March 29, 2024

దారి తప్పిన స్నేహం

రచన: గిరిజ పీసపాటి

ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి శైలజ, సరిత ప్రాణ స్నేహితులు. శైలజ చాలా బిడియంగా, నెమ్మదిగా ఉంటూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. సరిత తప్ప వేరే స్నేహితులు కూడా లేరు. కానీ సరిత గలగలా మాట్లాడుతూ తను ఎక్కడ ఉంటే అక్కడే చొరవగా కొత్త స్నేహితులను తయారుచేసుకునేది. స్కూల్ లో మొదలైన వారి స్నేహం కాలేజ్ లో కూడా కొనసాగడంతో ఏ చిన్న విషయాన్నైనా ఇద్దరూ షేర్ చేసుకునేవారు. కాకపోతే ఇద్దరి ఇళ్ళు మాత్రం చాలా దూరం. సరిత వాళ్ళు ఊరికి 16 కి.మీ. దూరంగా స్థలం కొనుక్కుని అక్కడే చిన్న ఇల్లు కూడా కట్టుకోవడంతో, ఎప్పుడో ప్రత్యేక సందర్భాలలో తప్ప శైలజ సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీలయేది కాదు. సరిత మాత్రం స్కూల్, కాలేజ్ లకి దగ్గరలోనే ఉన్న శైలజ వాళ్ళింటికి తరచూ వస్తూ ఉండేది.

ఎనిమిదవ తరగతి నుండి తమతోనే చదువుతున్న శ్రీరామ్ అనే అబ్బాయి డిగ్రీ సెకెండ్ ఇయర్లో తనకు ప్రపోజ్ చేసిన విషయం సరితకి చెప్పింది శైలజ. అప్పుడు సరిత కూడా తమ కాలనీలో ఉన్న చక్రపాణి అనే అబ్బాయిని తను ప్రేమిస్తున్న విషయం శైలజకి చెప్పింది. చదువు పూర్తయాక కూడా ఒకరి ఇంటి వద్ద మరొకరు కలుసుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగించసాగారు. డిగ్రీ పూర్తయాక కూడా శ్రీరామ్ శైలజ అంటే అదే ఇష్టం చూపించడం, ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరగానే శైలజతో మళ్ళీ తన ప్రేమ విషయం చెప్పగా, తన తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే తను ఈ పెళ్ళికి ఒప్పుకుంటానని చెప్పింది. శైలజ తల్లిదండ్రులను కలిసి శ్రీరామ్ ఈ విషయం చెప్పగా, వారు కొన్నాళ్ళు గడువు కోరడంతో సరేనన్నాడు. ఇదే విషయాన్ని శ్రీరామ్ తన తల్లిదండ్రులకు కూడా చెప్పగా వారు కూడా శైలజను ఎరిగినవారే కనుక వెంటనే ఒప్పుకున్నారు.

అయితే సరిత మాత్రం తల్లిదండ్రుల వద్ద తన ప్రేమ విషయాన్ని దాచిపెట్టి శెలవు రోజుల్లో శైలజ వాళ్ళింటికి వెళ్తున్నానని చెప్పి చక్రపాణితో సినిమాలు, షికార్లు సాగించేది. శైలజ మందలించినా నవ్వేసేది తప్ప మానేది కాదు. ఒకసారి మనిద్దరం సినిమాకి వెళ్దాం అని చెప్పి తీరా హాల్ లోపలికి వెళ్ళి కూర్చున్నాక సరిత పక్కన కూర్చున్న చక్రపాణిని ఆశ్చర్యపోయి చూస్తున్న శైలజతో ముందే చెప్తే నువ్వు రావనీ… అని గునుస్తున్న సరితతో ఇలాటివి తనకి ఇష్టం ఉండదనీ, మరోసారి ఇలా చెయ్యొద్దని చెప్పింది శైలజ.

రెండు సంవత్సరాల పాటు శ్రీరామ్ ప్రవర్తనను పరిశీలించిన శైలజ తల్లిదండ్రులు శ్రీరామ్ తో పెళ్ళికి అంగీకరించగా ఒక శుభ ముహూర్తానికి శైలజ, శ్రీరామ్ ల వివాహం జరిగిపోయింది. శైలజ వివాహం జరిగిన కొన్నాళ్ళకి చక్రపాణి డబ్బుకోసం తన మరదలిని చేసుకుంటున్నాడని, తను నిలదీసి అడిగితే నీకు నేనే కావాలంటే పెళ్ళి చేసుకోకుండా నీకో ఇల్లు తీసి, నీతో రహస్యంగా కాపురం చేస్తానన్నాడని ఏడుస్తూ చెప్పిన సరితతో, నిన్ను ప్రేమించి ఇంకొరిని ఎలా చేసుకుంటాడు? వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి జరిగిన విషయాలు చెప్పు అని చెప్తే… నీకు దండం పెడతాను వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే నన్ను చంపేస్తారు? దయచేసి వాళ్ళకేమీ చెప్పకు అని ప్రాధేయపడింది సరిత.

ఇది జరిగాక సరిత ఏ అఘాయిత్యానికి ఒడిగడుతుందోనని భయపడిన శైలజకి సరిత ప్రవర్తన అసలేమీ జరగనట్లే ఉండడంతో హమ్మయ్య అనుకుంది. కానీ… సరిత తన అక్కకి పుట్టిన ఇద్దరు కవల పిల్లలకు అనిల్ చక్రపాణి, కిరణ్ చక్రపాణి అనే పేర్లు పెట్టడంతో ఇదేం చోద్యం అనుకోకుండా ఉండలేకపోయింది. మరో సంవత్సరానికి సరిత వివాహం కూడా తల్లిదండ్రులు నిశ్చయించిన అబ్బాయితో జరిగిపోవడం, సరిత భర్త కృష్ణ ఉద్యోగం రాజమండ్రిలో కావడంతో, కాపురానికి వెళ్ళిపోయింది సరిత. వెళ్ళిన నెలరోజులకే సరిత దగ్గరనుండి శైలజకు ఉత్తరం రావడం, అందులో కృష్ణ తనను సరిగా చూసుకోవడం లేదనీ, తను వాళ్ళ వదిన కుముద ఎలా చెప్తే అలా వింటాడనీ, వదినకు దూరంగా ఉండలేక ఇక్కడి ఉద్యోగం మానేసి అక్కడే కొత్త ఉద్యోగం వెతుక్కుంటానని అంటున్నాడనీ, తను వద్దన్నానని తనను మానసికంగా హింసిస్తున్నాడనీ, అతనికి తెలియకుండా ఈ ఉత్తరం రాస్తున్నందున నువ్వు నాకు రాసే తిరుగు ఉత్తరంలో ఈ విషయాలేవీ ప్రస్తావించవద్దనీ కోరింది.

ఉత్తరం చదివిన శైలజ భర్తతో విషయం చెప్పి బాధ పడింది. అయినా సరిత కోరినట్లే కుశల ప్రశ్నలు వేస్తూ మామూలుగా జవాబు రాసింది. సరిత కృష్ణ గురించి రాసిన ఉత్తరాలను ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా దాచేది శైలజ. ఒకరోజు అనుకోకుండా సరిత, కృష్ణలు ఇంటికి రావడంతో ఆనందంగా ఆహ్వానించిన శైలజ సరితను వంటింట్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంది? అని అడిగితే తనని బాగానే చూసుకుంటున్నాడనీ, తన వదిన ఆదేశం మేరకు అక్కడి ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చేసామని చెప్పి, ఇకమీద ఏం జరగనుందో అని బాధపడుతున్న సరితకు ధైర్యం చెప్పి పంపింది శైలజ.

కొద్ది రోజులకు సరిత తన భర్త పూర్తిగా మారిపోయాడనీ, తను ఎలా చెప్తే అలా వింటున్నాడని చెప్పడంతో చాలా సంతోషించింది శైలజ. శైలజకు ఒక కూతురు, సరితకు ఇద్దరు కొడుకులు పుట్టాక అంతా బాగుంది అనుకునే సమయంలో శ్రీరామ్ తల్లిదండ్రులు ఇద్దరూ హఠాత్తుగా ఏక్సిడెంట్ లో చనిపోవడం, ఆస్తి అంతా దాయాదుల పాలు కావడంతో తను కూడా ఉద్యోగం చేయసాగింది శైలజ. సరిత కూడా ఉద్యోగం చేస్తూ, భర్తలో వచ్చిన మార్పుతో, అత్తమామలు, పుట్టింటివారు ఇచ్చిన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకుని, కింద తాము ఉంటూ మేడమీద వాటాలను అద్దెకిచ్చి జీవితంలో స్థిరపడింది.

అప్పటి నుండి సరిత ప్రవర్తనలో మార్పును గమనించసాగింది శైలజ. అన్నీ తనకే తెలుసనీ, ఎవరైనా సరే తను చెప్పినట్లు వినాల్సిందే తప్ప నేను ఎవరినీ లెక్కచేయననీ మాటల సందర్భంగా వ్యక్తపరిచేది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా నీతులు ఉన్న కొటేషన్స్ పోస్ట్ చెయ్యడం, భార్యాభర్తలు, స్నేహం ఎలా ఉండాలో వాటిలో ఉండేది.

ఒకరోజు శైలజకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో చూపించుకుంటే గర్భాశయంలో కణితి పెరుగుతోందనీ, అర్జంటుగా ఆపరేషన్ చేసి గర్భసంచి తీసెయ్యాలని చెప్పారు డాక్టర్. రెండు రోజుల్లో హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ఆపరేషన్ చేసి కణితిని తీసి వారంరోజులకి డిస్చార్జ్ చేయడం జరిగింది. శైలజ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన నెల్లాళ్ళకు పరామర్శకు తన భర్తతో కలిసి వచ్చింది సరిత.

కాసేపు ఆ మాట, ఈ మాట మాట్లాడి శ్రీరామ్, శైలజ తల్లి వింటుండగా తన భర్తతో చిన్నప్పటి నుండి శైలజ ఎక్కడ ఉంటే అక్కడే కొత్తవాళ్ళను స్నేహితులుగా చేసుకునే చొరవ ఉందనీ, స్కూల్ లో చదువుతున్న రోజుల్లో స్కూల్ లో, కాలేజ్ లో కూడా మధ్యాహ్నం భోజనం చేయగానే అబ్బాయిలతో కబుర్లు మొదలెట్టేదనీ, స్కూల్ లో, కాలేజ్ లో తనకు ఫ్రెండ్ కాని అబ్బాయంటూ లేడనీ, తను మాత్రం ఆ సమయంలో క్లాస్ రూమ్ లో ఒక్కర్తనీ కూర్చుని చదువుకునే దాన్నని, తన గురించి వంకరగా మాట్లాడుతున్న సరితను చూసి నిర్ఘాంతపోయి భర్త వంక చూడగా, అన్నీ తెలిసి కూడా నవ్వుతూ వింటున్న భర్తను చూసి ఒళ్ళు మండింది శైలజకి.

వాళ్ళు వెళ్ళాక తనేమైనా పతివ్రతను అనుకుంటోందా? అయినా అది అలా వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఇదేనా శైలజ మీద నీకున్న ఇష్టం? ఇలా అడ్డమైన వాళ్ళూ నా కూతురిని అంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ… నేను ఊరుకోను అని కోపంతో ఊగిపోతున్న తల్లితో బాధ పడొద్దని, తను ఇలా మారిపోబట్టే తనని దూరం పెట్టానని చెప్పింది శైలజ. దూరం పెడితే సరిపోదే పిచ్చిదానా! శ్రీరామ్ నిన్ను ఇష్టపడగానే మా దగ్గర దాచకుండా చెప్పావు, అంతేకాక నువ్వేంటో మాకు తెలుసు కనుక సరిపోయింది. ఇదే పరిస్థితుల్లో ఇంకొకరుంటే కాపురాలు కూలిపోతాయి. తల్లిదండ్రులు కూడా అపార్ధం చేసుకుని దూరమైపోతారు అని ఆవేదనతో అంటున్న తల్లి మాటలకు ఆలోచనలో పడింది శైలజ.

తనకు పూర్తిగా నయమయాక ఒకరోజు సరిత ఆఫీసుకి లంచ్ టైమ్ లో వెళ్ళిన శైలజ, సరితను పక్కకు తీసుకెళ్ళి సూటిగా సరితనే చూస్తూ నువ్వు ఆ రోజు నీ భర్త దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నన్ను చెడుగా చిత్రీకరించావు. కానీ..‌. రాజమండ్రి నుండి నువ్వు రాసిన ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. వాటిలో ఈ మనిషిని చేసుకునే కన్నా నేను ప్రేమించిన చక్రపాణితో రహస్యంగా బతకడమే నయం అంటూ నీ స్వహస్తాలతో నీ మాజీ ప్రేమికుడి గురించి రాసిన వివరాలు కూడా ఉన్నాయి. ఆ రోజే నేను ఆ ఉత్తరాలను బయటపెట్టి ఉన్నా, మీ అమ్మానాన్నలకు నీ విషయాలన్నీ చెప్పినా నీగతి ఏమయ్యేదో ఆలోచించుకో…

ఇంకెప్పుడూ నువ్వు మంచి అనిపించుకోవడం కోసం ఇంకొరిని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం మానుకుని నువ్వు మంచిగా మారడానికి ప్రయత్నించు. ఇంకోసారి ఇంకెవరితోనైనా ఇలా ప్రవర్తిస్తే నా దగ్గర ఉన్న ఉత్తరాలు మీ ఆయన దగ్గరకు చేరతాయి జాగ్రత్త! అని హెచ్చరించి, మనసులో… ఆ రోజు తన భర్త తనని ఏమైనా చేస్తాడేమోననే భయంతో సాక్ష్యానికని దాచిన ఉత్తరాలు ఈ రోజు తన ప్రవర్తన సరిచేయడానికి పనికొచ్చాయి. చూద్దాం ఇప్పటికైనా మారుతుందేమో అనుకుంటూ… వెనుదిరిగింది శైలజ.

*****

6 thoughts on “దారి తప్పిన స్నేహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *