March 29, 2024

బ్రహ్మలిఖితం 22

రచన: మన్నెం శారద

ఆమె ఆందోళనగా కంపార్టమెంటంతా గాలించింది.
ఎక్కడా కార్తికేయన్ జాడలేదు.
రైలు దిగి ప్లాట్‌ఫాం మీద నిలబడింది. నిస్తేజమైన ధృకులతో ప్రతి మనిషినీ పరిశీలంగా చూస్తూ.
ప్లాట్‌ఫాం మీద రైలు వెళ్ళిపోయింది.
అమ్ముకునేవాళ్ల రద్దీ తగ్గిపోయింది.
ఎక్కడా కార్తికేయన్ కనిపించలేదు.
ఆమె తల గిర్రున తిరిగిపోతోంది. తన తండ్రి ఏమయ్యేడు. తిరిగి ఆయన మానసిక పరిస్థితి క్షీణించి ఎక్కడో రైలు దూకెయ్యలేదు కదా.
ఒక వేళ తనకంటే ముందే ఇల్లు చేరుకున్నారేమో. అది సరికాదని మనసు చెబుతున్నా ఒక రకమైన ఆశకి గురవుతూ ఆమె ఆటోలో ఇల్లు చేరుకుంది.
తల్లికేం జవాబు చెప్పాలా అని కుములుతూ ఆటో దిగిన లిఖిత ఇంటికేసి ఉన్న తాళం చూసి ఢీలాపడి అలానే నిలబడిపోయింది చాలాసేపు.
తల్లికయినా తను పడ్డ కష్టం చెప్పుకోవాలని వచ్చిన లిఖిత అక్కడ తల్లి కనిపించక ఆమె ఎక్కడికెళ్లుంటుందో ఊహించలేక అలానే నీరసం ఆవహించి అక్కడే కూలబడిపోయింది ఎంతోసేపు.
*****

కేయూర చెప్పిందంతా విని రాజ్యలక్ష్మి దిగ్భ్రాంతికి గురయింది.
“ఇదంతా నిజమా?” అనడిగింది ఆశ్చర్యంగా.
“నేనూ నీలానే మొదట నమ్మలేకపోయెను. తీరా వెళ్లి చూస్తే ఆ ఈశ్వరి నిజంగానే వెంకట్‌ని భర్తని గొడవ చేస్తోంది. అతన్ని చూస్తే జాలేసింది. ఆమెని డాక్టర్ ప్రభంజన దగ్గరకు తీసుకెళ్లమన్నాను. తీసుకెళ్ళాడో లేదో మరి” అంది బాధగా.
వెంటనే రాజ్యలక్ష్మి ప్రభంజనకి ఫోను చేసి ఈశ్వరి సంగతి అడిగింది.
“అవును నా దగ్గరే ఉంది రాజ్యం. ఆమెకో కొత్తరకమైన విధానంలో ట్రీట్‌మెంట్ ఇస్తున్నాను. ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తోంది. అయింతే ఆమె పూర్వజన్మలో భర్తనుకుంటున్న వ్యక్తి దగాకోరని ఆమెకి ఏదైనా సంఘటన ద్వారా రూఢీ అయితే ఇంకా బావుంటుంది” అని చెప్పింది ప్రభంజన.
వెంటనె కేయూర భీమిలీ రోడ్డులోని ఓంకారస్వామి మీద నిఘా వేయాల్సిందిగా హైద్రాబాదుకి ఫోను చేసి డి.జి.పికి చెప్పింది.
“సర్! ఇక్కడ పోలీసుల ద్వారా కాకుండా మీరే స్వయంగా రంగంలోకి దిగండి. ఇతని వలన జనం ఎంతో మోసపోతున్నారు. మీరు క్షమిస్తే ఓ సంగతి చెబుతాను. మీ డిపార్టుమెంటులోని చాలామంది ఇతని భక్తులుగా మారేరు. మీ అండ చూసుకునే ఇతనింత నాటకమాడుతున్నాడు. తమ శక్తిని భగవంతుని శక్తిని నమ్మని కొంతమంది దురాశాపరులు, బలహీనుల వల్లనే ఇలాంటి సాధువులు బతికిపోతున్నారు. మీరు వెంటనే ఏక్షన్ తీసుకోకపోతే చాలామంది జీవితాలు నాశనమైపోతాయి”అంది కేయూర క్లుప్తంగా అతని సంగతులు వివరిస్తూ.
అతను వెంటనే ఏక్షన్ తీసుకుంటానని ప్రామిస్ చేయడంతో కొంత ఊరట కల్గిందామెకు.
“అసలు నిన్నెందుకు బంధించాడా రోగ్?” అనడిగింది రాజ్యలక్ష్మి.
“రోగ్ కాబట్టి. వాడికి నా సంగతి తెలుసు. నాకు వాడి గుట్టు తెలిసిపోయిందని అలా చేస్తుంటాడు.ఇంతకీ లిఖిత జాడ తెలియలేదు. ఈ నీచుడు తననేం చేసేడోనన్న దిగులు నన్ను తినేస్తున్నది.” అంది కేయూర బాధగా.
సరిగ్గా అప్పుడే లిఖిత ఆ గుమ్మంలో కొచ్చి తల్లి మాటలు విన్నదని, తండ్రిని తీసుకురాకుండా తల్లికి మొహం చూపించలేక వెనుతిరిగి వెళ్లిందని ఆమెకెంత మాత్రమూ తెలియదు.
*****
“ఎవర్నువ్వు?” అన్నాడు అప్పల నరసుని చూసి వెంకట్ గాభరాగా.
“ఎవరంతావేంతి తొత్తు కొడకా. నాను నీ పెళ్లాన్నని జెప్పేసి అడ్డదారంతా ఎల్లిపోయే నన్ను ఈ గదిలో కూకోబెత్తేసినావు కాదేంతి. కొట్టు కెల్లి కోక గుడ్డల్ దెస్తానని ఎల్లి ఉప్పుడొచ్చి తీరుబడిగా ఎవరంతావేంతి? ప్లేటూ ఫిరాయించేస్తన్నావేంతి! నా దగ్గరీ ఏసకాలు కుదరవు” అంది అప్పల నరసు కోపంగా వెంకట్ కాలరు పట్టుకుని.
వెంకట్ నిజంగానే ఖంగు తినిపోయేడు.
అసలు కేయూరవల్లేమైపోయింది. మధ్యలో ఇదెవర్తీ.. అనుకుంటూ తలుపుల వైపు చూసేడు. అప్పల నరసు చదువుకోకపోయినా అసాధ్యురాలు. ఊడిన తలుపులకి లోపల వైపు నుండి మేకులు కొట్టి సరిచేసింది. వేసిన తాళం వేసినట్టే వుంది.
ఒకవేళ కేయూర ఇలా మారిపోయిందా?
అలా అనుకోగానే వళ్లు ఝల్లుమందతనికి.
“ఏంతాలోచిస్తున్నావు . బేగి తాళి కట్టీ మరి. లేకపోతే నా మొగుడొచ్చి సితకమతకా తంతాడు నిన్ను!” అంది అప్పలనరసు వెంకట్ భుజం మీద చెయ్యేసి.
*****
వెంకట్ ఆమెను గొంగళి పురుగులా విదిలించి కొట్టి “నువ్వెవరివి? ఆ కేయూరేది? నిజం చెప్పు!” అనడిగేడు కోపంగా.
వెంకట్ విదిలింపుకి అప్పల నరసుకి నిజంగానే కోపమొచ్చేసింది. తన మెల్ల కళ్లని ఇంకా సీరియస్ చేసి చూసింది వెంకట్‌ని.
“ఏటి నానెవరో నీకు తెల్దా. మల్లీ నాను సెప్పాలా? మునపటి జనమలో మనం భార్యాభర్తలమంజెప్పి నువ్వు నన్నట్టు కొచ్చేసింది గాక ఎవులని అడుగుతున్నావా. నానాడదాన్ని ఏటీ సెయ్యలేననుకుంతన్నావేమో. నాను కాలేసి తొక్కేసినానంటే అడుసులోకి దిగబడిపోతావు. మర్యాదగా పెల్లాడు. నేదంటే పద ఆ బీమిలీ సావి కాడ కెల్దాం. ఆయనేగా మనిద్దరమ్మొగుడూ పెళ్లాలని సెప్పింది.”అంది నరసు.
వెంకట్‌కి వెంటనే ఓంకారస్వామి మీద అంతులేని కోపం వచ్చేసింది.
ఏదో ఈశ్వరితో నాటకమాడమంటే బాగానే వుందని ఆడేడు. ఇప్పుడీ మెల్లకన్ను దాన్ని కూడా తన మీద కుసి గొల్పుతాడా? తేల్చుకోవాలి అతని సంగతి. అనుకుని కోపంగా “పద. అతని దగ్గరే తేలుస్తాను నీ సంగతి!” అన్నాడు.
“పద నాకేంతి బయం” అంది అప్పల నరసు మంచం మీంచి దూకి.
ఇద్దరూ ఆటో ఎక్కేరు.
ఆటొ కదలబోతుండగా “ఒసే! నరసు. ఇన్నాల్లూ ఏటయిపోనావే. నీకోసం మన గేదలు, పొట్టేల్లు, మేకలు బెంగట్టేసుకుని రేత్తిరీ పగలనక ఒకటే కూతలు. అరుపులూనూ. అవునూ ఈ జుత్తు పోలిగాడెవరే. ఆడితో ఎలిపోతన్నావేంతి. కొంపదీసి లేసిపోతన్నావేంతి?” అని మేకపిల్లని భుజాల మీద ఎక్కించుకున్న మనిషొకడొచ్చేడు ఆటో దగ్గరికి.
“దా మావా నువ్వూ ఆటొ బండి ఎక్కేసేయి. బీవిలీ కాడ ఆ గడ్డాల సాధువు ఈడు నా ముందు జనమలో మొగుడని సెప్పేడు. ఆ సంగత్తేల్చుకోతానికెల్తాన్నా. దా..” అంది అప్పల నరసు పక్కకి జరుగుతూ.
“అతనెవరు? అతన్రావడానికి వీల్లేదు” అన్నాడు వెంకట్ అసహనంగా.
“శానా బాగుంది. సచ్చి పుట్టినోడికి నీకే అంత పెత్తనముంటే ఆడు ఈ జనమలో తాలి కట్టి ఏలుకుంతున్న మొగుడు. బలేటోడివే. జరుగు పక్కకి.” అంది నరసు వెంకట్‌ని ఒక్క తోపు తోస్తూ.
అప్పల నరసు మొగుడు మేక పిల్లతో సహా ఆటో ఎక్కి కూర్చున్నాడు. వెంకట్ వస్తున్న దుఃఖం ఆపుకుని మూలకి నక్కి కూర్చున్నాడు. ఆటో భీమిలి రోడ్డువైపు సాగింది వేగంగా.

*****
లిఖిత అగమ్యంగా రోడ్డు మీద నడుస్తూ తండ్రి ఎటు వెళ్ళి వుంటాడా అని ఆలోచిస్తుంది.
అప్పుడామెకి సడెన్‌గా రైల్లో సిద్ధాంతి తండ్రితో మాట్లాడిన మాటలు గుర్తొచ్చేయి.
అరకులోయ దాపులో బొర్రా గుహల వెనుక వున్న కపాల బ్రహ్మకి మృత సంజీవిని విద్య తెలిసినట్లుగా చెప్పేదతను. ఓవేళ తండ్రి తనలోని కోరిక చావక తనకి తెలిస్తే వెళ్లనివ్వనని రహస్యంగా వెళ్ళేడేమో.
ఆ ఆలోచన రాగానే లిఖితలో ఒక విధమైన టెన్షన్ చోటు చేసుకుంది. అతనీ ఉత్తరాయన పుణ్యకాలంలో సమాధి అవుతారని దానికి కేవలం మూడు రోజులే టైముందని చెప్పడం ఆమెకి గుర్తొచ్చింది.
అప్పుడే ఒక రోజులో అర్ధభాగం ముగిసింది. ఇక కేవలం రెండున్నర రోజులే. తన ప్రయాణానికి ఒక అర్ధరోజు ముగుస్తుంది.
ఆమె వెంటనే మరేం ఆలోచించకుండా రైల్వే స్టేషనుకి బయల్దేరింది ఆటోలో. ఇంకో అరగంటలో ఐరన్ ఓర్ కోసం బలిమెళ వెళ్ళే గూడ్స్ ట్రెయిన్ వుంది. దానికి కొన్ని పాసెంజర్సు కంపార్టుమెంట్సు వుంటాయి. ఆ రైలు శృంగవరపు కోట మీదుగా బొర్రా గుహలు, అరకు దాటి వెళ్తుంది. ట్రెయినులో అరకు వెళ్ళడం ఒక మధురమైన అనుభవం. కాని ఇప్పుడు తను ఎంత తొందరగా బొర్రా గుహలు చేరుకోగలిగితే అంత అదృష్టవంతురాలు.

ఇంకా వుంది..

2 thoughts on “బ్రహ్మలిఖితం 22

  1. కార్తికేయన్ ఏం చేసేసారు శారద గారూ… లిఖితకు మనసుశాంతి ఎప్పటికి? వెంకట్ తిక్క బాగా కుదురుస్తున్నారు..మొత్తానికి మూఢ నమ్మకాలను ఎండగడుతూ సీరియల్ బావుంది..Waiting for next part

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *