలేదండి. అయితే ఇనస్పెట్తరు గారొత్తన్నారండి రేపు. ఆరే..సొయంగా ఆజరేత్తారు. ఆ యాలకి ఉంటే సాలండి. ఎన్ని సార్లు సెప్పినా ఇంటం లేదండి. అంతుకే.. మీరు సెప్తేనన్నా,,ఇంటాదేమోనని..మీకు సెబ్దావని వచ్చేనండి..”
ఆ మాటలకి కోపవంతా వడ్లగింజల్లో పొల్లుగింజల్లా తేలిపోగా తెగ నవ్వొచ్చేసి పక పకా నవ్వేసింది సరోజ్ని. గంగాజలం కూడా సరోజ్నితో కలిసి కాసేపు నవ్వేసి..
“మీకలాగే ఉంటాదండి..మామూలు రోజుల్లో అయితే ఎక్కడ కూచ్చున్నా కూచ్చోవచ్చండి. కానీ ఆపీసర్లు ఊరుకోరండి..ఎవళ్ల క్లాసుల్లో ఆళ్ళే కూకోవాలంటారండి. అలా కూకోబెట్టాపోతే మా మీద రాసేత్తారండి పై ఆపీసర్లకి..అంతుకే పరిగెత్తుకొచ్చేనండి..బాబ్బాబూ ఎలాగైనా రేపొక్క పూట నా కళాసులో కూచ్చోమని సెప్తే..నా నెత్తిన గుండిగుడు పాలు గుమ్మరిచ్చినట్తండి..” బతిమాలినంత పన్జేసింది గంగాజలం మేస్టారు..
అయ్యన్ని ఏదో గుత్తొచ్చి నవ్వాపుకోలేకపోయింది..సరోజ్ని. నవ్వీ నవ్వీ..
“ సిన్నప్పట్నించీ అదంతేనండి మేస్టారా? ఒట్టి మొండిగటవండి. అది ఏది తినాలనుకుంటే అదే తింటాదండి. దానికిట్టం లేపోతే మనవెంత సెప్పినా దాన్నోరు ఇప్పిచ్చలేవండి. గుడ్దలైనా అంతే. దానికి నచ్చినియ్యే కొనాలండి. నచ్చాపోతే ఎంత కొత్తదైనా, ఇస్త్రీదైనా కట్టదండి. ఇట్తం ఉన్న గౌనైతే సిరిగిపోయినా, ఎలిసిపోయినా అదే కడద్దండి మల్లీ మల్లీని. ”
“బళ్ళోనూ అంతేనండి..సెప్పిన పని నచ్చితే అందరికంటే ముందే రాసి అక్కడ పెట్టేత్తాదంటండి. నచ్చాపోతే పుస్తకం అట్త కూడా తెరవదంటండి లచ్చిం మేస్టారే సెప్పేరండి..నేనావిడికి సెప్పాల్సింది ఆవిడి నాకు సెప్తారండి. సిగ్గేత్తాదనుకొండి..”
“మరంతేగదండీ పాపం. పెద్ద సావే వొచ్చి పడిందండి..అలాగైతే దీంతో మీకు..”
“ మామూలప్పుడైతే ..నేనిలా రాపోదునండి. ఇనస్పెట్టర్ గారొత్తన్నారుగదండీ..! ఆయనేదన్నా అంటే నాకు నా మర్ధా అండి మా తోటి మేస్టారుల్లో..! లక్ష్మిం మేస్టార్ని అడుగుతాకి నామోసి ఏసి మీ దగ్గరకొచ్చేనండి..” ఒకింత సిగ్గు సిగ్గుగా అన్న గంగాజలం మాటలకి జాలేసింది సరోజ్నికి.
“వద్దులెండి. అలాగైతే నేనే సెప్తానుండండి ఎదవకి. అయినా ఎవరి కళాసులో ఆళ్ళు కూకోవాలిగానండి..పేరో కళాసులోనూను, కూచ్చునేది ఒక కళాసులోనూనా..? అదెలాక్కుదురుద్ది ఏసాలు కాపోతేని ఏసాలు!
దీనికి బళ్ళో ఏసేతలికి ఆడింది ఆటగానూనూ, పాడింది పాటగానూ ఉంది. దీనికి సాగుతుందలాగ. మీరెల్లండి. ఏవనుకోబాకండి. మళ్ళీ వణ్నం తిని బళ్ళోకి ఎల్లాలిగదండీ..! బాధపడకండి మేస్టరుగారా? నేను సెప్తాగదండీ దానికి. “
అన్న సరోజ్ని మాటల్తో..కూతంత ధైర్నం రాగా మరి కాసేపు ఆమాటా ఈమాటా మాట్టాడి..ఇంటిదారి పట్టింది.. గంగాజలం మేస్టారు బొట్టెట్టి అరటి పళ్లత్తం కవరందించిన సరోజ్నికేసి ప్రేమగా సూత్తా..
గంగాజలం మేస్టార్ని అటంపి పొయ్యలో రెండు పిడకలలేసి ఆటి మద్దెన సన్నని గోగుపుల్ల ముక్కల్ని ఒడుపుగా దూరిపి అగ్గిపుల్ల గీసిందేవో..మెల్లగా మంటా..పొగా మొదలై ఇల్లంతా అలుముకుంటుండగా వచ్చింది గిలక..ముక్కు మూసుకుని మెల్లగా ఒక్కో అడుగూ ఏత్తా..
“ ఏటే ..అమ్మా..ఇప్పుడీ పొగెట్టేవేటి? దగ్గొచ్చేత్తందే..”
“ వత్తే రానియ్..నీకు దగ్గొత్తే నాకెటి. కాళ్ళుకడుక్కురా అన్నం పెడతాను. “
అమ్మెనక్కి తెల్లబోతా సూసింది గిలక ఆ మాటకి. అమ్మెప్పుడూ అలా మాట్తాడగా సూళ్ళేదేవో ..ఆచెర్యంగా ఉంది గిలక్కి.. అలా ఆచ్చెరపోతానే..తల్లెనక్కి సూత్తా..
“నాకన్నం వద్దు . నేంతిన్ను. “ బెదిరిచ్చింది గిలక.
“ అయితే ఇంతికాడెంతుకు బళ్లోకి పో..అన్నం తినన్దానివి ఇంటికెంతుకొచ్చా..” లొంగలేదు సరోజ్ని.
పిచ్చెక్కినట్టు అయిపోయింది గిలక్కి తల్లలా ఎక్కడికక్కడ విరదీసి మాట్తాడేసేసరికి..
అంతా గమనిత్తానే ఉంది సరోజ్ని. అయినా ఏ మాత్తరం ఎనక్కి తగ్గక..అప్పుడప్పుడే పొగ తగ్గి బాగా ఎర్రబడ్ద పిడకల పొయ్యి మీద మంగళాన్నెట్టి మినువుల మూఠకాడికెల్లింది ఇనపజల్లెడదీస్కోని..
“ ఇయ్యేలప్పుడెంతుకు పొయ్యంటిచ్చేవ్ ? “ అంది దగ్గుతానే..తల్లెనకమాలే ఎల్తా..
“ ఎంతుకా..? మినువులు ఏపుదావని..సున్నుండలు సెయ్యాలి గదా. తమ్ముడికి ఇట్టం.
“ ఆడికొక్కడికేనా? మరి నాకో? నాకూ ఇట్తవే గదా అయ్యంటేనీ?”
“ నీకిట్తం అయితే నాకేంటంట? ఆడంటే నాకిట్తం. ఆడికోసం సేత్తన్నాను. .”
“ నేన్నీకే పుట్తేను గదేటే అమ్మా..! “ ఆ మాటతో ఉక్రోషం తన్నుకుంటా రాగా పుస్తకాల సంచీ అక్కడ పడేసి సన్నగా ఏడుత్తా..సరోజ్నీ ఈపు మీద గుద్దుతుం మొదలెట్టింది.. సన్నగా ఏడుత్తా..
“పుడితే పెట్టాలని ఎక్కడైనా ఉందా అంట..?” అంది సరోజ్ని బింకంగా ..
“పుట్తేను గాబట్టి పెట్టాలి..అందరూ అలాగే పెడతన్నారు..” వెనగ్గా వచ్చి సరోజ్ని మెడ సుట్టూ సేతులేసేసింది గిలక.
అయినా తగ్గలేదు సరోజ్నీ.. మంగలం;లో మినువులు ఏపుతానే…
“ఊహూ..! అలాగా! ఎవరికి పుడితే ఆల్లే పెట్టాలా..? అలాగైతే ..ఏ బళ్లో ఏత్తే ఆ బళ్లోకే ఎల్లాలి గూడానా? నాకు తెలవదే..?
అమాయకంగా నిజంగానే తెలవదన్నట్టు అన్న తల్లికేసి సూత్తా..
‘’ మరెల్లకుండా..ఒక బల్లో ఏత్తే ఇంకో బల్లోకి ఎల్తారా ఎవరన్నాను..?” ఎటకారంగా అంది గిలక..
“ ఒక్క కళాసులో ఏత్తే ఇంకో కళాసులో కూకుంటాలేదా నువ్వు? అంతుకని అలాగడిగేను..”
ఏమ్మాట్తాడకుండా గమ్మునుండిపోయింది గిలక. సరోజ్నీ మెడ సుట్టూ సేతులు తీసేసి..దొంగలాగా అక్కడ్నించి జారుకోబోతుంటే..ఎనకనించి సరోజ్నంది..
“ ఏ కళాసులో పేరుంటే ఆ కళాసులో కూకోకుండా ఎవరికిట్తమైన కళాసుల్లో ఆల్లే కూకుంటే తల్లైనా పుట్తిన అందరికీ పెట్టాలనేవీ లేదు. ఇట్టవైనవోల్లకే పెట్టుకోవచ్చు..”
అంటా తనకి అన్నం పెట్టటానికి ఏ మాత్రం లెగని తల్లిని తెల్లబోతా సూత్తా..కాళ్లు కడుక్కుంటాకి తూములోకెల్లిన కూతుర్ని వోరకంత సూసింది సరోజ్ని.
మర్నాడు…
జడల్రెండూ ఇంతెత్తున ఎగిరెగిరి పడేట్టుగా గంతులేసుకుంటూ బళ్లోంచి ఇంటికొచ్చిన గిలకమ్మ..
“ అమ్మా..ముందు సున్నుండలెట్టు.తర్వాతే అన్నం..తింటా..”
పిల్లోడి చొక్కాకి గుండీ ఊడిపోతే కుట్తటానికి ముందేసుకుని కూర్చుని సూదిలోకి దారం ఎక్కిస్తున్న సరోజ్నీ మూతి భిఢాయించుకుని కూర్చుందే తప్ప నోరు విప్పలేదు.
దాంతో దగ్గరకంటా వచ్చిన గిలకమ్మ తల్లి చేతిలోని చొక్కా దూరంగా బల్ల మీదకి విసిరేసి..తల్లి ఒళ్లో దూరిపోతూ..
“ అమ్మా..! మరే ఇయ్యాల మా బళ్ళోకి ఇనస్పెట్తరు గారొచ్చేరు. నన్ను గుడ్ అన్నారు. అందరికంటే ముందు రాసేసేనని. లచ్చిం మేస్టారి క్లాసులో ఎంత బాగా రాసినా మెచ్చుకునీవోరు కాదమ్మా.!
అంతుకే..నేనీ క్లాసులోనే కూకుంటా. అక్కడికెల్లను..” సేతులు తిప్పుతా వసపోసిన పిట్టలా సెప్పుకు పోతున్న కూతుర్ని సూత్తందే గానీ సరోజ్నీ..గంగాజలమ్మేస్టారే మనసులో మెదుల్తుంటే వంగుని కూతుర్ని నుదుట్న “ఉవ్వా.” అంటా ఇంత పొడుగున ముద్దెట్టింది.

3 thoughts on “గిలకమ్మ కతలు – అద్దీ.. లెక్క! కుదిరిందా.. తిక్క?

  1. సరోజినే కరష్ట్ గిలకమ్మకు. భలే కిటుకు ఏసింది సరోజిని. చాలా నచ్చింది కధ

Leave a Reply to పద్మజ యలమంచిలి Cancel reply

Your email address will not be published. Required fields are marked *