March 29, 2024

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

విశ్వవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కాని రాను రాను వాడేవాళ్లు తగ్గి భాష ఎక్కడ అంతరించిపోతుందోనన్న భయం కొంతమందికి లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునేమో అనిపిస్తుంది కూడా. ఇంత అందమైన మన మాతృభాష అంతరించకుండా ఉండాలంటే ఒక తరం నుండి ఇంకొక తరానికి అది అందించబడాలి. మన తెలుగులో చాటువులు అని ఉన్నాయి. వాటికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అసలు చాటువంటే ఏమిటి? కవులైన వారు కొన్ని కొన్ని సందర్భాలలో స్పందించి అప్పటికప్పుడు చెప్పిన పద్యాలే చాటువులుగా నిలచిపోయాయి. శ్రీనాథుని చాటువులకు మంచి పేరున్నది. పలనాటి సీమకు వెళ్లినపుడు అక్కడి పరిస్థితిని గమనించి కింది పద్యాలు చెప్పాడట.

చిన్ని చిన్ని రాళ్లు చిల్లర దేవుళ్లు
నాగులేటి నీళ్లు నాపరాళ్లు
సజ్జజొన్నకూళ్లు సర్పంబులును తేళ్లు
పలనాటిసీమయే పల్లెటూళ్లు

అలాగే

రసికుడు పోవడు పలనా
డెసగంగా రంభయైన ఏకులు వడకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన దొన్న కూడే గుడుచున్

జొన్నకలి జొన్నయంబలి
జొన్నన్నము జొన్నప్సరు జొన్నలెదప్పన్
సన్నన్నము సున్నజుమీ
పన్నుగ పలనాటిసీమ ప్రాంతమునందున్
ఇంకా ఆయనవి చాలానే ఉన్నాయి.
కుల్లాయుంచితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రాగితిన్, రుచుల దోసంబంచు బోనాడితిన్
దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాధుడన్!

అలాగే

“దీనారటంకాలదీర్థమాడించితి”
“చిన్నారి పొన్నారి చిరుతకూకటినాడు”

వంటి రసవత్తరమైన పద్యాలు చాటువులుగా తెలుగు భాషను జీవద్భాషగా చేస్తున్నాయి. ఆనాటి చరిత్ర తెలుసుకోవడానికి ఇలాంటి మరెందరి చాటువులో మనకు సాహిత్య చరిత్రలో దర్శనమిస్తాయి.
ఆంధ్రభోజుడుగా పిలువబడ్డ శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజాలుగా పేర్కొనబడే కవులలో
తెనాలి రామకృష్ణ కవి ఒకరు. ఈయన చాటువులు కూడా చాలా ప్రసిద్ధి గాంచినవే.
మేకకు మేకమేక మెకమేకకుతోకకు మేక మేక అనే పద్యం
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
అన్న పద్యానికి రాజుగారి వద్ద ఒకరకంగా, సేవకుని వద్ద ఒకరకంగా చెప్పిన చాటువులు కవుల చతురతకు నిదర్శనాలు.
అలాగే అల్లసాని పెద్దన
నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ప్రసిద్ధమైన చాటువు. అప్పట్లో కవులు ఎంతటి వైభవాలు పొందారో తెలిపే పద్యం. ఇంకా అనేక మందివి అనేక చాటువులున్నాయి. ఇవి చాటువుల ఉదాహరణలు మాత్రమే

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్న మాట చాలాసార్లు విని ఉంటాం. సంస్కృతంలో కాళిదాసు రచించిన ‘శాకుంతలం’ గొప్ప రచనగా పేరు పొందిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఇవన్నీ మనకు కాస్తో కూస్తో సాహిత్య పరిజ్ఞానం ఏర్పడ్డ తరువాత తెలిసిన విషయాలు. ఒక్కసారి మవందరం మన బాల్యాల్లోకి తొంగి చూసినట్లయితే తప్పకుండా మనం చూసిన నాటకాలు గుర్తుకు వస్తాయి.
పల్లెల్లో చిడతల రామాయణం, సుగ్రీవ విజయం వంటి యక్షగానాలు, చిందు బాగోతం, ఇలా జానపద కళా రూపాలయితే, పట్టణాల్లో, పెద్దపెద్ద గ్రామాల్లో సురభి కంపెనీ వారు గానీ, కొన్ని నాటక సమాజాలు గానీ వేసే హరిశ్చంద్ర, పాండవోద్యోగ విజయం, గయోపాఖ్యానము, చింతామణి, బాలనాగమ్మ, అల్లిరాణి, కనకతార, రంగూన్ రౌడీ, భక్తరామదాసు మధుసేవ వంటి ప్రసిద్ధ నాటకాలు అప్పట్లో విరివిగా ఆడేవారు. ఇప్పటిలా సినిమాలు, టీవీ సీరియళ్లు లేని కాలంలో అవే జనాలకు వినోద కాలక్షేపాలు. ఇదంతా అర్ధశతాబ్ది కిందటి ముచ్చట.
అయితే అప్పుడు ప్రదర్శించబడిన దాదాపు అన్ని నాటకాల్లోనూ పద్యాలుండేవి. ఆ పద్యాలు రాగయుక్తంగా పాడి, హావభావాలతో పాత్రోచితంగా నటిస్తుంటే తెల్లవారుఝాముదాకా నాటకాలు చూచేవాళ్లు. కరంటు కూడా లేని రోజుల్లో దివిటీల వెలుగులో, పెట్రొమాక్స్ లైట్ల వెలుగులో ప్రదర్శించేవారు. అప్పటి నాటకాలు పామరులకు సైతం పద్యాలు నేర్పాయి. పొట్టచీరితే అక్షరమ్ముక్క రానివారు కూడా..

చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి, గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో
ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

అని ఎలుగెత్తి పాడేవారనేది అతిశయోక్తి కాదు గదా!
వీటితో పాటు సందర్భానుసారంగా కీర్తనలు, నృత్యగీతాలు, భజనలు ఇలా నాటక సాహిత్యానికి అప్పట్లో అత్యంత ఆదరణ ఉండేది.

రామదాసు నాటకంలో
‘ఏ తీరుగ నను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా!
నా తరమా భవ సాగరమీదను నళినదళేక్షణ రామా!’
అలాగే
‘సీతాకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా’
‘రామరామ రఘురామ పరాత్పర రావణ సంహర రఘుధీరా’
ఇంకా ఎన్నో రామదాసు రాసిన పద్యాలు అప్పటి ప్రజల వాలుకల మీద నర్తించేవి
చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, చిరుతల రామాయణంలో బుడ్డెన్ ఖాన్ వంటి హాస్య పాత్రలు నాటి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయిన పాత్రలు. వారి సంభాషణలు నాటి కళాస్వాదకులకు కంఠోపాఠాలు.

అత్తగారిచ్చిన అంటునామిడి తోట సుబ్బిశెట్టి పద్యం ఎంతో ప్రసిద్ధం. శోకరసప్రధానమైన హరిశ్చంద్ర నాటకంలో ముఖ్యంగా కాటి సన్నివేశంలో జాషువా పద్యాలకు ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పలేం.

ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

అలాగే ‘ఇచ్చోటనేగదా’, మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ ‘ పద్యాలు కూడా ప్రాచుర్యం పొంగాయి.

రాయబారం పద్యాలు
‘జండాపై కపిరాజు. ’
‘ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను జూచితిన్’
బావా ఎప్పుడు వచ్చితీవు’
పద్యాలు తెలుగు నాటకపద్యాలలో మణిరత్నాలు.
సాహిత్యం ఒక ఎత్తైతే సంగీతం మరొక ఎత్తు. అప్పట్లో పద్యానికి వన్స్ మోర్ అనే విషయం నటుల గాయక పాటవానికి పరీక్షగా ఉండేది.

బాలనాగమ్మలో
‘ఆడుది నవ్వెనా’
అనే పద్యం ఆడవారి అన్ని కోణాలను ఎంతో రమ్యంగా వివరిస్తుంది.
అలాగే కృష్ణ తులాభారంలో ‘మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి’
బహుళ ప్రాచుర్యం పొందిన గీతం.
ఇంకా చెప్పాలంటే చాలనే ఉంది.కానీ నా ఉద్దేశం మిమ్మల్ని ఒకసారి మన తెలుగు నాటక సాహిత్యం వైపు దృష్టి సారించేలా చేయడమే.
నల్లనయ్య నయగారాల నవనవోక్తులు, ’నవఖండ భూమండలాధిప మకుటతట ఘటిత మణి ఘృణి నిరంతర నీరాజిత నిజపాద పంకేరుహుండను’వంటి సుయోధనుని వాక్తటిల్లతలు, ’ధ్వాంతోధ్వాంత ధూమధూమకర జంఝామారుత శిలోచఛయ భిన్న దంభోళినీ’వంటి మాయలఫకీరు ఉరుములవంటి మాటలు, నారదుని వాక్చమత్కృతులు, శకుని కపటపు వంకర మాటలు, సుబ్బిశెట్టి ఎగపోతల బొంగురు గొంతు గరగరలు ఇలా చెప్పుకుపోతే అనేక పాత్రల పాత్రచిత్రణకై తెలుగు కవులు సృజించిన నాటక సాహిత్యం అపారం. తేనెలొలుకు తెలుగు భాష మధురిమకు నాటకసాహిత్యం కూడా ఎంతో తోడ్పడిందనటంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *