May 25, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “డిప్రెషన్‌”

రచన: విజయలక్ష్మీ పండిట్

మోగుతున్న ఫోన్‌ను తీసి ‘హలో’ అంది సుమతి.
అవతలివైపు ‘హలో మేడమ్‌ నమస్కారమండి, బాగున్నారా? నేను సుధను మేడమ్‌, గుర్తుపట్టారా,”
సుమతికి వెంటనే ‘సుధ’ ఎవరో గుర్తుకు రాలేదు.
సుధ ”నేను మేడమ్‌ డిప్రెషన్‌ నుండి నన్ను రక్షించి నాకో భవిష్యత్తు నిచ్చారు ”.
”ఓ… సుధ బాగున్నావా అమ్మా, నీ టోన్‌లో మార్పుంది. ఎవరో అనుకున్నా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు” అడిగింది సుమతి సంతోషంతో.
“మేడమ్‌ హైదరాబాద్‌లో నాకు ఇంగ్లీషు లెక్చరర్‌గా పోస్ట్‌ వచ్చింది. నేను మా పేరెంట్సు మీ ఇంటికి ఈ రోజు వద్దామనుకుంటున్నాము మేడమ్‌. ఈ రోజు రావచ్చా, ఎప్పుడు రమ్మంటారు మేడమ్‌”అంది సుధ.
”మధ్యాహ్నం నాలుగు గంటలకు రండి సుధ. కాంగ్రాట్యులేషన్స్‌ సుధ లేక్చరర్‌ పోస్ట్‌ సాధించావు గుడ్‌” అని, ”ఈవినింగు రండమ్మా… ఒకే”అని ఫోన్‌ పెట్టేసింది సుమతి.
ఆదివారం బ్రేక్‌ఫాస్ట్‌ చేసి కాఫీ సిప్‌ చేస్తూ న్యూస్‌ పేపర్‌ చదువుతున్న సమతికి సుధ చేసిన ఆ ఫోన్‌కాల్‌ చాలా సంతోషాన్నిచ్చింది.సుమతి ఆలోచనలు గతంలోకి మళ్ళాయి.

***

దాదాపు ఆరు సంవత్సరాల క్రితం. కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్న తను ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల క్లాసు తీసుకుని స్టాఫ్‌ రూముకు వస్తూంది. దారిలో ఉన్న చెట్టు క్రింద ఆరుగుపై కూర్చున్న తల్లితండ్రులు కూతురుని బ్రతిమాలుతున్నారు. నీవు చదువుకోవాలిరా అమ్మలూ.. సుధా చదువుకొని నీవు మంచి ఉద్యోగం చేయాలి. మా లాగా చదువులేక ఆ ఇంట ఈ ఇంట పనిచేస్తూ, మీ నాన్న ఆటో నడుపుతూ మా బతుకులు ఇలా అయిపోయాయి. నీమీదే మా ఆశంతా సుధా చదువుకోమ్మా…” అని ఆ అమ్మాయి వాళ్మ అమ్మ అంటూంది.
“నాకు చదువుకోవాలని లేదు.. నేను వచ్చేస్తాను ఇంటికి” అని మొండికేసి చెపుతూంది ఆ అమ్మాయి. బహుశ మొదటి సంవత్సరంలో చేరినట్టుంది అని అనుకుని కొంతసేపు తటపటాయించి మెల్లగా వాళ్ళదగ్గరకు వెళ్ళింది సుమతి.
లెక్చరర్ సుమతిని చూడగానే లేచి నిలుచుని ”నమస్కారం మేడమ్‌” అంది సుధ. సుధతోపాటు వాళ్ళ అమ్మా నాన్న లేచి నిలుచుని సుమతికి నమస్కరించారు.
సుధ పేరంట్సును చూస్తూ ”ఏందుకు మీరు బాధపడుతున్నట్టున్నారు? ఏమయింది” అని.
“నీ పేరేంటమ్మా” అని సుధ నడిగింది సుమతి.
‘సుధ’ అని బదులిచ్చింది.
”నాకు చదువుకోవాలని లేదు అంటున్నావు ఎందుకమ్మా సుధా” అని అడిగింది సుమతి.
“ఏంటో అమ్మ డిప్రెసనంట సదువుకోవాలని లేదంట, ఇంటికి వచ్చేస్తానంటాంది, మీరయిన చెప్పండమ్మా, ఎన్నో ఆశలు పెట్టుకుని దాని భవిసత్తు బాగుండాలని కాయకష్టం చేసి సదివిస్తున్నాము. ఈ పిల్లేమో సదవనంటాంది “ అని సుధ తల్లి మొరపెట్టుకుంది. వెంటనే సుధ వాళ్ళ నాన్న,
”నీవయిన చెప్పు తల్లి నా బిడ్డకు సదువుకోమని, ఎట్లాగోట్ల మా బిడ్డను సదివించి దాని కాళ్ళమీద అది నిలబడాలని మా ఆశ. వాళ్ళ అక్క సదువుకుంటానంటే మేము పెళ్ళిచేసి ఆ మూర్ఖుని చేతిలో పెట్టి దాని బతుకు నాశనం చేసినాము. తాగి తగవులాడటం తప్ప దాని మొగుడు చిల్లిగవ్వ సంపాదించకుండా, నా పెద్ద కూతురు గుడ్డల షాపులో పనిచేసి తెచ్చుకొనే జీతంతో ఇద్దరు బిడ్డలను, మొగున్ని సాకుతూ కష్టాలు పడుతూంది. ఈ పిల్ల బాగా సదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని బాగుపడుతుందనుకుంటే నేను సదవనంటాంది.నీవయినా బుద్ధి చెప్పమ్మా” అంటూ నమస్కారం పెట్టాడు వెంకటస్వామి.
“సుధ నాన్న బక్కపలచగా బాగా చితికి పోయినట్టున్నాడు, పాపం” అని అనుకుంది సుమతి. దీనంగా కృంగిపోయిన వారి చూపులు సుమతి మనసును కలిచివేసాయి.
సుమతి సుధ భుజంపై చేయివేసి ”ఎందుకు చదువొద్దంటున్నావు సుధా. మీ అమ్మ నాన్న నీకోసం, నిన్ను విద్యావంతురాలిని చేసి ఒక ఉద్యోగస్తురాలిగా ఆర్థికంగా మంచి భవిష్యత్‌ నీకివ్వడానికి వాళ్ళు అంత శ్రమపడుతుంటే, చదివించే అమ్మ నాన్న లేక ఎంతో మంది అభాగ్యులు అనాథలు చదువుకోవాలని తహతహలాడుతూంటే నీవెందుకట్లా నిరాశకు లోనవుతున్నావు?” అంటూ సుధకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది సుమతి.
“ఎందుకో మేడమ్‌ నాకు జీవితం మీద, చదువుమీద విరక్తిగా వుంది. చదవాలని లేదు” అంది తలవాల్చుకుంటూ సుధ .నీరసంగా మానసికంగా కృంగిపోయినదానిలా అనిపించింది సుధ సుమతికి.
అందంగా, హుందాగా మంచి వ్యక్తిత్వం ప్రతిబింబించే ఆకారం సుమతిది. సుమతి కండ్లలోకి సూటిగా చూడలేక పోతూంది సుధ.
సుమతి కొంచెం ఆగి… సుధ వాళ్ళ అమ్మా నాన్నతో ”సరే నేను చెప్పి చూస్తాను మీరు వెళ్ళండి”అని వాళ్ళను పంపి సుధతో ”ఎక్కడుంటావు సుధా”అని అడిగింది.
”ఉమెన్స్‌ హాస్టల్లో వుంటున్నా మేడమ్‌. మా ఇంట్లో చదువుకోడానికి స్థలం… రూము లేదని మా అమ్మా నాన్న హాస్టల్లో చేర్పించారు”అంది.
“సరే నేను హాస్టల్‌ వార్డెన్తో మాట్లాడుతాను మా ఇంటిలో వుంటావా నాతో కూడా” అంది సుమతి.
సుధ కాసేపు తటపటాయించి ‘మా అమ్మ నాన్నలతో మాట్లాడి చెప్తా మేడమ్‌” అంది.
“సరే రేపు చెప్పు” అని సుమతి స్టాఫ్‌ రూమ్‌ వైపు నడిచింది.

***

సుధ సుమతి వాళ్ళ ఇంట్లో వుండానికి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవడంతో వార్డెన్‌తో మాట్లాడి సుధను వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చింది సుమతి.
సుధ అమ్మ నాన్నలకు తమ బిడ్డను ఆదుకోడానికి దిగివచ్చిన దేవతలా అన్పించింది సుమతి. కూతురు బాగుపడుతుందనే నమ్మకం కలిగింది వాళ్ళకు.
సుధ సన్నగా ఐదున్నర అడుగుల పొడవుండి అమాయకంగా అనిపిస్తుంది.
సుమతి తన ఇంట్లో అదనంగా వున్న చిన్న గదిలో సుధ వుండడానికి ఏర్పాటు చేసింది. తనతో కూడా కూర్చోమని బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ చేసేలా బిడియాన్ని పోగొట్టింది . ఇద్దరు సూపర్‌ బజార్‌కు వెళ్ళారు. సుధకు కావాల్సిన టాయిలెట్ ‌ సామాన్లు, కొన్ని డ్రస్సులు కొని, ఇతర ఇంటికి కావాల్సిన ప్రొవిషన్స్‌ తెచ్చుకుంది సుమతి.
ఆ రోజు ఈవినింగు ముందున్న స్టడీ రూములో వుండే చిన్న పుస్తకాల లైబ్రరీ దగ్గరకు సుధను తీసుకెళ్ళి కొన్ని మంచి జీవితగాథలు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పుస్తకాలను ఎంపిక చేసి, ”క్లాసు పుస్తకాలే కాకుండా ఈ కథలు, జీవిత గాథలు అప్పుడప్పుడు చదువు సుధా. పుస్తకాలు మంచి స్నేహితులు. అవి మన జీవితాలలో నిత్యం భాగమయితే మనమెంతో ఆనందాన్ని, విజ్ఞానాన్ని పొందుతాము. మన కష్ట నష్టాలను మరిచిపోతాము” అని సుధ చేతికిచ్చింది .
మానసికంగా, శారీరకంగా సుధ చాలా నీరసించినట్టు గమనించి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళి బలానికి టానిక్ , విటమిన్‌ మాత్రలు తీసి, రెగ్యులర్‌గా వేసుకోమని ఇచ్చింది. వారం పది రోజులు గడిచాక తనతో కూడా సుధను తీసుకొని వెళ్ళి రామకృష్ణ మఠంలో యోగా, మెడిటేషన్‌ క్లాసెస్‌లో చేర్పించింది సుమతి.
సుధ వీలయినపుడల్లా సుమతికి పనులలో సాయం చేస్తూ ఇంటిని నీటుగా సర్దుతూ సుమతికి చేదోడుగా మెలగడం సుమతికి సంతోషానిచ్చింది. చదువుకుంటూ పిల్లలు దూరంగా ఉండడం వల్ల సుమతికి ఒక్కసారిగా ఏర్పడిన ఒంటరి తనాన్ని సుధ పోగొట్టింది.

***

ఆ రోజు ఆదివారం. ఇద్దరు సాయంకాలం స్నాక్స్‌ తిని టీ త్రాగి బాల్కనీలో కూర్చున్నారు. సుధను యోగా, మెడిటేషన్ క్లాసుల గురించి అడిగింది సుమతి . సుధ “ నాకు ఎంతో సహాయపడుతున్నాయి మేడమ్. ముందులాగ నీరసంగా నిరాశగా లేను.” అంది.
సుధ కొంచెం కోలుకున్న తరువాత ఆ అమ్మాయి డిప్రెషనుకు కారణం తెలుసుకోవాలని వెయిట్ చేసింది సుమతి. కొద్ది సేపాగి మెల్లగా అనునయంగా సుధ నడిగింది.
“ఎందుకు సుధా అంత డిప్రెషన్‌ చోటుచేసుకున్నది నీలో..”అని, మరలా
”నీవు తెలివైన దానివి, నీ చేతిలో నీ భవ్యిత్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అన్ని పక్కన పెట్టి ఒక జీవిత లక్ష్యంతో నీవు ముందుకు సాగాలి. నీ గురించి ఎంత బాధపడ్డారో చూశావా మీ అమ్మా నాన్న” . సుమతి ప్రేమ ఆప్యాయతతో అడుగుతుంటే సుధకు దుఃఖం పెల్లుబికింది. కొంతసేపు చిన్నగా ఏడుస్తూ వుండిపోయింది.
ఏడుపు ఆపినాక సుధ తలమీద చేయివేసి నిమురుతూ, ”ఇప్పుడు చెప్పు నీ నిరాశ నిస్పృహకు కారణం?” అంది సుమతి.
“రవి వాళ్ళ అమ్మ అన్న మాటలు నాలో ఎప్పుడూ మెదులుతూ నన్ను కృంగదీస్తాయి మేడమ్‌” అంది.
“రవి ఎవరు? నీ బాయ్‌ఫ్రెండా”అడిగింది సుమతి.
“మా స్కూల్‌మ్‌ట్ మేడమ్‌” మా డాబా ఇల్లు దాటుకొని స్కూలుకు వెళ్ళే దారిలో వాళ్ళ ఇల్లు. వాళ్ళకు వ్యాపారాలు న్నాయి. నేను స్కూలుకు వెళ్ళేప్పుడు అప్పుడప్పుడు నాతో కూడా రవి కలుసుకుని ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. రవి మంచి అబ్బాయి. నేను బాగా రాస్తానని నా టెంత్‌క్లాస్‌ నోట్సు, అసైన్‌మెంట్ వర్క్‌ బుక్స్‌ తీసుకుని రాసుకుని ఇచ్చేస్తుంటాడు. ఒకసారి నా నోట్ బుక్ లో “ఐ లవ్‌ యు సుధ” అని హార్ట్‌ బొమ్మ వేసి అందులో వ్రాశాడు” అని ఆగి సుధ మరలా..
”నేను ఎవరు? మా అమ్మా నాన్న ఎవరో, ఏం చేస్తారో అన్ని విషయాలు రవితో చెప్పాను. అయితే ఏమి, నీవంటే నాకిష్టం అని స్నేహంగా ఉండేవాడు. కాని ఒక రోజు నేను వాళ్ళ ఇంటి ముందు వెళుతూంటే రవి వాళ్ళ అమ్మ నన్ను లోపలికి పిలిచింది. రవి ‘హాయ్‌ సుధ’ అని వచ్చాడు, అంతలో వాళ్ళ అమ్మ, ” ఆగు రవి.. ఈ పిల్లతో ఏంటి నీ స్నేహం? వాళ్ళ నాన్న ఒక ఆటోవాలా. వాళ్ళ అమ్మ ఇండ్లల్లో పనులు చేసుకొనే పనిమనిషి. ఈ దరిద్రపు స్నేహితురాలును ఎట్లా పట్టావురా!”అంటూ నావైపు తిరిగి ”ఇక ఎప్పుడైనా మా వాడితో కనిపించావో… జాగ్రత్త, ఇక వెళ్ళు.. దరిద్రపుదాన”అని గొణుగుతూ ఇంట్లోనుండి బయటకు గెంటేసినట్లు పంపి తలుపులేసుకుంది. తరువాత రవి నాకు కనిపించలేదు. ఎక్కడో దూరంగా హాస్టల్‌లో పెట్టి చదివిస్తున్నారని తెలిసింది. అప్పటి నుండి నాకు, నా పేరెంట్సు మీద , చాలి చాలని సంపాదనతో గడిచే మా దరిద్రపు బతుకులపైన అసహ్యం, విసుగు, నిస్పృహ. దానికి తోడు మా అక్క కన్నీటి కాపురం. నాకు ఎందుకీ బ్రతుకు అనిపించి జీవితమంటే విరక్తి ఏర్పడింది మేడమ్‌”అని ముగించింది.

సుధ మాటలు విన్న సుమతి ఆ టీనేజ్ లో పిల్లల మనస్తత్వాలు ఎంత సున్నితంగా ఉంటాయో , కుల మత ఆర్థిక పరిస్తితులు అంటని , రాబోయే జీవితం ఆలోచనకు రానియ్యని మగపిల్లల ప్రేమమాటలు ఆడపిల్లలను ఎలాంటి మాయలో పడేస్తాయో, ఆలోచిస్తూ ఉండిపోయింది.
కొంతసేపు ఆగి సుధతో..,“అంతే సుధ ఒక్కోసారి మనం ఇష్టపడేవాళ్ళను ఆత్మీయులను కోల్పోయినపుడు, తిరస్కరింపబడి అవమానానికి లోనయినపుడు, బాధ పడుతూ ఇంకా ఇంకా కృంగిపోతూ ఆ మనసనే చీకటి బావిలోకి జారిపోతుంటాము. జీవితమంటే ఆసక్తి కోల్పోతాము. అంతా శూన్యంగా తోస్తుంది. అప్పుడే మనకు ఎంతో ధైర్యం, స్థైర్యం, విచక్షణా జ్ఞానం అవసరమనేది మనం గ్రహించలేనంతగా ఆ చీకటి వలయంలో చిక్కుకొని కృంగిపోయి డిప్రెషన్‌కు లోనవుతాము. అలాంటి మనిషిని ఎంతో సున్నితంగా అర్థం చేసుకుని ఆదుకునే ఆపన్నహస్తం దొరికితే మరలా ఈ ప్రపంచంలోకి వస్తాము. నా జీవితంలో నేనూ డిప్రెషన్‌కు లోనయిన క్షణాలను, కాలాన్ని నేనూ చవి చూశాను కాబట్టి నీ పరిస్థితిని చూసి దాని ప్రభావం ఏమిటో తెలిసి నిన్ను అర్థంచేసుకున్నాను” అని అంటూంటే , సుధ ఆశ్చర్యంగా సుమతి ముఖంలోకి చూసింది. ఇంత నిబ్బరంగా, హుందాగా ఉండే సుమతి మేడమ్ ‌కు డిప్రెషనా అని ఆశ్చర్యపోయింది సుధ.
సుమతికి స్టూడెంట్సతో ఫ్రెండ్లీగా వుండే మంచి లెక్చరర్‌గా పేరు. సుధ మొహంలో ప్రతిఫలించిన ఆశ్చర్యాన్ని గమనించి సుమతి తన కథ చెప్పసాగింది

***

సుమతి, ”నేను ఇంటర్‌ మీడియ్‌ అవగానే కాలేజీలో చేరాలని చాలా ఉబలాటపడ్డాను. కాని సంప్రదాయం అంటూ, ఆడపిల్లలకు పైచదువెందుకంటూ మా నాన్న పెండ్లి చేయడంతో పైచదువులు ఒక తీరని కోరికగా మిగిలిపోయింది నాకు. ఆ కాలపు సాంప్రదాయాల వలయంలో చిక్కుకుని అదే జీవితమనుకునే కొందరు తల్లిదండ్రులు పిల్లల మానసిక పరిస్థితిని, ముఖ్యంగా ఆడపిల్లల అభిప్రాయాలకు, చదువుకోవాలన్న కోరికను పట్టించుకునేవారు కాదు. ఐదు సంవత్సరాలలో ఇద్దరు పిల్లలు కలగడం, కూతురు నెలల పిల్లగా ఉన్నప్పుడు ఆక్సిడెంట్ లో నా భర్త శ్రీథర్‌ చనిపోవడం నన్ను కోలుకోలేని అగాథంలోకి నెట్టేశాయి. మా పిల్లలను అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళే నాకంటే ఎక్కువ పట్టించుకున్నారు. ఎప్పుడు దిగులుగా, తిండి సరిగా తినక నీరసించిపోయి మానసికంగా కృంగిపోయాను. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. మానాన్న నా పరిస్థితికి తల్లడిల్లిపోతూ నాకు త్వరగా పెండ్లిచేసి తప్పు చేశానన్న బెంగతో చనిపోయారు. నన్ను ఆ పరిస్థితి నుండి ఓపికతో వెలుగులోకి నడిపించింది మా అమ్మ, అన్నయ్య, వదినలే.
”మా అన్నయ్య నా ఆరోగ్యాన్ని గురించి ఎంతో శ్రద్ధ వహించాడు. రామకృష్ణ మఠ్‌లో యోగా, మెడిటేషన్‌ క్లాసుల్లో చేర్పించారు. అక్కడి లైబ్రరీలో మెంబర్‌షిప్‌ కట్టి వివేకానందుని జీవిత చరిత్ర, అతని సూక్తులు, ఆ పుస్తకాలు చదవమని ఎంకరేజ్‌ చేశారు. మనిషి శారీరకంగా, మానసికంగా కోలుకొనేట్టు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నాతో ఎక్కువ సేపు గడుపుతూ నేను నా గత జీవితాన్ని మరచిపోవాలని నాకు ఎన్నో బుక్స్‌ తెచ్చిచ్చి చదివి వినిపించే వాడు. మంచి సినిమాలు, ప్రదేశాలు చూపించి ఆ డిప్రెషన్‌ నుండి బయట పడేట్టుచేసేవాడు.
నన్నుచదువుకోమని ఎంకరేజ్‌ చేసి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో చేర్పించాడు. బి.ఎ. అయినాక నాకు ఇష్టమైన ఇంగ్లీషు లిటరేచర్‌లో ఎమ్‌.ఏ. లో చేరాను. గోల్డ్‌ మెడలిస్ట్‌గా ఉత్తీర్ణురాలవడానికి మా అమ్మ, అన్నయ్య వదినలే కారణం. నా పిల్లలను వాళ్ళ పిల్లలుగానే పెంచారు. మా అన్నయ్య కొడుకుతో సహా ముగ్గురు పిల్లలన్నట్టు. నాకు మరలా జీవితాన్నిచ్చిన దేవతలు “ అని అంటూన్న సుమతి గొంతులో ఆ జ్ఞాపకాల తాలూకు దుఃఖపు జీర మెదిలింది.
కొద్దిసేపాగి సుమతి మరలా సుధతో, ”మీ అమ్మానాన్నలతో నీవు ఆ రోజు చెట్టుకింద నీ వాలకం చూడగానే అనుకున్నాను నీవు ఎంతో డిప్రెషన్‌కు లోనయివున్నావని. నిన్ను ఆ ఊబిలో కూరుకు పోకుండా బయట పడేయాలనే నిర్ణయంతో నా దగ్గర పెట్టుకుని నీకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని నా ఇంట్లోకి తెచ్చుకున్నాను ”అని ఆగి మరలా అంది సుమతి,
”మరి నా కథ విన్నావు కదా… దేవుడిచ్చిన జీవితాన్ని కాలం కాటేసినా, మరలా మనలను కాలమే ముందుకు నడిపిస్తుంది. మధ్యలో వచ్చే ఆటుపోట్లకు తట్టుకుని ఆశావాదదృక్పథంతో మన జీవితాలను మనం మరలా నిలబెట్టుకోవాలని నేను తెలుసుకున్నాను సుధా. నా జీవితమే ఉదాహరణ. మరి నీ జీవితాన్ని ఏవిధంగా దిద్దుకుంటావన్నది ఇప్పుడు నీ చేతుల్లో వుంది. నేను నాలుగు మంచి మాటలు చెప్పి, నీవు శారీరకంగా, మానసికంగా కోలుకోవాలని నా ప్రయత్నం చేశాను. నీ భవిష్యత్‌కు బాటలు వేసుకోవడం ఇక నీ చేతుల్లో వుంది. ఔనా” అని తన కథను పూర్తి చేసింది సుమతి.
”మీరు నాకోసం దేవుడు పంపిన దేవత మేడమ్‌” అంది సుధ ఒణికే గొంతుతో సుమతికి చేతులు జోడించి సమస్కారం పెడుతూ.
సుమతి, ”సుధ నీవు ఎవరో ఏమో అన్నారని అంత డిప్రెషన్‌కు లోనయినావు. టూ ఎమోషనల్‌, పరిణితి చెందని అప్పటి నీ వయసు అలాంటిది.నీ పేద తల్లి తండ్రులు నీకోసం పడే కష్టాలు, తపన నీవు అర్థం చేసుకోలేదు. రవి వాళ్ళ అమ్మ మాటలు నిన్ను ముందే మేలుకొనేటట్టు చేసాయి అని పాజివ్‌ ఆంగిల్‌లో ఆలోచించు. టీనేజ్ ‌లో వున్న మీ కథ, అదే రవి నీవు ఇంకా ముందుకు వెళ్ళి ప్రేమ అంటూ మగవాడి ఆకర్షణ వలలో పడి నీ జీవితం పాడు కాకముందే వాళ్ళ అమ్మ హెచ్చరిక నీకు తోడ్పడిందని పాజివ్‌ కోణంలో తీసుకుంటూ, నీ ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకో. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి, నీ మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ మీ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చు. వృద్ధాప్యంలో వారిని ఆదుకో. ఆ లక్ష్యంతో నీవు నీ భవిష్యత్‌ను దిద్దుకోవాలి. చదువుకుని మంచి ఉద్యోగంలో వున్న అమ్మాయికి పెండ్లి ఒక సమస్య కాదు. చదువుకుని ఉద్యోగం చేసే మంచి వ్యక్తిత్వం ఉన్న వాడు నీకు భర్తగా వస్తాడనే నమ్మకం నాకుంది. సరేనా..” అంది సుధతో ఆప్యాయంగా.
సుమతి జీవితంలో ఎదురు కొన్న సమస్యలు ఆ డిప్రెషన్ నుండి కోలుకున్న రీతి సుధ లో చాల మార్పును తెచ్చాయి. సుమతి మేడమ్ కష్టం ముందు నా సమస్య చాల చిన్నదనే అవగాహనకొచ్చింది సుధ.
సుమతి వద్దనే వుంటూ తన జీవితాన్ని చక్కదిద్దుకుంది సుధ. చదువుమీద బాగా శ్రద్ధ ఏర్పరుచుకుంది. తనకోసం తన తల్లి తండ్రులు పడే కష్టాలు , ప్రేమ విలువ అర్థంచేసుకుంది సుధ. తన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకుంది.
అమ్మ నాన్న వచ్చి కూతురు కోలుకొని చదువుకోవడం చలాకీగా వుండడం చూసి అనందపడేవారు. సుమతి ఎంతో సంతోషించేది. బి.ఎ. ఫస్ట్‌క్లాసులో పాసయి, యూనివర్సిటీలోఎం.ఏ.ఇంగ్లీషులో చేరింది. హాస్టల్‌లో చేరింది. అప్పుడప్పుడు ఫోన్‌ చేసేది . నెట్, సెట్ ’ఎగ్జామ్‌ బాగా రాశానని ఫోన్‌ చేసింది. ఇప్పుడు లెక్చరర్‌ పోస్ట్‌ వచ్చిందని ఫోన్‌ చేయడంతో సుమతికి ఎంతో సంతోషమయింది. ఊబిలోకి దిగజారిపోతున్న ఒక అమ్మాయి జీవితానికి చేయూతనిచ్చాననే తృప్తితో నిండింది సుమతి మనసు.

***

ఆ సాయంకాలం సుధ వాళ్ళ అమ్మనాన్న వచ్చారు. శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని, ఆనందంతో వెలిగే సుధ పేరెంట్సును చూసి సుమతి చాలా సంతోషించింది. సుధ స్వీ‌ట్సు, పండ్లు తెచ్చింది. ఒక పట్టుచీర సుమతి చేతుల్లో పెట్టి పాదాలకు నమస్కరించింది, ”నా మొదటి సాలరీతో మీకు కొన్న చీర మేడమ్‌” అంటూ.
సుధ ఎమోషనల్‌గా ”మేడమ్‌ మీరు ఆ రోజు నా అదృష్టంగా నాకు లభించిన దేవత మీరు. మీరే లేకుంటే నేను ఏమయిపోయేదాన్నో” అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సుధ. తన చెమ్మగిల్లిన కండ్లను దాచుకోవడం సుమతి తరం కాలేదు. సుధను అక్కున చేర్చుకుంది సుమతి , సుధ వీపు పై చేయివేసి సముదాయిస్తూన్నట్టు.
తమ కూతురును తీర్చిదిద్ది మంచి జీవితానిచ్చిన ఆ దేవతకు సుధ తల్లి తండ్రులు రెండు చేతులు జోడించారు సుమతివైపు ఆర్తితో, ఆనందంతో చూస్తూ.

******

3 thoughts on “విశ్వపుత్రిక వీక్షణం – “డిప్రెషన్‌”

  1. నిజంగా టీనేజ్ పిల్లల్లో ఆకర్షణ, అలజడి ఎటువంటి మానసిక ఒత్తిడి ని కలగజేస్తాయో.. సరైన చేయూత దొరికితే చక్కటి భవిష్యత్తు వారి సొంత మవుతుంది…చక్కటి ముగింపు నిచ్చారు.. అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *