February 23, 2024

మన( నో) ధర్మం

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం

తెల్లని రాయంచ లాటి బెంజ్ ఎస్ యూ వి గంటకు యాభై మైళ్ళ వేగంతో ఆరు వందల ఎనభై ఫ్రీ వే మీద కాలిఫోర్నియా లోని శాన్ రామన్ నుండి మిల్పిటాస్ వైపుకు దూసుకు పోతోంది. లోపల కూర్చున్న వారికి మాత్రం పూలరథం మీద ప్రయాణిస్తున్నట్టు ఉంది. కారులో స్టీరియో నుండి ‘ దిద్ద రానీ మహిమల దేవకి సుతుడు” అంటూ బాలకృష్ణ ప్రసాద్ పాడిన అన్నమయ్య పాట వస్తోంది. అన్నమాచార్యుని ఆరు వందల తొమ్మిదవ జయంతి సంధర్భంగా జరుగుతున్న పాటల పోటీలో పాల్గొనడానికి పాపను తీసుకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్లేదాకా నాకు ఈ పోటీలు సిలికానాంధ్రా విశ్వవిద్యాలయంలో జరుగుతున్నట్టు తెలియదు.
యూనివర్సిటీ ముందు కారు దిగి నామఫలకం చూసే సరికి మనసంతా ఒక విధమైన ఉద్విగ్నతతో నిండిపోయింది. ఇంతకు ముందుసారి అమెరికా వచ్చినప్పుడు పాలో అల్టో లోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చూడడానికి వెళ్ళినప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ సరస్వతీ నిలయాన్ని కనీసం చూడగలిగినందుకు పులకించిపోయాను. అక్కడ చదివే వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపించింది.
గ్రాడ్యూయేషన్ పూర్తి అయిన కొందరు విద్యార్థుల జట్టు మెడలో రంగు రంగుల పూల దండలు వేసుకుని ఆనందం గా నాట్యం చేస్తున్నారు చెట్టు కింద. లోపల హాల్లో ఏదో పార్టీ జరుగుతున్నది. ఇంకో తరగతి గదిలో ప్రొఫెసర్ పాఠాలు చెబుతున్నాడు. నా యూనివర్సిటీ రోజులు గుర్తుకు వచ్చాయి.
అల్లాగే యూరప్ ట్రిప్ లో లండన్ లో కేంబ్రిజ్ యూనివర్సిటీని చూడగలగడం ఒక భాగ్యంగా తోచింది. రాజా ప్రాసాదం ముందు చేన్జ్ ఆఫ్ గార్డ్స్ సెరిమొని, మేడమ్ టసాడ్స్ మ్యూజియమ్ , లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్ టవర్ ఇవన్ని చూడడం ఒక ఎత్తు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చూడగలగడం ఒక ఎత్తు అనిపించింది. అలిసిపోయి ఎక్కడికీ రానని పడుకున్న నన్ను పట్టుబట్టి తీసుకు గొప్ప విశ్వవిద్యాలయం చూపించిన మా చెల్లెలి కూతురును కౌగలించుకుని కృతజ్ఞతలు తెలిపాను. కాలిఫోర్నియాలో బెర్కిలీ లో ఇస్కాన్ గుడి, రామకృష్ణ మఠం దర్శించుకుని, బెర్కిలీ యూనివర్సిటీ కూడా చూసాను.
ఇదివరకు సిలికానాంధ్ర వారు జరిపిన ఉగాది ఉత్సవానికి వెళ్ళి ఉన్నాను. వచ్చిన వారందరికీ చిన్న గ్లాసులలో ఉగాది పచ్చడి అందించారు పట్టు చీరెలలో ఉన్న పడతులు. తరువాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇండియా ఇక్కడికే వచ్చిందా అనిపించేలా ఆవరణలో కొలువైన అంగళ్లలో చీరెలు, చుడిదార్లు, గాజులు , ఆభరణాలు, గోరింటాకు కోన్ లు వచ్చినవారిని ఆకట్టు కున్నాయి. ఇవి కాక సమోసాలు, కారం,తీపి వస్తువులు కూడా నోరూరించాయి. ఆఖరుగా అచ్చమైన తెలుగు పండుగ భోజనం వడ్డించారు అందరికి. మన పండుగలను సామూహికంగా ఇంత సంబరం గా అమెరికాలో జరుపుకుంటారా అని ఆనందం కలిగింది.
ఆ మధ్యన మెన్లొ. ఎతెర్టన్ లో ” ఇన్ ఫైనిట్ ఫేసెట్స్ – యాన్ ఎక్స్‌ప్లొరేషన్ ఆఫ్ ద సెల్ఫ్”అన్న థీమ్ తో విశ్వ శాంతి వారు ఏర్పాటు చేసిన భరత నాట్యం ప్రదర్శన చూశాను. భిన్నత్వంలో ఏకత్వం భావనను, ఒకే పరమ సత్యం భిన్నరూపాలలో వ్యక్తం కావడం అద్భుతం గా చూపించారు. ఇరవై మంది కన్నా ఎక్కువ నాట్య కళాకారులు రెండు గంటల సమయంలో ఈ విశ్వాన్ని శాశిస్తున్న ఒక శక్తి, , భిన్న రూపాలలో స్త్రీ పురుష శక్తి ప్రతీకగా అర్థ నారీశ్వర తత్వంగా, త్రిమూర్తి స్వరూపంగా, చతుర్ వేదాలుగా, పంచ భూతాలుగా, షట్ చక్రాలుగా, సప్త స్వరాలుగా, అష్ట రసములుగా, నవ గ్రహాలుగా, చివరగా సత్ చిత్ ఆనంద స్వరూపమైన పూర్ణత్వంగా “ఓం పూర్ణమద: పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావశిష్యతే ” అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ అద్భుతంగా అభినయించి వీక్షకులకు ఒక అలౌకిక అనుభవాన్ని కలిగించారు . రసానుభూతిలో ఓలలాడించే విధంగా ఆవిష్కరించారు.
తాము పుట్టిన తెలుగు నేలకు పదివేల మైళ్ళ దూరంలో ఉన్న దేశానికి ఉద్యోగ ,వ్యాపార నిమిత్తంగా వచ్చి, ఈ దేశంతో మమేకమై, అన్ని రంగాలలో ఈ దేశాభివృద్ధికి పాటుపడుతున్న తెలుగువారు తమకు జన్మనిచ్చిన భూమిని, ఆ భూమి నుండి సంక్రమించిన సంస్కృతిని, సంస్కారాన్ని, కళలను ఇక్కడి నేలలో పండించుకుంటున్న తీరు చూస్తే గుండె పులకించక మానదు.
కానీ ఈ రోజు సిలికానాంధ్ర యూనివర్సిటీ లోపలికి అడుగు పెడుతుంటే ఇదీ అని చెప్పలేని ఉద్విగ్నత నన్ను కుదిపివేసింది అమెరికా గడ్డ మీద మన తెలుగువారి తేజాన్ని వెదజల్లుతున్న ఆ సరస్వతీ నిలయం యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రను దర్శించిన క్షణం నా మాతృసంస్థ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంను చూస్తే కలిగే గర్వంతో కూడిన ఆర్థ్రత మళ్లీ అనుభూతి చెందాను.
లోపలికి వెళ్లగానే ఎదురుగా ఒక బల్ల మీద వినాయకుడి విగ్రహం , చుట్టూ పూల దండలు, వెనుక గోడమీద యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర అన్న పదాలు, పైన వారి లోగో దర్శన మిచ్చాయి.
క్రింది అంతస్థులో పాప రిజిస్ట్రేషన్ చూపితే ఒక నంబర్ ఇచ్చారు. పదిహేను సంవత్సరాల లోపు వారికి అన్నమయ్య పాటల పోటీలు రెండవ అంతస్తు లో జరుగుతాయని చెప్పారు. సరే క్రింద జరుగుతున్న పోటీ ఏమిటో చూసి వెళ్ళవచ్చు అనుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాము. ఎటు చూసినా భారతీయత ఉట్టి పడేలా పట్టు, జరీ చీరెలలొ ఆడవాళ్ళు. పోటీలో పాల్గొంటున్న పదహారు నుండి ఇరవైలోపు కుర్రాళ్ళు చక్కగా పంచ కట్టులో కనబడ్డారు.ఆడపిల్లలు పావడా పైటలో వచ్చారు. అక్కడి వాతావరణం చూస్తే అమెరికాలో ఉన్నామన్న విషయం జ్ఞాపకం రాదు. అక్కడ కార్య నిర్వాహకులు కూడా ధోవతి , జుబ్బా ధరించి పైన కండువాతో నిండుగా ఉన్నారు.
పేరు పిలవగానే శ్రుతి బాక్స్ పట్టుకుని వేదిక మీదికి వచ్చింది ఒక అమ్మాయి. సభికులకు, తమని పరీక్షించ నున్న పండితులకు నమస్కరించి, ఆ రోజు తాను పాడబోతున్న పాట , రాసినవారి పేరు, రాగము, తాళము ధర్మావతి రాగంలో ఆది తాళం “మంగాంబుధి హనుమంతా నీ శరణ మంగవించితిమి హనుమా “అంటూ వివరాలు చెప్పింది .
ఖంగున మోగుతున్న కమ్మని కంఠ స్వరంతో , ఆత్మ విశ్వాసం తొంగి చూస్తున్న ముఖ కవళికలతో ఆలాపన మొదలు పెట్టింది. ” బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరిచేతల హనుమంతా” అని నెరవలి పాడుతుంటే పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత గుర్తుకు వచ్చింది ఆ అమ్మాయిని చూస్తుంటే.
తరువాత వచ్చిన అబ్బాయి కల్యాణి రాగంలో ఆలాపన అందుకున్నాడు.
“కల్యాణి రాగానికి, శంకరాభరణం రాగానికి ఆరోహణ అవరోహణ లో తేడా చెప్ప గలవా?” ప్రశ్నించారు గురువుగారు.
“కళ్యాణికి శంకరాభరణంకు మధ్యమంలో తేడా వున్నదండీ! కల్యాణిలో ప్రతి మధ్యమం ఉంది. శంకరాభరణంలో శుద్ధ మధ్యమం పలుకుతాము.” వినయంగా జవాబు చెప్పాడు ఆ చిన్నారి.
“శంకరాభరణంలో గాంధారం జీవస్వరం . కల్యాణి సర్వ గమక రాగం. “అంటూ పాడి వినిపించారు ఆయన. అలాగే పల్లవి పాడిన తరువాత నెరవలి మొదలు పెడుతూనే స్వర కల్పన గురించి అడిగారు.
పరీక్షకురాలిగా వచ్చిన సంగీత విద్వాంసురాలు ఏ ప్రశ్న అడిగినా తడ బడ కుండా తమకు తెలిసి నంతలో జవాబులు చెప్పాడు
తరువాత వేదిక మీదికి వచ్చిన అబ్బాయి శుద్ధ ధన్యాసి రాగంలో అన్నమాచార్య కీర్తన” భావములోన భాగ్యము నందున” ఆది తాళంలో పాడుతున్నట్టు చెప్పి మొదలు పెట్టాడు. అతను కల్పన స్వరముల దగ్గరికి వచ్చేసరికి భిన్నమైన ఆవృతులలో స్వర కల్పన చేయమని అడిగి, పరీక్షించారు. చెదరని చిరునవ్వుతో ఆయన సూచనలను అనుసరించి స్వర కల్పన చేసి మెప్పించాడు.
అతను పాట పూర్తిచేస్తూ “హరి నామములే అన్ని మంత్రములు” అంటూ ఆలపిస్తుంటే” అంటే అర్థం తెలుసా? ” అని అడిగారు చెన్నై నుండి వచ్చిన సంగీత విద్వాంసుడు. ఆ పిల్లవాడు చిరునవ్వుతో ఆయన వైపు చూసి తల వంచుకున్నాడు.
అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు అమ్మా నాన్న పట్టుబడితే కొద్దిగా తెలుగు నేర్చుకుంటారు. బాగా నేర్చుకోవాలని సిలికానాంధ్ర వాళ్ళ ” మన బడి”లో చేర్పించితే ఇంకొంచెం బాగా భాష తెలుస్తుంది. గానీ సాహిత్యంలో అర్థాన్ని గ్రహించే అంత గా కాదు .
“సంగీతం లో మనో ధర్మం మీద మిమ్మల్ని పరీక్షిస్తున్నాము. ఒక రాగాన్ని ఎంత లోతుగా ఆకళింపు చేసుకున్నారు, దాని మీద ఎంత పట్టు సాధించారు, ఆ రాగంలో కల్పనా స్వరాలలో , నెరవలిలొ అప్పటి కప్పుడు ఆ రాగంలో కల్పనా స్వరాలు పాడగల సృజనాత్మకతలో మీ శక్తి ఎంత అనేది చూడడానికే ఈ పరీక్ష. ఇదే మనో ధర్మం. విద్యార్థి దశలో వంద సార్లు విని , సాధన చేస్తే అందులో పది శాతం వేదిక మీద ప్రదర్శించగలరు. ఇది ఒక అగ్నిపరీక్ష వంటిది. సాధనతో సాధించగలరు . ”
“ఒక రాగాన్ని ఆకళింపు చేసుకోవడంతో బాటు రసాత్మకతను అనుభూతి చెందడం, అందులో లయించి తన్మయత పొందడం వలన మీ పాటలో జీవరసం చిందులు వేస్తుంది. సాహిత్యంలోని భావాన్ని అనుభవించితేనే అటువంటి రసాత్మకత సాధ్య మవుతుంది. హరి నామమే అన్ని మంత్రములు అంటే ఆ ఒక్క హరి అనే పేరు అన్ని మంత్రములకు సమానము అన్న భావాన్ని గ్రహించి పాడితే ఇంకా గొప్పగా వుంటుంది. అప్పుడే అన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించగలవు. ” ప్రసన్న వదనంతో మనసుకు హత్తుకునే రీతిలో చెప్పారు ఆయన .
ఆ అబ్బాయి చిరునవ్వుతో వారికి నమస్కరించి వేదిక దిగాడు . చదువులు, ప్రాజెక్ట్స్, ఆటలుతో తీరిక సమయమే దొరకని ఈ వయసు పిల్లలు ఇంత సంగీత జ్ఞానాన్ని ఎప్పుడు నేర్చుకున్నారు? ఆ నేర్పిన గురువులు ఎంతటి విద్వత్తు గల వారు? ఉద్యోగ నిర్వహణలో, పిల్లల పెంపకంలో ఉక్కిరి బిక్కిరి అయ్యే ఆ తలిదండ్రులు ఎంతటి అంకిత భావంతో వీళ్ళ కు నేర్పించారు అని తలచుకుంటే ఆశ్చర్యం గా అనిపించింది.
ఇంతలో రెండవ అంతస్తులో చిన్న పిల్లలకు పోటీ జరుగుతుందని మైక్ లో వినిపించడంతో మేము ఎలివేటర్ లో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా ఆడపిల్లలు పావడా జాకెట్ లలో ముచ్చటగా కనిపించారు. ముఖాన బొట్టు, చేతులకు గాజులు, మెడలో గొలుసులతో సంప్రదాయబద్ధంగా ఉన్నారు. అబ్బాయీలు పైజామా కుర్తాలలో ఉన్నారు.
పిల్లలు అందరు రాగ తాళ లయానుగుణంగా శ్రుతి పేయంగా అన్నమయ్య పాటలు ఆలపించారు.
పోటీలో గెలవడం అన్నది ఎన్నో విషయాల మీద ఆధారపడుతుంది. పోటీలో పాల్గొనడం ముఖ్యం అని చెప్పి పిలిచుకు వచ్చాము మా మనవరాలి ని .
ఆ వారంలో జరిగిన సిలికానాంధ్ర వారి ” మన బడి” స్నాతకోత్సవం లో వేదిక మీద కూచిపూడి ఆనంద్ గారి చేతికి నా కథా సంకలనాలు అందించే సమయంలో హాలు నిండా స్నాతకోత్సవ దుస్తులలో కూర్చున్న చిన్నారులను చూసి మనసు నిండి పోయి మాటలు రాలేదు. అమెరికాలో తెలుగు భాషకు పట్టం కడుతున్న సిలికానాంధ్ర వారు రాబోయే రోజులలో పదకొండో తరగతి పిల్లలు రాసే కాలేజ్ ప్రవేశ పరీక్ష “శాట్” కూడా తెలుగును ఒక అంశంగా చేర్చ డానికి కృషి చేస్తామని చెప్పడంతో అక్కడ ఉన్న వందల మంది తలిదండ్రులు, పిల్లల హర్షధ్వానాలతో హాలు ప్రతిధ్వనించింది.
తిరిగి వెళ్తున్నప్పుడు నా మనసు నిండా ఎన్నో ఆలోచనలు. ఎక్కడో ఒక చోట మొదలైన మానవ జాతి దేశ దేశాలకు విస్తరించి , ఆయా దేశ ప్రజలు తమదైన సంస్కృతిని, సంప్రదాయాలను, కళలను, సాహిత్యాన్ని పెంపొందించుకుని తమకు మాత్రమే సొంతమైన అస్తిత్వాన్ని కలిగి వర్ధిల్లుతున్నాయి.
ఇక్కడ అమెరికాలో ” వీక్షణం ” వారు నెల నెలా రచయితల సాహితీ సమావేశాలు జరుపుకుంటున్నారు. ఎంతో శ్రమకోర్చి తెలుగు భాషాభిమానులు ఆంతర్జాలంలో ” కౌముది”, “సృజన రంజని” మాసపత్రికలు వెలువరిస్తున్నారు.
మనదైన ఆ ఆస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇతర సంస్కృతుల నుండి మంచిని ఆహ్వానిస్తూ మన పరిధిని విస్తరింప చేసుకుంటూ తన జాతి గౌరవాన్ని తల ఎత్తి చాటుతున్న తెలుగు వాళ్ళని చూసి తల్లిగా అమ్మమ్మగా గర్వపడడం నా హక్కు అనిపించింది.
సంగీతంలో నిష్ణాతులై సృజనాత్మకత సాధించడం “మనోధర్మం” అయితే, తెలుగు జాతి గౌరవప్రతిష్టలను కాపాడుకుని తెలుగు వెలుగుని ముందు తరాలకు అందించడం “మన ధర్మం ” అన్న గ్రహింపే మనకు శ్రీరామ రక్ష అనిపించింది.

——- ——– ———

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *