March 28, 2024

సంగీతానిది ఏ మతం ?

రచన: కాంత గుమ్మలూరి

ఇంట్లో అందరూ సంగీత ప్రియులే. అమ్మేమో చాలామందికి కర్నాటక్ క్లాసికల్ సంగీతం నేర్పిస్తుంది.
నాన్నయితే అన్నిరకాలూ హిందుస్తానీ, కర్నాటక్ సంగీతాలే కాక పాత తెలుగూ , హిందీ సినిమా పాటలూ, నిజానికి ఏ భాషయినా పాట బాగుందనిపిస్తే సమయం దొరికినప్పుడల్లా వింటూనే ఉంటారు.
అన్నయ్య డాక్టరీ చదువు. కాలేజీలో ప్రతీ మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ పాల్గొంటాడు.. ప్రైజులు కూడా తెచ్చుకుంటాడు. అక్క హైయర్ సెకండరీ. సంగీతం నేర్చుకుంటోంది. చాలా బాగా పాడుతుంది కూడా.
మరి నేనేం తక్కువ తినలేదు. నేను కూనిరాగాలు తీస్తే నీగొంతూ చాలా బావుంది. బద్ధకం వదిలి పెట్టి రోజూ నాదగ్గిరే సంగీతం నేర్చుకోవచ్చుగా అని అమ్మ అంటూనే వుంటుంది.
తను కాన్వెంట్ లో ఫోర్త్ స్టాండర్డ్ చదువుతోంది. ఆరోజు క్లాస్ టీచరు “రజినీ నువ్వు చాలా బాగా పాడ్తావు.ఈసారి క్రిస్మస్ పార్టీకి నువ్వుకూడా క్రిస్మస్ కారల్స్ గ్రూప్ లో పార్టిసిపేట్ చెయ్యి.” అన్నారు. సంతోషంగా ఎగిరి గంతేసి, నేనూ మిగతా పిల్లలతో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టా. ఇంటికి వచ్చాక కూడా సాయంత్రం అవే పాటలు గట్టిగా పాడడం మొదలుపెట్టా.
అదే గదిలో మాగజీన్ చదువుతున్న అక్క చిరాకుతో “అవేం పాటలే బాబూ! వినలేక ఛస్తున్నా.అసలు మనం హిందువులం తెలుసా? మనం మన సాంప్రదాయపు పాటలు పడాలి కానీ అవి పాడటం ఏమిటి? నేనీపాటలు పాడనని మీ టీచర్ తో చెప్పెయ్యి.”
“అక్కా! ఈ పాట కదనకుతూహలం రాగం ట. ట్యూన్ చాలా బాగుందిగా! పైగా ఇది మన హిందూ సాంప్రదాయపు రాగమేగా.”
“అసలన్నదే అందుకు. మన రాగాలతో వాళ్ళ దేవుడి పాటలు కట్టడమేమిటిట? వాళ్ళకి ఇంకేవీ రాగాలు దొరక లేదటనా?”
ఏం మాట్లాడాలో తెలియక బయట సావిట్లో పేపర్ చదువుతున్న నాన్నగారి దగ్గరకెళ్ళి ఇలా అడిగా
” నాన్నగారూ! సంగీతానిది ఏ మతం?”
“అదేం ప్రశ్నమ్మా! సంగీతానికి మతం ఏమిటి? ఎవరైనా ఏ పాటయినా నిస్సంకోచంగా పాడచ్చు.”
“మరి అక్క అలా అందేం?” తన మీద చెల్లి నాన్నగారితో చాడీలు చెప్తోందని రమ గబగబా సావిట్లోకి వచ్చింది.
” నాన్నగారూ! మీకు తెలుసు కదా ఆ మధ్య క్లాసికల్ సింగర్ నిత్యశ్రీ జీసస్ పాటల్ని త్యాగరాజు కీర్తనతో జత చేసి పాడిందని ఎంత హంగామా అయిందో ! ఆవిడ క్షమార్పణ చెప్పేదాకా వూరుకోలేదు. అది గుర్తుకు వచ్చే అలాంటి పరిస్థితి చెల్లికి రాకూడదని కదా ముందు జాగ్రత్తతో అలా చెప్పాను మరి.”
“ప్రజలు ఆవిడ మీద అనవసరంగా అభాండాలు వేసారమ్మా ! ఆవిడ చెట్టి భానుమూర్తి అన్న ఆయన రాసిన పాటని క్లాసికల్ రాగంతో పాడింది. ఆ పాట త్యాగరాజు కీర్తనపై ఆధారం కానేకాదు.” అన్నారు నాన్నగారు.
అన్నయ్య నాన్నగారి మాటల్ని మధ్యలో తుంచుతూ అన్నాడు,,” నాన్నగారూ! ఈ మధ్య న్యూస్ లో వచ్చింది చదివారా? ఢిల్లీ లో స్పిక్ మెకే, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి స్పాన్సర్ చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ పోస్ట్ పోన్ చెయ్యాల్సి వచ్చింది. కారణం మూఢ భక్తి గల హిందూ ఫనటిక్స్. వాళ్ళు కర్నాటక సంగీత కారుడైన టి.ఎమ్. కృష్ణ ని కచేరీలో పాల్గొనడానికి వీల్లేదని అడ్డుపడ్డారు.ఆయన చేసిన మహా పాపం ఏమిటంటే తాను పాడే పాటల్లో క్రిస్టియన్, ముస్లిం విషయాలతో కూడిన పాటలు కూడా జత కూరుస్తాడని. అసలు వాళ్ళకి ఆ విధమైన చొరబాటు సమంజసమేనా? అది అనాగరపు సంస్కృతి కదా‌ ! వీటి వెనక పొలిటికల్ ప్రభావం కూడా ఉందని తెలిసింది. కృష్ణ అన్నదేమంటే “మన దేశం బహు భాషా, బహు మతాలు గల దేశం. నేను అన్ని లలిత కళలకీ సమానమైన విలువ నిస్తాను. అల్లా, జీసస్, రామ్ లలో ఏవిధమైన భేదం నాకు కనబడదు. అంచేత జీసస్ మీద గానీ అల్లా మీద కానీ నెల కొకటి చొప్పున కర్నాటక సంగీతంలో పాట విడుదల చేస్తానని ట్వీట్ చేశారు. ఇది అందరు సంగీతకారులూ హర్షించదగ్గ విషయం కదూ!”

నాన్నగారు అన్నారు,” అసలు క్లాసికల్ సంగీతం ఏ భాషకి చెందినా, ఏమతానికి సంబంధించినా ‌ గౌరవనీయం పూజ్యనీయం. ఏదేశంలో నైనా నలుమూలలా వ్యాపిస్తుంది మానవ హృదయాలను దోచుకుంటుంది. ఒక దేశానికి సంబంధించిన సంగీతం ప్రభావం వేరొక దాని మీద పడడం, అనుసరణ కూడా అతి స్వాభావికం. మన కర్నాటక సంగీతానికి కానీ హిందూస్తానీ సంగీతానికి కానీ ఎంత వైభవమైన మూలం , ఎంత ప్రభావితమైన సంస్కృతి వుందో తెలుసా? పాడే విధానం వేరే ఐనా రాగాలలో సమానత కనబడుతూనే వుంటుంది. కానీ ఈ సంగీత కళాకారులు వాడే వాయిద్యముల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పండిట్ రవిశంకర్ గారి సితార్ నిజానికి పర్షియన్ సెతార్, మూడు తారల వాయిద్యం నుంచి ఉద్భవించింది. సరోద్ ఆఫ్ఘన్ రుబాబ్ నుంచి వచ్చింది. హార్మోనియం యూరోపియన్ ఎకార్డిన్ నుంచి జన్మించింది. అవి ఆ సంగీత కారుల్ని ముస్లిమ్, క్రిస్టియన్ లేక విదేశీ కళాకారులు గా విడదీసాయా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, అమ్జద్ ఆలీ ఖాన్, అల్లా రఖ్ఖా, పండిట్ రవిశంకర్, హరి ప్రసాద్ చౌరాస్య మొదలగు ‌ప్రముఖ కళాకారులకి వారి వారి మతం గురించి ఆలోచన ఏనాడూ రాలేదు. అందరూ కలిసి ఒకే స్టేజ్ మీద కచేరీలు చేసే వారు.

మన సౌత్ ఇండియన్ కర్నాటక సంగీతం చాలా శాస్త్రీయ బద్ధమైనదనీ, ఏవిధమైన మార్పులకీ లొంగదని కదా ప్రతీతి. కానీ వయోలిన్ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మన దేశంలో ప్రవేశం పొంది, కర్నాటక సంగీతంలో అంతర్గత భాగమైంది. ద్వారం వెంకటస్వామి నాయుడు, ఎమ్.ఎస్. గోపాలకృష్ణన్, ఎన్. రాజమ్, ఎల్.శంకర్, ఎల్.సుబ్రమణ్యం, ఇంకా చాలా మంది ప్రతిభాశాలులైన వయోలిన్ విద్వాంసులు దక్షిణ భారతదేశంలో ఎంతమందో కదా. వారిని అనుసరించే సంగీత ప్రియులు వయొలిన్ విదేశం నుంచి వచ్చి,న వాయద్యమంటే భరించలేరు కూడా.
యూ.శ్రీనివాస్ అతి రమ్యంగా మాండలీన్ పై కర్నాటక సంగీతం వాయించి మాండలీన్ శ్రీనివాస్ గా ప్రఖ్యాతి గాంచి, సార్ధక నామదేయుడు అయాడు. అందరికీ తెలిసిందే కదా మాండలీన్ మన దేశపు వాయిద్యం కాదని. ఈనాడు కదరి గోపాలనాద్ సాక్సాఫోన్ తో కర్నాటక సంగీతంలో అత్యంత ప్రముఖుడు.ఈ సంగీతజ్ఞుల కందరికీ తెలుసు సంగీతానికి, సంగీతపు ఇన్స్ట్రుమెంట్స్ కీ పరిధి ‌లేదని.
ప్రొద్దున్నే లేవగానే వింటాం రేడియోలో భజన పాటలు. హిందూ సాంప్రదాయపు సంగీతం. ఆ భజనలు పాడిన వాళ్ళలో ముఖ్యుడు, లెక్క లేనన్ని పాటలు పాటలు పాడి అందరి గుండెల్లోనూ పీట వేసుకొని కూర్చున్న వాడు మొహమ్మద్ రఫీ. ఆయన ముసల్మాన్ కదా. ఈనాటికీ అందరి నోటంటా ఆయన పాడిన పాటలే . “ఓ దునియా కే రఖ్ వాలే” బైజూ బావరా లో పాట – సంగీతం సమకూర్చింది నౌషాద్ ఆలీ, పదాల్ని సమ కూర్చినది షకీల్ బదయూనీ, పాడినది మొహమ్మద్ రఫీ. ఆ ముగ్గురు ముస్లిములు కలసి అందరు హిందువుల హృదయాలు దోచుకున్న పాట, సాంగ్ ఆఫ్ ఆల్ టైమ్ ని సృష్టించారు. అటువంటి పాటలెన్నెన్నో ! వాటి లోని మాధుర్యాన్ని ,అవి కలిగించే భావోద్రేకాన్ని కాదనగలమా? వాటిని పాడినది ముస్లిం మతస్తులు కనుక ఆ పాటలను తిరస్కరిస్తున్నామా?
“సారే జహా సె అచ్ఛా” ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి నోటా పలికే పాట. లిఖించినది ఇక్బాల్.
ఏ పండుగైనా, శుభ కార్యమైనా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి సన్నాయి వాదనతో ఆరంభిస్తాం శుభ ప్రదమంటూ!
దైవభక్తి, దేశభక్తి, మతం, జాతీయం, అంతర్జాతీయం వీటన్నింటికీ అతీతమైనది సంగీతం. అన్నింటా వ్యాప్తంగా వుంది.
వీటన్నింటి వెంటా వున్న సందేశం ఒకటే సంగీతానికి పరిధులు లేవు.
కొంతమంది ఈర్ష్యా అసూయల వల్ల గానీ, రాజకీయ పరమైన ప్రేరణల వల్ల గానీ, మూర్ఖత్వపు నమ్మకాలవల్ల గానీ తాము నమ్మినదే సరియైనది, అందరూ అదే పాటించాలి లేకుంటే ఘర్షణ తప్పదన్నట్లు శతృత్వంతో వ్యవహరిస్తారు.మన దేశంలో ఇటీవల ఈ విధమైన వ్యవహారం ఎక్కువైపోయింది. సామరస్యం తగ్గిపోయింది.
హేతుబద్ధంగా ప్రతి యొక్కరూ ఆలోచించాల్సిన విషయం కాదూ ఇది ?”
నాన్నగారి మాటలు విన్న రజిని మళ్ళీ తన పాటలు నిరాఘాటంగా ప్రాక్టీస్ చేసుకోవడం మొదలు పెట్టింది.

************

1 thought on “సంగీతానిది ఏ మతం ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *