December 6, 2023

కంభంపాటి కథలు – దేవతలాంటి నిన్ను…

రచన: రవీంద్ర కంభంపాటి

డోర్ బెల్ రింగైన వెంటనే పరిగెత్తుకెళ్లి తలుపు తీసింది శిరీష. తలుపు బయట నుంచున్న దేవిని చూసి, ‘అయ్యో.. నీకు వొంట్లో బాగోలేదని మీ అమ్మ ఫోన్ చేసింది.. ఇవాళ పన్లోకి రావనుకున్నానే ?’ అంది

‘ఆఁ.. ఏదో కొంచెం జొరంగా అనిపించి మా అమ్మకి చెబితే, వెంటనే మీకు ఫోన్ చేసేసిందమ్మా.. కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని వచ్చేసేను ‘ అంటూ లోపలికెళ్ళిపోయింది. దేవి వెనక్కాలే కిచెన్ లోకి నడుస్తూ శిరీష అంది ‘నీ పేరు దేవి కాకుండా దేవత అని పెట్టుండాల్సింది మీ అమ్మ.. నువ్వు లేనిదే ఈ ఇంట్లో ఏ పనీ ముందుకెళ్లదు ‘ అంటే, ‘ఊరుకోండమ్మా.. ఈ మాత్రం పనికే మీరలా అనేస్తారు ‘ అంటూ సింకులో ఉన్న గిన్నెల్ని విమ్ పౌడర్ తో తోమడం మొదలెట్టింది దేవి.

‘చాల్లే.. నిన్న రాత్రి ఈయన ఆఫీస్ లో ఏదో ఫంక్షన్ కి వెళ్లొచ్చి బాగా టైర్ అయిపోయాను.. నువ్వు రావేమో, ఇప్పుడీ గిన్నెలు కడగడం అదీ ఎలాగా అని అనుకుంటున్నాను, నువ్వు వచ్చేసేవు ‘ అంటూ స్టవ్ వెలిగించింది కాఫీ పెట్టడానికి. ఇంతలో హాల్లో పేపర్ చదువుకుంటున్న కిషోర్ అరిచేడు ‘శిరీషా.. నేను ఇంక ఆఫీస్ కి బయల్దేరాలి, బ్రేక్ఫాస్ట్ రెడీనా ?’

‘చూసేవా.. ఒక్క క్షణం కూడా నన్ను ఒక చోట ఉండనీయరీయన ‘ అని దేవితో అంటూ, ‘జస్ట్ ఫైవ్ మినిట్స్’ అని హాల్లోకి అరిచి గబగబా స్టవ్ మీద ఓట్స్ ఉడకెయ్యడం మొదలెట్టింది శిరీష.

డైనింగ్ టేబుల్ మీద ఓట్సు, కాఫీ పెట్టేసరికి, అప్పటికే కిషోర్ స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు.

‘ఏమిటింత తొందరగా వెళ్తున్నారు ?’

‘త్వరగా వెళ్లకపోతే ఆ వెధవ ట్రాఫిక్ లో ఇరుక్కుని చావాలని తెలుసు కదా. పెద్ద ఏదో తెలీనట్టు అడుగుతావేం?’ అని శిరీష మీద విసుక్కున్నాడు కిషోర్

‘సర్లెండి.. ఆ విషయం మామూలుగా చెప్పొచ్చు కదా.. విసుక్కోడం ఎందుకూ ?’ అంది శిరీష

‘మరి.. విషయం తెలిసి కూడా వెర్రి డవుట్లడిగితే నవ్వుతూ ఆన్సర్ చెప్పాలా ? ‘ అని హడావుడిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీసుకెళ్లిపోయేడు కిషోర్.

అతని వెనకాలే వెళ్లి తలుపేసుకుని, బాత్రూమ్ వేపు వెళ్తూ శిరీష అరిచింది ‘ఇదిగో దేవీ.. నేను స్నానం చేసొస్తా.. ఈ లోపల ఇల్లు తడిగుడ్డ పెట్టెయ్యి ‘ అంటూ.

ఓ పావుగంట తర్వాత బాత్రూం లోంచి బయటికొచ్చి, బట్టలు మార్చుకోడానికి బెడ్ రూమ్ లోకెళ్తూ, ఆ గది బయట తడిగుడ్డ పెడుతున్న దేవిని అడిగింది ‘నేను ఇందాక స్నానం చేస్తున్నప్పుడు, డోర్ బెల్ మోగింది.. ఎవరొచ్చారు ?’

‘కొరియర్ అబ్బాయి వచ్చాడమ్మా.. వేరే ఫ్లాట్ కి వెళ్ళబోయి మీ ఫ్లాట్ కి వచ్చాడు.. నెంబర్ తప్పు అని చెప్పి పంపేసేను ‘ బదులిచ్చింది దేవి

సరేనని బెడ్ రూమ్ తలుపేసుకుని, లోపల్నుంచి అరిచింది ‘దేవీ.. నా మంగళసూత్రం నువ్వేమైనా తీసేవా ?’

ఒక్కసారి అదిరిపడిన దేవి మెల్లగా అంది ‘లేదమ్మా.. అయినా మీ మంగళ సూత్రం నేనేం చేసుకుంటాను ?’

‘ఏమిటో.. వినపడ్డం లేదు.. అలా గొణుగుతావేం ?… వచ్చి వెతుకు.. రాత్రి పార్టీకి వేసుకెళ్తే స్టైల్ గా ఉండదని తీసి, దిండుకింద పెట్టేను.. అలా ఎలా మాయమౌతుంది ?’ అంటూ గదంతా వెతకడం మొదలెట్టింది శిరీష

దేవి చేస్తున్న పని పక్కనెట్టి, తను కూడా వెతకడం మొదలెట్టింది.

‘ఇందాక.. నేను స్నానం చేస్తున్నప్పుడు నిజంగానే కొరియర్ అబ్బాయి వచ్చేడా ? అంటే.. అతను ఏ ఫ్లాట్ కి వెళ్ళాలో తెలిసినప్పుడు, వేరే ఫ్లాట్ తలుపు ఎందుకు కొడతాడు ?’ అనుమానంగా అంది శిరీష

‘ఏమోనమ్మా.. నాకూ తెలీదు.. 411 అన్నాడు.. కాదు..ఇది 417 అన్నాను.. వెళ్ళిపోయేడు ‘ వెతుకుతూ బదులిచ్చింది దేవి

‘నిజం చెప్పవే బాబూ.. నిన్నేమీ అనను.. క్రితం నెలే జీతం పెంచమని అడిగేవు.. నేను పెంచలేదు.. అదేమైనా మనసులో పెట్టుకుని.. ఫర్వాలేదు చెప్పు ?’

‘లేదమ్మా.. మీకు నేనెలా కనిపిస్తున్నాను ?.. ఇంతకు ముందెప్పుడైనా మీ ఇంట్లో వస్తువులు ముట్టుకున్నానా? ఓసారి సార్ ని అడగండి.. ఆయనెక్కడైనా పెట్టేరేమో ‘ అంది దేవి, మంచం కిందకి వొంగి వెతుకుతూ.

‘సార్ కి ఏం అవసరం ? పైగా ఆ మంగళసూత్రం తాలూకా చైన్ లో మా అత్తగారి బంగారం కూడా వేయించేం… అలాంటిదాన్ని ఆయనెందుకు తీసుకుంటారు ?’ కోపంగా అడిగింది శిరీష

‘అయ్యో.. ఆయన తీసుకున్నారనలేదమ్మా.. ఆయన తీసి ఎక్కడైనా పెట్టుండొచ్చు కదా ‘ అంది దేవి

‘ఏమో.. ఆ తీసిందేదో నువ్వే తీసుండొచ్చు కదా.. నిన్నెందుకు అనుమానించకూడదు ?’ అని శిరీష అనేసరికి దేవి కళ్ళల్లో నీళ్ళొచ్చేసేయి

‘నేను నిన్నిప్పుడు ఏమన్నానని ? నువ్వూ.. నీ దొంగ ఏడ్పులూ ?’ కోపంగా అరిచింది శిరీష

ఆ అరుపుకి బెదిరిపోయిన దేవికి ఏడ్పు ఆగడం లేదు, ‘నిజంగానమ్మా.. ఎవరిమీదైనా ఒట్టు పెడతాను.. నేనసలు తియ్యలేదు ‘ అంది

‘నా ఖర్మేంటంటే.. చూసేవుగా.. ఆయనెంత చిరాగ్గా ఆఫీసుకెళ్ళేరో.. అలాంటిది ఇప్పుడు ఆఫీసుకి ఫోన్ చేసి, మీరు మంగళసూత్రం తీసేరా అని అడిగితే, నన్ను బూతులు తిట్టేస్తారు… కాబట్టి ఆయన వచ్చేలోపే.. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలి.. నిజం చెప్పు..నీకు దణ్ణం పెడతాను ‘ అంది శిరీష

‘నేను కూడా మీకు దణ్ణం పెడతానమ్మా. నేనస్సలు తీయలేదు.. నన్ను నమ్మండి ‘ భోరున ఏడుస్తూ బదులిచ్చింది దేవి !

‘నీ సంగతిలాక్కాదు.. అపార్ట్మెంట్ సెక్యూరిటీ కి ఫోన్ చేస్తాను.. ‘ అని ఇంటర్ కాంలోనుంచి అపార్ట్మెంట్ సెక్యూరిటీకి ఫోన్ చేసింది, వాళ్ళు వెంటనే ఓ సెక్యూరిటీ అతన్ని పంపించేరు.. అతని కోసం ఎదురు చూస్తూంటే, రెండు ఫ్లాట్స్ అవతల ఉండే అపార్ట్మెంట్ సెక్రటరీ పరమేశ్ గారు బయటికెళ్తూ, ఆదుర్దాగా ఉన్న శిరీష మొహం చూసి ‘ఏమ్మా.. అలా ఉన్నావు ? అంతా బాగానే ఉందా ?’ అని అడిగేసరికి, శిరీష ఏడుపాపుకుంటూ విషయం చెప్పింది.
‘ఏదీ.. ఆ పిల్లను పిలిపించు ‘ అని పరమేశ్ గారు అడిగితే లోపల్నుంచి దేవి వెక్కుతూ వచ్చి పరమేశ్ గారికీ, సెక్యూరిటీకీ దణ్ణం పెడుతూ చెప్పింది ‘ నిజం సార్.. నేను తియ్యలేదు.. అమ్మగారు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు ‘

సెక్యూరిటీ అతను అన్నాడు ‘నిజం చెప్పు.. రెండు తగిలించమంటావా ? అప్పటికీ చెప్పలేదనుకో పోలీసుల్ని పిలవాలి ‘

‘లేదు సార్. ఇందాక ఇంట్లోకి వచ్చినప్పటినుంచీ నేను అసలు బయటికెళ్లలేదు.. అలాంటప్పుడు నేనెక్కడ తీస్తాను ?’ అంది దేవి

‘ఇందాక ఎవరో తలుపు కొట్టేరు.. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను.. వీళ్లమ్మేమో అని నా డవుట్.. ఇదేమో కొరియర్ అని చెబుతూంది ‘ అంది శిరీష

‘నిజం సార్.. ఇందాక కొరియర్ అతను వచ్చేడు.. 411 అని అడిగేడు.. లేదు.. ఈ ఫ్లాట్ 417 అని చెప్పి పంపేసేను ‘ ఏడుస్తూ దేవి చెప్పేసరికి, పరమేశ్ గారన్నారు ‘ఈ పిల్ల చెప్పింది నిజమే.. ఇందాక మా ఇంటికి అమెజాన్ కుర్రాడు.. వచ్చేడు.. పొరబాట్న వేరే ఫ్లాట్ కి వెళ్ళేను అని చెప్పేడు కూడా ‘

‘విన్నారామ్మా.. నేను చెప్పేను కదా.. కొరియర్ కుర్రాడు వచ్చేడని.. ఓసారి సార్ కి ఫోన్ చేసి అడగండి.. ఆయన తీసి ఎక్కడైనా పెట్టరేమో ‘ అంది దేవి కళ్ళు తుడుచుకుంటూ.

‘అదేమిటీ.. మీ ఆయన్నడగలేదా ఎక్కడైనా పెట్టేడేమో.. ఆ పనేదో ముందే చెయ్యొచ్చు కదమ్మా ‘ అన్నారు పరమేశ్ గారు మందలింపుగా !

వెంటనే శిరీష కిషోర్ కి ఫోన్ చేసి, భయం భయంగా విషయం చెబితే, అంతెత్తున అరిచేడతను, ‘ఉదయాన్నే నీ మంగళసూత్రం దాయడం తప్ప నాకు వేరే పన్లేవీ లేవనుకుంటున్నావా ?.. నీ అంత కేర్ లెస్ మనిషిని నా జన్మలో చూడలేదు.. చూడలేను కూడా.. నా ఖర్మ కొద్దీ దొరికేవు నువ్వు ‘

ఏడుపాపుకుంటూ అడిగింది శిరీష, ‘పోనీ పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేద్దామా దేవి మీద ?’
‘ఆఁ.. చెయ్యి.. అప్పటికి కానీ బుద్ది రాదు నీకు… నిన్నూ, నన్నూ కూడా లోపలేస్తారు.. చైల్డ్ లేబర్ కేసు కింద..ఆ పిల్లకి ఇంకా పద్నాలుగేళ్ళు నిండలేదు ‘ అంటూ కిషోర్ అరుస్తూంటే, శిరీష అడిగింది ‘అయితే నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు ?’

‘ఏం చేస్తాం ?.. నిన్ను నేను భరించడం లేదూ ? అలాగే ఆ పనిపిల్లని నువ్వు భరించు.. నాకసలే ఇప్పుడో క్లయింట్ మీటింగు ఉంది.. తర్వాత చూద్దాం.. నువ్వెలాగూ స్టైల్ గా ఉండదని మంగళ సూత్రం బయిటికి వేసుకోవు కదా.. అలాగే కొన్నాళ్ళు మేనేజ్ చెయ్యి ‘ అంటూ ఫోన్ పెట్టేస్తూంటే, శిరీష అడిగింది ‘పోనీ దేవిని పనిలోంచి తీసెయ్యనా ?’

‘చెప్పేను కదా.. నా ఖర్మ కొద్దీ దొరికేవు నువ్వు.. ఏదో ఒకటి ఏడువు’ అంటూ ఫోన్ దభీల్మని పెట్టేసేడు కిషోర్.

‘సరేనమ్మా.. ఆ పిల్ల ఇంట్లోనే ఉంది.. నిజం చెబుతూంది.. అనవసరంగా అనుమానించేవు.. ఇంట్లోనే సరిగ్గా వెతుకమ్మా.. ‘ అంటూ పరమేష్ గారు సెక్యూరిటీ అతన్ని తీసుకునెళ్ళి పోయేరు.

ఏం చెయ్యాలో అర్ధం కాక, శిరీష బేలగా దేవి వేపు చూస్తూ ‘సారీయే.. దేవతలాంటి నిన్ను అనవసరంగా అనుమానించేను.. పద.. ఇద్దరం కలిసి ఇల్లంతా వెతుకుదాం.. ఇప్పుడు నాకు అనుమానం వస్తూంది.. ఆ పార్టీకి వెళ్లే ముందు మంగళసూత్రం హ్యాండ్ బ్యాగ్ లో పడేసేనా లేక దిండు కింద పెట్టేనా.. సర్లే.. ముందు ఇంట్లో వెతుకుదాం ‘ అంటే, ‘సరేనమ్మా.. ‘ అంటూ కళ్ళు తుడుచుకుని శిరీషతో పాటు ఇల్లంతా వెతకడం మొదలెట్టింది దేవి !

ఉపసంహారం : ఆదివారం మధ్యాన్నం మల్లిఖార్జున థియేటర్లో మ్యాటినీ షో. ఇదిగో నీ కిష్టమైన ఆపిల్ సెల్ఫోన్ అని సతీషు అంటూంటే, అతను వేసుకున్న అమెజాన్ టీ షర్టు మీంచి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గిరకి తీసుకుంది దేవి.

2 thoughts on “కంభంపాటి కథలు – దేవతలాంటి నిన్ను…

  1. ఈకాలం ఎవరూ అమాయకులు లేరు. అపార్టమెంట్ వాచ్మెన్ చాలామంది దోపిడీలే ఏకంగా. మేమే స్వయంగా దొంగకు తాళం ఇచ్చాం. మీ స్టైల్ లో మళ్లీ ఓ మంచి కధ

  2. అన్యాయం . నాకెందుకో భానుప్రియ గుర్తు వచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2019
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728