April 19, 2024

విశ్వపుత్రిక వీక్షణం – కలల రెక్కలు

రచన: విజయలక్ష్మీ పండిట్
సాయంకాలం మిద్దెపైన వాకింగ్ చేస్తూంది విరజ.
టప్ మని శబ్దం రావడంతో వెనుతిరిగి చూసింది.
రెక్కతెగి రక్తం కారుతూ పడివుంది ఒక పావురం. ఒకరెక్కతో ఎగరడానికి ప్రయత్నిస్తూంది.  కాని వీలుకాక రెక్కను టపటపలాడిస్తూ శరీరాన్ని లాగుతూంది కష్టపడి.  క్రిందపడిన రక్తం చుక్కల పై తెగిన రెక్కను క్రిందలాగుతూ పోవడంతో ఎఱ్ఱగా రక్తం గీతలు పడ్డాయి.
“అయ్యో పాపం ఎట్లా తెగింది నీ రెక్క “ అంటూ విరజ పావురాన్ని చేతుల్లోకి తీసుకుని రెక్కను నిమురుతూ చుట్టు చూసింది.  మిద్దెపైని టి.  వి ఆన్టెన్నాకు వేలాడుతూంది గాలిపటానికి కట్టి ఎగరవేతలలో పోటీలలో ఎదుటి గాలీపటాలను తెంపే “మాన్జా “ అది.  గట్టి దారానికి గాజుపెంకుల పొడిని గమ్ములో కలిపి పూసి ఆరబెట్టి అమ్ముతారు గాలిపటాలు ఎగరేసే సంక్రాంతి సీజన్లో.
“గోడమీద ఎగురుతూ వచ్చిందేమో పాపం ఆ మాన్జా చుట్టుకుని తెంపింది రెక్కను” అనుకుంది విరజ. మాన్జాకు అంటుకున్న రక్తంమరక  సాక్షం చెప్పింది .
మాన్జా వల్ల జరిన ప్రమాదాలను విన్నప్పుడు చదివినపుడు,మనుషుల ఆనందాలకోసం మతిమాలిన చేష్టలలో మాన్జా ఒకటని ఎప్పుడో నిర్దారించుకుంది విరజ.
పావురాన్ని చేతిలో పట్టుకుని గబగబ క్రిందికి ఇంటిలోకి వెళ్ళి ఫస్టెయిడ్ బాక్స్ తీసుకుని రెక్కలపైని గాయాన్ని డెటాల్ తో తుడిచి ఆయింట్మెంట్ రాసి రెక్కను దగ్గరకుచేర్చి గాజు క్లాత్తో కట్టుకట్టింది.
విరజ చేతిలో చిక్కిన పావురం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాణి బాధ, భయం చూచనగా కనుగుడ్లు తిప్పుతూంది.  కట్టుకట్టి కిచన్ బాల్కనిలో ఒకమూల పావురాన్ని దింపి తినడానికి గింజలు ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేసి, ఇంకో  గిన్నెలో తాగడానికి నీళ్ళుపెట్టి లోపలికొచ్చి కిటికీలో నుండి చూసింది.
పావురం అటు ఇటు చూస్తూ ఎవరు లేరని నిర్దారించుకుందేమో నీళ్ళ గిన్నెదగ్గరి కెళ్ళి మెడ వంచి నీళ్ళుతాగింది.  మెల్లగా గిన్నెల చుట్టు ఒకసారి తిరిగి నేలపై చతికిలబడింది.
“పాపం నొప్పిగుందేమో తెగిన రెక్క” అనుకుంటూ లోపలికెళ్ళి తన పనిలోకి మళ్లింది విరజ.
విరజకు మాటిమాటికి, తెగిన రెక్కతో పైకెగరలేక  కుంటుకుంటూ నీరసంగా నడుస్తున్న పావురం మదిలో మెదులుతూంది.  ” కావాలన్న చోటిక స్వేచ్ఛగా ఎగిరిపోలేని అవిటితనం రెక్కలు తెగిన పక్షికి” అనుకుంది విరజ.
అప్పుడు అనూహ్యంగా విరజ రెండురోజులనుండి దిగాలు మొగముతో తిరుగుతున్న కూతురు దీపికను ఆ పావురంతో పోల్చుకుంటూంది.

****
విరజకు కూతురు గీతిక మదిలో మెదిలింది.
ఎప్పుడూ చలాకీగా ఎగురుతూ గెంతుతూ ఆనందగా ఉండే గీతిక అలా దిగాలుగా ఉండడానికి కారణం పైచదువులకు అమెరికాకు పంపలేనని వాళ్ళ నాన్న నికార్సిగా చెప్పడం.
“నీకున్న అకడమిక్ రికార్డ్ కు కాంపస్ సెలక్షన్ లో జాబ్ తప్పక వస్తుంది నీకు .  అమెరకాలో ఎమ్ . ఎస్. చేయడమవసరమా” అని అమెరికాలో ఎమ్ . ఎస్ . చేయాలన్న గీతిక ప్రతిపాదనను వాళ్ళ నాన్న విశ్వనాథ్ కొట్టి  పారేయడంతో గీతిక కలల రెక్కలు కుంచించుకపోయి మనసును నిరాశ, నిస్సత్తువ ఆవరించాయి.
వాళ్ళ నాన్న అమెరికాకు వద్దనడానికి కారణం కూతురు పైని అతిగారాబం. అక్కడ ఏమికష్టాలు పడాల్సి వస్తుందో గారాల కూతురు అనే సగటు నాన్నలకుండే భయం కారణం కాని. . ,పంపే స్తోమత లేక కాదు అని విరజకు, గీతికకు తెలుసు.
గీతిక చిన్నప్పటి నుండి వీలయినంతవరకు పై చదువులు చదివి తరువాత తనకిష్ట మయిన జాబ్ లో చేరి స్థిరపడిన తరువాతనేపెండ్లి చేసుకోవాలనే నిర్ణయించుకున్నట్టు వాళ్ళ అమ్మ విరజతో అంటుండేది.
అకడమిక్ గా మంచి తెలివితో గోల్డ్ మెడల్స తెచ్చుకున్న వాళ్ళమ్మ విరజ, వాళ్ళ నాన్నపట్టుదలకు కట్టుబడి పెండ్లి చేసుకోవడంతో పైచదువులు చదివి లెక్చరర్ గా జాబ్ చేయాలన్న  విరజ కలల రెక్కలు తెగి రాలిపోయాయి అనే ఆలోచన, బాధ గీతక మనసులో నాటుకుంది.
“చదువుకున్న అమ్మనాన్నలు కూడా ఆడపిల్లలు ప్రపంచాన్ని చూడాలి,కాలానుగుణంగా వారి మనసు, ఆలోచనలు పెరగాలి అనే ఆలోచనలు కాకుండా. . , ఎంతసేపు ఆ మూసలో పోసిన పిల్లల భవిష్యత్ ప్లాన్స వేసుకుంటూ వుండిపోతారు”. . అంటుంది గీతిక వాళ్ళ నాన్న అమ్మతో.
విరజకు కూతురి వాదన నిజమనిపించింది.
విరజ వాళ్ళ నాన్న మెదిలాడు మనసులో.
విరజ గ్రాడ్యుఏట్ అవగానే ఎమ్.  ఎ.  చేస్తానని అడిగింది వాళ్ళ నాన్నను.  అప్పటికే విరజకు పెండ్లి
సంబంధం చూసిన వాళ్ళ నాన్న రామకృష్ణ రావు  . . ,”మంచి సంబంధం, అబ్బాయి విశ్వనాథ్ కు మంచిచదువు, ఉద్యోగం,అందం, సాంప్రదాయమైన తెలిసిన కుటుంబం .  నిన్నుకోరి చేసుకుంటానన్నాడు . పైచదువులెందుకు కావాలంటే పెళ్ళయినాక మీ ఆయన్ను ఒప్పించుకుని పైచదువులు చదువుకో “ అని తనపెళ్ళి చేసేయడం, ఇదు సంవత్సరాలలో ఇద్దరు పిల్లలను కనడం జరిగి పోయింది.  వాళ్ళపెంచడంతో తన పైచదువు  మూలపడింది.
తను పోస్ట్ గ్రాడ్యుయేట్ పాసయి లెక్చరర్ ఉద్యోగం చేయాలన్న తన కలను నిజంచేసుకోలేకపోయింది విరజ.
గీతిక అమెరికాలో యం. యస్ . చేయాలన్న కోరికను విరజ సమర్తించింది.
“నాన్నతో చెప్పి వొప్పించంమ్మా” అని వాళ్ళమ్మతో మొరపెట్టుకుంది గీతిక.
విరజకు భర్త విశ్వనాథ్ ను ఒప్పించడం ఒక పరీక్షనే. విరజ ధైర్యస్తురాలు.  కూతురు అమెరికా చదువు గురించి విశ్వనాథ్ కున్న భయాలు విరజకు లేవు. తనూ పైచదువు చదవలేకపోయానన్న బాధ అనుభవించింది కాబట్టి కూతురు గీతిక మనసును అర్థంచేసుకుంది.
“మగవాళ్లకు ఆ అనుభవం లేదు కదా . కొడుకుల చదువుకిచ్చే ప్రాముఖ్యతను కూతురు చదువుల కిచ్చేవారు కాదు.  వయసొస్తూనే ఆడపిల్ల పెండ్లి ధ్యాస పట్టుకుంటుంది తల్లితండ్రలకు”అనుకుంది విరజ .
ఈ తరం ఆడపిల్లలుకు బయటి ప్రపంచం ఎక్సపోసర్ ఎంతో అవసరం అని విరజ ఆలోచన.  ఈ తరం యువతకు,ముఖ్యంగ ఆడపిల్లలకు కూడా అన్ని విషయాలలో; చదువులు, ఉద్యోగాలు,పెండ్లిళ్ళు, వైవాహిజీవితం విషయాలలో నిర్దిష్ట మయిన కోరికలు,ఆలోచనలున్నాయి. అవి సాధించుకోవాలనే పట్టుదల కూడా మెండుగా ఉంది.  యువత ఆలోచనా ధోరణిలో తరాల అంతరాలు చాల ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి.
తమ తరం ఆడపిల్లల్లా తల్లితండ్రుల, అన్నతమ్ముల,భర్తల మాటలకు తలవంచి జీవితాలను గడిపేసే రకంగా లేరు ఈ తరం ఆడపిల్లలు.
యువత చదువుతో పాటు ప్రపంచంలో, ప్రజల ఆలోచనా ధోరణులలో వస్తున్న మార్పులను గమనిస్తున్నారు.  ఈ తరం ఆడపిల్లకు పెండ్లే పరమావధి కాదు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక స్వాంతంత్రంతో, తనజీవితాన్ని, కుటుంబాన్ని తమ పిల్లలను రాబోయే తరానికణుగుణంగా పెంచుకోవడం అనే భహుముఖ కర్తవ్యాలు ముందున్నాయి ఆడపిల్లలకు.
మనదేశ మగపిల్లలు, ముఖ్యంగా విదేశాల లో చదివి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ దేశాలలో ఆలుమగల జీవితాలను గమనించడం,సర్వెంట్స పెట్టుకోవడం కాస్టిలి కావడం, ఇద్దరు ఉద్యోగాలు చేయడం. . ,కారణాలు ఏమయినా కలిసి ఇంటి పనులలో పిల్లల పెంపకంలో,వంట పనులలో భార్యకు సాయం చేస్తున్నారు. యువతలోని ఈ మార్పుకు కారణం బయటి ప్రపంచంలో వారు పొందుతున్న అనుభవాలు, అవగాహన.
విరజకు ఆలోచిస్తే, మంచి చెడ్డలను బేరీజు వేస్తే” ఆడపిల్లలను విదేశాలలో చదువుల కోసం దూరంపంపుతున్నామే “ అనే భయాందోళనలక్కర లేదనిపిస్తుంది .
విదేశాలలో పైచదువుచదవడంవల్ల ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది.  నలుగురితో ఎలా అడ్జస్ట అవ్వాలో నేర్చుకుంటారు. వాళ్ళ జీవితాలను వాళ్ళు మానేజ్ చేసుకోవడం జరుగుంది.  ఈ బిహేవియరల్ మార్పుల వలన ఆడపిల్లలు అనుకోని అవాంతరాలు,ప్రాబ్లంసును ఎదుర్కొనే ధైర్య స్తైర్యాలనిస్తుందని, వారి భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవడానికి తోడ్పడుతుందని విరజ ఆలోచన.
అక్కడి ప్రజల జీవితం నుండి నేర్చుకోవాలసినవి చాలా ఉన్నాయి.  ప్రపంచంలో మార్పులను గమనిస్తూ,ఆ  ప్రజలతో జీవిస్తూ  నేర్చుకోవాల్సిందే కదా. . .  అనిపిస్తుంది విరజకు.   “ఎనెన్నో కలలల కంటూన్న ఆడపిల్లలకు జీవితాలలో శీగ్రంగా చోటుచేసుకుంటున్న మార్పుల పై అవగాహన లేనిపక్షంలో పరిస్తితులను ఎదుర్కోలేక జీవితం గాయాలపాలై,వారి కలలరెక్కలు తెగి,గాయపడిన పక్షిలా కుంటుతూ జీవితాన్ని గడపాలసిందే కదా. ?!” అని అనుకుంటోంది విరజ.
విరజ మనసు మాటి మాటికి స్వేచ్చగా ఎగిరే రెక్కలు తెగి మూలగెంతున్న పావురంతో గీతికను పోల్చుకుంటూంది.  కూతురిని నిస్సహాయంగా గెంతుతున్న పావురంతో పోల్చుకోవడాన్ని సహించలేకపోయింది విరజ మనసు.
“పావురానికి ఆ మాన్జా వల్ల పొంచివున్న ఉపద్రవం తెలియక కదా రెక్క తెగింది.  ఆడపిల్లలు అగసాట్ల పాలవడానికి కారణం వీరికి లోకజ్ఞానం లేకపోవడం, హానికరమైన మాన్జాను పోలిన అపాయకరమైన పెనుమార్పులు ప్రపంచప్రజల జీవితాలలో చోటుచేసుకుంటున్నాయన్న అవగాహన లేకపోవడం కదా “అని అనుకుంటూ . . ,”కూతురు గీతిక జీవితంలో ఏమి కష్టాల నెదుర్కోవలసి వస్తుందో” అని విరజ మనసు పరి పరి విధాలుగా ఆలోచించ సాగింది.
తుదకు ఏదో గుర్తుకొచ్చి ఒక కత్తెర తీసుకుని గబ గబ మిద్దెపైకి వెళ్ళింది.  టి. వి. ఆన్టెన్నాకు పొడవుగా వ్రేలాడుతున్న మాన్జాను కత్తిరించి తెచ్చి డస్ట్ బిన్లో పడేసింది.  ఇంకో పక్షి రెక్కలు తెగకూడదని తను మంచి పని చేశానని గాలి పీల్చుకుంది.
ఆ సంఘటనతో విరజ కూతురి విషయమై ఒక గట్టి నిర్ణయానికొచ్చింది.  అమెరకాలో చదువు పూర్తి చేసి ఆ సంవత్సరమే ఉద్యోగంలో చేరిన కొడుకు కార్తీక్ తో చెల్లెలు గీతిక అమెరకాలో పైచదువు విషయంలోతన అభిప్రాయాన్ని చెప్పి
మీ నాన్నను ఒప్పించదలచానని చెప్పింది.
కార్తీక్ కూడా చెల్లెలు గీతిక అభిప్రాయాలను, ఆలోచనలను సపోర్టు చేస్తాడు.
విరజ,వారంరోజులు వీలయి నపుడల్లా భర్తతో మంచిగా,ప్రేమతో కూతురు కలలు కన్న అమెరికాలో పైచదువులకు ఎందుకు పంపాలో, దానివల్ల గీతిక చదువుతో పాటు జీవితాన్ని కూడా ఎలా చదువగలుగుతుందో,ఆ అనుభవం వల్ల తన జీవితాన్ని మలుచుకొనే నేర్పరితనం కూడా గీతికకు పరోక్షంగా జరిగే లాభాలనూ ఉదాహరణలతో చెపుతూ భర్తను ఒప్పించింది
అమెరికాలో పై చదువుకు వాళ్ళ నాన్న ఒప్పుకోవడంతో ముడుచుక పోయిన గీతిక కలలరెక్కలు విశాలంగా విచ్చుకున్నాయి.
తన ఆనందానికి అవదులు లేవు. స్నేహితుకు ఫోన్ చేసింది. అమ్మ నాన్నను కౌగిలించుకొని ముద్దాడింది.
అన్న కార్తీక్ తో సంతోషాన్ని పంచుకుంది.  విశ్నానాథ్ కు కూతురిని ఆనందంగా చూడడంతో పెద్ద భారం
దిగినట్టయింది .
భార్య విరజ మాటలలో నిజం లేకపోలేదనే  భావన స్థిర పడింది అతనిలో.

*****

పదిరోజుల తరువాత పావురం రెక్క గాయం మాని కొంచెం కొంచెం ఎగరడం మొదలు పెట్టింది .  విరజకు కోలుకుని ఎగరడానికి ప్రయత్నం చేస్తున్న పావురాన్ని చూసి చాల సంతోషంగా ఉంది ఒక మూగజీవికి మరలా జీవితానిచ్చాననే తృప్తితో.
అమెరికాకు వెళ్ళడానికి కావాల్సిన క్వౌలిఫికేషన్లను,ముందుపనులన్ని స్నేహితురాళ్ళతో కలిసి చేసుకుని మంచి యూనివర్సిటీ లో సీటు కూడా సంపాదించుకుంది గీతిక .
వాళ్ళనాన్న సుముఖంగా లేకపోవడంతో ఆగిపోయిన ప్రయాణానికి డేట్ ఫిక్స్ చేసుకుంది.
అదే యూనివర్సిటీలో సీటువచ్చిన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్ళడానకి గీతిక అన్ని సర్దుకుంది విరజ సలహా సహాయంతో.
రాజీవ గాంధి ఇంటర్నేషనల్ ఏయిర్పోర్టులో ఇంటర్నేషనల్ టర్మినల్ యువతతో, దిగులుతో కూడిన ఆనందంతో జాగ్రత్తలు చెపుకుంటూ,
వీడ్కోలు చెప్పే తల్లి తండ్రులతో కోలాహలంగా ఉంది.
ఒకవైపు ఎమ్.  ఎస్.  చదవడానికి అమెరికాకు వెళుతున్నాననే ఆనందం, మరో వైపు ఎప్పుడూ అమ్మ నాన్నలను వదిలి దూరంగా ఉండని గీతిక మనసును కంట్రోల్ చేసుకుంటూ ఇద్దరు స్నేహితురాళ్ళతో సెక్యూరిటీ చెక్ వైపు నడుస్తూ కండ్లుతుడుచుకోవడం విరజ,విశ్వనాథ ల చూపులను తప్పించుకోలేకపోయింది.
సెక్యూరిటీ చెక్ ముగించుకుని చేయి ఊపుతూన్న కూతురును చూస్తూన్న విరజ, విశ్వనాథ్ ల మనసులు బరువెక్కాయి.  ఇటువైపుకు తిరిగి కండ్లుతుడుచుకుంటున్న భార్య బుజం పై చేయివేశాడు విశ్వనాథ్ . రాని నవ్వును మొహంపై పులుముకుంటూ . . , ”నాకు ధైర్యం చెప్పి నీవు ఏడుస్తున్నావా. . విరీ”. . అన్నాడు ఓదార్పుగా .  ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు .  కూతురు గీతిక లేక ఇల్లు ఉసూరుమనిపించింది వారికి .
అయినా కూతురి కోరిక నెరవేరి కలలరెక్కలతో తాను ఏర్పరుచుకున్న లక్ష్యం వైపు ఆకాశంలో విమానంలో ఎగిరి వెళుతూందనే ఆనందంతో మనసును సంభాలించుకుంది విరజ.
విరజకు పావురం గుర్తుకు వచ్చి . . ,”గీతిక వెళ్ళే పని ఒత్తిడిలో ఈ రోజు పావురానికి గింజలు వెయ్యలేదు
కదా”అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది .  చిందిపోయిన గింజలతో, గిన్నెలో మిగిలిన నీళ్ళతో
ఆ బాల్కని ఖాళీగా ఉంది.
“గాయం మానింది, నిస్సహాయత తొలిగింది, మానిన రెక్కలతో ఎగిరిపోయింది పావురం “ అనుకుంటూ సంతోషంగా లోపలికి నడిచింది విరజ.
విశ్వనాథ్ మాటలు,”జాగ్రత్త నాన్నా గీతు. . ,చేరిన వెంటనే ఫోన్ చేయి, మెసేజ్ ఇవ్వు రోజు ఫేస్ టయిములో మాట్లాడు” అని ఫ్లైట్ టేకాఫ్ కు ముందు కూతురుతో చెపుతున్న భర్త విశ్వనాథ్ మాటలు వినింది.  భార్యను, పిల్లలను అమితంగా ప్రేమించే విశ్వనాథ్. . , కూతురు ఎడబాటును ఎట్ల తట్టుకుంటారో అని కొంచెం దిగులు పడింది విరజ.

***\\\***\\\****

1 thought on “విశ్వపుత్రిక వీక్షణం – కలల రెక్కలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *