April 19, 2024

దుఃఖమనే అనాది భాషలో..!

రచన: పల్లిపట్టు నాగరాజు

 
ఖాళీతనంతో
మనసు కలవరపడుతున్నప్పుడు…
గుండె సడి
నాది నాకే వినిపిస్తున్న ఏకాకితనాన్ని
నేను మోయలేని తండ్రీ….!

జనారణ్యంలో
ఏ ముఖమూ నాకు కనిపించడంలేదు…
ఏ వెచ్చని చేయీ నా చేతిలో సంతకం చేయలేదు….
ఏ చూపుల తీగా స్వాగతాన్ని పరిమళించలేదు…

తమకు తామే అంతస్తులల్లో
ఆర్థిక సొరంగాల్లో
ఖననం చేసుకుంటున్న ఈ రోజులు
రోజాలుగా ఎప్పుడు పూస్తాయో…!
ఏ ఎదపైనైనా వాలే పిట్టలెప్పుడవుతాయో…!!

తండ్రీ…
నన్ను
విసిరేస్తావా ఆ సముద్రాల పైన
నన్ను
విసిరేస్తావా ఆ మంచుకొండలుపైన
ఆ అగ్నిపర్వతాల పైనా…
పిట్టలు, పురుగులు, జంతువులు
పశుత్వం మరిచి ప్రేమను పాడుకుంటున్న
పచ్చని అరణ్యాలకు నన్ను నడిపిస్తావా…!

తండ్రీ…
దిగుల్ని మోయలేకున్నాను..
దుఃఖాన్ని పాడలేకున్నాను…
శతాబ్దాలుగా పిడికెడు ప్రేమకై ప్రాకులాడుతున్నాను..
ఆలింగనాలమధ్య
అగాధాలులేని శాంతి వనాల్ని కలగంటూ…
గాయపడ్డ సిరియాను చూసాను
తెగిపడ్డ రోహింగ్యా దేహాన్ని చూసాను…
వేల వేల దుక్కనదుల ఒడ్డున
ఎన్ని కనుగుడ్లయి నేను కారుతున్నానో…

ఎవరు బాకులు విసురుతున్నారో
ఎవరు తేనె పూసినమాటల్లో
కత్తులు నాల్కల్ని నూరుతున్నారో..
గమనిస్తూనే వున్నా తండ్రీ….

ఎందుకో తండ్రి
మట్టి ఎక్కడ పొక్కిపోయినా కుమిలిపోతుంటాను..
మట్టి ఎక్కడ చీలిపోయినా విలపిస్తుంటాను..
నా అనాది దుఃఖభాషలో అవిసిపోతుంటాను…

ఎవరొస్తారు ఇపుడు
ఏడ్పులు వినడానికి వేదనలు వినడానికి?
జీవన పరిమళాల తోటల్ని
మైదానంలోకి  అడుగుపెట్టినప్పుడే వదిలేసామేమో

ఎవరొస్తారిపుడు
సుడిగుండాల నా గుండెలోకి
ఎవరొస్తారిపుడు..
నా తలవాల్చి సేద తీరే వొడిమందిరమై…
ఏ గాజుపెంకులు లేని గుండెపాటలై..
ఏ ముళ్ళకంపలులేని ప్రేమగొంతులై..

సమస్తానికి తల్లి యైన నా తండ్రి…
నువ్వు మళ్ళీ ప్రసవించు…
కొత్త సముద్రాలను అరణ్యాలను
కొత్త పర్వతాలను నీకు ఏ కళంకంతేని నన్నూ..!

లోపల పరుచుకుంటున్న
ఈ ఏడారుల్లో ఎన్నాళ్లు నడవాలితండ్రి…
ఓ ప్రేమ మూర్తి నన్ను నడిపించవా…
నువ్వు పూస్తున్న దారిలో
నవ్వులు కురుస్తున్న పెదాల మీద…
కడగళ్లు లేని తడికళ్ల వాకిళ్ళలో….

ఈ దిగులు మేఘాల ఆకాశం కింద.
భయం భయంగా  బాధ బాధగా
హృదయాలులేని
కోటికోటి శిరస్సుల ,
కనుపాపాల, చేతుల, పాదాల సమూహాల
నా లోపలికి తొంగి చూడని ఋతువుల్ని
నేను ఓర్వలేకున్నా తండ్రీ…

ఏ ఉదయమైనా నా ప్రేమ మందిరంలో
ఒక ప్రణయ రాగం వినిపించేలా…
నన్ను నీ చేతులారా స్వాగతించి దీవించు తండ్రి….
ప్రేమే అంతిమంకదా తండ్రి…
నా చుట్టూ ప్రేమ తోటలై నువ్వు పూయవా తండ్రి…

(లోపల కమ్ముకుంటున్న ఖాళీలతనం నుంచి..)

 

 

 

 

3 thoughts on “దుఃఖమనే అనాది భాషలో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *