March 29, 2024

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద

అతను కళ్ళద్దాలు సవరించుకొని అందులో రసింది దీక్షగా చదివేడు. ఆ పైన పకపకా నవ్వాడు.
కాన్హా అసహనంగా చూస్తూ నిలబడ్డాడు.
“ఏముంది అందులో?”
“ఏముంటుంది? మామూలే. నీకు తనకి ఉన్న అనుబంధానికి వెల లేదట. నువ్వు చేసిన సహాయానికి డబ్బిస్తే నువ్వు బాధపడతావని డబ్బివ్వడం లేదట. ప్రేమకి పర్యవసానం పెళ్లి కాకపోతే ఆమె హృదయంలో మొదటి స్థానం నీదేనట. మనసు నెప్పుడైనా ఒంటరితనం ఆవహించినా, బాధ కల్గినా మొదటిసారి గుర్తు చేసుకునేది నిన్నేనట. ఎప్పుడయినా తన దగ్గరకి రావొచ్చని ఎడ్రసిచ్చింది.” అని చెప్పేడతను.
ఆ మాటలో కొన్ని పదాల అర్ధం నిర్దుష్టంగా తెలీకపోయినా కాన్హా కళ్లు నీటితో చిప్పిల్లేయి.
అతనది చూసి పకపకా నవ్వి “ఏంటి ఏడుస్తున్నావా? ఇవన్నీ నిజమనే నమ్మేస్తున్నావా? మగాడిపట్ల టియర్‌గాస్ ఆడాళ్ళు. చక్కగా ఈ మాటలు చెప్ఫేసి చెక్కేసిందా? సరిగ్గా నాలుగేళ్ల క్రితం నా ప్రియురాలు కూదా ఇలానే చెప్పేసి ఎవణ్ణో కట్టుకుని బాంబే వెళ్ళిపోయింది. నమ్మకు. ఈ దగాకోరు మాటలు నమ్మకు. అంతా ట్రాష్.” అంటూ మళయాళంలో అరుస్తూ ఆ ఉత్తరాన్ని ముక్కలుగా చింపేసి గాలిలో ఎగరేసేడతను.
కాన్హా అతని చర్యకు నిరుత్తుడయి కోపంగా అతని కాలర్‌ను పట్టుకొని కొట్టబోయేడు.
“వద్దు. వాడు పిచ్చోడు. కొట్టకు” ఎవరో పోర్టరు వచ్చి కాన్హా నుండి అతన్నొదిలించేడు.
కాన్హాలో అప్పూడావరించింది చెప్పలేని నిస్పృహ.
ఎప్పుడయినా, ఎన్నడయినా లిఖితని చూడాలనిపిస్తే.. వెళ్ళే దారి పూర్తిగా సమాధి చేయబడించని తెలిసి అతని హృదయం నొక్కేసినట్లయింది.
నిర్లిప్తత ఆవరించిన హృదయంతో అతను మున్నార్ బయల్దేరేడు.
బస్సు కదిలింది. ఓ మూల సీటులో కూర్చుని అతను అనుకున్నాడు. ‘ఆమెనెందుకు కలవాలి. కలిసినా తమ మధ్యనున్న అంతర్యాలు కలవవు. ఆ ఎడ్రస్సలా పోవడమే ఒక విధంగా మంచిదేమో.
కఠినమైన నిర్ణయం కన్నీరు తెప్పిస్తుంటే కళ్ళు మూసుకున్నాడతను.

**********
డాక్టరు ప్రభంజన విచారంగా తన గదిలో కూర్చొని ఎంతకూ బయటకు రాకపోయేసరికి ఈశ్వరి అనుమానంగా ఆమె గదిలోకి తొంగి చూసింది.
ప్రభంజన కూర్చున్న భంగిమలోగాని, చూపులోగాని మార్పు రాకపోయేసరికి ఈశ్వరి తనే చొరవ చేసుకొని లోనికొచ్చి ‘మేడం’ అని పిలిచింది.
ప్రభంజన చూపు మరల్చి ఈశ్వరి కేసి చూసి విచారంగా మొహం పెట్టి “నువ్వనవసరంగా నా కొంప ముంచేవు” అంది బాధగా.
ఈశ్వరి ఆమె వైపు తెల్లబోతూ చూసి “ఏం జరిగింది మేడం. వెంకట్‌ని తెసుకొస్తానని వెళ్ళి ఇలా దిగులుగా వచ్చేరేంటీ? అతను కనబడలేదా?” అంది ఆత్రుతగా.
“నేను ఓంకారస్వామి దగ్గర కెళ్ళేను. అతను నా పూర్వజన్మ గురించి చెప్పేడు. అప్పట్నించి నా మనసు మనసులో లేదు. నా భర్త ఎవరో తెలిశాక.. నాకన్నం ముట్టబుద్ది కావటం లేదు. ఏం చేయాలో దిక్కు తోచక ఏడుస్తున్నాను” అంది ప్రభంజన.
ఈశ్వరి ఆశ్చర్యంగా చూస్తూ “ఏమిటీ, డాక్టర్ సుందరంగారు మీ భర్త కాదా?” అంది.
“పోయిన జన్మలో కాదట. ప్రస్తుతం నా భర్త.” అంటూ ఆగి ఈశ్వరి కళ్లలోకి చూసింది.
“చూశారా! నన్నన్నారుగాని మీక్కూడా పూర్వజన్మలోని భర్త మీదే ప్రేమ కల్గింది. ఇప్పుడింతకీ ఆయనెక్కడున్నాడు.”
ప్రభంజన వేలుపెట్టి వరండాలొకి చూపించింది.
ఈశ్వరి అటు చూసి ఎవరూ లేకపోవడంతో “అక్కడెవరున్నారు మీ పెంపుడు కుక్క తప్ప” అంది.
“అదే నా భర్తట. నా మీద ప్రేమతో నా ఇంట్లోకే వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి.” అంది బాధగా ప్రభంజన.
ఈశ్వరి మొహం ఏవగింపుగా పెట్టి “చా! చ! ఈ కుక్కా!” అంది.
ప్రభంజన ఈశ్వరి వైపు అదోలా చూసి “అలా అనకు. నాకు బాధేస్తుంది. ఏదో పాపం కొద్ది అలా పుడితే అది నా భర్త కాకపోతుందా? నేను సుందరంగారిని వదిలి దాన్ని తీసుకెళ్ళి పోదామనుకుంటున్నా.
ఈశ్వరి నవ్వాపుకొని “ఖచ్చితంగా మీకు పిచ్చి పట్టిందనుకుని పిచ్చాసుపత్రిలో వేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా దాన్ని తరిమేసి సుందరంగారితో హాయిగా ఉండండి” అంది.
“ఎందుకని?”
ప్రభంజన సూటి ప్రశ్నకి ఈశ్వరి చిరాగ్గా చూసింది.
“ఎందుకేమిటి, సొసైటీలో మీరొక పెద్ద డాక్టరు. ఒక కుక్క పూర్వ జన్మలో మీ భర్తంటే నవ్వరూ. పైగా దాంతో వెళ్తే మీ గౌరవమేం కావాలి?”
ప్రభంజన ఈశ్వరికేసి నిశితంగా చూసి “నీ పెళ్లయి ఎన్నేళ్ళయింది?” అనడిగింది.
“పద్నాలుగేళ్ళు”
“పద్నాలుగేళ్ళు కాపురం చేసిన భర్తని, కన్న పిల్లల్ని సొసైటీలో నీకున్న స్థానాన్ని వదిలేసి వెంకట్ అనేవాడితో వెళ్లిపోతే నీ గౌరవం మాత్రం పోదా? నువ్వెళ్లిపోగానే నీ భర్త, పిల్లల గతేంటి?” అనడిగింది సూటిగా.
ఈశ్వరి తెల్లబోయినట్లుగా చూసిందామెవైపు.
మొదటిసారిగా ఆమె సరైన జవాబు చెప్పలేకపోయింది.
ప్రతివాళ్ళూ తమ పూర్వజన్మల గురించి తెలుసుకొని ప్రస్తుత అనుబంధాలు వదిలేసి వెళ్ళిపోతే ప్రపంచమేమైపోతుందో ఆలోచించు. అసలివన్నీ నమ్మదగ్గ విషయాలు కాదు ఈశ్వరి. వాళ్లు బ్రతుకు తెరవుకోసం ఏవేవో చెబుతారు. నా చిన్నప్పుడొక జ్యోతిష్కుడు నాకసలు చదువే రాదన్నాడు. ఆ మాట మనసులో పెట్టుకుని చదవకపోతే నేను డాక్టర్నయ్యేదాన్నా? ఆలోచించు” అంటూ ఆ గదిలోంచి డిస్పెన్సరీ వైపు వెళ్లిపోయింది డా.ప్రభంజన.
ఈశ్వరి మొదటిసారి ఆలోచించడం మొదలెట్టింది.
*****
వెంకట్ అనుచరులు తలుపు తాళం తీసి అన్నం కేరియర్ అక్కడ పెడుతూ “అన్నం తెచ్చేం” అన్నారు. చీకట్లో మంచం కేసి చూస్తూ.
“నాకొద్దు” అంది మంచం మీద ఆకారం.
“ఏమో మాకు తెల్దు. ఆయన తినమని చెప్పేడు. తిను”
“ఆయనెప్పుడొస్తాడు?”
“చెప్పలేదు”
“ఇప్పుడే రమ్మనీసిండి. నాకు సూడాలనిపిస్తన్నదా బాబుని”.
ఆమె మాట తీరుకు ఆశ్చర్యపడి టార్చిలైటు వెలిగించేడు అందులోని వ్యక్తొకడు.
ఆ వెలుగులో మంచమ్మీద కూర్చున్న ఆకారాన్ని చూసి అందరి గుండెలు ఝల్లుమన్నాయి.
చారెడు బంతిపూల దండతో జడేసుకుని చంకీ రవిక, నైలాను చీర కట్టి మెల్లకన్నుతో మెల్లిగా నవ్వింది అప్పలనరసమ్మ.
“నువ్వెవరివి. ఆవిడేది?” అన్నారు వాళ్లు కోపంగా.
“నేనెవతినా! మీ కళ్లల్లో దుమ్ముగొట్టా. నన్నే కదరా ఆటోరిచ్చాలో అమాంతం తెచ్చి ఈ గదిలో కుదేసినారు. ఎవురో సాధువు ఆ కిటికీలోంచి నా బుర్ర మీన సెయ్యెట్టి ఆ ఎంకటుగాడే నీ మొగుడు. ఆణ్ని మనువాడమని సెప్పి ఇంత బుగ్గి నా మొకాన కొట్టి ఎల్లిపోనాడు. అంతే. నా ఆకారమిలాగయిపోనాది. మీరు బేగెల్లి ఎంకటుని రమ్మని సెప్పండి.” అంది అప్పలనరసమ్మ.
ఆ మాటలు విని వాళ్ల గుండె బేజారైంది.
పరుగున వెంకట్ దగ్గరికి పరిగెత్తేరు.
అప్పుడు వెంకట్ ఓంకారస్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు.
వెంకట్ వాళ్లవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
“కొంప మునిగింది. ఆవిడ మారిపోయింది” అన్నారు వాళ్లు గుసగుసగా వెంకట్ పక్కన చేరి.
“అంటే! పారిపోయిందా?” అనడిగేడు వెంకట్ గాభరాగా.
“లేదు సామి. అదెవర్తిగానో మారిపోయింది. నిన్ను సూడాలంటుంది. ఎంటనే నిన్నట్టుకొచ్చేయమని అరిచి గీ పెడుతుంది. అందుకే నీకు సెబుదామని.” అన్నారు వాళ్లు.
ఓంకారస్వామి ఏవిటన్నట్లుగా చూశాడు వెంకట్ వైపు.
మిగతా భక్తులకి అనుమానం రాకుండా వెంకట్ లేచి ఓంకారస్వామి చెవిలో విషయాన్ని గుసగుసగా చెప్పేడు.
ఓంకారస్వామి భ్రుకుటి ముడిపడింది.
“తమాషాగా ఉందే. నిజంగా మీరు కేయూరవళ్లనుకొని ఇంకెవర్నొ బంధించలేదు కదా.” అనడిగేడు.
“ఇంకా నయం. నేనే కదా ఆవిణ్ణి తీసుకెళ్లింది” అన్నాడు వెంకట్.
“అయితే ఇదేదో చిత్రంగా ఉంది. నువ్వెల్లొకసారి చూసిరా. “అన్నాడు ఓంకారస్వామి.
వెంకట్ అదురుతున్న గుండెతో వాళ్ల వెంట బయలుదేరాడు.
*****
రైలు వేగంగా వెళ్తోంది. కాన్హా ప్రాట్ఫామ్ మీద నిలబడి తనని అలాగే చూస్తూ నిలబడిపోయిన దృశ్యం లిఖిత కళ్ళనుండి వీడిపోవడం లేదు.
“బేబీ!”
తండ్రి పిలుపుకి కళ్ళు తెరచి చూసింది లిఖిత.
“నేను పడుకుంటాను” అన్నాడాయన.
లిఖిత కర్టెన్ సరిచేసి చలిగా అనిపించి కొద్దిగా ఏ.సి తగ్గించి కూర్చుంది తన సీట్లో.
కార్తికేయన్ పడుకున్నాడు.
లిఖిత రైలు వేగంగా వెళ్తుంటే అద్దంలోంచి దట్టంగా పరిగెత్తుతున్న కొబ్బరి చెట్ల సముదాయాన్ని చూస్తూ కూర్చుంది.
సాయంత్రమయింది.
రైలు జాలార్ పెయిట్‍లో ఆగింది.
వెంటనే ఎస్పీ హరిహరన్ గుర్తొచ్చేడామెకు.
ట్రెయిన్ తమిళనాడు బంద్ వలన అక్కడాగిపోతే ఆయన తనకు చేసిన మర్యాదలు గుర్తొచ్చేయి.
గబగబా గుమ్మం దగ్గర కొచ్చి అక్కడే నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్ని పిలిచి “హరిహరన్గారున్నారా?” అనడిగింది.
అతను వెళ్లి మరో ఇన్పెక్టర్ ని పిలుచుకొచ్చేడు.
అతను వెంటనే లిఖితను గుర్తుపట్టి సెల్యూట్ చేసేడు.
లిఖిత అతనికి ప్రతి నమస్కారం చేస్తూ “హరిహరన్ గారున్నారేమో చూద్దామని” అంది.
వెంటనే అతని మొహం మ్లానమైంది.
“రెండ్రోజుల క్రితమే ఆయనకి హార్టెటాక్ వచ్చింది.” అన్నాడతను.
“ఇప్పుడెలా ఉన్నారు?” అంటూ గాభరాగా అడిగింది లిఖిత.
“చనిపొయేరు. ఒక్క స్ట్రోక్కే”
అతని జవాబు ఆమె మనసుని నలిపేసింది. అసలే కాన్హా ఎడబాటుతో కుమిలిపోతున్న ఆమె మనసులో దుఃఖం ఆగలేదు. కన్నీరు వెంటనే చెంపల మీదకి జారింది.
“సారీ! చెప్పకూడదనుకున్నాను.” అన్నాడతను.
లిఖిత జవాబు చెప్పలేదు.
అతను తన కర్తవ్యం గుర్తొచ్చినట్లుగా వెళ్లి ఫ్లాస్కోతో కాఫీ టిఫిన్స్, అరటిపళ్లు తెచ్చి ఆమెకందించబోయేడు.
“వద్దు” అంది లిఖిత హీనస్వరంతో.
అ”అలాగనకండి. సార్ చాలా మంచివారు. ఎన్నడూ పోలీసాఫీసర్ దర్పం ప్రదర్శించలేదు. ఆయనక్కావలసిన వాళ్లు మాకూ కావాల్సిన వాళ్ళే!” అంటూ బలవంతంగా లోనికొచ్చి బెర్త్ మీద ఉంచేడు.
రైలు కదిలింది.
అతను దిగి మళ్లీ సెల్యూట్ చేసేడు.
రైలు వేగమందుకుంటుంటే లిఖిత కన్నీటిని దాచుకోలేకపోయింది. నిశ్శబ్దంగా అవిరామంగా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కూర్చుంది.
తన మనసుని దోచుకున్న ఎవరు వీరంతా.
ఊరుకాని ఊరులో భాషేతర ప్రాంతంలో తన్ని ఆదుకొని ఆత్మీయతని పంచిన మనుషులు.
తనంటే ఎవరో ఏమిటో తెలియకపోయినా మానవత్వాన్ని చూపించిన ఘనులు.
ఇంకా అక్కడక్కడా ఇలాంటి వారుండబట్టే తను తన తండ్రిని కలుసుకోగల్గింది.
కార్తికేయన్ లేచి కూర్చుని లిఖిత వైపు చూసి “ఏంటమ్మా అలా వున్నావు?” అనడిగేడు.
లిఖిత హరిహరన్ మరణం గురించి చెప్పింది.
అతను బాధగా కళ్లు మూసుకున్నాడు.
కాస్సేపటికి కళ్లు తెరచి “అందుకే నేనీ మరణాన్ని జయించాలని విశ్వప్రయత్నం చేసేను. కాని ప్రయోజనం లేకపోయింది” అన్నాడు బాధగా.
అతని ఎదురు సీటులో కాషాయ వస్త్రాలు ధరించి, నున్నగా గుండుతో నుదుటన చందనం లేపనంతో చెవులకి బంగారు సింహపు మకరకుండలాలతో కుడిచేతికి బంగారు కంకణంతో కూర్చున్న వృద్ధుడు కార్తికేయన్ వైపు చూసి “మీరెవరు?” అనడిగేడు.
“ఒక సైంటిస్టుని”
“మరి మరణమంటున్నారేమిటి?”
“అవును. చావులేని మందు కనుక్కోవాలని విశ్వప్రయత్నం చేసి ఓడిపోయాను. చివరికి మళయాళ క్షుద్రోపాసకుల్ని కలిసి ఆ అద్భుత శక్తిని సంపాదించాలనుకున్నాను. అదీ జరగలేదు” అన్నాడు కాస్త విచారంగా.
ఆ వృద్ధుని పెదవులు అపహాస్యంగా విచ్చుకున్నాయి.
“క్షుద్ర అనే పదంలోనే తక్కువ, నీచం అనే అర్ధాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి క్షుద్రోపాసకులు మహత్తరమైన మరణ రాహిత్యం గురించి మీకు బోధించగలరని ఎందుకనుకున్నారు?”
అతని ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయేడు కార్తికేయన్.”లాబరేటరీలో నిర్విరామ శ్రమ నాకే ప్రయోజనం కూర్చలేదు. . అందుకే వాళ్లనాశ్రయించేను. ఓటమి మనిషిని బలహీనుణ్ని చేస్తుంది కదా!” అన్నాడు చివరికి.
అతను తల పంకించి కాస్సేపు కళ్లు మూసుకుని తెరచి “మరణరాహిత్యం! అంటే మరణం లేకపోవడం. అది లేకపోతే జననముంటుంది కాని మరణముండదు. అప్పుడీ భూవిస్తీర్ణం మానవవాసానికి సరిపోతుందా? ఇప్పటికే ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారు. అడవుల్ని నరకుతున్నారు. సముద్రాల్ని, నదుల్నీ పూడుస్తున్నారు. ప్రకృతినంతా వికృతం చేసేస్తున్నారు. సంతృప్తి అనే పదాల్ని పూర్తిగా సమాధి చేస్తున్న మనిషి మరణం లేకపోతే మృగమయిపోడూ!” అన్నాడు.
లిఖిత అంతసేపు అనాసక్తంగ వారి సంభాషణ వింటున్నదల్లా అతని మాటలకు ఆసక్తురాలయి వారి వైపు తిరిగింది.
“అంటే నా ఉద్ధేశ్యంలో ఈ మహత్తరమైన రహస్యాన్ని అది మంత్రం కానివ్వండి, మందు కానివ్వండి. అందరికీ అందుబాటులోకి తేవాలని కాదు. మనుషులు అకాలంగా మరణం వాతపడకుండా, అలానే గొప్పవారిని, మేధావుల్ని రక్షించుకోవాలని నా ఆకాంక్ష.”కాని ఇది ఎవరివల్లనా కాదని తెలిసి పొయింది. పూర్వం శుక్రాచార్యుల వారు కచుడికి బోధించిన మృతసంజీవినీ విద్య కూడా కట్టు కథేననుకుంటాను” అన్నాడు కార్తికేయన్.
“కాదు”
ఆయన జవాబు విని “అయితే ఉందంటారా?” అనడిగేడు కార్తికేయన్.
ఆ ప్రశ్నలో కొంత హేళన మిళితమై ఉండటం గమనించాడా వృద్ధుడు.
“మన శక్తికి అందని పరిజ్ఞానం లేదనుకోవడం కేవలం మన అజ్ఞానం మాత్రమే. అయితే మానవ అవతారం ఎత్తిన భగవంతుడు కూడా మరణించేడు. మనకి చావు అనివార్యమని చెబుతూ! కాని మృత సంజీవిని విద్య ఉన్నది. అది ప్రస్తుతం తెలిసిన వ్యక్తి ఒకరే.”
“ఎవరాయన?”
“కపాలబ్రహ్మ. తూర్పు కనుమలలో అరకులోయకి దగ్గర్లో ఉన్న బొర్రా గుహల కావల్ ఉంటాడని తెలుసు. ఈ ఉత్తరాయణంలొ ఆయన తనువు చాలిస్తారని విన్నాను.” అంటూ వ్రేళ్ళని లెక్కపెడుతూ.”ఇంకెంత, ఆయన సమాధి కావడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది” అన్నారాయన.
ఆ మాటలు వినగానే కార్తికేయన్‌లో ఉత్సాహం పొంగి పొరలింది. టైము చాలా తక్కువగా ఉండటం వలన ఒక విధమైన టెన్షన్ కూడా చోటు చేసుకుంది. కాని దాన్ని బయటకి కనిపించనీయకుండా” మీరు చెబుతున్నది నిజమేనా?” అనడిగేడు.
ఆయన కార్తికేయన్ కేసి కళ్ళు తిప్పి చూశాడు.
ఆ కళ్లు మండుతున్న అగ్నికణికల్లా ఉన్నాయి.
“ప్రకృతిని నమ్ముతూ మాకు తెలిసిన పరిజ్ఞానాన్ని విషయ వాంఛలకి ఉపయోగించకుండా ఊరూరా మంచిని పంచడానికి తిరుగుతున్న ఉపదేశికులం మేం. మాకబద్ధమాడాల్సిన పని లేదు.”
లిఖిత ఆయన కోపాన్ని చూసి భయపడింది.
“నాన్నారు చాలా జబ్బున పడి లేచేరు. ఏదైనా ఆయన మాటలు మిమ్మల్ని బాధిస్తే క్షమించండి”
ఆయన చిరునవ్వు నవ్వాడు.
“కోపం కాదది. నా నిజాయితీకుండే తీక్షణతది” అన్నాడాయన.
లిఖిత ఆయనకి అరటి పళ్లందించింది.
ఆయన లిఖితని ఆశీర్వదిస్తూ “శుభజాతకం. తలిదండ్రులకి ఆసరా అవుతావు” అన్నాడు.
అందరూ టిఫిన్స్ తిన్నారు.
రైలు వేగం పెంచుకుంది. అందరూ తెరలు వేసుకొని పడుకున్నారు.
అక్కడ నిద్రరాని వారిద్దరే.
ఒకరు తన సాధన వ్యర్ధమైందనే వేదనతో కార్తికేయనయితే మరొకరు లిఖిత.
మధ్యరాత్రి రైలు గుంటూరులో ఆగింది. లిఖిత ట్రెయిన్ దిగింది తండ్రిని తీసుకొని.
ఇద్దరూ బస్సులొ విజయవాడ చేరుకొని మద్రాసు నుండొస్తున్న హౌరామెయిల్‌ని కాచ్ చేసేరు. కండక్టర్‌ని బ్రతిమిలాడి రెండు సీట్లు సంపాదించింది లిఖిత.
తాము విశాఖపట్నానికి దగ్గరగా వచ్చేస్తున్నామన్న తలంపు ఆమెనొక రకమైన ఉద్వేగానికి గురి చేస్తోంది. తొందరలో తల్లిని చూడబోతోంది. అదీ తండ్రితో కలిసి.
తల్లిని… తండ్రిని తను కలపబోతోంది.
పుట్టినందుకు తన జన్మకొక సార్ధకత లభించబోతోంది.
ఇలాంటి తలపులతో ఆమె హృదయం తీవ్రంగా స్పందిస్తోంది. అలాగే ఆలోచిస్తూ ఆమె ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.
అలా ఎంత సేపయిందో.
సరిగ్గా ఎవరో తట్టినట్లు మెలకువొచ్చేసింది.
బాగా తెల్లారిపోయింది.
ఎండ గూడా వచ్చేసింది.
రైలు స్టేషన్లో ఆగి ఉంది.
“ఏ స్టేషనిది?” అనడిగింది ఎదురుగా సంపెంగి పూలమ్ముతున్న వ్యక్తిని.
“వాల్తేరు” అన్నాడతను.
లిఖిత ఆనందంగా తండ్రి బెర్త్ వైపు తిరిగి లేపబోతూ ఉలిక్కిపడింది.
అక్కడ బెర్త్ మీద అతను కప్పుకున్న దుప్పటి మాత్రమే ఉంది.
లిఖిత ఉలిక్కిపడి టాయిలెట్స్ వైపు వెళ్లింది. అక్కడా అతను కనిపించలేదు.

ఇంకా ఉంది.

2 thoughts on “బ్రహ్మలిఖితం 21

Leave a Reply to పద్మజ యలమంచిలి Cancel reply

Your email address will not be published. Required fields are marked *