April 19, 2024

కౌండిన్య హాస్య కథలు – తప్పెవరిది?

రచన: రమేశ్ కలవల

 

భార్యా భర్తలన్నాక సవాలక్షా ఉంటాయి. వారి విషయంలో మనం జోక్యం  చేసుకోకూడదు. కానీ ఇది జోక్యం జేసుకోవడం కాదేమో, ఏం జరిగిందో తెలుసుకుంటున్నాము అంతే కాబట్టి ఓ సారి ఏం జరిగిందంటే…

ఆఫీసు నుండి వచ్చి బట్టలు విడిచి భార్యకు వాటిని ఉతకడానికి  అందజేసాడు చందోళం. ఆ ప్యాంటు చూస్తూ “ఉతుకడానికేనా?” అంది ఇందోళం.

“ఏంటి, నన్నా” అని అడిగాడు హాలులోకి వెడుతూ అప్రమత్తం అవుతూ.

“మీ ప్యాంటు తో మాట్లాడుతున్నానండి. పతి దేవులు మిమ్మల్ని ఎపుడైనా అలా అన్నానా?” అంది ఇందోళం.  దీనిలో ఏదో గూడార్థం లేకపోలేదు అనుకున్నాడు.

స్నానం చేసి వచ్చాడు. చందోళం తన  పడక గదిలోకి ఏదో చూసుకొని కేకలు పెట్టడంతో  ఆ ఉతికిన దాన్ని తీసుకొని ఆ గదికి బయలుదేరింది ఇందోళం.

“రెండు వేల రూపాయలు. కనిపించడం లేదు” అన్నాడు.

“ఏదో కొంపలు మునిగినట్లు అరిస్తే బాత్రూంలో కాలుజారి పడ్డారేమో అనుకున్నాను” అంది

ఆలోచించి “ఆ గుర్తుకొచ్చింది. నువ్వు ఉతికిన ప్యాంటులో ఉండాలి. ఉతికే ముందు జేబులో చూసి తీసావా?” అన్నాడు

“ప్చ్” అంటూ బుంగ మూతి పెట్టింది.

“చూడకుండా దాంతో పాటే ఉతికేసావా?” అని అడిగాడు.

“మొన్న ఉతకడానికి వేసే ముందు జేబులు చూసి ఉతకడానికి వేసే బాధ్యత మీదే నంటే సరేనన్నారు మహానుభావా” అంది

“డబ్బులేమైనా చెట్లకి కాస్తున్నాయా?” కోపంగా విసుక్కోబోయాడు.

ఆవిడ ప్యాంటు వైపు చూసి “ ఆకలేస్తే నోట్లు మింగేయటమే? అమ్మా ఆయ్” అంటూ అటు నడవబోతుంటే “మాట మార్చకు నీదే తప్పు” అన్నాడు

“కొన్ని దేశాలలో ప్లాస్టిక్ కరెన్సీ వచ్చిందిట.  చిరిగితే ప్యాంటైనా చిరుగుతుందిట కానీ నోటు మాత్రం చెక్కు చెదరదుట” అంది ఇందోళం.

“ఇది అప్రస్తుతం” అన్నాడు.

“ఇక్కడ కూడా అలాంటిది ప్రవేశపెడితే ఇదిగో ఇలా తడిసి ముద్దయ్యేది కాదు” అంటూ తడిసిన కాగితం ముద్ద చూపించింది.

“ఇదేంటి ఇండియా ఆకారంలో ఉంది” అన్నాడు.

“అవునండి. క్రితం సారి దొరికిన మాల్దీవుల్లా చిన్న తునకలు అవ్వలేదు” అంది

“దీని వల్ల నీ ఇంటి ఖర్చులలో రెండు వేలు కట్” అన్నాడు చందోళం.

”తప్పు మీది కాబట్టి  మీ క్యారేజీలో ఈ నెలంతా రెండు అరలే పెడతాను” అంది

“ఇదిగో రెండు వేలు పాడు చేసింది నువ్వే నువ్వే నువ్వే” అన్నాడు దురుసుగా ఆ ప్యాంటు లాగుతూ

“నేను కాదు, వాషింగ్ మెషిన్” అంటూ ఆయన చేతిలోంచి ఆ ప్యాంటు లాక్కొని ఆరేయటానికి బయలుదేరింది.

ఎక్కడలేని ఉడుకుమోతుతనం వచ్చింది చందోళానికి. ఇందోళానికి వినపడేలా “ఆ రోజు నువ్వు ఇలానే జేబులోంచి తీసి ఇది ఎవ్వరో గుర్తుపెట్టండి అని అడిగితే కళ్ళు చిట్లించి చూసి మా తాత అంటే, కాదు జాతి పిత అంటూ ఆ నాశనమైన ఇంకో నోటును చూపించావు, గుర్తుందా?”

“ఆ ఆ “ అంది.

“అదీకాక నా మిత్రుడు ఎన్నాళ్ళ తరువాత ఇండియా వచ్చినపుడు  ఫోన్ చేసి ఓ మంచి బిజినెస్ ప్రపోజల్ ఉంది ఈ నెంబరుకు కాల్ చేయి అంటూ ఇచ్చిన కాగితం పరిస్థితి అంతే కదా” అన్నాడు

“అవునవును” అంది

“నేను తెలివయిన వాడిని కాబట్టి ఏదో విధంగా దానిని పరిశీలనగా చూసి ఆ నెంబరు కలిపితే ఓ పెద్దావిడ ఎత్తి నాతో విసుగెత్తి చివరలో నన్ను ఫోన్ పెట్టేయ్ అని తిట్టింది. అంతా నీ వల్లే. లేకపోతే ఇప్పటికల్లా ఓ బిజినెస్ మాగ్నెట్ నయ్యేవాడిని” అన్నాడు. కోపంతో అలిగి పడకెక్కాడు, దుప్పట్లో దూరాడు.

ఇంతలో ఇందోళం వంట చేసి, ఆయన  పరిస్థితి తెలిసి తనే కంచంలో కలుపుకొని తీసుకొచ్చి దుప్పటి ముసుగు తీసింది. ఇదిగో అంటూ కోపంతో నోరు తెరవగానే కలిపిన ముద్ద నోట్లో పెట్టింది.

తింటూ “బావుంది పచ్చడి” అన్నాడు, మళ్ళీ లేని కోపం తెచ్చుకొని అటు జరిగాడు. ముసి ముసి నవ్వులు నవ్వుతూ “ఇంతకీ చెప్పడం మరిచాను. మీ మిత్రుడు ఫోన్ చేసాడు” అంది. ఆత్రుతగా దగ్గరకు జరిగాడు. ఇంకో ముద్ద పెడుతుంటే వారించాడు. ముందు ఇది తిన్న తరువాత అంటూ పెట్టి మళ్ళీ ఇంకో వంటకం కలపడానికి వంట గదిలోకి బయలుదేరింది. చందోళం కుతూహలంగా తన వెనుక నడిచాడు. “ఇంతకీ ఏమన్నాడు” అని అడిగాడు.

“చందోళం భార్య మీరేనా? అని అడిగాడు” అంది

“అబ్బా నీ గురించి అడిగితే అడిగాడు గానీ నా సంగతి ఏమన్నాడు?” అంటుండగా తను వంటింటి  నుంచి బయలుదేరడంతో వెనుకనే బయలుదేరి హాలులో కూర్చున్నాడు.

ఆవిడ పక్కన కూర్చొని ఘమ ఘమ వాసనలతో ఆ చెయ్యి దగ్గరకు వస్తుంటే, ఉండబట్టలేక నోరు తెరిచాడు మొత్తం తినేదాకా మాట్లాడితే ఒట్టు. అవ్వగానే వంటగదిలోకి నడిచింది. తనూ వెనుక నడిచాడు.

“ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేనంటే ప్రాణం వాడికి తెలుసా. చిన్నప్పుడు సలహాలన్ని నేనే ఇచ్చే వాడిని” అన్నాడు.

“అందుకే ఆయన అమెరికా వెళ్ళాడు” అంది

“ఏంటి వెటకారమా?” అన్నాడు

“అయ్యో కాదండి! మీ సలహా వల్లే ఎంతో ఎత్తుకు ఎదిగాడు అంటున్నాను” అంటూ మళ్ళీ హాలులోకి నడిచింది.

“నేనడగాలే కానీ వాడి బిజినెస్ లో సగం రాసిచ్చేస్తాడు తెలుసా” అన్నాడు

“అవునవును” అంటూ ఇంకో ముద్ద పెట్టింది.

“ఎలాగైనా నీ వంట బావుంటుందోయ్ ఇందోళం” అన్నాడు

“ఇంతకీ నెంబరు ఇచ్చాడా?” అని అడిగాడు.

“రెండు వేలు పోతే పోయాయి కానీ ఈ రోజు ఓ మంచి వార్త చెప్పావు. వాడికి నా మీద వెర్రి ప్రేమ కాకపోతే అంత పెద్ద బిజినెస్ లో పార్టనర్ చేస్తాననడం?” అంటూ మాట్లాడుతూ తినడం ముగించాడు.

ఇందోళం లేచి వంటగదిలోకి వెడుతూ ”మీ స్నేహితుడు చేసారు…. కానీ మళ్ళీ ఫోన్ చెయ్య వద్దని చెప్పటానికి చేసాడు. మీరు ఆ రోజు పెద్దావిడతో విసుగుగా మాట్లాడిన ఆవిడ వాళ్ళమ్మ గారుట” అంది.

ఆశ్చర్యంతో “అవునా! నేను ఆ రోజు నానిన కాగితం మీద నెంబరు వాడిది కాదేమోనని పొరపాటు పడి, ఎత్తిన ఆవిడ వాడి తల్లి అని తెలియక  ఫోను పెట్టేయమన్నాను“ అన్నాడు వంటగదిలో చేతులు కడుగుతూ.

మూతి కడుక్కొని ఇందోళం చీర కొంగు చేతిలోకి తీసుకున్నాడు. నిరాశ పడుతూ తుడుచుకున్న తరువాత ఆ కొంగులో ముడి వేసి ఉండటం కనపడంతో అది విప్పి తీసాడు. తీరా చూస్తే లోపల తన నోటు కనిపించింది.

“అరె.. నా రెండువేల రూపాయలు” అన్నాడు కళ్ళెగరేస్తూ.

వెంటనే పశ్చాత్తాప పడి భార్యతో “ఇందోళం క్షమించు! ఇక్కడ నుండి ఉతకడానికి వేసే ముందు జేబు వెతికే బాధ్యత నాదే” అన్నాడు.

“ఫరవాలేదు లేండి. ఉతికే ముందు చూసే బాధ్యత నాదే” అంది.

“అయితే సరేనోయ్!” అంటూ “వాడు మళ్ళీ ఫోన్  చేస్తే నాకు వాడి బిజినెస్ లో ఇష్టం లేదని చెప్పేయ్” అంటూ ఆవలిస్తూ పడక గదిలోకి నడిచాడు చందోళం.

తన భోజనం తెచ్చుకోవడానికి వంటగదిలోకి వెళ్ళింది ఇందోళం.

ఇదండీ ఇందోళం  (ఇందిరా) వెడ్స్ చందోళం (చంద్రశేఖర్) గార్ల చిర్రుబుర్రులాడిన కొన్ని గంటల సన్నివేశ కథ

 

1 thought on “కౌండిన్య హాస్య కథలు – తప్పెవరిది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *