April 19, 2024

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

తెలుగు భాషను వన్నెకెక్కించిన ప్రక్రియల్లో అవధాన ప్రక్రియ ఒకటి. ఇప్పటికీ ఈ ప్రక్రియ నిత్య నూతనంగా ఉందని చెప్పడానికి నిన్నమొన్న రవీంద్రభారతిలో జరిగిన ద్విగుణిత అష్టావధానం ఉదాహరణగా చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఎక్కడో దేశంగాని దేశం అమెరికాలో పుట్టి గీర్వాణాంధ్ర భాషలలో సమంగా అష్టావధానం చేయడం మాటలు కాదు. అతననే కాదు అష్టావధానం ఎవరికైనా కష్టావధానమే. పద్యం రాయడంలో పట్టుండాలి. పాండిత్యముండాలి. సద్యస్ఫూర్తి ఉండాలి. ధారణా పటిమ ఉండాలి. వాక్శుద్ధి ఉండాలి. ఉచ్ఛారణాపటుత్వం ఉండాలి. నిబ్బరత్వం, ఆత్మస్థైర్యం ఉండాలి.
అవధానం ఒక సాహిత్య క్రీడ. నాకు తెలిసి ఇలాంటి ఉత్సుకతను కలిగించే సాహిత్య సల్లాప క్రియ మరే భాషలోనూ లేదనుకుంటాను. అవధానంలో అష్టావధానం, శతావధానాలు పేరు మోసినా, ద్విగుణిత, సహస్ర, ద్వి సహస్ర, పంచ సహస్ర అవధానాలు కూడా చెదురుమదురుగా చేయబడ్డాయి. ఇందులో జంట అష్టావధానం చేసిన వాళ్లున్నారు. తిరుపతివేంకట కవులు, కొప్పరపు కవులు పాత తరం వారైతే, మేడసాని మోహన్, నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు, గుమ్మనగారి లక్ష్మీనృసింహా శర్మ, ఇందారుపు కిషన్ రావు, అష్టకాల నరసింహ రామశర్మ, ముద్దురాజయ్య అవధాని ఇలా చాలా మందే అవధానులు తెలుగు రాష్టాలలో అవధాన కార్యక్రమాన్ని నిర్వహించారు, నిర్వహిస్తున్నారు.
అవధానం అష్టావధానమైనా, శతావధానమైనా సాధారణంగా ముఖ్యమైన అంశాలు అవే ఉంటాయి. అవధానమంటేనే పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు పద్యరూపకంగా జవాబు చెప్పాలి. అంతేగాక నిషిద్ధాక్షరి, దత్తపది, సమస్య, వర్ణన, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, పురాణ పఠనం, ఘంటికా గణనం, తేదీకి తగిన వారం చెప్పడం వంటివాటిలో మొదటి నాలుగు మాత్రం తప్పక ఉంటాయి. మిగతావాటిలో ఏవైనా మూడు మరియు వీటికి తోడు అప్రస్తుత ప్రసంగం ఉంటాయి. అప్రస్తుత ప్రసంగానికి పద్య ప్రక్రియతో పనిలేదు. అది కేవలం అవధాని ఆలోచనలకు మధ్యమధ్య ఆటంకం కలిగించడమే. కాకపోతే అష్టావధానంలో ఎక్కువగా ఆకట్టుకునే అంశం అప్రస్తుత ప్రసంగమే. దానికి కారణం ఆ పృచ్ఛకుడు చమత్కారమైన, మెదడుకు మేతపెట్టే ప్రశ్నలో లేదా చొప్పదంటు ప్రశ్నలో వేయటం దానికి అవధాని సమయస్ఫూర్తితో జవాబివ్వటం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక నిషిద్ధాక్షరిలో పృచ్ఛకుడు ఏదైనా ఒక అంశం మీద పద్యం అడిగిన వృత్తంలో చెప్పాలి. కాని ఒక అక్షరంతో అవధాని మొదలుపెట్టగానే పృచ్ఛకుడు అవధాని చెప్బబోయే అక్షరాన్ని నిషేధిస్తే అవధాని వేరొక అక్షరం చెబతాడు. అలా రెండు పాదాలదాకా నిషేధం సాగుతుంది. యతి అక్షరం అవధాని ఇష్టం. మిగతా రెండు పాదాలకు నిషేధం ఉండదు. అయితే ఈ నాలుగు పాదాలు నాలుగు విడతల్లో చెప్పబడతాయి. అంటే మొదటి ఆవర్తంలో నిషిద్ధాక్షరి ఒకపాదం, దత్తపది ఒకపాదం, సమస్య ఒకపాదం, వర్ణన ఒకపాదం న్యస్తాక్షరి చెప్పటం జరుగుతుంది. ఆశువు, తేదీలకు వారం వగైరా ఎప్పటికప్పుడే సమాధానం ఇవ్వబడుతుంది. ఇక రెండవది దత్తపది. పృచ్ఛకుడు ఏవైనా నాలుగు పదాలు ఇచ్చి ఆ పదాలను ఒక్కో పాదంలో ఒక్కో పదాన్ని చేరుస్తూ అడిగిన అంశం మీద పద్యం చెప్పాలి. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. పృచ్ఛకుడు విచిత్రమైన పదాలు ఎన్నుకుంటాడు. ఉదాహరణకు క్రికెటు, వాలీబాలు, హాకీ. కబాడీ వంటి పదాలిచ్చి ఆపదల అర్థం కాకుండా పద్యాన్ని రామాయణార్థంలోనో భారతార్థంలోనో చెప్పమనటం. లేదా సినిమాతారల పేర్లో, ఇడ్లీ, దోస వంటి తిండి పదార్థాల పేర్లో ఇచ్చి పద్యం పూరించమనడం

మూడవది సమస్యాపూరణం. ఇదీ ఆకర్షణీయమైన అంశమే అవధానంలో. పద్యంలోని చివరిపాదాన్ని ఇస్తే మిగతా పద్యమంతా పూరించాలి. ఇందులో ఉన్న చిక్కేమిటంటే పృచ్ఛకుడు అసంగతమైన సమస్య ఇస్తే దాన్ని తెలివిగా పూరించాలి అవధాని. ఇది ఒకరకంగా ఇబ్బందికరమైన ప్రక్రియ.

ఉదాహరణకు పతిని తన్నకున్న పతితగాదె’ ఇది ఒకసారి ఆంధ్ర ప్రభ వారపత్రికలో వారం వారం అవధానంలో ఇచ్చిన సమస్య.
అప్పట్లో నేను దానిని ఇలా పూరించి పంపిస్తే బహుమతి వచ్చింది.

“పాడు తాగుడునకు బానిసయైపోయి
విత్తవాంఛతోడ విటుని దెచ్చి
తన్ను తార్చుటకును తలపడగా పత్ని
పతిని తన్నకున్న పతిత గాదె”
———————————

నేను అవధానిని గాదుగానీ ఒకటి రెండు అష్టావధానాల్లో పృచ్ఛకుడిగా ఉన్నాను

ఇలాంటివి ఇస్తే లౌక్యంగా పూరించవలసి ఉంటుంది. అప్పటికప్పుడు పరిష్కారం సాధించాలి. కనుక కొంచెం కష్టం.
నాలుగవది వర్ణన. ఏదైనా ఈయబడిన సందర్భమును పురస్కరించుకొని వర్ణిస్తూ పద్యం చెప్పాలి. ఆపై వ్యస్తాక్షరిలేదా న్యస్తాక్షరి ఏదో ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక వాక్యములోని అక్షరాలు క్రమరహితంగా (ఉదా॥5వ అక్షరం ‘ప’ తరువాత 11వ అక్షరం, ఆతరవాత 2వ అక్షరం ఇలా)అవధానం పూర్తయేలోపు మధ్యమధ్యలో పృచ్ఛకుడు అందిస్తాడు. అవన్నీ చివరలో పేర్చుకుని వాక్యం చెప్పాలి. ఇక న్యస్తాక్షరి అయితే ప్రతిపాదంలో ఏదో ఒక అక్షరం ఇచ్చి అది సంఖ్యాపరంగా 7వ అక్షరమనో 12వ అక్షరమనో చెప్పి ఆస్థానంలో ఆఅక్షరం వచ్చేట్టుగాపృచ్ఛకుడు అడిగిన సందర్భానికి ఏ వృత్తంలో అంటే ఆవృత్తంలో పద్యం చెప్పాలి. ఇకమిగతావన్నీ అవధాని ఏకాగ్రత భంగం చేసేవే అప్రస్తుతమైనా, తేదీలకు వారం చెప్పడమైనా గంటలు ఎన్ని కొట్టారో చెప్పడమైనా. పురాణపఠనం పాండిత్యానికి సంబంధించినది. ఏది ఏమైనా అవధానప్రక్రియ మేధోపరంగా కత్తిమీద సాములాంటిది. ఇదంతా అయిన తరువాత తాను పూరించిన పద్యాలన్నీ ధారణకు తెచ్చుకుని చదివి వినిపించడంతో అవధానం సుసంపన్నమవుతుంది. ఇంతటి కష్షటమైన ప్రక్రియను ఎందరో అవధానులు చాలా సునాయాసంగా చేసి ప్రేక్షకులను మెప్పించి అవధానానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టారు. అవధానం తెలుగు పద్యానికి తెలుగు భాషకు చాలా ప్రాచుర్యాన్ని గడించి పెట్టిందనటంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *