June 8, 2023

ఆంధ్రపితామహుడు–శ్రీ మాడపాటి హనుమంతరావు గారు

రచన: శారదాప్రసాద్

మాడపాటి హనుమంతరావుగారు మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధిప్రేరణం అనే కధలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపంలో వచ్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’. మాడపాటి హనుమంతరావుగారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. వీరు 11 -11 -1970 న తెలుగు వారిని భౌతికంగా వీడి వెళ్ళారు. కానీ, మన హృదయాలలో చిరంజీవిగా ఉన్నారు.
ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు గారు నవ తెలుగుజాతి నిర్మాతలలో ముఖ్యులు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటాల కోసం తెలంగాణా తెలుగు ప్రజలను జాగృత పరచిన వైతాళికుడు ఈయన. తెలుగు జాతిని సమైక్య పరచిన జాతీయ భావాలుగల మహామనీషి శ్రీ హనుమంత రావు గారు. గ్రంధాలయాల స్థాపనకు వీరు చేసిన కృషి మరువ రానిది. తెలుగు భాషకు వారు ఎనలేని సేవజేసి కీర్తిని గడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణంలో కూడా వారి పాత్ర చిరస్మరణీయం.
శ్రీ మాడపాటి హనుమంతరావు గారు 1885 జనవరి 22 న కృష్ణ జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవారు. హనుమంతరావు గారు తమ ప్రాధమిక విద్యను సూర్యాపేట, వరంగల్ లలో పూర్తిచేశారు. ఉన్నత విద్య అనంతరం, విద్యాశాఖలో గుమాస్తాగా ఎనిమిది సంవత్సరములు వరంగల్ లో పనిచేశారు. తరువాత హైదరాబాద్ కు మకాం మార్చి, అక్కడ నిజాం ప్రభుత్వంలో తెలుగు భాషా అనువాదకుడిగా కొంతకాలం పనిచేశారు. అలా ఉద్యోగం చేస్తూనే, న్యాయ శాస్త్రంలో పట్టభద్రులై 1917 లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అచిరకాలంలోనే మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. అలా నిరాటంకంగా 24 సంవత్సరములు న్యాయవాది వృత్తిలో పని చేసి, తదుపరి విశ్రాంత జీవితం గడిపారు.
1903 లో మాడపాటి వారికి తమ చిన మేనమామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్టవశాత్తూ అన్నపూర్ణమ్మగారు అకాలమరణం చెందారు. తదనంతరం 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు.
శ్రీ హనుమంతరావు గారు హైదరాబాద్ రాష్ట్ర తెలుగు ప్రజలకోసం 1921 లో ‘తెలుగు జనసంఘం’ను స్థాపించారు. దానికి వారే కార్యదర్శి. అది విస్తృతంగా వ్యాప్తి చెంది కొన్ని వేల శాఖలు ఏర్పడినవి. 1930లో ఇదే నిజాం ఆంద్రమహాసభగా మారింది. శ్రీ హనుమంతరావు గారి అధ్యక్షతన పలు విజయవంతమైన సమావేశాలు నిర్వహించబడ్డాయి. శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం, వేమనాంధ్ర భాషానిలయం, మహిళా కళాశాల లాంటి పలు సంస్థలను స్థాపించిన మహనీయుడు ఈయన. భారతదేశంలో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించారు.
1948లో హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన తరువాత వీరు 1951 లో హైదరాబాద్ నగరమునకు తొలి తెలుగు మేయర్ గా ఎన్నికయ్యారు. 1955 లో భారత ప్రభుత్వం వీరిని ‘పద్మభూషణ్ ‘పురస్కారంతో సత్కరించింది. ఉస్మానియా విశ్వ విద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ తో గౌరవించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత, శాసన మండలి ప్రధమ అధ్యక్షుడుగా 1963 వరకు పనిచేయటం ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనం. 1964 లో వీరి కుమారుడైన సుకుమార్ కు సుచేతతో వివాహమైంది. సుచేతవరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్ట వశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు. శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేశారు.
వీటన్నిటినీ మించి ఆయన స్వతహాగా ఒక రచయిత. రోమన్ సామ్రాజ్యం, మహాభారత సమీక్షలాంటి పెక్కు ప్రసిద్ధి చెందిన గ్రంధాలను రచించారు. సుజాత, గోల్కొండ, దేశబంధు లాంటి మున్నగు పత్రికలలో పెక్కువ్యాసాలను కూడా వ్రాశారు. వీరికి ఉర్దూ భాషలో కూడా ప్రావీణ్యం ఉంది. కొన్ని ఉర్దూ పత్రికలలో సంపాదకీయాలు కూడా వ్రాశారు.

‘ఆంద్ర పితామహునికి ‘మన ఘనమైన నివాళి!

10 thoughts on “ఆంధ్రపితామహుడు–శ్రీ మాడపాటి హనుమంతరావు గారు

  1. ఆనాటి ప్రముఖుల జీవితాలను అద్దం పట్టినట్లు చూపించినందుకు ధన్యవాదాలు!

  2. మనతరానికి ,యువతరానికి తెలుగు రాష్ట్రాలకు సేవచేసిన శ్రీ మాడపాటి హనుమంతరావు గారి గురించి చక్కటి విషయాలు తెలియజేసిన శారదా ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  3. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు కీర్తిశేషులు మాడపాటి హనుమంతరావు గారి మంచి వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు. ఇటువంటి పెద్దల ఘనతను చాటిచెప్పే ఉదంతాలను వెలికితీసి ఇప్పటి తరాలవారికి పరిచయం చేస్తున్నందుకు మీరు సదా అభినందనీయులు.

  4. I know Madapati Hanumantha Rao as one of the freedom fighters only till now. But after reading the above article I got more details about his life and activities. Thank you very much for the enlightening article.

Leave a Reply to sasibhushan Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2019
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728