April 19, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 34

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య శ్రీనివాసునికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. స్వామీ నీలీలలు మాకు ఎన్నటికీ అర్ధం కావు. ఒకడు నిన్ను నిరంతరం కీర్తిస్తూనే ఉంటాడు. కానీ మరొకనికి సులభంగా కైవల్య పధం దక్కుతుంది. కొందరు భక్తులను అష్టకష్టాల పాలు చేస్తావు. మరొకరికి చిటికెలో సద్గతులు కలిగిస్తావు. ఏమిటి నీ మాయ మా లాంటి సామాన్యులు ఎలా అర్ధం చేసుకోవాలి అంటూ అడుగుతున్నాడు.

కీర్తన:

పల్లవి: పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు
యీటు వెట్టి పెద్దతనా లెంచబనిలేదు

చ.1. సరవి గలకాలము జదువుచుండు నొకడు
గరిమ నీ క్రుప నిన్ను గను నొకడు
ధర బ్రయాసముతోడ దపముసేయు నొకడు
శరణుచొచ్చి నీకు జనవరౌ నొకడు॥ పాటెల్లా ॥

చ.2. వొక్కడు మోపుమోచు నొక్కడు గొలువు సేయు
వొక్కడు పొగడీ త్యాగ మూరకే యందు
వొక్క డాచారము సేయు నొక్కడూ మోక్షముగను
యెక్కడా నీకల్పన సేయవచ్చును ॥ పాటెల్లా ॥

చ.3. భావించ నటుగాన ఫలమెల్లా నీ మూలము
యేవలనైనా నీవు యిచ్చితేగద్దు
జీవులు నిన్నెఋఅగక చీకటి దవ్వగనేల
శ్రీవేంకటేశ్వర నిన్ను సేవించేదే నేరుపు ॥ పాటెల్లా ॥
(రాగం: రామక్రియ, సం.2. సంకీ.182, రాగిరేకు 141-4)

విశ్లేషణ:
పల్లవి: పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు
యీటు వెట్టి పెద్దతనా లెంచబనిలేదు
అన్నమయ్య పదాలు కానీ ఉపమానాలు కానీ ఒకంత కొరుకుడు పడవు ఎందుకంటే ఒక పదానికి అనేక అర్ధాలు ఉంటాయి. తాను ఏ అర్ధంలో వాడాడో చాలా నిశితంగా పరిశీలిస్తే గానీ బోధ పడదు. నానాపాట్లు,పొట్టకూటికి తిప్పలు పడేవాళ్ళు ఒకరైతే, ధన ధాన్యాలు భోగ భాగ్యాలు మరోచోట ఉంటాయి. అలాంటి సమయాల్లో తొందరపడి ఎవరి గొప్పదనాన్ని కానీ ఎవరి లేమి తనాన్ని గురించి గానీ విమర్శించ తగదు. శ్రీనివాసుని ప్రతి కార్యానికి ఓ అర్ధం ఉంటుంది ఒక పరమార్ధం ఉండి తీరుతుంది. అదేమిటో తెలుసుకోలేము అదే విష్ణు మాయ అంటునాడు అన్నమయ్య.

చ.1. సరవి గలకాలము జదువుచుండు నొకడు
గరిమ నీ క్రుప నిన్ను గను నొకడు
ధర బ్రయాసముతోడ దపముసేయు నొకడు
శరణుచొచ్చి నీకు జనవరౌ నొకడు
స్వామీ నీ చిత్ర విచిత్రాలు చెప్పనళవి కావు. ఒకడు జీవితాంతం వేదవేదాంగాలు, భగవద్గీత క్రమంగా, పారాయణం చేస్తూనే ఉంటాడు. అతనికి ఏమీ ఒరగదు. కానీ మరొకడు చిటికెలో నీకృపకు పాత్రుడౌతాడు. ఒకడు నీ కృపకై ప్రయాసపడి భయంకర అరణ్యాలలో తపస్సు కొనసాగిస్తూ ఉంటాడు. ఇంకొకడు జనం మధ్యనే తిరుగుతూ జనంలో ఉంటూ నీకు శరణు శరణు అంటూ సులభంగా తరిస్తాడు. సులభమైన మార్గాలు ఉండగా కష్టతరమైన మార్గాలు ఎందుకని బోధిస్తున్నావా! ఏమిటి స్వామీ! అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య.

చ.2. వొక్కడు మోపుమోచు నొక్కడు గొలువు సేయు
వొక్కడు పొగడీ త్యాగ మూరకే యందు
వొక్క డాచారము సేయు నొక్కడూ మోక్షముగను
యెక్కడా నీకల్పన సేయవచ్చును
ఓ శ్రీపతీ! ఒకడు బరువులు మోసుకుంటూ బాధలతో జీవనం సాగిస్తూ ఉండగా మరొకడు రాజు గారి కొలువులో కష్టించి పని చేస్తూ ఉంటాడు. మరొకడు సులభంగా అక్కడే చేరి వారిని పొగిడేస్తూ హాయిగా కాలం గడిపేస్తూ ఉంటాడు. వానికా కష్టమెందుకో తెలియరాదు. వీనికీ సుఖమునకు కారణమూ తెలియరాదు. ఒకడు యజ్ఞ యాగాదులతో పవిత్ర జీవనం గడుపుతూ ఉంటాడు. ఇంకొకడు అవేమీ లేకుండా త్యాగబుద్ధితో పరోపకార పరాయణత్వంతో ఉంటాడు. ఒకడు అతి సులభంగా మోక్ష పధం చేరుకుంటాడు. ఏమిటి స్వామీ నీ కల్పన? అగోచరంగా ఉంది. ఈ వ్యవహారం ఎంత ఆలోచించినా అంతుబట్టనిది కదా!

చ.3. భావించ నటుగాన ఫలమెల్లా నీ మూలము
యేవలనైనా నీవు యిచ్చితేగద్దు
జీవులు నిన్నెఋఅగక చీకటి దవ్వగనేల
శ్రీవేంకటేశ్వర నిన్ను సేవించేదే నేరుపు
స్వామీ! బాగా ఆలోచించి చూసినట్లైతే సుఖఫలమైనా, కష్టఫలమైనా నీవు ప్రసాదించినదే కదా! ఏ జీవికైనా నీవిచ్చినదే దక్కుతుంది. దానికి జన్మ జన్మల కర్మఫలంపై ఆధారపడి ఉంటుందేమో! మరి ఎందుకు ఈ మానవులు దేనికోసమో నిరంతర ఆరాటపోరాటాల మధ్య జీవనం గడుపుతూ ఉంటారు? ఎంత వెర్రితనం వారికి? ఎందుకా అనవసరమైన ప్రాకులాటలు. వారు అవన్నీ వదలి నీ శరణుజొచ్చి నిన్ను సేవించవచ్చుగదా? అదే అవసరమైన కార్యం. వారికి వలసిన నైపుణ్యం. మిగత కార్యాలనీ వృధా వృధా అంటున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధాలు పాటు = శ్రమపడడం; ఈటు = నిరర్ధకం, శూన్యం; సరవి = క్రమము, వరుస; గరిమ = ఘనము, గొప్ప; ధర = భూమి; జనవరి = జనులలో కలిసి తిరుగువాడు, వారిని కనిపెట్టుకుని ఉండే వాడు. (తలవరి అనగా గ్రామములో అందరికీ కాపలా ఉండు వాడు అని అర్ధము); చీకటి త్రవ్వగనేల? = ఉపయోగం లేని పనులు చేసేవారిని అనే మాట. ఆ పనులవలన ఏ ప్రయోజనము చేకూరదు అన్న భావనతో వాడిన మాట.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *